రివ్యూలు, సాంకేతికాలు, స్క్రీన్ ప్లే సంగతులు...

టికెట్లు దొరకడం యోగం, సినిమాలు చూడడం భోగం, రివ్యూలు రాయడం రోగం!

Saturday, January 22, 2022

1121 : బుక్ రివ్యూ!

 

 

        థ రాయడానికి ముందు కథ కోసం అనుకున్న ఐడియా (ప్రారంభ ఆలోచన) ని విశ్లేషించుకోవడం ఎంత ముఖ్యమో చాలా సార్లు చెప్పుకున్నాం. స్క్రీన్ ప్లే పుస్తకాల్లో, స్క్రీన్ ప్లే వెబ్సైట్స్ లో ఎక్కడా స్క్రీన్ ప్లే నేర్చుకోవడం ఐడియా నిర్మాణంతో మొదలు పెట్టుకుని నేర్చుకోవాలని  చెప్పలేదు. ఎందుకో తెలీదు. నేరుగా త్రీయాక్ట్ స్ట్రక్చర్, సీన్ రైటింగ్, క్యారక్టర్ రైటింగ్ వంటి అధ్యాయాలే  పుస్తకాల్లో వుంటున్నాయి. ఒక కథ చేసుకోవాలంటే నేరుగా ఫస్ట్ యాక్ట్, సెకండ్ యాక్ట్, థర్డ్ యాక్ట్ లలో కథని విభజించుకుని స్ట్రక్చర్ లో రాసుకు పోవాలనే పుస్తకాలు చెప్తాయి. మన దగ్గర వన్ లైన్ ఆర్డర్ తో ప్రారంభిస్తారు. రెండూ తప్పే. దేని గురించి రాస్తున్నామో దాని మినీ రూపం లేకుండా యాక్ట్స్ రూపంలోనో, వన్ లైన్ ఆర్డర్ రూపంలోనో నేరుగా కథా విస్తరణ చేయడం వల్లే తలపెట్టిన కాన్సెప్ట్ ఒకటైతే రాసి తీస్తున్న సినిమాలు ఇంకోటై ఫ్లాపవుతున్నాయి. ఇది గమనించే కథని నేరుగా యాక్ట్స్ గానో, వన్ లైన్ ఆర్డర్ గానో రాయడం దగ్గర్నుంచి కాకుండా, అసలా కథ పుట్టడానికి మూల కారణమైన ఐడియా (కాన్సెప్ట్) దగ్గర్నుంచే నిర్మాణాత్మకంగా రాయడం మొదలవ్వాలని గమనించి, ఎనిమిదేళ్ళ క్రితం తెలుగు సినిమాలకి పనికొచ్చే స్క్రీన్ ప్లే స్ట్రక్చర్ వ్యాసాలు రాస్తూ పోయాం. ఇలా ఐడియా నిర్మాణం తర్వాత వెంటనే వన్ లైన్ ఆర్డర్ వేసుకోవడం కూడా కాకుండా, ఈ రెండిటి నడుమ సినాప్సిస్ రాసు కోవాలని కూడా చెప్పుకున్నాం.

        ప్పుడు స్క్రీన్ ప్లే స్ట్రక్చర్ కి అధ్యాయాల క్రమం ఇలా ఏర్పడింది : ఐడియా సినాప్సిస్ వన్ లైన్ ఆర్డర్ ట్రీట్ మెంట్ డైలాగ్ వెర్షన్. ఇలా ముందుగా ఐడియాని త్రీ యాక్ట్స్ ప్రకారం నిర్మించుకుంటే దాన్ని విస్తరించి అదే త్రీయాక్ట్స్ లో కథని సినాప్సిస్ గా రాసుకుంటే, ఆ సినాప్సిస్ ఆధారంగా త్రీ యాక్ట్స్ లో వన్ లైన్ ఆర్డర్, ట్రీట్ మెంట్ వగైరా పక్కాగా వచ్చేస్తాయి.

        రాస్తున్న కథ స్క్రీన్ ప్లే డీఎన్ఏ అంతా ఐడియాలోనే వుంటుంది స్ట్రక్చర్ రూపంలో. ప్రారంభ ఆలోచన (ఐడియా) ఏ ఏ అంశాలతో కూడి వుంటే అది పటిష్ట కథకి దారితీస్తుందో కూడా మొదటి అధ్యాయంలో వివరించాం. ఈ వ్యాసం కింద లింకుల్ని క్లిక్ చేసి ప్రధాన వ్యాసాన్ని, అనుబంధ వ్యాసాల్నీ చూడొచ్చు. కథకి ఐడియా అనే పునాది నిర్మాణం లేకుండా ఎన్ని స్క్రీన్ ప్లే పుస్తకాలు చదివీ, చదకుండా కథ రాసినా అది వేస్టే.

        ఈ పూర్వరంగంలో గత నెల గుడ్ రీడ్స్ వెబ్సైట్ చూస్తూంటే, ఒక పుస్తకం మీద దృష్టి పడింది. ఆ పేరు తో అలాటి పుస్తకం ఇంత వరకూ మన దృష్టికి రాలేదు. ఇదే మొదటిది. ఆ పుస్తకం పేరు  ది ఐడియా - మన బాపతే!

కథకి ఐడియా నిర్మాణం ఆవశ్యకత గురించి ఇంగ్లీషులో ఒక్క పుస్తకమూ రాలేదు, వ్యాసమూ రాలేదు - స్క్రీన్ ప్లే పుస్తకాలకీ, వెబ్సైట్ వ్యాసాలకీ ఏకైక ప్రాప్తి స్థానమైన హాలీవుడ్ నుంచీ. ఏవైనా వస్తే గిస్తే సినిమా కథకి 50 ఐడియాలు, 100 ఐడియాలూ అంటూ ఐడియాల్ని అమ్మడం గురించే వచ్చాయి, వస్తున్నాయి తప్ప- అసలా ఐడియా నిర్మాణం గురించి కాదు. ఈ నేపథ్యంలో ఇలా ఐడియా నిర్మాణం గురించి ఒక పుస్తకం రావడం అపురూప సన్నివేశమే. ఈయనెవరో మనలాగే ఆలోచించాడు. 2018 లో ఈ పుస్తకం రాశాడు.

        ఎరిక్ బోర్క్ రచయిత, నిర్మాత. ఎమ్మీ, గోల్డెన్ గ్లోబ్ అవార్డుల విజేత. స్క్రీన్ రైటింగ్ ప్రొఫెసరే కాకుండా కోచ్ కూడా. ఈ అనుభవం ఆయన్నో ప్రాథమిక ఆలోచనకి దారితీయించింది... కథల్ని ఓ ఐడియాతోనే రాస్తారు కదా, మరి అక్కడ్నించే స్క్రీన్ ప్లే స్ట్రక్చర్ అనేది మొదలవాలి కదాని. కథా రచనా ప్రక్రియలో మొట్టమొదటి దశ అయిన ఐడియా నిర్మాణమే సినిమా విజయావకాశాలకి కీలకం కదాని. ఈ అవగాహనే ఈ పుస్తకం రాయడానికి పురిగొల్పింది తనని.  

అరవైకి 60 శాతమూ  సినిమా విజయావకాశాలు కథకి విత్తిన ఐడియా పటిష్టతతో సాధ్యమవుతుందనీ, మిగతా 30 శాతం స్క్రీన్ ప్లే స్ట్రక్చర్ తో తీసుకునే సృజనాత్మక స్వేచ్ఛ, అలాగే ఓ 10 శాతం రాత శైలీ సమకూరుస్తాయనీ చెప్తాడు. ఈ దృష్టితోనే పుస్తకం రాశాడు.   

సినిమాల గురించి వింటూంటాం- అబ్బ భలే టెక్నిక్ రా, వామ్మో భలే స్క్రీన్ ప్లే ఇచ్చాడురా నాయనో, మైండ్ బ్లోయింగ్  - అని జబ్బలు చరుచుకోవడం. తీరా చూస్తే అటక మీద అట్టర్ ఫ్లాప్. ఎందుకు అట్టర్ ఫ్లాప్? సారం లేక. కథకి ఐడియా అయితే వుంటుంది, దాని వ్యూహాత్మక పరిపాలన లేక. రాసే టెక్నిక్కులూ, స్క్రీన్ ప్లే స్టయిలింగులూ అన్నం పెట్టే ఐడియా ప్రాముఖ్యాన్ని గుర్తించక. స్క్రీన్ ప్లే అంటే ఏమిటో కడుపు చించుకున్నా తెలియనట్టే, నోటికి అన్నం పెట్టే ఐడియా అంటే ఏమిటో కూడా ప్రమాణ పూర్వకంగా తెలియక. నిర్మాణాత్మక ఐడియా మాత్రమే అన్నం పెడుతుంది, ఇంకేదీ కాదు.

        ఈ పుస్తకం ఐడియా అంతర్నిర్మాణాన్ని చర్చిస్తుంది. హాలీవుడ్ సామ్రాజ్యం అంతర్జాతీయం. మాస్ కమర్షియల్ సినిమాలు హాలీవుడ్ ప్రధాన వ్యాపారం. అలాటి వ్యాపారాత్మక సినిమా కథల్ని దృష్టిలో పెట్టుకుని ఈ పుస్తకం వుంటుంది. హాలీవుడ్ లో ప్రొఫెషనల్ రచయితలకి ఐడియా ప్రాముఖ్యం గురించి తెలుసు. నెలలూ  సంవత్సరాలూ స్క్రిప్టు రాస్తూ గడుపుతున్నప్పుడు, సమయాన్నీ కష్టాన్నీ వ్యయం చేస్తున్నప్పుడు, దాని మూలం లో ఐడియా అనే సెల్ ఫోన్ టవర్ ప్రసారం సవ్యంగా లేకపోతే, పౌనః పున్యం మ్యాచ్ కాకపోతే, రాసిందంతా వృధా అయిపోతుందని తెలుసు.

        ఐతే ఐడియా గురించి ఇంకేం తెలుసుకోవాలి? రాముడు సీత కోసం లంక కెళ్ళి ఠపీమని రావణుణ్ణి సంహరించాడు. ఇలా కథకి ఇది ఐడియా అనుకుంటే, దీంట్లో సినిమా పరంగా ఏ ఎలిమెంట్లు (మూల తత్వాలు) చూడాలి? ఏక్తా కపూర్ జోధా అక్బర్ సీరియల్ తీస్తున్నప్పుడు ఒక ఎపిసోడ్ కి రచయితని పిలిచి- చూడూ ఇలా చెయ్, జోధా బాయిని భూతం ఎత్తుకెళ్ళింది. అప్పుడు అక్బర్ వెళ్ళి ఆ భూతంతో పోరాటం చేసి జోధా బాయిని విడిపించుకుని గుర్రమెక్కించుకుని వచ్చాడని ఎపిసోడ్ రాయ్ అంది.       

అప్పుడా సీనియర్ రచయిత, చరిత్రలో అలా జరిగిందని ఏ మూర్ఖుడూ రాయలేదు, మేడమ్. మనం అలా తీస్తే జనాలు చెప్పులతో కొడతారు మేడమ్ అన్నాడు. అయినా అలాగే తీయించింది ఏక్తా. జోధా అక్బర్ అన్నిఎపిసోడ్ల కంటే దీనికే ఎక్కువ టీఆర్పీ వచ్చింది!    

        ఈ వికృత ఐడియాలో ఏక్తా కపూర్ చూసిన ఎలిమెంట్స్ ఏమిటి? హాలీవుడ్ నిర్మాతలూ అమెరికన్ ప్రేక్షకులూ సినిమాలు  ఎమోషనల్ ఎంటర్టయినర్ లుగా వుండాలని కోరుకుంటారు, ఇంటలెక్చువల్ సినిమాలు కాదు. అయినా తీస్తున్న చాలా ఎమోషనల్ ఎంటర్టయినర్లు అమెరికన్ ప్రేక్షకులకి నచ్చడం లేదు. వాటి ఐడియాల్లో ఎలిమెంట్లు మిస్సవడమే కారణమని రచయిత చెప్తాడు. ఈ ఎలిమెంట్స్ ఏమిటో ది ఐడియా -సెవెన్ ఎలిమెంట్స్ ఆఫ్ వయబుల్ స్టోరీ అన్న ఈ పుస్తకం లో వివరించాడు.

        ఈ సెవెన్ ఎలిమెంట్స్ (అంటే పంచ భూతాలో ఐదు తత్వాల్లాగా) ఐడియాలో కేంద్రకంగా వుండే ప్రాబ్లం తో ముడిపడి వుంటాయి. కథంటే పాత్రల మధ్య పుట్టే ప్రాబ్లం ని పరిష్కరించే టూల్ కాబట్టి- ఆ  ప్రాబ్లమే కథకి కేంద్రకంగా వుంటుంది కాబట్టి- ఐడియాకి  పర్యాయపదం ప్రాబ్లమే. స్థూలంగా ప్రాబ్లంని ఐడియాగా చూస్తామన్న మాట. అందుకని ప్రాబ్లంతో ఎలిమెంట్లు కలిస్తే కథకి బలం వస్తుందన్న మాట. ఆ ఎలిమెంట్స్ ఎలా పని చేస్తాయన్నది పుస్తకంలో ఇచ్చాడు.  

        స్క్రీన్ రైటింగ్ పుస్తకాలు తీసుకున్న ఐడియాకి స్టోరీ డెవలప్ మెంట్ ఎలా చేసుకోవాలో పాఠాలు చెప్తాయే తప్ప, అసలా తీసుకున్న ఐడియాని ఎలా నిర్మించుకోవాలో చెప్పడం లేదు గనుక, పుస్తక రచయిత ఈ లోటుని పూడ్చాడు. 

        అందరూ చేసే పని ఐడియాని కథగా విస్తరించే జోలికి అస్సలు పోకుండా, ప్రాథమికంగా ఎలిమెంట్స్ తో ఐడియాని నిర్మించుకోవడం గురించే పుస్తకం రాశాడు. ఐడియాలో ఆ ఏడు ఎలిమెంట్స్ ఇవీ - punishing, relatable, original, believable, life-altering, entertaining, meaningful అని సూత్రీకరించాడు.       

వీటిని ఒక్కో అధ్యాయంగా వివరించాడు. ఇవి అర్ధమవడానికి ప్రసిద్ధ సినిమాలని ఉదాహరణగా పేర్కొన్నాడు. ఈ ఎలిమెంట్స్ వున్న సినిమాలెలా వున్నాయి, లేనివెలా వున్నాయీ కళ్ళ ముందుంచాడు. జానర్ స్పెషలిజం కోరుకునే వాళ్ళకి వివిధ జానర్లలో ఈ ఎలిమెంట్స్ వినిమయం ఎలా జరుగుతుందో కూడా చెప్పాడు.

సాధారణంగా - ఇది కాదులేమ్మా, ఇంకో ఐడియాతో రమ్మనే పరిస్థితి ఎదురవుతుంది. ఇలా అనే ముందు ఐడియాతో ముడిపడి వుండే ఐదు ప్రశ్నల్ని గమనం లోకి తీసుకోవాలంటాడు - 1. ఐడియా ఏ పాత్ర కథతో వుంది, ఆ పాత్రతో మనమెందుకు ఐడెంటీఫై అవ్వాలి? 2. ఆ పాత్ర పరిస్థితులతో, ఇతరులతో సంబంధాలతో జీవితంలో ఏం పొందాలని కోరుకుంటోంది? 3. అది పొందడానికి ఎదురవుతున్నఆటంకా లేమిటి? 4. వాటినెలా అధిగమించా లనుకుంటోంది? 5. తాను పొందాలనుకుంటున్నది పొంది తీరాల్సిన అవసరాన్ని పాత్ర ఎందుకు ఫీలవుతోంది, అది మనమెందుకు ఫీలవ్వాలి?

        ఒక ఐడియాతో కథ రాయడానికి కూర్చునే ముందు, క్షుణ్ణంగా ఆ ఐడియాని అధ్యయనం చేసుకోవాలంటాడు. ఏడు ఎలిమెంట్స్ తో రూపొందిన ఐడియాని మూడు వాక్యాల లాగ్ లైన్లో కూర్చాలంటాడు. ఈ లాగ్ లైన్లో పాత్రెవరు, ప్రత్యర్థి ఎవరు, కాన్ఫ్లిక్ట్ ఏమిటనేవి కనబడాలంటాడు. కొన్ని టిప్స్ కూడా ఇచ్చాడు : చాలా కథలు ప్రాబ్లం (ఐడియా) సరీగ్గా లేక పట్టు సడలి పోతాయని, భారీ కథలకంటే సింపుల్ గా వుండే కథలే ఎక్కువ ఆకట్టుకుంటాయనీ, నిర్మాతలూ ప్రేక్షకులూ కొత్తదనాన్ని కోరుకోరనీ-రచయితలే, విమర్శకులే కొత్తదనాన్ని కోరుకుంటారనీ... ఇలా కొన్ని టిప్స్ ఇచ్చాడు.

        ఇలాటి పుస్తకం ఇదే మొదటిది గనుక సినిమా రచనని సీరియస్ గా తీసుకునే, ఎప్పటి కప్పుడు అప్డేట్ అవ్వాలనుకునే శ్రద్ధాసక్తులున్న వాళ్ళకి వెల కట్టలేని ఆస్తి. అమెజాన్లో అమ్మకానికుంది. లేదంటే పీడీఎఫ్ డౌన్లోడ్ వుంది.

—సికిందర్