రచన - దర్శకత్వం : చెల్లా
అయ్యావు
తారాగణం : విష్ణు
విశాల్, ఐశ్వర్యా లక్ష్మి, కరుణాస్,
శ్రీజా రవి, మునిష్కాంత్ తదితరులు సంగీతం : జస్టిన్
ప్రభాకరన్, ఛాయాగ్రహణం : రిచర్డ్
ఎం. నాథన్
బ్యానర్స్ : ఆర్ టి టీమ్
వర్క్స్, వివి స్టూడియోస్
నిర్మాతలు : రవితేజ, విష్ణు
విశాల్, శుభ్ర, ఆర్యన్
రమేష్
విడుదల : డిసెంబర్ 2,
2022
***
విష్ణు విశాల్-
ఐశ్వర్య లక్ష్మీలతో తమిళంలో ‘గట్ట కుస్తీ’, తెలుగులో ‘మట్టి కుస్తీ’ గా రవితేజ సహ నిర్మాతగా వుంటూ అందించిన ఈ ఎంటర్టయినర్ కి దర్శకుడు చెల్లా
అయ్యావు అనే తమిళుడు. దీనికి మునుపు విష్ణు విశాల్ తో ఒక మూవీ చేశాడు. అది
హిట్టయ్యింది. ఈ రెండో మూవీని స్పోర్ట్స్ మూవీ అన్పించేట్టు తీశాడు గానీ
స్పోర్ట్స్ మూవీ కాదు. మరి ‘మట్టి కుస్తీ’ అని టైటిల్ ఎందుకు పెట్టాడు? దీని వెనుక వేరే అర్ధం ఏమైనా వుందా? దీంతో విజయం
సాధించాడా? ఇవి తెలుసుకుందాం...
చిన్నతనంలోనే
తల్లిదండ్రుల్ని కోల్పోయిన
వీర (విష్ణు విశాల్) కి ఆ వూరి పంచాయితీ ప్రెసిడెంట్‌గా వున్న మేనమామ
(కరుణాస్), మగవాళ్ళ కంటే ఆడవాళ్ళు తక్కువనీ, ఎప్పుడూ ఆడవాళ్ళకి లొంగకుండా వుండాలనీ
వీరకి తన పైత్యం నూరిపోస్తాడు. ఎనిమిదో తరగతి చదివిన వీర తాతలు సంపాదించిన ఆస్తిని
అనుభవిస్తూ, చిన్న చిన్న పంచాయితీలు తీరుస్తూ, కబడ్డీ ఆడుతూ కాలం గడుపుతూంటాడు. మేన మామ నూరి పోసిన దాని ప్రకారం తనని
పెళ్ళి చేసుకునే అమ్మాయి తనకంటే ఎక్కువ చదువుకోకూడదనీ, బారెడు జడ కూడా వుండాలనీ కోరికలు చెబుతూంటాడు. ఎక్కువ చదువుకున్న
అమ్మాయిలతో సంబంధాలొస్తే తిప్పి కొడతాడు.
ఇంకో చోట ఇలాటి ఒకమ్మాయి - బీఎస్సీ చదివిన కీర్తి (ఐశ్వర్య లక్ష్మి) మట్టి
కుస్తీ పట్లు
నేర్చుకుని, పోటీల్లో పతకాలు గెలుచుకుని, జుట్టు కత్తిరించుకుని మగరాయుడిలా తయారయ్యేసరికి సంబంధాలు రాక
తల్లిదండ్రులు ఇబ్బంది పడుతూంటారు. దీంతో ఈమె బాబాయి (మునిష్కాంత్) ఈమె ఏడో తరగతే
చదివిందనీ, జడ కూడా బారెడు వుందనీ వీరకి అబద్ధాలు చెప్పి
పెళ్ళికి ఒప్పిస్తాడు. ఇలా కీర్తిని పెళ్ళి చేసుకున్న వీరని ఒక రోజు కొందరు
దుండగులు కొడుతూంటే, కీర్తి ఫైట్ చేసి కాపాడుకుంటుంది. దీంతో
వీరకి ఈమె రెజ్లర్ అని తెలిసిపోతుంది. పైగా జడ కూడా లేదనీ,
అది విగ్గు అనీ తెలిసిపోతుంది. దీంతో గొడవలు మొదలుతాయి. ఇవి తేల్చుకోవడానికి
ఇద్దరూ కుస్తీకి దిగుతారు. కుస్తీలో ఎవరు గెలిచి ఎవరు ఓడిపోయారనేది మిగతా కథ.
సందేశాత్మక కథ. ఇప్పటికీ స్త్రీలని బానిసలుగా చూసే మగవాళ్ళకి సందేశం. స్త్రీ సమానత్వం
గురించి చెప్పేందుకు కుస్తీని వాడుకున్న కామెడీ కథ. అంతేగానీ మట్టి కుస్తీ
ప్రధానంగా ఇది స్పోర్ట్స్ మూవీ కాదు. భార్యకి ఇష్టాయిష్టలేమిటని ఇగో పెంచుకుని
బతికే వాడికి పహిల్వాన్ భార్యగా వస్తే ఎలా వుంటుందనే ఐడియాతో ఈ కామెడీ కథ. ఇందులో
కీర్తికి రెజ్లర్ గా ఎదగాలని కలలుంటాయి. ఆమెని ఎదగనివ్వని మేల్ ఇగోతో వీర వుంటాడు.
ఈ సమస్య ఎలా పరిష్కారమయ్యిందన్నదే ఈ కథ. గట్ట కుస్తీ అనేది కేరళకి చెందిన క్రీడా.
కీర్తి కేరళకి చెందిన అమ్మాయిగానే వుంటుంది.
అయితే కథాకథనాలు, దర్శకత్వం ఔట్ డెటెడ్ గా వున్నాయి. వీర- కీర్తీల మధ్య కొన్ని కామెడీ
సీన్లు మాత్రం బావుంటాయి. మిగిలినదంతా తెలిసిపోయే కథే. పైగా కథలో బలమైన
సన్నివేశాలు లేకుండా ఫ్లాట్ గా సాగిపోతూంటుంది. వూళ్ళో వీర ఆవారాగా తిరిగే సీన్లు, మరో పక్క ఇంకో వూళ్ళో కీర్తి
కుస్తీ పట్లూ పాత ఫార్ములాల ప్రకారమే వుంటాయి. కొత్తదనం కోసం ప్రయత్నించే శ్రమ
తీసుకో దల్చుకో లేదు దర్శకుడు. హీరోహీరోయిన్లుగా విష్ణు విశాల్, ఐశ్వర్యా లక్ష్మిల పాపులారిటీ సినిమాని గట్టెక్కిస్తుందని
భావించినట్టుంది. క్లయిమాక్స్ లో విశాల్ అప్పటికప్పుడు కుస్తీ నేర్చుకుని కీర్తితో
పోటీకి దిగే సీన్లు కూడా కృత్రిమంగా వుంటాయి.
కొన్ని కామెడీ సీన్లు, ఇంటర్వెల్ సీను, వీర- కీర్తీల మధ్య కాన్ఫ్లిక్ట్, చివర సందేశం – కథకి ఇవి బలమైన ఆధారాలుగా వున్నా,
వీటిని ఆధారంగా చేసుకుని నడిపిన కథనం ఓ మోస్తరు ఎంటర్ టైనర్ గా సినిమాని
మిగిల్చింది.
హీరో విష్ణు విశాల్ ఎంటర్ టైన్ చేస్తాడు. ఐశ్వర్యా లక్ష్మి కూడా ఎంటర్ టైన్
చేస్తుంది. పాత్రలు, కథా కథనాలూ
ఎలా వున్నా, ఇద్దరి నటనలు మాత్రం సినిమా చూసేలా చేస్తాయి.
లొకేషన్స్, సెట్స్, ఇతర బ్యాక్
గ్రౌండ్స్ కలర్ఫుల్ గా వుండడంతో, వీటికి ఇద్దరి గ్లామర్
తోడవడంతో - ఇవి చూస్తూ కాలక్షేపం చేయొచ్చు. మిగిలిన అన్ని పాత్రలు నటించిన
నటీనటులకి తెర మీద లభించిన స్పేస్ తక్కువ. దీనికి తగ్గట్టు కన్పించి పోతారు.
జస్టిన్ ప్రభాకరన్ సంగీతంలో పాటలు
అలా వచ్చి పోతాయి. రిచర్డ్ నాథన్ కెమెరా వర్క్ లో విజువల్ బ్యూటీ వుంది. దీనికి
హీరోహీరోయిన్ల గ్లామర్ తోడయ్యింది. గ్రామీణ వాతావరణమనేది ఆహ్లాదకరంగా చూపించాడు
దర్శకుడు. నిర్మాణ విలువలు, ఇతర సాంకేతికాలూ బావున్నాయిగానీ, కొత్తదనమనేది అసలు విషయం లోనూ వుండాలి. గ్రామీణ కుటుంబ కథల్ని బలమైన
డ్రామాలుగానే ఎవరైనా తీస్తారు. ఈ సినిమాని పాత సినిమాలా తీసిన దర్శకుడు, ఆ పాత సినిమాల్లో వుండే కథా బలమైనా ప్రదర్శించి వుంటే ‘మట్టి కుస్తీ’ మరో లెవెల్లో వుండేది.
—సికిందర్