రివ్యూలు, సాంకేతికాలు, స్క్రీన్ ప్లే సంగతులు...

టికెట్లు దొరకడం యోగం, సినిమాలు చూడడం భోగం, రివ్యూలు రాయడం రోగం!

10, డిసెంబర్ 2022, శనివారం

1261 : రివ్యూ!

రచన- దర్శకత్వం : హర్ష పులిపాక
తారాగణం : బ్రహ్మానందం, కలర్స్ స్వాతి, శివాత్మికా రాజశేఖర్, దివ్యా శ్రీపాద, సముద్ర కని, నరేష్ అగస్త్య, రాహుల్ విజయ్, వికాస్, ఉత్తేజ్, ఆదర్శ్ బాలకృష్ణన్ తదితరులు
సంగీతం : ప్రశాంత్ విహారి, ఛాయాగ్రహణం : రాజ్ కె నల్లీ
బ్యానర్స్ : టికెట్ ఫ్యాక్టరీ, ఎస్ ఒరిజినల్స్
నిర్మాతలు : అఖిలేష్ వర్ధన్, సృజన్
విడుదల ; డిసెంబర్ 9, 2022
***

        హాస్య బ్రహ్మ బ్రహ్మానందం చాలా కాలం తర్వాత వెండి తెర మీద కనిపిస్తూ ప్రయోగాత్మక సినిమా నటించారు. హాస్య పాత్ర కాకుండా, కథలు చెప్పే ఉదాత్త పాత్ర నటిస్తూ వెరైటీ నందించారు. చాలా కాలం తర్వాత కలర్స్ స్వాతి కూడా తెరపైకొచ్చింది. కొత్త దర్శకుడు హర్ష పులిపాక విషయం లేని రొటీన్ మూస తీసి తనూ ఓ దర్శకుడయ్యాడన్పించుకోకుండా, ఏదో కొత్తగా చెప్పాలన్న తపనతో తన వంతు ప్రయత్నం చేశాడు. నాల్గయిదు చిన్న కథల ఆంథాలజీలు కొత్తగాకున్నా, ఓ నాల్గు జీవితాల్ని వాస్తవిక దృక్పథంతో చిత్రించేందుకు ముందుకొచ్చాడు. ఆంథాలజీలు బాక్సాఫీసు దగ్గర వర్కౌట్ కావని గత ఉదాహరణలున్నా, ఓటీటీ కాకుండా థియేటర్ విడుదలకే పూనుకోవడం సాహసమే అనాలి. ఈ సాహసం ఎంతవరకు వర్కౌట్ అయిందీ చూద్దాం...

కథ  


        వేదవ్యాస్ (బ్రహ్మనందం) ఆలిండియా రేడియోలో రిటైరై, కూతురు రోషిణి (కలర్స్ స్వాతి) తో వుంటాడు. ఖాళీగా వుండలేక కథలు రాయాలనుకుంటాడు. కథకుడుగా వూళ్ళో జరిగే స్టాండప్ స్టోరీ టెల్లింగ్ పోటీల్లో పాల్గొనాలనుకుంటాడు. నువ్వు కథలు రాయడమేమిటని, ఈ వయసులో యువ కథా రచయితలతో పోటీ పడలేవనీ రోషిణి నిరుత్సాహ పర్చినా, కాదని తన అరవై ఏళ్ళ జీవితానుభవాన్నీ రంగరించి కథలు చెప్పడానికి పోటీల కెళ్తాడు. అక్కడ ఏఏ కథలు చెప్పాడు, వాటికి ఎలాటి స్పందన లభించిందీ, పోటీల్లో గెలిచాడా లేదా అన్నది మిగతా కథ.

ఎలావుంది కథ

    పైన చెప్పుకున్నట్టు ఇది ఆంథాలజీ జానర్ కి చెందిన కథ. నాల్గయిదు కథానికల్ని కలిపి ప్రధాన కథతో ఏకీకృతం చేసే హైపర్ లింక్ ప్రక్రియ. ప్రధాన కథ వేదవ్యాస్ ది. పోటీల్లో అతను కథలు చెప్పి విజేత అవడం గురించి. కెరీర్ ని ఇరవైలలోనే కాదు, అరవైలలో కూడా ప్రారంభించ వచ్చని చెప్పే ప్రధాన కథ. ఈ ప్రధాన కథ కింద పంచేంద్రియాల కాన్సెప్ట్ తో పంచతంత్రం టైటిల్ తో ఐదు కథానికలు చెప్తాడు. చూపుకి, రుచికి, వాసనకి, స్పర్శకి, వినికిడికీ సంబంధించిన కథానికలు.

        1. చూపు : విహారి (నరేష్ అగస్త్య) హైదరాబాద్ లో ఒక సాఫ్ట్ వేర్ ఉద్యోగి. పని ఒత్తిడితో విశ్రాంతి లేక కోపంతో రియాక్ట్ అవుతూంటాడు. ఉద్యోగం తప్ప వేరే జీవితం లేకపోవడంతో మానసిక కుంగుబాటుతో వుంటాడు. ఒక రోజు కొలీగ్స్ బీచి గురించి మాట్లాడుకుంటే ఆసక్తితో బీచి గురించి వాళ్ళనీ వీళ్ళనీ అడిగి తెలుసుకుని ఆనందిస్తాడు. తను కూడా బీచి చూడాలనుకుంటాడు. కొలీగ్స్ తో వైజాగ్ వెళ్ళేందుకు ప్లాన్ చేస్తాడు. తీరా వైజాగ్ వెళ్ళి చూస్తే తన వూహల్లోని బీచి కనిపించదు. కొలీగ్ ఆ రద్దీ ప్రాంతం నుంచి ఏకాంత ప్రదేశంలోకి తీసి కెళ్ళి చూపిస్తుంది. అక్కడ సముద్రం, ఇసుక, అలలూ చూసి ఆనంద భరితుడవు తాడు. బీచి చూడాలన్న కోరికంతా తీర్చుకుంటాడు.

          ఈ కథానికలో దర్శకుడు ఏం చెప్పాలనుకున్నాడో అర్ధం గాదు. ఇంట్లో తిని కూర్చునే వాళ్ళకి కూడా బీచి చూడాలని వుంటుంది. కానీ ఈ కథానికలో హీరో కేటగిరీ ఇది కాదుగా? ఉద్యోగ వొత్తిడి వల్ల  ఉపశమనాన్ని కోరుకోవడంలోంచి బీచిని చూడాలన్న కోరిక పుట్టింది. ఆ కోరిక తీర్చుకుని, రెట్టించిన స్థాయిలో రిలీఫ్ పొంది, వచ్చి ఆఫీసులో ప్రొడక్టివిటీ పెంచేసి, ఆటాపాటాగా పని దంచేస్తూంటే కథానికకి అర్ధం వచ్చేది.

 2. రుచి :

        సుభాష్ (రాహుల్ విజయ్), లేఖ (శివాత్మికా రాజశేఖర్) లకి పెళ్ళి చూపులేర్పా
టవుతాయి.  
దీనికి ముందు పెళ్ళి చూపుల్లో, మీరెందుకు పెళ్ళి చేసుకోవాలనుకుంటున్నారు అని అడిగితే, ఏ అమ్మాయీ సరీగ్గా చెప్పలేదు. ఒకమ్మాయి సిగ్గుతో వంకర్లు పోవడం, ఇంకో అమ్మాయి ఇంకేదో చెప్పడం చేస్తారు. ఇక విసిగిపోయి, ముందు తనేంటో తనకి తెలియాలి. వీళ్ళు అమ్మాయిలు, నాకు వుమన్ కావాలి అని తల్లితో అనేస్తాడు. ఇప్పుడు లేఖతో పెళ్ళి చూపులయ్యాక బయట కలుసుకుంటారు. తను మెంటల్ గా, ఫైనాన్షియల్ గా రెడీగా వున్నానని చెప్తుంది లేఖ. పెళ్ళంటే అభిరుచులు కలవడమని అంటుంది. ఈ ఒక్క మీటింగ్ తో అభిరుచులేం తెలుస్తాయని అంటాడు. క్రికెట్ మ్యాచ్ గెలుస్తామని తెలిసి ఆడతామా, పెళ్ళి కూడా మ్యాచే, ఆడుతూంటే తెలుస్తూంటుంది. అడ్జస్ట్ మెంట్లు వుంటాయ్ అంటుంది. మనమేంటో మనకి తెలిస్తే మనకేది కావాలో తెలుస్తుందని అంటుంది. అతను అంగీకరిస్తాడు.

        ఈ కథానికలో అభిప్రాయాలు బాగానే వున్నాయి గానీ, మాటలు ఎన్నయినా చెప్పుకోవచ్చు. వాటిని ప్రేక్షకులు నమ్మరుగాక నమ్మరు. విజువల్ ఎగ్జాంపుల్ కావాలి. ఏదైనా సంఘటన జరిగి ఆ సంఘటనలో పరస్పరం వ్యక్తిత్వాలేంటో బయటపడితే ఆ సాక్ష్యం కన్విన్సింగ్ గా వుంటుంది. సంఘటన లేకుండా కథ వుండదు. కథంటే సంఘటనే. పాత్రల వ్యక్తిత్వాలు బయట పడే సంఘటన. ఇక ఈ కథానిక రుచి గురించి అయినప్పుడు, ఐస్ క్రీములు రుచి చూడడం గాక, బాదం పాలు తాగి మైమరిచి పోవడం గాక, వ్యక్తిత్వాల్ని ఆస్వాదించే అంశాలతో కథనం వుంటే కరెక్టుగా వుంటుంది.

        3. వాసన :  రామనాథం (సముద్ర కని) రిటైర్డ్ బ్యాంకు మేనేజర్. భార్య వుంటుంది. భర్త దగ్గర కూతురు డెలివరీ కుంటుంది. ఉన్నట్టుండి రామనాధానికి ఏదో దుర్వాసన వేస్తూ వుంటుంది. ఎలుక చచ్చిన వాసన. ఇల్లంతా గాలిస్తాడు, కడుగుతాడు, శుభ్రం చేస్తాడు. వేలు తెగి రక్తం కారుతూంటే అప్పుడు వాసన రక్తంలోంచి వస్తోందని గ్రహిస్తాడు. భార్యకి ఆ రక్తంలో కూడా ఏ వాసనా వేయదు. అల్లుడు వచ్చి, సైకియాట్రిస్టుకి చూపిస్తాడు. సైకియాట్రిస్టు రామనాధం నుంచి విషయాలు రాబడతాడు. ఈ సమస్యకి మూలం రామనాథం పుట్టుకలోనే వుందని గ్రహిస్తాడు. ఏమిటా మూలం? దానికీ ఇప్పుడు కూతురి డెలివరికీ వున్న సంబంధమేమిటి? సమస్యకి పరిష్కారం కూతురి డెలివరీ మీద ఆదారపడి వుండడమేమిటి? ఇవి తెలుసుకోవాలంటే మిగతా కథానిక చూడాలి.

        ఈ కథానిక విషయబలంతో కూర్చోబెడుతుంది. ప్రతీ క్షణం వాసన గురించిన సస్పెన్స్ వుండడంతో ఈ సస్పెన్సే చివరంటా తీసికెళ్తుంది. మొదటి రెండు కథానికలకంటే ఇది డెప్త్, డ్రామా, జీవం వున్న కథానిక. దీని రచన, నిర్వహణ ఉత్తమ తరగతికి చెందుతాయని చెప్పొచ్చు.

4. స్పర్శ :
   శీను (వికాస్), లక్ష్మి (దివ్యా శ్రీపాద) లది కింది మధ్యతరగతికి చెందిన కుటుంబం. నెలలు నిండిన లక్ష్మికి రక్తస్రావం జరగడంతో తీసుకుని హాస్పిటల్ కి పరిగెడతాడు. అక్కడ చాలా ట్రాజడీ బయటపడుతుంది (గుర్తుందా శీతాకాలం లో తమన్నా పాత్రకి లాగా)లక్ష్మికి ప్రాణ గండం పొంచి వుంటుంది. లక్షల రూపాయలు హాస్పిటల్ ఖర్చులకి కావాలి. శీనుకి దిక్కు తోచదు. ఇంతలో తల్లిదండ్రులొచ్చి సూటిపోటి మాటలంటారు. లక్ష్మి తల్లి వచ్చి ఎదురు తిరుగుతుంది. ఇక ఇచ్చుకున్న కట్నాల గురించీ, పుచ్చుకున్న కానుకల గురించీ అరుచుకుని, ఆస్పత్రి ఖర్చుల గురించి కీచులాడుకునీ వెళ్ళిపోతారు. శీను లక్ష్మిని తీసుకుని యింటి కొచ్చేస్తాడు. ఇక ఇద్దరికీ ఒకటే మిగులుతుంది - కడుపులో బిడ్డ కదిలితే ఆ స్పర్శకి ఆనందించడం, స్పర్శ లేకపోతే భయపడడం. ఈ క్షణ క్షణ గండంతో బాటు లక్ష్మి ప్రాణగండం ఎలా తీరాయి, తీరాయా లేదా అనేది మిగతా కథానిక.

ఇది కూడా సస్పెన్సుతో కూర్చోబెడుతుంది. ఈ సస్పెన్సుతో ఇద్దరికీ తమ వాళ్ళ స్వార్ధాలతో సంఘర్షణ తోడవుతుంది. డబ్బే ప్రధానమైన బంధుత్వాలు  నిస్సిగ్గుగా వీధిన పడతాయి. పైగా వాళ్ళిద్దర్నీ విడదీయాలని కూడా ప్రయత్నిస్తారు. కష్టం వచ్చినప్పుడు తెంచుకోవడం కాదు, పంచుకోవాలని చెప్పే ఈ కథానిక కూడా వాస్తవిక జీవితాలతో ఉత్తమమైనదే. ఇందులో ఒక చోట శీను మిత్రుడికి చెప్పుకుంటూంటే మిత్రుడు శీను జేబులో డబ్బులు పెట్టే లాంగ్ షాట్ లో మాంటేజ్ కదిలించేలా వుంటుంది.

        5. వినికిడి : ఇందులో లియా(కలర్స్ స్వాతి) ఒక పాడ్ కాస్టర్. పాడ్ కాస్టింగ్ తో ఆమె ప్రసారం చేసే కథలు పిల్లల్ని ఆకట్టుకుంటాయి. ఈ ప్రోగ్రాం అభిమాని రూపా అని బాలిక వుంటుంది. ఈమె బర్త్ డేకి ప్రోగ్రాంలో గ్రీటింగ్స్ చెప్పించాలని తండ్రి కిషన్ (ఉత్తేజ్) వూర్నుంచి బయల్దేరి హైదరాబాద్ వస్తాడు. అయితే కథల ప్రసారం ఆపి, వేరే ప్రోగ్రాం ప్రారంభించే పని మీద వుంటుంది లియా. కిషన్ వచ్చి విషయం చెప్పడంతో, లియాకి రూపా పట్ల ఆసక్తి పెరుగుతుంది. రూపాని కలిసేందుకు బయల్దేరి వెళ్తుంది. ఇప్పుడు తన బర్త్ డేకి వచ్చిన లియాని చూసి రూపా ఎలా ఫీలయ్యిందీ, రూపాని చూసి లియా ఎందుకు షాకయ్యిందీ తెలుసుకోవాలంటే మిగతా ఈ కదిలించే కథానిక చూడాలి.

ఈ కథానిక కూడా బలమైనదే. చివరికి పెల్లుబికే భావోద్వేగాలతో బలమైనది. మనుషుల్ని కలిపేది. తెలియకుండా సస్పెన్స్ వుంటూ, చివర్లో వెల్లడై షాకిచ్చేది.

      ఈ అయిదు కథానికల్లో సస్పెన్సుతో వున్న చివరి మూడు కథానికలే కట్టి పడేస్తాయి. కథానికలకి సంఘటనలు, సస్పెన్సు ఎంత ముఖ్యమో తెలియజేస్తాయి. మొదటి రెండు కథానికలు సంఘటనలూ సస్పెన్సూ  లేక విఫలమయ్యాయి.

ఇక ప్రధాన కథ చూస్తే, పోటీల్లో కథలు చెప్పిన వేదవ్యాస్ విజేతే అవుతాడు. అయితే కూతురు రోషిణి తో అతడికున్న సంబంధమే సరిగా లేదు. వ్యతిరేకించే పాత్ర వుంటే ప్రధాన పాత్ర గొప్ప తెలుస్తుందని రోషిణి క్యారక్టర్ వుండడం మంచిదే. అయితే ఆమె వ్యతిరేకించే కారణం వేరే వుండాలి. ఆలిండియా రేడియోలో అన్నేళ్ళు ఉద్యోగం చేసిన తండ్రికి సాహిత్యంతో  సంబంధం వుండదా? కథలు రాయలేడా? తండ్రియేదో సగటు మనిషి అయినట్టు- నువ్వు రైటర్ అవడమేమిటని చిన్నబుచ్చుతూ వుండాల్సిన అవసరం లేదు.

నటనలు –సాంకేతికాలు

ఇందులో నటీనటులందరూ పాత్రలకి తగ్గ అభినయాలు చేశారు. బ్రహ్మానందం పాత్ర అంతంత మాత్రమే. ఆడిటోరియంలో ఒక్కో కథ ప్రారంభిస్తూ చెప్పే రెండు మాటల వరకే ఆయన కనిపించేది. ఇలా కామెడీ చేయకుండా హూందాతనంతో నటించడం బావుంది. నిజానికి ఓ కథానిక తనతో వుంటే బావుండేది. బ్రహ్మానందం చెప్పే చివరి కథానికలో లియా పాత్రలో తననే వూహించుకుంటుంది కలర్స్ స్వాతి రోషిణి పాత్ర. లియా పాత్రని క్లాస్ గా నటించింది.

        తర్వాత సముద్ర కని వాసన సైకాలజికల్ పాత్ర నటన పాత్రలోకి లీనమైపోయి వుంటుంది. పాత్రలో అంతగా లీనమై కనిపించేది శివాత్మిక కూడా. ఎక్స్ ప్రెషన్స్ ని బాగా ప్లే చేసింది. దివ్యా శ్రీపాద, నరేష్ అగస్త్య, రాహుల్ విజయ్, వికాస్, ఉత్తేజ్ అందరూ పాత్రల్లా కన్పించే ప్రయత్నం చేశారు. దర్శకత్వం, దర్శకుడు రాసిన మాటలు నస పెట్టకుండా వున్నాయి. ఇలాటి కథానికలు కోరుకునే కళాత్మకత కి గుర్తుండే షాట్స్ కూడా తోడైతే  బావుంటుంది. ఇమేజెస్ అన్నవి విజువల్ మీడియాని ఉన్నతీకరిస్తాయి. ఇక ప్రశాంత్ విహారి సంగీతంలో బ్యాక్ గ్రౌండ్ లో వచ్చే పాటలున్నాయి. రాజ్ కె నల్లీ కెమెరా వర్క్ బడ్జెట్ కి తగ్గట్టు రిచ్ గానే వుంది.

చివరికేమిటి
          ఆంథాలజీలు వెండి తెర మీద సక్సెస్ కావడం ఎప్పుడూ జరగలేదు- ఒకటీ రెండు తప్ప.  చందమామ కథలు, మనమంతా, ఆవ్, గమనం వర్కౌట్ కాలేదు. వేదం, కేరాఫ్ కంచర పాలెం మాత్రం సంచలనం సృష్టించ గలిగాయి. పిట్ట కథలు ఓటీటీలోనే విడుదలైంది. పంచతంత్రం కూడా ఓటీటీ మూవీయే గానీ థియేటర్ సినిమా కాదు.  ఇందులో సగటు ప్రేక్షకులు కోరుకునే అంశాలేవీ లేవు. యూత్ కి అసలే పడదు. మొదటి రెండు కథలు యూత్ కథలే అయినా వాటిని అంత ట్రెండీగా తీయలేదు. మిగిలిన మూడు కథలు బరువైనవి. అయితే కొత్త దర్శకుడు ఇవన్నీ పక్కన బెట్టి కళాపోషణ చేస్తూ తాననుకున్నది తీయడమే గొప్పనుకోవాలి.

—సికిందర్