కథ- స్క్రీన్ ప్లే- దర్శకత్వం : రాం గోపాల్ వర్మ
తారాగణం : శివరాజ్ కుమార్, సందీప్ భరద్వాజ్, పారుల్ యాదవ్, యజ్ఞా శెట్టి తదితరులు
సంగీతం : రవి శంకర్,
నేపధ్యసంగీతం : శాండీ, సత్య, కాశ్యప్
ఛాయాగ్రహణం : రమ్మీ , కూర్పు: అన్వర్ అలీ, మేకప్ : వికాస్ గైక్వాడ్, యాక్షన్ : అలన్ అమీన్, బ్యానర్
: జెడ్ 3 పిక్చర్స్
నిర్మాతలు : బి.వి. మంజు నాథ్, బి. ఎస్. సుధీంద్ర, ఇ. శివప్రకాష్
విడుదల : జనవరి 7, 2016
***
ఈ మధ్య తెలుగులో అల్లాటప్పా సినిమాలు తీస్తూ అల్లరి
పాలవుతున్న రాం గోపాల్ వర్మ, కన్నడ వెళ్లి కంటెంట్ వున్న సినిమా తీసి
నిరూపించుకునే పని చేశాడు వీరప్పన్ కథతో. ఈ మాత్రం కంటెంట్ తెలుగులో కన్పించలేదా
అంటే, ‘రక్త చరిత్ర’ తర్వాత కన్పించలేదు. నడుస్తున్న చరిత్రతో ‘శివ’ లాంటిది తీసే
ఆలోచన చేయలేక, కన్నడలో గతించిన వీరప్పన్ చరిత్రలో ఆ కంటెంట్ అంతా కన్పించి,
బ్యాంగ్ ఇద్దామని అటెళ్ళిపోయాడు. అట్నుంచీ విజయఢంకా మోగించాడు దేశవ్యాప్తంగా
విన్పించేట్టుగా.
‘కిల్లింగ్
వీరప్పన్’ ని ఒక వ్యక్తి జీవిత చరిత్రని ఎలా
తెరకెక్కించాలన్నదానికి ఇంకో గైడ్ లా అందించాడు వర్మ. ఆల్రెడీ రిచర్డ్ అటెన్ బరో
అందించిన గైడ్ లా ‘ గాంధీ’ వుండనే వుంది. దీన్నుంచి ఏమీ నేర్చుకోక దర్శకుడు
గుణశేఖర్ ‘రుద్రమ దేవి’ తీసి రుద్రమదేవి
చరిత్రని గజిబిజి చేశాడు. వీరప్పన్ ని తీసుకుని వర్మ బయోపిక్ (జీవిత చరిత్ర) చిత్రణకి
ఎలా న్యాయం చేయవచ్చో తీసి చూపించాడు. జీవిత చరిత్ర తీయడమంటే మహాభారతంలా చాంతాడంత
తీసుకుంటూ పోవడం కాదు. మహాభారతాన్ని కూడా ఎక్కడికక్కడ విడగొట్టి ఒక్కో కథగా- ఒక్కో
పాత్ర కథగా - తీసిన సినిమాలు ఇందుకే వచ్చాయి. ఒక సినిమా తీసి భావి దర్శకులకి
నేర్చుకోవడానికి ఏమీ ఇవ్వని సీనియర్ దర్శకుడు ఉన్నా లేనట్టే అన్పించుకుంటాడు. నేనున్నానూ
అని నిరూపించాడు వర్మ వీరప్పన్ తో.
వివరంగా
తెలుసుకునేందుకు ముందు కథలోకి వెళ్దాం...
కథ
ఇరవై ఏళ్లుగా దొరక్కుండా కర్నాటక- తమిళనాడు సరిహద్దుల్లో సత్యమంగళం అడవుల్లో గడగడ లాడిస్తున్న అడవిదొంగ వీరప్పన్ ని పట్టుకునే ఆపరేషన్ కకూన్ పేరుతో పోలీసు శాఖ ఏర్పాటు చేసిన స్పెషల్ టాస్క్ ఫోర్స్ సంఘర్షణ ఇది. అడ్డొచ్చిన 184 మందిని చంపి ( ఇందులో సగానికి సగం మంది పోలీసులే) కొన్ని వందల ఏనుగుల్నివాటి దంతాలకోసం వధిస్తూ, మరోపక్క చందనపు చెక్కల్ని స్మగ్లింగ్ చేస్తూ, ఇంకో పక్క కన్నడ సూపర్ స్టార్ రాజ్ కుమార్ ని కూడా కిడ్నాప్ చేసి పెను సవాలుగా మారిన వీరప్పన్ ( సందీప్ భరద్వాజ్) తనని ట్రాప్ చేయడానికి వస్తున్న పోలీసు దళాన్ని ఇన్ఫార్మర్ సహా హతమార్చడం తో ఈ కథ ప్రారంభమవుతుంది. పోలీసులు పన్నే మరికొన్ని పథకాల్ని కూడా తిప్పికొట్టి వాళ్ళని హతమార్చడంతో స్పెషల్ టాస్క్ ఫోర్స్ ఎస్పీ ( శివరాజ్ కుమార్ పోషించిన ఈ పాత్రకి పేరు పెట్టలేదు, నిజజీవితంలో టాస్క్ ఫోర్స్ ఎస్పీ సెంతమరై కణ్ణన్ ఈ పాత్రకి ఆధారం) ఇక కఠిన నిర్ణయాలు తీసుకుంటాడు. వీరప్పన్ ని అడవిలో వేటాడి పట్టుకోలేమని, అతణ్ణి అడవిలోంచి బయటికి రప్పిస్తేనే పట్టుకోగలమని పై అధికారిని ఒప్పించి ఆ దిశగా ప్లాన్ చేస్తాడు.
సమీప గ్రామంలో శ్రేయ ( పారుల్ యాదవ్) అనే అమ్మాయిని ప్రోత్సహించి ఇన్ఫార్మర్ గా మార్చుకుంటాడు. ఆమె ఇంట్లోకి వీరప్పన్ భార్య ముత్తు లక్ష్మి ( యజ్ఞా శెట్టి ) అద్దెకి దిగేలా చేసి శ్రేయ చేత ఆమెని వాచ్ చేయిస్తూంటాడు. ముత్తులక్ష్మిని కల్సుకోవాలని వీరప్పన్ నుంచి రహస్య సమాచారం అందినప్పుడు, ఆ కలుసుకునే రహస్య ప్రదేశాన్ని ఒక ఫాం హౌస్ లో ఏర్పాటు చేస్తుంది శ్రేయ. ఆమెని నమ్మిన ముత్తులక్ష్మి అలాగే వీరప్పన్ ని అక్కడికి రమ్మనమని కబురుపెడుతుంది ఇన్ఫార్మర్ ద్వారా. ఎస్పీ టీం అంతా మరు వేషాల్లో ఫాం వర్కర్స్ లా వచ్చి పనులు చేసుకుంటూ వుంటారు. కానీ ఈ టీం లోనే వీరప్పన్ తొత్తు ఒకడు వుండడం వల్ల అసలు విషయం వీరప్పన్ కి తెలిసిపోయి వచ్చేసి ఫాం హౌస్ మీద దాడి చేస్తాడు. మారు వేషాల్లో వున్న పోలీసుల్ని హతమారుస్తాడు.
ఎస్పీ, వీరప్పన్ ముఖా ముఖీ తలపడతారు.
కాల్పులు జరిపి వీరప్పన్ అడవిలోకి తప్పించుకుంటాడు. ఇంత ప్లానూ ఇలా బెడిసి కొట్టినందుకు
నీరుగారిపోతాడు ఎస్పీ.
ఇప్పుడేం చేయాలి? వీరప్పన్ కి ఇంకెలా
వలపన్నాలి? అసలీ అడవిలోంచి బయటికి రప్పించే ప్లాన్ మళ్ళీ వర్కౌట్ అవుతుందా?
వీరప్పన్ పసిగట్టేస్తాడా? వీణ్ణి ఇంకెలా పట్టుకోవాలి? ..అన్నవి ఎస్పీ ఎదుటవున్న
సవాళ్లు.
పై అధికారి ఎస్టీ ఎఫ్ చీఫ్ (
నిజజీవితంలో ఎడిజిపి కె. విజయకుమార్ పాత్రని శ్రీధర్ పోషించాడు) కి ఏమని
సమాధానం చెప్పుకోవాలి?
ఎలావుంది కథ
కన్నడ, హిందీ నటులతో ఇది డబ్బింగే
అయినా, ఈ నాన్ స్టాప్ అడ్వెంచర్-
థ్రిల్లర్ ని చూడ్డం మొదలెడితే
డబ్బింగ్ అనే సంగతే మర్చిపోతారు తెలుగు ప్రేక్షకులు. పైగా అంతో ఇంతో
వీరప్పన్ గురించి తెలిసే వుంటుంది కాబట్టి, ఈ ఆసక్తికి నేటివిటీ అడ్డురాదు. మామూలు కాల్పనిక కథల్ని
డబ్బింగ్ చేస్తే వుండే నేటివిటీ సంబంధమైన అడ్డు, సమాజంలో ఒక వ్యక్తి జీవితం
గురించి సినిమా తీసినప్పుడు, ఆ వ్యక్తి ఏ
ప్రాంతీయుడైనా పాపులర్ అయివుంటే, ప్రాంతీయతకి అతీతమైపోతుంది ఆ డబ్బింగ్. ఇదే ‘కిల్లింగ్
వీరప్పన్’ కి కలిసివచ్చిన అంశం. మామూలుగానైతే ఈ మధ్య తెలుగులో ఐస్ క్రీమ్ సినిమాలు
తీస్తున్న వర్మ తీసిన మరో సినిమాని ఎవరూ
పట్టించుకోరు. కానీ ముందు కన్నడ ఒరిజినల్ విడుదలై అక్కడ మార్మోగడంతో తెలుగు
ప్రేక్షకుల ఆసక్తి అలాకూడా పెరిగి, అస్పృశ్యుడైన
వర్మని సత్పురుషుడుగా నమ్మగలిగారు. వర్మ ఇంకో కల్పిత కథతో పైత్యం (సినిమా) తీసివుంటే ఎవ్వరూ పట్టించుకునేవాళ్ళు కాదు.
వీరప్పన్ జీవిత కథతో తీయడంవల్ల- వీరప్పన్ కోసం మళ్ళీ వర్మ సినిమా చూసేందుకు
ప్రేక్షకులు బారులు తీరుతున్నారు. కనుక వీరప్పన్ వర్మకి పునర్జన్మనిచ్చినట్టే తన
కథనంతా ధారబోసి.
ఎవరెలా చేశారు
వీరప్పన్ కిడ్నాప్ చేసిన కన్నడ
సూపర్ స్టార్ రాజ్ కుమార్ కుమారుడు, కన్నడ హీరో శివరాజ్ కుమార్ ని ఈ సినిమాలో చూస్తే, నిజంగా తన
తండ్రిని కిడ్నాప్ చేసిన వీరప్పన్ మీద మాంచి
కసితో నటించాడని ఆ ముఖకవళికలు చూస్తేనే అర్ధమైపోతుంది. నిజజీవితంలో అలాటి బాధ
అనుభవిస్తేనే అంత సహజంగా ఆ కసిని ప్రదర్శించగల్గుతారు. సినిమాలోనైనా అలాటి
వీరప్పన్ ని చంపి కసి తీర్చుకునే అవకాశం రావడం ఒక గమ్మత్తయిన దైవలీల. కళ- జీవితం
రెండిటి మధ్య విభజన రేఖ ఇలా చెరిగిపోయింది. ఇక మనం కళ, జీవితం రెండూ ఒకటేనని
నమ్మితీరాలి! ఈ సినిమా బాక్సాఫీస్ అప్పీల్ కి ఇది కూడా కలిసివచ్చింది. శివరాజ్ కుమార్ స్థానంలో మరొక నటుడు ఉండుంటే ప్రేక్షకులు
ఈ సినిమాని ‘ఓన్’ చేసుకునే తీరు, ఆ ఫలితాలు వేరేగా వుండేవి.
|
సందీప్ భరద్వాజ్ ....వీరప్పన్ గా....
|
క్లోజప్స్
వర్మ ఆస్తి. శివరాజ్ కుమార్ భావోద్వేగాల్ని ఆ క్లోజప్స్ కళతో ప్రేక్షకుల మెదళ్ళలోకి
బలంగా దిగ్గొట్టి వదిలాడు వర్మ. ఇక వెంటాడే ఫేస్ అయిపోయింది శివరాజ్ కుమార్ ముఖాకృతి
ఎంత వద్దన్నా. వీరప్పన్ ని చుట్టుముట్టి సిబ్బంది చంపుతూంటే దూరంగా కూర్చుని వేడి
వేడి కాఫీ తాగుతూ తాపీగా తిలకించే శివరాజ్ కుమార్ సంతృప్తి ఒక పతాక స్థాయి నటన. పాత్రని
నిలబెట్ట గల్గితేనే సినిమా నిలబడుతుందని ఇందుమూలం గా ఫిలిం మేకర్లకి ఒక సూచన.
వీరప్పన్ పాత్రని
పోషించిన సందీప్ భరద్వాజ్ కూడా ఏమీ తీసిపోలేదు. ఎలాగైతే అమ్జాద్ ఖాన్ తొలి
సినిమా ‘షోలే’ తో బందిపోటు గబ్బర్ సింగ్ పాత్రని అజరామరం చేశాడో, అలా తన తొలి
సినిమాతో వీరప్పన్ కి ప్రాణం పోశాడు సందీప్ భరద్వాజ్ అనే నేషనల్ స్కూల్ ఆఫ్ డ్రామా
స్టూడెంట్. మళ్ళీ ఆ క్లోజప్స్, ఆ కళ్ళల్లో కాంతి, చిన్నపిల్లాడి సంతోషం, కర్కోటకుడి కౄరావేశం.. ఇవన్నీ వెంటాడే శూలాలై
పోతాయి చూసేవాళ్ళకి. ఎందరో విలన్లు
వచ్చిపోతున్నారు- వాళ్ళు అరుస్తారు గానీ ఒక శక్తిగా మెరవరు. సందీప్ భరద్వాజ్ మాట
నిదానం, చూపు చురకత్తి. అమ్జాద్ ఖాన్ కి కూడా ఇలాటి విషం స్రవించే కళ్ళు వుండవు.
మరో
ఇద్దరు గుర్తుండిపోయే నటులు పారుల్ యాదవ్ ( పారుల్ అంటే హిందీలో సుందరమైనది అట),
యజ్ఞా శెట్టిలు. నాకులాగే నీక్కూడా స్వార్ధం వుంటుంది, ఆ స్వార్ధకోసం ఈ పనికి
ఒప్పుకో- అని ఎస్పీ పాత్ర అంటే, కేవలం ఓ అడ్వెంచర్
చేసి చూద్దామనే స్వార్ధం కోసమే పోలీస్ ఇన్ఫార్మర్ గా మారిపోయే పాత్ర ఇది. వర్మ ఈ
పాత్రని నిర్లక్ష్యం చేయకుండా, సెకండాఫ్
లో తర్వాత్తర్వాత అంతగా పనిలేకపోయినా, ఒక సామాన్యమైన అమ్మాయిగా పోలీస్ యాక్షన్ ని
అర్ధంచేసుకోవడానికి ఆయా సన్నివేశాల్లో ఆమె ఇచ్చే ఎక్స్ ప్రెషన్స్ తో కూడిన
క్లోజప్స్ వేసి నిలబెట్టడం ఇంకో యెత్తు ఈ సినిమాకి. ఆమె చేతిలో రివాల్వర్
వుంటుంది. తప్పించుకుంటున్న వీరప్పన్ పక్కనించే పోతూంటాడు. మొట్టమొదటిసారిగా
వీరప్పన్ ని ప్రత్యక్షంగా చూస్తున్న షాక్ తో చంపలేక చేష్టలుడిగి ఆమె చూస్తూంటే ఆమెని చూసుకుంటూ పక్కనించే
వెళ్ళిపోతాడు వీరప్పన్. కాల్పులు జరుపుకుంటున్న రెండు వర్గాల మధ్య క్రాస్ ఫైర్ లో
అప్పుడప్పుడు పౌరులు చిక్కుకుంటూంటారు. అలాకూడా వుందామె పరిస్థితి. దివంగత విఖ్యాత
కార్టూనిస్టు ఆర్కే లక్ష్మణ్ వేసే ప్రతీ
కార్టూన్ లో ధోతీ కట్టుకుని కామన్ మాన్ ఉంటాడు- సమాజంలో జరిగే ఆయా
వైపరీత్యాల్ని పొంచి వుండి విభ్రమంగా చూసే క్యారక్టర్. అలాటి క్యారక్టరే సెకండాఫ్
లో కంటిన్యూ అయ్యే పారుల్ పోషించిన పాత్ర.
ఈమెకి
ముత్తు లక్ష్మి పాత్రలో యజ్ఞాశెట్టి తో బాండింగ్, ఆయా ఆహ్లాదకర సన్నివేశాల్లో
నటనలూ గుర్తుండి పోయేవే. వీళ్ళిద్దరి ఎపిసోడ్లకి వర్మ కావలసినంత స్పేస్ ఇచ్చాడు. తనని
నమ్మిన యజ్ఞా శెట్టి తో పారుల్ పాల్పడుతున్నది ద్రోహమే. ఒక దశలో పారుల్ ని
అనుమానించిన యజ్ఞ అది క్లియరై అపరాధ భావంతో క్షమించమంటుంది. ఇది పారుల్ ని పూర్తిగా
మోరల్ డైలమా లోకి నెట్టేసినా – తను చేస్తున్న అనైతికాన్ని పైకి చెప్పుకోలేని
పరిస్థితి... ఈ మానవసంబంధాల్లోని మాలిన్యాలూ పాత్రలు – నటనలు ఆకట్టుకోవడానికి
తోడ్పడ్డాయి.
***
వెన్నెలకంటి
శశాంక్ రాసిన మాటలు ( కన్నడ ఒరిజినల్ బాలాజీ కె) ఆడంబరాలు లేకుండా సహజంగా వున్నాయి.
మాటలకంటే ఎక్కువగా హావభావాలతోనే సీన్లని వర్కౌట్ చేశారు. చివర్లో- ‘నువ్వు
రాక్షసుడివి’ అంటాడు చీఫ్. రాక్షసుణ్ణి ( వీరప్పన్ ని ) చంపాలంటే
రాక్షసుడిగా మారాల్సిందేనంటాడు ఎస్పీ. ఇది ముగింపు డైలాగు. ‘ఆపరేషన్ కకూన్’ వీరప్పన్
ని సజీవంగా పట్టుకోవడానికే ప్రారంభించారు.
కానీ సజీవంగా పట్టుకుంటే అతను ఎవరెవరి
గుట్లు బయటపెడతాడో తెలీదు కనుక చివర్లో పట్టుకునే అవకాశం వున్నా చంపేశారు. దీనికి
సాక్షిగా వున్న ఒక పోలీసుని కూడా చంపేస్తాడు ఎస్పీ. ఈ నేపధ్యంలోంచి వచ్చినవే పై
డైలాగులు. రాక్షసుడిగా మారడం మంచిదే. కానీ సాక్షిని చంపి తను చట్టానికి దొరక్కుండా
చూసుకోవడం; అలాగే యంత్రాంగంలో, రాజకీయంలో వీరప్పన్ తో వుండే కనెక్షన్స్ రట్టు అవకుండా
కాపాడ్డం హీరోయిజం అన్పించుకోదు. ఈ రీత్యా
ముగింపు డైలాగు పేలవంగా వుంది. తర్వాత అమెరికా బిన్ లాడెన్ ని చంపడంలో కూడా ఇదే
నీతిని పాటించింది.
పాటలు షరా మామూలుగా చంపడం, నరకడం, నెత్తురు
తాగడం, కట్లపాము, త్రాచుపాము, కొండచిలువ లాంటి క్షుద్ర పదాలతో నాటు గొంతుకల అరుపులతో,
‘రక్తచరిత్ర’, ‘బెజవాడ’, ‘రౌడీ’ పాటల టైపులోనే మోటుగా వున్నాయి. వ్యక్తిగతంగా వర్మకే
చంపాలనీ, రక్తం కళ్ళ జూడాలనీ మనసు తహతహ లాడుతున్నట్టుంది ఈ పాటల్లో ఘాటు
చూస్తూంటే.
పాటల సంగీతం
అలా వుంచితే, ఈ మధ్య వర్మసినిమాల్లోలా మళ్ళీ బ్యాక్ గ్రౌండ్ సంగీతం అదే గోలగా,
ఫోర్సుడుగా, లౌడ్ స్పీకర్లు పెట్టినట్టుగా వుంది. ఎఫెక్ట్స్ కూడా కథని ఫాలో
అవుతున్నట్టు లేవు. చంపడానికి వీరప్పన్ గ్యాంగ్ తో అడవిలో మాటేసినప్పుడు ఒకటే
హోరుగా పక్షుల కూతలు విన్పించడంలో సహజత్వం ఎక్కడుంది. అవెందుకలా నాన్ స్టాప్ గా
అరిచేస్తున్నాయి. అలా అరుస్తూంటే అట్నుంచి వస్తున్న పోలీసులు ఎలర్ట్ కారా? ఇది
వీరప్పన్ తెలుసుకోడా? ఇవన్నీ వదిలేద్దామనుకున్నా- మరి కాల్పుల మోతకి ఆ పక్షులేం చేస్తున్నాయి. ఒక్క పెట్టున అవి ఎగిరిపోతున్న రెక్కల
చప్పుళ్ళు విన్పించాలిగా? ఇలా రొడ్డ కొట్టుడు
ఎఫెక్ట్స్, రొడ్డ కొట్టుడు పాటలు వర్మ బాగా తీసిన సినిమాల స్థాయిని కూడా
దిగజారుస్తున్నాయి.
డ్రోన్ షాట్లు, 360 డిగ్రీ షాట్లు, పాయింటాఫ్
వ్యూ షాట్లతో సూపర్ ఫాస్ట్ కెమెరా వర్క్ బావుంది. అలాగే యాక్షన్ కొరియోగ్రఫీ కూడా.
దర్శకుడగా వర్మ తిరిగి తన పాత ఫామ్ లో
కొచ్చేశాడు. ఈ సినిమా చూస్తూంటే ఒకటే అర్ధమవుతుంది- కాకమ్మ కథలు కాకుండా, సమాజంలో
జరిగే కథలు, వ్యక్తుల కథలు తీసినప్పుడు పాత్రచిత్రణలు-
వాటి చిత్రీకరణలు బలీయంగా వుండడం, వాటితో బలమైన ముద్ర వేయగల్గడం. రియల్ క్యారక్టర్లలో పరకాయ ప్రవేశం చేసినంతగా తను
ఫిక్షన్ క్యారక్టర్స్ లోకి దూరలేడెమో. రియల్ క్యారక్టర్స్ చిత్రీకరణ విషయంలో ‘గాడ్
ఫాదర్’ ని ఆవాహన చేసుకున్నట్టుంది.
స్క్రీన్ ప్లే సంగతులు
స్ట్రక్చర్ ని పట్టించుకోకుండా
శివాజీ గణేశన్ జోకేసిన – తెడ్డేసిన పడవ ప్రయాణపు కథా గమనంలా (ఆర్ట్ సినిమాల్లా)
ఈ మధ్య వర్మ స్క్రీన్ ప్లేలు వుంటూంటే, ‘కిల్లింగ్ వీరప్పన్’ భిన్నంగా స్ట్రక్చర్
లో ( కమర్షియల్) కొచ్చేసింది. బయోపిక్ ( జీవిత చరిత్ర) ని సినిమాగా
ఎలా తీయాలి, డాక్యుమెంటరీ ప్రాయమైన బయోపిక్ లని డ్రమెటిక్ చేసి ఎలా డాక్యూ డ్రామాగా రక్తి కట్టించాలి, ఎంతవరకూ
యదార్ధానికి దూరంగా సృజనాత్మక స్వేచ్ఛ తీసుకోవాలి, ఏ వివాదాలకి దూరంగా వుండాలి లాంటి జాగ్రత్తల
గురించి ఆలోచన ఈ స్క్రీన్ ప్లే వెనుక కన్పిస్తుంది. జీవితచరిత్ర చాలా రీసెర్చిని డిమాండ్ చేస్తుంది. ఆ రీసెర్చి సారం ఒక
స్క్రీన్ ప్లేలో ఒదగాలంటే మళ్ళీ ఇది కూడా
చాలా స్క్రీన్ ప్లే స్టడీస్ ని డిమాండ్ చేస్తుంది. కానీ జరుగుతున్న దేమిటంటే, గొప్పగా జీవిత చరిత్రని ఏళ్ల తరబడి రీసెర్చి
చేశామంటారు, తీరా దాన్ని రొడ్డ కొట్టుడు కమర్షియల్ మూస ఫార్ములా స్క్రీన్ ప్లే చట్రంలో
ఇరికించి- ఎత్తుపల్లాల్ని(జవజీవాల్ని) చదును చేసేసే గుచ్చుకునే కంకర
రోడ్డులా వేసేసి, ‘పాన్ సింగ్ తోమర్’, ‘రుద్రమ
దేవి’ ల్లాంటి ‘భ’యోపిక్ లతో జడిపించేస్తారు!
జీవితచరిత్రని మొత్తం తీయాల్సిన అవసరం
లేదు. ఒకే ఒక ఘట్టం తీసుకుని కూడా చేయవచ్చు. కిల్లింగ్ వీరప్పన్ లో ఇదే జరిగింది.
జీవితంలో అతణ్ణి చంపే చివరి ఘట్టాన్నే సినిమాకి తీసుకున్నారు. అందుకే
కిల్లింగ్ వీరప్పన్ అని టైటిల్ అయింది. ఇందుకే వీరప్పన్ అసలెవరు, ఎక్కడ పుట్టాడు,
ఎక్కడ పెరిగాడు, ఎందుకు ఎలా అడవిదొంగగా మారాడు, అప్పుడేమేం చేశాడు- లాంటి వివరాలన్నీ
దీనికి అవసరం లేదు. అది వేరే సినిమాగా తీయొచ్చు. అందువల్ల ఇది సమగ్రంగా లేదని
భావించడం సరికాదు. అతడి జీవిత చరిత్రని కంపార్ట్ మెంటలైజ్ చేసి, అందులో అతణ్ణి పట్టుకునే
క్రమాన్ని మాత్రమే చెప్పదలిచారు. వీరప్పన్
ని పట్టుకోవడానికి ఎప్పుడో 1991 లోనే తమిళనాడు- కర్ణాటక పోలీసులతో స్పెషల్ టాస్క్ ఫోర్స్ ఏర్పటయినా, అప్పట్నించీ
‘కిల్లింగ్ వీరప్పన్’ కథ చెప్పుకురాలేదు. దీన్ని మళ్ళీ సబ్- కంపార్ట్ మెంటలైజ్
చేశారు: కేవలం అంతిమంగా అతణ్ణి పట్టుకోవడానికి- లేదా చంపడానికి – పదినెలల క్రితం
2004 లో ప్రారంభించిన ‘ఆపరేషన్ కకూన్’ సాధకబాధకాల్ని మాత్రమే తీసుకున్నారు. ఇదీ
రీసర్చి సారం. ఇక దీని పైనే కథనాన్ని ఫోకస్ చేస్తూ స్క్రీన్ ప్లేకి ఫౌండేషన్
వేశారు.
ఏమిటా
ఫౌండేషన్? మనం గతంలో రెండుమూడు సందర్భాల్లో చెప్పుకున్నట్టు- ‘గాంధీ’ కి అటెన్ బరో వేసిన
ఫౌండేషనే ఇలాటి సమయాల్లో అవసరపడుతోంది- అది తెలుగులో ‘హేపీ డేస్’ లాంటి ఫిక్షన్ కైనా,
హిందీలో ‘గాంధీ మై ఫాదర్’ లాంటి మరో బయోపిక్ కైనా. మొత్తం
మహాత్మా గాంధీ జీవితంలో కేవలం మూడు ప్రధాన
ఘట్టల్నే ‘గాంధీ’ స్క్రీన్ ప్లేకి ఫౌండేషన్ గా అటెన్ బరో తీసుకున్నట్టు- వీరప్పన్ జీవితాన్ని
కంపార్ట్ మెంటలైజ్ చేసి, మళ్ళీ ఒక కంపార్ట్ మెంట్ ని సబ్ కంపార్ట్ మెంటలైజ్ చేస్తే
తేలిన సారంలో, వర్మ కూడా మూడే ఘట్టాల్ని ఫౌండేషన్ గా తీసుకున్నాడు : 1. లేడీ ఇన్ఫార్మర్
తో వీరప్పన్ ని పట్టుకునే ప్రయత్నం, 2. ప్రముఖుల్ని కిడ్నాప్ చేయాలనీ వీరప్పన్
అనుకున్నప్పుడు అవసరమైన దుండగుల స్థానంలో పోలీస్ ఏజెంట్లని పంపే ప్రయత్నం, 3.
వీరప్పన్ ఎల్ టీ టీ ఈ నేత ప్రభాకరన్ ని కలుసుకోవాలని ఉబాలట పడినప్పుడు, వాహనంగా పోలీస్ ఏజెంట్ డ్రైవర్ గా వున్న
అంబులెన్స్ ని పంపే ఘట్టం..
ఈ మూడు ఘట్టాలనీ త్రీ యాక్ట్ (బిగినింగ్-మిడిల్-ఎండ్) స్ట్రక్చర్లో
ఎలా సర్దాలి? నిజానికి ఈ మూడూ మిడిల్, ఎండ్ విభాగాల్లో మాత్రమే సర్దుకున్నాయి. బిగినింగ్
విభాగమంతా వీరప్పన్ ఎదురుదాడుల్లో
పోలీసులు మరణించడం, ఫ్లాష్ కట్స్ లో క్లుప్తంగా అతడి బ్యాక్ గ్రౌండ్ చూపించడం వగైరా
వున్నాయి. సుమారు అరగంట తర్వాత బిగినింగ్ ముగుస్తూ- ఈ ప్లాట్ పాయింట్ -1 దగ్గర ఇక వ్యూహం
మార్చాలన్న ఎస్పీ ఆలోచనతో- వీరప్పన్ ని అడవిలోంచి బయటికి రప్పించాలని
నిర్ణయించడంతో, మిడిల్ మొదలవుతుంది.
ఈ మిడిల్ ప్రారంభంలోనే గ్రామంలో శ్రేయ అనే అమ్మాయిని ఎస్పీ
తన ఇన్ఫార్మర్ గా నియమించుకోవడం, ఆమె ఇంట్లోకి ముత్తులక్ష్మి అద్దెకి దిగేలా
చూడడం, ఆమె మీద కన్నేసి వుంచడం- ఇదంతా ఎస్పీ తనముందున్న సమస్యతో మిడిల్ బిజినెస్
ప్రకారం చేస్తున్న స్ట్రగుల్లో భాగంగానే.
ఇది ఫాం హౌస్ కి వీరప్పన్ ని రప్పించేందుకు దారితీసి- అక్కడ
ఎలర్ట్ అయిన వీరప్పన్ ఎటాక్ చేయడంతో, ఇంటర్వెల్ దగ్గర ఆ ప్లానంతా విఫలమవడం- ఎస్పీ స్ట్రగుల్ లో
భాగంగా చోటు చేసుకోవాల్సిన బిజినెస్ లో - ప్రత్యర్ధితో సాగుతున్న ఈ యాక్షన్
రియాక్షన్ ల పర్వంలో గట్టి ఎదురు దెబ్బ
తగలాలన్న సూత్రాన్ని అమలు చేయడమే.
ఇంటర్వెల్ తర్వాత మిడిల్ కంటిన్యూ అవుతూ- ఎస్పీ మరో ఎత్తుగడ
వేయడం- అది వీరప్పన్ గతంలో కన్నడ సూపర్ స్టార్ రాజ్ కుమార్ ని కిడ్నాప్
చేసినప్పుడు, డిమాండ్ చేసిన డబ్బులో తనకేం మిగల్లేదన్న అసంతృప్తితో- రజనీ కాంత్
సహా మరికొందరు రాజకీయ నాయకుల్ని కిడ్నాప్
చేయదలచి- అందుకవసరమైన గ్యాంగ్ కోసం ప్రయత్నిస్తున్నప్పుడు- ఎస్పీ తన ఏజెంట్లని పంపి ట్రాప్ చేయాలనుకోవడం- ఇది కూడా
పసిగట్టిన వీరప్పన్ భారీ ఎత్తున నష్టం కలగజేయడం, ఎస్పీ సన్నిహిత పోలీసు కూడా
ప్రాణాలు కోల్పోవడం జరిగి మిడిల్ ముగుస్తుంది.
మిడిల్ ముగింపులో ( ప్లాట్ పాయింట్- 2) హీరోకి తీవ్ర
నష్టం జరిగి కోలుకోలేని పరిస్థితి ఎదురవడమనే
సూత్ర పాలనే జరిగిందిక్కడ. దీని తర్వాత ఎండ్ విభాగం ప్రారంభిస్తూ వెళ్ళేది
క్లయిమాక్ కే. అలా సన్నిహిత పోలీసు
ప్రాణాలు కోల్పోవడంతో ఎస్పీ కి సంకల్ప బలం పెరుగుతుంది. అవతల వీరప్పన్ శ్రీలంకలో
ఎల్ టీ టీ ఈ నాయకుడు ప్రభాకరన్ వీరత్వం గురించి విని ఉప్పొంగిపోయి- అతణ్ణి
కలుసుకోవలనుకుంటున్న ప్పుడు- ఎస్పీ తన ఏజెంట్ ద్వారా మాయోపాయంతో వీరప్పన్ ని ముఠా
సహా అంబులెన్స్ లో అడవిలోంచి బయటికి రప్పిస్తూ గ్రామం మధ్యలో ఎన్ కౌంటర్ చేయడమనే ఎండ్ బిజినెస్ తో ముగింపు.
***
మూడు ఎపిసోడ్లు, ఒక్కో ఎపిసోడ్లో కావలసినంత బిగువు,
సస్పెన్స్, టెంపో, థ్రిల్ వగైరా..ఇందులో మళ్ళీ పాత్రల్నీ సంఘటనల్నీ సంఘర్షణల్నీ
బాధల్నీ బలంగా ఎష్టాబ్లిష్ చేస్తూనే..
కావాల్సిందల్లా ఒక నిజ వ్యక్తి జీవితంలో ఒక బాక్సాఫీస్
సెల్లింగ్ పాయింటు వున్న భాగాన్ని మాత్రమే తీసుకుని, మళ్ళీ వెనక్కి చూడకుండా అక్కడ
స్పష్టమైన గీత గీసి- ఆ భాగం వరకూ స్ట్రక్చర్ లో కూర్చే నేర్పే.
‘కిల్లింగ్
వీరప్పన్’ స్క్రీన్ ప్లే ఇలాటి కథలకి ఒక గైడ్. గతంలో ‘శివ’ తో త్రీ యాక్ట్
స్క్రీన్ ప్లే కి వర్మే ఇచ్చిన గైడ్ కి లాగే.
-సికిందర్