రివ్యూలు, సాంకేతికాలు, స్క్రీన్ ప్లే సంగతులు...

టికెట్లు దొరకడం యోగం, సినిమాలు చూడడం భోగం, రివ్యూలు రాయడం రోగం!

Saturday, February 4, 2017

రివ్యూ...




దర్శకత్వం : ప్రియదర్శన్

తారాగణం : మోహన్ లాల్, సముద్ర కని,  అనుశ్రీ, విమలారామన్, నెడుముడి వేణు, బేబీ మీనాక్షి తదితరులు
కథ : గోవింద్ విజయన్, సంగీతం : రాన్ యోతాన్ యోహాన్, ఛాయాగ్రహణం : ఎన్ కె ఏకాంబరం
బ్యానర్ : ఆశిర్వాద్ సినిమాస్
నిత్మాత : బి. దిలీప్ కుమార్
విడుదల : ఫిబ్రవరి 3, 2017

***
          అంధత్వం వరుసగా ముడి సరుకవుతోంది థ్రిల్లర్స్ కి. ఈ ఆర్నెల్ల కాలంలో హాలీవుడ్ నుంచి  ‘డోంట్ బ్రీత్”, బాలీవుడ్ నుంచీ ‘కాబిల్’, మాలీవుడ్ నుంచి ‘ఒప్పమ్’, టాలీవుడ్ నుంచీ ‘ఒప్పమ్’  డబ్బింగ్ ‘కనుపాప’ అనే ‘బ్లయిండ్ థ్రిల్లర్స్’ నాల్గు వచ్చాయి. ప్రస్తుత టాలీవుడ్ ‘కనుపాప’ జయాపజయాల సంగతెలా వున్నా, మిగతా మూడు భాషల్లో మూడూ హిట్టయ్యాయి. అనేక కామెడీలు తీసి కామెడీ జానర్ కి మలయాళ, హిందీ భాషల్లో కొత్త ఒరవడిని దిద్దిన దర్శకుడు  ప్రియదర్శన్,  చాలాకాలం గ్యాప్ తర్వాత ఈ  క్రైం థ్రిల్లర్ తో వచ్చాడు. మలయాళ సూపర్ స్టార్ మోహన్ లాల్ నటించిన ఈ ‘కనుపాప’  తెలుగు ప్రేక్షకులతో పరిచయం పెంచుకోవాలన్న అతడి ప్లానింగ్ లో భాగంగా  ఈ అయిదు నెలల కాలంలో ఇది నాలుగో సినిమా.  కానీ 1994 లోనే ప్రియదర్శన్ తీసిన ‘గాండీవం’ లో తొలిసారిగా మోహన్ లాల్ తెలుగు ప్రేక్షకులకి పరిచయమయ్యాడు.
          మోహన్ లాల్ అంధుడి పాత్ర నటించిన ప్రస్తుత ‘కనుపాప’  టైటిల్ కీ కథకీ వున్న 
సంబంధమేమిటో ఈ కింద చూద్దాం...

కథ
       కళ్ళులేని  జయరాం (మోహన్ లాల్) ఓ అపార్ట్ మెంట్ లో లిఫ్ట్ ఆపరేటర్ గా  పనిచేస్తూ వూళ్లో వుంటున్న  చెల్లెలి పెళ్ళికి డబ్బు కూడేస్తూవుంటాడు. అపార్ట్ మెంట్ లో అందరూ అతణ్ణి  బాగా చూసుకుంటారు. ఒక రిటైర్డ్ సుప్రీం కోర్టు జడ్జి కృష్ణమూర్తి (నెడుముడి వేణు) అనే అతను  జయరాంతో మరింత సన్నిహితంగా వుంటాడు. ఈ కృష్ణమూర్తికో సమస్య వుంటుంది. ఎప్పుడో ఒక రేప్ అండ్ మర్డర్ కేసులో దోషికి  14 ఏళ్ళు ఖైదు విధించాడు. ఆ వాసుదేవ్ (సముద్రకని) అనే దోషి తానే  నేరం చేయలేదని మొరపెట్టుకున్నాడు. కానీ సాక్ష్యాథారాల్ని బట్టి మూర్తి శిక్ష విధించాడు. వాసుదేవ్ కుటుంబం ఈ అవమానాన్ని తట్టుకోలేక ఆత్మహత్య చేసుకుంది. దీంతో వాసుదేవ్ సైకోగా మారాడు. జైల్నుంచి  విడుదలై తన జీవితం, తన కుటుంబ సభ్యుల జీవితాలూ అన్యాయమై పోవడానికి కారకులైన వాళ్ళందర్నీ -కేసుతో సంబంధమున్న  పోలీసు అధికార్లూ ప్రాసిక్యూటర్ సహా-  చంపడం మొదలెట్టాడు. ఇప్పుడు  కృష్ణమూర్తి ఒక్కడే  మిగిలాడు. కృష్ణమూర్తి తన కూతురు నందిని (బేబీ మీనాక్షి)ని వేరే చోట కాన్వెంట్ లో చదివిస్తూంటాడు. ఇదంతా జయరాంకి  చెప్పివుంచాడు. 

     ఈ నేపధ్యంలో అపార్ట్ మెంట్ లో ఓ పెళ్ళి జరుగుతూంటే, ఆ అవకాశం తీసుకుని వాసుదేవ్ వచ్చి కృష్ణమూర్తిని చంపేస్తాడు. చంపి పారిపోతూ జయరాంతో కలబడతాడు, తప్పించుకుని పారిపోతాడు. పోలీసులు కేసు టేకప్ చేస్తారు. కృష్ణమూర్తికి చెందిన యాభై లక్షలు కూడా పోవడంతో, అదే సమయంలో జయరాం చెల్లెలి పెళ్ళికి డబ్బు కూడేస్తున్నాడని తెలియడంతో,  అతణ్ణి అనుమానించి వేధించడం మొదలెడతారు. మరోవైపు వాసుదేవ్ సాక్ష్యం లేకుండా చేయడానికి జయరాంని కూడా చంపడానికి ప్రయత్నిస్తూండడంతో,  కళ్ళులేని జయరాం గొప్ప చిక్కుల్లో పడిపోతాడు. అతడి ముందున్న మరో పెద్ద సమస్య- నందినిని కూడా వాసుదేవ్ చంపకుండా కాపాడుకోవడం...అటు పోలీసులనుంచీ, ఇటు హంతకుడి నుంచీ కూడా తనని కాపాడుకుంటూ, జయరాం తన ధ్యేయం కోసం ఎలా పోరాడాడన్నది మిగతా కథ. 

ఎలావుంది కథ 
       అచ్చమైన దేశవాళీ క్రైం థ్రిల్లర్ జానర్ కి చెందిన కథ ఇది. అంటే ఏ విదేశీ సినిమా లోంచీ కాపీ కొట్టలేదు. భౌతికంగా సాక్ష్యాధారాలు సేకరించకుండా, వాటి ఆధారంగా కేసు బిల్డప్ చేయకుండా, ఇంకా సాక్షుల వాంగ్మూలాలతో, వాళ్ళనుంచి వివరాలు రాబట్టే కర్రపెత్తనంతో, బుర్రపెత్తనానికి దూరంగా వుంటున్న అశాస్త్రీయ పోలీసు వ్యవస్థకి తార్కాణంగా వుంటుందీ కథ. ఇలాటి పోలీసుల్ని ఎదుర్కోవాలంటే మామూలు నిర్దోషులకే సాధ్యంకాదు, అలాంటిది కళ్ళులేని వాడి సంగతి చెప్పనవసరంలేదు. ఈ కథలో ఇంకో గొప్ప ఐరనీ ఏమిటంటే, ఏ జడ్జి తనకి అన్యాయంగా శిక్ష విధించాడని ఆ ‘నిర్దోషి’ ఆ జడ్జిని చంపాడో, అదే జడ్జి హత్య కేసులో ఇంకో నిర్దోషినే బోనెక్కించి చేతులు దులుపుకోవాలనుకోవడం! ఆ నిర్దోషీ ఈ నిర్దోషీ ఎప్పుడో స్వర్గంలో ఆ జడ్జిని కలుసుకుంటే అక్కడా కొట్టుకు చావాలనేమో!! 

          కథా ప్రయోజనం విషయానికొస్తే, ఇది ‘కాబిల్’ లో లాగా చట్టాన్ని చేతుల్లోకి తీసుకుని విజిలాంటీ గా మారే  అంధుడి వ్యక్తిగత వేదన కాదు, ‘డోంట్ బ్రీత్’ లోలాగా ఆత్మరక్షణ చేసుకునేకంటే, పోలీసులకి పట్టించడంకంటే,  దొరికిన దొంగల్ని చట్టాన్ని  తానే చేతుల్లోకి తీసుకుని,  కిరాతకంగా శిక్షించాలనుకునే అంధుడి శాడిజం కూడా కాదు; ఇరుక్కున్న కేసులోంచి బయటపడాలనుకునే, ప్రమాదంలో వున్న బాలికని కాపాడుకోవాలనుకునే, వ్యవస్థ బాధితుడైన గుడ్డివాడి పోరాటంగా సామాజిక ప్రయోజనమున్న కథ ఇది. కళ్ళున్న వ్యవస్థ బ్లయిండ్ జ్యూరీగా ప్రవర్తించే దురవస్థ ఇది. 

ఎవరెలా చేశారు 
     అంధ పాత్రని మోహన్ లాల్ సగటు మనుషుల సామాన్య ప్రపంచానికి దించాడు. హైఫై హవా లేదు, గ్లామర్ లేదు, అలవిమానిన హీరోయిజం లేదు, స్టార్ పవర్ లేదు. మలయాళ సినిమాలంటేనే వాస్తవికత. పూర్తిగా వాస్తవిక ధోరణికి కట్టుబడి నిజజీవితంలోని సహజమైన గుడ్డిపాత్రని ఒక నిష్ణాతుడిలా ఆవిష్కరించాడు. పోలీసులు తనని కొడుతున్న సన్నివేశంలోనైతే, ఓ రిక్షావాణ్ణి కొడితే ఎలా మొత్తుకుంటూ అటూఇటూ దూకుతాడో అచ్చం అలాగే చేశాడు. తర్వాత తను ఆ పోలీసులందర్నీ కలిపి కొట్టేయాల్సిన అత్యవసర పరిస్థితిలో,  అలవాటులేని ఆ పనికి పిల్లి మొగ్గలేస్తూ అష్టకష్టాలూ పడి మొత్తం మీద విజయం సాధిస్తాడు. కళ్ళులేని తను శారీరకంగా అసమర్ధుడైనా మానసికంగా  శక్తి సంపన్నుడు. తన ఎదురుగా వున్న మనిషి ఎత్తెంతో, బరువెంతో చెప్పేయగలడు.  మనిషి మాటలు ఏ ఎత్తునుంచి విన్పిస్తున్నాయో దాన్నిబట్టి తన ఎత్తుతో బేరీజు వేసుకుని చెప్పేయగలడు. హంతకుడు తనతో చెలగాటమాడే దృశ్యాల్లో చిక్కకుండా వేసే ఎత్తుగడలు అంధులకి స్ఫూర్తినిస్తాయి. కానీ అంధులు సినిమా చూడలేరు. కానీ అంధపాత్రలతో ఏఏ సినిమాలు ఎలా తీయవచ్చో కళ్ళున్న వాళ్ళకి తెలియజెప్తాయి. కళ్ళతో బాటు బుర్ర వున్నవాళ్ళకి ఇంకా బాగా తెలియజెప్తాయి. అంధ పాత్రలకి మోహన్ లాల్ అభినయం ఒక అధ్యయనాంశమే. 



       ఇక నేరస్థుడిగా ముద్ర పడ్డ మోహన్ లాల్ దగ్గరికి చెల్లెలు వచ్చి- నువ్వు నా పెళ్ళికి రావొద్దు, వస్తే నా పెళ్లి జరగదు- అనేసి కర్కశంగా చెప్పేసి వెళ్ళిపోవడంలాటిది సాధారణంగా తెలుగు సినిమాల్లో చూపించడానికి జంకుతారు- ఏదో సెంటి మెంటు దెబ్బతినేసి కొంపలంటుకుంటాయని. కానీ మలయాళ సినిమా జీవితాన్ని కప్పెట్టి మాయ చేయాలనుకోదు.  ఇలాంటివి జరిగే జీవితాలు కూడా వుంటాయి. గుడ్డివాడై వుండికూడా మోహన్ లాల్ తను సమకూర్చిన నీతిమంతమైన డబ్బుతోనే ఆ పెళ్లి జరుగుతున్నా, చెల్లెలిలో ఆ స్వార్ధం- స్వసుఖం అతన్నెలా దెబ్బ తీసి వుంటాయో ఇక్కడ పదాల్లో చెప్పడం కుదరదు. మోహన్ లాల్ ని చూడాల్సిందే. 

       ఇక సీరియల్ కిల్లర్ వాసుదేవ్ గా సముద్రకనిది కూడా డౌన్ ప్లే చేసిన సహజ- ఎక్సెలెంట్ నటన. మోహన్ లాల్ తనని చూడలేడు కాబట్టి, మోహన్ లాల్ ఎక్కడుంటే అక్కడ, పోలీస్ స్టేషన్ లో వుంటే అక్కడా, అన్నీ గమనిస్తూ ఫ్రీగా మసలుకుంటూ వుంటాడు.  బస్టాప్ లో పక్కనే నించుని లారీకింద తోసేసిపోతాడు. అసలు అపార్ట్ మెంట్ లోనే నివాసముంటాడు. క్లయిమాక్స్ పూర్తిగా అతడి ఆధీనంలో కొచ్చి, ఇంకో రెండు మూడు హత్యలు కూడా చేసి,  మోహన్ లాల్ నీ, బాలికనీ చీకట్లో చంపడానికి చేతులదాకా వచ్చినప్పుడు అతడి కళ్ళూ, మొహమూ అత్యంత భయానకంగా రూపుదాలుస్తాయి. సైలెంట్ విలనీని పరాకాష్ఠకి చేర్చిన హైపాయింట్ అది. 
          మోహన్ లాల్ కి సహకరించే యంగ్ ఎసిపి గంగ గా అనుశ్రీది, సరీగ్గా అలాటి ఆఫీసర్ కుండే స్కిల్స్ తో కూడిన ప్రొఫెషనల్ నటన. అయితే క్లయిమాక్స్ లో అర్ధాంతర మరణమే మింగుడుపడనిది. 

            బాలనటి బేబీ మీనాక్షి పాత్ర థర్డ్ యాక్ట్ లో- అంటే  క్లయిమాక్స్ లో అందుకుంటుంది, కిల్లర్ ఆమెకోసం రావడం అప్పుడే జరగడంతో. ఈ క్లయిమాక్స్ లో మోహన్ లాల్ ఆమెని కాపాడుతూ చేసే స్ట్రగుల్ తో పాసివ్ గా వుండిపోదు బేబీ మీనాక్షి. సర్వసాధారణంగా ఇలాంటప్పుడు బాల పాత్రలు భయపడుతూ, ఏడుస్తూ,  పెద్ద పాత్రలకి భారంగా వుంటాయి. కానీ బేబీ మీనాక్షి చాలా యాక్టివ్ గా, ఇంటలిజెంట్ గా వుంటూ, మోహన్ లాల్ కి దారి చూపుతూ, హంతకుడి ఉనికిని తెలుపుతూ, ఆయుధాలు అందిస్తూ, సమాన పాత్ర పోషించడంతో ఈ పాత్రకి వన్నె చేకూరింది.

          ఇక సహాయపాత్రలు కూడా బిజీగా వుంటాయి కథలో. జడ్జిగారి గ్లామరస్ పని మనిషిగా, మోహన్ లాల్ కి లైనేసే ఆడ రోమియోగా  మొన్నటి  మలయాళ- తెలుగు హీరోయిన్ విమలారామన్ కన్పిస్తుంది. అపార్ట్ మెంట్ వాచ్ మన్ గా మముక్కోయా, ఆటో డ్రైవర్ గా అజూ వర్ఘీస్ - వీళ్ళిద్దరూ మాటలతో పోలీసుల్ని ముప్పుతిప్పలు పెడుతూంటారు. కోర్టులో ఒకరోజు నిలబడి వుండే శిక్ష వేయించుకునే దుష్టుడైన సీఐగా వినోద్ జోస్, ఐపీఎస్ అధికారిగా రెంజీ పణిక్కర్, ఇంకో పోలీసు అధికారిగా ప్రదీప్ చంద్రన్, మోహన్ లాల్ చెల్లెలిగా అంజలీ అనీష్ కన్పిస్తారు. 



        సంగీతం చూస్తే సినిమాకి పాటలు బలహీనం, నేపధ్య సంగీతమే బలం. కెమెరా వర్క్ ఫర్వాలేదు. కోచీ నైట్ సీన్లు, ఊటీ పగటి సీన్లూ మాత్రం చిత్రీకరణా పరంగా బావున్నాయి. కోచీ  నైట్ సీన్లు  పాత క్లాసిక్ లుక్ రావడానికి డార్క్ రెడ్ లో డీఐ చేయడం బావుంది. ఇక యాక్షన్ సీన్లు మోహన్ లాల్ పాత్ర పరిమితులకి లోబడి సహజంగా వున్నాయి. 

చివరికేమిటి 
     అరవై ఏళ్ల ప్రియదర్శన్ దర్శకత్వం ఫస్టాఫ్ లో అలసటని తెలియజేస్తుంది. ఈ వయసులో ఇంకో కామెడీ చేసుకోక, ఎందుకురా థ్రిల్లర్ ని నెత్తి నేసుకున్నానూ అన్నట్టు వుంటుంది. మోహన్ లాల్ అంధ పాత్ర అష్టకష్టాలూ పడి ఎలాగో పోలీసుల్ని కొట్టి బయటపడినట్టు, ప్రియదర్శన్ కూడా కనాకష్టంగా  ఫస్టాఫ్ లోంచి బయటపడ్డాక తన పూర్వపు సత్తా ప్రదర్శిస్తాడు సెకండాఫ్ లో. ఫస్టాఫ్ లో కథని ప్రారంభించడానికే ఇంటర్వెల్ వరకూ తీసుకున్నాడు. నిజానికి కథని సెటప్ చేయడానికి అంత సుదీర్ఘమైన విషయం  లేదు- కేవలం జడ్జి గారి ఫ్లాష్ బ్యాక్ చెప్పేసి సీరియల్ కిల్లర్ తో రానున్న ప్రమాదాన్ని వెల్లడిస్తే సరిపోతుంది. కానీ అపార్ట్ మెంట్ లో రకరకాల పాత్రలతో, ప్రేమ వ్యవహారాలతో, కాలక్షేపాలతో, మూడేసి  పాటలతో గంట వరకూ సాగలాగడంతో పలచన బడిపోయింది సగం వరకూ థ్రిల్లర్.

           అన్నేసి పాత్రల పరిచయాలూ కథలూ ఎప్పుడవసరమంటే- ‘బర్నింగ్ ట్రైన్’ లాంటి ఉమ్మడి ప్రమాద పరిస్థితి వున్నప్పుడు. ‘బర్నింగ్ ట్రైన్’ లో గంట వరకూ రకరకాల పాత్రలు ట్రైన్ ఎక్కుతూ వుండడం, వాటి సరదాలూ కబుర్లూ, డ్యూయెట్లూ  ఖవ్వాలీలూ  ప్రేమలూ ఫ్లాష్ బ్యాకులూ వగైరా పూర్తి స్థాయిలో కానిచ్చాకే ప్రమాదంలో పడుతుంది ట్రైన్. ట్రైన్ సహా ఈ పాత్రలన్నీ అప్పుడు ప్రమాదంలో పడతాయి. ఇలా అన్ని పాత్రలూ ప్రమాదంలో  పడుతున్నప్పుడు వాటన్నిటి కథలూ  అవసరమే. 

          కానీ ప్రియదర్శన్ కథలో ఆ అపార్ట్ మెంట్ లో ప్రమాదం వాటిల్లబోయేది ఒక్క రిటైర్డ్ జడ్జికే. కనుక అతనొక్కడి కథమీద దృష్టి పెడితే సరిపోతుంది. అపార్ట్ మెంట్ లో మరెన్నో పాత్రల వ్యవహారాలన్నీ చూపిస్తూ కూర్చుంటే జడ్జి పాత్ర ఆనదు. పైగా అన్నేసి పాత్రలతో కథేమిటో అర్ధంగాదు. అపార్ట్ మెంట్ లో సర్దార్జీల పెళ్లి వేడుకల నేపధ్యంలో జడ్జి హత్య చూపించారు కాబట్టి- అంతమాత్రం చేత ఆ కాబోయే పెళ్లి కొడుకూ పెళ్లి కూతుర్ల ఎఫైర్లకి సీన్లు, వాళ్ళు పట్టు బడితే అపార్ట్ మెంట్ లో పెద్ద పంచాయితీ, పెళ్లి చేయాలనీ తీర్పూ వంటి తతంగాలతో కూడిన ఎపిసోడ్స్ తో కథకేం సంబంధం లేదు. అలాగే పెళ్లి సందడి చూసుకుని హంతకుడు వచ్చి హత్య చేసి పోయాడని కథలో చెప్పించారు. హంతకుడు వచ్చి వొంటరిగా వుండే జడ్జిని చంపిపోవడానికి ఈ పెళ్లి తతంగమే అవసరం లేదు. 

          బహుశా, జడ్జి పాత్ర మీంచి  ప్రేక్షకుల దృష్టి మళ్లించడానికే అన్నేసి పాత్రలూ, పెళ్లి సందడీ సృష్టించి వుంటారు. ఇవన్నీ లేకుండా కేవలం జడ్జి పాత్రే కన్పిస్తూంటే ప్రేక్షకులకి అనేక సందేహాలు వస్తాయి : సీరియల్ కిల్లర్ గురించి అంత ఫ్లాష్ బ్యాక్ చెప్పిన జడ్జి తన రక్షణ గురించి ఎందుకు ఏర్పాట్లు చేసుకోవడం లేదు? ఊటీలో చదువుకుంటున్న కూతురికీ ప్రమాదముందని పోలీస్ కంప్లెయింట్ ఎందుకివ్వడం లేదు?  హంతకుడు ఒక్కొకర్నీ చంపుతున్నాడని తెలిసీ, ఎందుకు చంపుతున్నాడో వాడి గురించి పేరుతో  సహా పోలీసులకి చెప్పేసి ఎందుకు పట్టుకునే ఆలోచన చేయడం లేదు? మోహన్ లాల్ కూడా ఇవన్నీ తెలిసీ ఎందుకు మిన్నకుండిపోయాడు? – ఈ సందేహాలన్నీ వస్తాయి కనుకనే, వస్తే కథే వుండదు కాబట్టీ,  అపార్ట్ మెంట్ లో అన్నేసి పాత్రలతో దృష్టిని మళ్ళించే ప్రయత్నం చేశారనుకోవాలి.

          ఇలా దాటవేతలతో ఫస్టాఫ్ అనే భవసాగరాన్ని ఎలాగో ఈది జడ్జిని చంపాక, ఇక సెకండాఫ్ లో పోలీసుల సంగతి. వాళ్ళు పాత  కేసులు  తిరగేస్తూ ఈ హత్యలన్నీ ఒకడే చేస్తున్నాడనీ, వాడు చంపి  చిటికెన వేళ్ళు కత్తిరించుకు పోతున్నాడనీ అనుకుంటారు. అయినా  ఇంతకాలం ఈ కేసుల మీద దృష్టి పెట్టలేదంటే ఈ  పోలీసు పాత్రల పోకడని బట్టి వీళ్ళింతేలే  అనుకోవచ్చు. మరి ఆ హంతకుడు జడ్జి చిటికెన వేలిని కూడా కత్తిరించినట్టా లేదా? ఈ విషయం గురించి పోలీసులు మాట్లాడుకోలేదంటే ఇది దర్శకుడి లోపమే. మరణించిన జడ్జి చేతుల అనాటమీ ఎలా వుందో మనకి  కూడా చూపించలేదు. అంటే చిటికెన వేలు కత్తిరించనట్టే. ఎందుకు ఈసారి కత్తిరించలేదు సీరియల్ కిల్లర్? అసలంతకి ముందు ఎందుకు కత్తిరిస్తున్నట్టు? అమెరికన్ పోలీసులు  నేరస్థుల ఇలాటి ప్రవర్తనని ‘ట్రోఫీ’ దాచుకునే యత్నంగా చెప్తారు. అంటే బాధితుల తాలూకు ఏదో వస్తువునో, అంగమో సేకరించి తమ విజయ చిహ్నంగా భద్రపర్చుకోవడ మన్నమాట. చిటికెన వేళ్ళు కత్తిరించడం ఇందుకేనా? ఏ సంగతీ చెప్పనప్పుడు ఇలాటి క్లూలు వూరికే ప్రస్తావిస్తే అది ఉత్త బిల్డప్  కోసమే అన్నట్టుగా వుంటుంది.

          సీరియల్ కిల్లర్ ప్రణాళికలో కూడా లోపం వుంది. అతడికి జడ్జికో కూతురుందని తెలుసు. అలాంటప్పుడు  కూతుర్ని ముందు చంపి, జడ్జి కుళ్ళి కుళ్ళి ఏడుస్తూంటే చూడాలనుకుంటాడు పగబట్టిన ఏ కిల్లరైనా. అప్పుడే  జడ్జిని కసిదీరా చంపుతాడు. ఈ మానసిక ధోరణి కూడా చూపిస్తే కూతురే ముందు చచ్చిపోయి కథే వుండదు. కాబట్టి కిల్లర్ పాత్రని ఇలా ఎక్కడబడితే అక్కడ కిల్  చేస్తూపోయారు.

          కథని పాత్రల్ని స్థాపించే ప్రయత్నం ఇలావున్నాక- ఇక హీరో/పోలీస్/కిల్లర్ అనే త్రిముఖ అట మొదలయ్యాక  సాఫీగా నడిచిపోతుంది. ఈ ఆటకి రాత్రిపూట ఊటీలో క్లయిమాక్స్ బలంగా వచ్చింది. అయితే ఇది కూడా ఎసిపి గంగ పాత్రలాగే సడెన్ గా ముగిసి పోవడమెందుకో అర్ధంగాదు. ఆ చిట్టచివరి చర్యని ఇంకో పావు నిమిషం పొడిగించి వుంటే అసలేం జరిగిందో ప్రేక్షకులకి అర్ధమయ్యే వీలుంటుంది. ఇలా ఈ కథ క్లయిమాక్స్ లోనే పాపని కాపాడే కథే తప్ప, మొత్తం అదే కథ కాదు. 

          వెరైటీగా అంధుడి పాత్ర వుండి, ఆ పాత్రలో సూపర్ స్టార్ మోహన్ లాల్ వున్నప్పుడు, దేశవాళీ కథని వరల్డ్ క్లాస్ స్టోరీగా అందించాల్సిన అవసరం కూడా వుంటుంది. ప్రియదర్శన్ కథని కూడా కనుపాపలా కాపాడుకుని వుండుంటే ఇది సాధ్యమయ్యేదేమో!  

-సికిందర్










 


 

Friday, February 3, 2017

రివ్యూ...



దర్శకత్వం : త్రినాధరావు నక్కిన

తారాగణం : నాని, కీర్తీ సురేష్, నవీన్ చంద్ర, సచిన్ ఖడేకర్, ఈశ్వరీరావ్, పోసాని, రావు రమేష్ తదితరులు.
రచన: ప్రసన్న కుమార్ బెజవాడ, సంగీతం: దేవీ శ్రీ ప్రసాద్, ఛాయాగ్రహణం: నిజార్ షఫీ
బ్యానర్ : శ్రీ వెంకటేశ్వరా క్రియేషన్స్
నిర్మాత : దిల్ రాజు
విడుదల  : ఫిబ్రవరి 3 2017
***
      ‘నేచురల్ స్టార్’ నాని ఓసారి మాస్ క్యారక్టర్ గా మెరిపించాలని ‘నేను లోకల్’  గా విన్యాసాలు చేస్తూ విచ్చేశాడు. నిర్మాత దిల్ రాజు, దర్శకుడు త్రినాధరావు నక్కిన, సంగీత దర్శకుడు దేవీ శ్రీప్రసాద్ ల టీంతో మొదటిసారి పనిచేస్తూ అభిమానుల్ని మురిపించేందుకు ముందడుగేశాడు. మరి గత వైఫల్యం  ‘మజ్నూ’ ని మరిపించే లోకల్ సంగుతులు ఇందులో ఏమున్నాయో ఒకసారి చూద్దాం...

కథ 
       బాబు (నాని) అనేకసార్లు బీటెక్ తప్పి, లెక్చరర్ ని అల్లరిపెట్టి, కాపీకొట్టి ఎలాగో పాసయి ఖాళీగా తిరుగుతూంటాడు. సంపాదించే తల్లి (ఈశ్వరీ రావ్) ) ఉద్యోగం పోగొట్టుకున్న తండ్రీ (పోసాని) వుంటారు. ఒక సంఘటనలో కీర్తి (కీర్తీ సురేష్) అనే అమ్మాయి ప్రేమలో పడతాడు. ఆమె ప్రేమని పొందేందుకు ఆమె చదువుతున్న ఎంబీఏ కాలేజీలో చేరి  వేధించడం, అల్లరి చేయడం మొదలెడతాడు. ఆమెకి మాత్రం తండ్రి (సచిన్ ఖెడేకర్) చూసే సంబంధమే చేసుకోవాలని వుంటుంది. ఈ  పట్టుదలని వదిలించి ప్రేమలో పడేసుకుంటాడు. ఇంతలో వర్మ (నవీన్ చంద్ర)  అనే ఒక పోలీస్ ఎస్సై వచ్చి, ఆమెని తను ప్రేమించానని, తనే పెళ్లి చేసుకోవాలనీ అడ్డు పడతాడు. ఆమె తండ్రి కూడా అతన్నే సమర్ధించి బాబుకి ఓ సవాలు విసురుతాడు : పాతిక రోజుల్లో నువ్వు నా చేత అవునన్పించుకుంటే కూతుర్నిచ్చి  పెళ్లి చేస్తానని. ఈ సవాలుని  బాబు స్వీకరిస్తాడు...

          ఇప్పుడు బాబు ఎలా యోగ్యుడనిపించుకున్నాడు, ఇందుకోసం ఏమేం చేశాడు, ఎస్సై తో ఎలా పోటీ పడ్డాడు, ఏమేం డ్రామా లాడేడూ  అన్నది మిగతా కథ. 

 ఎలావుంది కథ 
      ఇది మార్కెట్ లో వుండాల్సిన రోమాంటిక్ కామెడీ జానర్ కాకుండా, ఒక  పూర్తి స్థాయి వూర రోమాంటిక్ డ్రామా జానర్ కథ. చివర్లో  డబ్బు- వర్సెస్- ప్రేమ గురించి భారీగా క్లాసు పీకే మెలోడ్రామా దీనికి కొసమెరుపు. ఈ మూస ఫార్ములా డ్రామా పొల్లుపోకుండా ఈ కథంతా నడుస్తుంది. పూర్వం చిరంజీవి, బాలకృష్ణ, నాగార్జునలు అత్తారింట్లో మాస్ అల్లుళ్ళుగా వచ్చేసిన కథ కాదా అంటే, కావొచ్చు. వచ్చేసిన కథలే తెలుగుసినిమాలకి  అచ్చోసిన కొత్తగా అన్పించే  కథలని అర్ధంజేసుకోవాలి.  ముందే చెప్పుకున్నట్టు, ఇది నేచురల్ స్టార్ నాని తన నేచురాలిటీ చూసుకోకుండా కమిటై నటించిన, రోజూ తినే ఇడ్లీ లాంటి రొటీన్ మాస్ కథ. 

ఎవరెలా చేశారు 
     ఈ మాస్ క్యారక్టర్ లో నాని చేయాల్సిన వన్నీ చేశాడు. బీటెక్ స్టూడెంట్ గా ఎంత ఆకతాయిగా అలరిస్తాడో, ఆ తర్వాత ఎంబీఏ స్టూడెంట్ గా అంత చిల్లరగా నవ్విస్తాడు. అయితే  ఇక్కడ తను చూపెట్టిన స్పెషాలిటీ ఏమిటంటే, ఇలాటి క్యారక్టర్లు సాధారణంగా తండ్రి సంపాదిస్తూంటే తిని హీరోయిన్ వెంట పడుతూంటాయి. ఈ మూసని తనదైన  క్యారక్టరైజేషన్ తో నాని బ్రేక్ చేసి నెక్స్ట్ లెవెల్ కి తీసికెళ్ళాడు : తల్లి ఉద్యోగం చేసి సంపాదిస్తూంటే తను తిని హీరోయిన్ వెంటపడే కొడుకుగా ప్రేక్షకుల్ని అలరిస్తాడు, నవ్విస్తాడు, ఏడ్పిస్తాడు, ఎంతో ఎంటర్ టైన్ చేస్తాడు!  అరిగిపోయిన రొటీన్ ఆవారా మాస్ పాత్రకి ఇదే ప్రత్యేకాకర్షణ! ఈ క్యారక్టర్ లో బీటెక్ ఇంజనీర్ గా నాని మెరిసిపోయాడు. ‘పనీ పాటా లేకుండా, బాధ్యతా లేకుండా తిరిగే నువ్వూ...’  అని హీరోయిన్ తండ్రి తిట్టినా, సవాలు విసిరినా- నేను మారను, నేనిలాగే వుంటాను, ఏ పనీ చెయ్యను, హీరోయిన్ నాలోని ప్రేమని చూసే ప్రేమించాలి, నాలోని ప్రేమని చూసే పెళ్లి చేయాలి- అని చివరివరకూ అదే దృఢసంకల్పంతో, మాస్ కమిట్ మెంట్ తో వుండి,  పెద్దవాళ్ళందరి మీదా  పైచేయి  సాధించడం నాని హీరోయిజాన్ని మాసాత్మకంగా మరో  మెట్టు పైకి తీసికెళ్ళి అనితరసాధ్యంగా ఎస్టాబ్లిష్ చేసింది. ముగింపులో ప్రేమకోసం చేయబోయిన ప్రాణ త్యాగం, చెప్పిన మాటలు అద్భుతం. ఇలాటి నేచురల్ మాస్ పాత్రలు కమర్షియల్ సినిమాలకి చాలా అవసరం. ఈ వొరవడికి శ్రీకారం చుట్టిన,  తనకిచ్చిన పాత్రని అర్ధం జేసుకుని అంత  కష్టపడి నటించిన  ‘నేచురల్ స్టార్’ నానిని  ఎంతయినా అభినందించాల్సిందే! 

          నాని పాత్ర ఇంత ఎలివేట్ అయ్యేందుకు  కీర్తీ సురేష్, నవీన్  చంద్ర, ఈశ్వరీరావ్, తులసి, పోసాని, సచిన్ ఖెడేకర్, రావురమేష్ మొదలైన వాళ్ళందరూ పోటీపడి నటించారు. సంగీత సాహిత్యాలు, ఛాయాగ్రహణం అన్నీ వండర్ఫుల్ గా తోడ్పడ్డాయి. దర్శకుడు నక్కిన త్రినాధరావు ఇంతమంచి ప్రయత్నం చేసినందుకు నిజంగా అభినందనీయుడు!

చివరికేమిటి 
      ఎంటర్ టైనర్ గా తీసుకుని టైం పాస్ చేయడానికి ఎలాటి ధ్యాసకూడా  పెట్టి చూడనవసరంలేని,  ఈజీ గోయింగ్ మాస్ కమర్షియల్ మూవీగా ఇది ప్రేక్షకుల్ని అలరిస్తుంది. నాని హిట్ ‘భలే భలే మగాడివోయ్’ లాంటి పూర్తి స్థాయి ఆరోగ్యకర రోమాంటిక్ కామెడీ ని దృష్టిలో పెట్టుకుని దీన్ని చూడకూడదు. ఆ తర్వాత వచ్చిన హిట్ కాని రోమాంటిక్ డ్రామా  ‘మజ్నూ’  ని చూసిన కళ్లతోనూ దీన్ని చూడకూడదు. జస్ట్ నేచురల్ నాని, మాసాత్మకంగా ఎలా నేల విడిచి సాము చేశాడో చూడాలనుకుంటే మాత్రం దీన్ని తప్పకుండా చూడాలి!  దీనికి ‘మాసాత్మక నేచురల్’ అని  పైన అవకతవక హెడ్డింగ్ పెట్టడాన్ని కూడా వ్యాకరణాత్మకంగా  చూడరాదు.

-సికిందర్ 
http://www.cinemabazaar.in



         


Sunday, January 29, 2017

రివ్యూ!




దర్శకత్వం : సంజయ్ గుప్తా 



తారాగణం : హృతిక్ రోషన్, యామీ గుప్తా, సురేష్ మీనన్, రోణిత్ రాయ్, రోహిత్ రాయ్, సాహిదుర్ రెహ్మాన్, గిరీష్ కులకర్ణి, నరేంద్ర ఝా తదితరులు 

రచన : సంజయ్ మాసూమ్, విజయ్ కుమార్ మిశ్రా 

సంగీతం : రాజేష్ రోషన్,  సలీం- సులేమాన్ 
ఛాయాగ్రహణం : సుదీప్ ఛటర్జీ, ఆయనంకా బోస్ 
బ్యానర్ : ఫిలిం క్రాఫ్ట్ ప్రొడక్షన్స్ ప్రై. లి. 
నిర్మాత : రాకేష్  రోషన్ 
విడుదల : జనవరి 25, 2017
                              ***
      యాక్షన్ సినిమాల సంజయ్ గుప్తా సరైన సక్సెస్ కోసం పోరాడుతూ కేవలం యాక్షన్ తో పని జరగదని, కాస్త ఫీల్ కూడా అవసరమని ‘కాబిల్’ (సమర్ధుడు) తో సమర్ధవంతంగా తిరిగొచ్చేశాడు. షారుఖ్ తో పోటీగా హృతిక్ రోషన్ ని దింపేశాడు. థియేటర్లు పంచుకోవడం దగ్గరే తేడాలొచ్చి  హృతిక్ తండ్రి, నిర్మాత, అలనాటి హీరో రాకేష్ రోషన్ సినిమాలే తీయడం మానేస్తానని హెచ్చరించాడు. మానేస్తే డిస్ట్రిబ్యూటర్లకి పోయేదేం లేదుగానీ, తమ్ముడు రాజేష్ రోషన్ కి మళ్ళీ సంగీత దర్శకత్వం వహించే అవకాశాలు రాకపోవచ్చు. 1974లో రంగప్రవేశం చేసిన తను, కాలక్రమంలో అన్న రాకేష్  రోషన్ సినిమాలకే పరిమిత మైపోయాడు. నాన్న, బాబాయిలు తప్పుకుంటే హృతిక్కి వచ్చే లోటేమీ లేదు-  తను నటుడుగా ‘కాబిల్’ అని ‘కోయీ మిల్ గయా’ తోనే ఎప్పుడో నిరూపించుకున్నాడు. ప్రస్తుత ‘కాబిల్’ మళ్ళీ  అలాటి పరీక్షపెట్టే పాత్రే. ఈ పాత్రతో తనెలా పరీక్ష నెగ్గాడో చూద్దాం...

 కథ 
      అంధుడైన రోహన్ భట్నాగర్ (హృతిక్ రోషన్) డబ్బింగ్ ఆర్టిస్టు. యానిమేషన్స్ కి డబ్బింగ్ చెప్తూంటాడు. అంధురాలైన సుప్రియ ( యామీ గౌతమ్) పియానో ప్లేయర్. ఓ డాన్స్ స్కూల్లో పని చేస్తూంటుంది. ఒక మేడమ్  వీళ్ళిద్దరికీ పెళ్లి చూపులు ఏర్పాటు చేస్తుంది. పరస్పరం నచ్చుతారు. స్నేహం మొదలెడతారు. షికార్లు తిరుగుతారు. ఆడతారు, పాడతారు, పెళ్ళయిపోతుంది. అదే వీధిలో  ఆవారా బ్యాచ్ అమిత్ (రోహిత్ రాయ్), వసీం (సాహిదుర్ రెహ్మాన్) లుంటారు. వీధి అరుగుమీద కూర్చుని వచ్చే పోయే రోహన్ ని ఆటలు పట్టిస్తూంటారు.  రోహన్ పెళ్ళి చేసుకోగానే భార్య  సుప్రియతో మిస్ బిహేవ్ చేయడం మొదలెడతారు. ఒకరోజు రోహిత్ ఫ్లాట్ లో లేని సమయంలో సుప్రియని రేప్  చేస్తారు. సుప్రియ రోహన్ ల జీవితం తలకిందులై పోతుంది. పోలీస్ కంప్లెయింట్ ఇస్తారు. ఆ పోలీసు అధికారి (నరేంద్ర ఝా) సుప్రియని వైద్యపరీక్షకి పంపించబోతే అమిత్, వసీం లు సుప్రియతో బాటు రోహన్ నీ కిడ్నాప్ చేసి బంధించి, మర్నాడు విడుదల చేస్తారు. 24 గంటలు గడిస్తే మానభంగం జరిగిన ఆనవాళ్ళు చెరిగిపోతాయనీ,  ఇప్పడు వైద్య పరీక్ష లాభంలేదనీ డాక్టర్ చెప్పడంతో షాకవుతారు. పోలీసు అధికారి కూడా చేతులెత్తేస్తాడు. 

          కార్పొరేటర్ మాధవరావ్ (రోణిత్ రాయ్) తమ్ముడు అమిత్. ఇతను తమ్ముడి మీద  కేసులేకుండా చేస్తాడు. రోహన్ కి ఎటూ తోచదు. ఇక తన గురించి పోరాడ్డం మానెయ్యమనీ, ఇప్పుడు మనం విడిపోతేనే మనిద్దరికీ మంచిదనీ చెప్పేస్తుంది సుప్రియ. కానీ మర్నాడు ఉరేసుకుని చనిపోతుంది. అవాక్కవుతాడు రోహన్. ఆత్మహత్యగా తేల్చేసి చేతులు దులుపుకుంటాడు పోలీసు అధికారి. కార్పొరేటర్ మాధవరావ్ వచ్చి ముసలి కన్నీళ్లు కారుస్తాడు. అయినా మొదటిసారి రేప్  జరిగినప్పుడు ఆత్మహత్య చేసుకోని మనిషి, రెండోసారి జరిగితే ఎందుకు చేసుకున్నట్టు?-  అని బాంబు పేలుస్తాడు. రోహన్ కాళ్ళ కింద నేల కదిలిపోతుంది. అదే రేపిస్టులు  తెగించి రెండోసారి అఘాయిత్యం తలపెట్టడాన్ని  ఇక  సహించలేకపోతాడు- ఇప్పుడు కూడా సహకరించని పోలీసు అధికారిని సవాలు చేసి,  చెప్పి మరీ తన ప్రతీకార కాండ మొదలెడతాడు రోహన్...

ఎలావుంది కథ
         రొటీన్ రివెంజి కథ. ఇలాటి కథలు లెక్కలేనన్ని వచ్చాయి. ఈ మధ్య దుష్ట పాత్రలు కూడా రాజకీయనాయకుడి కొడుకో, తమ్ముడో అయివుంటున్నారు రొటీన్ గా. ‘పింక్’ లో రాజకీయ నాయకుడి కొడుకు. కేసులేకుండా ఆ నాయకుడి ఎత్తుగడలు. ఇదే పునరావృతమయింది ప్రస్తుత కథలోనూ. కథానాయకుడు కూడా రొటీన్ గానే చంపుకుంటూ పోతాడు పోలీసులతో దాగుడుమూత లాడుతూ. చివరికి దొరికిపోవడమో, తెలివిగా తప్పించుకోవడమో ఇలాటి కథల్లో చేస్తూంటాడు హీరో. ‘కహానీ -2’ లో చంపడాలు కానిచ్చి పోలీసు అధికారి సహకారంతో  తప్పించుకుంటుంది హీరోయిన్ - ‘డెత్ విష్’ లో హీరోలాగే.
         

        ‘డెత్ విష్’- ఇది ఇలాటి రివెంజి డ్రామాలకి రొటీన్ చెర విడిపించింది. తన కూతుర్ని రేప్  చేసిందెవరో పోలీసులు పట్టుకోకపోతే, అసలు వాళ్ళెవరో  గుర్తించకపోతే- అప్పుడా హీరో కేవలం తన ప్రతీకారం గురించి ఆలోచించడు- సమాజం గురించి ఆలోచిస్తాడు. తన కుటుంబానికి వచ్చిన   పరిస్థితి ఇంకే కుటుంబానికీ  రాకూడదని, రాత్రి పూట సంచరిస్తూ అసాంఘీక శక్తుల్ని వధిస్తూంటాడు! రొటీన్ రివెంజి కథల్ని విశాల దృష్టితో విజిలాంటీ కథగా మార్చేశాడు. ఇది చాలా ప్రఖ్యాతి చెందిన హాలీవుడ్ సినిమా. దీని సీక్వెల్స్ కూడా చాలా వచ్చాయి.

          అయినా ప్రస్తుత కథ ఎక్కడెక్కడ ప్లస్ అవుతోందంటే, ముఖ్యంగా రెండు- ఒకటి అంధ పాత్రలు కావడం, రెండు- భిన్న ప్రపంచాల్ని ఒక ఉద్దేశంతో చూపడం. అంధురాలు రేప్ కి గురై ప్రాణాలు తీసుకుంటే,  తోటి అంధుడు ప్రతీకారం  తీర్చుకోవడం ఎంతైనా రొటీన్ కి ఒక ఫ్లేవరే. రెండో ఫ్లేవర్- భిన్నప్రపంచాలు : హీరో హీరోయిన్ల అందమైన ఆనందమయ కథా ప్రపంచం, ఆ తర్వాత దుష్టుల దుర్మార్గపు కథా లోకం. ఇక్కడ పోలిక : కళ్ళున్న మనుషుల లోకం కంటే, కళ్ళు లేని అంధుల ప్రపంచమే మనోహరంగా వుండడం. ఆ ప్రపంచాన్ని  కళ్ళున్న మనుషులు చిదిమేస్తే, వాళ్ళ లోకాన్ని కళ్ళు లేని  కబోది ఛిద్రం  చేశాడు. కథలు అవే వుంటాయి, వాటిని భావాత్మకంగా చెప్పడంలో వుంటుంది. ఇది పైకి మన మనసుకి  తెలియకపోయినా, సబ్ కాన్షస్ గా గాలం వేస్తుంది. మరపురాని విధంగా సబ్ కాన్షస్ గా గాలం వేసే రొటీన్ రివెంజి కథ ఇది. ఇంతవరకూ ఇలాటిది వచ్చి వుండకపోవచ్చు. 

ఎవరెలా చేశారు 
       స్టార్లు కూల్ గా నటిస్తే అభిమానులు ఏమాత్రం గొడవచెయ్యరని నిరూపిస్తూ కూల్ గా నటించాడు హృతిక్ రోషన్. చాలా కూల్ గా తన యాక్షన్  చేసుకుపోతాడు. ఒకసారి గనుక కథాపరంగా నేపధ్యంలో భావోద్వేగాలు బలంగా ఏర్పాటయ్యాక, ఇక నటుడు ప్రత్యేకంగా వాటిని ప్రదర్శిస్తూ రెచ్చిపోనవసరం లేదని ఈ తరహా ప్రెజెంటేషన్ తెలియజెప్తుంది. నేపధ్యంలోని భావోద్వేగాలకి కదిలిపోవాల్సింది డబ్బెట్టి టికెట్లు కొనుక్కున్న విధేయులైన ప్రేక్షకులే. వాళ్ళు సినిమాకొచ్చేదే కదిలిపోవడానికి, దిష్టి బొమ్మల్లా కూర్చోవడానిక్కాదు. నటుడు కేవలం నిమిత్త  మాత్రుడు. హృతిక్ తో బాటు, యామీ గౌతమ్ పాత్రచిత్రణల్లో మరో కొత్తదనం ఏమిటంటే- సర్వసాధారణంగా, కరుడుగట్టిన, కాలప్రవాహంలో ఎక్కడో గడ్డ కట్టుకుపోయిన-  అదే పాత మూస ఫార్ములాగా, అంధుల్ని వీళ్ళు అంధులూ అని ముద్రేసినట్టు, కనుగుడ్లు పైకి తిప్పుతూ, తడుముకుంటూ నడుస్తూ,  ఏవో విషాద శోక రసాలతో బోలెడు సానుభూతిని పొందేట్టూ చూపిస్తూంటారు ఇంకా. లేకపోతే  బ్లైండ్ అని తెలియడానికి బ్లాక్ స్పెక్ట్స్ పెట్టేయడం.  ఈ రెండు బ్రాండింగులూ కట్ అయ్యాయిక్కడ. కొత్త ప్రతీకల్ని కనిపెట్టని సినిమాలు  అనాగరికంగా కన్పిస్తాయి. ముఖ్యంగా యూత్ అప్పీల్ ని కోల్పోతాయి.  ఇవాళ్టి మోడల్ సెల్ ఫోన్ రేపు వుండడం లేదు, ఇవాళ్టి తరహా సీను రేపు వుండకూడదు- ఇదే సక్సెస్ మంత్రం. 

       హృతిక్ మనలాగే చూస్తూ తిరుగుతూంటాడు. అతడికి పరిచయం లేని వాళ్ళకి  అంధుడని కూడా అన్పించనంత చక్కగా ఎవరి సాయమూ లేకుండా తనపనులు తాను  చేసుకుపోతాడు. చూపు లేకపోయినా మనోనేత్రంతో చూస్తాడు- పైగా ఘ్రాణశక్తి ఎక్కువ. దుస్తుల వాసనని బట్టి అదెవరో చెప్పేస్తాడు. దుష్టుడు అలికిడవకూడదని బూట్లు విడిచి, నిశ్శబ్దంగా వెనకనుంచి దాడి చేయడానికి వస్తూంటే- గిరుక్కున తిరిగి గట్టి పంచ్ ఇస్తాడు- నీ సాక్సు వాసన శవం కూడా పసిగడుతుందిరా- అని కూల్ గా అనేస్తాడు. దద్దరిల్లిపోతుంది థియేటర్  ప్రేక్షకుల కేరింతలతో 

          అతడికి కోపం, బాధ, విసుగు, అసహనం తెలియవు- తనకు లేనిది ఇతరులకుందన్న ఈర్ష్యాసూయలూ వుండవు- అంత ప్రేమగా వుంటాడు. చిరునగవు చెరగదు. ఆ అపార్ట్ మెంట్ బిల్డింగ్ లో అతనంటే అందరికీ ప్రేమ. అతడికి షాకు మీద షాకులు తగులుతూంటాయి, అయినా కన్నీళ్లు రావు- కాసేపు అలా కూర్చుండిపోతాడు. ఆ కూర్చుండి పోవడంలో చాలా అర్ధాలుంటాయి- డైలాగులు అవసరంలేని సబ్ టెక్స్ట్. లోకం తనతో ఇలా దయలేకుండా  ప్రవర్తిస్తోందని  అనుకుంటున్నాడేమో, గుడ్డోడని కూడా చూడకుండా పోలీసులిలా చేస్తున్నారని అనుకుంటున్నడేమో అలా కూర్చుని పాపమని మనకి అన్పిస్తుంది!

         ఇంటర్వెల్ సీన్లో హృతిక్ పోలీసు అధికారిని ఎదుర్కొన్నప్పుడు చెప్పే నాల్గు మాటలు - యే ఖేల్ ఉన్హోనే షురూ కియా థా...తమాషా ఆప్ లోగోనే దేఖాహై ... ఖతం మై కరూంగా!’  (ఆట వాళ్ళు మొదలెట్టారు, తమాషా మీరు చూశారు,  నేను ఫినిష్ చేస్తాను) ఎంత సింపుల్ గా వుంటాయో, అంత  టెర్రిఫిక్ గా వుంటాయి. ఇంటర్వెల్ పడ్డాక అవి వెంటాడుతూ వుంటాయి

      యామీ గౌతమ్ అంధ పాత్ర కాస్త తేడా. ఆమె మొహం ఎప్పుడూ నవ్వుతో వెలిగిపోతూ వుంటుంది. అంగవైకల్య పాత్రల్ని ఇలా రిచ్ గా, గ్లామరస్ గా, కలర్ఫుల్ గా చూపించడంతో కథలో శాడ్ ఫీల్ తొలగిపోయి ఆసక్తికరంగా తయారయ్యాయి. ఈ పాత్రల్లో హృతిక్, యామీలు ఏవో ఫాంటసీల్లో యాంజెల్స్ లా కన్పిస్తారు. యామీ ఇలా కన్పించేది ప్లాట్ పాయింట్ వన్ వరకూ మొదటి ముప్పావు గంటే అయినా,  ఆతర్వాత సినిమా ముగింపువరకూ ఆమె ప్రభావాన్ని- ఆ నవ్వు ముఖాన్ని  ఫీలవుతూనే వుంటాం. 

          రేపిస్టు లిద్దరూ బాగానే నటించారు. వీళ్ళని కాపాడే కార్పొరేటర్ గా రోణిత్ రాయ్ మరాఠీ యాస మాటాడే పవర్ఫుల్ విలన్ గా దర్శన మిస్తాడు. రేపిస్టుల్లో ఒకడైన రోహిత్ రాయ్ నిజజీవితంలో కూడా ఇతడి తమ్ముడే. హృతిక్ ఫ్రెండ్ జాఫర్ గా సురేష్ మీనన్ స్మూత్ గా కన్పిస్తాడు. గిరీష్ కులకర్ణి, నరేంద్ర ఝాలు బ్యాడ్ పోలీసు పాత్రల్ని భద్రంగా హేండిల్ చేశారు.

          సుదీప్ ఛటర్జీ, ఆయనంకా బోస్ ల కెమెరా వర్క్, మానినీ మిశ్రా ఆర్ట్ డైరెక్షన్; కరిష్మా ఆచార్య, నాహిద్ షా ల కాస్ట్యూమ్స్ వర్క్ ఒక శైలిని పాటించాయి : మొదటి అందమైన ప్రపంచం  ఒక రంగుల స్వప్నంలా, తర్వాత మొదలయ్యే రెండో అంధకార లోకం ఒక పీడకలలా ఆవిష్కరించారు దర్శకుడి విజన్ ప్రకారం. అయితే తను తీసే యాక్షన్ సినిమాలకి దర్శకుడు అలవాటు పడ్డ ఎలాటి టింట్ (సాధారణంగా డార్క్ గ్రీన్ టింట్ తో సినిమాలు తీస్తాడు) నీ వాడలేదు. ఓన్లీ ‘ఈస్ట్ మన్ కలర్’. అలాగే ఎడిటర్ అకీవ్ అలీ కూడా దృశ్యాల్ని నీటుగా వుంచాడు. జంప్ కట్స్, స్పీడ్ ర్యాంపులు, స్వైపులు వంటివి వేసి గజిబిజి చే యకుండా,
simple editing technique will make your scenes more dramatic and powerful కాన్సెప్ట్ ని పాటించాడు. దృశ్య కాలుష్యం లేని విజువల్స్ ని ప్రదర్శించాడు. సౌండ్ విషయంలో- ఇది భారీ యెత్తున సౌండ్ ఓరియెంటెడ్ స్క్రిప్టు కావడంతో, ఆస్కార్ విన్నర్ రసూల్ పోకుట్టికి మంచి ఆట స్థలమైంది. 

          మొత్తం ప్రాజెక్టుని సంజయ్ గుప్తా చాలా సున్నితంగా, సునిశితంగా, ఏంతో  ప్రేమిస్తున్నట్టు ప్రత్యేక అభిరుచితో,  హృదయపూర్వకంగా,  కథతో ఇంత రోమాన్స్  చేస్తూ దర్శకత్వం వహించడం ఆశ్చర్య పరుస్తుంది. హార్డ్ కోర్ యాక్షన్స్ తీసే సంజయ్ గుప్తా ఇక్కడ మళ్ళీ కన్పించడు.

స్క్రీన్ ప్లే సంగతులు

          యాక్షన్ సినిమాల సీనియర్ దర్శకుడు సంజయ్ గుప్తా పదిహేడు సినిమాలు తీస్తే, అందులో పన్నెండుకి పన్నెండూ  హాలీవుడ్, కొరియన్ కాపీలే. ‘రిజర్వాయర్ డాగ్స్’ లాంటి ప్రపంచ ప్రసిద్ధ సినిమాని  కూడా కాపీ కొట్టేందుకు ఏ మాత్రం మొహమాట పడడు. రొటీన్ గా ఈసారి కూడా  కాపీ ఆరోపణలే వున్నాయి- ‘కాబిల్’ కూడా హాలీవుడ్ ‘బ్లయిండ్ ఫ్యూరీ’, కొరియన్ ‘బ్రోకెన్’ లకి కాపీ అని  న్యూస్ వచ్చినా వీటితో సంబంధం లేని కథ ఇది. కథతో వేరే వివాదాలేర్పడ్డాయి. తను చెప్పిన ‘ఫర్మాయీష్’ (అభ్యర్ధన) కథ సంజయ్ గుప్తా కొట్టేసి  ‘కాబిల్’ గా తీశారని సుధాంశూ పాండే అనే మోడల్ కోర్టుకెక్కితే, ఆ ‘ఫర్మాయీష్’ నే నా దగ్గర్నుంచి సుధాంశూ పాండే కొట్టేశాడని ఈ సినిమా రచయితలలో ఒకడైన విజయ్ కుమార్ మిశ్రా పోలీస్ స్టేషన్ కెక్కాడు. అసలు మా ‘డార్క్ నైట్’ సిరీస్ నే  కాపీ కొట్టి ‘కాబిల్’ తీశారని నెట్ ఫ్లిక్స్ సంస్థ తాజాగా లీగల్ చర్యలకి దిగుతోంది. సంజయ్ గుప్తా కాపీ యావ పండి పాకాన పడింది. సినిమా మాత్రం భలేగా ఆడేస్తోంది. 

          రొటీన్ తో రోమాన్స్ చేశాడు ఈ స్క్రీన్ ప్లే తో సంజయ్ గుప్తా. ఒక రేప్, దానికి ప్రతీకారమనే - మళ్ళీ మళ్ళీ ఇదే రిపీట్ అవుతున్న- పురాతన కథతో రోమాన్స్ చేసి, పాత వాసనని వదిలించాడు. అంధ పాత్రలతో ఈ రేప్ అండ్ రివెంజి కథ పెట్టడం రోమాన్స్ లో ఒక భాగమైతే, దీన్ని రెండు ప్రపంచాలుగా విడగొట్టడం రెండో భాగం. పైన చెప్పుకున్నట్టు,   అంధు లైన హీరో హీరోయిన్ల అందమైన కథా ప్రపంచం ఒకటి, ఆ తర్వాత దుష్టుల దుర్మార్గపు కథా లోకం. తద్వారా కళ్ళున్న మనుషుల లోకం కంటే, కళ్ళు లేని అంధుల ప్రపంచమే మనోహరంగా వుంటుందని చూపడం. అంధుల ప్రపంచాన్ని కళ్ళున్న మనుషులు చిదిమేస్తే, కళ్ళున్న మనుషుల  లోకాన్ని కళ్ళు లేని కబోది  పొడిచేశాడు. ఈ కవితాత్మక ధోరణి  రివెంజిని ఒక మెట్టు పైకి తీసికెళ్ళి,   అనాదిగా వస్తున్న రొటీన్ బానిస సంకెళ్ళని తెంపేసింది. ఉన్నదానికి ఇన్నోవేషన్ (నూతన కల్పన) అంటే ఇదే. 

          బిగినింగ్ మొదటి ముప్పావు గంటకి  కుదించాడు. ఇందులో అంతా హీరో హీరోయిన్ల మెచ్యూర్డ్ లవ్ తో కూడిన దృశ్యాలే. వాళ్ళ బాండింగ్ ని బలీయం చేసే సన్నివేశాలే. ముప్పావు గంటలో ప్లాట్ పాయింట్ వన్ దగ్గర ఈ ప్రపంచం తలకిందులవబోతోంది కాబట్టి, దీన్ని వీలైనంత అందంగా చూపాడు. ఒడిదుకుల ప్రపంచాన్నే చూపిస్తే ఆ  తర్వాత తలకిం దులవడానికేమీ వుండదు- వున్నా తేడా అన్పించదు. అదే సమయంలో ప్లాట్ పాయింట్ వన్ దగ్గర హీరోయిన్ రేప్  అయి, ఆ తర్వాత చనిపోతుంది కాబట్టి- అదంతా విషాదమే కాబట్టి- దానికి కాంట్రాస్ట్ గా బిగినింగ్ విభాగమంతా ప్రతీ సీనులో ఆమెని చెరగని చిరునవ్వుతో అందమైన, సుకుమారమైన అమ్మాయిగా చూపించాడు. ఇలాటి అమ్మాయి ట్రాజెడీ పాలైతే వుండే బాధని ప్రేక్షకులు బాగా ఫీలయ్యేట్టు కథా పథకం కొనసాగించాడు. 

      అలాగే కథనీ, పాత్రల్నీ వేరు చేశాడు. కథ ముందా, పాత్రలు ముందా అంటే, బిగినింగ్ లో పాత్రలే ముందు కాబట్టి- ఆ తర్వాతే మిడిల్లో కథ ప్రారంభమవుతుంది కాబట్టి- పాత్రల్ని మాత్రమే బిగినింగ్ విభాగపు హైలెట్స్ గా చేసుకున్నాడు. ఇందులోకి కథ తాలూకు ఛాయల్ని ఏమాత్రం రానీయలేదు. ప్లాట్ పాయింట్ వన్ దగ్గర సంఘటనతో కథే ప్రధానం కాబట్టి,  అక్కడ్నించీ మిడిల్లో కథలోకి పాత్రలూ రాకుండా చేశాడు. పైన చెప్పుకున్నట్టు- కథాపరమైన, కథకి మాత్రమే చెందిన భావోద్వేగాల్ని నేపధ్యంలో వుంచుతూ,  హృతిక్ పాత్రని నడిపాడు. అంటే బిగినింగ్ లో ఆడియెన్స్ ముందు పాత్రల్ని మాత్రమే ఎంజాయ్ చేయాలి, లేదా ఫీలవ్వాలి. ఆతర్వాత ప్లాట్ పాయింట్ వన్ నుంచీ ప్రారంభమయ్యే మిడిల్ లో, కథ మాత్రమే ఫీలవ్వాలి. ఇక  కథ ముగింపుకొచ్చేసరికి మళ్ళీ  ఆ విజయం సాధించిన పాత్రనే ప్రేక్షకులు ఫీలయ్యేట్టు చేశాడు. 

          నిజమే, కథంటూ  ప్రారంభమయ్యాక ప్రేక్షకుల దృష్టి పాత్రల మీదికి ఎందుకు పోవాలి? అప్పుడు కథకి ఎలా కనెక్ట్ అవుతారు? సినిమా చూసి బయటికొచ్చిన ప్రేక్షకులు మీడియా వాళ్లకి ఏమని బైట్స్ ఇస్తారు? డాన్సులు అదిరాయి, ఫైట్లు అదిరాయి, కామెడీ సూపర్- అంటారు. ఇంతే,  కథ బావుంది సూపర్ అని ఒక్కరూ అనరు, లేడీస్ కూడా అనరు.  సినిమా అంటే డాన్సులూ ఫైట్లూ,కామెడీయేనా? అంటే కథ ప్రారంభమయ్యకా ఇంకా ప్రేక్షకుల దృష్టి పాత్రల  మీదికే పోయేట్టు చేయడంవల్ల కథ పట్టక ప్రేక్షకులు అలా బైట్స్ ఇస్తూండొచ్చు. 

          కాబట్టి ఒకసారి కథంటూప్రారంభమయ్యాకా, కథనే ప్రేక్షకులు చూడాలి, కథలోంచే  పాత్రల్ని చూడగలగాలి, పాత్రల్లోంచి కథని అస్సలు చూడకూడదని, అలా చూడడం సాధ్యం కాదని - ఇదే పొరపాటు చాలా సినిమాల్లో జరిగిపోతోందని అన్పిస్తుంది ‘కాబిల్’ మేకింగ్ ని చూస్తూంటే. 

          ఎంగేజిమేంట్ తో ప్రారంభమయ్యే బిగినింగ్, పెళ్లి జరిగి, తర్వాత రేప్ తో ముగుస్తుంది. ఇక్కడ కథ పుట్టి, ఈ ప్లాట్ పాయింట్ వన్ నుంచి మిడిల్ ప్రారంభమై, సమస్యతో సంఘర్షణ మొదలవుతుంది.  ఇక్కడ్నించీ ఇదంతా కళ్ళున్న మనుషుల కసాయి ప్రపంచం. ఈ ప్రపంచానికి పెత్తందార్లయిన పోలీసులూ కార్పొరేటరూ రేపిస్టుల ఎత్తుగడలు. అలవాటు లేని ఈ ప్రపంచంలో హీరోహీరోయిన్ల ఉక్కిరిబిక్కిరి. సాధారణంగా ఇలాటి కథల్లో ఒక్క సారే రేప్ జరుగుతూ వచ్చింది. ఈ 
కథలో రెండో సారి జరగడం కొత్త ఐడియా. దీంతో కథ మళ్ళీ ఓ కుదుపు నిస్తుంది. మొదటి రేప్ తో పోలీసుల నిర్వాకం చూసి నిస్సహాయుడై పోయిన హీరోకి- ఈ రెండో రేప్, హీరోయిన్ ఆత్మహత్య రగిలిస్తుంది. ఇప్పుడూ నిమ్మకునీరెత్తినట్టున్న పోలీసులతో  ఇక లాభంలేదని,  హీరో చట్టాన్ని చేతుల్లోకి తీసుకోవడం ఇంటర్వెల్. 

          ఇక సెకండాఫ్  మిడిల్ టూ ప్రారంభించి- హీరో పథకం ప్రకారం చంపడం మొదలెడతాడు. పోలీసులకి ఎవిడెన్స్ దొరక్కుండా చేస్తాడు. చివరికి పోలీసులు అతడి మీద నిఘా పెట్టడంతో, ప్లాట్ పాయింట్ టూ ఏర్పడి మిడిల్ ముగుస్తుంది. ఇక్కడ్నించి  ప్రారంభమయ్యే ఎండ్ విభాగం పోలీసుల కన్ను గప్పి మిగిలిన హత్య ఎలా చేశాడన్నది తెలియజెప్తుంది. ఇక హీరోని కిల్లర్ గా పట్టుకోవడానికి పోలీసు అధికారికి ఒక కీలక ఆధారం దొరుకుతుంది – అది దొరుకుతుందని ముందూహించే హీరో దానికీ ప్లానేస్తాడు. ఈ ప్లానుతో  పోలీసు అధికారికి ముందు దారంతా మూసుకుపోతుంది. ఇది గుర్తుండి పోయే ఫినిషింగ్ టచ్ కథకి.
***
      ఐతే స్ట్రక్చర్, పాత్రచిత్రణ, కథానిర్వహణా ఇంత పకడ్బందీగా వున్న ఈ స్క్రీన్ ప్లేలో  పెద్ద పెద్ద లోపాలూ లేకపోలేదు. ఈ లోపాలతో చూస్తే ఈ కథే వుండదు, కథే పుట్టదు. ఒక నేరానికి హీరో బలై నప్పుడు ఎంత పకడ్బందీగా అతను పథకం వేస్తాడో, అంతే  పకడ్బదీగా, లాజికల్ గా  ఆ జరిగిన నేరంతో రచయిత ఎందుకుండడు?  హీరో మీద నెట్టేసి ఎందుకు కూర్చుంటాడు?

          సినిమాలో ఒక నేరం తాలూకు దర్యాప్తు ఒక విధంగా చూపిస్తున్నారంటే అదే నిజమని అనుకోవచ్చు ప్రేక్షకులు. ఆ చూపడం లోపభూయిష్టంగా వుంటే మాత్రం తప్పుడు సంకేతాలు, తప్పుడు సమాచారమూ  వెళతాయి ప్రేక్షకుల్లోకి. ఫలితంగా వాళ్ళూ  అదే ఫాలో అయితే తీవ్రంగా నష్టపోతారు. ఉదాహరణకి, ఈ సినిమాలో చూపించినట్టు- రేప్ జరిగిం తర్వాత పోలీసుల దగ్గరికి వెళ్తారు హీరో హీరోయిన్లు. పోలీసులు వెనకాముందాడి ఎలాగో వైద్య పరీక్షలకి పంపిస్తారు. రేపిస్టులు జొరబడి ఆ వైద్య పరీక్షల్నిఅసాధ్యం చేస్తారు. ఇలాటివి జరక్కూడదనే పోలీసుల పరిధి నుంచి వైద్య పరీక్షల్ని తొలగించింది మూడేళ్ళ క్రితం కేంద్ర ప్రభుత్వం. ఇక నుంచి రేప్ బాధితురాలు ముందు పోలీస్ స్టేషన్ కి వెళ్లి కంప్లెయింట్ చేయనవసరం లేదు. ఏ డాక్టర్ దగ్గరికైనా  వెళ్లి వైద్య పరీక్షలు కోరవచ్చు. ఆ రిపోర్టుతో వెళ్లి పోలీసు కంప్లెయింట్ ఇవ్వొచ్చు. డాక్టర్లు పరీక్షకి నిరాకరించినా, పోలీసులు ఆ రిపోర్టు ఆధారంగా కేసు నమోదు చేయకపోయినా జైలుకి పోతారు!

          ఇప్పుడు సినిమాలో చూపించింది రద్దయిన పాత  ప్రక్రియ. ఇది చూపిస్తూ ఇది సినిమా అనీ,  సినిమాకి లాజిక్ ఏమిటనీ అంటే మాత్రం చెప్పేదేమీ వుండదు. ప్రభుత్వ పాలనా పరమైన విధివిధానాలతో  మెడికో లీగల్ కథలు చేయనవసరం లేదనుకుంటే వాళ్ళిష్టం.  కేంద్ర ప్రభుత్వం వైద్య పరీక్షల్లో రేప్ బాధితురాలికి అవమానకరంగా వుండే కొన్ని పాత ప్రక్రియల్ని కూడా రద్దు చేసింది. 

          సినిమాలో 24 గంటలు దాటితే బాధితురాలి శరీరంమీద రేప్ జరిగిన ఆనవాళ్ళు వుండవనడం వరకూ కరెక్టే. అయితే ఆమె ఫ్లాట్ లో రేప్ జరిగినప్పుడు రేపిస్టుల తాలూకు ఇతర సాక్ష్యాధారాలు లభించ వచ్చుకదా? సరే, పోలీసులు సహకరించలేదని అనుకుందాం, తర్వాత ఆమె ఆత్మహత్య చేసుకుంది. అప్పటికి రెండోసారి రేప్ జరిగినట్టు తెలియదనే అనుకుందాం- అప్పుడు పోస్ట్ మార్టం లోనే రేప్ జరిగినట్టు తెలుస్తుందిగా? ఆ ఎవిడెన్స్ పట్టిస్తుందిగా? అసలు అది ఆత్మహత్య అని హీరో ఎందుకు నమ్మాలి, రేపిస్టులే చంపేసి వుండొచ్చుగా? 

          బ్రెయిలీ భాషలో ఉత్తరం రాసి పెట్టిన హీరోయిన్ రెండు వాచీల్ని కూడా ప్రస్తావిస్తూ- వీటిలో  ఒకదాన్ని దహనం చేయమనీ, రెండో దాన్ని ఖననం చేయమనీ కోరుతుంది రేపిస్టుల్ని ఉద్దేశించి. మంచం కింద తర్వాత హీరోకి దొరికే  ఈ ఉత్తరం, వాచీలూ ఫోరెన్సిక్ టీం అప్పుడెందుకు చూడలేకపోయారు?  ఘటనా స్థలంలో మంచం కింద కూడా  చూడరా?  ఆమె మంచం కింద ఎందుకు తోసింది? ఆత్మహత్య చేసుకునే మనిషి రాసిన చీటీ కన్పించేలానే పెడుతుంది. వాచీలు పోలీసులకి దొరక్కూడదని మంచం కిందికి తోసిందా? మంచం కిందా పోలీసులు చూడరని ఎలా గెస్ చేసింది? 

          ఇదంతా అలావుంచి, ఇంత జరుగుతున్నా అపార్ట్ మెంట్ వాసులు ఒక్కరూ కన్పించరు. రేప్ ముందు వరకూ మాత్రం దగ్గరుండి అపురూపంగా చూసుకుంటారు- వీళ్ళంతా ఏమయ్యారు? వీళ్ళంతా సాయానికొస్తే రెండోసారి రేప్ జరిగేది కాదుగా? పోలీసుల ఆటలూ సాగేవి కాదుకదా? ...అసలు హీరోయిన్ ఒకణ్ణి దహనం చేయమనీ, ఇంకొకణ్ణి ఖననం చేయమనీ ఉత్తరంలో కోరిందంటే వెళ్లి చంపమనేగా అర్ధం?  మళ్ళీ పోలీసుల్ని ఆశ్రయించి లాభం లేదనే కదా?  అలా ఆమె చివరికోరిక తీర్చకుండా, వృధాగా  పోలీసుల దగ్గరికే మళ్ళీ ఎందుకెళ్ళాడు?.... ఇలాటి ప్రశ్నలు తలెత్తకుండా  సహేతుకంగా వుండాల్సి వుంటుంది  ఈ జానర్ కథనం.

-సికిందర్
http://www.cinemabazaar.in
         
         


         



Saturday, January 28, 2017

రివ్యూ!




స్క్రీన్ ప్లే- దర్శకత్వం : రాహుల్ ఢొలాకియా 

తారాగణం : షారుఖ్ ఖాన్, మాహిరా ఖాన్, నవాజుద్దీన్ సిద్దిఖీ, షా మహ్మద్ జీషాన్ ఆయూబ్, షీబా చద్దా, అతుల్ కులకర్ణి, సన్నీ లియోన్ తదితరులు
రచన : రాహుల్ ఢొలాకియా, హరిత్ మెహతా, ఆశీష్ వశి, నీరజ్ శుక్లా
సంగీతం : రామ్ శుక్లా, ఛాయాగ్రహణం : కె యు మోహనన్
బ్యానర్ : రెడ్ చిల్లీస్ ఎంటర్ టైన్మెంట్, ఎక్సెల్ ఎంటర్ టైన్మెంట్
నిర్మాతలు : రీతేష్ సిధ్వానీ, ఫర్హాన్ ఖాన్, గౌరీ ఖాన్
విడుదల : జనవరి 25, 2017

***
        సూపర్ స్టార్ షారుక్ ఖాన్ ‘రయీస్’ తో వూరించీ వూరించీ రిపబ్లిక్ డే సందర్భంగా బాక్సాఫీసుకి చేరుకున్నాడు. పాకిస్తానీ హీరోయిన్ మాహిరా ఖాన్ తో రచ్చ జరిగీ జరిగీ క్షేమంగా  బయటపడి బాక్సాఫీసు దగ్గర తేల్చేద్దామని ఎదురు చూస్తున్న ప్రేక్షకుల ముందు కొచ్చింది ‘రయీస్’. ‘పర్జానియా’ తో జాతీయ అవార్డు పొందిన దర్శకుడు రాహుల్ ఢొలాకియా తిరిగి గుజరాత్ కథనే చెప్పాలనుకుని ‘రయీస్’ కి తెరతీశాడు. రిపబ్లిక్ డేకి షారుఖ్ ‘రయీస్’ తో బాటు హృతిక్ రోషన్ ‘కాబిల్’ కూడా ప్రతిష్టాత్మకంగా తీసుకుని పోటీకి దిగింది. తెలుగులో ఇద్దరు పెద్ద స్టార్లు నువ్వా నేనా అన్నట్టు సంక్రాంతి బరిలోకి దిగినట్టు- అసలే ఆసక్తికరంగా మారిన  రయీస్- కాబిల్ ల అమీతుమీలో  మొదటిది జాతి వ్యతిరేకమనీ, రెండోది దేశభక్తియుతమనీ,  రెండో దానికే జైకొట్టాలనీ బిజెపి నేత నిప్పు రాజెయ్యడంతో, ఇదేంటో చూద్దామని ప్రేక్షకులు పనిగట్టుకుని బిజీ అయిపోయారు. కొందరు నేతలు బాక్సాఫీసులు కళ కళ లాడేట్టు చేయడానికే పుడతారు!
కథ 
       1970- 90 ల మధ్య కాలంలో గుజరాత్ లోని ఫతేపూర్ లో జరిగే కథ. గాంధీ  పుట్టిన రాష్ట్రం గుజరాత్ లో మద్య నిషేధం అమల్లో వున్నా,  నాటు సారా తయారీ, అమ్మకపు సిండికేట్లు  యదేచ్ఛగా కొనసాగుతున్న రోజులవి. పేద కుటుంబంలో పుట్టి పెరిగిన రయీస్ (షారుఖ్ ఖాన్) చిన్నప్పుడు తల్లి (షీబా చద్దా) చెప్పిన మాటల్ని బాగా వొంటబట్టించుకుంటాడు.  ఏ దందా (బిజినెస్) కూడా దేనికంటే తక్కువది కాదనీ, అలాగే ఏ దందా కంటే కూడా మతం గొప్పది కాదనీ చెబుతుంది తల్లి.  మొదటి ‘నేరం’ గాంధీ విగ్రహానికున్న కళ్ళద్దాల్ని దొంగిలించడంతో చేస్తాడు. అతడికి చిన్నప్పుడే దృష్టి లోపం. కళ్ళజోడు అరువు మీద ఇస్తానని పార్సీ వైద్యుడు అన్నా,  ఆత్మాభిమానంతో అప్పు తీసుకోదు రయీస్ తల్లి. దాంతో గాంధీ కళ్ళద్దాలు దొంగిలిస్తాడు. స్కూల్లో  చదివే రోజుల్లోనే జైరాజ్ (అతుల్ కులకర్ణి)  అనే బనియా (వ్యాపారి) గ్యాంగ్ లో చేరతాడు. జైరాజ్ తనకి బనియా బుర్ర కి తోడూ ముసల్మాను ధైర్యం కూడా వుందని ఉబ్బి తబిబ్బు అవుతూంటాడు. సారా స్మగ్లింగ్, గ్యాంబ్లింగ్ దందాలు నిర్వహిస్తూంటాడు. పోలీసులు ఇతడితో చేతులు కలుపుతారు. పెద్దయ్యాక రయీస్ కి సొంత దందా మొదలెట్టుకోవాలన్పిస్తుంది. దీంతో జైరాజ్ తో తేడా వస్తుంది. మూసా (నరేంద్ర ఝా) అనే ఇంకో సారాకింగ్ తో స్మగ్లింగ్ దందా మొదలెడతాడు. చూస్తూండగానే తనే డాన్ అయిపోతాడు. పేద ప్రజలకి నాయకుడు  అవుతాడు (రయీస్ అంటే నాయకుడు లేదా గొప్ప వాడు అని అర్ధం). ఒక ప్రతిపక్ష పార్టీ మొదలెట్టిన “యాత్ర” ని శాంతి భద్రతల దృష్ట్యా అడ్డుకుని ప్రజల్లో మరింత అభిమానం సంపాదించుకుంటాడు. సీఎం దృష్టిలో పడతాడు. సీఎం తన దందాలకి, రాజకీయాలకీ  వాడుకోవడం మొదలెడతాడు. తేడా వచ్చి జైల్లో పడేస్తాడు. జైల్లోంచే ఎమ్మెల్యేగా గెలిచి వస్తాడు రయీస్. ఇప్పుడు ప్రజాబలంతో తిరుగు లేని నాయకుడైన రయీస్ చరిత్రని ఎలాగైనా ముగించాలని సీఎం అదే ప్రతిపక్ష నాయకుడితో చేతులు కలుపుతాడు...
    ఈ కథలో ఇంకా రయీస్ ప్రేమించి పెళ్లి చేసుకున్న ఆసియా (మాహిరా ఖాన్) వుంటుంది, రయీస్ ఏకైక అనుచరుడు సాదిక్ (షా మహ్మద్ జీషాన్ ఆయూబ్) వుంటాడు. ఇంకా రయీస్ దందాలు ఖతం చేయాలనుకుని ప్రయత్నించే ఎసిపి జైదీప్ అంబాలాల్ మజ్ముదార్ (నవాజుద్దీన్ సిద్దిఖీ) వుంటాడు.

ఎలావుంది కథ
     ఇది అప్పట్లో గుజరాత్ అండర్ వరల్డ్ డాన్ అబ్దుల్ లతీఫ్ నేరచరిత్ర  ఆధారంగా తీసిన కథ అని తెలిసిందే. కాకపోతే ఆ నేరచరిత్రని వున్నదున్నట్టుగా  సినిమాగా తీయడం సాధ్యం కాదు- తీస్తే గొడవలవుతాయి. కాంగ్రెస్ పార్టీ పరువు మళ్ళీ పోతుంది, బిజెపి ప్రతిష్ఠ ఇంకా పెరుగుతుంది. లతీఫ్ వల్లే గుజరాత్ లో కాంగ్రెస్ భూస్థాపితమైంది, లతీఫ్ వల్లే గుజరాత్ లో బిజెపి తిరుగులేని పార్టీ అయింది. పార్టీల విషయం అలావుంచితే, కరుడు గట్టిన నేరస్థుడు లతీఫ్ జీవితం ఎవరికీ ఆదర్శం కాదు  సినిమాగా తీయడానికి. కనీసం అతడిలో హాజీ మస్తాన్, వరదరాజన్ ల లాంటి పూర్వపు ముంబాయి డాన్ లలో వున్న దయాగుణం లేదు- లౌకిక తత్త్వం లేదు. అతను దావూద్ ఇబ్రహీంతో చేతులు కలిపిన మతోన్మాది, టెర్రరిస్టు కూడా.          సారా దందాతో ప్రారంభమయ్యాడు లతీఫ్. అల్లా రఖా గ్యాంగులో చేరి  గాంబ్లింగ్ డెన్లు నడిపాడు. అల్లా రఖా నుంచి విడిపోయి సొంత దందా నడుపుకుంటూ స్మగ్లర్లతో, క్రిమినల్స్ తో, పోలీసులతో, రాజకీయ నాయకులతో సంబంధాలు ఏర్పరచుకున్నాడు. ఈ వెన్ను దన్నులతో బలవంతపు వసూళ్లు, కిడ్నాపులు, హత్యలు మొదలెట్టాడు. మరోవైపు దావూద్ ఇబ్రహీంతో గ్యాంగ్ వార్స్ మొదలెట్టాడు.
      తన గ్యాంగులో మైనారిటీ వర్గానికి చెందిన వాళ్ళనే చేర్చుకునే వాడు. మైనారిటీ పేదలకే సాయపడేవాడు. ఆ విధంగా తను మైనారిటీ వర్గానికి పెద్ద దిక్కు అన్నట్టు ప్రవర్తించేవాడు. మైనారిటీ వర్గంలో తగినంత ఓటు బ్యాంకు నిర్మించుకుని, 1986-87 లో అహ్మదాబాద్  మున్సిపల్ ఎన్నికల్లో ఐదు వార్డుల్ని గెల్చుకున్నాడు. ఆ సమయంలో జైల్లో వున్నాడు. 
     కానీ అతడి ఎన్నికని  కోర్టు కొట్టేయడంతో అతడి రాజకీయ జీవితం అక్కడే సమాప్తమైంది. అయినా మైనారిటీల్లో అతడికున్న పట్టు చూసి కాంగ్రెస్ నేతలు దగ్గరవసాగారు. తాము  ఎన్నికలు గెలవడానికీ, ప్రత్యర్ధుల్ని ఎదుర్కోవడానికీ అతడితో చేతులు కలిపారు. కాంగ్రెస్ లో అతడి పలుకుబడి ఎంతగా పెరిగిందంటే, తన చిన్న నాటి స్నేహితుడు హసన్ లాలాని  గుజరాత్ యూత్ కాంగ్రెస్ ప్రెసిడెంట్ గా చేసిపారేశాడు. 

     1980 లలో రిజర్వేషన్ల వ్యతిరేక ఉద్యమాన్ని ఎదుర్కోవడానికి కాంగ్రెస్ ప్రభుత్వం లతీఫ్ ని దింపింది. ఆ ఆందోళనని అతను  మతకలహాలుగా మార్చేశాడు. అక్కడ్నించీ రాష్ట్రంలో ఎక్కడ మతకలహాలు జరిగినా అందులో అతడి గ్యాంగులు వుండేవి. మెజారిటీ వర్గ ప్రజలే చనిపోయేవారు. దీంతో రాష్ట్రంలో, ముఖ్యంగా అహ్మదాబాద్ లోని మెజారిటీ వర్గ ప్రజలు అతడి  నుంచి తమని కాపాడే నాయకుడి కోసం ఎదురుచూసే వాళ్ళు. 

     లతీఫ్ బలం గురించి తెలుసుకున్న దావూద్ ఇబ్రహీం కూడా అతడితో సంధి చేసుకున్నాడు. దీంతో 1992 లో వాడుకోవడానికి ఏకే ఫార్టీ సెవెన్లు చేతికొచ్చాయి. ఒక జిమ్  ఖానాలో త్రివేదీ అనే వ్యక్తిని  చంపిరమ్మని ఏకే ఫార్టీ సెవెన్లు ఇచ్చి  గ్యాంగుని పంపిస్తే, వాళ్ళు త్రివేదిని గుర్తు పట్టక పోవడంతో, అక్కడున్న వాళ్ళందర్నీ కాల్చెయ్య మన్నాడు లతీఫ్. ఆ విచ్చలవిడి కాల్పులకి తొమ్మిది మంది ప్రాణాలు కోల్పోయారు. ఆహ్మదాబాద్ నగరం ఈ దుశ్చర్యకి వణికిపోయింది. 

      అక్కడ్నించీ లతీఫ్ టెర్రర్ కి హద్దులేకుండా పోయింది. 1993లో ముంబాయి పేలుళ్లు జరిపిన దావూద్, లతీఫ్ సాయం తీసుకోకపోయినా, గుజరాత్ లో మాత్రం లతీఫ్ మెజారిటీ వర్గానికి టెర్రర్ గా మారిపోయాడు. కాంగ్రెస్ ఏమీ చేయలేకపోయింది. 1995 ఎన్నికల ప్రచారంలో బిజెపి లతీఫ్ టెర్రర్ ని ప్రధానాంశం చేసి, అతణ్ణి జైల్లో వేస్తామని వాగ్దానం చేసింది. ఎన్నికల్లో బిజెపి ఘనవిజయం సాధించి, కాంగ్రెస్ ఇక ఎప్పటికీ కోలుకోలేనంతగా దెబ్బతిని పోయింది. యాంటీ టెర్రరిజం స్క్వాడ్ లతీఫ్ ని పట్టుకుని జైల్లో వేసింది. రెండేళ్ళ తర్వాత అతను పోలీస్ కస్టడీ నుంచి తప్పించుకుంటూ ఎన్ కౌంటరయ్యాడని వార్తలొచ్చాయి...


                                         ***
     
ఇలా వున్న లతీఫ్ నేరచరిత్రని రయీస్ కథగా సినిమాగా తీసినప్పుడు అతనో  గొప్పవాడుగా చిత్రించారు. హిందూ ముస్లిం ఎవరూ ఆకలితో వుండరాదన్న డైలాగులు పలికించి సెక్యులర్ గా మార్చేశారు. తెలియకుండా తను బాంబు పేలుళ్ళకి కారకుడయ్యాడ ని తెలుసుకుని, నిష్కృతిగా పోలీసు చేతిలో మరణాన్ని  కోరుకున్న మహోన్నతుడిగా గ్లామరైజ్ చేశారు.  

          ఒక క్రిమినల్ నేర చరిత్రని షారుఖ్ కోసం గ్లామరైజ్ చేశారా, లేకపోతే ప్రపంచానికి తెలిసిన ఆ క్రిమినల్ నేర చరిత్ర తప్పని షారుఖ్ నుపయోగించుకుని చెప్పాలనుకున్నారా అర్ధంగాదు. కానీ రెండూ తప్పుగానే కన్పిస్తాయి. పైగా ఆ ఏదోవొకటి చెప్పడంలో కూడా రచయితలకీ, దర్శకుడికీ, షారుఖ్ కీ ఎవరికీ కమిట్ మెంట్ గానీ, అవగాహనగానీ లేవని తెలిసిపోతూంటుంది. చాలా తమాషాగా నేరచరిత్రని ఫిక్షన్ చేశారు. ఇది మాత్రం అర్ధం పర్ధం లేని క్రియేటివిటీ అని అర్ధమైపోతుంది... ఎంతగా నంటే,  నవ్వొచ్చే విధంగా!

ఎవరెలా చేశారు 
     1975 లో సలీం- జావేద్ లు రాసి, యశ్ చోప్రా తీసిన ‘దీవార్’ లో అమితాబ్ బచ్చన్ పాత్రతో గానీ,  1987 లో మణిరత్నం తీసిన ‘నాయకన్’ లో కమల్ హాసన్ పాత్రతోగానీ పోలికలేని పాత్ర షారుఖ్ ఖాన్ నటించాడు. హాజీ మస్తాన్, వరదరాజన్ ముదలియార్ ల పాజిటివ్ డాన్ ల పాత్రలు అమితాబ్, కమల్ లవి. ఈ పాత్ర చిత్రణలకి అంతర్జాతీయంగా కూడా ఎన్నో పేరుప్రఖ్యాతు లొచ్చాయి. అబ్దుల్ లతీఫ్ నెగెటివ్ డాన్ పాత్ర షారుఖ్ ది. నెగెటివ్ ని పాజిటివ్ గా మార్చినా, ఈ పాజిటివిజంలోనూ సారా అమ్ముకునే పాత్రగా షారుఖ్ స్థాయికి తగని యాంటీ హీరో పాత్రయి పోయింది. సారా అమ్మడం, చంపడం, చివరికి చచ్చిపోవడం బాక్సాఫీసు అప్పీల్ కి తగని వ్యవహారమైపోయింది. పూర్తిగా డార్క్ షేడ్స్ తో, డార్క్ మూడ్ ని క్రియేట్ చేసే వాతావరణంతో  ఈ పాత్ర అభిమానులతో,  రెగ్యులర్ ఫ్యామిలీ ఆడియెన్స్ తో ఎలా వర్కౌట్ అవుతుందనుకున్నారో ఏమో. షారుఖ్ నుంచి వాళ్ళు ఆశించేది గ్లామరస్ కమర్షియల్ ఎంటర్ టైనర్ అనుకుంటాం. మైనారిటీల ఇమేజిని పెంచడానికి షారుఖ్ వరసగా మైనారిటీ  పాత్రలు పోషిస్తున్నాడని ఇప్పటికే విమర్శ వుంది. గాంధీ పుట్టిన రాష్ట్రంలో  లతీఫ్ సారా అమ్మడమే తప్పు. ఆ తప్పుని షారుఖ్ గ్లామరైజ్ చేస్తే అది మైనారిటీల ఇమేజిని పెంచడమెలా అవుతుందో అర్ధంగాదు. ఒక సూపర్ స్టార్ గా ఏవొక వర్గ కొమ్ము కాస్తున్నట్టూ తను కన్పించకూడదసలు. 
          ఇక ఈ పాత్రలో షారుఖ్ ఎలా నటించాడన్న ప్రశ్నే తలెత్తదు. పాత్రల్లో ఆదర్శ పాత్ర, మంచి పాత్ర, అమాయక పాత్ర, దుష్ట పాత్ర మొదలైనవి చాలా వుంటాయి. ఇలాటి దుష్ట పాత్రలో  సూపర్ స్టార్ ఎలా నటించాడో చెప్పడానికేమీ వుండదు-  దుష్ట (విలన్)  పాత్రలేసే నటుడెవరైనా ఈ పాత్ర  పోషించి వుంటే చెప్పుకోవడానికి చాలా వుండేది- ఇరగ దీశాడని, విరగబూశాడని! ఇప్పుడు మనం షారుఖ్ ని పొగిడితే రేపు ఇంకో స్టార్ ఇలాటి పాత్ర వేస్తాడు. 

          ఎన్నో  వివాదాలకి కారణమైన హీరోయిన్ మాహిరా ఖాన్ కూడా కథ ప్రకారం
80ల నాటి పాత్రలోనే కనిపిస్తుంది. ఈ పురాతన పాత్రలోనే  ఇంకే బాలీవుడ్ టాప్ హీరోయిన్ కన్పించినా ఈలలు పడేవి. మాహిరా ఇలా కూడా ప్లస్ కాలేకపోయింది. ఈమెతో ఇంత నిస్తేజంగా సీన్లు వెళ్లిపోతూంటే, కోరి ఈమెని ఎందుకు పెట్టుకుని కష్టాలు తెచ్చుకున్నట్టో! పాత్ర కూడా షారుఖ్ బయట ఏం చేసినా ఆమోదించేలా వుంటుంది. ఒక సన్నివేశంలో కొట్ట బోతాడు- అప్పుడైనా వాకౌట్ చేస్తే పాత్ర యాక్టివ్ అయ్యేది. ప్రేమించడంలో, భార్యగా బ్రతకడంలో, పిల్లాణ్ణి కనడంలో వున్న మెళకువలు ఈ తరానికి నేర్పుతున్నట్టు వుంటుంది. 

          ఎసిపి గా నవాజుద్దీన్ సిద్ధిఖీ ఇంకో వృధా అయిన టాలెంట్. షారుఖ్ కి వ్యతిరేక పాత్రగా తను చేసేదేమీ వుండదు- చివర్లో వచ్చి రెండు గుళ్ళు పేల్చి చంపడం తప్ప. షారుఖ్ అంతు చూసేందుకు ముఖ్యమంత్రికే  విలనీ పెరిగిపోవడంతో – అప్పుడప్పుడు పోలీస్ స్టేషన్లో కానిస్టేబుల్స్ తో సింగిల్ లైన్ పంచ్  డైలాగులు కొట్టడమే నవాజుద్దీన్ నమ్మిన కార్యక్రమమై పోయింది.

          ఈ సినిమాకి సరైన సంగీతం ఇద్దామని సంగీత దర్శకుడుకి కూడా కమిట్ మెంట్ లేదు, రెమ్యునరేషన్ తాలూకు అగ్రిమెంట్ తప్ప. పాట వచ్చినప్పుడల్లా బి గ్రేడ్ సినిమా పాట చూస్తున్నట్టు వుంటుంది. ఏం మ్యూజిక్ కొట్టాడో ఎంతకీ అర్ధంగాదు. కెమెరా మాన్ కూడా- కానీ కెమెరా మాన్ దర్శకుడు కోరుకున్న రెగ్యులర్ కమర్షియల్ లుక్ కాని డార్క్ మూడ్ కెమెరా వర్కే చేశాడు కథ ప్రకారం. రిచ్ లుక్ అన్నమాటకి తావే లేదు.

         ఇరుకు గల్లీలు, పాత ఇళ్ళు, బస్తీ జనం- సారాబట్టీలు, సీసాలూ - వీటితో కళా దర్శకత్వం కథా కాలానికి తగ్గట్టే వుంది. కానీ అప్పటి కథాకాలం ఇప్పుడెవరికి అవసరం, ఫ్రెష్ గా ఇప్పుడు జరుగుతున్న కథలు కాక!

చివరికేమిటి 
     ‘కబాలీ’ ని చూసి ఎంత నవ్వొచ్చిందో, ‘రయీస్’ నీ చూస్తే అంతే నవ్వొస్తుంది. ఈ రెండిటి దర్శకులూ సమాంతర సినిమా ప్రేమికులే.  సమాంతరం నుంచి అమాంతంగా కమర్షియల్ గా రూపాంతరం చెందాలని  సూపర్ స్టార్స్ నే బలిచేశారు.

     ‘కబాలీ’ తీసిన పా. రంజిత్ గతంలో ‘అట్టకత్తి’, ‘మద్రాస్’ అనే రెండు సమాంతర సినిమాలు తీసి పేరు తెచ్చుకున్నాడు. చాలా పూర్వం కమర్షియల్ సినిమాలనుంచి ఆర్ట్ (సమాంతర) సినిమాల్ని ఇట్టే గుర్తు పట్టేవాళ్ళు ప్రేక్షకులు. ఇప్పుడా ఆర్ట్ సినిమాలు చచ్చి పోయాయనుకుంటున్నారు. అవి బతికే వున్నాయి.  కాకపోతే గుర్తు పట్టలేకుండా క్రాసోవర్, మల్టీ ప్లెక్స్, ఇండీ ఫిలిమ్స్ రూపాల్లో. ఈ స్కూలు నుంచి వచ్చిన రంజిత్, రజనీకాంత్ తో ‘కబాలీ’ అనే బిగ్ కమర్షియల్ తీస్తే,  అది ఇందుకే అలావుంది-  ఏ కథా లక్షణాలూ లేకుండా. 

          రాహుల్ ఢొలాకియాది డాక్యుమెంటరీల పోర్టుఫోలియో. మూడు డాక్యుమెంటరీలు తీశాక, ఒక ‘పర్జానియా’ అనే సమాంతరం తీసి జాతీయ అవార్డు తీసుకున్నాడు. ఆ ‘పర్జానియా’ 2002 గుజరాత్ అల్లర్లలో తప్పిపోయిన పార్సీ బాలుడి కథ. ఇలాటి పోర్టుఫోలియోతో ఇప్పుడు  షారుఖ్ లాంటి సూపర్ స్టార్ తో  ‘రయీస్’ తీస్తే, ఇది  ‘పెద్ద పర్జానియా’ అయింది, అంతే.

          సమాంతర సినిమాలకి కథా లక్షణాలుండవు. కమర్షియల్ సినిమాలకి చాలా కథా లక్షణాలుంటాయని ఎందుకు తెలుసుకోరో రూపాంతరం చెందాలనుకునే సమాంతర వాసులు. దీంతో సూపర్ స్టార్ల అభిమానుల ప్రాణాల మీదికొస్తోంది ఈ సినిమాలు చూడలేక. స్టార్లు పర్మిషనిస్తే సమాంతరం కమర్షియల్ గా రూపాంతరం చెందిపోదు.  ఎందుకంటే ఈ దర్శకులకి ఎంత తెలుసో స్టార్స్ కీ, సూపర్ స్టార్స్ కీ అంతే తెలుసు. అన్ని కథలూ కమర్షియల్ కథల్లాగే కన్పిస్తాయి, అన్ని పాత్రలూ కమర్షియల్ పాత్రల్లాగే అన్పిస్తాయి. ఈ లెక్కన కొంత కాలం పోయాక,  ఓ షార్ట్ ఫిలిం చూసి ఆ టీనేజర్ ని కూడా దర్శకుడిగా పెట్టుకుని కబాలీని మించిన కబాలీ, రయీస్ ని మించిన రయీస్ తీస్తారు. 

          కమర్షియల్ గా ఏ కథయినా ఒక పాయింటు చుట్టే వుంటుంది, కమర్షియల్ గా బయోపిక్ తీసినా ఒక పాయింటు చుట్టే వుంటుంది. ‘గౌతమీ పుత్ర శాతకర్ణి’ గణరాజ్యాల్ని  ఏకం చేసే పాయింటు చుట్టే వుంటుంది. ఒక పాయింటూ, దాంతో సంఘర్షణా అంటూ వుండనిది సమాంతర సినిమా కథలకే. ‘రయీస్’ కథ కూడా ఇలాటిదే, సరీగ్గా చెప్పుకోవాలంటే ఇది కథ కాదు గాథ. గాథ కమర్షియల్ జాతి కాదు, సమాంతర జాతి. 

        ఇలా సమాంతర ‘రయీస్’ కి ఒక పాయింటు అంటూ వుండదు, ఫలితంగా సంఘర్షణ  కూడా వుండదు. ఒక్కో ప్రత్యర్ధితో ఒక్కో సమస్య పుట్టినప్పుడల్లా దాన్ని అణుస్తూ పోవడమే జరుగుతూంటుంది. ఎపిసోడ్లు గా కథనం సాగుతూంటుంది. అఆ అంటూ మొదలెట్టి అం అః వరకూ అదే వరస. కమర్షియల్ కథలు ‘అఆ’ అంటూ మొదలెట్టినా ‘ఋ’ దగ్గరో, ‘ఎ’ దగ్గరో పాయింటు  కొచ్చి, దాంతో పోరాడి ‘అం అః’ అన్పిస్తాయి. రయీస్ రాగం తీయడమే గానీ పల్లవే అందుకోదు. చిన్నప్పటి కథ పూర్తి  చేయడానికే చాలా సమయం తీసుకుంటుంది. పెద్దయ్యాక జైరాజ్, మూసా, ఎసిపి, సీఎం ఇలా ప్రత్యర్ధులు ఒకరితర్వాత ఒకరు వస్తూంటారు. ఇందరు విలన్లతో కథేమిటో అర్ధంకాదు, మొదలు కాదు. ఎసిపి నాంకే వాస్తే వుంటాడు, సీఎం విలన్ పార్టు అందుకున్నా క్లయిమాక్స్ లో అతను కూడా వుండడు – ఎవరో  అదృశ్య విలన్ వుంటాడు. ఉన్న వాళ్లతో కథ కుదరడం లేదన్నట్టు అదృశ్య విలనెవరో వుంటాడు. తను స్మగ్లింగ్ చేస్తున్నవి బాంబులని తెలియకుండా రయీస్ సరఫరా చేస్తే, నగరంలో పేలుళ్లు జరిగి చాలామంది ప్రాణాలు కోల్పోతారు. వాటిని ఎవరికి పంపాడో కూడా రయీస్ కి తెలీదు. ఆ పేలుళ్ళకి తనే కారణమని  ఎన్ కౌంటర్ అయిపోవడానికి సిద్ధ పడతాడు. ఒక పాసివ్ క్యారక్టర్ లా కథ ముగించుకుంటాడు. ఆ శత్రువెవరో వాణ్ణి పట్టుకుని చంపి లొంగి పోవచ్చుగా? ‘వాణ్ణి’ ఎందుకు వదిలేశాడు? ‘వాణ్ణి’ పట్టుకుంటే  వున్న మాహిరా ఖాన్ తో కష్టాలు కాక, మరిన్ని కష్టాలు  చుట్టుకుంటాయనేమో!

          చాలా కన్వీనియెంట్ గా కథలో  ‘వాణ్ణి’  లేకుండా చేశారు. కానీ లతీఫ్ చరిత్రలో దావూద్ ఇబ్రహీం స్పష్టంగా వున్నాడు. వీళ్ళ గ్యాంగ్ వార్స్  ని ఆపాలని, 1989 నవంబర్ లో దుబాయిలో ఒక  మత పెద్ద ఇద్దర్నీ కూర్చోబెట్టి, మతగ్రంధం మీద ప్రమాణం చేయించాడు-  కొట్టుకోకుండా కలిసి పనిచేసుకోవాలని! 

          లతీఫ్  నేరచరిత్రలో ఇది కీలక ఘట్టం. కానీ రయీస్ ని గొప్పవాడుగా చిత్రించే పనిలో దీన్ని పక్కన పెట్టారు. ఇందుకే కథకి  కేంద్ర బిందువైన పాయింటు అంటూ లేకుండా పోయింది. దర్శకుడి పోర్టు ఫోలియో ప్రకారం చూసినా తన సమాంతర ధోరణికి కేంద్ర బిందువు వుం టుందని కూడా తట్టే అవకాశం లేదు. ఇందుకే సంబంధంలేని సంఘటనలు ఒకదానివెంట ఒకటి వచ్చేస్తూంటాయి. ఫస్టాఫ్ లో "యాత్ర" తీస్తే అదే అంతిమ యాత్రవుతుందని హెచ్చరించడం, ఆ యాత్రని శాంతియుతంగా అడ్డుకోకుండా, హింస ద్వారానే అడ్డుకోవాలన్నట్టు పెట్రోలు సీసాలతో ఆ ప్లానింగ్ అంతా ముందే చేసుకుని హింసకే పాల్పడడం నవ్వు తెప్పిస్తుంది. “యాత్ర” తీస్తే శాంతిభద్రతలు దెబ్బ తింటాయన్న వాడే  ఇలా ప్రవర్తిస్తాడు. ఇక సెకండాఫ్ లో అలా జైలు కెళ్ళి ఇలా ఎన్నిక గెల్చి వచ్చేసే ఎపిసోడ్ అతిబలహీన కమర్షియలేతర చిత్రణ పాటతో కలుపుకుని. చాలా పాత సినిమాల్లో చూస్తూంటాం ఇలాటిది. ఇంకా ఆ వెంటనే 2002 గుజరాత్ అల్లర్లు, ఆ వెంటనే 1993 ముంబాయి బాంబు పేలుళ్లు- ఇలా తేదీలు కూడా ఫాలో అవకుండా ప్రేక్షకుల్ని ఫూల్స్ చేయాలనుకున్నారు. కాస్త ధైర్యం చేయడం, అమ్మో ‘వాడు’ న్నాడు మనకెందుకని వెనక్కి తగ్గడం - ఈ డైనమిక్సే గత్యంతరం అయ్యాయి స్ట్రక్చర్ లేని స్క్రీన్ ప్లేకి. కాసేపు లతీఫ్- కాసేపు కటీఫ్, ఇంతే.

-సికిందర్
http://www.cinemabazaar.in