రివ్యూలు, సాంకేతికాలు, స్క్రీన్ ప్లే సంగతులు...

టికెట్లు దొరకడం యోగం, సినిమాలు చూడడం భోగం, రివ్యూలు రాయడం రోగం!

Monday, January 24, 2022

1122 : ఇరానియన్ మూవీ రివ్యూ!

 రచన-  దర్శకత్వం : అస్ఘర్ ఫర్హదీ
తారాగణం : అమీర్ జదీదీ, సహర్ గుల్దస్త్, మోహ్సేన్ తనబందే, సరీనా ఫర్హదీ తదితరులు
ఛాయాగ్రహణం : అలీ ఘాజీ, కూర్పు : హయదే సఫియారీ
బ్యానర్ : మెమెంటో ఫిలిమ్స్
నిర్మాతలు : అలెగ్జాండర్ మలెట్ గై, అస్ఘర్ ఫర్హదీ
పంపిణీ : అమెజాన్ స్టూడియోస్
విడుదల : జనవరి 21, 2022,  అమెజాన్ ప్రైమ్ వీడియో
***

    క వ్యాపారం కోసం రహీమ్ సుల్తానీ (అమీర్ జదీదీ) ఫైనాన్సర్ దగ్గర అప్పు తీసుకుంటాడు. ఆ అప్పు తీర్చాలంటూ ఫైనాన్సర్ బెదిరింపులకి దిగేసరికి, బహ్రామ్ (రచయిత, నటుడు మోహ్సేన్ తనబందే) అనే బంధువు రహీమ్ ని ఆదుకుని అప్పు మొత్తం 150,000 ఇరానీ రియాళ్ళు తను కట్టేస్తాడు. ఇప్పుడు బహ్రామ్ కి బాకీపడిన రహీమ్ ఇది కూడా తీర్చక పోయేసరికి, బహ్రామ్ కేసుపెట్టి రహీంని జైలుకి పంపించేస్తాడు.

    కొంత కాలం తర్వాత రహీమ్ పెరోల్ మీద విడుదలై వస్తాడు. అతను పెళ్ళయి విడాకులు తీసుకున్నాడు. పదేళ్ళ కొడుకు వున్నాడు. అక్కా బావలున్నారు. కొడుకుతో వాళ్ళ దగ్గరే వుంటాడు. బావ హొసేన్ (అలీరెజా జహందీదే) కి చెప్పి బహ్రామ్ తో రాజీ కుదర్చమంటాడు. కొంత కొంత అప్పు తీర్చేస్తానని, జైలు శిక్ష రద్దు చేయించమనీ కోరతాడు. ఈ రాజీ ప్రయత్నానికి బహ్రామ్ ఒప్పుకోక మొత్తం అప్పు తీర్చి తీరాల్సిందేనంటాడు. అతడికి జెరాక్స్ సెంటర్ నడుపుతున్న కూతురు ఫాతిమా (దర్శకుడి కుమార్తె సెరీనా ఫర్హదీ) వుంటుంది. ఆ కూతురి కట్నానికి దాచిన డబ్బు అది. ఆ డబ్బు మొత్తం ఒకేసారి కావాలంటాడు.

    రహీమ్ కి రహస్యంగా కలుస్తున్న గర్ల్ ఫ్రెండ్ ఫర్కొందే (సహర్ గుల్దస్త్) వుంటుంది. ఆమెని పెళ్ళి చేసుకోవాలంటే తన జైలు శిక్ష రద్దు అవాలి. ఆమెని కలవడానికెళ్తే ఆమె ఒక బ్యాగు దొరికిందని చూపిస్తుంది. అందులో 17 బంగారు నాణేలుంటాయి. వాటిని అమ్మి అప్పు తీర్చేద్దామని ప్రయత్నిస్తే, వాటి మీద వచ్చే డబ్బు అప్పు తీర్చడానికి చాలదని తెలుస్తుంది.  

అబద్ధాల కోటలో హీరో

  దీంతో ఒక ఆలోచన చేస్తాడు. ఈ బంగారంతో తన నిజాయితీ నిరూపించుకుంటూ వార్తలకెక్కితే తను హీరో అవుతాడనీ, అన్ని సమస్యలూ ఒక్క దెబ్బతో పరిష్కారమై పోతాయనీ భావిస్తాడు. దీంతో వూరంతా తనకి దొరికిన బ్యాగు గురించి పోస్టర్లు వేసి, అక్క ఫోన్ నెంబర్ ఇస్తాడు. ఆ బ్యాగు పోగొట్టుకున్న నాజ్నీన్ అనే కష్టాల్లో వున్న యువతి ఆ ఫోన్ నెంబర్ కి కాల్ చేసి వచ్చి, రహీమ్ అక్క దగ్గర్నుంచి బ్యాగు తీసికెళ్ళి పోతుంది.

    ఇది టీవీ ఛానెల్ కి తెలిసి రహీమ్ ని ఇంటర్వ్యూ చేసి ప్రసారం చేస్తారు. అప్పు కేసులో జైల్లో శిక్ష అనుభవిస్తున్న ఖైదీ రహీమ్, అంత బంగారం దొరికినా దురాశ పడక, ఆ బంగారంతో అప్పు తీర్చేసి జైల్లోంచి బయటపడే ఆలోచన కూడా చేయకుండా, పరోపకార భావంతో బ్యాగు సొంతదారుకి అప్పగించేసి, హీరోలా ప్రవర్తించాడని వూరూ వాడా అవుతుంది. జైలు అధికారి కూడా రహీమ్ నిజాయితీని మెచ్చుకుంటూ ప్రకటన విడుదల చేస్తాడు.

    ఇదంతా చూసి బహ్రామ్ మండిపడతాడు. ఈ వెధవ హీరో అవడమేమిటి? సోషల్ మీడియాలో కూడా రహీమ్ కొస్తున్న మద్దతు చూసి, ఇప్పుడు కూడా బాకీ విషయంలో సడలింపుల ప్రశ్నే లేదంటాడు. ఇంతలో ఒక ఛారిటీ సంస్థ హీరో అయిన రహీమ్ ని సన్మానిస్తుంది. ఆ సన్మాన సభలో రహీమ్ కొడుకు చేత పథకం ప్రకారం మాట్లాడించి సానుభూతి పొందాలని చూస్తాడు. అప్పు తీర్చడానికి తన తండ్రి పడుతున్న కష్టాలు ఆ పిల్లవాడి నోటి నుంచి విన్న సభికులంతా కదిలిపోయి విరాళాలు కురిపించేస్తారు.

సాలెగూట్లో సుల్తానీ

    ఇక రహీమ్ ప్రభుత్వోద్యోగం కోసం దరఖాస్తు చేసుకుంటాడు. కానీ అధికారి ఈ బ్యాగు వ్యవహారం నిజమేనా అని ప్రశ్నించడం మొదలెడతాడు. బ్యాగు తనకే దొరికిందనీ, దాన్ని ఆ బ్యాగు సొంతదారైన యువతికి అప్పజెప్పామనీ అంటాడు రహీమ్. ఆమె ఫోన్ నంబర్ ఇమ్మంటాడు అధికారి. ఆమె టాక్సీ డ్రైవర్ ఫోన్నుంచే మాట్లాడిందనీ, అందుకని ఆమె ఫోన్ నంబర్ తెలీదనీ అంటాడు  రహీమ్. ఆమె ఎవరో ముందుకొచ్చి వాంగ్మూలం ఇస్తే తప్ప రహీమ్ ఉద్యోగ దరఖాస్తుని పరిశీలించలేమని స్పష్టం చేసేస్తాడు అధికారి.

    రహీమ్ విరాళాలు సేకరించిన ఛారిటీ సంస్థకి వెళ్తే, సంస్థ నిర్వాహకురాలు రద్మెహర్ (రచయిత్రి, నటి, దర్శకురాలు ఫరిష్టే సదర్) మొత్తం రహీమ్ వ్యహారాన్ని అనుమానించి, ఆ సేకరించిన విరాళం మరణ శిక్ష పడ్డ ఓ ఖైదీ విడుదలకి బ్లడ్ మనీ గా చెల్లించేశామని చెప్పేస్తుంది. ఇక్కడ రహీమ్ ఇంకో ఫోజు కొడతాడు- ఆ సభలో కొడుకు చేత తను అలా మాట్లాడించింది నిజానికి ఆ ఖైదీ కోసం అలా విరాళాలు వసూలవ్వాలనే అంటూ - మళ్ళీ ఈ క్రెడిట్ కూడా కొట్టేసి మరింత హీరోనై పోవాలనుకుంటాడు.

    అయితే తను కడుతున్న అబద్ధాల మేడ కూలిపోతోందని కూడా గమనించకుండా, ఇంకో పథకం వేస్తాడు. బ్యాగు సొంతదారు ఈమేనంటూ తన గర్ల్ ఫ్రెండ్ ని తీసికెళ్ళి అధికారికి చూపించేస్తాడు. దీంతో పూర్తిగా తన అబద్ధాల - పథకాల సాలెగూడులో తనే పీకల దాకా చిక్కుకు పోతాడు రహీమ్ సుల్తానీ ...

ఎలా వుంది కథ

లోపలి మనిషితో ఈ కథ... మనకి ఒక్కటే పరిశుభ్రమైన రంగు వుందనీ, అది తెల్లటి తెలుపు అనీ, దాని మీద ఒక్క మరక కూడా పడే ప్రసక్తే లేదనీ ఫీలవుతూ, ఎంతో నీతిగా జీవిస్తున్నామనుకుని మనతో మనం జాగ్రత్తగా వుంటూ, అవతలి వాళ్ళకి పరమ సత్యవంతుల్లా కన్పించే ప్రయత్నం చేస్తూంటాం. రోడ్డు మీద పడి నాల్గు రూపాయలు కన్పించగానే ఆ నిష్ఠా పరాయణత్వమంతా- నైష్ఠిక ప్రవృత్తి అంతా ఏమవుతుందో, ఎంత ముష్ఠిదో తేలిపోతుంది. రోడ్డు మీద రూపాయలు కన్పించగానే ఎవరైనా చూస్తున్నారా లేదా అని చూస్తాం. ఎందుకు చూస్తాం? ఎవరూ చూడకపోతే జేబులో వేసుకోవచ్చని, చూస్తే ఈ డబ్బెవరిదీ అని హీరోలా అరవ్వచ్చనీ!

    ఇదే రహీమ్ సుల్తానీ లోపలి క్యారక్టర్. అతను దొరికిన బంగారాన్ని గర్ల్ ఫ్రెండ్ చూపించగానే గబుక్కున ఏం ఫీలయ్యాడో అదే అతడి క్యారక్టరైనా, ఇంకెవరి క్యారక్టరైనా. ఆ దొరికిన బంగారం అమ్ముకుని అప్పుల్లోంచి బయట పడొచ్చని ఫీలవ్వడం ఫీలవ్వడం  అబద్ధాల మీద అబద్ధాలు చెప్పించి పతనం అంచుకి చేర్చింది. అదే తగినంత బంగారం దొరికి వుంటే నిస్సందేహంగా అది అమ్ముకుని అప్పుల్లోంచి బయటపడే వాడు. తగినంత బంగారం దొరక్కపోయేసరికి - నిజాయితీ పరుడన్పించుకుంటూ ఇంకో విధంగా లాభపడాలన్న దుర్బుద్ధితో నాటకాన్ని రచించి హీరో అయ్యాడు.

    ఇక్కడ్నించే దేన్ని ఆధారంగా చేసుకుని పథకం ప్రకారం హీరో అన్పించుకున్నాడో ఆ బంగారం సొంతదారు దగ్గరికే వచ్చి ఆగుతుంది పరిస్థితి. ఆమెని వెతికి తీసుకొస్తే అంతా బాగానే  జరిగేది. అయితే ఖర్మ కొద్దీ ఏం జరిగిందంటే, పోస్టర్ల మీద ఫోన్ నంబర్ చూసి, టాక్సీ అతడి ఫోన్ తీసుకుని రహీమ్ అక్కకి ఫోన్ చేసి వచ్చి కలిసిన నాజ్నిన్, తన బాధంతా చెప్పుకుంటుంది. భర్త పని చేయడు. తనే తివాచీలు కుట్టి కూడబెట్టిన డబ్బుతో కొనుక్కున్న బంగారమది. అది దొరికినందుకు సంతోషంగా వుందని చెప్పి బ్యాగు తీసుకుని వెళ్ళిపోతుంది. రహీమ్ అక్క ఆమె వివరాలేమీ తీసుకోలేదు. అదీ సంగతి.

    ఇక ఆమె దొరక్కపోవడంతో తన గర్ల్ ఫ్రెండ్ నే ఆ యువతిగా ప్రవేశపెట్టి పతనానికి శరవేగంగా బాట వేసుకున్నాడు...ఈ క్రమంలో ఇంకో తప్పుకి పాల్పడతాడు. అప్పిచ్చిన బహ్రామ్ తోనే ఘర్షణ పెట్టుకుని కొడతాడు. అది వీడియో తీసేస్తుంది బహ్రామ్ కూతురు ఫాతిమా. ఆ వీడియో సోషల్ మీడియాలో పెట్టేసిందంటే తనకొచ్చిన మంచి పేరంతా పోతుంది!

    చివరికెలా ముగిసింది? రహీమ్ కథ సుఖాంతమా, దుఖాంతమా? అప్పు తీర్చాడా? పెరోల్ గడువులోగా ఏం జరిగింది? తిరిగి జైలుకేనా, ఇంటికా? సింపుల్ కథ. ఇంత కథలా అన్పించని సింపుల్ కథ ఇలా తీస్తే తెలుగులో బావుంటుందా? కానీ నిజజీవితం ఇలాగే వుంటుంది. దీంట్లో కామెడీ గానూ తీయొచ్చు. తీస్తే కొత్తదనమేం వుండదు. ఈ తరహా కథా కథనాలని, మేకింగ్ నీ తెలుగులో చూస్తారా, తిప్పికొడతారా చెప్పడం కష్టం. సాహసించి ఎవరైనా ఇలాటి ప్రయత్నం చేస్తే తెలుగు సినిమా క్వాలిటీ మరో మలుపు తిరుగుతుంది. ఈ అమెజాన్ విడుదల ప్రస్తుతం అమెరికాలో  స్ట్రీమింగ్ అవుతోంది. ఇండియాలో  స్ట్రీమింగ్ అయినప్పుడు డబ్బింగ్ చేస్తే తెలుగు ప్రేక్షకుల స్పందనేమిటో తెలుస్తుంది.

నటనలు సాంకేతికాలు

రహీమ్ సుల్తానీగా అమీర్ జదీదీ చాలా ఎక్సెలెంట్ గా వుంటాడు. అతడిది స్మైలింగ్ ఫేస్. మనసులో ఆలోచనలని బయటపడనివ్వని స్మైలింగ్ ఫేస్. క్యారక్టర్ కి ఈ స్మైలింగ్ ఫేస్ లక్షణం కల్పించడం అద్భుత ఆలోచనే. అందరితో ఆత్మీయంగా వుంటాడు, ఎవరి ముందూ బయటపడడు. అలాటి వాడు గర్ల్ ఫ్రెండ్ విషయంలో బయటపడాల్సిన పరిస్థితి వస్తుంది. గర్ల్ ఫ్రెండ్ ని రహస్యంగా వుంచిన తను ఆమెనే బంగారం సొంతదారుగా అబద్ధపు నాటకంలో ముందుకు తీసుకురావాల్సిన పరిస్థితి ఎదురవుతుంది.

    గర్ల్ ఫ్రెండ్ గా సహర్ గుల్దస్త్ కూడా నీటుగా కన్పిస్తుంది. రోమాన్స్ వుండదు. రోమాన్స్ కి చోటులేదు. హీరో సమస్యతో సతమతమయ్యే పాత్రగా వుంటుంది. ఇంకో చెప్పుకోదగ్గ నటుడు బహ్రామ్ గా నటించిన మోహ్సేన్ తనబందే. కూతురి కట్నం కోసం దాచుకున్న డబ్బు తీసుకుని చెలగాట మాడుతున్న హీరోని జైలుకి పంపడం మినహా ఇంకేం ఆలోచించని, గొడవపడని హూందాతనం గుర్తుండి పోయేలా నటించాడు. ఇక ఛారిటీ సంస్థ నిర్వహకురాలిగా సీనియర్ నటి ఫరిష్టే సదర్ ది కూడా గుర్తుండిపోయే నటన. అందరి నటనలూ అంతర్జాతీయ ప్రమాణాలతో కూడిన నటనలే. ఈ స్కిల్స్ వేరు. తెలుగులో తీయాలంటే ఈ స్థాయి స్కిల్స్ కూడా అవసరం.

    విజువల్స్ ఎక్కువగా అద్దాల గదుల్లో ఆఫీసుల్లో ఇళ్ళల్లో షాపుల్లో పారదర్శకంగా చాలా ప్లెజంట్ గా వుంటాయి. ఈ అద్దాల బ్యాక్ డ్రాప్ సింబాలిజం కావచ్చేమో. ఒక అబద్ధాల ప్రహసనం నడుస్తున్న నేపథ్యంలో, మనుషులనే వాళ్ళు అద్దాల్లా పారదర్శకంగా వుడాలని గుర్తు చేయాలనేమో. ప్రారంభంలో హీరో జైల్నుంచీ ఇంటికొస్తూ మధ్యలో బావగారు పనిచేస్తున్న కొండపైకి ఎక్కుతాడు. ఇది కూడా సింబాలిజమే కావచ్చు. అబద్ధాల మెట్లు కట్టుకుని పైకి ఎక్కేయ బోతాడనీ...

    ఇంకోటేమిటంటే బ్యాక్ గ్రౌండ్ స్కోరు వుండదు. ఓ రెండు మూడు డిమాండ్ చేసిన దృశ్యాల్లో మంద్రంగా తప్ప ఎక్కడా సంగీతమే వుండదు. తెలుగులో మేకర్స్ ఈ ఛాలెంజిని స్వీకరించే ధైర్యం చేస్తారా?

చివరికేమిటి

హీరో పాత్రది పూర్తిగా జైల్లోంచి బయటపడాలన్న స్వార్ధమే అనలేం. ఒక విధంగా బహ్రామ్ కి తోడ్పడాలనే. బంధువైన బహ్రామ్ కూతురి కట్నం డబ్బులు తను వాడేశాడు. అది తిరిగిచ్చేసి పెళ్ళి జరిగేలా చూసే నైతిక బాధ్యత ఫీలవ్వకుండా లేడు. అందుకు వేసింది మాత్రం తప్పటడుగులే. అయితే ఒక లాజిక్ ఈ కథ మొత్తాన్నీ సిల్లీ అన్పించేలా చేసేస్తుంది. హీరో ఆ బంగారాన్ని అమ్మాలని చూసి, సరిపోక రెండో ఆలోచనగా పోలీసులకి అప్పగించేస్తే ఈ గొడవంతా వుండదు. న్యాయ మార్గంలో అన్ని రివార్డులూ, విరాళాలూ పొందేవాడు. కథని  ఇలా చేస్తే కథ వుండదని దర్శకుడు ఇలా లాజిక్ ని బలి పెట్టుండొచ్చు.

    ఈ కథలో విడివిడిగా ప్రధాన పాత్రప్రత్యర్ధి పాత్రలనే సూత్రాన్ని కూడా పక్కన పెట్టాడు దర్శకుడు. ఈ కథ రహీమ్ కీ, బహ్రామ్ కీ మధ్య నడిచే కథ. అయినా బహ్రామ్ ప్రత్యర్థి కాడు. అతను మంచి వాడే. రహీమే హీరోనై పోవాలనుకుని విలనై పోయాడు. తన చర్యలతో తానే హీరో, తానే విలనైనప్పుడు ఇంకా వేరే విలనెందుకు కథకి? మన శత్రువులం మనమే, బయట శత్రువులెవరూ లేరు. ఇది లోపలి మనిషి కథ. మన లోపలి మనిషితో మనం జాగ్రత్తగా వుండకపోతే మంగళగిరి జాతరవుతుంది బతుకు.

    దర్శకుడు అస్ఘర్ ఫర్హదీ 2011 లో ఏ సపరేషన్’, 2016 లో ది సేల్స్ మాన్ తీసి రెండిటికీ ఆస్కార్ అవార్డులు పొందాడు. ఇప్పుడు ఏ హీరో వివిధ  అంతర్జాతీయ చిత్రోత్సవాల్లో 24 ఉత్తమ చలన చిత్ర అవార్డులు పొందింది. అంతేగాక  2021 ఆస్కార్ అవార్డులకి ఇరాన్ నుంచి ఎంట్రీగా వెళ్ళింది...

—సికిందర్


Saturday, January 22, 2022

1121 : బుక్ రివ్యూ!

 

 

        థ రాయడానికి ముందు కథ కోసం అనుకున్న ఐడియా (ప్రారంభ ఆలోచన) ని విశ్లేషించుకోవడం ఎంత ముఖ్యమో చాలా సార్లు చెప్పుకున్నాం. స్క్రీన్ ప్లే పుస్తకాల్లో, స్క్రీన్ ప్లే వెబ్సైట్స్ లో ఎక్కడా స్క్రీన్ ప్లే నేర్చుకోవడం ఐడియా నిర్మాణంతో మొదలు పెట్టుకుని నేర్చుకోవాలని  చెప్పలేదు. ఎందుకో తెలీదు. నేరుగా త్రీయాక్ట్ స్ట్రక్చర్, సీన్ రైటింగ్, క్యారక్టర్ రైటింగ్ వంటి అధ్యాయాలే  పుస్తకాల్లో వుంటున్నాయి. ఒక కథ చేసుకోవాలంటే నేరుగా ఫస్ట్ యాక్ట్, సెకండ్ యాక్ట్, థర్డ్ యాక్ట్ లలో కథని విభజించుకుని స్ట్రక్చర్ లో రాసుకు పోవాలనే పుస్తకాలు చెప్తాయి. మన దగ్గర వన్ లైన్ ఆర్డర్ తో ప్రారంభిస్తారు. రెండూ తప్పే. దేని గురించి రాస్తున్నామో దాని మినీ రూపం లేకుండా యాక్ట్స్ రూపంలోనో, వన్ లైన్ ఆర్డర్ రూపంలోనో నేరుగా కథా విస్తరణ చేయడం వల్లే తలపెట్టిన కాన్సెప్ట్ ఒకటైతే రాసి తీస్తున్న సినిమాలు ఇంకోటై ఫ్లాపవుతున్నాయి. ఇది గమనించే కథని నేరుగా యాక్ట్స్ గానో, వన్ లైన్ ఆర్డర్ గానో రాయడం దగ్గర్నుంచి కాకుండా, అసలా కథ పుట్టడానికి మూల కారణమైన ఐడియా (కాన్సెప్ట్) దగ్గర్నుంచే నిర్మాణాత్మకంగా రాయడం మొదలవ్వాలని గమనించి, ఎనిమిదేళ్ళ క్రితం తెలుగు సినిమాలకి పనికొచ్చే స్క్రీన్ ప్లే స్ట్రక్చర్ వ్యాసాలు రాస్తూ పోయాం. ఇలా ఐడియా నిర్మాణం తర్వాత వెంటనే వన్ లైన్ ఆర్డర్ వేసుకోవడం కూడా కాకుండా, ఈ రెండిటి నడుమ సినాప్సిస్ రాసు కోవాలని కూడా చెప్పుకున్నాం.

        ప్పుడు స్క్రీన్ ప్లే స్ట్రక్చర్ కి అధ్యాయాల క్రమం ఇలా ఏర్పడింది : ఐడియా సినాప్సిస్ వన్ లైన్ ఆర్డర్ ట్రీట్ మెంట్ డైలాగ్ వెర్షన్. ఇలా ముందుగా ఐడియాని త్రీ యాక్ట్స్ ప్రకారం నిర్మించుకుంటే దాన్ని విస్తరించి అదే త్రీయాక్ట్స్ లో కథని సినాప్సిస్ గా రాసుకుంటే, ఆ సినాప్సిస్ ఆధారంగా త్రీ యాక్ట్స్ లో వన్ లైన్ ఆర్డర్, ట్రీట్ మెంట్ వగైరా పక్కాగా వచ్చేస్తాయి.

        రాస్తున్న కథ స్క్రీన్ ప్లే డీఎన్ఏ అంతా ఐడియాలోనే వుంటుంది స్ట్రక్చర్ రూపంలో. ప్రారంభ ఆలోచన (ఐడియా) ఏ ఏ అంశాలతో కూడి వుంటే అది పటిష్ట కథకి దారితీస్తుందో కూడా మొదటి అధ్యాయంలో వివరించాం. ఈ వ్యాసం కింద లింకుల్ని క్లిక్ చేసి ప్రధాన వ్యాసాన్ని, అనుబంధ వ్యాసాల్నీ చూడొచ్చు. కథకి ఐడియా అనే పునాది నిర్మాణం లేకుండా ఎన్ని స్క్రీన్ ప్లే పుస్తకాలు చదివీ, చదకుండా కథ రాసినా అది వేస్టే.

        ఈ పూర్వరంగంలో గత నెల గుడ్ రీడ్స్ వెబ్సైట్ చూస్తూంటే, ఒక పుస్తకం మీద దృష్టి పడింది. ఆ పేరు తో అలాటి పుస్తకం ఇంత వరకూ మన దృష్టికి రాలేదు. ఇదే మొదటిది. ఆ పుస్తకం పేరు  ది ఐడియా - మన బాపతే!

కథకి ఐడియా నిర్మాణం ఆవశ్యకత గురించి ఇంగ్లీషులో ఒక్క పుస్తకమూ రాలేదు, వ్యాసమూ రాలేదు - స్క్రీన్ ప్లే పుస్తకాలకీ, వెబ్సైట్ వ్యాసాలకీ ఏకైక ప్రాప్తి స్థానమైన హాలీవుడ్ నుంచీ. ఏవైనా వస్తే గిస్తే సినిమా కథకి 50 ఐడియాలు, 100 ఐడియాలూ అంటూ ఐడియాల్ని అమ్మడం గురించే వచ్చాయి, వస్తున్నాయి తప్ప- అసలా ఐడియా నిర్మాణం గురించి కాదు. ఈ నేపథ్యంలో ఇలా ఐడియా నిర్మాణం గురించి ఒక పుస్తకం రావడం అపురూప సన్నివేశమే. ఈయనెవరో మనలాగే ఆలోచించాడు. 2018 లో ఈ పుస్తకం రాశాడు.

        ఎరిక్ బోర్క్ రచయిత, నిర్మాత. ఎమ్మీ, గోల్డెన్ గ్లోబ్ అవార్డుల విజేత. స్క్రీన్ రైటింగ్ ప్రొఫెసరే కాకుండా కోచ్ కూడా. ఈ అనుభవం ఆయన్నో ప్రాథమిక ఆలోచనకి దారితీయించింది... కథల్ని ఓ ఐడియాతోనే రాస్తారు కదా, మరి అక్కడ్నించే స్క్రీన్ ప్లే స్ట్రక్చర్ అనేది మొదలవాలి కదాని. కథా రచనా ప్రక్రియలో మొట్టమొదటి దశ అయిన ఐడియా నిర్మాణమే సినిమా విజయావకాశాలకి కీలకం కదాని. ఈ అవగాహనే ఈ పుస్తకం రాయడానికి పురిగొల్పింది తనని.  

అరవైకి 60 శాతమూ  సినిమా విజయావకాశాలు కథకి విత్తిన ఐడియా పటిష్టతతో సాధ్యమవుతుందనీ, మిగతా 30 శాతం స్క్రీన్ ప్లే స్ట్రక్చర్ తో తీసుకునే సృజనాత్మక స్వేచ్ఛ, అలాగే ఓ 10 శాతం రాత శైలీ సమకూరుస్తాయనీ చెప్తాడు. ఈ దృష్టితోనే పుస్తకం రాశాడు.   

సినిమాల గురించి వింటూంటాం- అబ్బ భలే టెక్నిక్ రా, వామ్మో భలే స్క్రీన్ ప్లే ఇచ్చాడురా నాయనో, మైండ్ బ్లోయింగ్  - అని జబ్బలు చరుచుకోవడం. తీరా చూస్తే అటక మీద అట్టర్ ఫ్లాప్. ఎందుకు అట్టర్ ఫ్లాప్? సారం లేక. కథకి ఐడియా అయితే వుంటుంది, దాని వ్యూహాత్మక పరిపాలన లేక. రాసే టెక్నిక్కులూ, స్క్రీన్ ప్లే స్టయిలింగులూ అన్నం పెట్టే ఐడియా ప్రాముఖ్యాన్ని గుర్తించక. స్క్రీన్ ప్లే అంటే ఏమిటో కడుపు చించుకున్నా తెలియనట్టే, నోటికి అన్నం పెట్టే ఐడియా అంటే ఏమిటో కూడా ప్రమాణ పూర్వకంగా తెలియక. నిర్మాణాత్మక ఐడియా మాత్రమే అన్నం పెడుతుంది, ఇంకేదీ కాదు.

        ఈ పుస్తకం ఐడియా అంతర్నిర్మాణాన్ని చర్చిస్తుంది. హాలీవుడ్ సామ్రాజ్యం అంతర్జాతీయం. మాస్ కమర్షియల్ సినిమాలు హాలీవుడ్ ప్రధాన వ్యాపారం. అలాటి వ్యాపారాత్మక సినిమా కథల్ని దృష్టిలో పెట్టుకుని ఈ పుస్తకం వుంటుంది. హాలీవుడ్ లో ప్రొఫెషనల్ రచయితలకి ఐడియా ప్రాముఖ్యం గురించి తెలుసు. నెలలూ  సంవత్సరాలూ స్క్రిప్టు రాస్తూ గడుపుతున్నప్పుడు, సమయాన్నీ కష్టాన్నీ వ్యయం చేస్తున్నప్పుడు, దాని మూలం లో ఐడియా అనే సెల్ ఫోన్ టవర్ ప్రసారం సవ్యంగా లేకపోతే, పౌనః పున్యం మ్యాచ్ కాకపోతే, రాసిందంతా వృధా అయిపోతుందని తెలుసు.

        ఐతే ఐడియా గురించి ఇంకేం తెలుసుకోవాలి? రాముడు సీత కోసం లంక కెళ్ళి ఠపీమని రావణుణ్ణి సంహరించాడు. ఇలా కథకి ఇది ఐడియా అనుకుంటే, దీంట్లో సినిమా పరంగా ఏ ఎలిమెంట్లు (మూల తత్వాలు) చూడాలి? ఏక్తా కపూర్ జోధా అక్బర్ సీరియల్ తీస్తున్నప్పుడు ఒక ఎపిసోడ్ కి రచయితని పిలిచి- చూడూ ఇలా చెయ్, జోధా బాయిని భూతం ఎత్తుకెళ్ళింది. అప్పుడు అక్బర్ వెళ్ళి ఆ భూతంతో పోరాటం చేసి జోధా బాయిని విడిపించుకుని గుర్రమెక్కించుకుని వచ్చాడని ఎపిసోడ్ రాయ్ అంది.       

అప్పుడా సీనియర్ రచయిత, చరిత్రలో అలా జరిగిందని ఏ మూర్ఖుడూ రాయలేదు, మేడమ్. మనం అలా తీస్తే జనాలు చెప్పులతో కొడతారు మేడమ్ అన్నాడు. అయినా అలాగే తీయించింది ఏక్తా. జోధా అక్బర్ అన్నిఎపిసోడ్ల కంటే దీనికే ఎక్కువ టీఆర్పీ వచ్చింది!    

        ఈ వికృత ఐడియాలో ఏక్తా కపూర్ చూసిన ఎలిమెంట్స్ ఏమిటి? హాలీవుడ్ నిర్మాతలూ అమెరికన్ ప్రేక్షకులూ సినిమాలు  ఎమోషనల్ ఎంటర్టయినర్ లుగా వుండాలని కోరుకుంటారు, ఇంటలెక్చువల్ సినిమాలు కాదు. అయినా తీస్తున్న చాలా ఎమోషనల్ ఎంటర్టయినర్లు అమెరికన్ ప్రేక్షకులకి నచ్చడం లేదు. వాటి ఐడియాల్లో ఎలిమెంట్లు మిస్సవడమే కారణమని రచయిత చెప్తాడు. ఈ ఎలిమెంట్స్ ఏమిటో ది ఐడియా -సెవెన్ ఎలిమెంట్స్ ఆఫ్ వయబుల్ స్టోరీ అన్న ఈ పుస్తకం లో వివరించాడు.

        ఈ సెవెన్ ఎలిమెంట్స్ (అంటే పంచ భూతాలో ఐదు తత్వాల్లాగా) ఐడియాలో కేంద్రకంగా వుండే ప్రాబ్లం తో ముడిపడి వుంటాయి. కథంటే పాత్రల మధ్య పుట్టే ప్రాబ్లం ని పరిష్కరించే టూల్ కాబట్టి- ఆ  ప్రాబ్లమే కథకి కేంద్రకంగా వుంటుంది కాబట్టి- ఐడియాకి  పర్యాయపదం ప్రాబ్లమే. స్థూలంగా ప్రాబ్లంని ఐడియాగా చూస్తామన్న మాట. అందుకని ప్రాబ్లంతో ఎలిమెంట్లు కలిస్తే కథకి బలం వస్తుందన్న మాట. ఆ ఎలిమెంట్స్ ఎలా పని చేస్తాయన్నది పుస్తకంలో ఇచ్చాడు.  

        స్క్రీన్ రైటింగ్ పుస్తకాలు తీసుకున్న ఐడియాకి స్టోరీ డెవలప్ మెంట్ ఎలా చేసుకోవాలో పాఠాలు చెప్తాయే తప్ప, అసలా తీసుకున్న ఐడియాని ఎలా నిర్మించుకోవాలో చెప్పడం లేదు గనుక, పుస్తక రచయిత ఈ లోటుని పూడ్చాడు. 

        అందరూ చేసే పని ఐడియాని కథగా విస్తరించే జోలికి అస్సలు పోకుండా, ప్రాథమికంగా ఎలిమెంట్స్ తో ఐడియాని నిర్మించుకోవడం గురించే పుస్తకం రాశాడు. ఐడియాలో ఆ ఏడు ఎలిమెంట్స్ ఇవీ - punishing, relatable, original, believable, life-altering, entertaining, meaningful అని సూత్రీకరించాడు.       

వీటిని ఒక్కో అధ్యాయంగా వివరించాడు. ఇవి అర్ధమవడానికి ప్రసిద్ధ సినిమాలని ఉదాహరణగా పేర్కొన్నాడు. ఈ ఎలిమెంట్స్ వున్న సినిమాలెలా వున్నాయి, లేనివెలా వున్నాయీ కళ్ళ ముందుంచాడు. జానర్ స్పెషలిజం కోరుకునే వాళ్ళకి వివిధ జానర్లలో ఈ ఎలిమెంట్స్ వినిమయం ఎలా జరుగుతుందో కూడా చెప్పాడు.

సాధారణంగా - ఇది కాదులేమ్మా, ఇంకో ఐడియాతో రమ్మనే పరిస్థితి ఎదురవుతుంది. ఇలా అనే ముందు ఐడియాతో ముడిపడి వుండే ఐదు ప్రశ్నల్ని గమనం లోకి తీసుకోవాలంటాడు - 1. ఐడియా ఏ పాత్ర కథతో వుంది, ఆ పాత్రతో మనమెందుకు ఐడెంటీఫై అవ్వాలి? 2. ఆ పాత్ర పరిస్థితులతో, ఇతరులతో సంబంధాలతో జీవితంలో ఏం పొందాలని కోరుకుంటోంది? 3. అది పొందడానికి ఎదురవుతున్నఆటంకా లేమిటి? 4. వాటినెలా అధిగమించా లనుకుంటోంది? 5. తాను పొందాలనుకుంటున్నది పొంది తీరాల్సిన అవసరాన్ని పాత్ర ఎందుకు ఫీలవుతోంది, అది మనమెందుకు ఫీలవ్వాలి?

        ఒక ఐడియాతో కథ రాయడానికి కూర్చునే ముందు, క్షుణ్ణంగా ఆ ఐడియాని అధ్యయనం చేసుకోవాలంటాడు. ఏడు ఎలిమెంట్స్ తో రూపొందిన ఐడియాని మూడు వాక్యాల లాగ్ లైన్లో కూర్చాలంటాడు. ఈ లాగ్ లైన్లో పాత్రెవరు, ప్రత్యర్థి ఎవరు, కాన్ఫ్లిక్ట్ ఏమిటనేవి కనబడాలంటాడు. కొన్ని టిప్స్ కూడా ఇచ్చాడు : చాలా కథలు ప్రాబ్లం (ఐడియా) సరీగ్గా లేక పట్టు సడలి పోతాయని, భారీ కథలకంటే సింపుల్ గా వుండే కథలే ఎక్కువ ఆకట్టుకుంటాయనీ, నిర్మాతలూ ప్రేక్షకులూ కొత్తదనాన్ని కోరుకోరనీ-రచయితలే, విమర్శకులే కొత్తదనాన్ని కోరుకుంటారనీ... ఇలా కొన్ని టిప్స్ ఇచ్చాడు.

        ఇలాటి పుస్తకం ఇదే మొదటిది గనుక సినిమా రచనని సీరియస్ గా తీసుకునే, ఎప్పటి కప్పుడు అప్డేట్ అవ్వాలనుకునే శ్రద్ధాసక్తులున్న వాళ్ళకి వెల కట్టలేని ఆస్తి. అమెజాన్లో అమ్మకానికుంది. లేదంటే పీడీఎఫ్ డౌన్లోడ్ వుంది.

—సికిందర్   

Friday, January 21, 2022

1120 : రివ్యూ!



దర్శకత్వం : రామ్ రమేష్ శర్మ
తారాగణం : సంజయ్ మిశ్రా, విజయ్ రాజ్, అశ్వినీ కల్సేకర్, మాధురీ భాటియా, అమోల్
పరాశర్
, బర్ఖా సింగ్
కథ : సుభాష్ ఘాయ్, కథనం : ముక్తా స్టోరీ ల్యాబ్, మాటలు : శరద్ త్రిపాఠీ, సంగీతం : సుభాష్ ఘాయ్, ఛాయాగ్రహణం : అఖిలేష్  శ్రీవాస్తవ  
బ్యానర్ : ముక్తా ఆర్ట్స్ , జీ స్టూడియోస్
విడుదల : జనవరి 21, 2022 - జీ5
***

        కప్పటి షోమాన్ సుభాష్ ఘాయ్ ముక్తా ఆర్ట్స్ సంస్థ ద్వారా కొంత కాలంగా కొత్త దర్శకులకి సినిమాలు చేసే అవకాశం కల్పిస్తున్నారు. ముకుల్ ఎస్ ఆనంద్ 'త్రిమూర్తి' నుంచీ రామ్ రమేష్ శర్మ '36 ఫామ్‌హౌస్' వరకూ ముక్తా ఆర్ట్స్ జర్నీ మామూలైనది కాదు. రాజ్ కపూర్ తర్వాత సెకండ్ షోమాన్ గా పేరుబడ్డ సుభాష్ ఘాయ్ ఇక దర్శక
త్వానికి దూరమై ఎనిమిదేళ్ళు దాటింది. సంజయ్ లీలా న్సాలీ ఇప్పుడు కొత్త షోమాన్. అయితే గత కొన్నేళ్లుగా సుభాష్ ఘాయ్ తన సూపర్ హిట్టయిన సినిమాలన్నిటికీ సీక్వెల్స్ తీయడం గురించి ఆలోచిస్తున్నారు. దీన్ని అభిమానులు వ్యతిరేకించడంతో 1983 లో తన సూపర్ హిట్ హీరో నే నిఖిల్ అద్వానీ దర్శకత్వంలో రీమేక్ చేశారు. అది ఫ్లాపయ్యింది. ఇప్పుడు ఫ్రెష్ గా 36 ఫామ్ హౌస్  తీశారు. ఇది మరీ ముక్తా ఆర్ట్స్ పేరు చెడగొట్టేలా తయారయ్యింది.

        దెలా వుందంటే- అనగనగా దేశవ్యాప్తంగా కరోనా విస్తరిస్తున్న కాలం. లాక్ ఔన్ తో  అందరూ వూళ్ళకి పరుగులు తీస్తున్నారు. దారిలో దొరికిన ఒక వంట వాడ్ని వెంటబెట్టుకొస్తాడు ఒకడు ముంబాయి శివారు లోని 36 ఫామ్ హౌస్ కి. ఇతను ఆ ఫామ్ హౌస్ యజమానురాలి చిన్న కొడుకు. ఎప్పుడో కుటుంబానికి దూరమయ్యాడు. ఇప్పుడు యజమానురాలు ఇవ్వాళో రేపో అన్నట్టుంటుంది. మూడొందల ఎకరాల ఫామ్ హౌస్ ఆస్తిని పెద్ద కొడుక్కి వీలునామా రాసేసింది. దీంతో చిన్న కొడుకు, కూతురు ఆ ఆస్తిని కొట్టేయాలని చూస్తారు. ఇంతలో ఓ హత్య జరగడంతో ఫామ్ హౌస్ లో కలకలం రేగుతుంది. చంపి బావిలో పడేశారు. ఎవరు చంపారు? ఎవర్ని చంపారు? ఈ పాయింటుతో కథ ఎక్కడెసిన గొంగళిలా అక్కడక్కడే తిరుగుతూంటుంది. ముందుకు పోదు, మనల్ని వదిలి పెట్టనూ వదిలి పెట్టదు.

        దీన్ని క్రైమ్ కామెడీ కథ చేద్దామనుకున్నారు. సుభాష్ ఘాయ్ తీసిన 1990 నాటి కామెడీలతో ప్రయోగం చేశారు. సొంత కథతో సినిమా తీశారు. కథ కోసం ముక్తా స్టోరీ ల్యాబ్ అని పేరు పెట్టి ఆ లాబ్ లో ప్రయోగాలు చేశారు. ప్రసిద్ధ విజిలింగ్ వుడ్స్ ఇంటర్నేషనల్ ఫిలిమ్ స్కూల్ వ్యవస్థాపకుడుగా తనే ఇలాటి ప్రయోగాలు చేస్తే, ఫిలిమ్ స్కూల్ విద్యార్ధుల పరిస్థితేంటో పాపం!

        లాబ్ లో కెమిస్ట్రీ ఫెయిలైంది. ఫార్ములా ఫ్లాపయ్యింది. జీరో సస్పెన్స్, జీరో థ్రిల్. దీనికి కరోనా లాక్ డౌన్ పరిస్థితులతో సంబంధమే లేదు. ప్రారంభంలో న్యూస్ క్లిప్పింగ్స్ చూపించి వదిలేశారు. కరోనా లాక్ డౌన్ నేపథ్యంలో కథ జరుగుతున్నట్టు ఎక్కడా వుండదు. అసలు ఫామ్ హౌస్ లో ఎవ్వరూ కరోనా ఫీలవ్వరు, జాగ్రత్తలు పాటిస్తూ కూడా కన్పించరు. హత్య పరిశోధించడానికి వచ్చే పోలీసులతో ఏం పరిశోధనో అర్ధం గాదు.

        ఓ సాంగ్ లో ఆర్టిస్టు లిప్ సింక్ కూడా చూసుకోలేని లాబొరేటరీ ప్రయోగంలో  1990 ల నాటి ప్రాచీన కామెడీకి నవ్వేరాదు. నాటు కామెడీ, అందులోనూ లౌడ్ కామెడీ ఓ భయానక అనుభవాన్నిస్తాయి. 77 వసంతాల ఘాయ్ సాబ్ ఇంకా స్టోరీ లాబ్ తో ఇలా పగదీర్చుకోవడం బాగా లేదు. ఆ లాబ్ లో మనకి అవకాశమిచ్చినా స్కైలాబ్ మాత్రం తయారు చేయం.

        దర్శకుడిగా వున్నప్పుడు సుభాష్ ఘాయ్ సినిమాలు సూపర్ హిట్ పాటలతో సూపర్ మ్యూజికల్స్. ఇప్పుడు లాబ్ కి  మ్యూజిక్ కూడా జోడించి సంగీత దర్శకుడిగానూ ప్రయోగం చేశారు. పాటలు కూడా తానే రాసుకున్నారు. వాటిని పాడకుండా మాత్రం బతికించారు.

        ఇక రామ్ రమేష్ శర్మ దర్శకత్వ ప్రతిభ చెప్పక్కర్లేదు. ఘాయ్ సాబ్ కొత్త దర్శకులకి ఇలాటి అవకాశాలిస్తే, అకాల వృద్ధాప్యంతో వాళ్ళూ ఘాయ్ సరసన చేరతారు.

—సికిందర్

Tuesday, January 18, 2022

1119 : స్క్రీన్ ప్లే టిప్స్

 

     107. కథలు గాథలై పోతున్నాయి. చూసింది కథో గాథో అర్ధంగాని వింత స్క్రీన్ ప్లేలు తయారవుతున్నాయి. కథో గాథో ఏదో ఒక్కటే తీయాలి. ముందు కథంటే ఏమిటోగాథంటే ఏమిటో తెలుసుకుంటే  కథల్నే వాటి లక్షణాలతో తీస్తారేమో. మరి గాథలు పనికిరావాఖచ్చితంగా పనికిరావు. ఒకప్పుడు పనికొచ్చేవి. ఎండ్ సస్పన్స్ తో కూడిన కథలెలా ఒకప్పుడు పనికొచ్చేవో గాథలూ పనికొచ్చేవి. వాటి కాలం తీరిపోయింది. కళలు ఏవీ పర్మనెంట్ కావు. ఒకప్పటి నటనలూ సంభాషణలూ ఇప్పుడు లేవు. కాలాన్నిబట్టి మారిపోతూ వచ్చాయి. కాలం కాదని గాథలూ  ఆగిపోయాయి. గత రెండు దశాబ్దాలుగా యాక్టివ్ – పాసివ్ పాత్రల తేడాలే తెలీకపాసివ్ పాత్రల్లో హీరోల్ని పదేపదే చూపిస్తూ తీస్తున్న కథలే అట్టర్ ఫ్లాపవుతున్నాయిఇక పాసివ్ పాత్రలే వుండే గాథల్నేం తీసి హిట్ చేస్తారు. 

          
 108.  కథ - గాథ అనే గజిబిజి నుంచి గాథని విడదీసి చూస్తేకమర్షియల్ సినిమాలకి గాథలూ ఒకప్పుడు ఎందుకు పనికొచ్చేవో తెలుస్తుంది. గాథంటే ఉదాత్త విలువల జీవన సౌందర్యం. ఆత్మికంగా మనుషులు విలువల్ని ప్రేమించేవారే. బయట ఈ విలువలు కానరాక అర్రులు చాచే వారే. ఈ ఆత్మిక దాహాన్ని తీర్చేవే గాథలు. అంతేగానీ ఒక కుటుంబ సినిమా అనోఇంకేదో మహోజ్వల చిత్రరాజమనో అర్ధంపర్ధంలేనిరుచీ పచీ లేని  కృత్రిమ అనుబంధాలుసెంటిమెంట్లు కలిపి కుట్టి చూపిస్తే  గాథలైపోవు. ఆత్మిక దాహాన్ని తీర్చవు సరికదాఆత్మల్ని కుళ్ళబొడిచి వదుల్తాయి.

          109. ఉమ్మడి కుటుంబాలు ఇప్పుడు లేకపోవచ్చు. విడిపోయి న్యూక్లియర్ కుటుంబాలై పోవచ్చు. వలసపోయి ఎన్నారై కుటుంబాలై పోవచ్చు. కానీ కుటుంబాలనేవి వున్నాయి. వాటి విలువలు
విలువల్ని మళ్ళీ ఉమ్మడి కుటుంబాల నుంచే నేర్చుకోవాలి. కొనసాగించాలి. ఉమ్మడి కుటుంబాలు నాటి జమీందారీలే కావొచ్చు. నేటి పారిశ్రామిక కుటుంబాలే కావొచ్చు. జిఎంఆర్ గ్రూపు అధినేత గ్రంథి మాధవరావు లండన్లో కుటుంబ రాజ్యాంగం రాయించుకొచ్చారు. కుటుంబంలో ఆ రాజ్యాంగమే అమలవుతోంది. కుటుంబాలు కులాంతరమతాంతర వివాహాలతో సంకరం కావొచ్చు. అయినా కలిసే వుండాలి. ఆ జంటల్ని వెళ్ళ గొడితేప్రాణాలు తీసేస్తే కుటుంబాలు పితృ దోషం బారిని పడతాయి. కుటుంబాన్ని విచ్ఛిన్నం చేసుకోవడమంటే వంశంలో ప్రవహించే డీఎన్ఏ ని విచ్ఛిన్నం చేసు కోవడమే. దీని ఫలితాల్ని పిల్లలు సహా అందరూ అనుభవిస్తూ పోతారు. కుటుంబంలో విచ్ఛిన్నమైన డీఎన్ఏ తిరిగి దాని ఐక్యత కోసం తల్లడిల్లుతూ వుంటుంది. ఇదే పితృ దోషం.   ఇలా డీఎన్ఏ విచ్ఛిన్నం కాకూడదనే విలువ ఒక్కటే ఉమ్మడి కుటుంబాలకి ఆధారం. ఈ విలువ కోసం త్యాగాలే చేయాలి తప్ప తెగనరుక్కోవడం కాదు. ‘పెదరాయుడు’ ఈ విలువల్ని ఎత్తి చూపే ఉదాత్త కుటుంబ గాథ. అయింది.

   
 110.బ్రొమాన్స్ లో నైనారోమాంటిక్ కామెడీ లోనైనా పెద్ద వయసు క్యారెక్టర్లు నీతులతో క్లాసులు పీకి యూత్ పోకడల్ని మార్చే చాదస్తాలు వుండవు.కానీ తెలుగులో ప్రతీ రోమాంటిక్ కామెడీ ఇలాగే వుంటూ ఫ్లాపవుతోంది. ఏదో మోరల్ పోలిసింగ్ చేయబోతారు దర్శకులు. అలాటిది ఇలాటి చాదస్తాలు ఏవీ లేని జానర్ స్పెసిఫిక్ కథగా హుషారు’ అనే  బ్రొమాన్స్ కొత్తఊపిరే.తల్లిదండ్రుల పాత్రలున్నా అవి కథని మేనేజ్ చేయకుండా సమస్యల్నీవాటి పరిష్కారాలనీ పిల్లలకే వదిలేస్తాయి. యూత్ వాళ్ళ జీవితాలు వాళ్ళే జీవించడం నేర్చుకునే స్వావలంబనని అలవర్చుకునేలాచేయాలన్నదే  నిజమైన బ్రొమాన్స్రోమాంటిక్  కామెడీల ఉద్దేశంఇది  కథ నేరవేర్చింది.ఇవాళ్టి యూత్ సినిమాల మార్కెట్ యాస్పెక్ట్ రోమాంటిక్స్ లేదా ఎకనమిక్స్చాలా కాలానికి  కథ ఎకనమిక్స్ తో వచ్చిరోమాంటిక్ కామెడీలతో ఖాళీ అయిన తెలుగు మార్కెట్ ని క్యాష్ చేసుకోగల్గింది.
`        


           111. సినిమా కథంటే మరేమిటో కాదు- పాత్ర (బిగినింగ్) - ఆ పాత్ర ఎదుర్కొనే సమస్య (మిడిల్)  -  ఆ పాత్ర కనుక్కునే పరిష్కారం (ఎండ్). ఇది ఒకటో తరగతి పాఠం. ఎంతటి వాళ్ళయినా ఈ బ్రాకెట్ లోకొచ్చి సినిమా కథ చేసుకోవాల్సిందే. కానీ ఒకటో తరగతి కూడా తెలియని వాళ్ళు స్క్రిప్టులు చేస్తూంటేనే సినిమా కథలు రావడం లేదు. నర్సరీ స్కూలు కతలే వస్తున్నాయి. మళ్ళీ పాత్ర (బిగినింగ్) - ఆ పాత్ర ఎదుర్కొనే సమస్య (మిడిల్)  - ఆ  పాత్ర కనుక్కునే పరిష్కారం (ఎండ్) అని పొల్లుపోకుండా అనుకోకుండా – చివర పాత్ర కనుక్కునే పరిష్కారం’ లోంచి పాత్రని తీసేసి ఒట్టి పరిష్కారమే తీసుకుని – “పాత్రఆ పాత్ర ఎదుర్కొనే సమస్యపరిష్కారం”  – అనుకుని తప్పులో కాలేస్తే కూడా సినిమా కథవదు. ఆర్ట్ సినిమా పాసివ్  వ్యవహారమవుతుంది. పరిష్కారం పాత్ర కనుక్కోకపోతే – రచయిత  కనుక్కుంటాడన్న మాట. అంటే పాత్ర చేయాల్సిన పని రచయిత చేస్తాడన్న మాట. అంటే పాత్ర సమస్యలో పడ్డ దగ్గర్నుంచీ (మిడిల్ నుంచీ) రచయితే జోక్యం చేసుకుని పాత్రని నడిపిస్తాడన్న మాట. అంటే పాసివ్ పాత్ర తయారు చేస్తాడన్న మాట. అంటే సినిమాని అట్టర్ ఫ్లాప్ చేస్తాడన్న మాట. అంటే ఎందుకు ఫ్లాపయ్యిందో తెలుసుకోకుండా ఇంకో పది ఇలాగే అట్టర్ ఫ్లాపులు చేస్తాడన్న మాట. ఇదింకో రకం నర్సరీ స్కూలు తనమన్న మాట. కాబట్టి ఖచ్చితంగా పాత్ర కనుక్కునే పరిష్కారం’ అని క్రియాత్మకంగా గుర్తు పెట్టుకోవాల్సిందే. ఇక్కడ రచయిత అనడం కూడా సరి కాదు. ఇప్పుడు-  అంటే గత రెండు దశాబ్దాలుగా రచయిత లెక్కడున్నారు. దర్శకులే రచయితలు. వాళ్ళదే చెల్లుబాటువాళ్ళవే ఫ్లాపులు. కాబట్టి ఇలాటి కతల వ్యవహారం రచయితల కాపాదించ కూడదు.


          112.  సినిమా కథంటే పైన చెప్పుకున్న బ్రాకెట్లో పొల్లుపోకుండా వుండేదే. ఇలా లేనివి ఏవీ సినిమా కథలు కావుసినిమాలన్పించుకోవు. కథతో వుంటేనే సినిమా. కాకుండా కథ వుండని గాథ సినిమా అవదుకథ వుండని ఉపోద్ఘాతం సినిమా అవదుకథ వుండని ఫ్లాష్ బ్యాక్ సినిమా అవదుకథ వుండని డాక్యుమెంటరీ సినిమా అవదుకథ వుండని ఎపిసోడ్లు సినిమా అవదుకథ వుండని ఆంథాలజీ (కథల సంపుటి) సినిమా అవదుకథ వుండని ఆర్ట్ సినిమా సినిమా అవదుకథ వుండని వరల్డ్ మూవీ సినిమా అవదుకథ వుండని ఇండీ ఫిలిం సినిమా అవదుకథ వుండని క్రౌడ్ ఫండింగ్ కళాత్మకం సినిమా అవదుకథ వుండని న్యూస్ బులెటిన్ సినిమా అవదుకథ వుండని డైరీ సినిమా అవదుకథ వుండని బయోపిక్  సినిమా అవదు. కెమెరాతో తీసిందల్లా సినిమా అవదు.
          
          113. రాజకీయ సినిమాల కెప్పుడూ యూత్ అప్పీల్మాస్ అప్పీల్అన్ని అప్పీల్సూ వుంటూ వస్తున్నాయి. రజనీకాంత్ రోబో- 2’ తో  మార్కెట్ యాస్పెక్ట్ విషయంలో ఏం పొరపాటు జరిగిందో,  అదే ఎన్టీఆర్’ బయోపిక్ మొదటి భాగంతో జరిగింది. రోబో -2’ లో ఒక ప్రేక్షకులందరూ గుర్తించాల్సిన  పర్యావరణ సమస్యని సైన్స్ ఫిక్షన్ గా చెప్పారు. దీంతో ఇది నిజం కాదేమోలేనని ప్రేక్షకులు ఫీల్ కాలేదు. సైన్స్ ఫిక్షన్ నిజం కాదు కదా. ఇదే పర్యావరణ సమస్యని రాజకీయాలతో చూపించి వుంటే ఎక్కువ రెస్పాండ్ అయ్యేవారు. కనెక్ట్ అయ్యేవారు. రాజకీయాలు పర్యావరణాన్ని - పోనీ పిచ్చుకల్ని-  ఇంత ధ్వంసం చేస్తున్నాయా అని ఫీలయ్యే వారు. చేతిలో వున్న సెల్ ఫోన్ ని చూసినప్పుడల్లా పర్యావరణ హనన రాజకీయాలే కన్పించేవిక్రోనీ కేపిటలిజంతో బాటు. ప్రేక్షకులనుభవించే సామాజిక సమస్యల్ని సైన్స్ ఫిక్షన్ గా పలాయనవాదంతో చూపరాదునిత్యజీవితంలో వాళ్ళు చూసే  రాజకీయాలతోనే ఆర్గానిక్ గాప్రాక్టికల్ గా కళ్ళకి కట్టాలి. సామాజిక సమస్యలు వేడి వేడిగా రాజకీయాలతోనే ముడిపడి వుంటాయిసైన్స్ ఫిక్షన్ తో కాదు.  

      114. మ్యాటరాఫ్ ఫ్యాక్ట్  ( unemotional, practical, sensible, realistic, unsentimental, businesslike etc)  కథనాన్ని  ఏనాడో ప్యాసాలో గురుదత్ ప్రయోగించారు విజయవంతంగా. ఫలానా ఈ సంఘటన ఈ పాత్ర జీవితంలో ఇలా జరిగిందీ- అని ఒక టీవీ జర్నలిస్టు రిపోర్టింగ్ చేస్తున్న చందంగా చూపించి కట్ చేసేస్తారు ఏ సన్నివేశానికా సన్నివేశం దత్. పాత్రల ఏడ్పులూ మెలోడ్రామాలూ నహీచల్తా. దీన్ని మ్యాటరాఫ్ ఫ్యాక్ట్’ కథనమన్నారు పండితులు. ఇది మతిపోగొట్టే కథనమే. ఇలాంటిది చాలాకాలం వరకూ మరే దర్శకుడూ ప్రయత్నించలేదు- ఇటీవల కాలంలో బర్ఫీ’ లోనే చూస్తాం. ఇవి ఫ్లాష్ బ్యాక్మల్టిపుల్ ఫ్లాష్ బ్యాకులతో కూడిన కథనాలు కావు కాబట్టి చెల్లింది. కానీ చివరంటా మల్టీ పుల్ ఫ్లాష్ బ్యాకులే రాజ్యమేలే  ‘కంచె’ లోని జోడు కథలకి చెల్లలేదు. 
 
          115. కొన్ని సినిమాలకి విజయవంతంగా  స్క్రీన్ ప్లే అనేది వుండదు. రాం చరణ్ ‘బ్రూస్ లీ’ కి  ‘ఐస్ స్క్రీమ్ ప్లే’ అని కొత్తది కనిపెట్టారు.  దీనితర్వాత లాలిపాప్ ప్లే’ రావొచ్చు. చూయింగమ్ ప్లే’ రావొచ్చు. ఆఖరికి ఇంకా కాలం ఇలాగే కలిసివస్తూ వుంటే,   ‘పాన్ మసాలా ప్లే’, ‘మాణిక్ చంద్ గుట్కా ప్లే’ లు కూడా వచ్చేస్తాయి. బిగ్ బడ్జెట్ సినిమాలకి కావలసిందల్లా అతి బీదతనంతో కూడిన తెల్ల రేషన్ కార్డు  ‘ప్లే’ మాత్రమే. సబ్సిడీ బియ్యం మాత్రమే. సబ్సిడీ బియ్యంతో బడాయిగా బిర్యానీ వంటకం  మాత్రమే. నాణ్యమైన బాస్మతీ బియ్యంతో ప్రేక్షకులకి మంచి బిర్యానీ  పెట్టలేని పేదరికంతో  వుంది టాలీవుడ్ రైటింగ్ డిపార్ట్ మెంట్. సబ్సిడీ బియ్యం మాత్రమే తెలుగు బిగ్ బడ్జెట్ సినిమాల్ని ప్రపంచంలో కెల్లా అతి పెద్ద జోకుగా స్కామ్ గా కూడా!)  పేరు ప్రఖ్యాతులు సంపాదించి పెట్టగలదు కాబట్టి ఆ రేషన్ ని వదులుకోరు. టాలీవుడ్ సలీం-  జావేద్ లైన కోన వెంకట్- గోపీ మోహన్లు ఆల్రెడీ సింగిల్ విండో స్కీము అనబడు జారుడుబల్ల స్క్రీన్ ప్లేని  కనిపెట్టారు. అది సినిమా తర్వాత సినిమాగా ఏకసూత్ర కార్యక్రమంగా అమలవుతూ  ‘పండగ చేస్కో’ తో పరాకాష్టకి చేరింది. ఈ స్కీము కింద ఏ స్టార్ అయినాఎంతటి వాడైనాఏ కథైనాకథే కాకపోయినాఅదే సింగిల్ విండో లోంచి దూకిఅదే జారుడు బల్లమీదుగా రయ్యిన జారుకుంటూ వెళ్లి బాక్సాఫీసులో పడాల్సిందే. అదంతా ఒక సెట్ చేసిన ప్రోగ్రామింగ్ఒక టెంప్లెట్ఒక ఆటోమేషన్అంతే. మీటలు నొక్కడమే పని. స్టోరీ మేకింగ్ సాఫ్ట్ వేర్ లు అంటూ వున్నాయి. ఈ సింగిల్ విండో స్కీము గురించి ప్రపంచానికి తెలిసిపోతే,  వందల కోట్ల డాలర్ల ఆ స్టోరీ మేకింగ్ సాఫ్ట్ వేర్ రంగం మొత్తంగా మూతబడి పోవాల్సిందే. 
           
సికిందర్