రివ్యూలు, సాంకేతికాలు, స్క్రీన్ ప్లే సంగతులు...

టికెట్లు దొరకడం యోగం, సినిమాలు చూడడం భోగం, రివ్యూలు రాయడం రోగం!

Sunday, September 17, 2023

1365 : రివ్యూ!


రచన -దర్శకత్వం : సతీష్ వర్మ
తారాగణం : కార్తీక్ రత్నం, గోల్డీనిస్సీ, సత్య, రవిబాబు, అజయ్ తదితరులు
సంగీతం : కృష్ణ సౌరభ్, ఛాయాగ్రహణం : సుందర్ ఎస్సీ
బ్యానర్ : ఆర్టీ టీం వర్క్స్, ఫ్రేమ్ బై ఫ్రేమ్ పిక్చర్స్
నిర్మాత : రవితేజ
విడుదల : సెప్టెంబర్ 15, 2023
***
        మాస్ మహారాజా రవితేజ సొంత బ్యానర్ స్థాపించి నిర్మించిన రావణాసుర’, గట్ట కుస్తీ సత్ఫలితాలనివ్వలేదు. తిరిగి మూడో సినిమాగా కొత్త దర్శకుడికి అవకాశం కల్పిస్తూ నిర్మించిన ఛాంగురే బంగారు రాజా ఈ వారం విడుదలైంది. చాలా మంది హీరోలు సొంత బ్యానర్లు ప్రారంభించి కొత్త వారికి అవకాశాలు కల్పిస్తున్నారు. వీటితో చాలా కొందరు మాత్రమే సక్సెస్ అవుతున్నారు. ఇంకా నేర్చుకోవాల్సిన దశలో దర్శకులుగా మారిపోవడం వల్ల ఈ పరిస్థితి తప్పడం లేదు. ప్రస్తుతం సతీష్ వర్మ అనే కొత్త దర్శకుడు పరిచయ
మవుతూ మర్డర్ మిస్టరీ తీశాడు. కేరాఫ్ కంచరపాలెం నటుడు కార్తీక్ రత్నం హీరోగా నటించాడు. ఈ మర్డర్ మిస్టరీని కామెడీ ప్రధానంగా తీసి ఆకట్టుకునే ప్రయత్నం చేశారు క్రైమ్, కామెడీ రెండూ ఎక్కువ టాలెంట్ ని కోరుకునే జానర్లు. మరి ఈ కొత్త దర్శకుడు ఇందులో ఏమాత్రం ప్రతిభా నిరూపించుకోగలిగాడో చూద్దాం...

కథ

ఓ గ్రామంలో రాజు (కార్తీక్ రత్నం) అనే బైక్ మెకానిక్ వుంటాడు. అతడికి కోపం ఎక్కువ. దీంతో తెలియకుండానే శత్రువుల్ని పోగేసుకుంటాడు. ఆ గ్రామంలో వర్షాలు రంగురాళ్ళు బయటపడతాయి. వాటిని సొంతం చేసుకోవడానికి పోటీ పడతారు గ్రామస్థులు. అలా ఒక రోజు రంగురాళ్ళ దగ్గర సోమి నాయుడు (రాజ్ తిరందాసు) అనే అతడితో ఘర్షణ పడతాడు రాజు. ఆ తర్వాత సోమినాయుడు శవమై కనిపిస్తాడు. దీంతో రాజు అనుమానితుడుగా కేసులో ఇరుక్కుంటాడు. ఇక చేయని హత్యలో ఇరుక్కున రాజు నిర్దోషిగా ఎలా నిరూపించుకున్నాడన్నది మిగతా కథ.

ఎలావుంది కథ

మర్డర్ మిస్టరీ జానర్ గురించి పెద్దగా అవగాహన లేకుండా తీసినట్టుందీ సినిమా. హంతకుడెవరు? అని చివరిదాకా కథని లాగి, చిట్ట చివర్లో  హంతకుడ్ని చూపించే బాపతు ఎండ్ సస్పెన్స్ కథలు 40 ఏళ్ళ క్రితమే నవలలకి తప్ప, సినిమాలకి పనికి రావని మర్డర్ మిస్టరీలకి హాలీవుడ్ గుడ్ బై చెప్పేసింది. చివరి దాకా ప్రేక్షకుల సహనాన్ని పరీక్షించకుండా, హంతకుడెవరో చూపించేసి, వాడెలా పట్టుబడతాడన్న యాక్షన్ తో, సీన్ టు సీన్ సస్పెన్స్ కథల్ని సృష్టించి హాలీవుడ్ సినిమాలు తీస్తోంది. ఈ విషయం తెలీక ఇప్పటికీ తెలుగులో ఎండ్ సస్పెన్స్ మర్డర్ మిస్టరీలు తీసి అట్టర్ ఫ్లాప్ చేసుకుంటున్నారు. అందులో ఇది మరొకటి.
       
కొత్త దర్శకుడి చేతిలో ఈ మిస్టరీ వర్కౌట్ కానట్టే
, కామెడీ కూడా పని చేయలేదు. ఈ రెండు ప్రక్రియల్లో ప్రవేశం లేకపోయినా, కథ చెప్పడానికి రోషోమన్ ఎఫెక్ట్ అంతటి కళా ప్రక్రియకి సాహసించడం ఇంకో బడాయి. అంటే, జరిగిన హత్య గురించి వివిధ సాక్షులు వాళ్ళ  దృక్కోణంలో ఇచ్చే వాంగ్మూలాలతో కథ. హీరోతో బాటు, రవిబాబు, సత్యల పాత్రలు ఒకరి తర్వాత ఒకరు తాము చూసింది, తమకు తెలిసిందీ చెప్పుకురావడం. ఇలా అదే హత్యా సంఘటనని  వివిధ వెర్షన్లుగా మార్చి చూపించడం. 1950 లనాటి ఈ టెక్నిక్ ఎప్పుడో కాలదోషం పట్టి థ్రిల్ చేయడం మానేసింది.
       
ఇంకో  ఘోరమైన తప్పిదం ఏమిటంటే
, ఈ మూడు వెర్షన్లని మూడు చాప్టర్లు గా చెప్పి, ఈ మూడు చాప్టర్లలో గాకుండా, చివర్లోనే కథ వుంటుందని ముందే చెప్పేసి సినిమా ప్రారంభించడం! నిజమే, మర్డర్ మిస్టరీలో సస్పెన్స్ అంతా ఎండ్ లోనే వీడుతుంది. ఇదే చెప్పేశాడు. చెప్పేశాక మూడు చాప్టర్లు తీయడమెందుకు బడ్జెట్ దండగ? చివరి ముక్క తీసుకుని షార్ట్ ఫిలిమ్ తీస్తే సరిపోయే దానికి? మాస్ మహారాజానీ ఇంత బురిడీ కొట్టించాలా? ఆ మూడు చాప్టర్లలో కూడా వున్నడెం వున్నదేం లేదు, చూపించిందే చూపించడం!
       
విషయం ఇలా వున్నాక, ఇక ఎవరెలా నటించారు, పాటలెలా వున్నాయి, ప్రొడక్షన్ విలువలెలా వున్నాయి తెలుసుకోవాలన్పిస్తోందా
? రవితేజ సొంత బ్యానర్లో టీం వర్క్ ని సీరియస్ గా తీసుకోకపోతే, ఈ మూడో ఫ్లాప్ తర్వాత నాల్గోది కూడా డీఫాల్టుగా సిద్ధమవుతుంది.
—సికిందర్