రివ్యూలు, సాంకేతికాలు, స్క్రీన్ ప్లే సంగతులు...

టికెట్లు దొరకడం యోగం, సినిమాలు చూడడం భోగం, రివ్యూలు రాయడం రోగం!

Sunday, September 17, 2023

1365 : రివ్యూ!


రచన -దర్శకత్వం : సతీష్ వర్మ
తారాగణం : కార్తీక్ రత్నం, గోల్డీనిస్సీ, సత్య, రవిబాబు, అజయ్ తదితరులు
సంగీతం : కృష్ణ సౌరభ్, ఛాయాగ్రహణం : సుందర్ ఎస్సీ
బ్యానర్ : ఆర్టీ టీం వర్క్స్, ఫ్రేమ్ బై ఫ్రేమ్ పిక్చర్స్
నిర్మాత : రవితేజ
విడుదల : సెప్టెంబర్ 15, 2023
***
        మాస్ మహారాజా రవితేజ సొంత బ్యానర్ స్థాపించి నిర్మించిన రావణాసుర’, గట్ట కుస్తీ సత్ఫలితాలనివ్వలేదు. తిరిగి మూడో సినిమాగా కొత్త దర్శకుడికి అవకాశం కల్పిస్తూ నిర్మించిన ఛాంగురే బంగారు రాజా ఈ వారం విడుదలైంది. చాలా మంది హీరోలు సొంత బ్యానర్లు ప్రారంభించి కొత్త వారికి అవకాశాలు కల్పిస్తున్నారు. వీటితో చాలా కొందరు మాత్రమే సక్సెస్ అవుతున్నారు. ఇంకా నేర్చుకోవాల్సిన దశలో దర్శకులుగా మారిపోవడం వల్ల ఈ పరిస్థితి తప్పడం లేదు. ప్రస్తుతం సతీష్ వర్మ అనే కొత్త దర్శకుడు పరిచయ
మవుతూ మర్డర్ మిస్టరీ తీశాడు. కేరాఫ్ కంచరపాలెం నటుడు కార్తీక్ రత్నం హీరోగా నటించాడు. ఈ మర్డర్ మిస్టరీని కామెడీ ప్రధానంగా తీసి ఆకట్టుకునే ప్రయత్నం చేశారు క్రైమ్, కామెడీ రెండూ ఎక్కువ టాలెంట్ ని కోరుకునే జానర్లు. మరి ఈ కొత్త దర్శకుడు ఇందులో ఏమాత్రం ప్రతిభా నిరూపించుకోగలిగాడో చూద్దాం...

కథ

ఓ గ్రామంలో రాజు (కార్తీక్ రత్నం) అనే బైక్ మెకానిక్ వుంటాడు. అతడికి కోపం ఎక్కువ. దీంతో తెలియకుండానే శత్రువుల్ని పోగేసుకుంటాడు. ఆ గ్రామంలో వర్షాలు రంగురాళ్ళు బయటపడతాయి. వాటిని సొంతం చేసుకోవడానికి పోటీ పడతారు గ్రామస్థులు. అలా ఒక రోజు రంగురాళ్ళ దగ్గర సోమి నాయుడు (రాజ్ తిరందాసు) అనే అతడితో ఘర్షణ పడతాడు రాజు. ఆ తర్వాత సోమినాయుడు శవమై కనిపిస్తాడు. దీంతో రాజు అనుమానితుడుగా కేసులో ఇరుక్కుంటాడు. ఇక చేయని హత్యలో ఇరుక్కున రాజు నిర్దోషిగా ఎలా నిరూపించుకున్నాడన్నది మిగతా కథ.

ఎలావుంది కథ

మర్డర్ మిస్టరీ జానర్ గురించి పెద్దగా అవగాహన లేకుండా తీసినట్టుందీ సినిమా. హంతకుడెవరు? అని చివరిదాకా కథని లాగి, చిట్ట చివర్లో  హంతకుడ్ని చూపించే బాపతు ఎండ్ సస్పెన్స్ కథలు 40 ఏళ్ళ క్రితమే నవలలకి తప్ప, సినిమాలకి పనికి రావని మర్డర్ మిస్టరీలకి హాలీవుడ్ గుడ్ బై చెప్పేసింది. చివరి దాకా ప్రేక్షకుల సహనాన్ని పరీక్షించకుండా, హంతకుడెవరో చూపించేసి, వాడెలా పట్టుబడతాడన్న యాక్షన్ తో, సీన్ టు సీన్ సస్పెన్స్ కథల్ని సృష్టించి హాలీవుడ్ సినిమాలు తీస్తోంది. ఈ విషయం తెలీక ఇప్పటికీ తెలుగులో ఎండ్ సస్పెన్స్ మర్డర్ మిస్టరీలు తీసి అట్టర్ ఫ్లాప్ చేసుకుంటున్నారు. అందులో ఇది మరొకటి.
       
కొత్త దర్శకుడి చేతిలో ఈ మిస్టరీ వర్కౌట్ కానట్టే
, కామెడీ కూడా పని చేయలేదు. ఈ రెండు ప్రక్రియల్లో ప్రవేశం లేకపోయినా, కథ చెప్పడానికి రోషోమన్ ఎఫెక్ట్ అంతటి కళా ప్రక్రియకి సాహసించడం ఇంకో బడాయి. అంటే, జరిగిన హత్య గురించి వివిధ సాక్షులు వాళ్ళ  దృక్కోణంలో ఇచ్చే వాంగ్మూలాలతో కథ. హీరోతో బాటు, రవిబాబు, సత్యల పాత్రలు ఒకరి తర్వాత ఒకరు తాము చూసింది, తమకు తెలిసిందీ చెప్పుకురావడం. ఇలా అదే హత్యా సంఘటనని  వివిధ వెర్షన్లుగా మార్చి చూపించడం. 1950 లనాటి ఈ టెక్నిక్ ఎప్పుడో కాలదోషం పట్టి థ్రిల్ చేయడం మానేసింది.
       
ఇంకో  ఘోరమైన తప్పిదం ఏమిటంటే
, ఈ మూడు వెర్షన్లని మూడు చాప్టర్లు గా చెప్పి, ఈ మూడు చాప్టర్లలో గాకుండా, చివర్లోనే కథ వుంటుందని ముందే చెప్పేసి సినిమా ప్రారంభించడం! నిజమే, మర్డర్ మిస్టరీలో సస్పెన్స్ అంతా ఎండ్ లోనే వీడుతుంది. ఇదే చెప్పేశాడు. చెప్పేశాక మూడు చాప్టర్లు తీయడమెందుకు బడ్జెట్ దండగ? చివరి ముక్క తీసుకుని షార్ట్ ఫిలిమ్ తీస్తే సరిపోయే దానికి? మాస్ మహారాజానీ ఇంత బురిడీ కొట్టించాలా? ఆ మూడు చాప్టర్లలో కూడా వున్నడెం వున్నదేం లేదు, చూపించిందే చూపించడం!
       
విషయం ఇలా వున్నాక, ఇక ఎవరెలా నటించారు, పాటలెలా వున్నాయి, ప్రొడక్షన్ విలువలెలా వున్నాయి తెలుసుకోవాలన్పిస్తోందా
? రవితేజ సొంత బ్యానర్లో టీం వర్క్ ని సీరియస్ గా తీసుకోకపోతే, ఈ మూడో ఫ్లాప్ తర్వాత నాల్గోది కూడా డీఫాల్టుగా సిద్ధమవుతుంది.
—సికిందర్

 

Saturday, September 16, 2023

1364 : రివ్యూ!

రచన-దర్శకత్వం : ఆదిక్ రవిచంద్రన్
తారాగణం : విశాల్, రీతూ వర్మ, అభినయ, సునీల్, ఎస్ జె సూర్య, సెల్వ రాఘవన్, రెడిన్ కింగ్స్లే, నిళంగల్  రవి, వైజీ మహేంద్ర తదితరులు
సంగీతం : జివి ప్రకాష్ కుమార్, ఛాయాగ్రహణం : అభినందన్ రామానుజం
నిర్మాత : వినోద్ కుమార్
విడుదల : సెప్టెంబర్ 15, 2023
***

        పురచ్చి దళపతి (విప్లవ దళపతి అని టైటిల్స్ లో వేశారు) విశాల్ 2017 లో తుప్పరివాలన్ (తెలుగులో డిటెక్టివ్’) హిట్టయిన తర్వాత, వరుసగా 9 ఫ్లాపులిచ్చి కూడా విప్లవ దళపతి అన్పించుకోవడం విచిత్రం. ఒకే రకమైన మాస్ యాక్షన్ సినిమాలు అతడిని ముందుకెళ్ళకుండా చేశాయి. ఇప్పుడు కూడా మాస్ యాక్షన్నే తీసుకుని మార్క్ ఆంటోనీ నటించాడు. అయితే ఇక్కడ నిజమైన విప్లవం తీసుకొచ్చాడు. ఈ మాస్ యాక్షన్ కి సైన్స్ ఫిక్షన్ జోడించి విప్లవాత్మకంగా ఒక కొత్త వెరైటీని సృష్టించాడు. గతంలో  త్రిష-ఇలియానా-నయనతార’, ఏఏఏ’, బాఘీరా అనే మూడు తమిళ సినిమాలు తీసిన దర్శకుడు అధిక్ రవిచంద్రన్ ఈ కొత్త వెరైటీని ప్రేక్షకుల ముందుంచాడు. ఇందులో ఎంతవరకు విశాల్ ని నిలబెట్టేందుకు కృషి చేశాడో తెలుసుకుందాం....

కథ

1975 లో డాన్ ఆంటోనీ (విశాల్), గాడ్ ఫాదర్ జాకీ మార్తాండ (ఎస్ జె సూర్య) మంచి దోస్తులు. వీళ్ళ శత్రువు గ్యాంగ్ స్టర్ ఏకాంబరం (సునీల్), ఆంటోనీ వల్ల తన తండ్రి చనిపోయాడని ఆంటోనీని చంపేస్తాడు. అప్పుడు ఆంటోనీ కొడుకు మార్క్ ఆంటోనీ (యంగ్ విశాల్) ని జాకీ మార్తాండ కన్నకొడుకులా పెంచుకుంటాడు. మార్క్ ఆంటోనీ తల్లి వేదవల్లి (అభినయ) కిచ్చిన మాట కోసం తండ్రిలా ఆయుధాలు పట్టకుండా మెకానిక్ అవుతాడు.
       
తర్వాత 1995 లో గ్యారేజి నడుపుకుంటున్న మార్క్ ఆంటోనీతో రమ్య (రీతూవర్మ) ప్రేమలో పడుతుంది. ఇలా వుండగా
, ఒక సైంటిస్టు 30 ఏళ్ళు కష్టపడి తయారు చేసిన టెలిఫోను గ్యారేజీలో మూలన పడి వుంటుంది. ఆ టెలిఫోన్ కి టైమ్ ట్రావెల్ ఫోన్ అని పేరు పెట్టాడు. దాన్ని డయల్ చేస్తే కాల్స్ వర్తమానం నుంచి గతంలోకి వెళ్తాయి. ఈ ఫోను అనుకోకుండా మార్క్ ఆంటోనీకి తగిలే సరికి, ఆ బుక్కులో వున్న సూచనల ప్రకారం 1975 లో చనిపోక ముందు తన తల్లి నెంబర్ కి ఫోన్ చేసి మాట్లాడతాడు. అప్పట్లో తన తల్లిని తండ్రి చంపేశాడని అతడికి తెలుసు. అందుకని ఇప్పుడు చిన్నప్పటి తనకే ఫోన్ చేసి, తల్లిని కాపాడుకోమని హెచ్చరిస్తాడు...ఐతే ఇక్కడే మొత్తం మలుపు తిరుగుతుంది.
       
అసలు తల్లిని చంపిందెవరు
? తండ్రిని చంపింది కూడా ఎవరు? చనిపోయిన తండ్రి ఇప్పుడెలా బతికున్నాడు? బతికున్న జాకీ మార్తాండ ఇప్పుడెలా చచ్చిపోయాడు? ఈ మొత్తం గేమ్ లో ఏకాంబరం పాత్రేమిటి? నిజాలు బయటికి తీయడానికి, ఆ నిజాలతో శత్రువు మీద పగదీర్చుకోవడానికీ మార్క్ ఆంటోనీకి టెలిఫోన్ ఎలా ఉపయోగపడింది? మొత్తానికి మొత్తం తనే వెళ్ళి 1975 కాలంలో ఎలా పడ్డాడు? చివరికేమైంది? ఇదీ మిగతా కథ. 

ఎలావుంది కథ

ఇది గమ్మత్తయిన గ్యాంగ్ స్టర్స్ కథ. 2011లో డేనియల్ క్రేగ్, హారిసన్ ఫోర్డ్ లతో కౌబాయ్స్ అండ్ ఎలియెన్స్ అనే హాలీవుడ్ మూవీ ఇలాటిదే గమ్మత్తయిన కథతో వచ్చింది. సాధారణంగా గ్రహాంతర జీవులతో సైన్స్ ఫిక్షన్ కథలు వర్తమాన కాలపు కథలుగా వచ్చాయి. అలాటిది 19 శతాబ్దంలో కౌబాయ్స్, తమపై కొచ్చిన గ్రహాంతర జీవులతో పోరాడే కొత్త సైన్స్ ఫిక్షన్ యాక్షన్ సినిమాగా తీసి సంచలనం సృష్టించారు.      ఇలాగే టైమ్ ట్రావెల్ సైన్స్ ఫిక్షన్ కథలు ప్రేమ సినిమాలుగానో, ఇంకేదైనా యాక్షన్ సినిమాలుగానో వచ్చాయి. కానీ గ్యాంగ్ స్టర్స్ కథని టైమ్ ట్రావెల్ సైన్స్ ఫిక్షన్ తో కలిపి యాక్షన్ సినిమాగా తీయడం ఇదే మొదటిసారి. అందుకని ఆద్యంతం ఇది కొత్త థ్రిల్ ని స్తుంది.
       
రెండోదేమిటంటే
, ఈ గ్యాంగ్ స్టర్స్ కథ సీరియస్ గా లేకపోవడం. ఫన్నీగా, కామిక్ సెన్స్ తో లైట్ గా తీసుకుని చంపుకోవడాలు, శతృత్వాలు వుండడం. అందుకని టైంట్రావెల్ ఎలిమెంట్ తో –ట్విస్టులతో థ్రిల్ చేస్తూ నవ్విస్తుంది. ఈ కామెడీకి కేంద్రబిందువు జాకీ మార్తాండగా నటించిన దర్శకుడు ఎస్ జె సూర్య. మూడోది, ఎక్కడా స్లో అవకుండా సీన్స్, యాక్షన్ స్పీడుగా సాగడం. నాల్గోది 1975, 1995 రెండు కాలాల కాల్పనిక ప్రపంచాలు చాలా వరకూ నైట్ సీన్లతో, లైటింగ్ ఎఫెక్ట్స్ తో కనువిందు చేయడం.
       
అయితే ఫస్టాఫ్ ఇంటర్వెల్ కొచ్చేసరికి ఎవరు ఎవర్ని చంపారో సస్పెన్స్ వీడిపోయి- విలన్ ని చంపడంతో కథైపోతుంది. ఇక్కడే ఒక చిన్న ట్విస్టుతో మళ్ళీ కథ పుట్టి సెకండాఫ్ లో కెళ్తుంది. ఫస్టాఫ్ లో టెలిఫోన్ తో మేనేజ్ చేసిన విశాల్
, ఇప్పుడు తానే వెళ్ళి 1975 కాలంలో కెళ్ళి పడేసరికి- అక్కడ తన తండ్రిని చంపిన వాడికోసం వేచివున్న ఎస్ జె సూర్య చేతిలో పడతాడు. ఆ టెలిఫోన్ కూడా సూర్య చేతిలో పడేసరికి కథ ఇంకో మలుపు తిరిగి ఫన్ గా మారుతుంది.
       
ఈ సెకండాఫే కథ ఆగిన చోటే మళ్ళీ మళ్ళీ వెనక్కి వెళ్ళి
, ఇంకో రూపంలో రిపీటవడంతో - టైమ్ లూప్ స్క్రీన్ ప్లేగా, సర్క్యులర్ స్క్రీన్ ప్లేగా మారిపోయి మూడ్ చెడగొడతుంది. అర్ధం జేసుకోవడానికి భారంగా మారుతుంది. టైమ్ ట్రావెల్ జానర్లో ఈ కొత్త గా అన్పింఛే సైన్ ఫిక్షన్ కథని మళ్ళీ ఇన్ని క్రియేటివిటీలతో సంక్లిష్టం చేయనవసరం లేదు. దీన్ని దాటేసే ప్రయత్నం చేస్తూ ఎస్ జె సూర్య కామెడీ లేకపోతే, విశాల్  నటించిన ఈ సినిమా కూడా చాలా ప్రమాదంలో పడేది.

నటనలు – సాంకేతికాలు

తండ్రిగా కొడుకుగా విశాల్ నటించిన రెండు పాత్రలు ఇదివరకు సినిమాల్లోని అతడి ఒకే మూస యాక్షన్ పాత్రలకి కాస్త భిన్నంగా వున్నాయి. ముఖ్యంగా అమాయకుడైన కొడుకు పాత్రలో కొత్త గెటప్ తో నటించడానికున్న అవకాశాన్ని సద్వినియోగం చేసుకున్నాడు. అమాయకత్వంతో బాటు పిరికితనం కూడా బాగా నటించాడు.
       
అయితే విశాల్ ని ఎస్ జె సూర్య కామిక్ విలనీతో డామినేట్ చేశాడు. సూర్య లేకపోతే ఈ మైండ్ లెస్ కామెడీ ఫెయిలయ్యేది. సెకండాఫ్ లో యంగ్ విశాల్ చాలా సేపు కనిపించకపోవడంతో
, ఆ లోటుని సూర్యయే తెగ నవ్వించే విలనీతో భర్తీ చేశాడు. 
       
హీరోయిన్ రీతూవర్మ మాత్రం ఎప్పుడో గానీ కనిపించదు. ఈ సూపర్ ఫాస్ట్ యాక్షన్ థ్రిల్లర్ లో ఆమెతో రోమాన్స్ కి
, సాంగ్స్ కీ చోటు లేదు. వుంటే స్పీడ్ బ్రేకర్స్ లా బోరు కొట్టేవేమో. విశాల్ తల్లిగా అభినయది చిన్న పాత్ర. విశాల్ తో వుండే కమెడియన్ రెడిన్ కింగ్స్లే కి ఈసారి ఆశాభంగం తప్పలేదు. సూర్య లేకపోతే అతడి కామెడీని ఎంజాయ్ చేయొచ్చు. సూర్య వుండేసరికి అతడి టక్కుటమారాలు పనిచేయలేదు.
       
సునీల్ పోషించిన గ్యాంగ్ స్టర్ పాత్రకి మంచి -చెడు రెండు షేడ్స్ వున్నాయి. రెండిట్లో ప్రూవ్ చేసుకున్నాడు. సైంటిస్టుగా దర్శకుడు సెల్వరాఘవన్ ఈసారి ముఖం కని పించని గడ్డం మీసాలతో గుర్తు పట్టలేకుండా
, తన విలక్షణ నటనని ప్రేక్షకులు ఎంజాయ్ చేయకుండా జాలిగా మిగిలిపోయాడు.
       
జీవీ ప్రకాష్ కుమార్ సంగీతం
, అభినందన్ ఛాయాగ్రహణం సినిమాకి హైలైట్స్ గా నిలుస్తాయి. ప్రొడక్షన్ క్వాలిటీకి భారీగా ఖర్చు పెట్టారు. అలాగే ఐదుగురు యాక్షన్ డైరెక్టర్లతో ఈ నాన్ స్టాప్ యాక్షన్ థ్రిల్లర్ ని దర్శకుడు ఆదిక్ రవిచంద్రన్ కొత్త తరహాలో ప్రేక్షకుల ముందుంచాడు. తుప్పరివాలన్ తర్వాత విశాల్ కెరీర్ లో ఇదొక వెరైటీ సినిమా అనొచ్చు!

—సికిందర్ 

 

Thursday, September 7, 2023

1263 : రివ్యూ!

 


రచన-దర్శకత్వం : మహేష్ బాబు
తారాగణం : నవీన్ పొలిశెట్టి, అనూష్కా శెట్టి, జయసుధ, తులసి, నాజర్, మురళీశర్మ, అభినవ్ గోమఠం
సంగీతం : రాధన్, నేపథ్య సంగీతం : గోపీ సుందర్, ఛాయాగ్రహణం : నీరవ్ షా 
బ్యానర్: యువి క్రియేషన్స్, నిర్మాతలు: వంశీ-ప్రమోద్
విడుదల : సెప్టెంబర్ 7, 2023
***

        2021 లో జాతిరత్నాలు హిట్ కామెడీ తర్వాత నవీన్ పొలిశెట్టి, 2020 లో నిశ్శబ్దం సస్పెన్స్ థ్రిల్లర్ తర్వాత, అనూష్కా శెట్టీ కలిసి నటించిన మిస్ శెట్టి - మిస్టర్ పొలిశెట్టి రోమాంటిక్ కామెడీ ప్రేక్షకుల మధ్యకొచ్చింది. దీనికి మెగా స్టార్ చిరంజీవి ఫస్ట్ రివ్యూ ఇచ్చి అభినందించడంతో హైప్ వచ్చింది. ట్రైలర్స్ కి కూడా మంచి రెస్పాన్స్ లభించింది. మరో కొత్త దర్శకుడుగా మహేష్ బాబు దీంతో పరిచయమయ్యాడు. ప్రసిద్ధ బ్యానర్ యూవీ క్రియెషన్స్ నిర్మాణంలో ఈ కొత్త మూవీ కొత్తగా ఏం చెబుతోందీ, ఎలా చెబుతోందీ చూద్దాం...

కథ  

అన్వితా శెట్టి (అనూష్కా) లండన్లో మాస్టర్ షెఫ్ గా పని చేస్తూంటుంది. తల్లి (జయసుధ) అనారోగ్యం పాలు కావడంతో ఆమెని తీసుకుని ఇండియా వస్తుంది. తల్లి మరణించడంతో ఒంటరితనం ఫీలవుతుంది. అయితే పెళ్ళి మీద సదభిప్రాయం వుండదు. పెళ్ళి లేకుండా బిడ్డని కనాలని నిర్ణయించుకుంటుంది. ఆమెకి సిద్ధార్థ్ పొలిశెట్టి (నవీన్) పరిచయమవుతాడు. ఇతను ఇంజనీర్. అయితే స్టాండప్ కమెడియన్ గా జీవిస్తూంటాడు. ఇతను అన్వితతో ప్రేమలో పడతాడు. ఆమె పెళ్ళి లేకుండా సరొగసీ(అద్దె గర్భం) ద్వారా బిడ్డని కంటానని, వీర్యదానం చేయమని కోరేసరికి షాక్ తింటాడు. ఇప్పుడు వీళ్ళిద్దరి మధ్య ఏం జరిగిందనేది మిగతా కథ.

ఎలావుంది కథ

ఈ కథలో రెండు కాన్సెప్ట్ లున్నాయి : సరోగసి, స్టాండప్ కామెడీ. ఈ రెండిటినీ కలిపి ఒక రిలేషన్ షిప్ కథ చేశారు. సరోగసి (అద్దె గర్భం) కథతో గతంలో సినిమా లొచ్చాయి. 1981 లో వి. మధుసూధనరావు దర్శకత్వంలో శోభన్ బాబు- జయసుధ నటించిన సంసారం -సంతానం’, 1993 లో ఏ. కోదండరామి రెడ్డి దర్శకత్వంలో జగపతిబాబు- మహేశ్వరి నటించిన జాబిలమ్మ పెళ్ళి’, 2001 లో క్రాంతి కుమార్ దర్శకత్వంలో సౌందర్య- విక్రమ్ నటించిన ‘9 నెలలు’, 2022 లో హరి- హరీష్ దర్శకత్వంలో సమంత నటించిన యశోద. అలాగే స్టాండప్ కామెడీ కథతో 2021 లో భాస్కర్ దర్శకత్వంలో అఖిల్- పూజా హెగ్డే నటించిన మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్’. వీటిలో యశోద తప్ప మిగిలిన సినిమాలన్నీ హిట్టయినవే.
       
అయితే ఈ రెండు కాన్సెప్ట్స్ కూడా విడివిడి కథలుగానే వచ్చాయి. ఈ రెండిటినీ కలిపి
మిస్ శెట్టి- మిస్టర్ పొలిశెట్టి అనే కొత్త కథగా చేశాడు కొత్త దర్శకుడు. ఒక సరోగసి కోరుతున్న హీరోయిన్, ఆమెతో పెళ్ళి కలలుగన్న స్టాండప్ కమెడియన్ హీరో. ఈ రెండు వ్యతిరేక పాత్రల్ని ఎదురెదురు పెట్టి కొత్త డైనమిక్స్ ని సృష్టించాడు. దీంతో కథకి బలమైన సంఘర్షణ ఏర్పడింది.
       
పైన చెప్పుకున్న తెలుగు సరోగసి సినిమాలు సహా ఇతర భాషల్లో వచ్చినవి (హిందీలో
మిమీ తప్ప) సరోగసి సమస్యతో బరువైన సెంటిమెంటల్ మెలోడ్రామాలే. ప్రస్తుత సినిమా ఇందుకు భిన్నంగా కామెడీ. ఒక స్టాండప్ కమెడియన్ కి తీవ్రమైన వ్యక్తిగత సమస్య పుడితే అతనేం చేస్తాడు? ఏడుస్తూ కూర్చోలేడు. స్టాండఫ్ కామెడీతో నవ్వించాల్సిందే. దీంతో ఈ సరోగసి కథ ఫన్నీ రోమాంటిక్ కామెడీ అయ్యే అవకాశమేర్పడింది.
       
అయితే దీన్ని సరిగా ఉపయోగించుకోలేదు. ఇద్దరి విభిన్న కోరికలతో బలమైన సంఘర్షణ ఏర్పడినా
, దాని తాలూకు కథా కథనాలు బలంగా లేవు. కారణం ఎవరు కథ నడిపే ప్రధాన పాత్ర అవుతారనేది స్పష్టత లేకపోవడం. సరోగసితో సమస్య ఆమె పుట్టిస్తే, సమస్యనెదుర్కొనే అతనే ప్రధాన పాత్ర అవుతాడు. ఆ సమస్యని కథని ఎలా నడిపి పరిష్కరించుకుంటాడనేది ప్రధాన పాత్రగా అతడి లక్ష్యమే అవుతుంది. కాబట్టి అతడి స్టాండప్ కమెడియన్ పాత్రచిత్రణ ప్రధానంగా కథ వుండాలి.
       
2005 లో చందన్ అరోరా దర్శకత్వంలో పొట్టి కమెడియన్ రాజ్ పల్ యాదవ్ కి
, పొడుగు భార్య రీతూపర్ణా సేన్ గుప్తా తో మై మేరీ పత్నీ ఔర్ వోహ్ హిట్ కథ ఇలాటిదే. అతను ఏమీ జరగనట్టు పైకి నవ్విస్తూ బతికినా, లోపల పొడుగు భార్యతో ఇన్ఫీరియారిటీ, ఇన్ సెక్యూరిటీ, ఇంకొకడి మీద అనుమానం వంటి రకరకాల బాధలతో గించుకుచచ్చే బ్రహ్మాండమైన ఎమోషనల్ కామెడీ. మనకి నవ్వూ తెప్పిస్తుంది, కన్నీళ్ళూ తెప్పిస్తుంది. వ్యతిరేక పాత్రల మధ్య హీరోతో ఈ డైనమిక్సే మిస్సయ్యింది మిశె-మిపొ.
       
ఫస్టాఫ్ లో పదిహేను నిమిషాలపాటు అనూష్కా- జయసుధ తల్లీ కూతుళ్ళ పాత్రలతో విషాద కథ సినిమా ప్రారంభాన్ని నీరు గారిస్తే
, 15 నిమిషాల తర్వాత నవీన్ ఎంట్రీతో ఊపందుకుంటుంది. నవీన్ –అనూష్కాల మధ్య ఇంటర్వెల్ వరకూ రోమాన్స్ యూత్ అప్పీల్ తో ఫన్నీగానే సాగినా, సెకండాఫ్ షరా మామూలుగా అరగంట సేపు కథ లేక బోరు కొట్టే పరిస్థితి వస్తుంది. తర్వాత నవీన్ కామెడీతో హుషారు తెప్పించినా, క్లయిమాక్స్ లో ముగింపు  తెలిసి పోయేలా వుంటుంది. అనూష్కా తీసుకునే నిర్ణయానికి తగిన జస్టీఫికేషన్ లేకుండా. సమస్య అనూష్కా పాత్రదైనట్టు కథ నడపడంతో సీరియస్ అయిపోయింది సెకెండాఫ్.

నటనలు సాంకేతికాలు  

ఎప్పటిలాగానే నవీన్ పొలిశెట్టి కామెడీని రక్తికట్టించాడు. స్టాండప్ కమెడియన్ పాత్రతో పేల్చిన జోకులు సోషల్ మీడియా కాపీ జోకులు కాకుండా ఫ్రెష్ గా వున్నాయి. స్టాండప్ కమెడియన్ షో ఇవ్వడమంటే ఏకపాత్రాభినయం చేయడమే కాబట్టి తన అనుభవంతో అద్వితీయంగా చేశాడు. తన సీనియర్ అనూష్కాతో జోడీ మ్యాచ్ కాకపోయినా కామెడీతో కవర్ చేశాడు. తను ఏ సినిమా నటించినా ఒన్ మాన్ షో చేస్తాడు కాబట్టి ఇదీ అలాటిదే. కాకపోతే పాత్ర చుట్టూ కథ బలంగా లేదు. దాంతో పాత్రకుండాల్సిన భావోద్వేగాల్లేవు.
       
అనూష్కా సెంటిమెంటల్
, ఎమోషనల్ నటన ఫర్వాలేదుగానీ, ఇవి వుండాల్సింది నవీన్ పాత్రకి. అనూష్కా గ్లామర్ గానీ, స్క్రీన్ ప్రెజెన్స్ గానీ సినిమాకి ప్లస్ అయ్యాయి. ఆమెతల్లి పాత్రలో జయసుధ ఫర్వాలేదు. మురళీ శర్మ, నాజర్, తులసి తదితరులు వాళ్ళ పాత్రల్ని నిలబెట్టుకున్నారు. కమెడియన్ అభినవ్ గోమఠం ఈ సినిమాతో మంచి గుర్తింపు పొందవచ్చు.
       
రాధన్ సంగీతంలో పాటలు సాధారణంగా వుంటే
, గోపీసుందర్ నేపథ్య సంగీతం, నీరవ్ షా ఛాయాగ్రహణం, ఇతర ప్రొడక్షన్ విలువలు ఈ నవతరం రోమాంటిక్ కామెడీ కి విజువల్ అప్పీల్ ని చేకూర్చి పెట్టాయి. కొన్నే బలాలు, చాలా బలహీనతలున్న ఈ కొత్త దర్శకుడి సినిమాకి నవీన్-అనూష్కా పాత్రల కంటే వాళ్ళ స్క్రీన్ ప్రెజెన్స్, ప్రేక్షకుల్లో వున్న ఆకర్షణ కాపాడుతుందేమో చూడాలి. గతవారం విజయ్ దేవరకొండ - సమంతల ఖుషీ తో ఆకర్షణ వీకెండ్ తర్వాత 20 శాతానికి పడిపోయింది- కంటెంట్ లోపం వల్ల.

—సికిందర్

Friday, September 1, 2023

1362 : రివ్యూ!

 


రచన- దర్శకత్వం : శివ నిర్వాణ
తారాగణం : విజయ్ దేవరకొండ, సమంత, మురళీ శర్మ, సచిన్ ఖెడేకర్, శ్రీకాంత్ అయ్యంగార్, లక్ష్మి, శరణ్య, రోహిణి, వెన్నెల కిషోర్, రాహుల్ రామకృష్ణ తదితరులు
సంగీతం :  హిషామ్ అబ్దుల్ వహాబ్, ఛాయాగ్రహణం : మురళి జి
బ్యాంర్ ; మైత్రీ మూవీ మేకర్స్
నిర్మాతలు : నవీన్ యెర్నేని, వై. రవిశంకర్
విడుదల సెప్టెంబర్ 1, 2023
***

త సంవత్సరం లైగర్ పానిండియా యాక్షన్ ఈద్పరాజయంతో సందిగ్ధంలో పడ్డ విజయ్ దేవరకొండ, ఫ్యామిలీ ఓరియెంటెడ్ రోమాంటిక్ మూవీ మీదికి దృష్టి మరల్చాడు. ఇలాటి సినిమాలు తీసే (నిన్నుకోరి, మజిలీ, టక్ జగదీష్) దర్శకుడు శివ నిర్వాణ మీద బాధ్యత వుంచాడు. యూత్ అప్పీల్ కోసం సమంతని హీరోయిన్ గా తీసుకున్నాడు. దీన్ని అయిదు భాషల్లో పానిండియాగా విడుదల చేశారు. హిందీ కోసం కాశ్మీర్ లో సుదీర్ఘంగా షూటింగ్ జరిపారు. పాటలు ఇప్పటికే హిట్టయ్యాయి. 2022 డిసెంబర్ లో విడుదల వాయిదా పడి, ఈవారం ప్రేక్షకుల ముందుకొచ్చిన దేవరకొండ సినిమా ఎలా వుందో ఓసారి చూద్దాం...

కథ

విప్లవ్ (విజయ్ దేవర్ కొండ) బిఎస్ఎన్ఎల్ లో కాశ్మీర్ లో జాబ్ వేయించుకుని అక్కడికెళ్ళి ఎంజాయ్ చేస్తూంటాడు. ఆరా (సమంత) అనే అమ్మాయి తన ఫ్రెండ్ తో పాకిస్తాన్ నుంచి వచ్చి, తప్పిపోయిన తమ్ముడ్ని వెతుకుతూంటుంది. ఆమెని చూసి తొలిచూపులోనే ప్రేమలో పడ్డ విప్లవ్, ఆమె తమ్ముడ్ని వెతకడంలో పడతాడు. తమ్ముడు దొరకడు గానీ- ఆమె ఆరా కాదనీ, ఆరాధ్య అనీ తెలిసి పోతుంది. ఆరాధ్య తండ్రి శ్రీనివాస రావు (మురళీ శర్మ) కాకినాడలో ప్రవచనాలు చెప్పే ఆస్తికుడు. విప్లవ్ తండ్రి లెనిన్ సత్యం (సచిన్ ఖెడేకర్) అతడ్ని వ్యతిరేకించే నాస్తికుడు. వీళ్ళిద్దరూ విప్లవ్ ఆరాధ్యల పెళ్ళికి అడ్డుపడతారు. ఇప్పుడు విప్లవ్ ఆరాధ్యలు వీళ్ళని ఎదిరించి ఎలా పెళ్ళి చేసుకున్నారు? తమ పెళ్ళి పెటాకులవదని ఎలా నిరూపించ దల్చుకున్నారు? ఇదీ మిగతా కథ.

ఎలావుంది కథ

ఇది పూర్తిగా రోమాంటిక్ కామెడీ కాదు. రోమాంటిక్ కామెడీగా మొదలై, రోమాంటిక్ డ్రామాగా మారే సీరియస్ కథ. ప్రేమికులు- వాళ్ళ జాతకాలు- వాటితో అంగీకారానికి రాని వాళ్ళిద్దరి ఆస్తిక, నాస్తిక తండ్రులూ - వీళ్ళతో కాన్ఫ్లిక్ట్ (సంఘర్షణ) ఈ కథ. అబ్బాయి జాతకం కలవక పోతే హోమం చేయించమంటాడు అమ్మాయి ఆస్తిక తండ్రి. హోమం లేదు గీమం లేదు పొమ్మంటాడు అబ్బాయి నాస్తిక తండ్రి. దీంతో అమ్మాయి తండ్రిని ఎదిరించి అబ్బాయితో వచ్చేస్తుంది.
       
జాతకాలు కలవని వీళ్ళు సంసారం చేస్తే
సమస్యలు వస్తాయని హెచ్చరిస్తాడు అమ్మాయి తండ్రి. తమలాంటి చక్కగా సంసారం చేసే జంట ప్రపంచంలోనే లేదని ప్రూవ్ చేయాలని ఇద్దరూ అనుకుని పెళ్ళి చేసుకుంటారు. ఇక్కడామె సమస్య తన తండ్రితోనే తప్ప అబ్బాయి తండ్రితో కాదని గుర్తించదు. అలా వెళ్ళిపోతూ అబ్బాయి తండ్రితో తన తండ్రిని తక్కువ చేసి అవమానిస్తున్నానని కూడా తెలుసుకోదు. ఇద్దరూ చేయాల్సింది ఇలాటి సందర్భంలో ఇతర ప్రేమికులకి ప్రేరణగా వుండే ఫార్ములాతో, తండ్రులిద్దర్నీ రాజీకుదిర్చి పెళ్ళి చేసుకోవడం. ప్రేమ సినిమాలో ప్రేమికులకి ఆదర్శంగా వుండని భారీ బడ్జెట్ స్టార్ హీరోహీరోయిన్ల ప్రేమ సినిమాలతో యూత్ ఏం తెలుసుకుంటారు?


ఇది ఫస్టాఫ్ కథ. ఇక సెకండాఫ్ కొస్తే
, పెళ్ళి చేసుకుని ఏదైతే ప్రూవ్ చేయాలనుకున్నారో అది మర్చిపోయి అపార్ధాలతో తమ మధ్య కొత్త కాన్ఫ్లిక్ట్ కి దారి తీస్తారు. కథకి అసలు కాన్ఫ్లిక్ట్ తండ్రులతో చూపించింది వుండగా, తమ మధ్య వేరే కాన్ఫ్లిక్ట్ సృష్టించుకుని దూరాలు పెంచుకుంటారు. దీంతో సెకండాఫ్ సీరియస్ రోమాంటిక్ డ్రామాగా మారిపోతుంది. ఈ సీరియస్ నెస్ ని మరిపించడానికి వేరే పాత్రల్ని దింపి, కామెడీలు సృష్టించే ప్రయత్నం చేశాడు దర్శకుడు.
      
ఈ కచ్చా పచ్చాగా వండిన కథకి స్టార్ హీరోయిన్లకున్న యూత్ అప్పీల్ తో, హిట్ పాటలూ కాశ్మీర్ లొకేషన్స్ తో, అగ్ర నిర్మాణ సంస్థ భారీగా ఖర్చు చేసిన ప్రొడక్షన్ విలువ లతో, ప్రేక్షకులు మైమరిచిపోయేలా చేయడంలో సక్సెస్ అయ్యాడు దర్శకుడు. అయితే నిడివి రెండు గంటలా 50 నిమిషాలు ఓర్చుకోవాలి.

నటనలు - సాంకేతికాలు

విజయ్ దేవరకొండ ఫస్టాఫ్ రోమాంటిక్ కామెడీ కాబట్టి ప్రేమని సాధించుకోవడం కోసం యాక్టివ్ పాత్రగా వుంటూ కథని ముందుకు నడిపిస్తాడు. సెకండాఫ్ రోమాంటిక్ డ్రామాగా మారిపోతుంది కాబట్టి, సంసారంలో సమస్యల్ని సృష్టించుకోవడమే తప్ప, పరిష్కరించలేని పాసివ్ పాత్రగా మారిపోయి, కథా నాయకత్వాన్ని ఇతర పాత్రలకి వదిలేస్తాడు. అయితే పాత్ర చిత్రణలో ఈ కొట్టొచ్చినట్టుండే లోపం ప్రేక్షకుల కామన్ సెన్సుకి అందకుండా పాస్ అయిపోతాడు.
     
కాశ్మీర్ సీన్స్ లో లవర్ బాయ్ గా బాగా యాక్ట్ చేశాడు. సుమారు గంట సేపు సాగే కాశ్మీర్ లొకేషన్స్ లో వెన్నెల కిషోర్ ని కలుపుకుని
, సమంత ప్రేమకోసం చేసే సున్నిత కామెడీ సీన్లని, ఒక యాక్షన్ సీనుని, మూడు హిట్ సాంగ్స్ నీ  ప్రేక్షకులు ఎంజాయ్ చేస్తారు. కాశ్మీర్ ఎపిసోడ్ ముగించుకుని వచ్చాక మొదలయ్యే సీరియస్ డ్రామాలో గుర్తుండే ఒక్క సీను కూడా దర్శకుడ్ని అడిగి పెట్టించుకోలేక పోయాడు. ముగింపు సీనులో మాత్రం తన లోని నటుడ్ని బయటికి తీసి అభిమానుల గుండె బరువెక్కించాడు. అయితే ఈ డ్రామాకి లాజిక్ లేదనేది వేరే విషయం.
      
సమంత పాత్ర చిత్రణ లోపాల్ని ఆమె స్క్రీన్ ప్రెజెన్స్ కప్పి పుచ్చే ప్రయత్నం చేసింది. అయితే ఫస్టాఫ్ లో కాస్త అల్లరి పాత్రగా వుంటే యూత్ కి ఇంకా బాగా దగ్గరయ్యేది. సెకండాఫ్ లో గర్భస్రావమనే ట్రాజడీతో ఆమె డీలా పడింది.
     
ఇంట్రెస్టింగ్
, యాక్టివ్ క్యారెక్టర్లు ఎవరంటే, తండ్రుల పాత్రల్లో మురళీ శర్మ, సచిన్ ఖెడేకర్లు. వీళ్ళ విరుద్ధ భావాలతో గొడవపడే సీన్లని చాలా నీటుగా హేండిల్ చేశాడు దర్శకుడు. మెట్రో రైల్లో సంబంధం మాట్లాడుకునే సీను సహా.
     
విజయ్ దేవరకొండ తల్లి పాత్రలో శరణ్య
, సమంత నానమ్మ పాత్రలో లక్ష్మి, విజయ్ దేవరకొండ పై ఉద్యోగి పాత్రలో రోహిణీ - ఈ ముగ్గురివీ అర్ధవంతమైన పాత్రలు. వెన్నెల కిషోర్, రాహుల్ రామకృష్ణల కామెడీ ఫర్వాలేదు.
     
మలయాళ సంగీత దర్శకుడు అబ్దుల్ పాటలతో
, నేపథ్య సంగీతంతో ప్రేక్షకుల్ని అలరిస్తే, ఛాయాగ్రహణంతో మురళి సమ్మోహన పరుస్తాడు.
     
దర్శకుడు తండ్రులతో వున్న కాన్ఫ్లిక్ట్ తోనే సెకండాఫ్ నడిపి
, విజయ్- సమంతలు ఏదైతే ప్రూవ్ చేయాలనుకున్నారో, ఆ పాయింటుతో రోమాంటిక్ కామెడీగానే సాగించి వుంటే- పానిండియాకి ఇంకో లెవెల్లో వుండేది.  తెలుగు సినిమా కథల పరిధిలోనే వుంటే అది తెలుగు సినిమాయే. విజయ్ దేవరకొండ ఫస్టాఫ్ లో సమంత కోసం పాకిస్తాన్ కి  వెళ్ళడానికి కూడా సిద్ధ పడతాడు. నిజానికి సమంతని పాకిస్తానీ అమ్మాయిగానే చూపించి, తీరా పాకిస్తాన్లో  ఆమెని హిందూ ఆమ్మాయిగా రివీల్ చేసి వుంటే - ఇది ఇంతవరకూ ఇండియన్ స్క్రీన్ మీద రాని సరికొత్త సీమాంతర ప్రేమ కథ అయ్యేది. పానిండియాకి పాన్ మసాలా అయ్యేది.

—సికిందర్

 


Wednesday, August 30, 2023

1361 : స్క్రీన్ ప్లే సంగతులు!


 

         “The multi level, the conscious and the unconscious, is natural when I write scripts… when I come up with ideas and stories.”

— Bong Joon-Ho


        ‘జైలర్’ స్క్రీన్ ప్లే బిగినింగ్ విభాగం చూస్తే- కుటుంబంతో ముత్తువేల్ సాధారణ జీవితం కనిపిస్తుంది (కథా నేపథ్యం ఏర్పాటు). రిటైరయిన ముత్తువేల్ తో బాటు భార్య, కొడుకు, కోడలు, మనవడు, టాక్సీ డ్రైవర్ ల స్వభావాలతో; కుటుంబంతో, టాక్సీ డ్రైవర్ తో ముత్తు వేల్ సంబంధాలతో సాగుతుంది (పాజిటివ్ పాత్రల పరిచయం). మరోవైపు విగ్రహాల స్మగ్లర్ వర్మ స్వభావం, కార్యకలాపాలు, అతడి అనుచరుడు శీను వ్యవహారం వుంటాయి (నెగెటివ్ పాత్రల పరిచయం). ఇప్పుడు ముత్తువేల్ కొడుకు ఏసీపీ అర్జున్ ఒక విగ్రహం దొంగతనం కేసులో శీనుని దర్యాప్తు చేసే క్రమం ప్రారంభమవుతుంది (సమస్యకి దారి తీసే పరిస్థితుల కల్పన). శీనుని దర్యాప్తు చేస్తున్న అర్జున్ ఉన్నట్టుండి మాయమైపోతాడు (సమస్యకి దారితీసే పరిస్థితుల కల్పనలో తీవ్రత). తర్వాత అర్జున్ చనిపోయాడని తెలుసుకున్న ముత్తువేల్ తో బాటు కుటుంబం విషాదంలో మునిగిపోతారు (సమస్య ఏర్పాటు- ప్లాట్ పాయింట్ వన్).


        పై బిగినింగ్ విభాగం వరకూ చూస్తే, ఇది ముత్తువేల్ సాధారణ జీవితంతో ప్రారంభమై, ఆ సాధారణ జీవితం చెదిరిపోయిన పరిస్థితితో ముగుస్తోంది. సాధారణంగా కథతో వుండే త్రీయాక్ట్స్ స్ట్రక్చర్ నమూనానే ఇది కలిగివుంది. ఇందులో విషయం నడపడానికి తోడ్పడ్డ 4 టూల్స్ ( 1. కథానేపథ్యం ఏర్పాటు, 2. పాత్రల పరిచయం, 3. సమస్యకి దారి తీసే పరిస్థితుల కల్పన, 4. సమస్య ఏర్పాటు ) కూడా త్రీ యాక్ట్స్ స్ట్రక్చర్ కి చెందిన టూల్సే అవడాన్ని గమనించ వచ్చు.  
       
అయితే ఈ స్ట్రక్చర్ లోపల చేసిన కథనమే స్టార్ సినిమాల రెగ్యులర్ కథనంతో విభేదిస్తోంది. ఇదెక్కడ్నుంచి వచ్చింది
? మార్కెట్ యాస్పెక్ట్ నుంచి వచ్చింది. స్టోరీ ఐడియాకి ముందు మార్కెట్ యాస్పెక్ట్ నిర్ణయించుకుంటే, దాన్ని బట్టి క్రియేటివ్ యాస్పెక్ట్ తో తగిన కథనం వస్తుంది. దీని మార్కెట్ యాస్పెక్ట్ ఏమిటి? ఈ సినిమాని రియలిస్టిక్ జానర్ లో మార్కెట్లో నిలబెట్టడం. స్టార్ సినిమాకి రియలిస్టిక్ జానరా? యంగ్ స్టార్ కాదు, వయసు పైబడిన సీనియర్ స్టార్. కబాలి, కాలా, పేట, దర్బార్ లతో రజనీకాంత్ సినిమాలు రియలిస్టిక్ జానర్లోనే వర్కౌట్ అయ్యాయి. జైలర్ ని కూడా అదే రియలిస్టిక్ పాత్రచిత్రణతో వర్కౌట్ అవుతుందని ప్లాన్ చేశారు. కొత్త తరం దర్శకుడు నెల్సన్ దిలీప్ కుమార్ రియస్టిక్ స్కూల్ కి చెందిన వాడే. కాబట్టి రియలిస్టిక్ జానర్ లోనే తీయాలని మార్కెట్ యాస్పెక్ట్ నిర్ణయించి అందుకు తగ్గ క్రియేటివ్ యాస్పెక్ట్ తో కథనం చేశారు. చేసినప్పుడు రజనీకాంత్ పాత్ర చిత్రణకి ప్రేక్షకుల్ని మెప్పించే రెగ్యులర్ రజనీ మార్కు కమర్షియల్ ఎంట్రీ సీను దగ్గర్నుంచి మ్యానరిజమ్స్, పంచ్ డైలాగ్స్, రోమాన్స్, పాటలు, ఫైట్లు వరకూ సమస్తం సినిమా నుంచి తొలగి పోయాయి. ఒక కుటుంబ పెద్ద పాత్రగా అతనుండి పోయాడు.

2. మార్కెట్ యాస్పెక్ట్ ఏది?

అంటే మార్కెట్ యాస్పెక్ట్ ని రజనీతో వర్కౌటయ్యే రియలిస్టిక్ జానర్ గా నిర్ణయిస్తే, ఆ రియలిస్టిక్ జానర్ డిమాండ్ చేసే సహజ పాత్రచిత్రణ కారణంగా క్రియేటివ్ యాస్పెక్ట్ ఏర్పాటయింది. అంటే సహజంగా అన్పించే కథనం. అంటే మార్కెట్ యాస్పెక్ట్ ఈ రియలిస్టిక్ క్రియేటివ్ యాస్పెక్ట్ ని నిర్ణయిస్తే, ఈ రియలిస్టిక్ క్రియేటివ్ యాస్పెక్ట్ తో రియలిస్టిక్ కుటుంబ పెద్ద పాత్ర పుట్టింది. అప్పుడీ రియలిస్టిక్ కుటుంబ పెద్ద పాత్ర రియలిస్టిక్ గానే ప్రవర్తిస్తూ, రియలిస్టిక్ కథనమే చేసుకుపోతోంది. కథ పాత్రది. పాత్ర ఎలా వుంటే అలాటి కథనమే చేసుకుంటుంది. ఇందులో రైటర్ చేతులు పెట్టేదేమీ వుండదు. జానర్ మర్యాద పాత్ర చేతిలో వుంటుంది. రైటర్ కి అర్ధమవాల్సింది పాత్రే. అప్పుడే పాత్ర చేసుకుంటున్న కథనం అర్ధమవుతుంది. ఈ పాత్ర మధ్య తరగతి కుటుంబ పెద్ద పాత్ర. దీని మనస్తత్వం ప్రకారమే కథనం వుంటుంది, రైటర్ మనస్తత్వం ప్రకారం కాదు. ఇదంతా రజనీ నటనని చూస్తే తెలిసిపోతోంది.

రైటర్ దృక్కోణంలో ఈ బిగినింగ్ విభాగంలో విషయం చూస్తే
, ఇది కథకి ఇన్స్ పిరేషన్. దీని తర్వాత ప్రారంభమయ్యే మిడిల్ విభాగంలో విషయం క్రాఫ్ట్. దీని తర్వాత ప్రారంభమయ్యే ఎండ్ విభాగం ఫిలాసఫీ. అంటే బిగినింగ్ లో జరిగింది ఇన్స్ పిరేషన్ గా తీసుకుని, మిడిల్ లో జరిగే కథని చెక్కాలి. మిడిల్ లో చెక్కిన కథతో ఉత్పన్నమయ్యే సారంతో ఎండ్ విభాగంలో ఫిలాసఫీ చెప్పి ముగించాలి.
       
పై బిగినింగ్ విభాగంలో రణానికి పాజిటివ్
, నెగెటివ్ పాత్రల స్థాపన పూర్తయింది.  స్మగ్లర్ వర్మ, అతడి గ్యాంగ్ నెగెటివ్ పాత్రల చర్యల వల్ల కొడుకు చనిపోయాడని తెలుసుకున్న ముత్తువేల్ కుటుంబంతో విషాదంలో మునిగిపోవడంతో సమస్య ఏర్పాటై ప్లాట్ పాయింట్ వన్ ఏర్పడింది. స్ట్రక్చర్ సూత్రాల ప్రకారం ఈ మొదటి మలుపు దగ్గర పాత్రకి గోల్ ఏర్పడి, సమస్యతో సంఘర్షణ ప్రారంభమవుతుంది. అంటే కథ ప్రారంభమవుతుంది. ఈ గోల్ అనే టూల్ లో 4 ఎలిమెంట్స్ వుంటాయి. వీటిని గోల్ ఎలిమెంట్స్ అంటారు. ఇవి 1. కోరిక, 2.పణం, 3. పరిణామాల హెచ్చరిక, 4. భావోద్వేగం.

3. రణ రంగం సిద్ధం

ఇప్పుడు 1. ముత్తువేల్ కోరిక ఏమిటి? కొడుకు మరణానికి ప్రతీకారం తీర్చుకోవడం. 2. దీనికోసం దేన్ని పణంగా పెడుతున్నాడు? కుటుంబ క్షేమాన్ని. 3. ఇందువల్ల మున్ముందు ఏ పరిణామాలు ఎదురవొచ్చు? దీనికోసం బిగినింగ్ విభాగంలో జరిగింది చూడాలి. ముత్తువేల్ కుటుంబాన్ని చూపించారంటే ఆ కుటుంబం నెగెటివ్ పాత్రలతో ప్రమాదంలో పడుతుందని అర్ధం. శివ లో నాగార్జున అన్న కూతురితో అనుబంధాన్ని చూపించారంటే ఆ అన్న కూతురు ప్రమాదంలో పడుతుందని అర్ధం. అంటే సంఘర్షణకి దిగాలని ప్రధాన పాత్ర తీసుకుంటున్న నిర్ణయం ఎలాటి పరిణామాలకి దారితీయవచ్చో తెలిపి ప్రేక్షకుల్లో ఆందోళన, దాంతో భావోద్వేగాలు సృష్టించడం ఈ మూడో ఎలిమెంట్ ఉద్దేశం. ఈ మూడు ఎలిమెంట్స్ కలిసి ముత్తువేల్ పాత్రకి 4వ ఎలిమెంట్ భావోద్వేగాలు ఏర్పడుతున్నాయి.
       
ఇలా మిడిల్ విభాగానికి రణరంగం సిద్ధమైంది. అంటే సినిమా చూస్తున్న ప్రేక్షకుల మానసిక లోకం
, వెండి తెర మీద కథలో ప్రతిబింబిస్తే, ఆ సినిమా బలంగా కనెక్ట్ అవుతుందన్న నియమాన్ని పరిగణనలోకి తీసుకుంటే- ఏమిటా ప్రేక్షకుల (మనుషుల) మానసిక లోకం? కాన్షస్ మైండ్, సబ్ కాన్షస్ మైండ్, మధ్యలో ఇగో. కాన్షస్ మైండ్ ఏ ధర్మాలతో వుంటుందో, వెండితెర మీద బిగినింగ్ విభాగం అలా కన్పించడం. సబ్ కాన్షస్ మైండ్ ఏ ధర్మాలతో వుంటుందో, వెండితెర మీద మిడిల్ విభాగం అలా కన్పించడం. ఇక  ఇగో ప్రధాన పాత్ర. కాన్షస్ మైండ్ తో వుండే ఇగో, సబ్ కాన్షస్ మైండ్ లోకి ప్రవేశించి సమస్యని పరిష్కరించడం. మరి ఎండ్ విభాగం సైకలాజికల్ గా ఏది? సమస్యని పరిష్కరించుకున్న ఇగో, మెచ్యూర్డ్ ఇగోగా మార్పు చెంది మానసికంగా తృప్తి కల్గించడం.

4. గోల్ ఎలా పని చేస్తుంది?

ఇప్పుడు గోల్ ఏర్పాటుకి సంబంధించి ఒక కొత్త అప్డేట్ తీసుకుందాం. ఏదైనా ఒక గోల్ పెట్టుకుని అది సాధించడానికి ప్రయత్నిస్తారు మనుషులు. ఎలా సాధిస్తారు?  సబ్ కాన్షస్ మైండ్ తోడ్పాటు తీసుకుని సాధిస్తారు. సబ్ కాన్షస్ మైండ్ తోడ్పాటు ఎలా తీసుకుంటారు? సబ్ కాన్షస్ మైండ్ ని యాక్టివేట్ చేసి తోడ్పడేలా చేసుకుంటారు. ఎలా యాక్టివేట్ చేస్తారు?
       
ఇక్కడే రెటిక్యులర్ యాక్టివేటింగ్ సిస్టమ్ (ఆర్ ఏ ఎస్) అనే మెదడులో అంగం రంగప్రవేశం చేస్తుంది. జీవితంలో ఒక గోల్ పెట్టుకుని ఆ గోల్ ని సాధించాలని రాత్రింబవళ్ళు కష్టపడితే
, కష్టపడగా కష్టపడగా, ఎన్నాళ్ళకో సాధించవచ్చు. లేదా సాధించక పోవచ్చు. ఎందుకు? ఇది శాస్త్రం తెలీక కష్టపడడం కాబట్టి. ఏదైనా సాధించాలన్న మాటలతో, థాట్స్ తో సబ్ కాన్షస్ మైండ్ యాక్టివేట్ కాదు. దానికి దృశ్యం చూపించాలి. దృశ్య భాషే దానికి బాగా అర్ధమవుతుంది. ఫలానా ఒక జాబ్ కావాలని కోరుకుంటే ఆ జాబ్ లో ఆల్రెడీ చేరిపోయినట్టు, హాయిగా జాబ్ చేస్తున్నట్టు, ఆ ఆఫీసు వాతావరణంతో, కొలీగ్స్ తో, బాస్ తో హేపీగా కలిసి పనిచేస్తున్నట్టూ- డిటెయిల్డ్ గా వూహించుచుకుంటూ, ఆ వూహా రూపానికి మ్యూజిక్, ఇతర సౌండ్స్, ఎమోషన్స్, రంగులు  జోడిస్తే- ఈ సజీవ దృశ్య భాష సబ్ కాన్షస్ మైండ్ కి బాగా అర్ధమై వెంటనే యాక్టివేట్ అయి- అనుకున్న గోల్ నిజం చేసి పెడుతుంది. దృశ్య భాష భారీ సెట్టింగులతో, అవసరమైతే సీజీ ఎఫెక్ట్స్ తో, అట్మాస్ సౌండ్ సిస్టంతో కూడా ఎంత వూహించుకుంటే, అంత ఈజీగా గోల్ ని క్యారీ చేస్తుంది సబ్ కాన్షస్ మైండ్. ఈ దృశ్య భాషని సబ్ కాన్షస్ మైండ్ కి అందించేదే పైన చెప్పుకున్న ఆర్ ఏ ఎస్.  
        
గోల్ గురించిన ఇమేజి ( దృశ్యం) ని పైన చెప్పినట్టు పదేపదే మననం చేసుకుంటూ వుంటే, ఆ ఇమేజిని రెటిక్యులర్ యాక్టివేటింగ్ సిస్టమ్ అందుకుని, సబ్ కాన్షస్ మైండ్ కి బొమ్మ వేసి చూపిస్తుంది. ఈ ప్రకృతి ఏర్పాటు స్క్రీన్ ప్లే విషయానికొస్తే, ప్లాట్ పాయింట్ వన్ తో బిగినింగ్ ముగించుకుని, గోల్ తో మిడిల్ కి వెళ్తున్న క్యారక్టర్, గోల్ ని విజువలైజ్ చేసుకుని సంఘర్షణకి దిగితే, ఆ పోరాటం కరెక్టుగా వుంటుంది. పాత్ర మిడిల్ కి వెళ్ళడమంటే సబ్ కాన్షస్ మైండ్ లోకి ప్రవేశించడమే.
        
ఇప్పుడు ముత్తువేల్ గోల్ ని విజువలైజ్ చేసుకుని మిడిల్ పోరాటం ఎలా మొదలెట్టాడో, సబ్ కాన్షస్ మైండ్ ఎలా సహకరించిందో మిడిల్ విభాగంలో చూద్దాం.
(ఇంకా వుంది)
—సికిందర్


Tuesday, August 29, 2023

1360 : థియేటర్ న్యూస్!

 సాయంత్రం : జైలర్ స్క్రీన్ ప్లే సంగతులు!


     సినిమా ప్రకటనలు నిర్మాతలు విడుదల చేస్తారు. అవి చూసి ప్రేక్షకులు థియేటర్లకి వెళ్ళి సినిమా చూస్తారు. ఇది ఎక్కడైనా అమలయ్యే విధానం. కానీ సినిమా థియేటరే సినిమాలకి రారండని ప్రేక్షకులకి గుర్తు చేసే ప్రకటనలు విడుదల చేస్తే? ఈ అవసరం ఎందుకొస్తుంది? ప్రేక్షకులు మరీ బొత్తిగా సినిమాలు చూడాలన్న ధ్యాసే లేకుండా ఇంకేవో పార్టీలు పబ్బాలు, పిక్నిక్ లు, షాపింగులు, ఎంజాయ్ మెంట్లలో మునిగి తేలిపోతూంటే థియేటర్లు ఏమైపోవాలి? అందుకని నిర్మాతలతో సమానంగా థియేటర్ల యజమానులు కూడా ప్రకటనలివ్వడం అమెరికాల్లో జరుగుతోంది. అమెరికాలో 450 థియేటర్లతో నడిచే ప్రసిద్ధ రీగల్ సినిమాస్ గ్రూపు ఈ పనే చేసి మూడు యాడ్స్ విడుదల చేసింది. ఈ స్పూఫ్ వీడియోలతో ప్రేక్షకుల్ని తన థియేటర్లకి పరుగులు పెట్టేలా చేస్తోంది.

        టీటీలు, వీకెండ్ పార్టీలు, ఎంటర్ టైంమెంట్ పార్కులు... ఇలా వినోద సాధనాలు పెరిగిపోవడంతో థియేటర్ల మనుగడ కోసం కొత్త కొత్త చిట్కాలు ప్రయోగించక తప్పడం లేదు. మూడు ఫోమో వీడియోలతో ఈ ప్రచార కార్యక్రమం ఛేపట్టింది రీగల్ గ్రూపు. చికాగోకి చెందిన క్రియేటివ్ ఏజెన్సీ క్వాలిటీ మీట్స్ ఈ ఫోమో వీడియోల్ని విడుదల చేసింది. ఫోమో అంటే ఫియర్ ఆఫ్ మిస్సింగ్ ఔట్. అందరినీ ఆకర్షిస్తున్న ముఖ్యమైన ఈవెంట్ ని మిస్ అవుతున్నామనే భావోద్వేగ ప్రతిస్పందనని జనాల్లో రేకెత్తించడం. పార్టీల్లోనో, ఇంకెందులోనో మునిగి తేలుతున్నప్పుడు హఠాత్తుగా టీవీలో ఫోమో యాడ్ వస్తే, అది చూసి ఆ ఈవెంట్ వైపు పరుగెత్తేలా చేస్తాయి ఈ ఫోమో యాడ్స్.
       
రీగల్ గ్రూపు
పూల్, బీబీక్యూ, ఐస్-క్రీం అనే మూడు ఫోమో స్ఫూఫ్ యాడ్స్ ని విడుదల చేసింది. ఇవి 1973 నాటి హార్రర్ క్లాసిక్ ది ఎక్సార్సిస్ట్  నుంచి తీసుకుని చేసిన ఫన్నీ హార్రర్ సీనుతో ఒకటి చేసింది. ఏదో కార్యక్రమంలో వున్న ప్రేక్షకులు బుర్ర గోక్కుని థియేటర్స్ కి వెళ్ళేలా  చేసేంత హాస్యాస్పదంగా ఈ స్ఫూఫ్స్ వున్నాయి. పాత్రలు ఇవి చూస్తున్న స్పాట్స్ లోని వ్యక్తులకి సినిమా చూడడం కూడా ఓ ముఖ్యమైన దినచర్య అని గుర్తు చేస్తున్నాయి. ఈ నెలలోనే ఈ ప్రచార కార్యక్రమం మొదలెట్టింది. టీవీల్లోనే గాక సోషల్ మీడియాలోనూ ఈ యాడ్స్ ని గుప్పిస్తూ ప్రేక్షకుల్ని రాబట్టుకుంటోంది రీగల్ గ్రూపు.
       
అసలు కోవిడ్ మహమ్మారి దెబ్బకి అప్పుల్లో కూరుకుపోయి దివాలా ప్రకటించిన రీగల్ గ్రూపు జులై చివరి వారంలో
ఒపెన్ హైమర్, బార్బీ సినిమాలు రెండిటి సూపర్ సక్సెస్ తో బయటపడింది. బయటపడడంతో ఆగకుండా ప్రేక్షకుల్ని తన థియేటర్లకి తరిలించుకు పోవడానికి పెద్ద యెత్తున ఫోమో యాడ్స్ గుప్పించింది. గత సెప్టెంబర్ లో దివాలా ప్రకటించినప్పుడు బిలియన్ల కొద్దీ అప్పులున్నాయి. అదిప్పుడు 4.53 బిలియన్‌ డాలర్ల మేర తగ్గించుకున్నామని ప్రకటించింది. కొత్త ఈక్విటీ మూలధనంలో 800 మిలియన్‌ డాలర్లు సేకరించామని, 1.71 బిలియన్‌ డాలర్ల డెట్‌ ఫైనాన్సింగ్‌ ని పొందామనీ గ్రూపు ఛైర్మన్ ఎరిక్ ఫాస్ పేరుతో ఒక ప్రకటన వెలువడింది.
       
కోవిడ్
మహమ్మారి సమయంలో గ్రూపు చాలా థియేటర్లని మూసి వేయవలసి వచ్చింది. దీంతో 2020, 2021 లలో 3.3 బిలియన్ డాలర్లకి పైగా నష్టాల్ని చవిచూసింది. ఇప్పటికీ యునైటెడ్ స్టేట్స్ లో 51 థియేటర్లు మూసివేసే వున్నాయి.
       
రీగల్ సినిమాస్ గ్రూపు
సినిమాలని త్రీడీలో చూపించే రియల్ త్రీడీ కంపెనీలో భాగ స్వామి. రీగల్ ప్రీమియం థియేటర్స్ లో పెద్ద ఫార్మాట్ లో, డాల్బీ అట్మాస్ సౌండ్, బట్‌ కిక్కర్ మోషన్ సీట్లు, ఉన్నతీ కరించిన  స్క్రీన్‌పై 4కే లేజర్ ప్రొజెక్షన్‌ ని అందిస్తోంది. ఇవిగాక మొత్తం అమెరికాలో 94 ఐమాక్స్ థియేటర్లని నిర్వహిస్తోంది. 4డీ ఎక్స్ : సీజీవీ పేరుతో 4 డీ ఎక్స్ చోదిత మెరుగైన సీట్లతో గల థియేటర్స్ ని నిర్వహిస్తోంది. ఇందులో గాలి, స్ట్రోబ్ లైట్లు, నీరు, పేలుళ్ళు, లెగ్ టిక్లర్‌లు, వైబ్రేషన్‌లు, వర్షపు తుఫాను, పొగ, సువాసన వంటి ఎఫెక్ట్స్ తో ప్రేక్షకుల్ని ఉక్కిరిబిక్కిరి చేస్తోంది. ఇలాటి థియేటర్లు 32 వున్నాయి.
       
ఇక స్క్రీన్ ఎక్స్ పేరుతో
 270-డిగ్రీల వీక్షణ కోసం గోడల మీద రెండు అదనపు స్క్రీన్‌లతో సినిమాల్ని ప్రదర్శిస్తోంది. 2021 నాటికి ఈ థియేటటర్లు 34 వున్నాయి. ఫోమో యాడ్ ని ఈ క్రింది లింక్ ని క్లిక్ చేసి చూడొచ్చు.

—సికిందర్

ఫోమో యాడ్