107. కథలు గాథలై పోతున్నాయి. చూసింది కథో గాథో అర్ధంగాని వింత స్క్రీన్ ప్లేలు తయారవుతున్నాయి. కథో గాథో ఏదో ఒక్కటే తీయాలి. ముందు కథంటే ఏమిటో, గాథంటే ఏమిటో తెలుసుకుంటే కథల్నే వాటి లక్షణాలతో తీస్తారేమో. మరి గాథలు పనికిరావా? ఖచ్చితంగా పనికిరావు. ఒకప్పుడు పనికొచ్చేవి. ఎండ్ సస్పన్స్ తో కూడిన కథలెలా ఒకప్పుడు పనికొచ్చేవో గాథలూ పనికొచ్చేవి. వాటి కాలం తీరిపోయింది. కళలు ఏవీ పర్మనెంట్ కావు. ఒకప్పటి నటనలూ సంభాషణలూ ఇప్పుడు లేవు. కాలాన్నిబట్టి మారిపోతూ వచ్చాయి. కాలం కాదని గాథలూ ఆగిపోయాయి. గత రెండు దశాబ్దాలుగా యాక్టివ్ – పాసివ్ పాత్రల తేడాలే తెలీక, పాసివ్ పాత్రల్లో హీరోల్ని పదేపదే చూపిస్తూ తీస్తున్న కథలే అట్టర్ ఫ్లాపవుతున్నాయి, ఇక పాసివ్ పాత్రలే వుండే గాథల్నేం తీసి హిట్ చేస్తారు.
108. కథ - గాథ అనే గజిబిజి నుంచి గాథని విడదీసి చూస్తే, కమర్షియల్ సినిమాలకి గాథలూ ఒకప్పుడు ఎందుకు పనికొచ్చేవో తెలుస్తుంది. గాథంటే ఉదాత్త విలువల జీవన సౌందర్యం. ఆత్మికంగా మనుషులు విలువల్ని ప్రేమించేవారే. బయట ఈ విలువలు కానరాక అర్రులు చాచే వారే. ఈ ఆత్మిక దాహాన్ని తీర్చేవే గాథలు. అంతేగానీ ఒక కుటుంబ సినిమా అనో, ఇంకేదో మహోజ్వల చిత్రరాజమనో అర్ధంపర్ధంలేని, రుచీ పచీ లేని కృత్రిమ అనుబంధాలు, సెంటిమెంట్లు కలిపి కుట్టి చూపిస్తే గాథలైపోవు. ఆత్మిక దాహాన్ని తీర్చవు సరికదా, ఆత్మల్ని కుళ్ళబొడిచి వదుల్తాయి.
109. ఉమ్మడి కుటుంబాలు ఇప్పుడు లేకపోవచ్చు. విడిపోయి న్యూక్లియర్ కుటుంబాలై పోవచ్చు. వలసపోయి ఎన్నారై కుటుంబాలై పోవచ్చు. కానీ కుటుంబాలనేవి వున్నాయి. వాటి విలువలు? విలువల్ని మళ్ళీ ఉమ్మడి కుటుంబాల నుంచే నేర్చుకోవాలి. కొనసాగించాలి. ఉమ్మడి కుటుంబాలు నాటి జమీందారీలే కావొచ్చు. నేటి పారిశ్రామిక కుటుంబాలే కావొచ్చు. జిఎంఆర్ గ్రూపు అధినేత గ్రంథి మాధవరావు లండన్లో కుటుంబ రాజ్యాంగం రాయించుకొచ్చారు. కుటుంబంలో ఆ రాజ్యాంగమే అమలవుతోంది. కుటుంబాలు కులాంతర, మతాంతర వివాహాలతో సంకరం కావొచ్చు. అయినా కలిసే వుండాలి. ఆ జంటల్ని వెళ్ళ గొడితే, ప్రాణాలు తీసేస్తే కుటుంబాలు పితృ దోషం బారిని పడతాయి. కుటుంబాన్ని విచ్ఛిన్నం చేసుకోవడమంటే వంశంలో ప్రవహించే డీఎన్ఏ ని విచ్ఛిన్నం చేసు కోవడమే. దీని ఫలితాల్ని పిల్లలు సహా అందరూ అనుభవిస్తూ పోతారు. కుటుంబంలో విచ్ఛిన్నమైన డీఎన్ఏ తిరిగి దాని ఐక్యత కోసం తల్లడిల్లుతూ వుంటుంది. ఇదే పితృ దోషం. ఇలా డీఎన్ఏ విచ్ఛిన్నం కాకూడదనే విలువ ఒక్కటే ఉమ్మడి కుటుంబాలకి ఆధారం. ఈ విలువ కోసం త్యాగాలే చేయాలి తప్ప తెగనరుక్కోవడం కాదు. ‘పెదరాయుడు’ ఈ విలువల్ని ఎత్తి చూపే ఉదాత్త కుటుంబ గాథ. అయింది.
`
111. సినిమా కథంటే మరేమిటో కాదు- పాత్ర (బిగినింగ్) - ఆ పాత్ర ఎదుర్కొనే సమస్య (మిడిల్) - ఆ పాత్ర కనుక్కునే పరిష్కారం (ఎండ్). ఇది ఒకటో తరగతి పాఠం. ఎంతటి వాళ్ళయినా ఈ బ్రాకెట్ లోకొచ్చి సినిమా కథ చేసుకోవాల్సిందే. కానీ ఒకటో తరగతి కూడా తెలియని వాళ్ళు స్క్రిప్టులు చేస్తూంటేనే సినిమా కథలు రావడం లేదు. నర్సరీ స్కూలు కతలే వస్తున్నాయి. మళ్ళీ పాత్ర (బిగినింగ్) - ఆ పాత్ర ఎదుర్కొనే సమస్య (మిడిల్) - ఆ పాత్ర కనుక్కునే పరిష్కారం (ఎండ్) అని పొల్లుపోకుండా అనుకోకుండా – చివర ‘పాత్ర కనుక్కునే పరిష్కారం’ లోంచి పాత్రని తీసేసి ఒట్టి పరిష్కారమే తీసుకుని – “పాత్ర, ఆ పాత్ర ఎదుర్కొనే సమస్య, పరిష్కారం” – అనుకుని తప్పులో కాలేస్తే కూడా సినిమా కథవదు. ఆర్ట్ సినిమా పాసివ్ వ్యవహారమవుతుంది. పరిష్కారం పాత్ర కనుక్కోకపోతే – రచయిత కనుక్కుంటాడన్న మాట. అంటే పాత్ర చేయాల్సిన పని రచయిత చేస్తాడన్న మాట. అంటే పాత్ర సమస్యలో పడ్డ దగ్గర్నుంచీ (మిడిల్ నుంచీ) రచయితే జోక్యం చేసుకుని పాత్రని నడిపిస్తాడన్న మాట. అంటే పాసివ్ పాత్ర తయారు చేస్తాడన్న మాట. అంటే సినిమాని అట్టర్ ఫ్లాప్ చేస్తాడన్న మాట. అంటే ఎందుకు ఫ్లాపయ్యిందో తెలుసుకోకుండా ఇంకో పది ఇలాగే అట్టర్ ఫ్లాపులు చేస్తాడన్న మాట. ఇదింకో రకం నర్సరీ స్కూలు తనమన్న మాట. కాబట్టి ఖచ్చితంగా ‘పాత్ర కనుక్కునే పరిష్కారం’ అని క్రియాత్మకంగా గుర్తు పెట్టుకోవాల్సిందే. ఇక్కడ రచయిత అనడం కూడా సరి కాదు. ఇప్పుడు- అంటే గత రెండు దశాబ్దాలుగా రచయిత లెక్కడున్నారు. దర్శకులే రచయితలు. వాళ్ళదే చెల్లుబాటు, వాళ్ళవే ఫ్లాపులు. కాబట్టి ఇలాటి కతల వ్యవహారం రచయితల కాపాదించ కూడదు.
112. సినిమా కథంటే పైన చెప్పుకున్న బ్రాకెట్లో పొల్లుపోకుండా వుండేదే. ఇలా లేనివి ఏవీ సినిమా కథలు కావు, సినిమాలన్పించుకోవు. కథతో వుంటేనే సినిమా. కాకుండా కథ వుండని గాథ సినిమా అవదు, కథ వుండని ఉపోద్ఘాతం సినిమా అవదు, కథ వుండని ఫ్లాష్ బ్యాక్ సినిమా అవదు, కథ వుండని డాక్యుమెంటరీ సినిమా అవదు, కథ వుండని ఎపిసోడ్లు సినిమా అవదు, కథ వుండని ఆంథాలజీ (కథల సంపుటి) సినిమా అవదు, కథ వుండని ఆర్ట్ సినిమా సినిమా అవదు, కథ వుండని వరల్డ్ మూవీ సినిమా అవదు, కథ వుండని ఇండీ ఫిలిం సినిమా అవదు, కథ వుండని క్రౌడ్ ఫండింగ్ కళాత్మకం సినిమా అవదు, కథ వుండని న్యూస్ బులెటిన్ సినిమా అవదు, కథ వుండని డైరీ సినిమా అవదు, కథ వుండని బయోపిక్ సినిమా అవదు. కెమెరాతో తీసిందల్లా సినిమా అవదు.
113. రాజకీయ సినిమాల కెప్పుడూ యూత్ అప్పీల్, మాస్ అప్పీల్, అన్ని అప్పీల్సూ వుంటూ వస్తున్నాయి. రజనీకాంత్ ‘రోబో- 2’ తో మార్కెట్ యాస్పెక్ట్ విషయంలో ఏం పొరపాటు జరిగిందో, అదే ‘ఎన్టీఆర్’ బయోపిక్ మొదటి భాగంతో జరిగింది. ‘రోబో -2’ లో ఒక ప్రేక్షకులందరూ గుర్తించాల్సిన పర్యావరణ సమస్యని సైన్స్ ఫిక్షన్ గా చెప్పారు. దీంతో ఇది నిజం కాదేమోలేనని ప్రేక్షకులు ఫీల్ కాలేదు. సైన్స్ ఫిక్షన్ నిజం కాదు కదా. ఇదే పర్యావరణ సమస్యని రాజకీయాలతో చూపించి వుంటే ఎక్కువ రెస్పాండ్ అయ్యేవారు. కనెక్ట్ అయ్యేవారు. రాజకీయాలు పర్యావరణాన్ని - పోనీ పిచ్చుకల్ని- ఇంత ధ్వంసం చేస్తున్నాయా అని ఫీలయ్యే వారు. చేతిలో వున్న సెల్ ఫోన్ ని చూసినప్పుడల్లా పర్యావరణ హనన రాజకీయాలే కన్పించేవి, క్రోనీ కేపిటలిజంతో బాటు. ప్రేక్షకులనుభవించే సామాజిక సమస్యల్ని సైన్స్ ఫిక్షన్ గా పలాయనవాదంతో చూపరాదు, నిత్యజీవితంలో వాళ్ళు చూసే రాజకీయాలతోనే ఆర్గానిక్ గా, ప్రాక్టికల్ గా కళ్ళకి కట్టాలి. సామాజిక సమస్యలు వేడి వేడిగా రాజకీయాలతోనే ముడిపడి వుంటాయి, సైన్స్ ఫిక్షన్ తో కాదు.
114. మ్యాటరాఫ్ ఫ్యాక్ట్ ( unemotional, practical, sensible, realistic, unsentimental, businesslike etc) కథనాన్ని ఏనాడో ‘ప్యాసా’లో గురుదత్ ప్రయోగించారు విజయవంతంగా. ఫలానా ఈ సంఘటన ఈ పాత్ర జీవితంలో ఇలా జరిగిందీ- అని ఒక టీవీ జర్నలిస్టు రిపోర్టింగ్ చేస్తున్న చందంగా చూపించి కట్ చేసేస్తారు ఏ సన్నివేశానికా సన్నివేశం దత్. పాత్రల ఏడ్పులూ మెలోడ్రామాలూ నహీచల్తా. దీన్ని ‘మ్యాటరాఫ్ ఫ్యాక్ట్’ కథనమన్నారు పండితులు. ఇది మతిపోగొట్టే కథనమే. ఇలాంటిది చాలాకాలం వరకూ మరే దర్శకుడూ ప్రయత్నించలేదు- ఇటీవల కాలంలో ‘బర్ఫీ’ లోనే చూస్తాం. ఇవి ఫ్లాష్ బ్యాక్, మల్టిపుల్ ఫ్లాష్ బ్యాకులతో కూడిన కథనాలు కావు కాబట్టి చెల్లింది. కానీ చివరంటా మల్టీ పుల్ ఫ్లాష్ బ్యాకులే రాజ్యమేలే ‘కంచె’ లోని జోడు కథలకి చెల్లలేదు.
115. కొన్ని సినిమాలకి విజయవంతంగా స్క్రీన్ ప్లే అనేది వుండదు. రాం చరణ్ ‘బ్రూస్ లీ’ కి ‘ఐస్ స్క్రీమ్ ప్లే’ అని కొత్తది కనిపెట్టారు. దీనితర్వాత ‘లాలిపాప్ ప్లే’ రావొచ్చు. ‘చూయింగమ్ ప్లే’ రావొచ్చు. ఆఖరికి ఇంకా కాలం ఇలాగే కలిసివస్తూ వుంటే, ‘పాన్ మసాలా ప్లే’, ‘మాణిక్ చంద్ గుట్కా ప్లే’ లు కూడా వచ్చేస్తాయి. బిగ్ బడ్జెట్ సినిమాలకి కావలసిందల్లా అతి బీదతనంతో కూడిన తెల్ల రేషన్ కార్డు ‘ప్లే’ మాత్రమే. సబ్సిడీ బియ్యం మాత్రమే. సబ్సిడీ బియ్యంతో బడాయిగా బిర్యానీ వంటకం మాత్రమే. నాణ్యమైన బాస్మతీ బియ్యంతో ప్రేక్షకులకి మంచి బిర్యానీ పెట్టలేని పేదరికంతో వుంది టాలీవుడ్ రైటింగ్ డిపార్ట్ మెంట్. సబ్సిడీ బియ్యం మాత్రమే తెలుగు బిగ్ బడ్జెట్ సినిమాల్ని ప్రపంచంలో కెల్లా అతి పెద్ద జోకుగా ( స్కామ్ గా కూడా!) పేరు ప్రఖ్యాతులు సంపాదించి పెట్టగలదు కాబట్టి ఆ రేషన్ ని వదులుకోరు. టాలీవుడ్ సలీం- జావేద్ లైన కోన వెంకట్- గోపీ మోహన్లు ఆల్రెడీ సింగిల్ విండో స్కీము అనబడు జారుడుబల్ల స్క్రీన్ ప్లేని కనిపెట్టారు. అది సినిమా తర్వాత సినిమాగా ఏకసూత్ర కార్యక్రమంగా అమలవుతూ ‘పండగ చేస్కో’ తో పరాకాష్టకి చేరింది. ఈ స్కీము కింద ఏ స్టార్ అయినా, ఎంతటి వాడైనా; ఏ కథైనా, కథే కాకపోయినా, అదే సింగిల్ విండో లోంచి దూకి, అదే జారుడు బల్లమీదుగా రయ్యిన జారుకుంటూ వెళ్లి బాక్సాఫీసులో పడాల్సిందే. అదంతా ఒక సెట్ చేసిన ప్రోగ్రామింగ్, ఒక టెంప్లెట్, ఒక ఆటోమేషన్, అంతే. మీటలు నొక్కడమే పని. స్టోరీ మేకింగ్ సాఫ్ట్ వేర్ లు అంటూ వున్నాయి. ఈ సింగిల్ విండో స్కీము గురించి ప్రపంచానికి తెలిసిపోతే, వందల కోట్ల డాలర్ల ఆ స్టోరీ మేకింగ్ సాఫ్ట్ వేర్ రంగం మొత్తంగా మూతబడి పోవాల్సిందే.
―సికిందర్