రచన - దర్శకత్వం : సుజనా రావు
తారాగణం : శ్రియా శరన్,
నిత్యా మీనన్, ప్రియాంకా జవల్కర్, శివ కందుకూరి, బిత్తిరి
సత్తి తదితరులు
సంగీతం : ఇళయరాజా, ఛాయాగ్రహణం : వీఎస్ జ్ఞాన శేఖర్
బ్యానర్స్ : క్రియా ఫిలిం కార్పొరేషన్, కాళీ
ప్రొడక్షన్స్
నిర్మాతలు : కె రమేష్, పి వెంకీ, వీఎస్ జ్ఞాన శేఖర్
విడుదల : డిసెంబర్ 10,
2021
***
గత మూడు
నెలలుగా ముగ్గురు కొత్త యువ దర్శకురాళ్ళు తెలుగు
వెండితెర మీది కొచ్చారు : గౌరీ రోణంకి (పెళ్ళి సందడి), లక్ష్మీ సౌజన్య (వరుడు కావలెను), సుజనా రావు (గమనం). తొలి ఇద్దరివీ కమర్షియల్
ప్రయత్నాలైతే, సుజనా రావుది సామాజిక స్పృహతో ఆఫ్ బీట్
ప్రయత్నం. ఆహ్వానించ దగ్గది. ఇలాటి ప్రయత్నాలకి పాపులర్ నటులు, సాంకేతికులు తోడైతే ప్రేక్షకుల్లోకి వెళ్ళే అవకాశాలెక్కువ వుంటాయి. ‘గమనం’ కి శ్రియా శరణ్, నిత్యా
మీనన్, సుహాస్, చారు హాసన్, బిత్తిరి సత్తిలతో బాటు, రచయిత సాయినాధ్ బుర్రా, సంగీత దర్శకుడు ఇళయ రాజా, ఛాయా గ్రాహకుడు జ్ఞాన శేఖర్ ల వంటి ప్రముఖుల సమ్మేళనంతో ప్యాకేజీ ట్రెండీగా
వుంది. తెల్లారి పోయిన ఆర్ట్ సినిమాలని బాలీవుడ్
స్టార్స్ తో తీసి ట్రెండ్ లో కి తీసుకొచ్చి- ‘క్రాసోవర్
సినిమా’ అనే కొత్త కేటగిరీని సృష్టించిన శ్యామ్ బెనెగల్ బాట
ఎవరికైనా మంచిదే.
ఈ బాటలో కొత్త
యువ దర్శకురాలు సామాజిక స్పృహతో ‘హైదరాబాద్ లో వరదలు’
అనే ఇంత వరకూ ఎవరూ ప్రయత్నించని యూనిక్ కాన్సెప్ట్ ని తీసుకుంది. ఈ మధ్య ‘నూటొక్క జిల్లాల అందగాడు’, ‘కొండపొలం’, ‘అద్భుతం’, ‘స్కై లాబ్’, ‘లక్ష్య’ ...ఇవి కూడా యూనిక్ కాన్సెప్టులే. ఇవన్నీ కూడా పాత మూస ఫార్ములా ధోరణులతో
కాన్సెప్టులకి అన్యాయం చేసి అపజయాల సంఖ్య పెంచినవే. ‘గమనం’ కూడా ఇదే బాటలో వెళ్ళిందా, బెనెగల్ తరహా సమ్మోహనకర ప్యాకేజీ
వుండి కూడా? యూనిక్ అంటేనే అసాధారణమైన,
అరుదైన, ప్రత్యేకమైన అని అర్ధం. ఈ అర్ధాన్ని ‘గమనం’ అయినా నిలబెట్టుకుందా?
లేక ఆకాశం నుంచి దిగివచ్చినా మన తెలుగు సినిమాల కాన్సెప్టులింతే, గమ్యమింతే అన్పించుకుందా? ఈ ప్రశ్నలకి ఏమని సమాధానం
చెబుతోందో చూద్దాం...
హైదరాబాద్ లో మూడుగా విభజించి చూపించిన
జీవితాలవి...మొదటిది, ఆమె కమల (శ్రియ) అని వినికిడి లోపమున్న
వివాహితురాలు. చిన్న కూతురుతో వుంటుంది. భర్త గల్ఫ్ లో టాక్సీ నడుపుతూ వుంటే, తను బస్తీలో బట్టలు కుడుతూ జీవనం సాగిస్తూంటుంది. భర్త వచ్చేలోగా
వినికిడి సమస్యకి వైద్యం చేయించుకుని, భర్త తెచ్చే డబ్బుతో
చిన్న ఇల్లు కట్టుకోవాలని ఆశతో వుంటుంది.
రెండోది,
నగరంలో ఇంకో చోట అలీ (శివ కందుకూరి) అనే
యువకుడు తాత
(చారు హాసన్) తో వుంటాడు. మెడిసిన్ చదివే ఇతను
తాత మాట వినక, క్రికెటరై
దేశానికి ప్రాతినిధ్యం వహించాలని కృషి చేస్తూంటాడు. అక్కడే జారా(ప్రియాంకా జవల్కర్) అనే
పెద్దింటి యువతి వుంటుంది. వీళ్ళిద్దరూ ప్రేమించుకుంటే పెద్దలు ఒప్పుకోరు. జారా
పారిపోయి అలీ దగ్గరికి వచ్చేస్తుంది పెళ్ళి చేసుకోవాలని.
మూడోది, మరింకో చోట మురికి వాడలో ఇద్దరు వీధి బాలలుంటారు. చిత్తు కాగితా లేరుకుని
బ్రతుకుతూంటారు. ఈ ఇద్దర్లో ఒకడికి పుట్టిన రోజు ఘనంగా జరుపుకోవా లనుంటుంది.
అందుకు కేక్ కొనేందుకు, మట్టి వినాయకుల విగ్రహాలమ్మి
డబ్బు పోగేస్తూంటారు.
ఈ మూడు చోట్లా జీవితాలిలా వుండగా, నగరంలో భారీ వర్షాలు కురిసి వరదలొచ్చేస్తాయి. వరదలకి ప్రాణాలతో బాటు కలలు, ఆశలూ కల్లోలితమవుతాయి. ఇందులోంచి ఎలా బయటపడి జీవితాల్ని తిరిగి గాడిలో
పెట్టుకున్నారనేది మిగతా కథ. ఈ మిగతా కథలో
అలీ తాతతో బాటు, అలీ మిత్రుడు అబ్దుల్లా (సుహాస్), అలీ కోచ్ (రవి
ప్రకాష్), జారా తండ్రి (సంజయ్ స్వరూప్), గాయని శైలపుత్రి (నిత్యా మీనన్) మొదలైన వ్యక్తులెక్కడ కనెక్ట్ అయ్యారనేది
కూడా చూడొచ్చు.
గత వారమే విడుదలైన కుప్పకూలే ‘స్కై లాబ్’ యూనిక్ కథ లాగే,
హైదరాబాద్ లో వరద ముప్పుతో ఇది కూడా డిజాస్టర్ జానర్ యూనిక్ కథ. ‘స్కైలాబ్’ లాగే డిజాస్టర్ జానర్ ఎలిమెంట్స్ తో కథ
చేసుకోని కథ. అలాగని వరద ముప్పులో సర్వైవల్ (జీవన్మరణ పోరాటం) జానర్ ఎలిమెంట్స్
తో కూడా చేయని కథ. పోనీ ఒక సామాజిక
స్పృహతో ఆర్ట్ లేదా ఆఫ్ బీట్ మూవీయా అంటే అలా కూడా ఈ కథాంగాలు వుండవు. అన్ని కథా
లక్షణాలూ తీసేసి- వరదలొచ్చాయి, ఇందులోంచి ఎలా బయట పడ్డారూ అన్న
డాక్యుమెంటరీ మాత్రపు ప్రయత్నంగా యూనిక్ కథ మిగిలింది. పేరుప్రతిష్టల్ని తెచ్చి
పెట్టే యూనిక్ కథ ఇలా సింహాసనం నుంచి జారిపోగా, ఈ
డాక్యుమెంటరీ శైలి కథనం మొదట్నుంచీ మూడుగా
విభజించి చూపించిన జీవితాల చిత్రీకరణల్లో కన్పిస్తూ వస్తుంది. ఈ డాక్యుమెంటరీ
కథనమే మొత్తం కథకొక అల్లిక, మెలికలు, ముడులు లేకుండా చేసింది. అసలు దేనితో ఏం చేస్తున్నామో
తెలుసుకోకుండా రాసేసి తీసేస్తే ఇలాగే వుంటుందేమో. ఈ కథ కూడా పైన చెప్పుకున్న
ఇటీవలి నాల్గు సినిమాల యూనిక్ కాన్సెప్టుల బాటలోనే బుట్ట దాఖలైపోయింది.
మూడుగా విభజించి చూపించిన జీవితాలతో
మూడు కథలు. అంటే మూడు విడివిడి కథల ఒక ఆంథాలజీ అన్నమాట. అంటే హైపర్ లింక్ స్టోరీ.
ఈ మూడు కథల్ని హైపర్ లింకుగా కూడా ఎక్కడా కలపను కూడా లేదు. అంటే ఆంథాలజీ కూడా
కాకుండా పోయింది. ఇప్పుడు కావాలంటే 2020 హైదారాబాద్ వరద దృశ్యాలు చూసేందుకు యూట్యూబ్
లో బోలెడు వున్నాయి. సినిమా దేనికి చూడాలి. అలాటి వార్తా ప్రసారం లేదా
డాక్యుమెంటరీ కాదు కదా సినిమా కథంటే.
కథ కాలేదు కాబట్టి కాన్ఫ్లిక్ట్
లేదు. వరదల్ని చూపిస్తే అది పాత్రలకి ఎదురైన కాన్ఫ్లిక్ట్ అవదు. ప్రకృతి దాని
మానాన అది సర్దుబాటు చేసుకోవడం. ప్రకృతి వరదలతో దాని సర్దు బాటు బిజినెస్ లో అదుంటే, దీన్ని ఎదుర్కొంటూనే పాత్రల మధ్య పుట్టేది కాన్ఫ్లిక్ట్. ప్రకృతి
సర్దుబాటు నేపథ్యంలో పాత్రల మధ్య కాన్ఫ్లిక్ట్ లేకపోతే పాలగుమ్మి పద్మరాజు రాసిన ‘గాలివాన’ కథ లేదు, కొరియన్ ‘పారసైట్’ మూవీ కూడా లేదు. ‘టైటానిక్’ డిజాస్టర్ మూవీ డిజాస్టర్ గురించే కాదు కదా? అదో
అమరమైన ప్రేమ కథ కూడా.
‘సూరజ్ కా సాత్వా ఘోడా’ అనే ప్రసిద్ధ నాల్గు కథల ఆంథాలజీలో శ్యామ్ బెనెగల్ కూడా ప్రేమకి సంబంధించి ఇదే చెప్పారు- సామాజికార్ధిక వర్గ పోరాట పునాదులున్న ప్రేమలే మంచి ప్రేమ కథలవుతాయని. ‘గమనం’ దర్శకురాలి సామాజిక స్పృహకీ సామాజికార్ధిక కారణాలు కలగలిసిన కాన్ఫ్లిక్ట్ చూపించాలి నిజానికి.
పాలగుమ్మి పద్మరాజు గారి సుప్రసిద్ధ కథ ‘గాలివాన’ ఆయన జీవితంలో జరిగిందే. దాన్ని ఆయన వార్తలా రాసి వుంటే కథయ్యేది కాదు. ఆ అనుభవం లోంచి వర్షపు రాత్రి పాత్రల మధ్య కాన్ఫ్లిక్ట్ తో ఆ గొప్ప కథని సృష్టించారు. ఒక డబ్బున్న ఉన్నతాదర్శాల వ్యక్తి, తను అసహ్యించుకునే బిచ్చగత్తెతో వర్షపు రాత్రి చిక్కుకుని, ఆమె వల్ల తన ఉన్నతాదర్శాల్లోని డొల్లతనాన్ని తెలుసుకునే - సోషల్ కామెంట్ చేసే కథ. 1951 లో రాసిన ఈ కథని ఆయన అనువాదం చేసి పంపితే న్యూయార్క్ హెరాల్డ్ ట్రిబ్యూన్ పత్రిక నిర్వహించిన అంతర్జాతీయ పోటీల్లో ద్వితీయ బహుమతి పొంది, అనేక భాషల్లో అనువాదమైన ప్రపంచ స్థాయి కథ.
‘సూరజ్ కా సాత్వా ఘోడా’ అనే ప్రసిద్ధ నాల్గు కథల ఆంథాలజీలో శ్యామ్ బెనెగల్ కూడా ప్రేమకి సంబంధించి ఇదే చెప్పారు- సామాజికార్ధిక వర్గ పోరాట పునాదులున్న ప్రేమలే మంచి ప్రేమ కథలవుతాయని. ‘గమనం’ దర్శకురాలి సామాజిక స్పృహకీ సామాజికార్ధిక కారణాలు కలగలిసిన కాన్ఫ్లిక్ట్ చూపించాలి నిజానికి.
పాలగుమ్మి కథ లాగా ఆసియా ఖండం నుంచే
వెళ్ళిన కొరియన్ మూవీ ‘పారసైట్’ లో
కూడా వరదలు నగరాన్ని ముంచెత్తే కథే. ఆ వరదల్లో బయటపడే ఒక్కో పాత్ర నిజ రూపాలతో, వర్గ తారతమ్యాల సోషల్ కామెంట్ చేస్తుందీ 2019 ఆస్కార్ అవార్డు పొందిన సినిమా
కథ. ఆసియా ఖండం నుంచి వెళ్ళిన ఈ రెండూ అంతర్జాతీయ ఖ్యాతిని పొందాయి. ‘గమనం’ లో హైదరాబాద్ వరదలకి కారణం పేరుకు పోయిన
డ్రెయిన్లు, కబ్జా చేసిన చెరువులూ అని మీడియా రిపోర్టు చేసిన
కారణమే చెప్పి సరిపెట్టడంతో, అవార్డులకి ఎదిగే అవకాశాన్ని
కోల్పోయిన డాక్యుమెంటరీ అయిందీ యూనిక్
కాన్సెప్ట్.
ఈ కబ్జాదార్లయిన ధనిక పాత్రల్ని
కూడా సృష్టించి- పేద పాత్రలతో కాన్ఫ్లిక్ట్ వల్ల ఏం నేర్చుకున్నారో సోషల్ కామెంట్ చేసి
వుంటే అర్ధవంతమైన సామాజిక కథయ్యేది. వరదలతో ప్రకృతి కాదు విలన్. ప్రకృతిని
ఆటంకపర్చే సామాజిక శక్తులు విలన్లు. విలన్లు లేకుండా బాధితుల అపసోపాలే చూపిస్తే కథవదు.
కథంటే రెండు వైరి వర్గాల మధ్య డ్రమెటిక్ క్వశ్చన్ - ఆ క్వశ్చన్ తో కాన్ఫ్లిక్ట్ - దానికి
ముగింపూ. డ్రామాకే అవకాశం లేని డాక్యుమెంటరీలో ఇవి సాధ్యం కావు. సినిమాకి
కావాల్సింది డాక్యుమెంటరీలూ గాథలూ కావు, కథలే. బాధితులే తప్ప
బాధకుల్ని చూపించక పోవడం వల్ల, పెట్టుబడిదారీ పక్షమేమో
కథకురాలన్న అనుమానం కూడా వచ్చేలా వుంది.
నిస్సందేహంగా సీనియర్ నటి శ్రియది
వినికిడి లోపమున్న పాత్రలో చూడదగ్గ నటనే. ఏ సీనులో కూడా కమర్షియలేతర రియలిస్టిక్
నటనని గుండెలోతుల్లోంచి ప్రదర్శించకుండా వదిలి పెట్టలేదు. అయితే సన్నివేశ బలం, భావోద్వేగ బలం లేకపోవడం వలన జీవం లేని నటనయింది. కథ వుంటేగా ఇవి
వుండడానికి. తను లీడ్ క్యారక్టర్ కూడా కాలేదు. తను బట్టలు కుడితేనే కాదు, అల్లికలతో కథని కూడా కుట్టాలి. కుట్టాలంటే లీడ్ క్యారక్టరవాలి. కార్యకర్త
కావాలి. డిజాస్టర్ / సర్వైవల్ జానర్ కూడా కాదు కాబట్టి ఇవి కాలేదు. తనది ఎపిసోడ్
క్యారక్టర్. ఎపిసోడ్ కి పరిమితమైన క్యారక్టరైనా ఒక మినీ కథయినా కావాలి. కూతురితో ఈ
మినీ కథ చేయొచ్చు. వినికిడి లోపమున్న ఇలాటి ఏ తల్లికైనా ముందు తన కూతురి గొంతు వినాలనుంటుంది.
ఇది చాలు మినీ కథకి. కూతురి గొంతు వినడం కోసమే చికిత్స చేయించుకోవాలని సంకల్పం
వుంటే, తీరా వర్ష బీభత్సంలో ఓ పిడుగు పడి డ్రమెటిక్ గా వినికిడి
శక్తి వచ్చేసి వుంటే, ఆ సంబరంతో కూతురి గొంతు వినాలనుకుంటే...
కూతురి గొంతు పోవాలి అదే పిడుగుపాటు భయంతో. ఇది మనకొచ్చిన ఐడియా కాదు. 1972 లో
మనోజ్ కుమార్ సూపర్ హిట్ ‘షోర్’ నుంచి
కాపీ కొట్టాం.
‘షోర్’ లో మనోజ్ కుమార్ కొడుకు యాక్సిడెంట్ లో మూగవాడై పోతాడు. అతడికి గొంతు
తెప్పించి మాటలు వినాలని వైద్యం కోసం నానా పాట్లు పడి విజయం సాధిస్తే, పని చేస్తున్న కర్మాగారంలో తన చెవులు పోతాయి...దీన్ని ఉదాహరణ చెప్పడానికే
తీసుకున్నాం, కాపీ కొట్టాలని కాదు.
‘స్కైలాబ్’ తో నిత్యామీనన్, ఇప్పుడు ‘గమనం’ తో శ్రియ - తాము యూనిక్ కథలని నీరుగార్చే పాత్రల్ని ఒప్పుకుంటున్నామని
ఎప్పుడు గుర్తిస్తే అప్పుడు వాళ్ళ నటనలకి సార్ధకత వుంటుంది. మిగిలిన పాత్రల్లో
తెలిసిన నటీనటులున్నారంటే ఏదో వున్నారంతే. వీళ్ళందరి మధ్య ఇద్దరు స్లమ్ పిల్లల ‘కథ’ తమిళ సినిమా లోనిదేనేమో.
2016 లో వెట్రి మారన్ ‘విసారనైకి’ కి దర్శకత్వం వహించి దేశ విదేశాల్లో పేరు గడించక
మునుపు - 2015 లో ‘కాక ముట్టై’ కి నిర్మాతగా వ్యవహరించి అంతే పేరు ప్రతిష్టలూ పొందాడు. కాకపోతే
దీనికి సహ నిర్మాతగా హీరో ధనుష్ వున్నాడు. ధనుష్, వెట్రి
మారన్ ల అండదండలతో కెమెరా మాన్ మణికందన్ దర్శకుడుగా మారి, బాలల చలన చిత్రం ‘కాకముట్టై’ తీసి అంతర్లీనంగా గ్లోబలైజేషన్ స్వరూపాన్ని తేటతెల్లం చేశాడు. ‘కాకముట్టై’ (కాకి గుడ్డు) ని ఇద్దరు స్లమ్ పిల్లల గ్లోబల్ కోరికల కథగా తీశాడు.
ఈ పిల్లలకి పిజ్జా కొనుక్కు తినాలని
కోరిక. దానికి డబ్బుల కోసం చాలా కష్టపడతారు. తీరా కొనుక్కుని పిజ్జా ముక్క నోట్లో
పెట్టుకుంటే - థూ, దీనికంటే స్టవ్ మీద ముసలి నానమ్మ వేసే
బియ్యప్పిండి దిబ్బ రొట్టే ది బెస్ట్ అన్పిస్తుంది! అవసరం లేని గ్లోబల్ ఉత్పత్తుల
మీద గురి చూసి సోషల్ కామెంట్ ఇది. దీనికి దేశ విదేశాల్లో 21 అవార్డు లొచ్చాయి. 2 కోట్ల
బడ్జెట్ కి 12 కోట్ల బాక్సాఫీసూ వచ్చింది.
‘గమనం’ లో స్లమ్ పిల్లలు బర్త్ డేకి కేక్ కొనాలని ఆరాటపడతారు. ఇది కాకతాళీయమో
కాపీనో దర్శకురాలే చెప్పాలి. అయితే తమిళంలో కేకుతో కాకుండా పిజ్జాతో కథ చేయడం-
దిబ్బ రొట్టె కాంట్రాస్ట్ తో సామాజిక స్పృహ అయింది. ‘గమనం’ లో ఇలాటిది కాలేదు. అసలీ కేకుతో బర్త్ డేలు మన కల్చర్ కాదని పిల్లలు
చివరికి గుర్తించి, పుట్టిన రోజుకి శుభ్రంగా స్నానం చేసి గుడి కెళ్ళి గంట
కొడితే, కాంట్రాస్ట్ తో ముచ్చటైన సోషల్ కామెంట్ అయ్యేది.
మరో మూడు పేర్లూ బాక్సాఫీసు
అప్పీలుగా వున్నాయి - ఇళయరాజా (సంగీతం), వీఎస్ జ్ఞాన శేఖర్ (ఛాయాగ్రహణం),
బుర్రా సాయినాథ్ (మాటలు). నటీనటుల్లాగే ఈ ముగ్గురూ కూడా బాక్సులో విషయం లేకపోవడం
వల్ల ప్రశ్నార్థకంగా మిగిలారు తమ ప్రతిభా పాటవాలతో.
ఫస్టాఫ్ సమయమంతా మూడు కథల
పాత్రల్ని ఎస్టాబ్లిష్ చేయడానికే తీసుకున్నా పాత్రలు ఇంకా సరిగ్గా ఎస్టాబ్లిష్
కావు. భావోద్వేగాలు కనిపించని ఈ కథలు, పాత్రలు నిదానంగా సాగడంతో ఫస్టావ్ ఓపికని పరీక్షిస్తుంది.
సెకండాఫ్ వరదల్లో కష్టాలతో సాగుతుంది. ఫస్టాఫ్ లో కథలు,
పాత్రలు సరిగ్గా ఎస్టాబ్లిష్ కాకపోవడంతో, ఈ సెకండాఫ్ లో
భావోద్వేగాల్లేని పాత్రల స్ట్రగుల్ తో ఆడియెన్స్ కనెక్ట్ కష్టమైపోతుంది. ఇలా
సెకండ్ యాక్ట్ కూడా సరిగ్గా ఎస్టాబ్లిష్ కాకపోవడంతో, ఆకస్మికంగా
వచ్చే థర్డ్ యాక్ట్ సైతం ఆకట్టుకునే పరిస్థితి వుండదు. ఇలా స్క్రీన్ ప్లే ఏ యాక్ట్
లోనూ దాని బిజినెస్ జరగని పరిస్థితి ఈ సినిమాలోనే మొదటిసారిగా చూస్తాం.
డాక్యుమెంటరీ చేస్తే యాక్ట్స్ సహజంగానే వుండవు.
చివరిగా,దివ్యాంగుల్ని
విషాద పాత్రలుగా చూపించే ఫార్ములా ఇక పోయింది. వాళ్ళని కూడా సాధారణ పౌరులుగానే
సమానంగా ట్రీట్ చేసే సంస్కారాన్ని సమాజాలు గుర్తించాయి. పత్రికా భాష కూడా
వికలాంగులు నుంచి దివ్యాంగులుకి మారింది. 2012 లో ‘బర్ఫీ’ లో రణబీర్ కపూర్ మూగ చెవిటి పాత్ర ఫార్ములాని బ్రేక్ చేస్తూ హిలేరియస్
క్యారక్టర్ గా పాపులర్ అయింది. పాత్ర తన లోపాలతో బాధపడే విషాద పాత్రగా వుండదు. అలా
చూపించే కుసంస్కారానికి పోలేదు.
డిసెంబర్ 6 న దివ్యాంగుల సాధికారత అవార్డుల ప్రదానోత్సవం సందర్భంగా రాష్ట్రపతి స్టేజి దిగి అవార్డులు అందించడం తీవ్ర విమర్శలకి
దారితీసిన ఉదాహరణ వుంది. రాష్ట్రపతి
అలా స్టేజి దిగి రావడం దివ్యాంగులని అవమానించడమే అవుతుందన్న విమర్శలు వెల్లువెత్తాయి. రాష్ట్రపతి సమక్షంలో కెళ్ళి అవార్డులు అందుకునేందుకు తాము ముందుగానే డ్రెస్ రిహార్సల్స్ చేశామని, ఇందుకోసం హైడ్రాలిక్ లిఫ్ట్ కూడా ఉపయోగించామని, ఆ
రిహార్సల్స్ అంతా వృధా అయిందనీ దివ్యాంగులు
చెప్పుకుని బాధ పడ్డారు. ఇలాంటి చర్యలతో తమని మరోమారు దివ్యాంగుల్ని చేయవద్దని విన్నవించుకున్నారు. ఆలోచనల్లో మార్పు
రావాలని కోరారు. సామాజిక స్పృహతో సామాజిక కథకి ఇదవసరమే.
—సికిందర్