రివ్యూలు, సాంకేతికాలు, స్క్రీన్ ప్లే సంగతులు...

టికెట్లు దొరకడం యోగం, సినిమాలు చూడడం భోగం, రివ్యూలు రాయడం రోగం!

Saturday, December 10, 2022

1261 : రివ్యూ!

రచన- దర్శకత్వం : హర్ష పులిపాక
తారాగణం : బ్రహ్మానందం, కలర్స్ స్వాతి, శివాత్మికా రాజశేఖర్, దివ్యా శ్రీపాద, సముద్ర కని, నరేష్ అగస్త్య, రాహుల్ విజయ్, వికాస్, ఉత్తేజ్, ఆదర్శ్ బాలకృష్ణన్ తదితరులు
సంగీతం : ప్రశాంత్ విహారి, ఛాయాగ్రహణం : రాజ్ కె నల్లీ
బ్యానర్స్ : టికెట్ ఫ్యాక్టరీ, ఎస్ ఒరిజినల్స్
నిర్మాతలు : అఖిలేష్ వర్ధన్, సృజన్
విడుదల ; డిసెంబర్ 9, 2022
***

        హాస్య బ్రహ్మ బ్రహ్మానందం చాలా కాలం తర్వాత వెండి తెర మీద కనిపిస్తూ ప్రయోగాత్మక సినిమా నటించారు. హాస్య పాత్ర కాకుండా, కథలు చెప్పే ఉదాత్త పాత్ర నటిస్తూ వెరైటీ నందించారు. చాలా కాలం తర్వాత కలర్స్ స్వాతి కూడా తెరపైకొచ్చింది. కొత్త దర్శకుడు హర్ష పులిపాక విషయం లేని రొటీన్ మూస తీసి తనూ ఓ దర్శకుడయ్యాడన్పించుకోకుండా, ఏదో కొత్తగా చెప్పాలన్న తపనతో తన వంతు ప్రయత్నం చేశాడు. నాల్గయిదు చిన్న కథల ఆంథాలజీలు కొత్తగాకున్నా, ఓ నాల్గు జీవితాల్ని వాస్తవిక దృక్పథంతో చిత్రించేందుకు ముందుకొచ్చాడు. ఆంథాలజీలు బాక్సాఫీసు దగ్గర వర్కౌట్ కావని గత ఉదాహరణలున్నా, ఓటీటీ కాకుండా థియేటర్ విడుదలకే పూనుకోవడం సాహసమే అనాలి. ఈ సాహసం ఎంతవరకు వర్కౌట్ అయిందీ చూద్దాం...

కథ  


        వేదవ్యాస్ (బ్రహ్మనందం) ఆలిండియా రేడియోలో రిటైరై, కూతురు రోషిణి (కలర్స్ స్వాతి) తో వుంటాడు. ఖాళీగా వుండలేక కథలు రాయాలనుకుంటాడు. కథకుడుగా వూళ్ళో జరిగే స్టాండప్ స్టోరీ టెల్లింగ్ పోటీల్లో పాల్గొనాలనుకుంటాడు. నువ్వు కథలు రాయడమేమిటని, ఈ వయసులో యువ కథా రచయితలతో పోటీ పడలేవనీ రోషిణి నిరుత్సాహ పర్చినా, కాదని తన అరవై ఏళ్ళ జీవితానుభవాన్నీ రంగరించి కథలు చెప్పడానికి పోటీల కెళ్తాడు. అక్కడ ఏఏ కథలు చెప్పాడు, వాటికి ఎలాటి స్పందన లభించిందీ, పోటీల్లో గెలిచాడా లేదా అన్నది మిగతా కథ.

ఎలావుంది కథ

    పైన చెప్పుకున్నట్టు ఇది ఆంథాలజీ జానర్ కి చెందిన కథ. నాల్గయిదు కథానికల్ని కలిపి ప్రధాన కథతో ఏకీకృతం చేసే హైపర్ లింక్ ప్రక్రియ. ప్రధాన కథ వేదవ్యాస్ ది. పోటీల్లో అతను కథలు చెప్పి విజేత అవడం గురించి. కెరీర్ ని ఇరవైలలోనే కాదు, అరవైలలో కూడా ప్రారంభించ వచ్చని చెప్పే ప్రధాన కథ. ఈ ప్రధాన కథ కింద పంచేంద్రియాల కాన్సెప్ట్ తో పంచతంత్రం టైటిల్ తో ఐదు కథానికలు చెప్తాడు. చూపుకి, రుచికి, వాసనకి, స్పర్శకి, వినికిడికీ సంబంధించిన కథానికలు.

        1. చూపు : విహారి (నరేష్ అగస్త్య) హైదరాబాద్ లో ఒక సాఫ్ట్ వేర్ ఉద్యోగి. పని ఒత్తిడితో విశ్రాంతి లేక కోపంతో రియాక్ట్ అవుతూంటాడు. ఉద్యోగం తప్ప వేరే జీవితం లేకపోవడంతో మానసిక కుంగుబాటుతో వుంటాడు. ఒక రోజు కొలీగ్స్ బీచి గురించి మాట్లాడుకుంటే ఆసక్తితో బీచి గురించి వాళ్ళనీ వీళ్ళనీ అడిగి తెలుసుకుని ఆనందిస్తాడు. తను కూడా బీచి చూడాలనుకుంటాడు. కొలీగ్స్ తో వైజాగ్ వెళ్ళేందుకు ప్లాన్ చేస్తాడు. తీరా వైజాగ్ వెళ్ళి చూస్తే తన వూహల్లోని బీచి కనిపించదు. కొలీగ్ ఆ రద్దీ ప్రాంతం నుంచి ఏకాంత ప్రదేశంలోకి తీసి కెళ్ళి చూపిస్తుంది. అక్కడ సముద్రం, ఇసుక, అలలూ చూసి ఆనంద భరితుడవు తాడు. బీచి చూడాలన్న కోరికంతా తీర్చుకుంటాడు.

          ఈ కథానికలో దర్శకుడు ఏం చెప్పాలనుకున్నాడో అర్ధం గాదు. ఇంట్లో తిని కూర్చునే వాళ్ళకి కూడా బీచి చూడాలని వుంటుంది. కానీ ఈ కథానికలో హీరో కేటగిరీ ఇది కాదుగా? ఉద్యోగ వొత్తిడి వల్ల  ఉపశమనాన్ని కోరుకోవడంలోంచి బీచిని చూడాలన్న కోరిక పుట్టింది. ఆ కోరిక తీర్చుకుని, రెట్టించిన స్థాయిలో రిలీఫ్ పొంది, వచ్చి ఆఫీసులో ప్రొడక్టివిటీ పెంచేసి, ఆటాపాటాగా పని దంచేస్తూంటే కథానికకి అర్ధం వచ్చేది.

 2. రుచి :

        సుభాష్ (రాహుల్ విజయ్), లేఖ (శివాత్మికా రాజశేఖర్) లకి పెళ్ళి చూపులేర్పా
టవుతాయి.  
దీనికి ముందు పెళ్ళి చూపుల్లో, మీరెందుకు పెళ్ళి చేసుకోవాలనుకుంటున్నారు అని అడిగితే, ఏ అమ్మాయీ సరీగ్గా చెప్పలేదు. ఒకమ్మాయి సిగ్గుతో వంకర్లు పోవడం, ఇంకో అమ్మాయి ఇంకేదో చెప్పడం చేస్తారు. ఇక విసిగిపోయి, ముందు తనేంటో తనకి తెలియాలి. వీళ్ళు అమ్మాయిలు, నాకు వుమన్ కావాలి అని తల్లితో అనేస్తాడు. ఇప్పుడు లేఖతో పెళ్ళి చూపులయ్యాక బయట కలుసుకుంటారు. తను మెంటల్ గా, ఫైనాన్షియల్ గా రెడీగా వున్నానని చెప్తుంది లేఖ. పెళ్ళంటే అభిరుచులు కలవడమని అంటుంది. ఈ ఒక్క మీటింగ్ తో అభిరుచులేం తెలుస్తాయని అంటాడు. క్రికెట్ మ్యాచ్ గెలుస్తామని తెలిసి ఆడతామా, పెళ్ళి కూడా మ్యాచే, ఆడుతూంటే తెలుస్తూంటుంది. అడ్జస్ట్ మెంట్లు వుంటాయ్ అంటుంది. మనమేంటో మనకి తెలిస్తే మనకేది కావాలో తెలుస్తుందని అంటుంది. అతను అంగీకరిస్తాడు.

        ఈ కథానికలో అభిప్రాయాలు బాగానే వున్నాయి గానీ, మాటలు ఎన్నయినా చెప్పుకోవచ్చు. వాటిని ప్రేక్షకులు నమ్మరుగాక నమ్మరు. విజువల్ ఎగ్జాంపుల్ కావాలి. ఏదైనా సంఘటన జరిగి ఆ సంఘటనలో పరస్పరం వ్యక్తిత్వాలేంటో బయటపడితే ఆ సాక్ష్యం కన్విన్సింగ్ గా వుంటుంది. సంఘటన లేకుండా కథ వుండదు. కథంటే సంఘటనే. పాత్రల వ్యక్తిత్వాలు బయట పడే సంఘటన. ఇక ఈ కథానిక రుచి గురించి అయినప్పుడు, ఐస్ క్రీములు రుచి చూడడం గాక, బాదం పాలు తాగి మైమరిచి పోవడం గాక, వ్యక్తిత్వాల్ని ఆస్వాదించే అంశాలతో కథనం వుంటే కరెక్టుగా వుంటుంది.

        3. వాసన :  రామనాథం (సముద్ర కని) రిటైర్డ్ బ్యాంకు మేనేజర్. భార్య వుంటుంది. భర్త దగ్గర కూతురు డెలివరీ కుంటుంది. ఉన్నట్టుండి రామనాధానికి ఏదో దుర్వాసన వేస్తూ వుంటుంది. ఎలుక చచ్చిన వాసన. ఇల్లంతా గాలిస్తాడు, కడుగుతాడు, శుభ్రం చేస్తాడు. వేలు తెగి రక్తం కారుతూంటే అప్పుడు వాసన రక్తంలోంచి వస్తోందని గ్రహిస్తాడు. భార్యకి ఆ రక్తంలో కూడా ఏ వాసనా వేయదు. అల్లుడు వచ్చి, సైకియాట్రిస్టుకి చూపిస్తాడు. సైకియాట్రిస్టు రామనాధం నుంచి విషయాలు రాబడతాడు. ఈ సమస్యకి మూలం రామనాథం పుట్టుకలోనే వుందని గ్రహిస్తాడు. ఏమిటా మూలం? దానికీ ఇప్పుడు కూతురి డెలివరికీ వున్న సంబంధమేమిటి? సమస్యకి పరిష్కారం కూతురి డెలివరీ మీద ఆదారపడి వుండడమేమిటి? ఇవి తెలుసుకోవాలంటే మిగతా కథానిక చూడాలి.

        ఈ కథానిక విషయబలంతో కూర్చోబెడుతుంది. ప్రతీ క్షణం వాసన గురించిన సస్పెన్స్ వుండడంతో ఈ సస్పెన్సే చివరంటా తీసికెళ్తుంది. మొదటి రెండు కథానికలకంటే ఇది డెప్త్, డ్రామా, జీవం వున్న కథానిక. దీని రచన, నిర్వహణ ఉత్తమ తరగతికి చెందుతాయని చెప్పొచ్చు.

4. స్పర్శ :
   శీను (వికాస్), లక్ష్మి (దివ్యా శ్రీపాద) లది కింది మధ్యతరగతికి చెందిన కుటుంబం. నెలలు నిండిన లక్ష్మికి రక్తస్రావం జరగడంతో తీసుకుని హాస్పిటల్ కి పరిగెడతాడు. అక్కడ చాలా ట్రాజడీ బయటపడుతుంది (గుర్తుందా శీతాకాలం లో తమన్నా పాత్రకి లాగా)లక్ష్మికి ప్రాణ గండం పొంచి వుంటుంది. లక్షల రూపాయలు హాస్పిటల్ ఖర్చులకి కావాలి. శీనుకి దిక్కు తోచదు. ఇంతలో తల్లిదండ్రులొచ్చి సూటిపోటి మాటలంటారు. లక్ష్మి తల్లి వచ్చి ఎదురు తిరుగుతుంది. ఇక ఇచ్చుకున్న కట్నాల గురించీ, పుచ్చుకున్న కానుకల గురించీ అరుచుకుని, ఆస్పత్రి ఖర్చుల గురించి కీచులాడుకునీ వెళ్ళిపోతారు. శీను లక్ష్మిని తీసుకుని యింటి కొచ్చేస్తాడు. ఇక ఇద్దరికీ ఒకటే మిగులుతుంది - కడుపులో బిడ్డ కదిలితే ఆ స్పర్శకి ఆనందించడం, స్పర్శ లేకపోతే భయపడడం. ఈ క్షణ క్షణ గండంతో బాటు లక్ష్మి ప్రాణగండం ఎలా తీరాయి, తీరాయా లేదా అనేది మిగతా కథానిక.

ఇది కూడా సస్పెన్సుతో కూర్చోబెడుతుంది. ఈ సస్పెన్సుతో ఇద్దరికీ తమ వాళ్ళ స్వార్ధాలతో సంఘర్షణ తోడవుతుంది. డబ్బే ప్రధానమైన బంధుత్వాలు  నిస్సిగ్గుగా వీధిన పడతాయి. పైగా వాళ్ళిద్దర్నీ విడదీయాలని కూడా ప్రయత్నిస్తారు. కష్టం వచ్చినప్పుడు తెంచుకోవడం కాదు, పంచుకోవాలని చెప్పే ఈ కథానిక కూడా వాస్తవిక జీవితాలతో ఉత్తమమైనదే. ఇందులో ఒక చోట శీను మిత్రుడికి చెప్పుకుంటూంటే మిత్రుడు శీను జేబులో డబ్బులు పెట్టే లాంగ్ షాట్ లో మాంటేజ్ కదిలించేలా వుంటుంది.

        5. వినికిడి : ఇందులో లియా(కలర్స్ స్వాతి) ఒక పాడ్ కాస్టర్. పాడ్ కాస్టింగ్ తో ఆమె ప్రసారం చేసే కథలు పిల్లల్ని ఆకట్టుకుంటాయి. ఈ ప్రోగ్రాం అభిమాని రూపా అని బాలిక వుంటుంది. ఈమె బర్త్ డేకి ప్రోగ్రాంలో గ్రీటింగ్స్ చెప్పించాలని తండ్రి కిషన్ (ఉత్తేజ్) వూర్నుంచి బయల్దేరి హైదరాబాద్ వస్తాడు. అయితే కథల ప్రసారం ఆపి, వేరే ప్రోగ్రాం ప్రారంభించే పని మీద వుంటుంది లియా. కిషన్ వచ్చి విషయం చెప్పడంతో, లియాకి రూపా పట్ల ఆసక్తి పెరుగుతుంది. రూపాని కలిసేందుకు బయల్దేరి వెళ్తుంది. ఇప్పుడు తన బర్త్ డేకి వచ్చిన లియాని చూసి రూపా ఎలా ఫీలయ్యిందీ, రూపాని చూసి లియా ఎందుకు షాకయ్యిందీ తెలుసుకోవాలంటే మిగతా ఈ కదిలించే కథానిక చూడాలి.

ఈ కథానిక కూడా బలమైనదే. చివరికి పెల్లుబికే భావోద్వేగాలతో బలమైనది. మనుషుల్ని కలిపేది. తెలియకుండా సస్పెన్స్ వుంటూ, చివర్లో వెల్లడై షాకిచ్చేది.

      ఈ అయిదు కథానికల్లో సస్పెన్సుతో వున్న చివరి మూడు కథానికలే కట్టి పడేస్తాయి. కథానికలకి సంఘటనలు, సస్పెన్సు ఎంత ముఖ్యమో తెలియజేస్తాయి. మొదటి రెండు కథానికలు సంఘటనలూ సస్పెన్సూ  లేక విఫలమయ్యాయి.

ఇక ప్రధాన కథ చూస్తే, పోటీల్లో కథలు చెప్పిన వేదవ్యాస్ విజేతే అవుతాడు. అయితే కూతురు రోషిణి తో అతడికున్న సంబంధమే సరిగా లేదు. వ్యతిరేకించే పాత్ర వుంటే ప్రధాన పాత్ర గొప్ప తెలుస్తుందని రోషిణి క్యారక్టర్ వుండడం మంచిదే. అయితే ఆమె వ్యతిరేకించే కారణం వేరే వుండాలి. ఆలిండియా రేడియోలో అన్నేళ్ళు ఉద్యోగం చేసిన తండ్రికి సాహిత్యంతో  సంబంధం వుండదా? కథలు రాయలేడా? తండ్రియేదో సగటు మనిషి అయినట్టు- నువ్వు రైటర్ అవడమేమిటని చిన్నబుచ్చుతూ వుండాల్సిన అవసరం లేదు.

నటనలు –సాంకేతికాలు

ఇందులో నటీనటులందరూ పాత్రలకి తగ్గ అభినయాలు చేశారు. బ్రహ్మానందం పాత్ర అంతంత మాత్రమే. ఆడిటోరియంలో ఒక్కో కథ ప్రారంభిస్తూ చెప్పే రెండు మాటల వరకే ఆయన కనిపించేది. ఇలా కామెడీ చేయకుండా హూందాతనంతో నటించడం బావుంది. నిజానికి ఓ కథానిక తనతో వుంటే బావుండేది. బ్రహ్మానందం చెప్పే చివరి కథానికలో లియా పాత్రలో తననే వూహించుకుంటుంది కలర్స్ స్వాతి రోషిణి పాత్ర. లియా పాత్రని క్లాస్ గా నటించింది.

        తర్వాత సముద్ర కని వాసన సైకాలజికల్ పాత్ర నటన పాత్రలోకి లీనమైపోయి వుంటుంది. పాత్రలో అంతగా లీనమై కనిపించేది శివాత్మిక కూడా. ఎక్స్ ప్రెషన్స్ ని బాగా ప్లే చేసింది. దివ్యా శ్రీపాద, నరేష్ అగస్త్య, రాహుల్ విజయ్, వికాస్, ఉత్తేజ్ అందరూ పాత్రల్లా కన్పించే ప్రయత్నం చేశారు. దర్శకత్వం, దర్శకుడు రాసిన మాటలు నస పెట్టకుండా వున్నాయి. ఇలాటి కథానికలు కోరుకునే కళాత్మకత కి గుర్తుండే షాట్స్ కూడా తోడైతే  బావుంటుంది. ఇమేజెస్ అన్నవి విజువల్ మీడియాని ఉన్నతీకరిస్తాయి. ఇక ప్రశాంత్ విహారి సంగీతంలో బ్యాక్ గ్రౌండ్ లో వచ్చే పాటలున్నాయి. రాజ్ కె నల్లీ కెమెరా వర్క్ బడ్జెట్ కి తగ్గట్టు రిచ్ గానే వుంది.

చివరికేమిటి
          ఆంథాలజీలు వెండి తెర మీద సక్సెస్ కావడం ఎప్పుడూ జరగలేదు- ఒకటీ రెండు తప్ప.  చందమామ కథలు, మనమంతా, ఆవ్, గమనం వర్కౌట్ కాలేదు. వేదం, కేరాఫ్ కంచర పాలెం మాత్రం సంచలనం సృష్టించ గలిగాయి. పిట్ట కథలు ఓటీటీలోనే విడుదలైంది. పంచతంత్రం కూడా ఓటీటీ మూవీయే గానీ థియేటర్ సినిమా కాదు.  ఇందులో సగటు ప్రేక్షకులు కోరుకునే అంశాలేవీ లేవు. యూత్ కి అసలే పడదు. మొదటి రెండు కథలు యూత్ కథలే అయినా వాటిని అంత ట్రెండీగా తీయలేదు. మిగిలిన మూడు కథలు బరువైనవి. అయితే కొత్త దర్శకుడు ఇవన్నీ పక్కన బెట్టి కళాపోషణ చేస్తూ తాననుకున్నది తీయడమే గొప్పనుకోవాలి.

—సికిందర్

Wednesday, December 7, 2022

1260 : రివ్యూ!


దర్శకత్వం : అమర్ కౌషిక్
తారాగణం : వరుణ్ ధావన్, కృతీ సానన్, దీపక్ దోబ్రియాల్, పాలిన్ కబాక్, అభిషేక్ బెనర్జీ తదితరులు.
రచన : నీరేన్ భట్, సంగీతం: సచిన్ - జిగర్, ఛాయాగ్రహణం : జిష్ణూ భట్టాచార్య
నిర్మాణం : జియో స్టూడియోస్, దినేష్ విజన్ ,
పంపిణీ : అల్లు అరవింద్ (గీతా ఫిల్మ్ డిస్ట్రిబ్యూషన్)
విడుదల : నవంబర్ 25, 2022

***
            ప్రసిద్ధ బాలీవుడ్ దర్శకుడు డేవిడ్ ధావన్ కుమారుడు వరుణ్ ధావన్ కమర్షియల్ యాక్షన్ సినిమాలతో యువతరంలో క్రేజ్ సంపాదించుకున్నాడు. అందులో హిట్లున్నాయి, ఎక్కువగా ఫ్లాప్స్ వున్నాయి. ఈ సంవత్సరమే నటించిన జుగ్ జుగ్ జియో కుటుంబ వినోదం హిట్టయ్యింది. దీని తర్వాత ఇప్పుడు రూటు మార్చి ఫాంటసీ థ్రిల్లర్ భేడియా లో నటించాడు. ఇది పానిండియా మార్కెట్ లో విడుదలైంది. తెలుగులో తోడేలు గా డబ్ చేసి విడుదల చేశారు ప్రముఖ నిర్మాత అల్లు అరవింద్. స్త్రీ’, ‘బాలా అనే రెండు విభిన్న సినిమాలు తీసి హిట్లు సాధించిన అమర్ కౌషిక్ దీని దర్శకుడు. ఇప్పుడు ఈ మూడో సినిమా కూడా విభిన్నమే. ఇందులో వరుణ్ సరసన హీరోయిన్ గా కృతీ సానన్ నటించింది. ఏమిటీ తోడేలు ఫాంటసీ? హార్రర్ కామెడీగా తీసిన ఈ థ్రిల్లర్ ఏ మేరకు మెప్పిస్తుంది? ఇవి తెలుసుకుందాం...

కథ

ఢిల్లీలో వుండే భాస్కర్ అలియాస్ భాస్కీ (వరుణ్ ధావన్), బగ్గా (సౌరభ్ శుక్లా) అనే కాంట్రాక్టర్ దగ్గర పని చేస్తూంటాడు. అరుణాచల్ ప్రదేశ్‌లోని జీరో అనే అటవీ ప్రాంతంలో రోడ్డు వేసే పని మీద భాస్కీ కజిన్ జనార్థన్ (అభిషేక్ బెనర్జీ) తో కలిసి జీరోకి చేరుకుంటాడు. స్థానికుడైన జోమిన్ (పాలిన్ కబాక్) అక్కడ కలుస్తాడు. ఈ ముగ్గురితో పాండా (దీపక్ డోబ్రియాల్) కలుస్తాడు. అయితే గిరిజనులు తమ భూమిని వదులుకోవడానికి, చెట్లని నరికి వేయడానికీ ఒప్పుకోక పోవడంతో భాస్కీ కేం చేయాలో తోచదు. ఎలాగైనా రోడ్డు వేయాలన్న పట్టుదలతో వుంటాడు. గిరిజనులతో కొట్లాటకి దిగుతాడు. ఇంతలో అడవిలో తోడేలు అతడి మీద దాడి చేసి కరుస్తుంది. జనార్దన్, జోమిన్ కలిసి అతడ్ని పశువైద్యురాలు అనికా (కృతీ సానన్) దగ్గరికి తీసికెళ్తారు. ఆమె వైద్యంతో నయం కాదు. విషమించి భాస్కీ తోడేలుగా మారిపోతాడు. రాత్రి పూట తోడేలుగా మారుతాడు, పగటి పూట మనిషిలా వుంటాడు.

        ఏమిటీ పరిస్థితి? అడవి జోలికొచ్చినందుకు తోడేలు పగబట్టి ఇలా చేసిందా? అసలు కరిచింది నిజంగా తోడేలేనా? ఇప్పుడేం చేయాలి? తిరిగి మామూలు మనిషిగా ఎలా మారాలి? ఇదీ మిగతా కథ.

ఎలా వుంది కథ

హాలీవుడ్ లో వేర్వుల్ఫ్ సినిమాలని రెగ్యులర్ గా వస్తుంటాయి. మనిషి తోడేలుగా మారే ఈ సినిమాలు హార్రర్ సబ్ జానర్ లోకి వస్తాయి. ఈ కథలు గ్రీకు పురాణాల్లోంచి వచ్చాయి. ఆ పురాణాల ప్రకారం, లైకాన్ అనే వ్యక్తి ఆకాశానికి దేవుడైన జ్యూస్‌ కి మానవ మాంసంతో చేసిన భోజనాన్ని అందించినప్పుడు జ్యూస్‌ ఆగ్రహానికి గురయ్యాడు. దానికి శిక్షగా, కోపోద్రిక్తుడైన జ్యూస్ లైకాన్‌ ని తోడేలుగా మార్చేశాడు. అలా తోడేలు మనిషిగా లైకాన్ నరకాన్ని అనుభవించాడు. ఇలా యూరోపియన్ జానపద కథల్లో రాత్రిపూట తోడేలుగా మారి జంతువుల్ని, మనుషుల్నీ, శవాల్నీ మింగేసి, పగటిపూట మానవ రూపంలోకి తిరిగి వచ్చే మనిషికి వేర్వుల్ఫ్ అని పేరు పెట్టి కథల్ని సృష్టించారు. ఈ గ్రీకు నేపథ్యంలోంచి లోంచి వచ్చిందే తోడేలు కథ.

        ఈ హార్రర్ కథని కామెడీగా చూపించాడు దర్శకుడు. ఈ హార్రర్ కామెడీకి పర్యా వరణ సమస్య సందేశం జోడించాడు. ఈ మధ్య ఆవాస వ్యూహం అని మలయాళంలో వచ్చింది పర్యావరణ సమస్యతో. అందులో కప్ప మనిషిని చూపించారు. పర్యావరణానికి హాని చేస్తే ప్రకృతి పగదీర్చుకుంటుందనే కథ తోడేలు లో కూడా వుంది.

        అయితే పర్యావరణ సమస్యకి తోడేలు రియాక్ట్ అవడంతో ఇది సీరియస్ గా తీసుకోవాల్సిన విషయమవుతుంది. దీన్ని కామెడీ చేయడంతో సీరియస్ నెస్ పోయి విషయం దెబ్బతింది. తోడేలుగా మారిన హీరో మనుషుల మీద కామెడీగా దాడులు చేయడం, మనుషులూ కామెడీగా చావడం విషయాన్ని పక్కదోవ పట్టించేదిగా, కేవలం హార్రర్ కామెడీని ఎంజాయ్ చేయాలన్నట్టుగా తయారైంది. తోడేలుతో హార్రర్ కామెడీయే చేయాల్సి వుంటే మధ్యలో పర్యావరణ సమస్యని లాగాల్సిన అవసరం లేదు. గిరిజనుల సమస్య కామెడీ కాదు.

        ఫస్టాఫ్ ఏదోలే కామెడీ చేశాడని సరిపెట్టుకున్నా సెకండాఫ్ లోనూ అదే వరస. క్లయిమాక్స్ ఒకటే ఆసక్తిని పెంచుతుంది. కథలో చాలా అవసరమైన ఎమోషన్సే లేవు. ఎమోషన్స్, స్ట్రగుల్, బాధ, ఆక్రోశం వుంటే తోడేలు రూపంలోంచి బయటపడాలనుకునే హీరోతోనే వున్నాయి. ఇది కూడా వర్కౌట్ కాలేదు. ఎందుకంటే, తోడేలుగా మనుషుల్ని కామెడీగా తింటూ ఎంజాయ్ చేస్తున్నాడుగా- ఇంకేంటి బాధ?

నటనలు- సాంకేతికాలు

వరుణ్ ధావన్ హృదయాన్ని, ఆత్మనీ విప్పి పాత్రలో పోశాడని చెప్ప వచ్చు. మనిషిగా మామూలుగా వున్నప్పుడు, పదేపదే తోడేలుగా మారుతున్నప్పుడూ. తోడేలుగా మారేక అన్నీ కామెడీలే. కానీ తోడేలుగా మారేప్పుడు శరీరంలో జరిగే మార్పులకి అనుభవించే నరకాన్ని ఉద్విగ్నంగా ప్రదర్శించాడు. ఇంతవరకు తన గురించి చెప్పుకోవచ్చు. సినిమాలో ఏవైనా ఊపిరిబిగబట్టి చూసే సన్నివేశాలుంటే ఇవే.

        పశువుల డాక్టర్ గా కృతీసానన్ ది మామూలు పాత్ర. హీరోని ప్రేమించడం, వాదన పెట్టుకోవడం మామూలే. అయితే ఈ పాత్రకో ఫ్లాష్ బ్యాక్ వుంటుంది. దీంతో అసలు తోడేలుకథకి మూలాలు 1941 వేర్వుల్ఫ్ మూవీ ది వేర్వుల్ఫ్ మాన్లో వున్నాయని తెలిసిపోతుంది. ఇలా మామూలుగా కన్పించే కృతీసానన్ పాత్రతో అనూహ్యంగా ట్విస్టు రావడం క్లయిమాక్స్ కి బలాన్నిచ్చే ఎలిమెంట్.  ఇక హీరో ఫ్రెండ్ గా అభిషేక్ బెనర్జీ మంచి కమెడియన్. ఇతర నటులు సౌరభ్ శుక్లా సహా ఫర్వాలేదనిపించుకుంటారు –ఆ పాత్రల్లో అంతే నటించగలరు.

        సచిన్-జిగర్ ల  సంగీతం యావరేజ్‌గా వుంది. జిష్ణూ ట్టాచార్జీ ఛాయాగ్రహణం మాత్రం అద్భుతంగా వుంది. మునుపెన్నడూ చూడని లొకేషన్స్ ని అరుణాచల్ అందాలతో చూపెట్టాడు. ప్రొడక్షన్ డిజైన్ కూడా రిచ్ గా వుంది. సౌండ్ డిజైన్ బావుంది. కాస్ట్యూమ్స్ ఆకర్షణీయంగా వున్నా వాస్తవికంగా వున్నాయి.

        ప్రధానంగా చెప్పుకోవాల్సింది ప్రపంచ ప్రమాణాలకి ఏమాత్రం తీసిపోని గ్రాఫిక్స్. హీరో తోడేలుగా మార్పు చెందేటప్పటి దృశ్యాల గ్రాఫిక్స్ బలంగా వున్నాయి. సాంకేతికంగా రాజీ పడని ధోరణి కన్పిస్తోంది గానీ, విషయపరంగానే రంజింప జేసే ధోరణి కనిపించడం లేదు.
—సికిందర్

Tuesday, December 6, 2022

1259 : రివ్యూ!

రచన - దర్శకత్వం : చెల్లా అయ్యావు
తారాగణం : విష్ణు విశాల్, ఐశ్వర్యా లక్ష్మి, కరుణాస్, శ్రీజా రవి, మునిష్కాంత్ తదితరులు సంగీతం : జస్టిన్ ప్రభాకరన్, ఛాయాగ్రహణం : రిచర్డ్ ఎం. నాథన్
బ్యానర్స్ : ఆర్ టి టీమ్ వర్క్స్, వివి స్టూడియోస్
నిర్మాతలు : రవితేజ, విష్ణు విశాల్, శుభ్ర, ఆర్యన్ రమేష్
విడుదల : డిసెంబర్ 2, 2022
***

        విష్ణు విశాల్- ఐశ్వర్య లక్ష్మీలతో  తమిళంలో గట్ట కుస్తీ’, తెలుగులో మట్టి కుస్తీగా రవితేజ సహ నిర్మాతగా వుంటూ అందించిన ఈ ఎంటర్టయినర్ కి దర్శకుడు చెల్లా అయ్యావు అనే తమిళుడు. దీనికి మునుపు విష్ణు విశాల్ తో ఒక మూవీ చేశాడు. అది హిట్టయ్యింది. ఈ రెండో మూవీని స్పోర్ట్స్ మూవీ అన్పించేట్టు తీశాడు గానీ స్పోర్ట్స్ మూవీ కాదు. మరి మట్టి కుస్తీ అని టైటిల్ ఎందుకు పెట్టాడు? దీని వెనుక వేరే అర్ధం ఏమైనా వుందా? దీంతో విజయం సాధించాడా? ఇవి తెలుసుకుందాం...

కథ

చిన్నతనంలోనే తల్లిదండ్రుల్ని కోల్పోయిన వీర (విష్ణు విశాల్) కి ఆ వూరి పంచాయితీ ప్రెసిడెంట్‌గా వున్న మేనమామ (కరుణాస్), మగవాళ్ళ కంటే ఆడవాళ్ళు తక్కువనీ, ఎప్పుడూ ఆడవాళ్ళకి లొంగకుండా వుండాలనీ వీరకి తన పైత్యం నూరిపోస్తాడు. ఎనిమిదో తరగతి చదివిన వీర తాతలు సంపాదించిన ఆస్తిని అనుభవిస్తూ, చిన్న చిన్న పంచాయితీలు తీరుస్తూ, కబడ్డీ ఆడుతూ కాలం గడుపుతూంటాడు. మేన మామ నూరి పోసిన దాని ప్రకారం తనని పెళ్ళి చేసుకునే అమ్మాయి  తనకంటే ఎక్కువ చదువుకోకూడదనీ, బారెడు జడ కూడా వుండాలనీ కోరికలు చెబుతూంటాడు. ఎక్కువ చదువుకున్న అమ్మాయిలతో సంబంధాలొస్తే తిప్పి కొడతాడు.

        ఇంకో చోట ఇలాటి ఒకమ్మాయి - బీఎస్సీ చదివిన కీర్తి (ఐశ్వర్య లక్ష్మి) మట్టి కుస్తీ పట్లు నేర్చుకుని, పోటీల్లో పతకాలు గెలుచుకుని, జుట్టు కత్తిరించుకుని మగరాయుడిలా తయారయ్యేసరికి సంబంధాలు రాక తల్లిదండ్రులు ఇబ్బంది పడుతూంటారు. దీంతో ఈమె బాబాయి (మునిష్కాంత్) ఈమె ఏడో తరగతే చదివిందనీ, జడ కూడా బారెడు వుందనీ వీరకి అబద్ధాలు చెప్పి పెళ్ళికి ఒప్పిస్తాడు. ఇలా కీర్తిని పెళ్ళి చేసుకున్న వీరని ఒక రోజు కొందరు దుండగులు కొడుతూంటే, కీర్తి ఫైట్ చేసి కాపాడుకుంటుంది. దీంతో వీరకి ఈమె రెజ్లర్ అని తెలిసిపోతుంది. పైగా జడ కూడా లేదనీ, అది విగ్గు అనీ తెలిసిపోతుంది. దీంతో గొడవలు మొదలుతాయి. ఇవి తేల్చుకోవడానికి ఇద్దరూ కుస్తీకి దిగుతారు. కుస్తీలో ఎవరు గెలిచి ఎవరు ఓడిపోయారనేది మిగతా కథ.

ఎలావుంది కథ

సందేశాత్మక కథ. ఇప్పటికీ స్త్రీలని బానిసలుగా చూసే మగవాళ్ళకి సందేశం. స్త్రీ సమానత్వం గురించి చెప్పేందుకు కుస్తీని వాడుకున్న కామెడీ కథ. అంతేగానీ మట్టి కుస్తీ ప్రధానంగా ఇది స్పోర్ట్స్ మూవీ కాదు. భార్యకి ఇష్టాయిష్టలేమిటని ఇగో పెంచుకుని బతికే వాడికి పహిల్వాన్ భార్యగా వస్తే ఎలా వుంటుందనే ఐడియాతో ఈ కామెడీ కథ. ఇందులో కీర్తికి రెజ్లర్ గా ఎదగాలని కలలుంటాయి. ఆమెని ఎదగనివ్వని మేల్ ఇగోతో వీర వుంటాడు. ఈ సమస్య ఎలా పరిష్కారమయ్యిందన్నదే ఈ కథ. గట్ట కుస్తీ అనేది కేరళకి చెందిన క్రీడా. కీర్తి కేరళకి చెందిన అమ్మాయిగానే వుంటుంది.

        అయితే కథాకథనాలు, దర్శకత్వం ఔట్ డెటెడ్ గా వున్నాయి. వీర- కీర్తీల మధ్య కొన్ని కామెడీ సీన్లు మాత్రం బావుంటాయి. మిగిలినదంతా తెలిసిపోయే కథే. పైగా కథలో బలమైన సన్నివేశాలు లేకుండా ఫ్లాట్ గా సాగిపోతూంటుంది. వూళ్ళో వీర ఆవారాగా తిరిగే సీన్లు, మరో పక్క  ఇంకో వూళ్ళో కీర్తి కుస్తీ పట్లూ పాత ఫార్ములాల ప్రకారమే వుంటాయి. కొత్తదనం కోసం ప్రయత్నించే శ్రమ తీసుకో దల్చుకో లేదు దర్శకుడు. హీరోహీరోయిన్లుగా విష్ణు విశాల్, ఐశ్వర్యా లక్ష్మిల పాపులారిటీ సినిమాని గట్టెక్కిస్తుందని భావించినట్టుంది. క్లయిమాక్స్ లో విశాల్ అప్పటికప్పుడు కుస్తీ నేర్చుకుని కీర్తితో పోటీకి దిగే సీన్లు కూడా కృత్రిమంగా వుంటాయి.

        కొన్ని కామెడీ సీన్లు, ఇంటర్వెల్ సీను, వీర- కీర్తీల మధ్య కాన్ఫ్లిక్ట్, చివర సందేశం – కథకి ఇవి బలమైన ఆధారాలుగా వున్నా, వీటిని ఆధారంగా చేసుకుని నడిపిన కథనం ఓ మోస్తరు ఎంటర్ టైనర్ గా సినిమాని మిగిల్చింది.

నటనలు - సాంకేతికాలు

హీరో విష్ణు విశాల్ ఎంటర్ టైన్ చేస్తాడు. ఐశ్వర్యా లక్ష్మి కూడా ఎంటర్ టైన్ చేస్తుంది. పాత్రలు, కథా కథనాలూ ఎలా వున్నా, ఇద్దరి నటనలు మాత్రం సినిమా చూసేలా చేస్తాయి. లొకేషన్స్, సెట్స్, ఇతర బ్యాక్ గ్రౌండ్స్ కలర్ఫుల్ గా వుండడంతో, వీటికి ఇద్దరి గ్లామర్ తోడవడంతో - ఇవి చూస్తూ కాలక్షేపం చేయొచ్చు. మిగిలిన అన్ని పాత్రలు నటించిన నటీనటులకి తెర మీద లభించిన స్పేస్ తక్కువ. దీనికి తగ్గట్టు కన్పించి పోతారు.

        జస్టిన్ ప్రభాకరన్ సంగీతంలో పాటలు అలా వచ్చి పోతాయి. రిచర్డ్ నాథన్ కెమెరా వర్క్ లో విజువల్ బ్యూటీ వుంది. దీనికి హీరోహీరోయిన్ల గ్లామర్ తోడయ్యింది. గ్రామీణ వాతావరణమనేది ఆహ్లాదకరంగా చూపించాడు దర్శకుడు. నిర్మాణ విలువలు, ఇతర సాంకేతికాలూ బావున్నాయిగానీ, కొత్తదనమనేది అసలు విషయం లోనూ వుండాలి. గ్రామీణ కుటుంబ కథల్ని బలమైన డ్రామాలుగానే ఎవరైనా తీస్తారు. ఈ సినిమాని పాత సినిమాలా తీసిన దర్శకుడు, ఆ పాత సినిమాల్లో వుండే కథా బలమైనా ప్రదర్శించి వుంటే మట్టి కుస్తీ మరో లెవెల్లో వుండేది.

—సికిందర్   


Sunday, December 4, 2022

1258 : సండే స్పెషల్ రివ్యూ!

        చాందినీ బార్ (ముంబాయి బార్ గర్ల్స్ జీవితాలు), పేజ్ త్రీ (ఉన్నత వర్గాల హిపోక్రసీ  ), కార్పొరేట్ (కార్పొరేట్ రంగం చీకటి కోణాలు), ఫ్యాషన్ (ఫ్యాషన్ రంగం తళుకులు)... ఇలా ఒక్కో రంగం లోపలి సంగతుల్ని కథా వస్తువులుగా తీసుకుని, 12 రీసెర్చి సహిత సినిమాలు తీసిన దర్శడుడు మధుర్ భండార్కర్, 13వ సినిమాగా ఇండియా లాక్ డౌన్ అందించాడు. దేశంలో కరోనా వ్యాప్తిని అరికట్టడానికి 2020 మార్చి 24 న విధించిన 21 రోజుల దేశవ్యాప్త మొదటి లాక్ డౌన్ అందరికీ గుర్తుంటుంది. ఈ లాక్ డౌన్ కాలంలో ఎదుర్కొన్న ఇక్కట్లు తిరిగి గుర్తుచేస్తూ డైరెక్ట్ ఓటీటీ రిలీజ్ చేశాడు. హిందీలో జీ5 ఓటీటీ ద్వారా డిసెంబర్ 5 నుంచి స్ట్రీమింగ్ అవుతున్న ఈ రెండున్నర  గంటల డాక్యూ డ్రామా, ఇంగ్లీషు సబ్ టైటిల్స్ తో వుంది.

        ఇందులో ప్రతీక్ బబ్బర్, శ్వేతా బసు ప్రసాద్, ఆహానా కుమ్రా, ప్రకాష్ బెలవాడి వంటి తెలిసిన నటులతో బాటు, సాయి తంహన్కర్ , తాహురా మన్సూరీ, జరీన్ షిహాబ్, ఆయీషా అయిమన్ నటించారు. అమిత్ జోషీ, ఆరాధనా సా రచన చేశారు. పలాస్ దాస్ ఛాయాగ్రహణం. దీనికి సంగీత దర్శకుడు లేడు. నిర్మాతలు జయంతీలాల్ గడా, మధుర్ భండార్కర్, ప్రణవ్ జైన్.  ఇక ఈ లాక్ డౌన్ లో ఏం జరిగిందో చూద్దాం...

నాలుగు కథల ఆంథాలజీ

ముంబాయిలో మూన్ (ఆహానా కుమ్రా) ఒక పైలట్. రిలేషన్ షిప్స్ కి సమయం లేనంత పని రాక్షసి. లాక్ డౌన్ తో విమానాలాగి పోయి ఇంటి ముఖం పడుతుంది. అదే అపార్ట్ మెంట్లోని ఒక ఫ్లాట్లో తనకంటే చిన్నవాడైన స్టూడెంట్ ఆకాష్ పరిచయమవుతాడు. అతడికి దగ్గరవడానికి ప్రయత్నిస్తూంటుంది. అతను వేరే గర్ల్ ఫ్రెండ్ ని లాక్ డౌన్ లో కలవలేక వీడియో కాల్స్ మాట్లాడుతూంటాడు.

ముంబాయిలోనే ఒక పోష్ సొసైటీలో కుక్కతో ఒంటరిగా నివసిస్తూంటాడు నాగేశ్వరరావు (ప్రకాష్ బలెవాడి) అనే రిటైర్డ్ తెలుగు వ్యక్తి. హైదరాబాద్ లో డెలివరీ దగ్గర పడ్డ కూతురు దగ్గరికి వెళ్దామనుకుంటే లాక్డౌన్ తో బందీ అయిపోయాడు. పని మనిషి ఫూల్మతి (సాయి తంహన్కర్) కి నెల జీతం అడ్వాన్సు ఇచ్చేసి, ఇంటి పట్టున జాగ్రత్తగా వుండమని చెప్పి పంపించేస్తాడు.

ఫూల్మతి భర్త మాధవ్ (ప్రతీక్ బబ్బర్) తోపుడు బండి మీద తినుబండారాలు అమ్మే అప్పుల్లో వున్న వలస కార్మికుడు. లాక్ డౌన్ తో ఆ ఉపాధి కూడా కోల్పోయి, కుటుంబాన్ని తీసుకుని కాలినడకన బీహార్లో స్వగ్రామానికి బయల్దేరతాడు.

ఇదే ముంబాయి కామాటీ పురాలో మెహరున్నీసా (శ్వేతా బసు ప్రసాద్) సెక్స్ వర్కర్. లాక్ డౌన్ తో ఉపాధికోల్పోయి, తోటి సెక్స్ వర్కర్స్ తో కొత్త ఆదాయ మార్గాన్ని కనిపెడుతుంది. కస్టమర్లతో ఫోన్ సెక్స్ ద్వారా ఆన్ లైన్ లో  డబ్బులు సంపాదించడం మొదలెడుతుంది.

ఇలా నాల్గు భిన్న వర్గాలకి చెందిన వ్యక్తుల అనుభవాలే ఈ నాల్గు కథలు. నిర్బంధ పరిస్థితుల్లో కూడా మనుషుల స్వభావం మారదనడానికి ఆర్ధికంగా స్థిరపడ్డ పాత్రల్ని చూపించాడు. ఆర్ధికంగా స్థిరపడ్డ వర్గాలకి లాక్ డౌన్ నిర్బంధంలో అప్రమత్తత కాదు, ఆరోగ్యమూ కాదు. సరదాలు కోరికలూ ఎలా తీర్చుకోవాలనే తాపత్రయం. మూన్, ఆకాష్, అతడి గర్ల్ ఫ్రెండ్ పాత్రలు దీనికి చెందుతారు.

అదే ఉపాధి కోల్పోయిన వర్గాలకి బ్రతుకు పోరాటమే తప్ప సరదాలు కోరికలూ కాదు. సెక్స్ వర్కర్ మెహరున్నీసా, ఆమె తోటి వర్కర్లు; పనిమనిషి ఫూల్మతి, ఆమె భర్త మాధవ్ ఈ వర్గానికి చెందుతారు. ఇక రిటైర్డ్ వ్యక్తులకి బంధువర్గం గురించి ఆందోళన. నిజమే, 70, 80 దాటిన వాళ్ళు కూడా ఎక్కడో బంధువుల ఫంక్షన్ కి వెళ్ళక పోతే వుండలేని అసహనాన్నిచూశాం. ఈ కథలో కూతురి డెలివరీకి రిస్కు చేసి వెళ్ళాలనుకునే నాగేశ్వరరావు ఇలాటి పాత్ర. వెళ్ళక పోతే కొంపలేమీ అంటుకోవు. కూతురే రావద్దని చెప్తున్నా, ముంబాయి నుంచి హైదరాబాద్ కి కారు డ్రైవ్ చేస్తూ బయల్దేరతాడు!

నాలుగు కథల కథ కాదు

అయితే ఈ నాల్గు కథలూ చివర్లో ఒక బిందువు దగ్గర కలిసే రొటీన్ ఇందులో వుండదు. అంటే నాల్గు కథలూ ఒక కథగా కలిసిపోవు. కేవలం నాగేశ్వరరావు, ఫూల్మతి కుటుంబం మార్గంలో ఎదురుపడతారు. ఇక్కడే ఇద్దరి కథలు కొలిక్కి వస్తాయి. అయితే నాగేశ్వరరావు ముంబాయి నుంచి వెళ్తున్నది హైదరాబాద్ కి. ముంబాయి నుంచి ఎక్కడో అటు ఉత్తరాన బీహార్ కాలినడకన వెళ్తున్న ఫూల్మతి కుటుంబం ఇటు దక్షిణాని కెలా వస్తుంది? సినిమాకోసం లాజిక్ ని లాక్ డౌన్ చేశాడేమో రియలిస్టిక్ సినిమాల రీసెర్చి స్పెషలిస్టు భండార్కర్.

నాగేశ్వరరావనే తెలుగు పాత్రతో కథకి ప్రయోజనం కూడా ఏమీ లేదు. నాందేవ్ సిన్హాగా పేరు మార్చి అటు బీహార్ పంపి వుంటే ఆ రూట్లో ఫూల్మతి కలిసేది. నాగేశ్వరరావుతో  నేటివిటీ కోసం ఓ రెండు చోట్ల తెలుగు కూడా మాట్లాడించారు. అప్పా రాత్రి భోజనం చేసరా?’ (చేశారా కాదు) అని కూతురు అడుగుతుంది. అప్పా అని ఏ తెలుగామె పిలుస్తుందో! సౌత్ అంటే మద్రాసీలే అనే హిందీవాళ్ళ జనరల్ నాలెడ్జి కి తమిళ అప్పానే తెలుసు. రాత్రి ఫోన్ చేసి రాత్రి భోజనం చేశారా అనడమేమిటో!

ఇక నాగేశ్వరరావంటాడు, ఇంటి పని ఏమి అని ఈ లాక్ డౌన్ సమయంలో నేను కట్బడ్డాను’… అంటే ఏమిటో! దారినిపోయే ఏ తెలుగు వాడినో కిడ్నాప్ చేసి  డైలాగు తిన్నగా రాయించుకోవచ్చుగా?

వలసల చరిత్రకి మచ్చ?

    కాలి నడకన వెళ్తున్న వలస కార్మికులు ఓ ఇరవై మంది వుంటారు. కానీ విజువల్స్ అప్పట్లో మనం టీవీల్లో, యూట్యూబ్ లో చూసినట్టుగా హృదయవిదారకంగా వుండవు. నడక వేగం కూడా వుండదు. ఇరవై మంది కలిసి సైట్ సీయింగ్ కి వెళ్తున్నట్టు నిదానంగా నడుస్తూంటారు. బాధ, ఆయాసం, అనారోగ్యం ఏవీ వుండవు. ఫూల్మతి కుటుంబానికి మాత్రమే నడవలేని బాధ, ఆకలిదప్పులు వుంటాయి. అయితే మధ్యలో ఒక అభ్యంతరకర సీను వస్తుంది. ఈ బృందానికి నాయకత్వం వహిస్తున్న అతను, ఫూల్మతి మీద కన్నేయడం, రాత్రికి పిలవడం అసభ్యంగా వుంటుంది.

ఆర్ధికంగా స్థిరపడ్డ వాళ్ళ కోరికలు, ఊపాధి కోల్పోయిన వాళ్ళ క్షుద్బాధా అని స్పష్టంగా వర్గీకరణ చేసిన తర్వాత, వలస కార్మికుల ఈ విపత్కర పరిస్థితుల్లో కామ కోరికలేమిటి? ఇలా ఎప్పుడైనా జరిగిందా? లాక్ డౌన్ వలసల్లో అత్యాచారాలు జరిగినట్టు కూడా వినలేదు. ఇలా చూపించి ఆ వలసల చారిత్రక ఇమేజికి చేటు చేసినట్టే దర్శకుడు.

దీంతో గొడవ జరిగి ఫూల్మతి కుటుంబం విడిపోతారు. అంటే తర్వాత నాగేశ్వరరావుతో విడిగా కలపడానికే బృందంనుంచి ఫూల్మతిని విడగొట్టే మార్గాన్ని ఇలా కల్పన చేశాడన్నమాట దర్శకుడు!

ఇక ఈ నాల్గు కథలూ ఎలా ముగిశాయన్నది మూవీ చూడాల్సిందే. ఇందులో ఫూల్మతిగా నటించిన సాయి తంహన్కర్, సెక్స్ వర్కర్ గా నటించిన శ్వేతా బసు ప్రసాద్ లవి ఎక్కువ ప్రభావం చూపే పాత్రలు, నటనలు. సాయిది విషాదమైతే, శ్వేతాది మగాళ్ళని రెచ్చగొట్టే సెక్సీతనం. దేన్నీ కేర్ చేయని,, జీవితాన్ని ఎంజాయ్ చేసే (సెక్స్) వర్కింగ్  వుమన్. సినిమాలో సంగీతం లేదు. ఆ లోపం కన్పించదు. టెక్నికల్ గా భండార్కర్ స్థాయిలో వుంది.

—సికిందర్