రివ్యూలు, సాంకేతికాలు, స్క్రీన్ ప్లే సంగతులు...

టికెట్లు దొరకడం యోగం, సినిమాలు చూడడం భోగం, రివ్యూలు రాయడం రోగం!

Friday, May 12, 2023

1326 : రివ్యూ!


 

రచన- దర్శకత్వం : వెంకట్ ప్రభు
తారాగణం: నాగ చైతన్య అక్కినేని, కృతీ శెట్టి, అరవింద్ స్వామి, ప్రియమణి, శరత్ కుమార్, సంపత్ రాజ్, ప్రేమ్ జీ అమరేన్, వెన్నెల కిషోర్, ప్రేమీ విశ్వనాథ్ తదితరులు
మాటలు : అబ్బూరి రవి, సంగీతం : ఇళయరాజా, యువన్ శంకర్ రాజా ; ఛాయాగ్రహణం : ఎస్ ఆర్ కదిర్
బ్యానర్ : శ్రీనివాసా సిల్వర్ స్క్రీన్
నిర్మాత: శ్రీనివాస చిట్టూరి
విడుదల : మే 12. 2023

        హీరో నాగచైతన్య 2021-22 లలో లవ్ స్టోరీ’, బంగార్రాజు’, థాంక్యూ లలో నటించి, థాంక్యూ అట్టర్ ఫ్లాపయ్యాక ఇప్పుడు కస్టడీ అనే యాక్షన్ తో ప్రేక్షకుల్ని బుజ్జగించడానికి వచ్చాడు. అటు తమ్ముడు అఖిల్ ఏజెంట్ తో మళ్ళీ మొదటికొచ్చాడు. అఖిల్ అంతర్జాతీయ గూఢచారిగా నటిస్తే తను మామూలు పోలీస్ కానిస్టేబుల్ గా కస్టడీ లో నటించాడు. ఇప్పుడు గూఢచారికంటే కానిస్టేబుల్ బెటర్ అన్పించుకున్నాడా లేదా అన్నది ప్రశ్న.

        నిర్మాత శ్రీనివాస చిట్టూరి మాత్రం కస్టడీ ని తెలుగు ఎమోషన్స్ లోడ్ చేసిన హాలీవుడ్ సినిమా అన్నారు. అంతే కాదు, నాగార్జున కెరీర్ లో శివ ఎలా గుర్తుండి  పోయిందో, నాగచైతన్య కెరీర్ లో కస్టడీ అలా గుర్తుండి పోతుందన్నారు. నిర్మాతే ఇలా నమ్మి ప్రకటిస్తే ప్రేక్షకులకి మంచి భరోసా, కొంత ధైర్యం కూడా లభిస్తాయి.
       
తమిళ దర్శకుడు వెంకట్ ప్రభు తమిళంలో
మానాడు హిట్ తర్వాత 'కస్టడీ ని తెలుగు-తమిళం ద్విభాషా చలన చిత్రంగా తీశాడు. భారీ తారాగణాన్నీ, ఇళయరాజా సంగీతాన్నీ జత చేశాడు. నాగచైతన్య సరసన హీరోయిన్ గా ట్రెండింగ్ లో వున్న కీర్తీ శెట్టిని తీసుకున్నాడు. సినిమాలో కీర్తి శెట్టి పాత్ర పేరు రివీల్ చేయాడానికి కూడా ఈవెంట్ ని ప్లాన్ చేశాడు. ఇంతా చేస్తే పాత్ర పేరు రేవతి. ఇవన్నీ దృష్టిలో పెట్టుకుని ఇప్పుడు కథని రివీల్ చేస్తే ఏముందో చూద్దాం...

కథ

    సఖినేటి పల్లిలో శివ (నాగచైతన్య) ఓ కానిస్టేబుల్. డ్యూటీ అంటే ప్రాణమిచ్చే అతను  డ్రైవింగ్ స్కూలు నడిపే రేవతి (కీర్తీ శెట్టి) ని ప్రేమిస్తాడు. ఒకరోజు సీఏం దాక్షాయణి (ప్రియమణి) కాన్వాయ్ ని ఆపి అంబులెన్స్ కి దారివ్వడంతో వార్తల్లో కొస్తాడు శివ. రేవతితో కులాలు వేరు కావడంతో ప్రేమలో సమస్యలొస్తాయి. ఆమె ఇంట్లో వేరే సంబంధం (వెన్నెల కిషోర్) చూడడంతో -నీతో వచ్చేస్తా లేదా చచ్చిపోతా అంటుంది శివతో. శివ రేవతి కోసం పరిగెడుతూంటే దారిలో, డ్రంకన్ డ్రైవ్ కేసులో రాజు (అరవింద్ స్వామి) అనే క్రిమినల్ ని సీబీఐ అధికారి (సంపత్ రాజ్) అరెస్టు చేసి పోలీసు స్టేషన్ కి తీసికెళ్తాడు.
       
రాజుని చంపడానికి పోలీస్ కమీషనర్ (శరత్ కుమార్) పోలీసుల్ని, రౌడీల్నీ రంగంలోకి దింపుతాడు. దీంతో దీన్ని నివారించడానికి రాజుని తీసుకుని శివ పారిపోతాడు. రాజుకి చట్టప్రకారం శిక్ష పడాలన్నది అతడి లక్ష్యం. మరి పెద్ద పెద్ద అధికారుల్ని ఎదిరించి శివ తాను అనుకున్న లక్ష్యం నేర వేర్చుకున్నాడా లేదా అన్నది మిగతా కథ.

ఎలావుంది కథ

    ఇలాటి కథ సినిమాగా తీయాలంటే, విట్నెస్ ప్రొటెక్షన్ కథలతో హాలీవుడ్ లో వచ్చిన చాలా సినిమాలు చూసి తీయొచ్చు. మెల్ గిబ్సన్ నటించిన బర్డ్ ఆన్ ఏ వైర్ (1990) వాటిలో ఒకటి. కానీ దర్శకుడు వెంకట్ ప్రభు ఈ క్రిమినల్ ప్రొటెక్షన్ కథని ప్రేక్షకుల్ని పూర్తిగా కస్టడీ లోకి తీసుకుని, బంధించి టార్చర్ చేస్తూ- చూస్తారా చస్తారా అని బెదిరిస్తున్నట్టు తీశాడు. నిర్మాత చెప్పిన తెలుగు ఎమోషన్స్ తో హాలీవుడ్ సినిమా అంటే ఇదేనేమో. ఇది నాగచైతన్య కెరీర్ లో గుర్తుండిపోయే మాటేమోగానీ, ప్రేక్షకుల తెలుగు ఎమోషన్స్ కి అయిన గాయాలు మాత్రం బాగా గుర్తుంటాయి.
       
ఓ కానిస్టేబుల్ వ్యవస్థని ఎదిరించి నేరస్థుడికి శిక్షపడేలా చూడాలనుకునే పాయింటు బాగానే వుంది. ఈ పాయింటుని అమలు చేయబోయే సరికి ఏ లాజిక్కూ
, ఏ కామన్ సెన్సూ లేకుండా పోయాయి. కథకంటే, కానిస్టేబుల్ వ్యూహాలూ ప్రతివ్యూహాలతో కూడిన రసవత్తర డ్రామా కంటే, ఊకదంపుడు పోరాటాలూ ఛేజింగులూ ఇవే నిండిపోయాయి.
       
పైన చెప్పిన
బర్డ్ ఆన్ ఏ వైర్ లో అంత స్టార్ హీరోహీరోయిన్లు (మెల్ గిబ్సన్, గోల్డీ హాన్) తో  కథ పెద్దగా ఏమీ వుండదు. కానీ యాక్షన్ సీన్స్ జరగడానికి కల్పించిన ట్విస్టులే యాక్షన్ సీన్స్ ని ఎంజాయ్ చేసేలా చేస్తాయి. వెంకట్ ప్రభు కథలో ఈ ఎంజాయ్ మెంటుతో కూడిన ఎంటర్టైన్మెంట్ వుండదు. సినిమా సాంతం రిలీఫ్ లేకుండా సీరియస్సే. సహన పరీక్ష పెట్టే ఫైట్సే. పైగా తమిళ నటులు ఎక్కువై పోయేసరికి తెలుగు సినిమా చూస్తున్నట్టు కూడా వుండదు.
       
నాగచైతన్య ఈ బి గ్రేడ్ కథతో
, బి గ్రేడ్ సినిమా ఎందుకు నటించినట్టో తెలియదు. అతడి కెరీర్ లో ఇది మరో జోష్ లాంటిది.

నటనలు- సాంకేతికాలు

    నాగ చైతన్య సాధారణ కానిస్టేబుల్ పాత్రలో ఒదిగిపోవడానికి చేసిన ప్రయత్నం మాత్రం బాగా ఫలించింది. నటుడిగా నిలబడ్డాడు. నిజానికి నిజ జీవితంలో కానిస్టేబుల్స్ ని ఇన్స్పైర్ చేయగల విషయం పాత్రలో వుంది. దీన్ని దర్శకుడు గుర్తించకపోవడంతో ఆకారానికే తప్ప, ఆలోచనకి కాకుండాపోయింది పాత్ర. ఏ మాత్రం భావోద్వేగాలు పలకని నటన పూర్తిగా ఫ్లాపయ్యింది. కథకే కాదు పాత్రకీ న్యాయం చేయలేదు. హీరోయిన్ తో ప్రేమకథ కూడా ఒక డ్రై సబ్జెక్టు.
        
హీరోయిన్ కీర్తీ శెట్టి గ్లామర్ తో సినిమా నెట్టుకొచ్చింది. ఫస్టాఫ్ లో ప్రేమ కథ ఆగి, యాక్షన్ కథ మొదలవడంతో స్పేస్ ఫిల్లర్ పాత్రగా వుండిపోయింది. ఇక ప్రియమణి, అరవింద్ స్వామి, శరత్ కుమార్, సంపత్ రాజ్ ల వంటి హేమా హేమీలున్నా సినిమాకి బలం పెరగలేదు. చిన్న చిన్న పాత్రల్లో ఈ హేమా హేమీలు నటించారు.
        
ఇదిలా వుంటే, ఇక ఇళయరాజా- యువన్ శంకర్ రాజా తండ్రీ కొడుకుల సంగీతం అట్టర్ ఫ్లాపయ్యింది. ఇళయరాజా నాగార్జున శివ చూసి ఫీలయినట్టు ఫీలవ్వాలిగా సంగీతం చేయడానికి. ఆయనకి తోడు రామజోగయ్య రాసిన పాటలు నిర్లక్ష్యంగా వున్నాయి.నిర్మాత ప్రొడక్షన్ విలువలకి మాత్రం బాగా ఖర్చు పెట్టారు. దర్శకుడి కంటే సాంకేతిక నిపుణులే తమ ప్రతిభని చూపెట్టుకున్నారు. దర్శకుడి సృజనాత్మకతకి ఏ విషయంలోనూ రాణింపు లేదు. సినిమా నడక కూడా మందకొడిగా వుంటుంది.

చివరికేమిటి

        సింగిల్ షాట్ యాక్షన్ సీను అని ఈ సినిమా గురించి చాలా వినపడింది. సింగిల్ షా ట్ లో తీసిన ఈ ఒక యాక్షన్ సీను చాలా బావుంది. మెచ్చుకుని తీరాలి. దర్శకుడు ఇది చెప్పి నాగ చైతన్యని పడెయ్యలేదు కదా? ఫస్టాఫ్ ఇంటర్వెల్ ముందు వరకూ నాగచైతన్య- కీర్తీ శెట్టిల విసుగు పుట్టించే ప్రేమ కథని సాగదీసి సాగదీసి, దాన్ని వదిలేసి, ఇంటర్వెల్ ముందు అరవింద్ స్వామీ ఎంట్రీతో అసలు కథలోకి వస్తాడు. ఆసక్తిగానే కథ మొదలైంది కదా అనుకుంటే, సెకండాఫ్ లో వుంటుంది టార్చర్. ఈ టార్చర్ ని భరించి చూడాలనుకుంటే సినిమా చూడొచ్చు.  లేదంటే చక్కగా వెళ్ళి రామబాణం చూసుకోవచ్చు. రెండో టార్చర్ భరించలేకపోతే మొదటి టార్చరే బెటర్ అనిపిస్తుంది.

—సికిందర్


Monday, May 8, 2023

1325 : రివ్యూ!


 

రచన- దర్శకత్వం : సుదీప్తో సేన్
తారాగణం : అదా శర్మ, యోగితా బిహానీ, సోనియా బలానీ, సిద్ది ఇద్నానీ, దేవదర్శిని, విజయ్ కృష్ణ, ప్రణయ్ పచౌరీ, ప్రణవ్ మిశ్రా తదితరులుసంగీతం : వీరేష్ శ్రీవల్స, బిషఖ్ జ్యోతి; ఛాయాగ్రహణం :  
బ్యానర్: సన్‌షైన్ పిక్చర్స్
నిర్మాత: విపుల్ అమృత్ లాల్  షా

విడుదల : మే 5, 2023
***
        గుజరాత్ కి చెందిన బాలీవుడ్ అగ్ర నిర్మాత, దర్శకుడు  విపుల్ అమృత్ లాల్ షా స్టార్స్ తో భారీ కమర్షియల్ సినిమాలు తీసిన వాడే. 2002 నుంచీ అమితాబ్ బచ్చన్, సల్మాన్ ఖాన్, అక్షయ్ కుమార్, అర్జున్ కపూర్ లతో దర్శకుడుగా 6 సినిమాలు; అక్షయ్ కుమార్, జాన్ అబ్రహాం, విద్యుత్ జమ్వాల్ లతో నిర్మాతగా 8 సినిమాలూ తీసి, ప్రస్తుతం జాన్ అబ్రహాంతో ఫోర్స్3 నిర్మిస్తున్నాడు. ఇంతలో తానూ గుజరాత్ లాబీలో చేరాలనుకున్నట్టుగా, కాశ్మీర్ ఫైల్స్ సరళిలో ప్రభుత్వానికి ఓట్లు, తనకి నోట్లు ప్రణాళికతో కేరళ స్టోరీ తీశాడు. ఇది హిట్టయ్యింది.

        టు కర్నాటకలో ఎన్నికల ప్రచారం చేస్తూ ప్రధాని కూడా అన్ని ఎన్నికల నియమావళులనూ, పదవీ మర్యాదనూ తుంగలో తొక్కి ఓట్ల కోసం సినిమాకి ప్రచారం చేశాడు. ఇంతలో సినిమాలో చెప్పినట్టుగా 32 వేలమంది కేరళ యువతుల అదృశ్యం నిజమని కాసేపు, కాదని కాసేపూ నిర్మాత అమృత్ లాల్ కన్ఫ్యూజన్ లో వుండగా, నిన్న గుజరాత్ స్టోరీ రిలీజ్ అయింది. గుజరాత్ నుంచి 41, 621 మంది వివాహితలు, అవివాహితలూ  అదృశమయ్యారని ప్రభుత్వానికి చెందిన నేషనల్ క్రైమ్ రికార్డ్స్ బ్యూరో కన్ఫ్యూజన్ లేని అంకెలు విడుదల చేసింది. ఇతర రాష్ట్రాల్లో వ్యభిచార గృహాలకి అమ్మేసి వుంటారని అధికారుల అంచనా. దీంతో కేరళ స్టోరీ కి ఏ బురఖాలో తల దాచుకోవాలో తెలియని పరిస్థితి ఏర్పడింది.
        
దీనికి తోడు ఇండియా టుడే, ఇండియన్ ఎక్స్ ప్రెస్, ఎన్డీ టీవీ, టైమ్స్ ఆఫ్ ఇండియా, చివరికి గోదీ మీడియా అయిన ఆజ్ తక్ వంటి జాతీయ మీడియా సంస్థలు ఈ సినిమాకి 0.5 నుంచి 1.5 వరకు మాత్రమే రేటింగ్స్ నిర్ణయించాయి. ఇది చాలా అన్యాయమే. మరీ అంత తీసిపారేయాల్సిన అవసరం లేదు. ఎందుకంటే, ఈ సినిమా ద్వారా మైనారిటీ వర్గాన్ని ఎండగట్టే సృజనాత్మక స్వేచ్ఛ మాటున, విద్యావంతులైన మెజారిటీ వర్గ యువతుల తెలివిని ఎంత అపహాస్యం చేశారో అర్ధం జేసుకునే అవకాశం లభిస్తుంది. ఈ సినిమా వేరే ఎవరైనా తీసి వుంటే ఈపాటికి 100 కేసులు పడేవేమో. 
       
బెంగాలీ దర్శకుడు సుదీప్తో సేన్ 10 వాస్తవిక సినిమాలు తీసి స్ట్రగుల్ చేస్తున్న దర్శకుడు. తను వెలుగులోకి రావడానికి కేరళ స్టోరీ తీయాలనుకోవడం మంచి నిర్ణయం. ప్రభుత్వ పాలనా వైఫల్యాల పుట్ట మీద బురఖా వేసి
, బురఖాల మీద- గడ్డాల మీదా కోపాన్ని మళ్ళించే ఇలాటి తెలివైన సినిమాలే నేటి జాతీయ అవసరం. అలాగే, అదా శర్మ పూరీ జగన్నాథ్ నితిన్ తో తీసిన హార్ట్ ఎటాక్ తో తెలుగులో పరిచయమై, ఇంకో నాల్గు తెలుగు సినిమాలు, కొన్ని తమిళ హిందీ సినిమాలూ నటించిన ఛోటా నటి. ఈమె నట జీవితానికి కేరళ స్టోరీ ఓ మలుపు కాగలదు. ఈ నేపథ్యంలో ఈ సినిమా కథా కమామిషేమిటో ఓసారి చూద్దాం...

కథ

శాలినీ ఉన్ని కృష్ణన్ (అదా శర్మ), గీతాంజలి (సిద్ధీ ఇద్నానీ) అనే ఇద్దరు హిందూ విద్యార్థినిలు, నిమా (యోగితా బీహానీ) అనే క్రిస్టియన్ విద్యార్థిని, ఆసిఫా (సోనియా బలానీ) అనే ముస్లిం విద్యార్థిని నల్గురూ కేరళలోని కాసర్ గోడ్ లో నర్సింగ్ కాలేజీలో చదువుతూ హాస్టల్లో వుంటారు. ఆసిఫా సిరియా ఉగ్రవాద సంస్థ ఐసిస్  స్లీపర్ సెల్ ఏజెంట్ గా వుంటుంది. ఈ స్లీపర్ సెల్ స్థానిక నాయకుడి ఆదేశాల ప్రకారం, ఇతర మతాల అమ్మాయిలకి మాయ మాటలు చెప్పి మతంలోకి మార్చి, ముస్లిం యువకులతో ప్రేమలోకి దింపితే, ఆ ముస్లిం యువకులు పెళ్ళిళ్ళు చేసుకుని సిరియా తీసికెళ్ళి పోయి పవిత్ర యుద్ధంలో పాల్గొనాలని ప్లాను.
        
ఆసిఫాతో ఈ ప్లాను ఆలస్యమవుతూంటే, వాళ్ళని గర్భతుల్ని చేసి పెళ్ళికి దారి క్లియర్ చేయమని ఆదేశిస్తాడు నాయకుడు. ముస్లిం యువకుడు రమీజ్ తో ప్రేమలో పడ్డ శాలిని గర్భవతవుతుంది. ఇంకో ముస్లిం తో గీతాంజలి కూడా గర్భవతై ఆత్మహత్య చేసుకుంటుంది. నిమా సురక్షితంగా వుంటుంది. ఇక గర్భవతైన శాలిని పెళ్ళి చేసుకోమని అడిగితే, మతం మారితే చేసుకుంటా నంటాడు రమీజ్. విధిలేక ఆమె మతం మారితే,  పెళ్ళి జరిగే సమయంలో పరారవుతాడు. ఇక దిక్కుతోచని శాలిని వేరే ఒకడ్ని పెళ్ళి చేసుకోక తప్పదనీ, పెళ్ళి చేసుకుని సిరియా వెళ్తే అల్లా స్వర్గాన్ని అనుగ్రహిస్తాడనీ నూరిపోస్తాడు నాయకుడు. దీంతో శాలినీ ముక్కూ మొహం తెలీని వాణ్ని చేసుకుని సిరియా వెళ్ళాక, అక్కడ అసలు మోసం గ్రహిస్తుంది.

ఎలావుంది కథ

ఇది కేరళలో జరుగుతున్న లవ్ జిహాద్ ని పురస్కరించుకుని చేసిన కల్పిత కథ అన్నారు దర్శకుడు, నిర్మాత. టీజర్ లో 32000 అమ్మాయిలన్నారు, సినిమా విడుదలకి ముందు సుప్రీం కోర్టులో కాదు ముగ్గురు అమ్మాయిలే అన్నారు, సినిమాలో ఒకమ్మాయి కథే చూపించారు. ఇలా వుంది విశ్వసనీయత. అసలు లవ్ జిహాద్ పదాన్నే కేంద్రప్రభుత్వం గుర్తించడం లేదనీ, అలాటి కేసులు ప్రభుత్వ దృష్టికి రాలేదనీ, కేంద్ర మంత్రి జి. కిషన్ రెడ్డి లోక్ సభలో ప్రకటించాక, మత మార్పిడి చట్టం తేవాలన్న ఆలోచనే కేంద్ర ప్రభుత్వానికి లేనప్పుడు, కొన్ని  బీజేపీ రాష్ట్రాలే చట్టం చేస్తూ, దాన్ని లవ్ జిహాద్ చట్టమని అననప్పుడు, కేరళలో లవ్ జిహాద్ అంటూ దుమారం రేపిన కేసుని సుప్రీం కోర్టు కొట్టేసి, మతాంతర ప్రేమ జంటని ఏకం చేసినప్పుడు- ఇవన్నీ సాక్ష్యాలే. వీటిని కాదని బడాయికి పోయి అభూతకల్పనల, నమ్మదగని  సినిమా తీశారు.
        
కేరళలో మతశక్తులు లేవని కాదు. ఇరు వర్గాల మత శక్తులూ చక్కగా వున్నాయి. వీటి మధ్య సిరియా కనెక్షన్ తో కొట్లాటలు జరుగలేదు. ఇండియా నుంచి సిరియా కెళ్ళిన ముస్లింలు 100 మంది వరకూ వుంటారని కేంద్ర ప్రభుత్వమే ప్రకటించింది. ఇందులో లవ్ జిహాద్ బాధితులైన హిందూ అమ్మాయిల లెక్క చెప్పలేదు. అయితే సినిమాలో చూపించిన ముగ్గురమ్మాయిల అనుభవాలూ నిజమని సినిమా కర్తలు చెప్తున్నారు. నిజమే కావచ్చు. అయితే మొత్తం ఒక రాష్ట్రాన్నీ, మతాన్నీ చెడుగా చూపిస్తూ సినిమా తీయడం సృజనాత్మక స్వేచ్ఛ అన్పించుకోదు, రాజకీయ ఎజెండా అన్పించుకుంటుంది. టెర్రరిజం మీద చాలా సినిమాలు తీశారు. ఇలా చూపించలేదు. ఒక వర్గం స్మగ్లర్లతో, మాఫియాలతో తీసిన సినిమాల్లో కూడా వీళ్ళని వ్యతిరేకించే అదే వర్గంలో మంచి వాళ్ళని కూడా చూపించారు. కానీ కేరళ స్టోరీ లో మొత్తం ఆ వర్గాన్ని బ్యాడ్ గా చూపించారు మంచిదే, రాజకీయ ఎజెండా కాబట్టి. కానీ మెజారిటీ వర్గాన్ని అసమర్ధులుగా చూపిస్తున్నామని తెలుసుకో లేదు అభూతకల్పిస్టులు.
        
ఇక కేరళ దృశ్యాలకి సిరియా వికృత దృశ్యాలు కలిపి చూపించడంతో రెచ్చగొట్టే కావాల్సినంత మసాలా దొరికినట్టయ్యింది. అయితే ఈ సిరియా దుర్మార్గాలు కొత్తగా చూస్తున్నవేం కావు. మీడియాలో తెలిసినవే. కేరళలో స్లీపర్ సెల్ నాయకుడంటాడు- ఔరంగజేబు ప్రారంభించిన పని మనం పూర్తి చేయాలని. ఇదొక వక్రీకరణ. ఔరంగజేబు తల్చుకుని వుంటే - వాళ్ళు పాలిస్తున్న ఈ దేశానికి హిందూస్థాన్ అని పేరు పెట్టుకునే వాళ్ళే కాదు.
        
పోతే, 2020 లో నెట్ ఫ్లిక్స్ సిరీస్ కాలిఫేట్ లో కూడా ఇలాగే స్వీడెన్ కి చెందిన ముగ్గురమ్మాయిల కథ. మోసపోయి సిరియా పవిత్ర యుద్ధం లో ఇరుక్కునే కథ చూడొచ్చు. 

నటనలు - సాంకేతికాలు 

అదా శర్మ నటించిన ఈ పాత్ర వేరే కమర్షియల్ సినిమాల్లోనైతే, విషయం తో కూడి వుండి - ఇంకెవరైనా సమర్ధురాలైన నటితో తీసి వుండేవాళ్ళు. తన మీద ఆధారపడ్డ ఈ కథలో కదిలించే, సానుభూతిని పొందే సన్నివేశాలన్నిటినీ చెడగొట్టింది. ఇందుకు కూడా నేషనల్ మీడియా అలాటి రేటింగ్స్ ఇచ్చి వుంటుంది. ఆమె నటన గురించి చెప్పుకునేందుకు ఏమీలేదు.
        
దర్శకుడు చిత్రించిన పాత్ర గురించి చెప్పుకోవాలి. నర్సింగ్ చదువుతున్న తను సేఫ్ సెక్స్ తెలియనట్టు గర్భం తెచ్చుకోవడం, పెళ్ళి కోసం మతం మార్చుకోవడం, పెళ్లి కొడుకు పారిపోతే ఇంకొకడ్నిపెళ్ళి చేసుకోవడం, వాడితో అల్లా ఆనుగ్రహించే స్వర్గం కోసం సిరియా వెళ్ళడం లాంటివి‌ చేసేస్తూంటుంది.
        
ఆసిఫా ప్లాను ప్రకారం పబ్లిక్ గా నల్గురు కుర్రాళ్ళ చేత ఈవ్ టీజ్ చేయించి  బట్టలు చించేస్తే, పోలీస్ కంప్లెయింట్ ఇచ్చి లోపలేయించకుండా ఆసిఫా మాటల్ని నమ్ముతుంది. బురఖా వేసుకుంటే రేపులు జరగవని ఆసిఫా చెప్పింది నమ్మేసి బురఖాలు వేసుకోవడం మొదలెడతారు. అల్లా గురించి ఏవో మాటలు ఆసిఫా చెప్తే, నమ్మేసి ముస్లిం కుర్రాళ్ళని ప్రేమిస్తారు. గర్భవతులవుతారు. మోసపోయానని తెలిసీ గీతాంజలి కంప్లెయింట్ ఇవ్వకుండా ఆత్మహత్య చేసుకుంటుంది.  కూతురు (అదాశర్మ) పెళ్ళవుతూంటే వచ్చేసిన ఆమె తల్లి, ఏడ్చి వెళ్ళి పోతుంది. ఆమె కంప్లెయింట్ ఇచ్చి వుంటే  స్లీపర్ సెల్ ముఠా అప్పుడే కటకటాల్లో వుండేది. కూతురు దక్కేది.
        
ఇలా అడుగడుగునా పాత్రలు అసమర్ధంగా ప్రవర్తిస్తే ఈ కథకి వేరే అర్ధాలొస్తాయని దర్శకుడు గ్రహించ లేదు. తమతోనే వుంటూ ఆసిఫా కుట్రలు చేస్తోందని తెలిసిపోతున్నప్పుడు- రెండు పీకుళ్ళు పీకితే సరిపోయేదానికి ప్రాణాల మీదికి  తెచ్చుకున్న సిల్లీ పాత్రలివి.
        
సాంకేతికంగా అరాచకంగా వుంది. కేరళ దృశ్యాలు గానీ, సిరియా దృశ్యాలు గానీ పూర్ గా వున్నాయి. యాక్షన్ సీన్స్ కి అవకాశం లేదు. అదాశర్మ చివర్లో పారిపోయే రెండు మూడు దృశ్యాలు కూడా క్లయిమాక్స్ ని నీరుగార్చేస్తాయి. మనీషా కోయిరాలాతో తీసిన కాబూల్ ఎక్స్ ప్రెస్ లో గానీ, ఎస్కేప్ ఫ్రమ్ తాలిబన్ లో గానీ టెర్రిఫిక్ గా దృశ్యాలుంటాయి. ఇక కేరళ సంగీతం, పాటలు ఒరిజినల్ హిందీ వెర్షన్లో తమాషాగా వున్నాయి.

చివరికేమిటి

సిరియా వదిలి పారిపోతూ అంతర్జాతీయ దళాలకి చిక్కిన అదా శర్మ తన కథ చెప్పుకోవడంతో ఈ సినిమా ప్రారంభమవుతుంది. ఇక్కడికి రావడానికి ముందు కేరళలో జరిగిన కథంతా మల్టీపుల్ ఫ్లాష్ బ్యాకులుగా వస్తూంటుంది. దీంతో పాటు సిరియాలో ఎదుర్కొన్న అనుభవాలూ మల్టీపుల్ ఫ్లాష్ బ్యాకులుగా సెకండాఫ్ పై వరకూ సాగుతూనే వుంటాయి. ఆమె భద్రతా దళాలకి దొరికిన ప్రధాన కథ అక్కడే వుంటుంది ఏమీ జరక్కుండా. దీంతో మల్టీపుల్ ఫ్లాష్ బ్యాకులు చూసీ చూసీ విసుగొచ్చేస్తుంది. ముందుకూ వెనక్కీ కదిలే ఈ నాన్ లీనియర్ నేరేషన్ వల్ల ఏదైనా బలం వుంటే అది కథ కోల్పోయింది. ఆమె మొత్తం చెప్పడం ముగించాక భద్రతా దళాల క్యాంపులోనే సినిమా ముగుస్తుంది.
        
ఇలాటి విశ్వసనీయత, సృజనాత్మకత, నటనలు, డ్రామా వున్న కథకి ఉపసంహారంగా ఇద్దరు బాధితుల స్టేట్మెంట్లు జత చేశారు. ఇక్కడ 32000 మంది ప్రస్తావన లేదుగానీ, సెకండాఫ్ లో క్రిస్టియన్ అమ్మాయి పాత్ర- పోలీసు అధికారులకి చెప్తుంది-  చాలా డేటా అందిస్తుంది. ఇంత డేటా తెలిసి వుంటే ఎలా మోసపోయిందో పక్కన పెడితే, మొత్తం 30 వేల మంది అమ్మాయిలు అదృశ్యమయ్యారని, అప్పటి ముఖ్యమంత్రి ఊమెన్ చాండీ చెప్పారనీ తప్పుడుగా చెప్తుంది. సుప్రీం కోర్టుకి టీజర్ నుంచి 32000 అంకె తొలగిస్తామని చెప్పిన నిర్మాత సినిమాలోంచి తొలగించలేదు. 2006-12 మధ్యకాలంలో 2667 మంది యువతులు స్వచ్ఛందంగా ఇస్లాంలోకి మారారని మాత్రమే చాండీ అసెంబ్లీలో ప్రకటించారు. దీన్ని 3000 చొప్పున తానే లెక్కకట్టి, ఆ తర్వాత పదేళ్ళలో-ఇప్పటికి 30 వేలు అని చెప్పేసినట్టుంది ఆమె!
        
ఈ అంకెల సంక్షోభమేమిటో నిన్న గుజరాత్ స్టోరీ ప్రకటించిన నేషనల్ క్రైమ్ రికార్డ్స్ బ్యూరేయే చెప్పాలి! కానీ అంకెలు ఇప్పుడెంత సరిదిద్దినా వెళ్ళాల్సిన 32000 సంఖ్య  ప్రేక్షకుల్లోకి వెళ్ళిపోయాక దాంతో అనుకున్న ఎజెండా హిట్టయినట్టే! హేట్సాఫ్ టు రెండో వివేక్ అగ్నిహోత్రీ...

—సికిందర్

 

Saturday, May 6, 2023

1324 : రివ్యూ!



దర్శకత్వం : శ్రీవాస్
తారాగణం : గోపీచంద్, డింపుల్ హయతీ, జగపతి బాబు, కుష్బూ సుందర్, తరుణ్ రాజ్ అరోరా, నాజర్, శుభలేఖ సుధాకర్, సచిన్ ఖేడేకర్, కాశీ విశ్వనాథ్, అలీ, వెన్నెల కిషోర్, సప్తగిరి, సత్య, గెటప్ శ్రీను తదితరులు
కథ : భూపతిరాజా, మాటలు : అబ్బూరి రవి,  సంగీతం : మిక్కీ జె మేయర్, ఛాయాగ్రహణం : వెట్రి పళనిసామి
బ్యానర్ : పీపుల్ మీడియా
నిర్మాత : టీజీ విశ్వ ప్రసాద్
విడుదల : మే 5, 2023
***

            2021 లో సీటీ మార్ హిట్టయ్యాక ఆరడుగుల బుల్లెట్’, 2022 లో పక్కా కమర్షియల్ అనే రెండు పరాజయాలెదుర్కొన్న మాచో స్టార్ గోపీచంద్, తాజాగా సమ్మర్ ఫ్యామిలీ ఎంటర్ టైనర్ అని నమ్మి రామబాణం తో వచ్చాడు. దర్శకుడు శ్రీవాస్ తో గోపీచంద్ 2007 లో లక్ష్యం’, తిరిగి 2014 లో లౌక్యం అనే రెండు హిట్స్ అందించిన అనుభవంతో తిరిగి తొమ్మిదేళ్ళ తర్వాత  రామబాణం ప్రయత్నించాడు. మరి ఈ బాణం ఎవరికైనా తగిలిందా, ఎవరిలోనైనా స్పందన కలిగే అవకాశముందా ఈ క్రింద తెలుసుకుందాం...

కథ

ఒక టౌన్లో రాజారాం (జగపతి బాబు) సుఖీభవ అనే హోటల్ నడుపుతూ సేంద్రీయ పంటలతో వండిన భోజనాన్ని తక్కువ ధరకి అందిస్తూంటాడు. దీంతో ఎదుటి హోటల్ యజమాని జీకే (తరుణ్ రాజ్ అరోరా) కి నష్టం వచ్చి తన మామ (నాజర్) తో కలిసి రాజారాం మీదికి గొడవకి వస్తాడు. హోటల్ లైసెన్స్ తీసుకుని వెళ్ళిపోతాడు. రాజారాం కి భార్య (ఖుష్బూ), తమ్ముడు విక్కీ (గోపీచంద్) వుంటారు. విక్కీ జీకే అడ్డా తగులబెట్టి లైసెన్స్ తీసుకుని వచ్చేసే సరికి అన్న రాజారాం మండిపడతాడు. తమ్ముడికి అహింసని బోధిస్తాడు. ఇది నచ్చని విక్కీ కోల్ కతా వెళ్ళిపోయి పెద్ద డాన్ గా ఎదుగుతాడు. అక్కడ యూట్యూబర్ భైరవి (డింపుల్ హయతీ) ని ప్రేమిస్తాడు. భైరవి తల్లిదండ్రులు విక్కీని కుటుంబంతో మాట్లాడించమనే సరికి విక్కీ అన్న దగ్గరికి ప్రయాణం కడతాడు. అన్న రాజారాం ఇప్పుడు హైదరాబాద్ లో సేంద్రీయ ఆహార వ్యాపారంలో భారీగా ఎదిగివుంటాడు. అతడి వ్యాపారాన్ని దెబ్బ తీయాలని జీకే కుట్రలు పన్నుతూంటాడు. ఇప్పుడు విక్కీ జీకే బారినుంచి అన్న వ్యాపారాన్ని ఎలా కాపాడి, తన పెళ్ళి సంబంధం గురించి ఒప్పించుకున్నాడనేది మిగతా కథ.

ఎలావుంది కథ

1980-90 లలో ఇలాటి కథలతో సినిమాలు చాలా వచ్చాయి. అన్నదమ్ముల అనుబంధం, వదినా మరదుల మురిపెం, అన్నని తమ్ముడు కాపాడడం, విలన్ కటకటాల్లో కూర్చోవడం, తమ్ముడు హీరోయిన్ని పెళ్ళాడి శుభం కార్డు వేయడమనే మేనిఫెస్టోని దగ్గర పెట్టుకుని, సీనియర్ రచయిత భూపతి రాజా సునాయసంగా దింపేసిన పాత కథే ఇది.
        
ఓటర్లని ఆకర్షించడానికి ఎన్నికల మేనిఫెస్టోలే కొత్త కొత్త హామీలతో మారిపోతున్నాక, కర్నాటకలో కాంగ్రెస్ మేనిఫెస్టో ప్రధాని చేత జై భజరంగ బలీ అన్పిపిస్తూ హిట్టవుతున్నాక, భూపతిరాజా ఒక్కటంటే ఒక్క హిట్టయ్యే నినాదం ప్రేక్షకుల కోసం సృష్టించలేకపోయాడు. సేంద్రీయ ఉత్పత్తుల గురించి సాగించిన కథ హీరో- విలన్ల మధ్య ఫార్ములా కొట్లాటతో ఉత్త ప్రహసనంగా మిగిలిపోయింది. ఈ కథలో వుండాల్సింది ఇలాటి పాత్రల మధ్య కాలం చెల్లిన ఎమోషన్స్ కాదు, అసలు పాత్రలన్నీ కలిసి సేంద్రీయ ఉత్పత్తుల వైపుగా ప్రేక్షకుల ఎమోషన్లు కేంద్రీకృతమయ్యేలా చేయగల్గాలి. ఈ కథకి హీరో సేంద్రీయ వ్యవసాయమే.
        
అన్నదమ్ముల అనుబంధం ఇప్పుడెవరు చూస్తారని కొందరు అన్నారని,  కానీ అనుబంధాలు ఎప్పుడూ వుండేవే అనీ, మారిన కాలానికి ఎలా చూపించామన్నదే ముఖ్యమనీ భూపతి రాజా చెప్పాడు. అనుబంధాలు మారవు, కాలాన్ని బట్టి వాటి కారణాలు మారుతాయి. భూపతిరాజా చూపించింది పాత కాలం సినిమాల్లోని కారణాలూ వాటితో అనుబంధాలే. ఈ తరానికి వీటితో సంబంధమే లేదు. నిజంగా అన్నదమ్ముల అనుబంధమే చూపించాలనుకుంటే, ఎవరో విలన్ తో కాదు-  సేంద్రీయ ఉత్పత్తులతో అన్నదమ్ముల మధ్యే విభేదాలతో భగభగ మండే సంఘర్షణ సృష్టించ వచ్చు. అప్పుడు ఇది అర్ధవంతమైన కథ అయ్యే అవకాశముండేది.

నటనలు- సాంకేతికాలు

గోపీ చంద్ కి అవే సినిమాలు, అవే పాత్రలు, అదే నటన, అదే గెటప్, సెటప్. ఆయన మారతాడని ప్రేక్షకులు ఆశలు పెట్టుకుని ఎదురు చూస్తున్నారు. ఆయన మార్పు చూపించింది ఒక చోటే- బాణం బదులు గద పట్టుకుని ఫైట్ చేయడం. ఆ గదతోనే కథని చావగొట్టినట్టయ్యింది. కోల్ కతాలో లో డాన్ గా గానీ, తర్వాత అన్నదగ్గరికి తమ్ముడిగా వచ్చాక గానీ పాత్ర స్వభావంలో మార్పేమీ లేక నటించడానికి లేకపోయింది. డాన్ గా క్రూరంగా వుండుంటే అన్నదగ్గర మృదువుగా వుంటూ షేడ్స్ కనబర్చవచ్చు.  గోపీ చంద్ సినిమా సాంతం`ఒకే సెలెబ్రిటీ లుక్ తో యాడ్స్ చేస్తున్నట్టు వుంటాడు.
        
విలన్ పాత్రలు నటించే జగపతి బాబు సాత్విక పాత్ర వేసినప్పుడు, గోపీచంద్ విలన్ లా వుండుంటే ఇద్దరి మధ్య డైనమిక్స్ కమర్షియల్ గా పనికొచ్చేవి. జగపతి బాబు సేంద్రీయ ఉత్పత్తులతో గాంధేయవాదిగా అన్పిస్తూ చివరికి ప్లేటు ఫిరాయించేస్తాడు. గోపీ చంద్ తో ఖుష్బూ పాత సినిమాల వదిన పాత్రకి న్యాయం చేసింది. హీరోయిన్ గా డింపుల్ హయతీ కి అసలు ప్రాధాన్యమే లేదు పాటల కోసం తప్ప. యూట్యూబర్ గా ఖుష్బూ చేత వంటల వీడియో చేసిన దృశ్యం హాస్యాస్పదంగా వుంది. ఖుష్బూకి చేపల కూర వండడమే రాలేదు, కూర మాడిపోయిందని అంటుంది. డింపుల్ కి వీడియో తీయడం కూడా రాలేదు. యూట్యూబర్ గా సేంద్రీయ ఉత్పత్తుల్ని ప్రమోట్ చేయాలన్న ఆలోచన కూడా రాలేదు. కాయగూరలతో సేంద్రీయ ఉత్పత్తులకి ప్రాణమిచ్చే కుటుంబంలో ఖుష్బూ చేపల కూర వండడ మేమిటో అర్ధంగాదు.
        
విలన్లుగా నాజర్, తరుణ్ రాజ్ అరోరాలు సరే, ఫార్ములా విలనిజమే. కమెడియన్లు చాలా మంది వున్నారు గానీ ఒక్కరూ నవ్వించలేకపోయారు. అలీ, వెన్నెల కిషోర్, సత్యా, సప్తగిరి, గెటప్ శీను ఎవ్వరికీ సరైన కామెడీ నివ్వలేదు దర్శకుడు.
        
ఇక కెమెరా వర్క్, ప్రొడక్షన్ విలువలూ బావున్నా మిక్కీ జె మేయర్ సంగీతం అతి సాధారణంగా వుంది. శ్రీవాస్ దర్శకత్వం అతి ఔట్ డేటెడ్ గా వుంది.

చివరికేమిటి

పాత మూస కథైనా కొత్త దర్శకులు కొత్తగా చూపించే ప్రయత్నం చేస్తున్నారు. కానీ రామబాణం దర్శకుడు దృశ్యాలుగానీ, కథనం గానీ కొత్తగా ఏమీ మార్చకుండా రెండు దశాబ్దాల క్రిందటి తన తరహా మేకింగ్ తోనే కానిచ్చేశాడు. మొదటి సీను నుంచీ చివరిదాకా పాత సినిమా చూస్తున్నట్టే వుంటుంది. ప్రారంభంలో కోల్ కతా సీన్లు పదే పదే హౌరా బ్రిడ్జి మీదే జరుగుతూంటాయి. కోల్ కతా నగరం లోపలికి వెళ్ళి తీసినట్టు కూడా వుండదు.     
          
ఇక ఆసక్తి కల్గించే ఒక్క సీనూ, నటుల మధ్య డ్రామాతో హైలైట్ అన్పించే ఒక్క సీను కూడా సృష్టించ లేకపోయారు.  డబ్బు వుంటే ధనవంతులు- కుటుంబముంటే బలవంతులమని మంచి డైలాగు వేశారు. అలాటి డబ్బున్న డాన్ గా గోపీచంద్, కుటుంబ బంధం కోసం తాపత్రయపడే కథనం సృష్టించలేకపోయారు. మరి భావోద్వేగాలు ఎలా పుడతాయి.  ఈ చేతులతో నీ కిష్టమైన వంట వండేదాన్ని, ఒక్క రోజైనా తినడానికి వచ్చావా- అని వదిన అంత మాట అన్నప్పుడు, గోపీచంద్ రియాక్షన్ ఏది?
        
ఇలా పైపైన రాసేసి పైపైన తీసేస్తే సినిమా అవుతుందని యూత్ మాత్రం అనుకోవడం లేదు. యూట్యూబ్ లో పాత కుటుంబ సినిమాల్ని లక్షల మంది యూత్ చూస్తూ, నేటి సినిమాలపై పెడుతున్న కామెంట్లయినా మేకర్లు చూసి పునరాలోచించుకోవాలి.

—సికిందర్
       

Friday, May 5, 2023

1323 : రివ్యూ!

 

రచన -దర్శకత్వం : విజయ్ కనకమేడల
తారాగణం: అల్లరి నరేష్ , మిర్నా మీనన్, ఇంద్రజ, బేబీ ఊహా రెడ్డి, శత్రు, శరత్ తదితరులు  
కథ: టూమ్ వెంకట్, మాటలు : అబ్బూరి రవి, సంగీతం: శ్రీ చరణ్ పాకాల, ఛాయాగ్రహణం : సిద్ధార్థ్ జె
బ్యానర్: షైన్ స్క్రీన్స్
నిర్మాతలు: సాహు గారపాటి, హరీష్ పెద్ది
విడుదల : మే 5, 2023
***

            2021 లో హీరో అల్లరి నరేష్ తో కొత్త దర్శకుడు విజయ్ కనకమేడల అందించిన నాంది విజయం సాధించింది. అది పోలీసు వ్యవస్థకి బలైన సామాన్యుడి కథ.  ఆ తర్వాత 2022 లోఅల్లరి నరేష్ ఇట్లు మారేడుమిల్లి ప్రజానీకం అనే సామాజికంలో నటిస్తే విజయం సాధించలేదు. తిరిగి ఇప్పుడు విజయ్ కనకమేడల దర్శకత్వంలో ఉగ్రం నటించాడు. మరి కామెడీ సినిమాలు మానుకుని, సామాజిక సమస్యలతో కూడిన  వాస్తవిక సినిమాల్లో నటించడం మొదలెట్టిన అల్లరి నరేష్, ఈ మూడో ప్రయత్నంతో ఎలాటి ఫలితాన్ని సాధించాడు? ఇందులో పోషించిన పాత్రేమిటి? విషయమేమిటి?... ఇవి తెలుసుకుందాం.

కథ   

సీఐ శివకుమార్ (అల్లరి నరేష్) కి భార్య అపర్ణ (మిర్నా మీనన్), కూతురు లక్కీ (బేబీ ఊహా రెడ్డి) వుంటారు. సీఐగా అతను డ్యూటీకి కట్టుబడి వుండడంతో భార్యతో సమస్యలు వస్తాయి. ఒక గర్ల్స్ హాస్టల్లో దుష్ట మూక పాల్పడుతున్న అరా చకాల్ని ఎదుర్కోవడంతో, ఆ మూక శివకుమార్ భార్యని అవమానిస్తారు. శివకుమార్ వెళ్ళి ఆ మూకని కాల్చి పారేసి హత్య కేసులో ఇరుక్కుంటాడు. ఇంతలో భార్యా  కూతురూ కనపడకుండా పోతారు. వీళ్ళిద్దరే కాదు, ఇంకా చాలా మంది మిస్సింగ్ కేసులు నమోదవుతాయి. ఈ కిడ్నాపర్స్ ఎవరు? ఎందుకు కిడ్నాప్ చేస్తున్నారు? శివకుమార్ భార్యా కూతురూ కిడ్నాపై ఎక్కడున్నారు? ఇవీ శివ కుమార్ ముందున్న సమస్యలు. ఈ సమస్యల్ని ఎలా పరిష్కరించాడనేది మిగతా కథ.

ఎలావుంది కథ

ఇది సామాజిక కథయితే కాదు, కృత్రిమ పోలీస్ యాక్షన్ కథ. పైగా దీంతో భావోద్వేగాలు కరువైన పరిస్థితి ఏర్పడింది. భావోద్వేగాల  కెమిస్ట్రీ భార్యా కూతుళ్ళతో లేదు, వందల సంఖ్యలో మాయమవుతున్న మనుషులతోనూ లేదు. చెప్తే భార్యా కూతుళ్ళ అదృశ్య కథయినా చెప్పాల్సింది, లేదా మిగతా మనుషుల మిస్సింగ్ కేసుల కథైనా చెప్పాల్సింది. ఫస్టాఫ్ భార్యాకూతుళ్ళ అదృశ్య కథగా నడిపి, సెకండాఫ్ మిస్సింగ్ మనుషుల కథ నడిపే సరికి రెండు కథల్లాగా తయారైంది. ఇక సెకండాఫ్ లో ఎక్కడో ముగింపులో వరకూ భార్యకీ కూతురికీ స్క్రీన్ స్పేస్ దక్కకుండా పోయింది. వాళ్ళు కనిపించక పోవడంతో వెలితి ఏర్పడింది.
        
ఇంతా చేసి ఈ కిడ్నాపులు ఎందుకో చివర్లో రివీల్ చేస్తే తెలిసే విషయం రొటీన్ అరిగిపోయిన మెడికల్ మాఫియా విషయం. దీంతో మొత్తం కథ కృత్రిమంగా తయారయ్యింది. ఇటీవలే సమంతా నటించిన యశోద లో ఒక మెడికల్ మాఫియాని చూశాం, ఇంతలో ఇప్పుడు అల్లరి నరేష్ తో ఇంకో మెడికల్ మాఫియా. రెండిటి ఫలితం డిటో.

నటనలు- సాంకేతికాలు

    అల్లరి నరేష్ పోలీసు పాత్ర వరకూ నటన ఓకే. మరీ ఓవర్ యాక్షన్ చేయకుండా నటించాడు. ముఖ్యంగా యాక్షన్ సీన్స్ కొత్తగా ప్రయత్నించాడు. నిర్మాణ విలువలు కూడా రిచ్ గా వుండడంతో కొన్ని టెక్నికల్ అంశాలు నటనని ఎలివేట్ చేశాయి. అతను చట్టాన్ని  చేతుల్లోకి తీసుకునే ఎమోషనల్ పోలీసు. దీనికి తగ్గ మానసిక సంఘర్షణ మాత్రం కథలో లేక పైపై యాక్షన్ హీరోగా నెట్టుకొచ్చే ప్రయత్నం చేశాడు.
        
హీరోయిన్ మిర్నా మీనన్ ది భార్యగా విచిత్ర పాత్ర. ప్రేమించిన పోలీసుకోసం పెళ్లి పీటల మీద నుంచి లేచి వచ్చేసిన తను భార్యగా సాధింపులు మొదలెట్టడానికి తగిన పరిస్థితి కనిపించదు. పోలీసు భార్యగా జీవితం ఎలా వుంటుందో తెలియకుండానే చేసుకుందా. కథ కోసం ఆమె పాత్రని నెగెటివ్ గా మార్చేశారు. అసలు మొదట ప్రేమ, పెళ్ళీ, సంసారం కూడా పొడిపొడిగా చూపించి వదిలేశారు. కిడ్నాప్ కాబోయే హీరోయిన్ని పాజిటివ్ గా చూపించినప్పుడే ఎమోషనల్ కెమిస్ట్రీతో సానుభూతి ఫీలవగల్గుతాం. కాబిల్ లో సంజయ్ గుప్తా హీరోయిన్ యామీ గుప్తాని ఎంత పాజిటివ్ గా చూపించి తర్వాత సానుభూతిని రాబడతాడు.  మిర్నా గ్లామర్ కి, నటనకీ ఫర్వాలేదు. ఇక కూతురి పాత్రలో బేబీ ఊహా రెడ్డి చైల్డ్ సెంటి మెంటు సీన్లు ఏ పాత సినిమాల్లోంచి ఎత్తుకొచ్చారో తెలీదు. ఈ కాలపు పిల్లలు మాత్రం ఇలా వుండరు.
        
డాక్టర్ గా ఇంద్రజ నటించింది. ఫర్వాలేదు. ఈ కథలో విలన్ అనేవాడు మెడికల్ మాఫియాగా చివర్లో తప్ప కనపడడు. కాబట్టి అతడి గురించి అనవసరం. పైన చెప్పుకున్నట్టు నిర్మాణ విలువలు రిచ్ గా వున్నాయి. ముఖ్యంగా బ్రహ్మ కడలి కళా దర్శకత్వం, కలర్స్ వాడిన విధానం, సెట్స్, లొకేషన్స్ అన్నీ టెక్నికల్ గా ఒక హోదాని సమకూర్చి పెట్టాయి. సిద్ధార్థ్ జాదవ్ ఛాయాగ్రహణం టాప్ క్లాస్. ఛోటా కే ప్రసాద్ ఎడిటింగ్ కూడా. శ్రీచరణ్ పాకాల పాటలేం కుదరకపోయినా, నేపథ్యసంగీతం ఫర్వాలేదు.
        
దీనికి టూమ్ వెంకట్ కథ అందిస్తే, అబ్బూరి రవి రాసిన మాటలు కొన్ని చోట్ల ఆలోచింపజేస్తాయి. అయితే ఈ సినిమాలో యాక్షన్ ఎక్కువ వుండడంతో మాటల వాడకం తగ్గింది. ఇక విజయ్ కనకమేడల దర్శకత్వం నాంది కంటే ఉన్నతంగా వుంది. విషయం మాత్రం అంతగా లేదు.

చివరికేమిటి

ఈసారి నరేష్ తను నటిస్తున్న సామాజికం చాలనట్టు కుటుంబాన్నీ భుజానేసుకున్నాడు. ఈ రెండు పడవల ప్రయాణంలో ఎటు వైపూ ఎమోషన్లు సాధ్యంగాక చేరాల్సిన తీరానికి చేరలేదు. సెకండాఫ్ లో అదృశ్యమైన కుటుంబాన్ని పక్కనపెట్టి సామాజికాన్ని(సమాజంలో మిస్సింగ్ కేసులు) ఎత్తుకోవడంతో ఏకసూత్రత దెబ్బతిని ఎసరు వచ్చింది. స్క్రీన్ ప్లేకి ఒక స్ట్రక్చర్ లేదు, హీరోకి ఒక గోల్ లేదు, కథకి విలన్ లేడు. ఇంతకంటే ఏం కావాలి సినిమా అనారోగ్యానికి.
        
ఫస్టాఫ్ ఎత్తుకున్న కుటుంబ అదృశ్య కథని వదిలేసి, సెకండాఫ్ సామాజికాన్ని ఎత్తుకోవడంతో సినిమా సెకండాఫ్ సిండ్రోమ్ అనే సుడి గుండంలో కూడా పడింది. తను దుష్ట మూకని కాల్చి చంపడంతో నాల్గు హత్య కేసులు నమోదై, మానసికారోగ్య కారణాలతో కోర్టు హౌస్ అరెస్టులో వుంచమన్నప్పుడు- హౌస్ అరెస్టులో వుండిపోయి, కుటుంబాన్నే మర్చిపోతాడు. ఇతర మిస్సింగ్ కేసులు పట్టించుకుంటాడు. అతను ప్రశ్నించి వుంటే ఈ రెండు కథలూ ఒక కథగా అయ్యేవి.
        
ఎలాగూ హౌస్ అరెస్టులోంచి పారిపోయినప్పుడు- నేను దుష్ట మూకని ఎందుకు చంపాల్సి వచ్చిందో తెలుసుకోకుండా మర్డర్ కేసులు పెడితే- నేను నా కుటుంబం ఎక్కడుందో వెతుక్కోవడానికే పారిపోతా. మిగతా మిస్సింగ్ కేసుల గొడవ నాకెందుకు- అది మీ డిపార్ట్ మెంట్ గొడవ అని పూర్తిగా అతను కుటుంబం కోసం సంఘర్షించి వుంటే ఎమోషనల్ కెమిస్ట్రీ వుండేది. చివర్లో ఎక్కడో సామాజిక బాధ్యత కూడా గుర్తుచేసుకుని, ఇతర బాధితులకి  విముక్తి కలిగించి వుంటే, సినిమా అంతా ఒకే కుటుంబ పర భావోద్వేగాలతో, ఒకే కథలా వుండేది.

—సికిందర్