రివ్యూలు, సాంకేతికాలు, స్క్రీన్ ప్లే సంగతులు...

టికెట్లు దొరకడం యోగం, సినిమాలు చూడడం భోగం, రివ్యూలు రాయడం రోగం!

8, డిసెంబర్ 2021, బుధవారం

1103 : బాక్సాఫీస్

శుక్రవారం 10వ తేదీ ఇంకో 8 సినిమాలు ఒకేసారి విడుదలవుతున్నాయి. గత నెల 19 న కూడా ఒకేసారి  తొమ్మిది సినిమాలు విడుదలయ్యాయి. పెద్ద సినిమాలు లేని శుక్రవారం చూసుకుని ఛోటా సినిమాలు ఈ సంఖ్యలో విడుదలై పోతున్నాయి. ఈ శుక్రవారం లక్ష్య తప్ప మిగిలినవి చిన్న సినిమాలే. లక్ష్య సహా అన్ని సినిమాలూ కొత్త దర్శకులవే. లక్ష్య లో నాగ శౌర్య హీరో. ఇది మరో స్పోర్ట్స్ డ్రామా. సంతోష్ జాగర్లపూడి దర్శకత్వం. ట్రైలర్ తో ఆసక్తి రేపింది. ఈ మూవీ ట్రైలర్‌ ని గ్లామర్ కోసం విక్టరీ వెంకటేష్ విడుదల చేశారు. పైగా నాగశౌర్య పలకల శరీరం (సిక్స్ ప్యాక్) తో పరిచయమవుతున్నాడు. క్రీడాకారులు సిక్స్ ప్యాక్ తో వుంటారా అన్నది వేరే సంగతి. కేతికా శర్మ మరో సారి హీరోయిన్ గా కనిపించబోతోంది. ఈమె ఇటీవలే పూరీ జగన్నాథ్ తనయుడు ఆకాష్ పూరీ రోమాంటిక్ లో హీరోయిన్ గా తెలుగు తెరకి పరిచయమైంది. ప్యాడింగ్ ఆర్టిస్టులుగా జగపతి బాబు, సచిన్ ఖేడేకర్ ల బలం ఈ సినిమాకి వుంది. దీని నిర్మాతల్లో ప్రముఖులు నారాయణ్ దాస్ కే నారంగ్, శరత్ మరార్ వున్నారు.

        మెయిన్ మూవీ శౌర్య తర్వాత చెప్పుకో దగ్గ మూవీ గ్యాంగ్ స్టర్ నయీమ్ జీవిత కథ నయీమ్ డైరీస్’. ఈ వివాదాస్పద నయీమ్ కథలో చాలా నిజాలు నిజాయితీగా చెప్పాననీ, సినిమా ఎలా రిలీజ్ చేస్తావో చూస్తామని బెదిరింపులు వస్తున్నాయనీ దర్శకుడు దాము బాలాజీ చెప్పడం ఆసక్తిని పెంచింది సినిమా మీద. ఇందులో నయీమ్ పాత్రని వశిష్ట సింహా పోషించాడు. ఇతను కేజీఎఫ్, నారప్ప సినిమాలతో తెలుగు ప్రేక్షకులకి పరిచయమైన నటుడు. దీని ట్రైలర్ చూస్తూంటే సాంకేతిక బలంతో పవర్ఫుల్ గా కన్పిస్తోంది.

        పోతే, కొత్త దర్శకురాలు సుజనా రావు తీసిన గమనం లో శ్రియ నటించింది. ఇంకో పాత్రలో నిత్యా మీనన్ కన్పిస్తుంది. సుహాస్ కూడా ఓ పాత్రలో కన్పిస్తాడు. హైదారాబాద్, విశాఖల్లో షూటింగ్ చేశారు. ఇళయరాజా సంగీతం వహించిన ఈ హీరోయిన్ ఓరియెంటెడ్ కథ ఐదు భాషల్లో విడుదలవుతోంది.

        మిగిలిన అయిదూ కొత్త నటులవే. మడ్, బుల్లెట్ సత్యం, కఠారీ కృష్ణ, ప్రియతమా, మనవూరి పాండవులు. అందరూ కొత్త దర్శకులే తెలుగు ప్రేక్షకులకి అందిస్తున్న ఈ ఎనిమిదిలో ఎన్ని నిలబడతాయో శుక్రవారం తేలుతుంది. ఈవారం పెద్ద సినిమాలు లేకపోయినా అఖండ సృష్టిస్తున్న మేనియా ఇంకా తగ్గలేదు. ఒకప్పుడు సింగిల్ స్క్రీన్స్ లో విడుదలైనప్పుడు హైదారాబాద్, విజయవాడ లాంటి నగరాల్లో పెద్ద సినిమాల మధ్య చిన్న సినిమాలు విడుదల చేస్తే, పెద్ద సినిమా బుకింగ్స్ ఫుల్ అయిపోతే, కాంపౌండులో చిన్న సినిమా వున్న థియేటర్లో పడే వాళ్ళు పెద్ద సినిమా కొచ్చిన ప్రేక్షకులు. ఇలా బతికిన చిన్న సినిమా లున్నాయి. ఆన్ లైన్ బుకింగ్స్ తో ఇప్పుడా పరిస్థితి లేదు.

***