రివ్యూలు, సాంకేతికాలు, స్క్రీన్ ప్లే సంగతులు...

టికెట్లు దొరకడం యోగం, సినిమాలు చూడడం భోగం, రివ్యూలు రాయడం రోగం!

Monday, December 13, 2021

1105 : రివ్యూ!

 

రచన - దర్శకత్వం : సుజనా రావు
తారాగణం : శ్రియా శరన్‌
, నిత్యా మీనన్‌, ప్రియాంకా జ‌వల్క‌ర్, శివ కందుకూరి, బిత్తిరి సత్తి తదితరులు 
సంగీతం : ఇళయరాజా, ఛాయాగ్రహణం : వీఎస్ జ్ఞాన శేఖర్
బ్యానర్స్ : క్రియా ఫిలిం కార్పొరేషన్
, కాళీ ప్రొడక్షన్స్
నిర్మాతలు  : కె రమేష్
, పి వెంకీ, వీఎస్ జ్ఞాన శేఖర్
విడుదల : డిసెంబర్‌
10, 2021
***

          త మూడు నెలలుగా ముగ్గురు కొత్త యువ దర్శకురాళ్ళు తెలుగు వెండితెర మీది కొచ్చారు : గౌరీ రోణంకి (పెళ్ళి సందడి), లక్ష్మీ సౌజన్య (వరుడు కావలెను), సుజనా  రావు (గమనం). తొలి ఇద్దరివీ కమర్షియల్ ప్రయత్నాలైతే, సుజనా రావుది సామాజిక స్పృహతో ఆఫ్ బీట్ ప్రయత్నం. ఆహ్వానించ దగ్గది. ఇలాటి ప్రయత్నాలకి పాపులర్ నటులు, సాంకేతికులు తోడైతే ప్రేక్షకుల్లోకి వెళ్ళే అవకాశాలెక్కువ వుంటాయి. గమనం కి శ్రియా శరణ్, నిత్యా మీనన్, సుహాస్, చారు హాసన్, బిత్తిరి సత్తిలతో బాటు, రచయిత సాయినాధ్ బుర్రా, సంగీత దర్శకుడు ఇళయ రాజా, ఛాయా గ్రాహకుడు జ్ఞాన శేఖర్ ల వంటి ప్రముఖుల సమ్మేళనంతో ప్యాకేజీ ట్రెండీగా వుంది. తెల్లారి పోయిన ఆర్ట్ సినిమాలని  బాలీవుడ్ స్టార్స్ తో తీసి ట్రెండ్ లో కి తీసుకొచ్చి- క్రాసోవర్ సినిమా అనే కొత్త కేటగిరీని సృష్టించిన శ్యామ్ బెనెగల్ బాట ఎవరికైనా మంచిదే.

        బాటలో కొత్త యువ దర్శకురాలు సామాజిక స్పృహతో హైదరాబాద్ లో వరదలు అనే ఇంత వరకూ ఎవరూ ప్రయత్నించని యూనిక్ కాన్సెప్ట్ ని తీసుకుంది. ఈ మధ్య నూటొక్క జిల్లాల అందగాడు’, కొండపొలం’, అద్భుతం’, స్కై లాబ్’, లక్ష్య ...ఇవి కూడా యూనిక్ కాన్సెప్టులే. ఇవన్నీ కూడా పాత మూస ఫార్ములా ధోరణులతో కాన్సెప్టులకి అన్యాయం చేసి అపజయాల సంఖ్య పెంచినవే. గమనం కూడా ఇదే బాటలో వెళ్ళిందా, బెనెగల్ తరహా సమ్మోహనకర ప్యాకేజీ వుండి కూడా? యూనిక్ అంటేనే అసాధారణమైన, అరుదైన, ప్రత్యేకమైన అని అర్ధం. ఈ అర్ధాన్ని గమనం అయినా నిలబెట్టుకుందా? లేక ఆకాశం నుంచి దిగివచ్చినా మన తెలుగు సినిమాల కాన్సెప్టులింతే, గమ్యమింతే అన్పించుకుందా? ఈ ప్రశ్నలకి ఏమని సమాధానం చెబుతోందో చూద్దాం...

కథ

హైదరాబాద్ లో మూడుగా విభజించి చూపించిన జీవితాలవి...మొదటిది, ఆమె కమల (శ్రియ) అని వినికిడి లోపమున్న వివాహితురాలు. చిన్న కూతురుతో వుంటుంది. భర్త గల్ఫ్ లో టాక్సీ నడుపుతూ వుంటే, తను బస్తీలో బట్టలు కుడుతూ జీవనం సాగిస్తూంటుంది. భర్త వచ్చేలోగా వినికిడి సమస్యకి వైద్యం చేయించుకుని, భర్త తెచ్చే డబ్బుతో చిన్న ఇల్లు కట్టుకోవాలని ఆశతో వుంటుంది.

        రెండోది, నగరంలో ఇంకో చోట అలీ (శివ కందుకూరి) అనే యువకుడు తాత (చారు హాసన్) తో వుంటాడు. మెడిసిన్ చదివే ఇతను తాత మాట వినక, క్రికెటరై దేశానికి ప్రాతినిధ్యం వహించాలని కృషి చేస్తూంటాడు. అక్కడే జారా(ప్రియాంకా జవల్కర్‌) అనే పెద్దింటి యువతి వుంటుంది. వీళ్ళిద్దరూ ప్రేమించుకుంటే పెద్దలు ఒప్పుకోరు. జారా పారిపోయి అలీ దగ్గరికి వచ్చేస్తుంది పెళ్ళి చేసుకోవాలని.

        మూడోది, మరింకో చోట మురికి వాడలో ఇద్దరు వీధి బాలలుంటారు. చిత్తు కాగితా లేరుకుని బ్రతుకుతూంటారు. ఈ ఇద్దర్లో ఒకడికి పుట్టిన రోజు ఘనంగా జరుపుకోవా లనుంటుంది. అందుకు కేక్ కొనేందుకు, మట్టి వినాయకుల విగ్రహాలమ్మి డబ్బు పోగేస్తూంటారు.

        ఈ మూడు చోట్లా జీవితాలిలా వుండగా, నగరంలో భారీ వర్షాలు కురిసి వరదలొచ్చేస్తాయి. వరదలకి ప్రాణాలతో బాటు కలలు, ఆశలూ కల్లోలితమవుతాయి. ఇందులోంచి ఎలా బయటపడి జీవితాల్ని తిరిగి గాడిలో పెట్టుకున్నారనేది మిగతా కథ. ఈ మిగతా కథలో  అలీ తాతతో బాటు, అలీ మిత్రుడు అబ్దుల్లా (సుహాస్), అలీ కోచ్ (రవి ప్రకాష్), జారా తండ్రి (సంజయ్ స్వరూప్), గాయని శైలపుత్రి (నిత్యా మీనన్) మొదలైన వ్యక్తులెక్కడ కనెక్ట్ అయ్యారనేది కూడా చూడొచ్చు.

ఎలా వుంది కథ 

గత వారమే విడుదలైన కుప్పకూలే స్కై లాబ్ యూనిక్ కథ లాగే, హైదరాబాద్ లో వరద ముప్పుతో ఇది కూడా డిజాస్టర్ జానర్ యూనిక్ కథ. స్కైలాబ్ లాగే డిజాస్టర్ జానర్ ఎలిమెంట్స్ తో కథ చేసుకోని కథ. అలాగని వరద ముప్పులో సర్వైవల్ (జీవన్మరణ పోరాటం) జానర్ ఎలిమెంట్స్ తో  కూడా చేయని కథ. పోనీ ఒక సామాజిక స్పృహతో ఆర్ట్ లేదా ఆఫ్ బీట్ మూవీయా అంటే అలా కూడా ఈ కథాంగాలు వుండవు. అన్ని కథా లక్షణాలూ తీసేసి- వరదలొచ్చాయి, ఇందులోంచి ఎలా బయట పడ్డారూ అన్న డాక్యుమెంటరీ మాత్రపు ప్రయత్నంగా యూనిక్ కథ మిగిలింది. పేరుప్రతిష్టల్ని తెచ్చి పెట్టే యూనిక్ కథ ఇలా సింహాసనం నుంచి జారిపోగా, ఈ డాక్యుమెంటరీ శైలి కథనం మొదట్నుంచీ  మూడుగా విభజించి చూపించిన జీవితాల చిత్రీకరణల్లో కన్పిస్తూ వస్తుంది. ఈ డాక్యుమెంటరీ కథనమే మొత్తం కథకొక అల్లిక, మెలికలు, ముడులు లేకుండా చేసింది. అసలు దేనితో ఏం చేస్తున్నామో తెలుసుకోకుండా రాసేసి తీసేస్తే ఇలాగే వుంటుందేమో. ఈ కథ కూడా పైన చెప్పుకున్న ఇటీవలి నాల్గు సినిమాల యూనిక్ కాన్సెప్టుల బాటలోనే బుట్ట దాఖలైపోయింది. 

        మూడుగా విభజించి చూపించిన జీవితాలతో మూడు కథలు. అంటే మూడు విడివిడి కథల ఒక ఆంథాలజీ అన్నమాట. అంటే హైపర్ లింక్ స్టోరీ. ఈ మూడు కథల్ని హైపర్ లింకుగా కూడా ఎక్కడా కలపను కూడా లేదు. అంటే ఆంథాలజీ కూడా కాకుండా పోయింది. ఇప్పుడు కావాలంటే 2020 హైదారాబాద్ వరద దృశ్యాలు చూసేందుకు యూట్యూబ్ లో బోలెడు వున్నాయి. సినిమా దేనికి చూడాలి. అలాటి వార్తా ప్రసారం లేదా డాక్యుమెంటరీ కాదు కదా సినిమా కథంటే. 

        కథ కాలేదు కాబట్టి కాన్ఫ్లిక్ట్ లేదు. వరదల్ని చూపిస్తే అది పాత్రలకి ఎదురైన కాన్ఫ్లిక్ట్ అవదు. ప్రకృతి దాని మానాన అది సర్దుబాటు చేసుకోవడం. ప్రకృతి వరదలతో దాని సర్దు బాటు బిజినెస్ లో అదుంటే, దీన్ని ఎదుర్కొంటూనే పాత్రల మధ్య పుట్టేది కాన్ఫ్లిక్ట్. ప్రకృతి సర్దుబాటు నేపథ్యంలో పాత్రల మధ్య కాన్ఫ్లిక్ట్ లేకపోతే పాలగుమ్మి పద్మరాజు రాసిన గాలివాన కథ లేదు, కొరియన్ పారసైట్ మూవీ కూడా లేదు. టైటానిక్ డిజాస్టర్ మూవీ డిజాస్టర్ గురించే కాదు కదా? అదో అమరమైన ప్రేమ కథ కూడా.

పాలగుమ్మి పద్మరాజు గారి సుప్రసిద్ధ కథ గాలివాన ఆయన జీవితంలో జరిగిందే. దాన్ని ఆయన వార్తలా రాసి వుంటే కథయ్యేది కాదు. ఆ అనుభవం లోంచి వర్షపు రాత్రి పాత్రల మధ్య కాన్ఫ్లిక్ట్ తో ఆ గొప్ప కథని సృష్టించారు. ఒక డబ్బున్న ఉన్నతాదర్శాల వ్యక్తి, తను అసహ్యించుకునే బిచ్చగత్తెతో వర్షపు రాత్రి చిక్కుకుని, ఆమె వల్ల తన ఉన్నతాదర్శాల్లోని డొల్లతనాన్ని తెలుసుకునే -  సోషల్ కామెంట్ చేసే కథ. 1951 లో రాసిన ఈ కథని ఆయన అనువాదం చేసి పంపితే న్యూయార్క్ హెరాల్డ్ ట్రిబ్యూన్ పత్రిక నిర్వహించిన అంతర్జాతీయ పోటీల్లో ద్వితీయ బహుమతి పొంది, అనేక భాషల్లో అనువాదమైన ప్రపంచ స్థాయి కథ.

 సూరజ్ కా సాత్వా ఘోడా’ అనే ప్రసిద్ధ నాల్గు కథల ఆంథాలజీలో శ్యామ్ బెనెగల్ కూడా ప్రేమకి సంబంధించి ఇదే చెప్పారు- సామాజికార్ధిక వర్గ పోరాట పునాదులున్న ప్రేమలే మంచి ప్రేమ కథలవుతాయని. గమనం దర్శకురాలి సామాజిక స్పృహకీ సామాజికార్ధిక కారణాలు కలగలిసిన కాన్ఫ్లిక్ట్ చూపించాలి నిజానికి.


        పాలగుమ్మి కథ లాగా ఆసియా ఖండం నుంచే వెళ్ళిన కొరియన్ మూవీ పారసైట్ లో కూడా వరదలు నగరాన్ని ముంచెత్తే కథే. ఆ వరదల్లో బయటపడే ఒక్కో పాత్ర నిజ రూపాలతో, వర్గ తారతమ్యాల సోషల్ కామెంట్ చేస్తుందీ 2019 ఆస్కార్ అవార్డు పొందిన సినిమా కథ. ఆసియా ఖండం నుంచి వెళ్ళిన ఈ రెండూ అంతర్జాతీయ ఖ్యాతిని పొందాయి. గమనం లో హైదరాబాద్ వరదలకి కారణం పేరుకు పోయిన డ్రెయిన్లు, కబ్జా చేసిన చెరువులూ అని మీడియా రిపోర్టు చేసిన కారణమే చెప్పి సరిపెట్టడంతో, అవార్డులకి ఎదిగే అవకాశాన్ని కోల్పోయిన  డాక్యుమెంటరీ అయిందీ యూనిక్ కాన్సెప్ట్.

        ఈ కబ్జాదార్లయిన ధనిక పాత్రల్ని కూడా సృష్టించి- పేద పాత్రలతో కాన్ఫ్లిక్ట్ వల్ల ఏం నేర్చుకున్నారో సోషల్ కామెంట్ చేసి వుంటే అర్ధవంతమైన సామాజిక కథయ్యేది. వరదలతో ప్రకృతి కాదు విలన్. ప్రకృతిని ఆటంకపర్చే సామాజిక శక్తులు విలన్లు. విలన్లు లేకుండా బాధితుల అపసోపాలే చూపిస్తే కథవదు. కథంటే రెండు వైరి వర్గాల మధ్య డ్రమెటిక్ క్వశ్చన్ - ఆ క్వశ్చన్ తో కాన్ఫ్లిక్ట్ - దానికి ముగింపూ. డ్రామాకే అవకాశం లేని డాక్యుమెంటరీలో ఇవి సాధ్యం కావు. సినిమాకి కావాల్సింది డాక్యుమెంటరీలూ గాథలూ కావు, కథలే. బాధితులే తప్ప బాధకుల్ని చూపించక పోవడం వల్ల, పెట్టుబడిదారీ పక్షమేమో కథకురాలన్న అనుమానం కూడా వచ్చేలా వుంది.  

నటనలు- సాంకేతికాలు     

నిస్సందేహంగా సీనియర్ నటి శ్రియది వినికిడి లోపమున్న పాత్రలో చూడదగ్గ నటనే. ఏ సీనులో కూడా కమర్షియలేతర రియలిస్టిక్ నటనని గుండెలోతుల్లోంచి ప్రదర్శించకుండా వదిలి పెట్టలేదు. అయితే సన్నివేశ బలం, భావోద్వేగ బలం లేకపోవడం వలన జీవం లేని నటనయింది. కథ వుంటేగా ఇవి వుండడానికి. తను లీడ్ క్యారక్టర్ కూడా కాలేదు. తను బట్టలు కుడితేనే కాదు, అల్లికలతో కథని కూడా కుట్టాలి. కుట్టాలంటే లీడ్ క్యారక్టరవాలి. కార్యకర్త కావాలి. డిజాస్టర్ / సర్వైవల్ జానర్ కూడా కాదు కాబట్టి ఇవి కాలేదు. తనది ఎపిసోడ్ క్యారక్టర్. ఎపిసోడ్ కి పరిమితమైన క్యారక్టరైనా ఒక మినీ కథయినా కావాలి. కూతురితో ఈ మినీ కథ చేయొచ్చు. వినికిడి లోపమున్న ఇలాటి ఏ తల్లికైనా ముందు తన కూతురి గొంతు వినాలనుంటుంది. ఇది చాలు మినీ కథకి. కూతురి గొంతు వినడం కోసమే చికిత్స చేయించుకోవాలని సంకల్పం వుంటే, తీరా వర్ష బీభత్సంలో ఓ పిడుగు పడి డ్రమెటిక్ గా వినికిడి శక్తి వచ్చేసి వుంటే, ఆ సంబరంతో కూతురి గొంతు వినాలనుకుంటే... కూతురి గొంతు పోవాలి అదే పిడుగుపాటు భయంతో. ఇది మనకొచ్చిన ఐడియా కాదు. 1972 లో మనోజ్ కుమార్ సూపర్ హిట్ షోర్ నుంచి కాపీ కొట్టాం.

        షోర్ లో మనోజ్ కుమార్ కొడుకు యాక్సిడెంట్ లో మూగవాడై పోతాడు. అతడికి గొంతు తెప్పించి మాటలు వినాలని వైద్యం కోసం నానా పాట్లు పడి విజయం సాధిస్తే, పని చేస్తున్న కర్మాగారంలో తన చెవులు పోతాయి...దీన్ని ఉదాహరణ చెప్పడానికే తీసుకున్నాం, కాపీ కొట్టాలని కాదు.

        స్కైలాబ్ తో నిత్యామీనన్, ఇప్పుడు గమనం తో శ్రియ - తాము యూనిక్ కథలని నీరుగార్చే పాత్రల్ని ఒప్పుకుంటున్నామని ఎప్పుడు గుర్తిస్తే అప్పుడు వాళ్ళ నటనలకి సార్ధకత వుంటుంది. మిగిలిన పాత్రల్లో తెలిసిన నటీనటులున్నారంటే ఏదో వున్నారంతే. వీళ్ళందరి మధ్య ఇద్దరు స్లమ్ పిల్లల కథ తమిళ సినిమా లోనిదేనేమో.


2016 లో వెట్రి మారన్ ‘విసారనైకి’ కి దర్శకత్వం వహించి దేశ విదేశాల్లో పేరు గడించక మునుపు - 2015 లో ‘కాక ముట్టై’ కి నిర్మాతగా వ్యవహరించి అంతే పేరు ప్రతిష్టలూ  పొందాడు. కాకపోతే దీనికి సహ నిర్మాతగా హీరో ధనుష్ వున్నాడు. ధనుష్వెట్రి మారన్ ల అండదండలతో కెమెరా మాన్ మణికందన్ దర్శకుడుగా మారిబాలల చలన చిత్రం ‘కాకముట్టై’ తీసి అంతర్లీనంగా గ్లోబలైజేషన్ స్వరూపాన్ని తేటతెల్లం చేశాడు. ‘కాకముట్టై’ (కాకి గుడ్డుని ఇద్దరు స్లమ్ పిల్లల గ్లోబల్ కోరికల కథగా తీశాడు.

        ఈ పిల్లలకి పిజ్జా కొనుక్కు తినాలని కోరిక. దానికి డబ్బుల కోసం చాలా కష్టపడతారు. తీరా కొనుక్కుని పిజ్జా ముక్క నోట్లో పెట్టుకుంటే - థూ, దీనికంటే స్టవ్ మీద ముసలి నానమ్మ వేసే బియ్యప్పిండి దిబ్బ రొట్టే ది బెస్ట్ అన్పిస్తుంది! అవసరం లేని గ్లోబల్ ఉత్పత్తుల మీద గురి చూసి సోషల్ కామెంట్ ఇది. దీనికి దేశ విదేశాల్లో 21 అవార్డు లొచ్చాయి. 2 కోట్ల బడ్జెట్ కి 12 కోట్ల బాక్సాఫీసూ వచ్చింది.

గమనం లో స్లమ్ పిల్లలు బర్త్ డేకి కేక్ కొనాలని ఆరాటపడతారు. ఇది కాకతాళీయమో కాపీనో దర్శకురాలే చెప్పాలి. అయితే తమిళంలో కేకుతో కాకుండా పిజ్జాతో కథ చేయడం- దిబ్బ రొట్టె కాంట్రాస్ట్ తో సామాజిక స్పృహ అయింది. గమనం లో ఇలాటిది కాలేదు. అసలీ కేకుతో బర్త్ డేలు మన కల్చర్ కాదని పిల్లలు చివరికి గుర్తించి, పుట్టిన రోజుకి శుభ్రంగా స్నానం చేసి గుడి కెళ్ళి గంట కొడితే, కాంట్రాస్ట్ తో ముచ్చటైన సోషల్ కామెంట్ అయ్యేది.

        మరో మూడు పేర్లూ బాక్సాఫీసు అప్పీలుగా వున్నాయి - ఇళయరాజా (సంగీతం), వీఎస్ జ్ఞాన శేఖర్ (ఛాయాగ్రహణం), బుర్రా సాయినాథ్ (మాటలు). నటీనటుల్లాగే ఈ ముగ్గురూ కూడా బాక్సులో విషయం లేకపోవడం వల్ల ప్రశ్నార్థకంగా మిగిలారు తమ ప్రతిభా పాటవాలతో.

చివరికేమిటి

ఫస్టాఫ్ సమయమంతా మూడు కథల పాత్రల్ని ఎస్టాబ్లిష్ చేయడానికే తీసుకున్నా పాత్రలు ఇంకా సరిగ్గా ఎస్టాబ్లిష్ కావు. భావోద్వేగాలు కనిపించని ఈ కథలు, పాత్రలు  నిదానంగా సాగడంతో ఫస్టావ్ ఓపికని పరీక్షిస్తుంది. సెకండాఫ్ వరదల్లో కష్టాలతో సాగుతుంది. ఫస్టాఫ్ లో కథలు, పాత్రలు సరిగ్గా ఎస్టాబ్లిష్ కాకపోవడంతో, ఈ సెకండాఫ్ లో భావోద్వేగాల్లేని పాత్రల స్ట్రగుల్ తో ఆడియెన్స్ కనెక్ట్ కష్టమైపోతుంది. ఇలా సెకండ్ యాక్ట్ కూడా సరిగ్గా ఎస్టాబ్లిష్ కాకపోవడంతో, ఆకస్మికంగా వచ్చే థర్డ్ యాక్ట్ సైతం ఆకట్టుకునే పరిస్థితి వుండదు. ఇలా స్క్రీన్ ప్లే ఏ యాక్ట్ లోనూ దాని బిజినెస్ జరగని పరిస్థితి ఈ సినిమాలోనే మొదటిసారిగా చూస్తాం. డాక్యుమెంటరీ చేస్తే యాక్ట్స్ సహజంగానే వుండవు.

        చివరిగా,దివ్యాంగుల్ని విషాద పాత్రలుగా చూపించే ఫార్ములా ఇక పోయింది. వాళ్ళని కూడా సాధారణ పౌరులుగానే సమానంగా ట్రీట్ చేసే సంస్కారాన్ని సమాజాలు గుర్తించాయి. పత్రికా భాష కూడా వికలాంగులు నుంచి దివ్యాంగులుకి మారింది. 2012 లో బర్ఫీ లో రణబీర్ కపూర్ మూగ చెవిటి పాత్ర ఫార్ములాని బ్రేక్ చేస్తూ హిలేరియస్ క్యారక్టర్ గా పాపులర్ అయింది. పాత్ర తన లోపాలతో బాధపడే విషాద పాత్రగా వుండదు. అలా చూపించే కుసంస్కారానికి పోలేదు.

        డిసెంబర్ 6 న దివ్యాంగుల సాధికారత అవార్డుల ప్రదానోత్సవం సందర్భంగా రాష్ట్రపతి స్టేజి దిగి అవార్డులు అందించడం తీవ్ర విమర్శలకి దారితీసిన ఉదాహరణ వుంది. రాష్ట్రపతి అలా స్టేజి దిగి రావడం దివ్యాంగులని అవమానించడమే అవుతుందన్న విమర్శలు వెల్లువెత్తాయి. రాష్ట్రపతి సమక్షంలో కెళ్ళి అవార్డులు అందుకునేందుకు తాము ముందుగానే డ్రెస్ రిహార్సల్స్ చేశామని, ఇందుకోసం హైడ్రాలిక్ లిఫ్ట్ కూడా ఉపయోగించామని, ఆ రిహార్సల్స్ అంతా వృధా అయిందనీ  దివ్యాంగులు చెప్పుకుని బాధ పడ్డారు. ఇలాంటి చర్యలతో తమని మరోమారు దివ్యాంగుల్ని చేయవద్దని విన్నవించుకున్నారు. ఆలోచనల్లో మార్పు రావాలని కోరారు. సామాజిక స్పృహతో సామాజిక కథకి ఇదవసరమే.

—సికిందర్


Friday, December 10, 2021

1104 : రివ్యూ

రచన- దర్శకత్వం : జె ధీరేంద్ర సంతోష్
తారాగణం : నాగశౌర్య
, కేతికా శర్మ, జగపతి బాబు, సచిన్ ఖెడేకర్, సత్య, రవి ప్రకాష్ తదితరులు
సంగీతం : కాల భైరవ
, ఛాయాగ్రహణం : రామ్
బ్యానర్స్ : శ్రీ వెంకటేశ్వరా సినిమాస్
, నార్త్ స్టార్ ఎంటర్ టైన్మెంట్
నిర్మాతలు : నారాయణ దాస్ నారంగ్
, పుష్కర్ రామ మోహన రావు. శరత్ మరార్
విడుదల : డిసెంబర్ 10
, 2021
***


        మొన్న అక్టోబర్ చివర్లోనే తను నటించిన వరుడు కావలెను పరాజయం చూసి ఇక విలుకాడుగా లక్ష్యానికి గురి పెట్టి బాణం విసురుతూ వచ్చేశాడు నాగశౌర్య. టైటిల్ : లక్ష్య’. పూర్తి మేకోవర్ తో ఎయిట్ ప్యాక్ కి అప్డేట్ అయి, అమీతుమీ తేల్చుకోవడానికి వచ్చేశాడు. 2011 నుంచీ ఒకే ఒక్క హిట్ తో, మరో 16 అవసరమే లేని ఫ్లాప్స్ తో ముందుకు పరుగులు తీస్తున్న నాగశౌర్య, ఎయిట్ ప్యాక్ స్పోర్ట్స్ డ్రామాతో బాక్సాఫీసు ఛాంపియన్ షిప్ కి కర్చీఫ్ వేశాడు. దర్శకుడుగా సుబ్రహ్మణ్య పురం తో సక్సెస్ ఇచ్చిన ధీరేంద్ర సంతోష్ ని తీసుకున్నాడు. ప్రముఖ నిర్మాతల బ్యానర్స్ అండదండలతో, తెలుగులో ఆర్చరీ (విలువిద్య) మీద తొలి క్రీడా చలన చిత్ర్రాన్ని పరిచయం చేస్తూ చరిత్ర పుటల్లో తన పేరుని నమోదు చేసుకున్నాడు. మరి ఇన్ని సమకూర్చుకున్న తను, ఇప్పుడు ఒకటైనా హిట్ కోసం వేసిన బాణాలేమిటి? అవెక్కడెక్కడ తగిలాయి? బాక్సాఫీసుకే తగిలాయా? ఈ సందేహాలు తీర్చుకుందాం...

కథ


  పార్థు (నాగశౌర్య) కి చిన్నప్పట్నుంచీ బాణా లేయడంలో నేర్పు. ఈ విద్య తండ్రి (రవి ప్రకాష్) కుండేది. అతను చనిపోయాక అతడి కలని తీర్చగల వాడుగా మనవడు పార్ధు కన్పిస్తాడు తాత (సచిన్ ఖెడేకర్) కి. ఇక సర్వస్వం ఒడ్డి విలు విద్యలో మనవడ్ని తీర్చి దిద్దుకుంటూ వస్తాడు. మనవడు పార్ధుకి తాత ప్రోత్సాహంతో బాటు, రీతిక (కేతకీ శర్మ) ప్రేమ కూడా లభించడంతో ఆర్చరీలో రాణించి రాష్ట్ర స్థాయి టోర్నమెంట్ గెలుస్తాడు. ఇక అంతర్జాతీయ పోటీలకి సిద్ధమవుతూంటే గుండెపోటుతో తాత చనిపోతాడు. ఈ బాధ తట్టుకోలేక పార్ధు డ్రగ్స్ మరిగి బహిష్కరణకి గురవుతాడు. ఇప్పుడు ఇతడి క్రీడా జీవితం ఏమయిందన్నది మిగతా కథ.

ఎలావుంది కథ

వెండితెర మీద ఆర్చరీతో స్పోర్ట్స్ మూవీ అనేది కాన్సెప్టుగా కొత్తదే. కథ  చూస్తే అదే కొత్త సీసాలో పాత సారా. కాకపోతే సారా బదులు డ్రగ్స్ చూపించారంతే. రొటీన్ టెంప్లెట్ స్పోర్ట్స్ డ్రామా. 1. ఒక గురువు, 2. ఒక శిష్యుడు, 3.శిక్షణ, 4. సమస్యలు, 5. ఒక ప్రత్యర్థి, 6. ప్రత్యర్ధితో ఓటమి, 7. తాజా శిక్షణ, 8. ప్రత్యర్ధి మీద గెలుపు! ...ఈ ఎనిమిది స్టోరీ బీట్స్ ని టెంప్లెట్లో వరుసగా వేసుకుంటూ పోతే స్పోర్ట్స్ మూవీ తయార్. చాలా ఈజీ స్క్రిప్టు తయారీ. ఇంత ఈజీగా దర్శకులు తీసి తీసి విసుగు చెందరేమో గానీ, ప్రేక్షకులకి అంత ఓపిక లేదు. లక్ష్య తో అసలే ఓపిక లేనట్టు ఇంటర్వెల్ కి బయటి కెళ్ళిన ప్రేక్షకులు చాలా మంది వెనక్కి రాక పోవడం ఆందోళన కల్గించే విషయం కాదేమో.

        ఆర్చరీ మీద తొలి సినిమా అన్నాక దీనికి మార్కెట్ యాస్పెక్ట్ పట్టింపు కూడా లేదు. కథా ప్రయోజనం అసలే లేదు. కనీసం కథగా సోల్ కూడా లేని నిర్జీవ నమూనాగా మిగిలింది. వరల్డ్ నంబర్ వన్ ప్రొఫెషనల్ ఆర్చర్ దీపికా కుమారి మీద తీసిన లేడీస్ ఫస్ట్ అనే అద్భుత అవార్డు విన్నింగ్ డాక్యుమెంటరీ తప్ప ఆర్చరీ మీద సినిమా రాలేదు. ఇప్పుడు తెలుగులోనే వచ్చింది. ఆర్చరీ లాంటి ప్రజాకర్షణ లేని పాసివ్ స్పోర్ట్స్ ని ప్రేక్షకుల్లో ప్రమోట్ చేసే ఒక మంచి అవకాశాన్నీ, ఇంకా మాట్లాడితే జాతీయ అవార్డునీ పొంద వచ్చన్న స్పృహ  గానీ లేకుండా కాన్సెప్ట్ ని వృధా చేశారు.

        ఈ సినిమాకి కావాల్సింది కథ కవసరం లేని నాగశౌర్య ఎయిట్ ప్యాక్ కాదు. ఎయిట్ ప్యాక్ లాంటి ప్యాకేజీ వుండాల్సింది ఈ విలు విద్య కథకి. నాగశౌర్య పాత్రకి పార్ధు అనే పేరు పెట్టి వదిలేస్తే కాదు. పురాణాల్లో విలువిద్యతో పార్ధు (అర్జునుడు) కీ, ఏకలవ్యుడుకీ వున్న సంబంధమేమిటో గుర్తు చేస్తూ- ఆర్చరీ పట్ల భావి క్రీడాకారులకి స్ఫూర్తిని, క్రేజ్ నీ రగిలించే ఒక కథా ప్రయోజనం, ఒక మార్కెట్ యాస్పెక్ట్ అవసరం.

        ఆర్చరీ అనే పాయింటుని ఒక క్యారక్టర్ గా తీర్చిదిద్దే హిస్టరీతో, బాక్సాఫీసు అప్పీలుతో, ఆర్చరీయే దైవమన్న భక్తితో - దాని ఎమోషనల్ కంటెంట్ కోసం, సోల్ కోసం  ప్రయత్నించకుండా - అర్ధం లేని చిత్రణలు నాగశౌర్య పాత్రకి ఆపాదించారు. ఆర్చరీతో నాగశౌర్యకి ఏ ఎటాచ్ మెంటూ కనబడదు. అలాటి ఒక్క సీను కూడా లేదు. తాత తోనే ఎటాచ్ మెంట్, పిల్లలతోనే ఎటాచ్ మెంట్, హీరోయిన్ తోనే ఎటాచ్ మెంట్. తాత చనిపోతే ఆ బాధ మరుపుకి డ్రగ్స్ తో మత్తు బానిసవడం, విలన్ తో హింసఏం చెప్తున్నారు ఈ కథతో? ఆర్చరీ క్రీడ చంఢాలమైనదనీ, దాని జోలికి పోకూడదనా? స్ఫూర్తిమంతంగా, ఉత్సాహజనకంగా వుండాల్సిన కథలో ఈ డ్రగ్స్ తో రిపల్సివ్ మూడేంటి?

నటనలు- సాంకేతికలు
నాగశౌర్యది పూర్తిగా పాసివ్ పాత్ర. తాత ఎదురుగా లేకపోతే బాణం వేయలేని పాసివ్ పాత్ర. తాత చనిపోతే డ్రగ్స్ మరిగి పతనమయ్యే విషాద పాసివ్ పాత్ర. సెకండాఫ్ లో జగపతి బాబు వచ్చి లేపి చెప్తేగానీ లక్ష్యం తెలియని పాసివ్ పాత్ర. ఈ కథ నాగశౌర్య క్యారక్టర్ గ్రాఫ్, క్యారక్టర్ గ్రోత్, క్యారక్టర్ స్టడీ గురించైనట్టు. ఈ ప్లాట్ టూల్స్ అన్నీ ప్రధానంగా వుండాల్సింది ఆర్చరీ స్పోర్ట్స్ కి కాదన్నట్టు. ఆర్చరీ కథే కానట్టు, నాగశౌర్య పాత్ర కథే అన్నట్టు! అద్భుత పాత్ర చిత్రణ...

        తాతగా సచిన్ ఖెడేకర్ కూడా కథకుడి చేతిలో కీలుబొమ్మ పాత్ర. నాగశౌర్య పాత్ర డ్రగ్స్ ని మరగాలంటే తాత సడెన్ గా చావాలి. ఈ చావుతో పాపం ఆస్తులమ్మి మనవణ్ణి తీర్చిదిద్దుతున్న తాత మనవణ్ణి వీధిన పడేశాడు. ఈ చావు సానుభూతి నిచ్చేదేనా?

మొదట్లో తండ్రి పాత్ర కూడా, ఆర్చరీ గెలిచొస్తానని తాతకి చెప్పి వెళ్ళే సీను కట్ చేస్తే, నెక్స్ట్ సీన్లో యాక్సిడెంట్లో చనిపోయాడని కబురు! కథ నడపాలంటే సడెన్ చావులు తప్పవన్నమాట!

        ఇక జగపతి బాబు పాత్ర ఎక్కడ్నించి వస్తుందో, ఎందుకొస్తుందో సిల్లీగా వుంటుంది. తను రెండో కృష్ణుడన్నట్టు గురువు నెంబర్ టూ. హీరోయిన్ కేతికా శర్మ పాత్ర కూడా ఎందుకుంటుందో, ఏం చేస్తూంటుందో తెలియదు. గ్యాలరీలో కూర్చుని చప్పట్లు మాత్రం కొడుతుంది. చచ్చిపోతూ తాత హీరోని ఒప్పజెప్పాడని, రెండో కృష్ణుడు వచ్చే వరకూ హీరోకి గార్డియన్ లా వుంటుంది. లేకపోతే వుండదేమో. కానీ హీరో డ్రగ్స్ ఆరగిస్తూంటే తెలియని గార్డుగా సరదాగా వుంటుంది, పారితోషికం ఇస్తున్నందుకు.

        సాంకేతికంగా బలహీనమే. ఆర్చరీ ట్రైనింగు, ఈవెంట్స్, ఆఖరికి వరల్డ్ కాంపిటీషన్ దృశ్యాలూ అపరిపక్వంగా వున్నాయి. కనీసం ఇవైనా ప్రొఫెషనల్ గా వుండి థ్రిల్ చేస్తే ఓ యాక్షన్ మూవీ చూసినట్టయినా వుండేది. హాకీ, ఫుట్ బాల్ ఆటల్లాగా యాక్షన్ ఓరియెంటెడ్ గా వుండదు బాణాలేసే ఆర్చరీ. ప్రత్యర్ధితో నేరుగా తలబడ్డం వుండదు. ఎదురుగా బోర్డు మీద బుల్స్ ఐని నిలబడి గురిచూసి కొట్టడమే వుంటుంది. కానీ బాణాలతో జలదరింప జేసే పోరాట సినిమా లెన్నో వచ్చాయి. పద్మావత్ చూసినా, ఇందులో సింహళ రాకుమార్తె పద్మావత్ పాత్రలో దీపికా పడుకునే, బాణాలతో జింకని వేటాడే ఓపెనింగ్ విజువల్స్ ని ఎవరు మర్చిపోతారు.

చివరికేమిటి

చిన్నప్పట్నుంచీ కథ చూపించారు. తాత- తండ్రి-మనవడుల జీవితం చూపిస్తూ స్పూన్ ఫీడింగ్ చేశారు. ఇదేదో ఫ్యామిలీ కథైనట్టు జానర్ మర్యాద కలుషితం. ఈ బయోగ్రఫీ అంతా, పరిచయమంతా కూడా, స్పోర్ట్స్ జానర్ మర్యాద కింద, బాక్సాఫీసు అప్పీలు కోసం, ఆర్చరీతో వుండాల్సింది. తాతా, కోచింగ్ కి వెళ్తున్నానంటాడు హీరో. తాత దగ్గుతాడు. ఇక హీరో కోచింగ్ కి వెళ్ళే సీను లేకుండా, తాతతో సెంటిమెంటు -ఎటాచ్ మెంటు సీను వచ్చేస్తుంది. ఇలా ఆర్చరీ సీన్లకి పదేపదే తాతా మనవళ్ళ అనుబంధాల సీన్లు, హీరోయిన్ లవ్ సీన్లు, ఆర్చరీలో ప్రత్యర్ధి (విలన్) తో గొడవల సీన్లూ ఆల్టర్నేట్ గా వచ్చి అడ్డుపడుతూంటాయి. కథకుడికి దేనిమీద మక్కువ వుందో ఇలా తెలిసి పోతూంటే ఇంకేం స్పోర్ట్స్ సినిమా చూస్తాం. పైగా ప్రత్యర్ధిని ముందే చూపించడంతో కథేమిటో ఇక్కడే తెలిసిపోతోంది.

        తాత మరణం, హీరో డ్రగ్స్ సేవనం, మత్తులో వున్న హీరో ఇంటర్వెల్ సీన్లో ఈవెంట్ కెళ్ళకుండా విలన్ గ్యాంగ్ దాడి చేసి అడ్డుకోవడం లాంటి రొటీన్ కి, హీరో గాయాలతో తూలుతూ వచ్చి ఈవెంట్ లో బాణం వేసి గెలిచి పడిపోవడం లాంటి ఇంకో రొటీన్ జీవం లేనివిగా వుంటాయి. ఫస్టాఫ్ ఇలా విఫలమయ్యాక, సెకండాఫ్ కథ వదిలేసి హీరో ఎమోషనల్ డ్రామాలతో మరీ ఎక్కడికో వెళ్ళిపోయింది...ఎయిట్ ప్యాక్ ని  కేవలం ఒక రెస్టారెంట్ లో సిల్లీ గొడవకి షర్టు విప్పి చూపించడం. ఈ మైనర్ ఫైట్ కోసమే ఎయిట్ ప్యాక్. ఇలా మొత్తానికి నాగశౌర్య వేసిన బాణం ఇంకో ఫ్లాప్ ని పెంచడానికే పనికొచ్చింది....

—సికిందర్
 

Wednesday, December 8, 2021

1103 : బాక్సాఫీస్

శుక్రవారం 10వ తేదీ ఇంకో 8 సినిమాలు ఒకేసారి విడుదలవుతున్నాయి. గత నెల 19 న కూడా ఒకేసారి  తొమ్మిది సినిమాలు విడుదలయ్యాయి. పెద్ద సినిమాలు లేని శుక్రవారం చూసుకుని ఛోటా సినిమాలు ఈ సంఖ్యలో విడుదలై పోతున్నాయి. ఈ శుక్రవారం లక్ష్య తప్ప మిగిలినవి చిన్న సినిమాలే. లక్ష్య సహా అన్ని సినిమాలూ కొత్త దర్శకులవే. లక్ష్య లో నాగ శౌర్య హీరో. ఇది మరో స్పోర్ట్స్ డ్రామా. సంతోష్ జాగర్లపూడి దర్శకత్వం. ట్రైలర్ తో ఆసక్తి రేపింది. ఈ మూవీ ట్రైలర్‌ ని గ్లామర్ కోసం విక్టరీ వెంకటేష్ విడుదల చేశారు. పైగా నాగశౌర్య పలకల శరీరం (సిక్స్ ప్యాక్) తో పరిచయమవుతున్నాడు. క్రీడాకారులు సిక్స్ ప్యాక్ తో వుంటారా అన్నది వేరే సంగతి. కేతికా శర్మ మరో సారి హీరోయిన్ గా కనిపించబోతోంది. ఈమె ఇటీవలే పూరీ జగన్నాథ్ తనయుడు ఆకాష్ పూరీ రోమాంటిక్ లో హీరోయిన్ గా తెలుగు తెరకి పరిచయమైంది. ప్యాడింగ్ ఆర్టిస్టులుగా జగపతి బాబు, సచిన్ ఖేడేకర్ ల బలం ఈ సినిమాకి వుంది. దీని నిర్మాతల్లో ప్రముఖులు నారాయణ్ దాస్ కే నారంగ్, శరత్ మరార్ వున్నారు.

        మెయిన్ మూవీ శౌర్య తర్వాత చెప్పుకో దగ్గ మూవీ గ్యాంగ్ స్టర్ నయీమ్ జీవిత కథ నయీమ్ డైరీస్’. ఈ వివాదాస్పద నయీమ్ కథలో చాలా నిజాలు నిజాయితీగా చెప్పాననీ, సినిమా ఎలా రిలీజ్ చేస్తావో చూస్తామని బెదిరింపులు వస్తున్నాయనీ దర్శకుడు దాము బాలాజీ చెప్పడం ఆసక్తిని పెంచింది సినిమా మీద. ఇందులో నయీమ్ పాత్రని వశిష్ట సింహా పోషించాడు. ఇతను కేజీఎఫ్, నారప్ప సినిమాలతో తెలుగు ప్రేక్షకులకి పరిచయమైన నటుడు. దీని ట్రైలర్ చూస్తూంటే సాంకేతిక బలంతో పవర్ఫుల్ గా కన్పిస్తోంది.

        పోతే, కొత్త దర్శకురాలు సుజనా రావు తీసిన గమనం లో శ్రియ నటించింది. ఇంకో పాత్రలో నిత్యా మీనన్ కన్పిస్తుంది. సుహాస్ కూడా ఓ పాత్రలో కన్పిస్తాడు. హైదారాబాద్, విశాఖల్లో షూటింగ్ చేశారు. ఇళయరాజా సంగీతం వహించిన ఈ హీరోయిన్ ఓరియెంటెడ్ కథ ఐదు భాషల్లో విడుదలవుతోంది.

        మిగిలిన అయిదూ కొత్త నటులవే. మడ్, బుల్లెట్ సత్యం, కఠారీ కృష్ణ, ప్రియతమా, మనవూరి పాండవులు. అందరూ కొత్త దర్శకులే తెలుగు ప్రేక్షకులకి అందిస్తున్న ఈ ఎనిమిదిలో ఎన్ని నిలబడతాయో శుక్రవారం తేలుతుంది. ఈవారం పెద్ద సినిమాలు లేకపోయినా అఖండ సృష్టిస్తున్న మేనియా ఇంకా తగ్గలేదు. ఒకప్పుడు సింగిల్ స్క్రీన్స్ లో విడుదలైనప్పుడు హైదారాబాద్, విజయవాడ లాంటి నగరాల్లో పెద్ద సినిమాల మధ్య చిన్న సినిమాలు విడుదల చేస్తే, పెద్ద సినిమా బుకింగ్స్ ఫుల్ అయిపోతే, కాంపౌండులో చిన్న సినిమా వున్న థియేటర్లో పడే వాళ్ళు పెద్ద సినిమా కొచ్చిన ప్రేక్షకులు. ఇలా బతికిన చిన్న సినిమా లున్నాయి. ఆన్ లైన్ బుకింగ్స్ తో ఇప్పుడా పరిస్థితి లేదు.

***


Saturday, December 4, 2021

1102 : రివ్యూ


 

రచన - దర్శకత్వం : విశ్వక్ ఖందేరావు
తారాగణం : నిత్యా మీనన్,
సత్య దేవ్, తనికెళ్ళ భరణి, రాహుల్ రామకృష్ణ తదితరులు
సంగీతం :
ప్రశాంత్ విహారి, ఛాయాగ్రహణం : జవ్వాది ఆదిత్య
బ్యానర్ :   
బైట్‌ ప్యూచర్స్, నిత్యామీనన్‌ కంపెనీ 
నిర్మాత
లు  : నిత్యా మీనన్, పృథ్వీ పిన్నమరాజు
విడుదల : డిసెంబర్ 4, 2021

***

 

        1979 లో  సంచలనం సృష్టించిన స్కైలాబ్ దుర్ఘటనని పురస్కరించుకుని స్కైలాబ్ అనే ప్రయోగాత్మక తెలంగాణా నేటివిటీ సినిమా తీశాడు కొత్త దర్శకుడు విశ్వక్ ఖందేరావు. దీన్లో నటిస్తూ సహ నిర్మాతగా వ్యవహరించింది పాపులర్ హీరోయిన్ నిత్యా మీనన్. పాపులర్ నటుడు సత్యదేవ్ ఒక పాత్ర వేశాడు. రాహుల్ రామకృష్ణ, తనికెళ్ళ భరణి తదితరులు ఇతర పాత్రల్లో నటించారు. మూస కథలకి భిన్నంగా వైవిధ్య కాన్సెప్ట్స్ తో ముందుకు వస్తున్న ఇలాటి తెలుగు సినిమాలకి ఆదరణ పెరగాలి. నిత్యా మీనన్ స్వయంగా పూనుకుని సహ నిర్మాతగా ముందుకు వచ్చిందంటే ఈ కాన్సెప్ట్ ఆమెని అంతగా ఆకర్షించి వుండాలి.  సినిమాలో ఆమె నటించడం మంచి బాక్సాఫీసు ఆకర్షణ కూడా అయింది. పాపులర్ హీరో హీరోయిన్లు ఇలాటి కాన్సెప్ట్స్ లో నటిస్తూ వుంటే ప్రేక్షకుల్లోకి ఎక్కువ వెళ్తాయి. మరి ఈ నిత్యా మీనన్ ఔటింగ్ ఎంతవరకూ దీన్ని సాధించింది? హైలీ ఎడ్యుకేటెడ్ అయిన తను హైక్వాలిటీ ఎంటర్ టైనర్ అందించిందా?  

కథ

1979 లో తెలంగాణాలోని బండ లింగం పల్లి గ్రామం. అక్కడ గౌరి (నిత్యా మీనన్) దొరబిడ్డ. ఈమెకి పత్రికా రిపోర్టర్ అవ్వాలని బలమైన కోరిక. హైదరాబాద్ లో ప్రతిబింబం అనే పత్రికలో ఈమె రాతలు చూసి ఎడిటర్ ఇంటికి పంపించేస్తే వచ్చి ఇంట్లో వుంటోంది. ఎలాగైనా వూళ్ళో వార్తలు రాసి పేరు తెచ్చుకుంటానని తండ్రికి సవాలు చేస్తుంది. తల్లి సహకరిస్తూంటుంది.

        ఆనంద్ (సత్యదేవ్) కూడా హైదారాబాద్ లో డాక్టరుగా సస్పెండ్ అయి వచ్చి వూళ్ళో తాత సదాశివం (తనికెళ్ళ భరణి) దగ్గర వుంటూ, క్లినిక్ పెట్టుకోవడానికి డబ్బులకోసం వేధిస్తూంటాడు. ఇంకో రామారావు (రాహుల్ రామకృష్ణ) అనే సుబేదారుల కొడుకు అప్పులు చేస్తూ తిరుగుతూంటాడు.

        ఇలా ఈ ముగ్గురూ మూడు లక్ష్యాలతో వుంటే, స్కైలాబ్ పడబోతోందని రేడియో వార్త వస్తుంది. దీంతో వూళ్ళో కంగారు పడతారు ప్రజలు. గౌరికి వార్తలు రాయడానికి ఇది మంచి టాపిక్ అయితే, రామారావు దగ్గర అప్పు చేసి క్లినిక్ పెట్టబోయిన ఆనంద్ కి బ్రేకు పడుతుంది. ఇప్పుడు ఈ నేపథ్యంలో ముంచుకు వస్తున్న ప్రమాదంతో ఎవరి జీవితాలేమయ్యా యన్నది మిగతా కథ.   

ఎలావుంది కథ

1979 లో 850 టన్నుల అమెరికా అంతరిక్ష ప్రయోగ శాల స్కైలాబ్ ఆకాశంలో పతనమై భూమ్మీద ఢామ్మని పడ్డానికి సిద్ధమైంది. అది తెలంగాణా మీదే పడుతుందని పుకార్లు వ్యాపించాయి. మరీ ముఖ్యంగా కరీంనగర్ జిల్లా మీద. దీంతో చావు తప్పదని ప్రజలు మేకలూ కోళ్ళూ తెగ కోసుకు తినేసి తృప్తిగా చనిపోవడానికి రంగం సిద్ధం చేసుకున్నారు. తీరా జులై 19 న స్కైలాబ్ శకలాలు వెళ్ళి హిందూ మహా సముద్రం లోనూ, అటు పశ్చిమ స్ట్రేలియా లోనూ పడ్డాయి.

        ఈ ఉదంతాన్ని స్కైలాబ్ కథగా తీసుకున్నారు. 2011 లో ఫ్రెంచి కామెడీగా లీ  స్కైలాబ్ అనే మూవీ వచ్చింది. గ్రాండ్ మా పుట్టిన రోజు జరుపుకోవడానికి విలేజీలో ఓ బంగాళా కొచ్చిన బంధు మిత్ర పరివారం, ఫ్రాన్స్ మీద స్కై లాబ్ పడుతోందన్న వార్తకి ఎలా స్పందించారన్న కథ. ఇందులో కుటుంబ బంధాలు, టీనేజీ ప్రేమలు వగైరా చర్చించారు.

        తెలుగు స్కైలాబ్ మంచి సోషల్ కామెడీ అయ్యే అవకాశమున్న కథ. అయితే ఈ కథ ఏ జానర్ కిందికి వస్తుందో గుర్తించి ఆ జానర్ మర్యాదలతో కథ చేయకపోవడం వల్ల విఫలమైంది. డిజాస్టర్ జానర్ కథని డిజాస్టర్ జానర్ మూవీ ఎలిమెంట్స్ తో తీయాలి. తెలంగాణా సినిమాలతో సమస్యేమిటంటే, ప్రతీ సినిమాలోనూ తెలంగాణా జీవితం చూపించడానికే పాత్రలుంటాయి. పాత్రలతో తెలంగాణా జీవితమెక్కువ, పాత్రలతో కథ తక్కువ. ఆ కథ కూడా నాన్ కమర్షియల్ కేటగిరీలోకి చేరిపోయే పరిస్థితి.   

 వాస్తవంగా స్కైలాబ్ ప్రమాద వార్త పరిణామాల్లోనే కామెడీ వుంది. చాలా కామెడీగా తాము చచ్చిపోతామనే డిసైడ్ అయ్యారు అప్పటి ప్రజలు. చివరి కోర్కెలు తీర్చుకోవడం ప్రారంభించారు. డిజాస్టర్ జానర్ కథలు రెండు రకాలు. ఒకటి సీరియస్ యాక్షన్, రెండోది కామెడీ. ఇది డిజాస్టర్ కామెడీ కిందికి వస్తుంది. ఈ కథ అనుకున్నప్పుడు జానర్ గురించి  ఆలోచించి రీసెర్చి చేసుకున్నట్టు లేదు. డిజాస్టర్ కామెడీలుగా గత పదేళ్ళ లోనే వచ్చిన దిసీజ్ ది ఎండ్’, ది వరల్డ్స్ ఎండ్’, కూటీస్ మొదలైనవి వున్నాయి. ఇవి చూసి వుంటే స్కైలాబ్ ఎలా తీయాలో తెలిసి వుండేది. ఒక చారిత్రక ఘటనతో అపూర్వ ఐడియా అన్నప్పుడు వచ్చిన అవకాశాన్ని వృధా చేసుకోకూడదు. దాన్ని చెడగొట్టి, బాగా తీయగల్గే వాళ్ళకి అవకాశం లేకుండా చేయకూడదు.

నటనలు -సాంకేతికాలు

నిత్యా మీనన్ నాటి తెలంగాణా పీరియెడ్ పాత్రలో డమ్మీ జర్నలిస్టుగా బాగా కుదిరింది. అమాయకత్వంతో కూడిన సున్నిత హాస్యం చేసింది. క్లయిమాక్స్ లో కదిలించే సన్నివేశంతో రాణించింది. భాష, నటన, హావభావాలు పలికించడంతో ఆమెకి తిరుగులేదు. తల్లిదండ్రులతో ఆమె మొండి తనంతో కూడిన హాస్య దృశ్యాలు నవ్విస్తాయి. తను కని పించినప్పుడల్లా దృష్టి నాకర్షిస్తుంది. అలరిస్తుంది, ఆనందింప జేస్తుంది. ఇదంతా కథలోంచి పాత్రని తీసి వేరుగా చూసినప్పుడు. కథలో పెట్టి పాత్రని చూస్తే, పాత్రకీ కథకీ ఉపయోగపడిందేమీ లేదు.

        కథ అన్నాక ఒక కథానాయకుడో, కథా నాయకురాలో వుంటారు కథని నడిపించడానికి. ఈ కథకి సత్యదేవ్ కథానాయకుడు కాదని సినిమా చూస్తూంటే గానీ బయటపడదు. మరి నిత్యామీనన్ కథా నాయకురాలా అంటే అదీ కాదు. కానీ మార్కెట్ యాస్పెక్ట్ తో చూస్తే తనే కథా నాయకురాలవాలి. అంటే హీరోయిన్ ఓరియెంటెడ్ మూవీ అవ్వాలి. అప్పుడు ఆమె పాత్రకి అర్ధం వుండేది.

        సత్యదేవ్ సహాయ పాత్రలాగా వుంటాడు. ఇలా కూడా చేయడానికేమీ లేదు. ఈ కామెడీలో పాత్రకి వుండాల్సిన హుషారు లేదు. డిటో రాహుల్ రామకృష్ణ. ఇక ఇతర  తెలంగాణా పాత్రల్లో నిత్యా మీనన్ తల్లి పాత్ర నటి, రాహుల్ రామకృష్ణ నానమ్మ పాత్ర నటి బావున్నారు.  

        పాటలకి పెద్దగా ప్రాధాన్యం లేదుగానీ నేపథ్య సంగీతం కొన్ని సన్నివేశాలకి బావుంది. లొకేషన్స్ తో, కాస్ట్యూమ్స్ తో, సెట్ ప్రాపర్టీస్ తో  కళాదర్శకత్వం మాత్రం పకడ్బందీగా వుంది పీరియెడ్ వాతావరణాన్ని సృష్టిస్తూ. కెమెరా వర్క్ సైతం ఉన్నతంగా వుంది. ఇంత మంచి సాంకేతిక సహకారం పొందిన కొత్త దర్శకుడు సినిమాని నిలబెట్టడంలో మాత్రం తగిన కృషి చేయలేకపోయాడు.

చివరికేమిటి

ఉరకలేసే క్రేజీ కామెడీతో, జానర్ డిమాండ్ చేస్తున్న అద్భుత రసపు కథా కథనాలతో, స్కైలాబ్ ఉపద్రవాన్ని ఎదుర్కొనే అడ్వెంచరస్ క్యారక్టర్ గా నిత్యామీనన్ మ్యాజిక్ చేయాల్సింది- ఈ లక్షణాలేవీ లేని డమ్మీ పాత్రగా మిగిలిపోయింది. తన పాపులారిటీతో ఫిమేల్ ఆడియెన్స్ ని కూడా థియేటర్లకి రప్పించే పనికే దూరంగా వుండిపోయింది. ఫస్టాఫ్ అంతా నిత్య, సత్యదేవ్, రామకృష్ణల విడివిడి ఉపకథలు చూపిస్తూ, స్కైలాబ్ కూలుతోందన్న పాయింటు వచ్చేసరికి ఇంటర్వెల్ వచ్చింది.

        ఫస్టాఫ్ లో చూపించిన కామెడీ సున్నిత హాస్యం చేయడంతో, అది నవలా సాహిత్యంలా అనిపిస్తూ సామాన్య ప్రేక్షకులకి దూరంగా వుండిపోయింది. తెరమీద చూ పించడానికి పనికిరాని నవలా కథనం వల్ల ఫస్టాఫే సహన పరీక్షగా మారింది.

        స్కైలాబ్ పాయింటు కొచ్చాక,  ఆ ప్రమాద వార్తకి గట్టి రియాక్షన్స్ చూపించాల్సింది పోయి, హడావిడి మొదలెట్టాల్సింది పోయి- నీరసంగా సాగే సీన్స్ తో మరీ దెబ్బతినిపోయింది సెకండాఫ్. పంచ్ లేదు, పరుగులు లేవు, ఎత్తుగడల్లేవు, బతకడానికి పాట్లు లేవు. ఉపద్రవంలో లీడ్ చేసే మెయిన్ క్యారక్టర్ లేదు. మినిమం కథా లక్షణాలే లేని సినిమా తీసి ఏం ప్రయోజనం. అరుదైన కాన్సెప్టుతో అరుదైన డిజాస్టర్ కామెడీని అందించే బంగరు అవకాశాన్ని కొత్త దర్శకుడు ఇలా కోల్పోవడం విచారకరం.

—సికిందర్