రివ్యూలు, సాంకేతికాలు, స్క్రీన్ ప్లే సంగతులు...

టికెట్లు దొరకడం యోగం, సినిమాలు చూడడం భోగం, రివ్యూలు రాయడం రోగం!

Thursday, May 18, 2023

1329 : రివ్యూ!


 

రచన - దర్శకత్వం : నందినీ రెడ్డి
తారాగణం: సంతోష్ శోభన్, మాళవికా నాయర్, షావుకారు జానకి, రాజేంద్ర ప్రసాద్, రావు రమేష్, నరేష్, వెన్నెల కిషోర్ తదితరులు
స్క్రీన్ ప్లే : షేక్ దావూద్, మాటలు : లక్ష్మీ భూపాల, సంగీతం: మిక్కీ జె మేయర్, ఛాయాగ్రహణం : సన్నీ కూరపాటి, రిచర్డ్ ప్రసాద్
బ్యానర్స్ : స్వప్న సినిమా, మిత్ర విందా మూవీస్
నిర్మాత : ప్రియాంకా దత్
విడుదల : మే 18, 2023
***

        యువ హీరో సంతోష్ శోభన్ 2011 లో ఎంట్రీ ఇచ్చినప్పట్నుంచీ నటించిన 9 సినిమాలూ సక్సెస్ కి దూరంగా వుండిపోయి స్ట్రగుల్ చేస్తున్న సందర్భంలో, 10 వ అవకాశంగా అన్నీ మంచి శకునములే విడుదలైంది. ఒక్క గత సంవత్సరమే నటించిన లైక్ షేర్ అండ్ సబ్ స్క్రైబ్’, కళ్యాణం కమనీయం’, శ్రీదేవీ శోభన్ బాబు మూడూ అట్టర్ ఫ్లాపయ్యాక, ఇప్పుడు పేరున్న దర్శకురాలు నందినీ రెడ్డి దర్శకత్వంలో నటించే అవకాశాన్ని దక్కించుకున్నాడు. 2019లో కొరియన్ రీమేక్ ఓహ్ బేబీ హిట్ తర్వాత నాల్గే ళ్ళకి నందినీ రెడ్డి  కొత్త సినిమా వెండితెర నలంకరించింది. మహానటి, సీతా రామం వంటి హిట్స్ అందించిన స్వప్న సినిమా సంస్థ నుంచి తాజాగా వస్తున్న కుటుంబ ప్రేక్షకుల సినిమా అన్పి స్తున్న  అన్నీ మంచి శకునములే ఎలా వుంది? మళ్ళీ కుటుంబ ప్రేక్షకులకి అదే పాత కాలక్షేపమా, లేక కొత్త ఉత్సాహమేమైనా వుందా పరిశీలిద్దాం...

కథ  

ప్రసాద్ (రాజేంద్ర ప్రసాద్), దివాకర్ (రావు రమేష్), సుధాకర్ (నరేష్) కుటుంబాల మధ్య వాళ్ళ ముత్తాతలు సంపాదించిన కాఫీ ఎస్టేట్ గురించి తగాదాలుంటాయి. ఈ తగాదాలుండగా, సుధాకర్ కొడుకుగా రిషి (సంతోష్ శోభన్), ప్రసాద్ కూతురుగా ఆర్య (మాళవికా నాయర్) పుడతారు. ఒకే సమయంలో పుట్టిన వీళ్ళిద్దరూ హాస్పిటల్లో చేతులు మారిపోతారు. దీంతో ప్రసాద్ కొడుకుగా రిషి, సుధాకర్ కూతురుగా ఆర్య పెరిగి ప్రేమలో పడతారు. ఆర్య కాఫీని విదేశాలకి ఎగుమతి చేయాలనే బిజినెస్ మైండ్ తో వుంటుంది.రిషి ఈ క్షణం ఎంజాయ్ చేయాలన్న లేజీ మైండ్ తో వుంటాడు. మరి భావాలు కలవని వీళ్ళిద్దరి ప్రేమ ఏమైంది? తాము పుట్టుకతో చేతులు మారిపోయామని ఎప్పుడు తెలుసుకున్నారు? వీళ్ళు తారుమారైన సంగతి కుటుంబాలకెప్పుడు తెలిసింది? కాఫీ ఎస్టేట్ తగాదా ఎలా తీరింది? ఇదీ మిగతా కథ.

ఎలా వుంది కథ

ఒక ప్రేక్షకుడు దీన్ని 1952 నాటి కథగా ట్వీట్ చేశాడు. నిజమే, యూట్యూబ్ లో ప్రేక్షకులు బోలెడు పాత కుటుంబ సినిమాల్ని తనివిదీరా ఎంజాయ్ చేస్తూండగా, అదే మళ్ళీ నందినీ రెడ్డి తీయడమెందుకు? ఈ కాలపు కొత్త కుటుంబ కథ చెప్పొచ్చుగా? ఒక హాస్పిటల్, ఇక్కడ ఇద్దరు పిల్లలు పుట్టడం, ఇద్దరు నర్సులు పొరబడి ఆ పిల్లల్ని తారుమారు చేయడం- వంటి కథలతో ఎన్ని తెలుగు, హిందీ, తమిళ సినిమాలు రాలేదు. బ్రిటన్ లో డినైజ్ రాబిన్స్ కూడా 50 ఏళ్ళ  క్రితం ఈ ఫార్ములాతోనే నవలలు రాసింది.
       
ఇక రెండు కుటుంబాల మధ్య తగాదాలనే ఇంకో పాత ఫార్ములా కలిపి చేసేస్తే ఫీల్ గుడ్ ఫ్యామిలీ సినిమా అవుతుందని దర్శకురాలు భావించింది. కానీ తెరమీద వేరేగా వచ్చింది. అక్కడక్కడా కొన్ని నవ్వించే సీన్లు మాత్రం వర్కౌట్ అయ్యాయి తప్పితే
, మొత్తం కథగా దీన్ని కొత్తగా చెప్పలేని అవే పాత సన్నివేశాల్ని చూపించే ట్రాప్ లో పడిపోవడంతో, రెండు గంటలా 34 నిమిషాల సుదీర్ఘ సహన పరీక్ష అయిందీ సినిమా. దర్శకురాలు ప్రేక్షకులతో కలిసి చూస్తే వాళ్ళు పడే బాధ తెలుస్తుంది. బోరుకైనా పరిమితి వుంటుంది.
       
తెలుగులో ఇక కుటుంబ సినిమాలు తీయకపోవడం ఉత్తమం. పాత కథలే తీసినా
, కనీసం యూట్యూబ్ పాత సినిమాల్లోని భావోద్వేగాలు, కుటుంబ బంధాలు, నాటకీయతా కాపీ చేసైనా తీయలేనప్పుడు తీయడం వృధా!

నటనలు- సాంకేతికాలు

సంతోష్ శోభన్ టాలెంట్ వున్న నటుడు. ప్రతీసారీ టాలెంట్ ని నిరూపించుకుంటూనే వున్నాడు కానీ, సినిమాలే సహకరించడం లేదు. అతడి టాలెంట్ కి కలిసొచ్చే అంశం ఈజ్. ఎలాటి పాత్రనైనా ఈజ్ తో సహజంగా నటించేస్తాడు. ఇది మూడో సినిమా తనూ నేను తోనే మెయింటెయిన్ చేస్తూ వస్తున్నాడు. అయితే ఈ సారికూడా పాత్ర కుదర్లేదు. కారణం కాన్ఫ్లిక్ట్ లేకపోవడం. ముగింపులో మాత్రం భావోద్వేగాలతో కట్టి పడెసే నటన కనబర్చాడు. ఇక కుటుంబ దృశ్యాల్లో చాలా సార్లు సీనియర్ నటుల డామినేషన్ తో డ్యామేజీ అయ్యాడు. దీన్ని బ్యాలెన్స్ చేయలేదు దర్శకురాలు. మాళవికా నాయర్ తో రొమాన్స్ కూడా విషయం లేక ఫ్లాట్ గా సాగడంతో రాణించడం కష్టమై పోయింది శోభన్ కి. రెండు పాటలైనా ఆదుకుని వుంటే సినిమాలో వున్న బోరు కొంత తగ్గేది.
       
మాళవికా నాయర్ పాత్రకి వ్యాపార దృక్పథముంది గానీ దీని తాలూకు పాత్రచిత్రణ కొరవడింది. ఆదర్శాలు మాటల వరకే
, ఆలోచనలు విషయం లేని ప్రేమ గురించే అన్నట్టుగా వుంది. ఇక సహాయ పాత్రల్లో రాజేంద్ర ప్రసాద్, రావురమేష్, నరేష్, గౌతమి ఇంకా చాలా మంది నటీనటులు, వాళ్ళ కోపాలు, ఆనందాలు, పాటలూ ఏవీ ప్రేక్షకులకి తాకకుండా, తామరాకుపై నీటి బొట్టు టైపులో వుండిపోతారు.
       
మిక్కీ జె మేయర్ సంగీతం ఎవరేజ్ గా వుంది. కూనూరు
, ఇటలీ లొకేషన్స్ లో సన్నీ, రిచర్డ్స్ ల కెమెరా వర్క్ టైటిల్ కి తగ్గ మూడ్ తో వుంది. లక్ష్మీ భూపాల రాసిన మాటలు వుండాల్సిన చోట బలంగా, లేని చోట్ల తేలికగా వున్నా, మొత్తం కథని డ్రైవ్ చేసే ఫ్లో తో లేవు. ఎందుకంటే కథకే ఒక ఫ్లో లేదు. కారణం షేక్ దావూద్ స్క్రీన్ ప్లే స్క్రీన్ ప్లే కాకుండా స్క్రీన్ ఫ్లూ అయి వ్యాపించడం. మళ్ళీ దీనికి కారణం కథలో కాన్ఫ్లిక్ట్ లేకపోవడం. కాన్ఫ్లిక్ట్ లేకపోతే ఎంత స్లోగా సాగాలో అంత స్లోగా సినిమా సాగి తీరుతుంది.

చివరికేమిటి?

కథలో కాన్ఫ్లిక్ట్ మర్చిపోయి ఎవరైనా సినిమా తీస్తారా? తీస్తే ఏం కథ చూస్తున్నామో అర్ధమవుతుందా? కథంటేనే కాన్ఫ్లిక్ట్ (సంఘర్షణ). రెండు కుటుంబాల మధ్య దశాబ్దాల కాన్ఫ్లిక్ట్ వుంది- ఇది వెనక్కి వెళ్ళిపోయి, నానా తిప్పలుపడి ఎలాగో హీరోహీరోయిన్ల మధ్య ఇంటర్వెల్లో ఇగోలకి సంబంధించిన కాన్ఫ్లిక్ట్ పుడుతుంది. దీంతో సెకండాఫ్ మీద ఆసక్తి పెంచుకుని చూస్తే, హీరోహీరోయిన్లు ఇగోల తగాదాలే మర్చిపోతారు. దీంతో ఏ కాన్ఫ్లిక్ట్ లేని కథ - సంబంధం లేని సీన్లతో, కామెడీలతో చివరి వరకూ సహనాన్ని పరీక్షిస్తూ తీసికెళ్ళి - ఆనాడు పుట్టుకతో హీరోహీరోయిన్లు తారుమారైన విషయం బయటపడి సుఖాంత మవుతుంది.
       
కథలో ఒక చోట ఒక పాయింటు ఉత్పన్న మవుతుంది- పుట్టి తారుమారురైన హీరో ఆ పెంపుడు తల్లి స్వభావంతో పెరుగుతాడు. హీరోయిన్ ఆ పెంపుడు తండ్రి స్వభావంతో పెరుగుతుంది. అప్పుడు తాము తారుమారైన విషయం తెలిస్తే ఆ పెంపుడు తల్లి
, ఆ పెంపుడు తండ్రి స్వభావాల్ని పుణికి పుచ్చుకుని పెరిగిన తాము, వాటిని కలుషితం చేసుకోలేక-  నిజం బయటపడకుండా చేసే ప్రయత్నాలతో కాన్ఫ్లిక్ట్ పుట్టి వుంటే- ఇది యూత్ అప్పీలున్న హీరోహీరోయిన్ల కథగా కాస్త నయమన్పించుకునేది.

—సికిందర్