రివ్యూలు, సాంకేతికాలు, స్క్రీన్ ప్లే సంగతులు...

టికెట్లు దొరకడం యోగం, సినిమాలు చూడడం భోగం, రివ్యూలు రాయడం రోగం!

8, అక్టోబర్ 2022, శనివారం

1227 : రివ్యూ!


 రచన - దర్శకత్వం : ప్రవీణ్ సత్తారు

తారాగణం : నాగార్జున, సోనల్ చౌహాన్, గుల్ పనాగ్, అనైకా, రవివర్మ తదితరులు
సంగీతం : మార్క్ రాబిన్, ఛాయాగ్రహణం : ముఖేష్
బ్యానర్స్ :  శ్రీ వేంకటేశ్వర సినిమాస్, నార్త్ స్టార్ ఎంటర్ టైన్మెంట్
నిర్మాతలు : సునీల్ నారంగ్, పుష్కర్ రామ్ మోహన్ రావు, శరత్ మరార్
విడుదల :  అక్టోబర్ 5, 2022
***
        చాలా కాలం నిర్మాణంలో వున్న నాగార్జున అక్కినేని నటించిన ది ఘోస్ట్ దసరాకి విడుదలైంది. రాజశేఖర్ తో గరుడ వేగ అనే హిట్ తీసిన ప్రవీణ్ సత్తారు నుంచి మరో యాక్షన్ మూవీ ఇది. ఈ మూవీ కోసం నాగార్జున క్రవ్ మగా, కటానా అనే కత్తి పోరాటాలు నేర్చుకున్నట్టు ప్రచారం చేశారు. హీరోయిన్లు మారిపోతూ చివరికి సోనల్ చౌహాన్ ని తెరపైకి తీసుకొచ్చారు. ఇంకో పాత్రలో ప్రముఖ బాలీవుడ్ నటి గుల్ పనాగ్ ని తెలుగులోకి తీసుకొచ్చారు. ఇంకా చాలా ఆకర్షణీయమైన అంశాలున్నాయి. అయితే సినిమా అంటే కేవలం ఆకర్షణీయమైన అంశాలేనా, ఇంకేమైనా వుండాలా? ఏముండాలి? ఇది తెలుసుకుందాం.

కథ

విక్రమ్ (నాగార్జున) ప్రేమిస్తున్న ప్రియ (సోనల్ చౌహాన్) తో కలిసి దుబాయ్ లో ఇంటర్ పోల్ అధికారిగా పని చేస్తూంటాడు. క్రిమినల్స్ మీద చేపట్టిన ఒక ఆపరేషన్ లో ఒక చిన్న పిల్లాడు చనిపోవడంతో విచారంలో మునిగిపోతాడు. మానసికంగా దెబ్బ తిన్న అతడ్ని చూసి ప్రియ దూరమవుతుంది. ఇంతలో ఇరవై ఏళ్ళక్రితం దూరమైన చెల్లెలు అనుపమ (గుల్ పనాగ్) నుంచి విక్రమ్ కి కాల్ వస్తుంది. తననీ తన కూతురు అదితి (అనైక) నీ కాపాడమని వేడుకుంటుంది. దాంతో విక్రమ్ ఊటీకి బయల్దేరతాడు. ఇక చెల్లెల్ని, ఆమె కూతుర్నీ కాపాడడంలో అతడికి ఎదురైన ప్రమాదాలేమిటి, చెల్లెలికి ఎవరు ఎందుకు హాని తలపెడుతున్నారు, అసలు అన్నా చెల్లెళ్ళ కథేమిటన్నది మిగతా కథ.

ఎలావుంది కథ

యాక్షన్ జానర్ కథ. అయితే కథ లేదు. ఆకర్షణీయమైన అంశాలు చాలా వున్నాయి గానీ, కథ కూడా వుండాలని మనస్ఫూర్తిగా నమ్మ లేదు. అందుకని కథ లేని యాక్షన్ సీన్సే వున్నాయి. అసలే చెల్లెల్ని కాపాడే సిస్టర్ సెంటిమెంటు అరిగిపోయిన పురాతన పాయింటు అయితే, ఈ అరిగిపోయిన పురాతన పాయింటుతో కథెందుకు అనుకున్నట్టు దర్శకుడు ప్రవీణ్ సత్తారు కథ వదిలేసి యాక్షన్ సీన్లు జోడించుకుంటూ పోయాడు. బాక్సాఫీసులో బుకింగ్ క్లర్కు నోట్లు జోడించక పోయినా డోంట్ కేర్ అనుకున్నట్టుంది. చెల్లెలి కుటుంబాన్ని కాపాడే మెయిన్ స్టోరీని, ప్రేమించిన ప్రియకి దూరమైన సబ్ ప్లాట్ నీ ఫ్లాప్ కి తాకట్టు పెట్టేసి, శత్రువులు వర్సెస్ నాగార్జున అన్నట్టుగా వాళ్ళు ఎడతెరిపి లేకుండా కొట్టుకునే ...కొట్టుకునే...నరుక్కునే...నరుక్కునే అద్భుత దృశ్యాలతో రూపకల్పన చేశాడు. కొట్టుకుంటే కోటి ఇస్తామన్నట్టుంది నిర్మాతలు. ఎన్ని సార్లు కొట్టుకుంటే అన్నీ కోట్లు! సినిమా ఇలా కూడా వుంటుందని కొత్త విధానం చెప్పే ఆభినందనీయ ప్రయత్నం ఆహ్లాదకరంగా చేశాడు.

చిన్నప్పుడు చెల్లెలితో నాగార్జున ఫ్లాష్ బ్యాక్ కూడా  భావోద్వేగాలుంటే అది మనుషుల లక్షణం కాదనుకుని, మట్టి బొమ్మలుగా చేసి ప్రదర్శించాడు. యాక్షన్ సీన్స్ లో ఎమోషన్స్ వుండడానికి వీల్లేదని తీర్మానించాడు. గుంటూరు టాకీస్ వంటి రియలిస్టిక్ ఎమోషనల్ హిట్ తీసిన ప్రవీణ్ సత్తారులో ప్రావీణ్యం ఇలా జీరో ఐందేమిటని ఆశ్చర్యపోవాల్సిందిగా ఆజ్ఞాపించాడు. 2017 లో గరుడ వేగ అనే టెర్రరిజం సినిమా తీసినప్పుడు ప్రావీణ్యం ట్రాకులోనే వుందికదా అని పోల్చడం తెలివి తక్కువ తనమని ఆగ్రహించాడు.

ఇలా ది ఘోస్ట్ ప్రేక్షకుల పాలిట భూతమైపోయింది. యాక్షన్ సీన్స్ కి కూడా అయిడియాలు కొరవడినట్టు కేజీఎఫ్ నుంచి, కమల్ హాసన్ విక్రమ్ నుంచీ కాపీ కొట్టినట్టు వుండడం ఇంకా అన్యాయం. చెల్లెలి కుటుంబాన్ని కాపాడడమనే ఏదో ఒక లైను పెట్టుకుని, దానికైనా కథ లేకుండా స్టయిలిష్ యాక్షన్ సీన్స్ సిరీస్ గా సినిమా తీసేస్తే ప్రేక్షకులు భరించగలరను కోవడం పొరపాటు. సుదీర్ఘ కాలం సినిమా నిర్మాణంలో వుందంటేనే విషయంతో  ఏదో ప్రాబ్లం వున్నట్టు అర్ధం జేసుకోవాలి.

నటనలు – సాంకేతికాలు

నాగార్జున స్టయిలిష్ లుక్ తో డీసెంట్ గా వున్నాడు. యాక్షన్ సినిమాలు తనకి కొత్త కాదు. అరవై దాటిన వయసులో ఈ యాక్షన్ తో సత్తా చాటాడు. మరీ చేయలేని విన్యాసాలు చేయకుండా వయసు అనుమతించిన మేరకు ఓకే అనిపించాడు. అయితే పోరాటాలతో బాటు కాస్త పాత్ర, దాంతో కథ, పోరాటాలకి దిగడానికి బలమైన నేపథ్యం, ఆ నేపథ్యంలోంచి భావోద్వాగాలూ లేకపోవడంతో తన స్టార్ స్టేటస్ సినిమాని కాపాడలేకపోయింది. గత యాక్షన్ మూవీ వైల్డ్ డాగ్ లాగే ఇది కూడా తనకి ఐరన్ లెగ్ సినిమా. తల్వార్లు, తుపాకులు, బాంబులు వీటితోనే తను నటిస్తే, వీటిని పరీక్షిస్తున్నట్టు అన్పిస్తే, అది డెమో అవుతుందేమో గానీ మూవీ కాదు.

హీరోయిన్ సోనల్ చౌహాన్ గ్లామర్ ప్రదర్శన, ఓ యాక్షన్ సీనులో విజృంభణ వరకే పరిమితం. గుల్ పనాగ్ సిస్టర్ సెంటిమెంటుతో వుంటే, ఆమె ఎదిగిన కూతురుగా, దుర్వ్యసనాల బారిని పడ్డ ధనిక అమ్మాయిగా అనైకా నటించింది. చాలా మైనస్ ఎవరంటే విలన్. ఇన్నేసి యాక్షన్ సీన్స్ కి తెరతీస్తున్న దుష్టుడు దుష్టుడులాగా లేకుండా దిష్టి బొమ్మలాగా వుండడం ప్రవీణ్ సత్తారు ప్రావీణ్యానికి ఇంకో మచ్చు తునక.

ప్రొడక్షన్ విలువలు మాత్రం బ్రహ్మాండంగా వున్నాయి. ముఖేష్ కెమెరా, మార్క్ రాబిన్ సంగీతం, లవ్ సాంగ్ తో బాటు పార్టీ సాంగ్ చిత్రీకరణా ఆసక్తికరంగా వున్నాయి. ఇలా ఎంతో ఆసక్తిరేపుతూ వార్తల్లో వుంటూ వచ్చిన నాగ్ -సత్తారు కాంబినేషన్లో ది ఘోస్ట్ ఇంత వేస్టయిపోవడం సమస్యేం కాదు- ఓటీటీ వుందిగా!  

—సికిందర్

1226 : స్పెషల్ ఆర్టికల్


    సెప్టెంబర్ లో నిర్వహించిన జాతీయ సినిమా దినోత్సవానికి లభించిన ప్రతిస్పందనని  చూసి మరో మూడు రోజులు పండుగని పొడిగించాయి మల్టీప్లెక్స్ కంపెనీలు. కొత్త సినిమాల విడుదలల సాకు చూపించి తెలుగు రాష్ట్రాల్లో పండుగ నిర్వహించలేదు. ఇతర రాష్ట్రాల్లో 75 రూపాయల టికెట్ కి 90 శాతం ఆక్యుపెన్సీతో మల్టీప్లెక్సులు కళకళ లాడడం చూసి కళ్ళు తెరిచారు. ఇటీవల ప్రేక్షకులు సినిమాలకి దూరమవడానికి కారణం భారీగా పెంచిన టికెట్ రేట్లు అని గ్రహించారు. చౌక వినోద సాధనమైన సినిమాని ఖరీదైన విలాస వస్తువుగా మార్చడంతో ప్రేక్షకులు తగ్గిపోయారని తెలుసుకున్నారు. టికెట్ ధరలతో బాటు తినుబండారాల ఖర్చు ఫైఫ్ స్టార్ లెవెల్లో వుండడంతో సామాన్యులు సినిమాలకి దూరమైపోయారు.

హైదరాబాద్ లో ఉప్పల్ఎల్బీ నగర్మేడ్చల్ వంటి శివారు ప్రాంతాల్లో మల్టీ ప్లెక్స్ టికెట్ ధర మూడేళ్ళ క్రితం 100 రూపాయలుండేది. దీంతో సింగిల్ స్క్రీన్ థియేటర్లకి వెళ్ళే సగటు ప్రేక్షకులు మల్టీప్లెక్సుల వైపు మరలారు. ఇంతలో ప్రభుత్వం మల్టీప్లెక్సుల్లో పార్కింగ్ ఫీజు ఎత్తేయడంతోపార్కింగ్ ఫీజుల నష్టాల్ని పూడ్చుకోవడానికా అన్నట్టు టికెట్ ధరలు 150 కి పెంచేశారు. పార్కింగ్ ఫీజులున్నప్పుడు బైక్ కి 20కారుకి 30 రూపాయలుండేది. పార్కింగ్ ఫీజు ఎత్తేయడంతో టికెట్ ధర 150 చేశారు. దీంతో 2030 రూపాయలు నష్టం  ప్రేక్షలకే తప్పమల్టీప్లెక్సులకి టికెట్టు మీద 2030 రూపాయలు అదనపు లాభమే. పార్కింగ్ ఫీజులు ఎత్తేస్తూ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం మల్టీప్లెక్సులకే అదనపు ఆదాయంగా మారింది! అయినా సగటు ప్రేక్షకులు భరించారు.

 

        ఇక కోవిడ్ తర్వాత టికెట్ ధర 200 కి పెంచేశారు. ఆన్ లైన్ బుక్కింగ్ చేసుకుంటే 30 రూపాయలు అదనం. కోవిడ్ దెబ్బతో కోట్లాది కుటుంబాలు ఆర్ధికంగా  ఛిన్నాభిన్నమవగాకోట్లమంది మధ్యతరగతి జీవులు దారిద్ర్య రేఖకి దిగువకు జారిపోగాసినిమా టికెట్ల రేట్లు పెంచడం తెలివి తక్కువ నిర్ణయమే. పైగా పెద్ద సినిమాలు విడుదలైతే 300400 రూపాయలు వసూలు చేయడం దోపిడీయే. తినుబండారాలు కూడా 30గ్రా పాప్ కార్న్ 100 రూపాయలు70 గ్రా పాప్ కార్న్ 200 రూపాయలు! టీ కాఫీలు 40 రూపాయలు! ఇదంతా కోవిడ్ కాలంలో మల్టీప్లెక్సులు మూతబడి భారీ నష్టాలు చవి చూసినందుకని కారణం చెప్పారు. మరి కోవిడ్ కాలంలో చితికిపోయిన ప్రజల నష్టాలు  ఎవరు తీరుస్తారు. తమ నష్టాల్ని ప్రజలు తామే భరించినట్టుమల్టీప్లెక్సులు వాటి నష్టాల్ని అవే భరించాలి. ఎవరి నష్టాల్ని వారే జీర్ణం చేసుకోవాలి తప్ప ఇంకొకరి ద్వారా పూడ్చుకోవాలని చూస్తే అసలుకే ఎసరురే వస్తుంది.

 

        ఇదే జరిగింది. మల్టీప్లెక్సుల నష్టాల్ని పూడ్చడానికి ప్రేక్షకులు ససేమిరా అని సినిమాలకి డుమ్మా కొట్టడం ప్రారంభించారు. మల్టీప్లెక్సుల అంచనాలు తలకిందులయ్యాయి. ఒక గ్రూపు కంపెనీ ఇంకో గ్రూపుకి మల్టీప్లెక్సులు అమ్మేసి చేతులు దులుపుకుంది. సినిమాలు ఫ్లాపవడానికి రకరకాల కారణాలు వూహించారు. వాటిలో ఓటీటీలు ఒకటి. ఓటీటీలతో నిర్మాతలు లాభపడుతున్నారుమల్టీప్లెక్సులకి నష్టాలే. అమెరికాలో కోవిడ్ కాలంలో దూరమైన ప్రేక్షకుల్ని తిరిగి రప్పించడానికి 3 డాలర్ల టికెట్టుతో జాతీయ సినిమా దినోత్సవం నిర్వహించారు. ఇది బ్రహ్మాండంగా విజయవంతమైంది. ఇది చూసి ఇండియాలో నిర్వహించారు. ఇక్కడ కూడా విజయవంతమైంది. దీన్ని మూడు రోజులు పొడిగించి చూశారు. ప్రేక్షకులు తగ్గలేదు.

 

        దీంతో వ్యాపారం అర్ధమైంది. ప్రేక్షకులు సినిమాలకి దూరమవడానికి ఓటీటీలు పూర్తి కారణం కాదనీపెంచేసిన టికెట్ల ధరలేననీ జ్ఞానోదయమైంది. సినిమా పండగ రోజు హిందీలో ‘చుప్ - రివెంజ్ ఆఫ్ ది ఆర్టిస్ట్’ నిర్మాతలు వెనుకాడకుండా 75 రూపాయల టికెట్ ధరకే సినిమా విడుదల చేశారు. 90 శాతం ఆక్యుపెన్సీ తో ఆటలు కళకళ లాడాయి. దీన్ని మూడు రోజులు పొడిగించారు. ఇంకా బాగా ప్రేక్షకులొచ్చారు. అంటే చిన్న సినిమాలకి ప్రేక్షకులు దూరమయ్యారనే అభిప్రాయం కూడా తప్పని రుజువయ్యింది.  ఇదే ‘చుప్’ కి 200300 రెగ్యులర్ టికెట్ రేట్లు వసూలు చేస్తే అన్ని చిన్న సినిమాలకి లాగే ఇదీ మల్టీప్లెక్సుల రెంట్లు కట్టుకుని వెనక్కి వచ్చేది.

 

           సినిమా పండుగ జరిగే సెప్టెంబర్ 23 వ తేదీన తెలుగులో అల్లూరికృష్ణ వ్రింద విహారి (ఇదొక వికృత టైటిల్)దొంగలున్నారు జాగ్రత్త అని మీడియంచిన్న సినిమాలు విడుదలయ్యాయి. అందుకని తెలుగు రాష్ట్రాల్లో 75 రూపాయల సినిమా పండుగని రద్దు చేశారు. రద్దు చేసి లాభపడిందేమీ లేదు.  75 రూపాయల టికెట్ కే ఈ మూడు సినిమాలు చూపించి వుంటే మీడియంచిన్న సినిమాలకి 200 రూపాయల టికెట్ కారణంగా  దూరమైన ప్రేక్షకుల స్పందన వేరేగా వుండేదేమో- ‘చుప్’ కి లాగా!

 

        ఇక కనీసం తెలుగులో చిన్నమధ్య తరహా  సినిమాల  నిర్మాతలు పునరాలోచించు కోవాలేమో. ప్రేక్షకులకి సినిమా అంటే 100 రూపాయల వస్తువే. సగటు ప్రేక్షకులకి సైతం. మల్టీప్లెక్స్ కంపెనీలు ఈ కోవలోనే ఇప్పుడు ఆలోచిస్తున్నాయి. దీనికో ఎజెండా రూపొందిస్తున్నారు. చిన్నమధ్య తరహా బడ్జెట్ సినిమాలకి వేరియబుల్ ధర వుంటుంది. ఈవినింగ్నైట్ షోలుఅలాగే వారాంతాల్లో ఉద్యోగాలు చేసే యువ ప్రేక్షకులు ఎక్కువగా వుంటున్నారు. వీరిని వీలైనన్ని ఎక్కువ సార్లు రప్పించేందుకు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు. ఎక్కువగా విడుదలయ్యే చిన్నమధ్య తరహా సినిమాల టికెట్ల ధర్ల 100 రూపాయలు నిర్ణయించితినుబండారాల ధరలూ బాగా తగ్గించాలని ఆలోచిస్తున్నారు. ఈ చర్యలు  రాబోయే నెలల్లో విడుదలయ్యే మధ్య స్థాయి హిందీ సినిమాలని దృష్టిలో పెట్టుకుని తీసుకుంటున్నారు.


‘బ్రహ్మాస్త్రా
’,  ‘చుప్: రివెంజ్ ఆఫ్ ది ఆర్టిస్ట్’ లకి ప్రయోగాత్మకంగా గత వారం 100 రూపాయల టిక్కెట్‌లని  విక్రయించారు. స్పందన బావుంది. నవంబర్‌లో షెడ్యూల్ చేసిన అజయ్ దేవగన్ ‘దృశ్యం 2’ కి 50 శాతం తగ్గింపుని ఆఫర్ చేస్తున్నారు. అమితాబ్ బచ్చన్ నటించిన ‘గుడ్‌బై’  ప్రారంభ రోజున ₹150 లకే టికెట్స్ ని అందించారు. మరి కొంత సమయం తీసుకునిటిక్కెట్ ధరలు తగ్గిస్తే థియేటర్లకి  వచ్చే ప్రేక్షకుల ఫ్రీక్వెన్సీ నిజంగా పెరుగుతుందో లేదో విశ్లేషిస్తారు. టిక్కెట్ రేట్లు చాలా తక్కువగా వుంటే పెట్టుబడిని తిరిగి పొందలేని భారీ-బడ్జెట్ చిత్రాలకి సాధ్యం కాదు. అయితే అక్టోబర్‌లో విడుదలయ్యే చిన్న తరహా సినిమాలకి నిర్మాతలు ప్రయోజనమే పొందుతారు.

 

        ఒకే ప్రాపర్టీ ఒకే సమయంలో ప్రీమియంతో బాటు  తక్కువ ధర టికెట్లని  అమలు చేయగల డ్యూయల్ టికెటింగ్ వ్యూహంకూడా ప్రయోజనం చేకూరుస్తుంది. చౌకగా వున్నందున యువకులుశ్రామిక తరగతి ఫ్రేక్షకులు పెరుగుతారని ఆశిస్తున్నారు. ఈ సంస్కరణలకి తెలుగు నిర్మాతలు అంగీకరిస్తారో లేదో చూడాలి.

***

 

7, అక్టోబర్ 2022, శుక్రవారం

1225 : రివ్యూ!


 రచన- దర్శకత్వం: ఏ మోహన్ రాజా

తారాగణం : చిరంజీవి, నయనతార, ప్రగతి, సల్మాన్ ఖాన్, సత్యదేవ్, మురళీ శర్మ, సాయాజీ షిండే, సునీల్, షఫీ తదితరులు
కథ : మురళీ గోపి (మలయాళం), మాటలు : లక్ష్మీ భూపాల, సంగీతం : థమన్ ఎస్, ఛాయాగ్రహణం : నీరవ్ షా
బ్యానర్స్ : కొణిదెల ప్రొడక్షన్ కంపెనీ, సూపర్ గుడ్ ఫిల్మ్స్
నిర్మాతలు : రామ్ చరణ్, ఆర్ బి చౌదరి, ఎన్వీ ప్రసాద్
విడుదల : అక్టోబర్ 5, 2022
***

చార్య పరాజయం తర్వాత మెగాస్టార్ చిరంజీవి మలయాళంలో హిట్టయిన లూసిఫర్ రీమేక్ తో దసరా సందర్భంగా ప్రేక్షకుల ముందుకొచ్చారు. రెగ్యులర్ తన మార్కు కమర్షియల్ మసాలాలకి దూరంగా ఈసారి కథా బలమున్న రాజకీయ డ్రామాలో నటించారు. విడుదలకి ముందు రిలీజ్ అయిన ట్రైలర్ తో భిన్నాభిప్రాయాలు వ్యక్తమైనా బుకింగ్స్ బలంగా వున్నాయి. ఇందులో ఇంకా సల్మాన్ ఖాన్ కూడా ఒక పాత్ర నటించడంతో అదనపు ఆసక్తి ఒకటి ఏర్పడింది. రెండు దశాబ్దాల క్రితం హనుమాన్ జంక్షన్ అనే మలయాళం రీమేక్ తో హిట్ దర్శకుడుగా తమిళ సినిమాల్లోకి వెళ్ళిపోయిన దర్శకుడు మోహన్ రాజా, తిరిగి ఈ మలయాళం రీమేక్ తో చిరంజీవికి హిట్ ఇచ్చేందుకు సాహసించారు. ఇది సాధ్యపడిందా? మోహన్ లాల్ నటించిన  లూసిఫర్ తెలుగు డబ్బింగ్ 2019 లోనే విడుదలయింది. యూట్యూబ్ లో కూడా వుంది. తెలుగు ప్రేక్షకులు చాలా వరకూ చూసేసే వుంటారు. ఇప్పుడు గాడ్ ఫాదర్ ని చూస్తే లూసిఫర్ ని మరిపించేలా వుంటుందా? తెలుసుకుందాం...

కథ
జనజాగృతి పార్టీ అధ్యక్షుడు
, ముఖ్యమంత్రి పికె రామదాసు మృతితో విషాద చ్ఛాయలు అలుముకుంటాయి. ఇంకా అంత్య క్రియలకి ముందే సీఎం పదవి కోసం కుమ్ములాటలు మొదలవుతాయి. పార్టీ నాయకుడు వర్మ (మురళీ శర్మ), నాయుడు (సాయాజీ షిండే) ఎత్తుగడలు వేస్తూంటారు. రామదాసు పెద్ద కుమార్తె సత్యప్రియ (నయనతార), అల్లుడు జయదేవ్ (సత్య దేవ్) ల పేర్లు ప్రతిపాదన కొస్తాయి. జయదేవ్ పెద్ద నేర సామ్రాజ్యాన్ని నడుపుతూంటాడు. ఆ డబ్బుతోనే పార్టీని నడిపిస్తున్నందుకు పదవికి తానే అర్హుడని పావులు కదుపుతాడు.

ఇవన్నీ గమనిస్తున్న రామదాసు ఆత్మీయుడు బ్రహ్మ (చిరంజీవి) రంగప్రవేశం చేసి జయదేవ్ ని అడ్డుకుంటాడు. దీంతో ఇద్దరి మధ్యా పోరాటం మొదలవుతుంది. కింగ్ మేకర్ పాత్ర పోషిస్తున్న బ్రహ్మ అసలు ఉద్దేశమేమిటి
? ఎవర్ని సీఎం పదవిలో కూర్చోబెట్టబోతున్నాడు? అతనంటే సత్య ప్రియకి ఎందుకు ద్వేషం? అసలు బ్రహ్మ ఎవరు? అతడికి రామదాసు కుటుంబంతో సంబంధమేమిటి? ఇవి తెలియాలంటే వెండి తెరమీద చూడాల్సిందే.

ఎలావుంది కథ

రాజకీయ సినిమా కథల్లో ఇదొక భిన్నమైన కథ. ఈ క్రెడిట్ మలయాళం లూసిఫర్ కిచ్చేయాలి. దీన్ని తెలుగుకి కొన్ని మార్పు చేర్పులతో  గాడ్ ఫాదర్ గా రీమేక్ చేసినప్పుడు, లూసిఫర్ కి దీటుగానే ఫలితం వచ్చింది. ఇంత నీటయిన, అర్ధవంతమైన, బలమైన రాజకీయ డ్రామా చాలా కాలం తర్వాత  తెలుగులో చూస్తాం. ఒరిజినల్లో వున్న క్రైస్తవం, కమ్యూనిజం నేపథ్యాల్ని పూర్తిగా తొలగించినా కథకేమీ లోటు రాలేదు. బైబిల్లో లూసిఫర్ కథని తెలుగుకి జానపద రాజు కథగా నేపథ్యమిచ్చారు.

కథ ఒకెత్తు అయితే
, పాత్ర చిత్రణలొక ఎత్తు. చిరంజీవి బ్రహ్మ పాత్రని మలయాళంలో మోహన్ లాల్ లాగా పాత్ర వయసురీత్యా  ఔచిత్యం చెడకుండా కాపాడారు. చిరంజీవి కదాని ఫ్యాన్స్ కోసం, మాస్ కోసం, హీరోయినూ రోమాన్సూ పాటలూ డాన్సులూ పంచ్ డైలాగులూ కామెడీలూ వంటివన్నీ పూర్తిగా దూరం పెట్టి, ఆనాడు హిట్లర్ లో చిరంజీవిలాగా హూందాగా చూపించి పాత్రకి పూర్తి న్యాయం చేశారు. చిరంజీవి ఇమేజి చట్రాన్ని తీసి అవతల పడేశారు. రాజకీయ కథ కొత్తగా, మెచ్యూర్డ్ గా వున్నప్పుడు చిరంజీవి కూడా మెచ్యూర్డ్ గా, కొత్తగా వుండాల్సిందే.  ఇలా ప్రతీ పాత్రా డీసెంట్ గా బలంగా వున్నాయి.   ఇలా చాలా కాలం తర్వాత తెలుగులో ఒక మౌలిక హిట్ కథ తెరకెక్కింది. ఇది చూస్తూ లూసిఫర్ ని మర్చిపోవాల్సిందే. ఈ కథలో అసలు బ్రహ్మగా చిరంజీవి ఎవరన్న దానికి రొటీన్ మూస ఫ్లాష్ బ్యాక్ వేయకుండా, ఫస్టాఫ్ నడుస్తున్న డ్రామాతోనే బ్రహ్మ గతాన్ని డిమాండ్ చేసే సన్నివేశం వచ్చినప్పుడల్లా, తెలుపు -నలుపులో మాంటేజెస్ తో దృశ్యాలు వచ్చి పోవడం నీటైన స్క్రీన్ ప్లే రచనలా వుంది.

నటనలు – సాంకేతికాలు
మొదటి పావుగంట తర్వాత చిరంజీవి ఎంట్రీ వుంటుంది. ఈ ఎంట్రీ హీరోయిజం కోసం ఫైట్ సీనుతో కాకుండా
, సీఎం అంత్యక్రియలకి వచ్చే సీనుతో డ్రమెటిక్ గా వుంటుంది. పావు గంట తర్వాత నుంచి కథ వేడెక్కి చిరంజీవి క్యారక్టరైజేషన్ స్థిర పడుతుంది. దెబ్బకి ఎదురు దెబ్బ తీసే డ్రామాతో ఇంటర్వెల్ వరకూ పాత్ర ఎలివేట్ అవుతూ పోతూంటుంది. ఇదంతా చిరంజీవి పెర్ఫార్మెన్స్ తో హైలైట్ అవుతూంటుంది. ఇంటర్వెల్ కి ముందు ఫైట్ సీన్ కూడా డీసెంట్ గా వుంటుంది. బ్యాక్ గ్రౌండ్ లో థమన్ సంగీతంలోని పాటతో ఈ ఫైట్ ఒక ఈవెంట్ లా వుంటుంది.

అయితే సెకండాఫ్ కథ రొటీన్ గాడిలో పడినా
, ప్రత్యర్ధితో పోరాటంలో క్యారక్టర్ ని నిలబెట్టుకుంటూ వచ్చారు చిరంజీవి. కానీ చివరి అరగంట క్లయిమాక్స్ ని కాపాడలేకపోయారు.

చిరంజీవికి దీటుగా ప్రత్యర్ధి పాత్రలో స్మాల్ హీరో సత్యదేవ్ ఒక సర్ప్రైజ్ అప్పీయరెన్స్. జయదేవ్ గా సత్యదేవ్ నటించిన ప్రతీ సీనూ రాణిస్తాయి. మెగాస్టార్ మూవీకి విలన్ గా నటించే ధైర్యానికి అతడ్ని మెచ్చుకోవాలి. గుర్తుండిపోయే పెర్ఫార్మెన్స్ ఇచ్చాడు. వర్మగా మురళీ శర్మ కామిక్ విలనీ
, ఎక్స్ ప్రెషన్స్ చూస్తున్న కొద్దీ చూడాలన్పించేలా వున్నాయి. ఈ ఎక్స్ ప్రెషన్స్ కోసమే దర్శకుడు క్లోజప్ షాట్స్ వేస్తూ పోయాడు. ఇక చిరంజీవి మీద కోపంతో వుండే నయనతార సీరియస్ నటన, బాల్యం నుంచీ ఆమె పాత్రకున్న గతం సన్నివేశాలకి డెప్త్ నిస్తాయి. ఇతర పాత్రల్లో సహాయ నటులూ ఏమీ తీసిపోలేదు.

ఇంటర్వెల్లో మాసూమ్ భాయ్ గా ఎంట్రీ ఇచ్చే సల్మాన్ ఖాన్ తిరిగి క్లయిమాక్స్ లోనే చిరంజీవిని కాపాడేందుకొస్తాడు. ఇద్దరూ వున్న ప్రతీ సీనూ కనువిందు ప్రేక్షకులకి. ఇద్దరి మీదా సాంగ్ కూడా కిక్ నిచ్చేదే. అయితే క్లయిమాక్స్ లో కథ మిగలక పోవడంతో సల్మాన్ చేసేదేమీ వుండదు పాత్ర పరంగా.

థమన్ కూర్చిన సంగీతం మెగాస్టార్ మూవీ లెవెల్లో వుంది. కథా బలం వల్ల తన సంగీతం బలంగా వున్నట్టు అన్పిస్తుంది. నీరవ్ షా కెమెరా వర్క్ చాలా ఉన్నతమైనది. క్రౌడ్ దృశ్యాలు
, దృశ్యాలకి వేసిన సెట్స్, ఇన్ డోర్ - ఔట్ డోర్ లొకేషన్స్, యాక్షన్ సీన్స్ ప్రతీదీ అతడి లైటింగ్ -కెమెరా వర్క్ తో దృశ్య వైభవాన్ని సంతరించుకున్నాయి. లక్ష్మీ భూపాల రాసిన డైలాగులు కూడా హైలైట్ గా, కొన్ని చోట్ల ఆలోచనాత్మకంగా వున్నాయి.

చివరి కేమిటి
రీమేకుల దర్శకుడు మోహన్ రాజా (ఎడిటర్ మోహన్ కుమారుడు) ఇరవై ఏళ్ళ తర్వాత తిరిగి ఈ రీమేక్ తో పేరు నిలబెట్టుకున్నాడు. చివరి అరగంట తప్పితే మిగతా రెండు గంటలూ పకడ్బందీ కథా కథనాలతో రాజకీయ డ్రామా నడపడం అభినందించ దగ్గ విషయమే. అయితే, చివరి అరగంటే చేజారిపోయింది. ఈ అరగంట క్లయిమాక్స్ నడపడానికి కథే లేదు. ఒక్క దెబ్బతో విలన్నీ ఫినిష్ చేయొచ్చు. చేయకుండా విలన్ తో యాక్షన్ సీన్స్ సాగిసాగి అనవసర హైరానా లాగా తేలింది. ఈ యాక్షన్ సీన్స్ కి చేసిన సీజీ కూడా నాసిరకంగా వుంది. తుపాకీ కాల్పులు, పేల్చివేతలూ అంతవరకూ నీటుగా చూపించు కొచ్చిన సినిమాని తారుమారు చేశాయి. ఈ లాజిక్ లేని మసాలా మాస్ కోసమేమో తెలీదు. మొత్తానికి చివర్లో సల్మాన్ ని తీసుకొచ్చి చిరంజీవితో ఇలా ధూం ధాం చేసి పూర్తి చేశారు.     

దసరా పండక్కి రక్తపాతం లేని తెలుగు ప్రమాణాలతో కూడిన రీమేకుని ఓ  రెండు గంటలు ఎంజాయ్ చేశాక
, చివరి అరగంట ముగింపు భరించక తప్పదు. అవ్వా కావాలి బువ్వా కావాలీ అంటే కుదరదుగా?

—సికిందర్