రివ్యూలు, సాంకేతికాలు, స్క్రీన్ ప్లే సంగతులు...

టికెట్లు దొరకడం యోగం, సినిమాలు చూడడం భోగం, రివ్యూలు రాయడం రోగం!

Saturday, November 6, 2021

 

hursday, March 18, 2021

1027 : సాంకేతికం

     కొన్ని సినిమాల్లో ఓ షాట్ స్ట్రెస్ బస్టర్ లా వెంటపడుతుంది. ఆ షాట్ ని గుర్తు చేసుకుంటే మానసిక వొత్తిళ్ళు దూరమైపోయేంత బలం వాటికుంటుంది. సినిమా మొత్తం మీద ఆ షాటే గుర్తుండిపోతుంది. ఆఫ్ కోర్స్, ఇది చూసే వాళ్ళ దృష్టిని బట్టి వుంటుంది. సినిమా కథలు, స్క్రీన్ ప్లే వెతలూ లోకమైపోయిన వాళ్ళకి షాట్స్ మీద క్రియేటివ్ దృష్టి ఎక్కువ వుంటుంది. ఎందుకంటే సినిమా కథలంటేనే, స్క్రీన్ ప్లేలంటేనే షాట్స్ తో విజువల్ గా ఆలోచించడం. సినిమా కథ ఆలోచించడమంటే మేస్త్రీలా కథలో పడి తిరుగుతూ విజువల్ గా ఆలోచించడమే, మహర్షిలా వ్యాసం రాయడానికి కూర్చుని ఆలోచించినట్టు కాదు. విజువల్ సెన్స్ తో సినిమాలు చూసినప్పుడు ఎక్కడ బడ్జెట్ వృధా అవుతోంది, ఎక్కడ ఆదా అవుతోందీ తెలుస్తుంది. సినిమాలకి స్టోరీ రైటింగ్ కాదు, స్టోరీ మేకింగ్ కావాలి. స్టోరీ రైటింగ్ సీన్లు చూస్తుంది, స్టోరీ మేకింగ్ షాట్లు చూస్తుంది. స్టోరీ రైటింగ్ ఒక విషయాన్ని మూడు సీన్లలో చెప్పి బడ్జెట్ ని వృధా చేస్తుంది. స్టోరీ మేకింగ్ మూడు సీన్లతో చెప్పే విషయాన్ని ఒక్క షాట్ తో చెప్పి బడ్జెట్ ని ఆదా చేస్తుంది. దర్శకత్వ మంటే సెట్స్ లో చేసేది కాదు, హిచ్ కాక్ లా పేపర్ మీద చేసేది. హిచ్ కాక్ కి రచయితలతో అంత ఓపికుండేది. వాళ్ళతో కలిసి పేపర్ మీదే పడుండే వాడు. బాలీవుడ్ లో అంత ఓపిక ఇప్పుడూ వుంది. రచయితల తోడ్పాటు లేకుండా షూటింగ్ స్క్రిప్టే పూర్తి చెయ్యరు. ఇందాకా తాజాగా సెల్ టెక్స్ లో హై ఫైగా వున్న ఒక డైలాగ్ వెర్షన్ తో పూర్తయిన స్క్రిప్టుని చూస్తూంటే, అందులో దర్శకత్వం కనిపించడం లేదుఒక చోట ఏక బిగిన అరగంట స్క్రీన్ స్పేస్ వృధా అయ్యే సీన్ల పరంపర వుంది. అరగంట స్క్రీన్ స్పేస్ అంటే బడ్జెట్ లో పావు వంతు. రెండు కోట్ల బడ్జెట్ అనుకుంటే అందులో 50 లక్షలు అనాలోచిత సీన్లతో వృధా వృధా. ఆర్టిస్టులు, టెక్నీషియన్లు బతకడానికే ఇది, సినిమా కాదు. స్టోరీ రైటింగ్ ఫలితం ఇలా వుంటుంది.

        రే, వెంటాడే షాట్స్ రెండు రకాలు : నటనా పరమైనవి, రచనా పరమైనవి. నటనా పరమైనవి ఆర్టిస్టులు చూసుకుంటారు వాళ్ళ భావోద్వేగాల క్లోజప్స్ తో. ఇవి కూడా వెంటాడ వచ్చు. అయితే ఇవి ఆ సీనుతో మాత్రమే సంబంధంతో వుంటాయి. సీను మారిందంటే భావోద్వేగాలు మారతాయి. ఇవి కత్తిరింపులకి గురయినా కథకి నష్టముండదు. ఈయనకి/ ఈవిడకి అంత ఇంపార్టెన్స్ ఎందుకయ్యా, ఆ షాట్ ని కత్తిరించి పారేయ్ - అని ఎడిటింగ్ లో లేపెయ్యొచ్చు. ఆయన/ఆవిడ ఆ షాట్ ఇచ్చి మేఘాలలో నడుచుకుంటూ ఇంటికెళ్ళి పోయాక, తీరా సినిమాలో చూసుకుంటే, బ్లాంక్ గా కన్పించి నేలమీద రాలిపడడమే.

        రచనా పరమైన షాట్స్ ఇలా కాదు, ఇవి కథకి సంబంధించి వుంటాయి. ముందు జరిగిన కథని దృష్టిలో పెట్టుకుని తర్వాత జరగబోయే కథ చెప్తాయి ఆ ఒక్క షాట్ తో. వీటిని కత్తిరించలేరు బామియాన్ తాలిబన్లయితే తప్ప. ఇలాటి రెండు షాట్స్ ఈ మధ్య బాగా పిచ్చెత్తించి నిద్ర పట్టకుండా చేశాయి. ఏమిటీ షాట్స్? వీటిగురించి పిచ్చెత్తి ఎందుకు రాయాల్సి వచ్చిందిప్పుడు పనులాపుకుని తీరిగ్గా? స్టోరీ మేకింగ్ కి ఇవి అందిస్తున్న మైండ్ బ్లాస్టింగ్ టెక్నిక్సే కారణం. ఇలా చేయాలీ స్టోరీ మేకింగ్ అనీ చెబుతూ... ఇటీవల ఓటీటీలో విడుదలైన హాలాహల్ లోని ఒక షాట్, స్క్రీన్ ప్లే సంగతులు రాసిన దే ర్ విల్ బి బ్లడ్ లోని ఇంకో షాట్.

***
       1. పక్క షాట్ చూడండి. దేర్ విల్ బి బ్లడ్ ఎండ్ విభాగంలో చర్చి సీన్. ఈ సీన్లో డానీ ప్రాయశ్చిత్తం చేసుకుని మతంలో చేరాక, భక్తుల అభినందనలు అందుకుంటున్నప్పుడు, మేరీ వచ్చి ఆలింగనం చేసుకుంటుంది. కొద్ది సెకన్ల పాటే వుండే ఈ షాట్ చెప్పకనే కథ చెప్పేస్తుంది. ఈ షాట్ కి పూర్వ కథలో ప్రార్ధన చేయక తండ్రి చేత దెబ్బలు తింటూ వుంటుంది మేరీ. ఆమెకి నాస్తికుడైన డానీ అండగా వుంటాడు.  తను నాస్తికుడైతే ఆమె కాబోయే నాస్తికురాలని. కొడుకుని దృష్టిలో పెట్టుకుని ఆమెని ఫ్యామిలీగా కూడా ప్రకటించాడు. నాస్తికుడుతో నాస్తికురాలి అనుబంధం ఇక్కడుంది.

        ఈ నేపథ్యంలో ఈ షాట్ ఇప్పుడు చెప్పే కథేమిటంటే- నిశ్శబ్దంగా బేబీ మేరీ ఆలింగనం చేసుకోవడంలో, ఫ్యామిలీలో నీతో పాటే నేనూ అన్న అర్ధమిస్తోంది. అతను మారాడు, తానూ మారింది. ఆడియెన్స్ కి ఇక రిలీఫ్. తానూ మతాన్ని స్వీకరిస్తూ హామీ ఇస్తోంది. ఆడియెన్స్ కి ఆమె మీద నమ్మకం. అప్పుడేమంది తను? చర్చికి బాకీ వున్న 5000 అతను ఇస్తాననడం అతడి గొప్ప మనసు అంది. అతనేమన్నాడు? ఎప్పట్నుంచో ఇవ్వాల్సిన బాకీ అన్నాడు. ఈ సిన్సియారిటీతో ఆడియెన్స్ కి హమ్మయ్యా అని అతడిపట్ల పూర్తి పాజిటివ్ ఫీల్. ఇంతే, దీంతో షాట్ ముగుస్తుంది. ఈ షాట్ కి బిజిఎం వుండదు. వుంటే చెడుతుంది.

        ఇంత క్లుప్తంగా వున్న ఈ షాట్ లో బాకీ గురించిన రెండు మాటలే పని గట్టుకుని ఇంకెందుకున్నాయి? డానీ డానీయే. చచ్చినా మారడు. చర్చికి మాటిచ్చి రేపు బాకీ ఎగ్గొట్టక వుంటాడా? రేపు బాకీ ఎగ్గొడితే ఆడియెన్స్ కి ఈ మాటలే గుర్తుకు రావాలంటే, ఈ మాటలు చెదిరిపోయే ఇంకే మాటలూ ఇక్కడ వుండకూడదు. చాలా డిస్టర్బింగ్ షాట్ ఇది. మేరీ అతడ్ని నమ్మేసి మతంలోకి వచ్చింది. రేపు పెళ్ళయాక తెలుస్తుంది అతడ్ని నమ్మడం ఎంత మోసమో. ఇక్కడ చర్చి సాక్షిగా కొడుకుని స్వీకరించిన ఇతనే, రేపు కొడుక్కుని బాస్టర్డ్ అని వెళ్లగొట్టేసినప్పుడు, కోడలిగా తను అవమానకర పొజిషన్లో పడ్డప్పుడు గానీ అర్ధం గాదు. అయితే ఈ షాట్ లో మేరీ ఫేస్ ఎందుకు చూపించలేదు? ఎందుకంటే దీని తర్వాత ఆమె కథలో కన్పించదని. ఇలా ముందు జరగబోయే వాటికి మందుగుండు అంతా ఈ ఒక్క షాట్ లోనే జొప్పించి వుంది... ఇదీ స్టోరీ మేకింగ్.

***
        2. దీన్ని స్టోరీ రైటింగ్ చేస్తే - చర్చిలో డానీ మతంలో చేరిన సీన్ నెంబర్ వన్ తర్వాత, సీన్ నెంబర్ టూ - డానీ ఇంటికెళ్తాడు. మేరీ పరిగెట్టుకుంటూ వస్తుంది - అంకుల్ అంకుల్ అంకుల్ అని పట్టి వూపేస్తుంది. ఏంటమ్మా ఏంటంత సంతోషం? ప్రభువు చల్లని చేయి తాకిన గొర్రెపిల్లలా చెంగు చెంగు మంటున్నావు?’ - డానీ. నువ్వు చర్చి కెళ్ళావు కదూ? నేనూ చర్చికి వెళ్తా, చర్చికెళ్తా, ప్రార్ధన చేస్తా. నువ్వెలా చేస్తే అలా చేస్తా. సేమ్ టు సేమ్ అంకుల్ - మేరీ. నా బంగారు తల్లి కదే. బుజ్జి తల్లి కదేఎంత ఎదిగావమ్మా నువ్వూ - డానీ. నన్ను చర్చికి తీసికెళ్ళాలి. తీసికెళ్ళాలీ తీసికెళ్ళాలీ.. మేరీ. సీన్ నెంబర్ త్రీ- చర్చికి వెళ్తారు. కలిసి ప్రార్ధన చేస్తారు. అంకుల్ ఇప్పుడెంతో బావుంది. నేను నీతోటే వుంటా నంకుల్, ప్రామీస్ అంకుల్ ప్రామీస్ - మేరీ. నేనెప్పుడు కాదన్నానమ్మా నా మేరమ్మ  తల్లమ్మ తల్లీ, పద ఐస్ క్రీమ్ తిందాం - డానీ. ఈ సీన్లకి పులకింఛిపోయే బిజిఎం కూడా వస్తూంటుంది. ఇలా వుంటుంది... అప్పుడెప్పుడో పాత రాతి యుగపు నాటి నరహంతక సుత్తి కాక ఏమిటిది మూడేసి సీన్లతో? ముందు వెనుక కథతో సంబంధం లేకుండా బడ్జెట్ ని తేరగా ఆరగిస్తూ?

***
     3. ఇక హాలా హల్ ముగింపులోషాట్. క్లయిమాక్స్ లో సచిన్ ఖెడేకర్ కి కౌన్సెలింగ్ చేస్తున్న పద్ధతిలో విలన్ వివరిస్తాడు చాలా స్మూత్ గా మంచి చెడ్డలు. అనవసరంగా మాతో పెట్టుకోక మంచిగా బ్రతక మంటాడు. సీన్ కట్ అవుతుంది. రోహతక్ లో ఆందోళనలో వున్న సచిన్ భార్యా కూతురు, అతణ్ణి వచ్చెయ్యమని అంతకి ముందే కోరి వుంటారు. ఇప్పుడు ఈ షాట్ లో టేబుల్ ముందు కూర్చుని కూతురు స్టడీ చేస్తూంటుంది.  తలెత్తి తలుపు వైపు చూస్తుంది. ఆమె మొహం ఒక్కసారి ప్రసన్నమవుతుంది. షాట్ కట్ అయిపోతుంది. దీనికి బిజిఎం వుండదు. బిజిఎంవుంటే ఫీల్ వుండదు. దీనితర్వాత సీనుండదు.

        ఆమె తలుపు వైపు అలా ఏం చూసి ప్రసన్నమై వుంటుందిసచిన్ వచ్చేసి వుంటాడు. ఇలా సచిన్ ని చూపించకుండానే ఆ అర్ధంలో షాట్ తీశాడు క్రాఫ్ట్ తెలిసిన దర్శకుడు. ఇది కథ చెప్పే మర్చిపోలేని బ్యూటీఫుల్ షాట్. ఈ షాట్ తర్వాత ఇక సీనుండదు. విలన్ తో ఓడిపోయి ఇంటికొచ్చిన సచిన్ మొహం చూడాలన్న తహతహని  ఆడియెన్స్ కి అలాగే మిగిల్చేస్తాడు దర్శకుడు. అర్ధోక్తిలో షాటుని ఆపితే ఎంత బలంగా వెంటాడుతూ వుంటుందో చెప్పనవసరం లేదు. ఇది స్టోరీ మేకింగ్.

***
        4. ఈ ఒక్క షాటునే ముగింపుతో స్టోరీ రైటింగ్ చేస్తే ఎలా వుంటుంది? ఆమె తలుపు వైపు చూసి ప్రసన్నమయేసరికి, తలుపు దగ్గర సచిన్ ని భయంకరంగా చూపించేస్తూ సెంటిమెంటల్ సీను రాసుకుంటూ రాసుకుంటూ పోతారు. పెన్నులన్నీ అయిపోయి పరిగెడతారు. అసలలా సచిన్ ని చూపిస్తే చాలు నాశనం చేయడానికి. అప్పుడు సచిన్ కాల్షీటు కావాలి, మేకప్, కాస్ట్యూమ్స్ ఖర్చులు కావాలి, ఇంకా... అద్దె భవనపు ఖర్చు, యూనిట్ ఖర్చు, ఎడిటింగ్ ఖర్చు, డబ్బింగ్, బిజిఎం ఖర్చు, డీఐ ఖర్చూ.. ఇంకా థియేటర్లకి కరెంటు ఖర్చు, ప్రేక్షకులకి టైమ్ వేస్టూ. ఈయనేంటీ అర్ధమైపోయిన దాన్ని ఇంకా చూపిస్తాడూ - అని లేచెళ్ళి పోవడం....

***

        5. ఈ కింది వీడియో చూడండి. 2010 ప్రాంతంలో ప్రచారంలో వున్న, పాపులరైన  ధూమపాన హెచ్చరిక యాడ్ ఫిలిమ్. ప్రారంభం చూడండి. టేబుల్ ముందు కూర్చుని బొమ్మలేసుకుంటూ వుంటుంది అమ్మాయి. సడెన్ గా తలతిప్పి చూస్తుంది. సిగరెట్ తాగుతూ గుమ్మం లోంచి లోపలికొస్తూ కనిపిస్తాడు తండ్రి. చిరునవ్వుతో చూస్తాడు. తానూ ఆప్యాయంగా చిరునవ్వుతో చూస్తుంది...



        ఈ షాట్స్ ఫిమేల్ టచ్ తో వుండడం వల్ల గుర్తుండి పోతున్నాయా? ఆలోచించాల్సిన విషయం. పై మూడు షాట్స్ లో ఫిమేల్ క్యారెక్టర్సే వున్నాయి. హాలా హల్ షాట్ చూస్తూంటే ఈ యాడ్ ఫిలిమ్ లో షాట్ గుర్తుకొచ్చింది. ఎంత యాక్షన్, వయోలెంట్ మూవీస్ లోనైనా, ఒకటి రెండు కథతో, పాత్రచిత్రణతో కూడిన ఇలాటి ట్రాడిషనల్ ఆడతనపు షాట్స్ వుంటే, లైఫ్ వుంటుందని చెప్పొచ్చు. బ్యూటీ వస్తుంది.

సికిందర్ 

 

Friday, November 5, 2021

1076 : రివ్యూ


 రచన - దర్శకత్వం : మారుతి
తారాగణం : సంతోష్ శోభ‌న్‌, మెహ్రీన్ పీర్జాదా, అజ‌య్ ఘోష్‌, శ్రీనివాసరావు, వెన్నెల కిశోర్‌, స‌ప్త‌గిరి, శ్రీనివాస‌రెడ్డి, ప్ర‌వీణ్, రజిత త‌దిత‌రులు
సంగీతం : అనూప్‌ రూబెన్స్ , ఛాయాగ్రహణం : సాయి శ్రీరామ్‌
బ్యానర్స్: వీ సెల్యులాయిడ్‌, ఎస్‌.కె.ఎన్‌.

నిర్మాత : ఎస్‌.కె.ఎన్‌.
విడుదల : నవంబర్ 4, 2021
***

        లాక్ డౌన్ సమయంలో దర్శకుడు మారుతీ ఖాళీగా వుండ కూడదని, ఓ రెండు లొకేషన్స్ లో  లో -బడ్జెట్ ప్లాన్ చేసుకుని తక్కువ రోజుల్లో పూర్తి చేసిన మంచి రోజులొచ్చాయి మంచి సమయం చూసుకుని విడుదలైంది. దీపావళికి పెద్దన్న’, ఎనిమీ అనే రెండు డబ్బింగులు తప్ప తెలుగు సినిమాలు లేక పోవడంతో విడుదల లాభసాటి అవకాశంగా మారింది. 2011 నుంచి హీరోగా నిలదొక్కుకోవడానికి స్ట్రగుల్ చేస్తున్న సంతోష్ శోభన్, 2018 లో పేపర్ బాయ్ తో తిరిగి పరాజయాన్ని చవిచూశాక  వెబ్ సిరీస్ మీద దృష్టి పెట్టాడు. వెబ్ సిరీస్ నుంచి మారుతీ దర్శకత్వంలో సినిమాలో కొచ్చాడు ప్రస్తుతం. ఇప్పుడైనా తనకి మంచి రోజులొస్తాయా లేదా అనేది తేలిపోయే సమయమిది. ఇదేమిటో చూద్దాం...

కథ

    సంతోష్ (సంతోష్ శోభన్), పద్మ (మెహ్రీన్ పీర్జాదా) లు బెంగుళూరులో ఐటీ జాబ్స్ చేస్తూ ప్రేమలో పడతారు. లాక్ డౌన్ ప్రకటించడంతో వర్క్ ఫ్రమ్ హోమ్ కి హైదరాబాద్ వచ్చేస్తారు. ఇక్కడ పద్మ తండ్రి గోపాలం (అజయ్ ఘోష్) కి మూర్తి, కోటేశ్వర్రావ్ అనే ఇద్దరు మిత్రులుంటారు. వీళ్ళు ఇద్దరు కూతుళ్ళున్న గోపాలం ఏ చీకూచింతా లేనట్టు ఆనందంగా గడపడాన్ని చూసి ఓర్వలేక పోతారు. కోటేశ్వర్రావ్ కి తన కూతురు ఒకడితో లేచిపోయిన అవమాన భారముంటుంది. దీంతో గోపాలం ఆనందంగా జీవిస్తూంటే మండి పోతూంటాడు. గోపాలం కూతురు పద్మ బెంగుళూరు నుంచి వచ్చెయ్యడంతో, సంతోష్ తో ఆమె వరస కనిపెట్టి, మూర్తీ కోటేశ్వర్రావ్ లు గోపాలంలో అనుమాన బీజాలూ, దాంతో భయాందోళనలూ బలంగా నాటుతారు. నీ కూతురు కూడా లేచిపోయి పరువు తీస్తుందని.

        దీంతో గోపాలం కూతుర్ని అనుమానించడం మొదలెడతాడు. సంతోష్ తో ఆమె ప్రేమకి అడ్డంకులు సృష్టిస్తూంటాడు. తండ్రికి కలుగుతున్న అనవసర భయాలకి సంతోషే కారణమని అతడికి దూరమవుతుంది పద్మ. ఇప్పుడు సంతోష్ ఈ తండ్రీ కూతుళ్ళ సమస్యల్ని ఎలా తొలగించి, వాళ్ళకి దగ్గరయ్యాడన్నది మిగతా కథ.

ఎలావుంది కథ

    మారుతి ప్రారంభించిన సైకాలజీ సిరీస్ సినిమా కథల్లో ఇది మూడో కథ. భలేభలే మగాడివోయ్’, మహానుభావుడు అనే రెండు ప్రయత్నాలకి రెండు మానసిక సమస్యల్ని తీసుకున్నాడు. మొదటిది మతిమరుపు  సమస్యతో, రెండోది ఓసీడీ సమస్యతో. ఇప్పుడు అతి భయం - ఫియర్ యాంగ్జయిటీని చూపించాడు. మారుతితో వచ్చిన సమస్యేమిటంటే, ఈ మానసిక సమస్యలు అసలేంటో రీసెర్చి చేసి తెలుసుకోకుండా ఇష్టానుసారం తీసేయడం. భలేభలే మగాడివోయ్ లో మతిమరుపుని  పక్కనబెడితే, తర్వాత తీసిన రెండూ అసహజ కథలు. మహానుభావుడు ని ఓసీడీ గురించి తీశానని హైప్ ఇచ్చాడు. తీరా చూస్తే అది ఓసీడీ (అబ్సెసివ్ కంపల్సివ్ డిజార్డర్) కాదు, మామూలు ఎలర్జీ అని సన్నివేశాలే తేల్చేశాయి. 

ఇప్పుడు అతి భయం తీసుకుని కథగా చేస్తే తగిన శాస్త్రీయ మూలాల్లేక, తన కల్పితాలతో సగానికే విషయం లేకుండా తేలిపోయింది కథ. అతిభయం - ఫియర్ యాంగ్జయిటీని పెంచితే ఫోబియాగా మారి, సమస్య మరింత తీవ్రమయ్యేది. కథలేని కొరత తీరుస్తూ విస్తరించుకుంటూ పోయేది. కొత్త పుంతలు తొక్కెది. ఆ ఫోబియాని మాన్పే క్లినికల్ పరిష్కారాల డ్రామాతో ముగింపు అర్ధవంతంగా వుండేది. కథని అసలేమీ ప్లాన్ చేయకపోవడంతో, ఒక జంటకి సగం పెళ్ళి  చేసి వదిలేస్తే ఎలా వుంటుందో అలా తయారైంది కథ. మారుతి తను సైకాలజీ కథల స్పెషలిస్టు అన్పించుకోవాలని నిజంగా అనుకుంటే తత్సంబంధ విషయ సేకరణ వైపూ కాస్త తొంగి చూస్తే బావుంటుంది.

నటనలు- సాంకేతికాలు
     సంతోష్ శోభన్ 2015 లో తను- నేను లో నటించినప్పుడే మంచి ఈజ్ వున్న డైనమిక్ హీరో అవుతాడని భావించాం. అదే డైనమిజం ఇప్పుడూ వుంది. అతనేమీ ఓవరాక్షన్ చేసో, లేదా మసాలా మాస్ యాక్టింగ్ చేసో దృష్టి నాకర్షించే ప్రయత్నం చెయ్యడు. సింపుల్ నటనతోనే ప్రేక్షకుల దృష్టిని తన వైపు తిప్పుకుంటాడు. ప్రస్తుత మూవీలో లవర్ బాయ్ పాత్ర నటించాడు. ఉన్నది కాసేపే. ఇదే సమస్య. దర్శకుడు మారుతీ ప్రధాన పాత్ర హీరోయిన్ తండ్రిగా వేసిన అజయ్ ఘోష్ అన్నట్టు, అతడి చుట్టే కథ నడిపి, సంతోష్ ని పక్కన పడేశాడు. పేరుకి మాత్రమే సంతోష్ హీరో. కథ మాత్రం అజయ్ ఘోష్ దే. ఇలా కూడా సినిమా తీయొచ్చా అంటే ఏమో. జీవితమే ఒక నాటకరంగం’, సంసారం-సాగరం’, మొరటోడు’, ‘,దేవుడే దిగివస్తే లాంటి సినిమాలు క్యారక్టర్ ఆర్టిస్టు కైకాల సత్యనారాయణ హీరోగా నటించినవి వున్నాయి. ఇవి వేరు.

        సంతోష్ పాత్ర పని కాసేపు అజయ్ ఘోష్ భయాన్ని వదిలించడమైతే, ఈ ప్రయత్నాలు చాలా సిల్లీగా వున్నాయి. హీరోయిన్ మెహ్రీన్ డిటో సంతోష్. ఈమెకి కూడా పాత్ర తక్కువే. చేసేదేమీ వుండదు, స్లిమ్ గా మారి కనువిందు చేయడం తప్ప. అజయ్ ఘోష్ మాత్రం సింహభాగం సినిమా నాక్రమించేశాడు. కూతురి పట్ల ఎంతో ప్రేమ వున్న వాడిగా మొదలై, కూతురిని తల్చుకుని భయపడే వాడుగా మారే పాత్ర ప్రయాణం ఫస్టాఫ్ వరకే ఫర్వా లేదనిపించుకుని వినోద పరుస్తాడు. ఇక్కడితో మారుతీ చేతిలో కథ అయిపోవడంతో, సెకండాఫ్ లో అవే రిపీట్ సీన్లతో, అవే భయాలతో బోరు కొట్టేస్తాడు.

        అతడ్ని భయపెట్టే పాత్రధారులిద్దరూ మూర్తీ, శ్రీనివాసరావులు కూడా కాసేపటికి వాళ్ళ ప్రయత్నాలతో చీకాకు పెట్టేస్తారు. హీరో హీరోయిన్లకి ఫుటేజీ తగ్గి, చాలా మంది కమెడియన్లు స్పేస్ నాక్రమించేశారు. కానీ ఒక్క ప్రవీణ్ తప్ప ఇంకెవరితోనూ కామెడీ పేలకుండా పేలవంగా తయారైంది. వెన్నెల కిషోర్, సప్తగిరి, శ్రీనివాస రెడ్డి, సత్యం రాజేష్, వైవా హర్ష  కామెడీ పాత్రలు ఎందుకొస్తాయో, ఎందుకు పోతాయో తెలీదు. ప్రవీణ్ అప్పడాల విజయలక్ష్మి ఆడవేషం కామెడీ చీప్ కామెడీయే అయినా, మొత్తం సినిమా కామెడీ కంటెంట్ లో ఇదే నయం.

        చాలా కాలం తర్వాత అనూప్ రూబెన్స్ సంగీతంలో రెండు పాటలు బావున్నాయి. లో - బడ్జెట్  పేరేగానీ ఖర్చు మాత్రం బాగానే పెట్టి విజువల్స్ తీశారు. రెండు లొకేషన్స్ లోనే నిర్మాణం జరిపేశారు.

చివరికేమిటి

    ఫస్టాఫ్ ఇంకా కథలోకి వెళ్ళే సమయం కాబట్టి పాత్రల పరిచయాలతో, కామెడీలతో, అజయ్ భయాలతో సరదాగానే వుంటుంది. కథలోకి వెళ్ళాక మాత్రం కథలేక, సరైన కాన్ఫ్లిక్ట్ లేక, హీరో పాత్రకి స్థానం లేక, అజయ్ చుట్టూ వచ్చిన సీన్లే వస్తూ- సీరియస్ గా మారిపోతుంది కథ. భయం అనే పాయింటుకి ఇచ్చిన మెసేజి కూడా తూతూ మంత్రపు వ్యవహారమే. ఇది చెప్పడానికి రెండు గంటల 20 నిమిషాల సేపు లాగారు. పైగా యూత్ ఫుల్ కథనం లేక, ఓల్డ్ స్కూల్ మేకింగ్ తో లేజీగా వుంటుంది. ట్రెండ్ కి తగ్గ మార్కెట్ యాస్పెక్ట్, దానికి తగ్గ క్రియేటివ్ యాస్పెక్ట్ కన్పించవు.     

        మరి మంచి రోజులు దేనికొచ్చాయి? మారుతీ ప్రారంభంలో తీసిన ఈరోజుల్లో’, బస్టాప్ టైపు బూతు కామెడీకా? బూతులు మాత్రం ధారాళంగా పారించేశారు. కాన్సెప్ట్ సరిగ్గా వుంటే ఇంత బూతు మీద ఆధారపడే అవసరం రాక పోయేదేమో. తెలుగులో పోటీ లేకుండా విడుదలైన పండగ సినిమా తీరు ఇలా వుంది. పైగా కోవిడ్ మహమ్మారిని కామెడీ చేశారు. కోవిడ్ తో దేశం అల్లకల్లోలమై జనం చస్తే, మారుతీ కిందులో కామెడీ కని పించడం సృజనాత్మకతే అనాలా!

—సికిందర్

Thursday, November 4, 2021

1075 : రివ్యూ


 దర్శకత్వం : శివ

తారాగణం : రజనీ కాంత్, మీనా, ఖుష్బూ, నయన తార, కీర్తీ సురేష్, జగపతి బాబు, ప్రకాష్ రాజ్, అభిమన్యూ సింగ్, సూరి, సత్యన్, సతీష్, వేలా రామ్మూర్తి, పాండ్యరాజన్ తదితరులు
రచన : శివ -ఆది నారాయణ
, సంగీతం : డి ఇమాన్, ఛాయాగ్రహణం: వెట్రీ
బ్యానర్
; సన్ పిక్చర్స్,
సమర్పణ : కళానిధి మారన్
నిర్మాతలు (తెలుగు డబ్బింగ్) : డి సురేష్ బాబు
, దిల్ రాజు, నారాయణ దాస్ నారంగ్
విడుదల : నవంబర్ 4
, 2021
***

      గ్లోబల్ సూపర్ స్టార్, దాదా సాహెబ్ ఫాల్కే అవార్డు గ్రహీత, తలైవర్ రజనీకాంత్ పండగ కుటుంబ సినిమా, చెల్లెలి సెంటిమెంటు పెద్దన్న - గత సంవత్సరం దీపావళికి రావాల్సింది ఈ దీపావళికి ముస్తాబైంది కోవిడ్ సౌజన్యంతో. ప్రపంచ వ్యాప్తంగా రికార్డు స్థాయిలో 3 వేల థియేటర్లలో విడుదలైన ఈ మల్టీ స్టారర్ లో ముచ్చటగా ముగ్గురు సీనియర్ హీరోయిన్లతో బాటు ఒక తాజా హీరోయిన్ కొలువుదీరింది. మీనా, ఖుష్బూ, నయనతార ప్లస్ కీర్తీ సురేష్ లతో బోలెడు సంసారపక్ష గ్లామర్ షో. మరో ముగ్గురు విలన్లతో రజనీ యాక్షన్ హంగామా. తెలుగులో శౌర్యం’, శంఖం మొదలైన సినిమాలు తీసిన యాక్షన్ - ఎమోషనల్ డ్రామాల దర్శకుడు శివకి తొలిసారిగా రజనీతో డైరెక్షన్. పెద్ద నిర్మాణ సంస్థ, తెలుగులో పెద్ద పంపిణీదార్లు - హంగూ ఆర్భాటం పండగకి తగ్గట్టు ఆకర్షణీయంగానే వుంది. థియేటర్లోకి వెళ్ళాక ఎలా వుంటుంది? చెల్లెలి సెంటిమెంటుతో, పెద్దన్న మమతాను రాగాలతో పండగని ఫీలవుతామా? రజనీ ఎప్పట్లానే పిల్లాపాపల్ని, యువ కెరటాల్ని, ముసలీ ముతకనీ తన మార్కు వినోద కాలక్షేపంతో రంజింపజేస్తాడా? ఇవీ తెలుసుకోవాల్సిన ముఖ్యాంశాలు...    

కథ

   రాజోలులో పెద్దన్న అనే వీరన్న (రజనీకాంత్) పంచాయితీ పెద్ద. ఇతడికి కనకం అనే కనక మహాలక్ష్మి (కీర్తీ సురేష్) ముద్దుల గారాల చెల్లెలు. ఈమెని కంటూ తల్లి చని పొతే చెల్లె పాపగా ప్రాణంలా పెంచి పెద్ద చేశాడు. చెల్లె పాపకి కూడా పంచ కట్టుకునే అన్నంటే పంచ ప్రాణాలు. ఇలా వుండగా ఓ కేసులో తను చెప్పినట్టు చేసిందని లాయరమ్మని (నయనతార) ప్రేమిస్తాడు పెద్దన్న. ఆమె కూడా న్యాయంగా ప్రేమిస్తుంది.

        ఇంతలో ఇద్దరు పెళ్ళయిన మరదళ్ళు (మీనా, ఖుష్బూ) మమ్మల్ని నువ్వు పెళ్ళి చేసుకోకపోతే చేసుకున్న మొగుళ్ళతో మేమెలా అయ్యామో చూడమని వచ్చేసి గొడవ మొదలెడతారు. వీటన్నిటి మధ్య ఇక పెద్దన్నకి చెల్లెలి పెళ్ళి చేయాలన్పించి సంబంధాలు చూసి, ఓ పెద్దమనిషి (ప్రకాష్ రాజ్) కొడుకుతో పెళ్ళి వేడుకలు ప్రారంభిస్తాడు. తీరా పెళ్ళి  సమయానికి చెల్లెలు కనకం చెప్పాపెట్టకుండా ఇంట్లోంచి  వెళ్ళి పోతుంది. పెద్దన్న కంగారు పడతాడు. ఎంత వెతికినా కనపడదు కనకం. పెళ్ళి ఆగిపోతుంది. అలా మాయమై పోయిన కనకం కలకత్తాలో ప్రమాదంలో వుందని తెలుస్తుంది.

        కనకం కలకత్తాలో ప్రమాదంలో ఎందుకుంది? ఎవరా ప్రమాదకారులు? ఇక పెద్దన్న కలకత్తా వెళ్ళి చెల్లెల్ని ఎలా కాపాడుకున్నాడు? ఇదీ రజనీ స్టయిల్ మిగతా కథ.

ఎలావుంది కథ

    రజనీ అలసి పోలేదు, రజనీతో కథలు అలసి పోయాయి. అవే కథలు అలాగే తీసి తీసి రజనీని అపహాస్యం పాల్జేస్తున్నారు. రజనీలో సరుకు అయిపోలేదు, రజనీతో తీసే దర్శకుల్లో కొత్త సరుకు లేదు. రజనీ యాక్టింగ్ స్టయిల్ అదే హైరేంజి లో వుంటే, దాన్ని అందుకోవడంలో యువ దర్శకులుగా విఫలమై, లో- రేంజి ముసలి దర్శకత్వాలతో సరిపెడుతున్నారు. రజనీ వయసై పోయిందనే వాళ్ళు, యువ దర్శకుల వయసై పోయిందని భాష మార్చుకోవాల్సి వుంటుంది.

        రజనీ ఎప్పుడో 30, 40 ఏళ్ళ క్రితం నటించేసిన కథల్లోంచి ఓ చెల్లెలి కథ తీసుకుని ఇప్పటి ప్రేక్షకులకి ఆ కాలపు తరహాలోనే ఉన్నదున్నట్టు అంటగట్టాడు దర్శకుడు శివ. భావోద్వేగాలు ఎప్పుడూ అవే వుంటాయి. వాటిని వ్యక్తం చేసే సినిమా నాటకీయత కాలాన్ని బట్టి మారుతుంది. ఇప్పటి ఏ సినిమాల్లో అన్నాచెల్లెలు దర్శకుడు శివ చూపించినట్టు వుంటున్నారు? ఇది కూడా సరి చూసుకోకూడదా?

        పాత కథల్ని సినిమాలుగా తీయకూడదని కాదు. రీబూట్ చేసి, సమకాలీన కథలన్పించేలా తీయడానికి కూడా బద్ధకమైతే ఎలా? ప్రమాదంలో పడ్డ చెల్లెల్ని అన్న కాపాడాల్సిన అవసరం జీవితంలో ఎప్పుడైనా రావచ్చు. దీనికి ఎక్స్ పైరీ డేట్ వుండదు. కాలాన్ని బట్టి తీరు మారుతుంది. ఈ కాలీన స్పృహ కూడా లేకపోతే సినిమాలు తీయడమెందుకు?

        ఈ కథ థీమ్ తో ఇబ్బంది లేదు. తీసిన విధానమే, పురాతన సినిమా చూస్తున్నట్టు వుంది. అన్నా చెల్లెల సెంటిమెంట్లు, వాళ్ళ సీన్లు, మాటలు, పాటలు, ఎడబాటులో కన్నీళ్ళూ  ఏడ్పులూవీటికి తోడు రజనీ పెద్దరికపు గ్రామీణ దృశ్యాలు, కామెడీలు,  గ్రామీణ విలనీ, కలకత్తా విలనీలూ... ఏదీ నేపథ్యాలు మార్చి కొత్తగా చూపించే బదులు 1980 ల, 90 ల నాటి సినిమా చూడమన్నట్టు చూపించేశాడు ఆలిండియా ప్లస్ ఓవర్సీస్ ప్రేక్షకులకి శివ!

నటనలు- సాంకేతికాలు

  రజనీ రహస్యమేమిటంటే ఏ సినిమాలోనూ బరువెక్కకుండా అదే స్లిమ్ బాడీతో యాక్టివ్ గా వుండడం. ఈ సినిమాలో ఎక్కడా కుదురుగా వుండడు. ఏ సీనులో చూసినా స్పీడుగా నడిచి వచ్చేస్తూ డైలాగులు చెప్పేస్తాడు. తను మూవ్ మెంట్ లో వుండని క్షణం లేదు. తన వల్లే సీన్లు మొరాయించకుండా చకచకా పరిగెడుతూంటాయి. కాలం చెల్లిన కథనీ, పాత్రనీ ఓడించేస్తూ తన సమ్మోహనాస్త్రపు ఛత్రఛాయ కిందికి ప్రేక్షకుల్ని లాక్కొచ్చేస్తాడు. విలన్లనీ, వాళ్ళ ముఠాల్నీ తంతున్నప్పుడు మన ఉద్రేకాలు పెరిగేలా చేస్తాడు. తనకి అన్ని విద్యలూ తెలుసు. మందబుద్ధి మేకర్లే అర్ధం జేసుకోరు. ప్రతీ పాటా జనరంజకం చేసి పెట్టాడు. ఈ సినిమా కథని పూర్వజన్మ కర్మ ఫలమని భరిస్తూ ఏదో కాసేపు చూడాలన్పిస్తే - అది రజనీ గురించీ, సంగీత దర్శకుడు ఇమాన్ గురించే!

        కీర్తి సురేష్ చెల్లెలి పాత్రా, నటనా కీర్తి శిఖరాలందుకునే ప్రమాదముంది. దీంతో ఇతర దర్శకులు ఆమెతో ఇలాటి ప్రయోగాలు చేసినా చేస్తారు. బారసాల నుంచి సీమంతం పాట వరకూ తనెక్కడికో వెళ్ళిపోయింది. ఇంత ప్రాచీన జీవితం ఆమెతో మనం చూడాలి. మధ్యలో పాత మోడల్ మరదళ్ళుగా మీనా, ఖుష్బూల విచిత్ర పాత్రలు, గోల కామెడీ నటనలూ సరే. నేటి సినిమా అంటే ఇలా వుండాలని ప్రేక్షకులకి నేర్పుతున్నాడు దర్శకుడు. మీనా, ఖుష్బూ లకి కూడా ఇదే కరెక్ట్ అన్పించి వుంటుంది. లాయర్ పాత్రలో నయనతార ఒక్కరే రజనీ తర్వాత కాస్త చూడదగ్గదిగా వుంటుంది. రజనీ- నయనల మధ్య ముందొక డ్యూయెట్ పెట్టేశాక, ఇంకా రోమాంటిక్ సీన్లు తలపోయలేదు ఎందుకో శివ.  

        విలన్ల గురించి- ఫస్టాఫ్ లో ప్రకాష్ రాజ్, సెకండాఫ్ లో జగపతిబాబు, అభిమన్యూ సింగ్ లు అత్యంత అర్ధం పర్ధం లేని విలన్ పాత్రలేశారు. చివరి ఇద్దరికీ కీర్తీ సురేష్ తో కుట్రకి కూడా సరైన కారణం కన్పించదు. బోలెడు హింసకి పాల్పడ్డమే విలనీ అనుకుంటే అదిక్కడ వర్కౌట్ కాలేదు, కనెక్టూ కాలేదు. 

        ఇక సంగీత దర్శకుడు ఇమాన్ గురించి. విషయపరంగా సినిమా ఎలా వున్నా, ఆరు పాటలు రజనీకి తగ్గట్టు ఇవ్వడంలో హిట్టయ్యాడు. కానీ బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్కేం చేశాడు? ఇవాళ దీపావళి. టపాకాయలు హోరెత్తుతాయి. దీనికి పోటాపోటీగా అన్నట్టు సినిమా సాంతం లౌడ్ మ్యూజిక్ తో శబ్ద కాలుష్యం సృష్టించి పారిపోయేలా చేశాడు. ఈ సినిమా కెళ్తే ఇంటి కొచ్చి బాణసంచా కాల్చనవసరం లేదు. డబ్బులు ఆదా అవుతాయి.

        నిర్మాణపరంగా బడ్జెట్ కి వెనుకాడలేదు. గ్రామీణ దృశ్యాలు, కలకత్తా దృశ్యాలూ హై రేంజిలో చిత్రీకరించారు. అలాగే యాక్షన్ దృశ్యాలూ. ఓ మూడు నాల్గు సీన్లు తప్పిస్తే, ఏ సీన్లోనూ కనిష్టంగా 50, గరిష్టంగా వందల మందికి తక్కువ కాకుండా క్రౌడ్ సీన్లే వుంటాయి. రజనీని కాసేపు ఒంటరిగా చూద్దామంటే కన్పించడు! ఇది సినిమానా, ఎలక్షన్ ర్యాలీనా అన్నట్టు తీశారు బడ్జెట్టంతా ధారబోసి!

చివరికేమిటి

      ఈ రజనీ కొత్త సినిమా విడుదల ముందు అనుకున్నంత బజ్ క్రియేట్ చేయలేదు తమిళనాడులోనూ, మిగతా దేశంలోనూ. సోషల్ మీడియా స్తబ్దుగా వుండి పోయింది. యూత్ పెద్దగా పట్టించుకోలేదు. ఇక మాస్ మసాలా సినిమాలకి దూరంగా ఆన్ లైన్లో వస్తున్న కొత్త కంటెంట్ కి అలవాటు పడుతున్నారేమో. తెలుగులో కూడా ఈ మధ్య మాస్ సినిమాలకి మాస్ ప్రేక్షకులే కరువయ్యారు. రివ్యూలు రాయడానికి మనం సింగిల్ స్క్రీన్ థియేటర్లలో సినిమాల్ని చూస్తాం. అక్కడైతే అన్ని తరగతుల ప్రేక్షకుల రియాక్షన్ తెలుస్తూంటుంది. ఈ సినిమా మార్నింగ్ షోకి మాస్ తక్కువే వున్నారు. రజనీ కాబట్టి ఆ మాత్రం వచ్చి వుంటారు. వాళ్ళు ఈ పాత అతి మెలో డ్రామా సీన్లకి గట్టిగా నవ్వకుండా వుండ లేక పోయారు. నిజం కంటే న్యాయం గొప్పదని ఒక డైలాగు వుందిందులో. అరిగిపోయిన పాత చింతకాయ కథ అన్న నిజాన్ని దాచి పెడుతూ న్యాయం చేయాలని తెలుసుకోకుండా - దర్శకుడు రెండు దీపావళులు దివ్యంగా గడిపేశాడు...

—సికిందర్ 

 

దేశ విదేశాల పాఠకులందరికీ...



Tuesday, November 2, 2021

1074 : రివ్యూ


 రచన- దర్శకత్వం : టీజే జ్ఞానవేల్
తారాగణం సూర్య, ప్రకాష్ రాజ్, రావు రమేష్,, మణికంఠన్, జీషా విజయన్, లిజోమోల్ జోసీ తదితరులు.
సంగీతం: సీన్ రోల్డన్, ఛాయాగ్రహణం : ఎస్ ఆర్ కదీర్
బ్యానర్: 2డి ఎంటర్ టైన్మెంట్
నిర్మాతలు : సూర్య, జ్యోతిక
విడుదల :  నవంబర్ 2,  2021, అమెజాన్ ప్రైమ్

***

         సంవత్సరం లాక్ డౌన్ పరిస్థితుల్లో సూర్య సూరరై పొట్రు తో ఓటీటీ ప్లాట్ ఫామ్ కెళ్ళింతర్వాత, ఈ సంవత్సరం లాక్ డౌన్ లేకపోయినా తర్వాతి సినిమా జై భీమ్ తోనూ తిరిగి ఓటీటీకే వెళ్ళడం ఓ టాపిక్ గా వుంది తమిళనాడులో. వెంట వెంటనే ఈ రెండూ నిజవ్యక్తుల మీద తీసిన సినిమాలు కావడం ఇంకా హాట్ టాపిక్ అయింది. జై భీమ్ ని తనూ జ్యోతిక కలిసి నిర్మించడం ఇంకో టాపిక్. ఎందుకంటే ఇది రెగ్యులర్ కమర్షియల్ కాదు. టైటిల్ ని బట్టే సామాజిక వాస్తవిక కథా చిత్రమని అర్ధమవుతోంది. స్టార్ గా ఇలాటి సమాంతర సినిమా బాధ్యతలు మీదేసుకుని నిర్మించడం- అందులోనూ ఓటీటీ ద్వారా తమిళ తెలుగు మలయాళ కన్నడ హిందీ భాషల్లో అందించడం, సూర్య తన స్టార్ డమ్ ని పునర్నిర్వచించుకుంటున్న వైనాన్ని తెలుపుతోంది.

        స్టార్లు సామాజిక బాధ్యత ఫీలైనప్పుడే జై భీమ్ లాంటి రియలిస్టిక్ ప్రయత్నాలు సవినయంగా చేస్తారు- కాసేపు ఫ్యాన్స్ కోరికల్ని పక్కన బెట్టి. ఈ దీపావళికే రేపు 4వ తారీఖున సూపర్ స్టార్ రజనీకాంత్ పండగ కుటుంబ సినిమా అన్నాతే (పెద్దన్న) తో థియేటర్ల మీద దండెత్తుతూంటే, తనేమో సూర్య ఇంటి పట్టునే ముందు జై భీమ్ చూసుకుని వెళ్ళమన్నట్టు ఓటీటీ లోంచి పిలుపు నిస్తున్నాడు. కానీ ఇది పండగ మూడ్ కి వ్యతిరేకమైన చాలా సీరియస్ సినిమా. దీన్ని చూడాలంటే మనసు రాయి చేసుకోవాలి. పండగంటే మన ఆనందాలే కాదు, ఇతరుల ఆక్రందనలు కూడా. రెండూ అనుభవించాలి. ఏమిటా ఆక్రందనలు? ఎవరివా ఆక్రందనలు? ఓసారి చూసి వద్దాం... 

కథ

     ఓ గిరిజన ప్రాంతంలో రాజన్న (మణికందన్) పాములు పట్టే వాడుగా వుంటాడు. ఒక రోజు వూళ్ళో రాజకీయనాయకుడి ఇంట్లో పాము జొరబడితే వెళ్ళి పట్టుకుంటాడు. రాజన్న భార్య చిన్నతల్లి (లీజోమోల్ జోసీ) తో, ఓ కూతురితో ఆనందంగా గడుపుతూంటాడు. ఇంతలో రాజకీయ నాయకుడి ఇంట్లో నగలు పోయాయని కంప్లెయింట్ వస్తే, ఆ రోజు పాము పట్టడానికి వచ్చిన రాజన్నే ఈ పనిచేసి వుంటాడని పట్టుకెళ్ళి కొడతారు పోలీసులు. తనకి తెలియదన్నా విపరీతంగా కొట్టి గాయపరుస్తారు. రాజన్న కోసం భార్య వస్తే తప్పించుకుని పారిపోయాడని చెప్తారు. ఇక దిక్కు తోచని చిన్నతల్లి నాల్గు చోట్ల చెప్పుకుని, ఎక్కడా లాభం లేక లాయర్ చంద్రు (సూర్య) దగ్గరి కెళ్తుంది. కేసు సానుభూతితో విన్న చంద్రు, హైకోర్టులో రాజన్న ఆచూకీ గురించి హేబియస్ కార్పస్ కేసు వేస్తాడు.

        ఇప్పుడీ కేసు సీరియస్ గా చేపట్టిన చంద్రుకి రాజకీయంగా ఎలాటి సవాళ్ళు ఎదురయ్యాయి? కేసు వాపసు తీసుకోవాలని చిన్న తల్లి మీద పోలీసులు ఎలాటి కుట్రలు చేశారు? అసలు రాజన్న ఏమయ్యాడు? ఈ కేసులో చంద్రు న్యాయం సాధించగల్గాడా? ఏ ఏ వృత్తి నైపుణ్యాలు ప్రయోగించి గెలిచాడు? ఈ ప్రశ్నలకి సమాధానమే మిగతా కథ.

ఎలావుంది కథ

      తమిళనాడు కడలూర్ జిల్లాలో బుట్టలు అల్లే కురుంబర్ గిరిజన తెగకి చెందిన 4 కుటుంబాలు ఇరవై ఏళ్ళకి పైగా అక్కడ నివాసముండేవి. ఆ కుటుంబాల్లో రాజకన్ను  కుటుంబం ఒకటి. వీరు పంట కోతల సమయంలో చుట్టు పక్కల పొలాల్లో కూలీకి వెళ్ళే వాళ్ళు. ఇలా వుండగా, 1993 లో ఓ రోజు గోపాల పురం అనే వూరికి కూలీ కెళ్ళారు. అక్కడ కూలీ పూర్తి చేసుకుని డబ్బులూ ధాన్యాలతో తిరిగొచ్చేశారు. ఇంతలో ఆ వూళ్ళో ఒకింట్లో నగలు దొంగతనం జరిగాయని పోలీసులకి ఫిర్యాదు అందింది. పోలీసులు రాజకన్నుని పట్టుకెళ్ళి దొంగతనం మోపి చిత్రహింసలు పెట్టారు. రాజకన్ను భార్య పోలీస్ స్టేషన్ కెళ్ళి అడిగితే, తప్పించుకుని పారిపోయాడని చెప్పారు.

        దీన్ని నమ్మని ఆమె పై పోలీసు అధికారుల్నీ, కలెక్టర్నీ కూడా కలిసింది. ఫలితం లేకపోవడంతో కమ్యూనిస్టు పార్టీ నాశ్రయించింది. రాజకన్నుని పోలీసులే కొట్టి చంపేశారని కమ్యూనిస్టు పార్టీ ఆందోళన చేపట్టింది. ఇది కూడా నిష్ఫలమవడంతో లాయర్ చంద్రు సాయం చేస్తాడని చెప్పారు పార్టీ నేతలు. రాజకన్ను భార్య లాయర్ చంద్రుని కలిసి చెప్పుకుంది. అతను హైకోర్టు లాయర్. మానవ హక్కుల కేసుల్ని ఫీజులు తీసుకోకుండా వాదిస్తాడు.

        చంద్రు హేబియస్ కార్పస్ కేసు వేయడంతో విచారణ చేపట్టిన హైకోర్టు, మధ్యంతర ఉత్తర్వులిచ్చింది. బాధితురాలి కుటుంబానికి 3 సెంట్ల భూమి, 2.65 లక్షల నగదు తాత్కాలిక సాయంగా అందించాలని.  తర్వాత హైకోర్టు ఆదేశాలందుకుని దర్యాప్తుకి దిగిన పోలీసులు ఒక పడవలో దొరికిన మృతదేహం రాజకన్నుతో సరిపోలడాన్ని రిపోర్టు చేశారు. దీంతో రాజకన్ను అదృశ్య కేసు హత్య కేసు గా నమోదై తాజాగా విచారణ కొనసాగింది. చిట్టచివరికి 13 ఏళ్ళ తర్వాత 2006 లో, కడలూర్ కోర్టులోనూ, ఫాస్ట్ ట్రాక్ కోర్టులోనూ విచారణ పూర్తయి తీర్పు వెలువడింది. కేసులో మొత్తం 12 మందిని దోషులుగా నిర్ధారించారు. అందులో డిఎస్పీ, ఇన్స్ పెక్టర్, అసిస్టెంట్ ఇన్స్ పెక్టర్, ఒక డాక్టర్ కూడా వున్నారు. వీళ్ళందరికీ జైలు శిక్షలు పడ్డాయి. రాజకీయ పార్టీల నుంచి అనేక బెదిరింపులూ వేధింపులూ ఎదుర్కొంటూనే కేసు పోరాడి విజయం సాధించాడు లాయర్ చంద్రు. అతను ప్రస్తుతం రిటైర్డ్ హైకోర్టు జడ్జి. 75 ఏళ్ళ రాజకన్ను  భార్య జీవించే వుంది.

        ఈ ఉదంతమంతా కొన్ని మార్పులతో  జైభీమ్ కథగా తెరకెక్కింది. ఇది 2016 లో వెట్రిమారన్ టెర్రిఫిక్ తీసిన విశారనై ని గుర్తు చేస్తుంది. ఇది కూడా మానవ హక్కుల ఉల్లంఘన కేసు ఆధారంగానే తీశారు. 1983 లో గుంటూరులో నల్గురు తమిళనాడు వలస కూలీల్ని దొంగతనం కేసులో ఇరికించి పోలీసులు చిత్ర హింసలు పెడుతూంటే, దీని వెనుకున్న కొన్ని రాజకీయ రహస్యాలు బయట పడకూడదని, చెన్నై పోలీసులు వాళ్ళని పట్టుకెళ్ళి లాకప్ డెత్తులూ, ఎన్కౌంటర్లూ చేసి చేతులు దులుపు కున్నారు.

        ఈ నిజ కథా చిత్రం కూడా మానవ హక్కుల దుస్థితిని దృశ్యీకరిస్తుంది. విశారనై’, జై భీమ్ రెండిట్లోనూ బాధితులు ఏ దిక్కూ లేని బడుగు జనాలే. న్యాయం కోసం వాళ్ళు చేసే ఆక్రందనలే. వీళ్ళతో ముందూ వెనుకా చూడకుండా పోలీసులు పాల్పడే అకృత్యాలే. ఏ దోలా డ్యూటీ పూర్తవడానికి ఈజీ టార్గెట్లు గా కన్పించే వీళ్ళని నిలువునా బలి చేయడాలే. ఇలా పోలీసులు పాల్పడే  మానవ హక్కుల ఉల్లంఘనల మీద అనేక సినిమాలు వివిధ భాషల్లో వచ్చి వుంటాయి. కానీ విశారనై అంత పచ్చిగా ఇంకోటి రావడం ఇప్పుడు  జై భీమ్ రూపంలోనే. చాలా పచ్చిగా, గగుర్పాటు కల్గించేదిగా. పోలీసు రెండో ముఖాన్నినిర్మొహమాటంగా విప్పి చూపించే వాస్తవిక సినిమాలివి. దేశంలో ఇంకెవరూ  ప్రయత్నించని స్థాయిలో ఈ రెండు పచ్చి వాస్తవికాలు తమిళంలోనే ప్రయోజనాత్మకంగా వచ్చాయి.

        విశారనై తో లాగే జై భీమ్ తో కూడా పోలీసులేం నీతి తెలుసుకుంటారో గానీ- ఎవరో రాజకీయ నాయకుల కోసం ఇలాటి దుశ్చర్యలకి పాల్పడితే - ఆ రాజకీయనాయకులే దృశ్యంలోకే రాకుండా, కేసుతో సంబంధం లేకుండా ఎక్కడో వుంటారు- పోలీసులు కటకటాల వెనక్కి వెళ్ళి ఏడ్వడమే.

         విశారనై కి  మూడు జాతీయ అవార్డులు లభించడంతో బాటు, ఆస్కార్ అవార్డులకి ఎంపిక కూడా అయి సంచలనం సృష్టించింది. అయితే హద్దుల్లేని హింస చూపించిన కారణంగా ఆస్కార్ నామినేషన్ కి నోచుకోకుండా ఎంపిక దగ్గరే ఆగిపోయింది. దేశంలో ఇంకే సినిమా చూపించనంత హింసతో పోలీసుల అకృత్యాల్ని చూపించాడు వెట్రిమారన్. వాస్తవంగా జరుగుతున్న మానవ హక్కుల ఉల్లంఘన ఏ స్థాయిలో జరుగుతోందో నిజాన్ని ప్రజలకి తెలియజేయకపోతే ఈ కథల్లో సదరు బాధితులకి న్యాయం చేసినట్టవదు. ఈ కథల్లో  జరిగినట్టు ఎక్కడైనా ఎవరికైనా జరగవచ్చన్న హెచ్చరిక వీటిలో  ప్రధానంగా వుంది.

        ఆల్రెడీ ఇలాటి కథగా విశారనై వచ్చేశాక, తను చూపించిన తేడా ఏమిటనేది జైభీమ్ దర్శకుడు జ్ఞానవేల్ ముందుండే ప్రశ్న. దీనికి - అడవి మృగాల కంటే పట్టణ మనిషే గిరిజన జీవితాలకి అత్యంత ప్రమాదకరమని దీటైన సమాధానమిచ్చేలా విషయం చెప్పాడు. అయితే ఈ కథ కోర్టు రూమ్ డ్రామా జానర్ కావడంతో, సహజంగానే అలాటి టెంప్లెట్ రొటీన్ దృశ్యాల పరంపరకి లోనవక తప్పలేదు.

నటనలు- సాంకేతికాలు

   ‘సూరరై పొట్రు లో ఏర్ డెక్కన్ వ్యవస్థాపకుడు  కెప్టెన్ జీఆర్ గోపీనాథ్ బయోపిక్ నటించిన సూర్య, ఈసారి నాటి లాయర్, నేటి రిటైర్డ్ హైకోర్టు జడ్జి చంద్రుగా నటించాడు. తన రెగ్యులర్ కమర్షియల్ హంగూ ఆర్భాటాలూ అన్నీ తీసి పక్కన పెట్టాడు. కెప్టెన్ గోపీనాథ్ గా నటించినప్పుడు మాత్రం అన్ని మసాలాలూ కలిపి రెగ్యులర్ సూర్య లాగే నటించాడు. లాయర్ చంద్రుగా నటనలో వ్యాపార ధోరణిని పక్కన పెట్టేసి, తనకో హీరోయిన్ వుండాలన్న ఆలోచనే చేయకుండా, మానవ హక్కుల కార్యకర్త పాత్ర అత్యంత సహజ ధోరణిలో పోషించాడు. బాధిత పాత్ర చిన్నతల్లి తో అతడి ఔదార్యం చూసినా, ఒక సమయంలో ఆగ్రహం చూసినా, అలాగే కోర్టు దృశ్యాల్లో వృత్తితత్వంతో కూడిన వాద ప్రతివాదాల ధోరణి చూసినా- నటుడిగా తనని తాను పరీక్షించుకునే అవకాశంగానే దీన్ని తీసుకున్నాడు. ఈ పరీక్ష సునాయాసంగా నెగ్గేశాడు.

        రెండో ముఖ్య పాత్ర చిన్నతల్లిగా లిజోమోల్ జోసీ ఒక వండర్. గిరిజనురాలి పాత్రలో రంగూ హంగూ అచ్చం సరిపోయి, ఆమె నటి అని చెప్తే తప్ప తేడా గుర్తించలేనంత ప్రాంతీయత కలగలిసిపోయి కనిపిస్తుంది. పాత్ర నిడివీ ఎక్కువే. సంఘర్షణా చూసినా సూర్య పాత్రతో సమానమే. ఆమె పాత్ర తీరుకి, న్యాయ పోరాటానికీ ముక్తాయింపుగా మట్టిలో తేమ వుంది, రేయికో వెన్నెలుంది అని అర్ధవంతమైన పాట రాశాడు కవి.

        ఇక ప్రకాష్ రాజ్, రావు రమేష్ పాత్రలు  రెండూ రెండు ధృవాలు. ప్రకాష్ రాజ్ సూర్యకి సహకరించే, హూందాగా మాట్లాడే  ఉన్నత పోలీసు అధికారైతే, రావు రమేష్ సూర్యని వ్యతిరేకించే, వ్యంగ్యంగా మాట్లాడే పబ్లిక్ ప్రాసిక్యూటర్. ఇద్దరూ ఈ వాస్తవిక సినిమాకి ఓ నిండుదనాన్ని తెచ్చారు.

        రాజన్నగా నటించిన మణికందన్ తప్పకుండా ఉత్తమ నటుడవుతాడు. తొలి సన్నివేశాలు వదిలేసి తర్వాత చూస్తే, ఎప్పుడు చూసినా పోలీస్ టార్చర్ తో గావు కేకలే. గావు కేకలేయడం కూడా నటనేనా అంటే, ఒక కేక ఇంకో కేకలా అన్పించకుండా వేయడం కష్టమైన నటనే. సూర్య లాయర్ పాత్ర అసిస్టెంట్ గా జీషా విజయన్ నటించింది. ఇంకా 205 మంది సహాయ నటీనటులున్నారు.

        సాంకేతికంగా 1990 లనాటి వాతావరణ సృష్టి ప్రదర్శిస్తున్నట్టుగాక, సన్నివేశాల్లో సంలీనమైపోయి వుంటుంది. కళాదర్శకత్వం కే కదీర్. టార్చర్, యాక్షన్ దృశ్యాల కొరియోగ్రాఫర్ అన్బీరవ్. ఛాయాగ్రహణం ఎస్ఆర్ కదీర్, సంగీతం సీన్ రోల్డన్ (కర్ణాటక సంగీత కారుడు రాఘవేంద్ర రాజా రావు), కూర్పు ఫీలోమిన్ రాజ్...వీళ్ళందరూ గిరిజన తత్వాన్ని యావత్తూ రంగరించేశారు. సూర్య స్టార్ హవా కోసం ఎక్కడా ప్రయత్నించ లేదు. కాకపోతే నిడివి రెండు గంటల 44 నిమిషాలు చాలా ఎక్కువ.

చివరికేమిటి


     మధ్య మధ్యలో బాధితుల ఫ్లాష్ బ్యాక్స్ తో, సాక్షుల మల్టీపుల్ ఫ్లాష్ బ్యాక్స్ తో ఈ కథ నడిపారు. త్రీయాక్ట్స్ స్ట్రక్చర్లో కాల నియమాలు పాటిస్తూ వేగవంతమైన కథనం చేశారు. కాకపోతే మొత్తం కలిపి నిడివి ఎక్కువై పోయింది. మొదటి పాతిక నిమిషాలు సూర్య లేకున్నా, మణికందన్ పాత్రతో కాలమే తెలియనంత వేగంగా అడవిలో గిరిజన జీవన నేపథ్యాన్ని ఏర్పాటు చేసేసి, అతను అరెస్టయి, భార్య న్యాయ సహాయం కోసం సూర్య దగ్గరి కొచ్చే మొదటి మలుపు వరకూ లీనియర్ కథనమే నడుస్తుంది.

       ఏం జరిగిందో చెప్పు, ఎక్కువ చెప్పకు అని సూర్య ఆమెతో అనడంతో, ఆమె ఫ్లాష్ బ్యాక్ లో జరిగింది చెప్పుకొస్తుంది. ఎక్కువ చెప్పకు అని డైలాగు రాసి, ఎక్కువ కంటే ఎక్కువన్నర ఫ్లాష్ బ్యాక్ చెప్పుకుంటూ వెళ్లిపోయాడు కథకుడు. ఎక్కువ చెప్పకు అని సూర్య కథకుడికి చెప్పి వుండాల్సింది. ఈ ఎక్కువ చెప్పడం వల్లే రెండు గంటల 44 నిమిషాలు పట్టింది. ఇది రియలిస్టిక్ సినిమా ధర్మం కాదు.

        ఈ ఫ్లాష్ బ్యాక్ లో పోలీస్ టార్చర్ చూపిన విధం రెగ్యులర్ మాస్ సినిమాల్లోలాగా లేదు. రెగ్యులర్ మాస్ సినిమాల్లో టార్చర్ ఎంటర్ టైన్ చేస్తుంది. ఇక్కడ వెంట్రుకలు నిక్కబొడుచుకుంటాయి. ఎవరైనా పోలీసులు ఈ టార్చర్ ఐడియాలు ఇచ్చారా అన్నట్టు షాకింగ్ గా వుంటాయి. దీని తర్వాత సూర్య హైకోర్టులో కేసు వేయడంతో మొదలవుతుంది కోర్టు రూమ్ డ్రామా. దీని ఆధారంగానే మిగతా సెకండాఫ్ కథ.

        కోర్టు రూమ్ డ్రామా టెంప్లెట్ తెలిసిందే. ఒక కోర్టు సీను, తర్వాత బయట ఒక రిలీఫ్ సీను, మళ్ళీ కోర్టు సీను, బయట ప్రత్యర్ధులతో ఒక యాక్షన్ సీను, మళ్ళీ కోర్టు సీను...ఇలా లోపలా బయటా సీన్లు నడుస్తూంటాయి. చూసి చూసి వున్న ఈ టెంప్లెట్ ని దర్శస్కుడు బ్రేక్ చేసి వుండాల్సింది.

        ఒక రిలీఫ్ సీన్లో చిన్నతల్లి భర్తతో తల్చుకునే రోమాంటిక్ సీను వేసి పాట కూడా పెట్టారు. ఈ కోర్టు రూమ్ డ్రామా మొదటి దశలో రాజన్న అదృశ్యం గురించే వాదోప వాదాలుంటాయి. సూర్య ఇన్వెస్టిగేషన్లో రాజన్న గురించి అసలు నిజం తెలియడం రెండో దశ. ఈ దశ కోర్టు రూమ్ డ్రామాలో మెడికల్ సాక్ష్యాల పరిశీలన వుంటుంది. తర్వాత పోలీసుల వాదనతో మూడో దశ వుంటుంది. ఈ దశలో సాక్షులుగా పోలీసులతో నడుస్తుంది. ఈ మొత్తం వాదోపవాదాల్లో మల్టీపుల్ ఫ్లాష్ బ్యాకుల్లో రాజన్న అరెస్టు దగ్గర్నుంచీ చివరి వరకూ ఏమేం జరిగాయో దృశ్యాలు వస్తూంటాయి.

        మొత్తంగా చూస్తే ఇదొక  మిస్టరీ  కథ. మిస్టరీని తేల్చే లాజిక్స్, ఇల్లాజిక్స్ ల సంఘర్షణ. ఏకాగ్రతతో ఫాలో అయి చూస్తే వ్యవస్థ ఎలా పనిచేస్తుందో తెలుస్తుంది. అంతర్లీనంగా న్యాయంకోసం ఆక్రందన ఈ ఇన్వెస్టిగేషన్ కథనానికి జీవం పోస్తుంది. అయితే చివర కోర్టు తీర్పూ, అందులో చేసిన వ్యాఖ్యలూ బలహీనంగా లేకుండా చూసుకోవాల్సింది. దర్శకుడు జ్ఞానవేల్ కి రచించి చిత్రీకరించడంలో రియలిస్టిక్ జానర్ మీద మంచి పట్టు వుందనేది మాత్రం ఒప్పుకోవాల్సిన విషయం. కొత్త దర్శకులు చాలా నేర్చుకోవచ్చు. తెలుగులో ఇలా తీస్తారో లేదో అనేది దేవుడెరుగు.

       

—సికిందర్   

 

Saturday, October 30, 2021

1073 : రివ్యూ

 

రచన - దర్శకత్వం : లక్ష్మీ సౌజన్య
తారాగణం : నాగశౌర్య
, రీతూ వర్మ, మురళీ శర్మ, నదియా, జయప్రకాష్, వెన్నెల కిషోర్, సప్తగిరి తదితరులు
సంగీతం : విశాల్ చంద్ర శేఖర్
, ఛాయాగ్రహణం : పి. వంశీ, విష్ణు శర్మ
బ్యానర్ : సితార ఎంటర్ టైన్మెంట్స్
నిర్మాత : సూర్యదేవర నాగ వంశీ
విడుదల : అక్టోబర్ 29
, 2021

***

        కొత్త దర్శకురాలు లక్ష్మీ సౌజన్యతో నాగశౌర్య ప్రేమ కథతో దీపావళి ప్రేక్షకుల హృదయాల్లో కాకర పువ్వొత్తులు వెలిగించడానికి వచ్చాడు. పెళ్ళిచూపులు ఫేమ్ రీతూ వర్మ గ్లామర్ తోడయ్యింది. దీనికి పేరున్న సితార ఎంటర్ టైన్మెంట్స్ సంస్థ తోడ్పాటునందించింది. ఇన్ని హంగులతో ఏమిటి కొత్త దర్శకురాలు అందిస్తున్న ప్రేమ కథ? ఇది చూద్దాం...

కథ

    ఫారిన్ నుంచి ఆకాష్ (నాగశౌర్య) హైదారాబాద్ వస్తాడు. అతను ఆర్కిటెక్ట్. హైదారాబాద్ లో భూమి (రీతూ వర్మ) ఒక స్టార్ట్ అప్ కంపెనీ నడుపుతూ వుంటుంది. ఆమె చాలా కఠినంగా వుంటుంది. ఎవరితోనూ సరిగా మాట్లాడదు. ఆమె కంపెనీకి ఆకాష్ డిజైన్ చేసి ఇస్తాడు. ఈ క్రమంలో ఆమెని ఆకర్షించాలని ప్రయత్నిస్తాడు. ప్రేమించాలనీ చూస్తాడు.  ఆమె ఇవేవీ ఒప్పుకోదు. ఆమె తల్లి (నదియా)మాత్రం సంబంధాలు చూస్తూంటుంది. భూమికి పెళ్ళి ఇష్టముండదు. కారణం చెప్పదు. ఇంతలో భూమి, ఆకాష్ లు విడిపోయే సంఘటన జరుగుతుంది. ఏమిటా సంఘటన? ఎందుకు విడిపోయారు? ఎలా కలుసుకున్నారు? ఇదీ మిగతా కథ...

ఎలావుంది కథ

    ప్రేమికులు విడిపోయి కలుసుకునే రోటీన్ తెలుగు ప్రేమ సినిమా కథ. ఒక మాటతో తేలిపోయే సమస్యకి సాగదీస్తూ పోయే కథ. అసలు చెప్పాలనుకున్న పాయింటేమిటంటే, తల్లిదండ్రులు కొడుకులకి పెళ్ళి చేసుకోవడానికి చాలినంత సమయమిస్తారు, అదే కూతుళ్ళ విషయంలో తొందర పెడతారెందుకు, మానసికంగా సిద్ధంగా వున్నారో లేదో తెలుసుకోరెందుకు - ఇదీ చెప్పాలనుకున్న పాయింటు, కథ.

        హీరోయిన్ తండ్రి (మురళీ శర్మ) ఈ పాయింటు రైజ్ చేయడానికి సెకండాఫ్ లో సగం వరకూ సమయం పట్టింది. అంటే సకాలంలో కాన్ఫ్లిక్ట్ ఏర్పాటు కాని మిడిల్ మటాష్ స్క్రీన్ ప్లే అన్నమాట. ఇలా ఫస్టాఫ్ నుంచీ సెకండాఫ్ లో సగం వరకూ ఈ పాయింటు వచ్చే దాకా ఏమీ జరగదు, అంటే కథే మొదలు కాదు. ఈ పాయింటుతో కథ మొదలయ్యాక కూడా ఏం చేయాలో అర్ధంగాక, ఫ్లాష్ బ్యాక్, కామెడీ ట్రాక్, పాటలూ వంటి వాటిని భర్తీ చేశారు. కథ కాని, కథే లేని కథతో సినిమా తీసిన  దర్శకురాలి ధైర్యానికి మెచ్చుకోవాల్సిందే. ఈ సినిమా కథా మూలాల గురించి నెట్లో రెండు టైటిల్స్ చక్కర్లు కొడుతున్నాయి. నాగార్జున మన్మథుడు’, జగపతి బాబు ప్రవరాఖ్యుడు రెండూ కలిపితే వరుడు కావలెను కాలం చెల్లిన కథ అని.

నటనలు – సాంకేతికాలు
      పాత్ర నటించడం కంటే (నటించడానికి పాత్రలో ఏముందని) ఫ్యాషన్ పెరేడ్ చేస్తున్నట్టు స్టయిలిష్ కాస్ట్యూమ్స్ తో నాగశౌర్య చేసిన ప్రదర్శన దీపావళికి హోమ్లీగా, కనువిందుగా వుంది.  రీతూ వర్మ పాత్రకే కథ వుంది, దాంతో పాత్రకి కొంత బలమూ వుంది. మోస్ట్ ఎలిజిబుల్ బేచిలర్ లో పూజా హెగ్డే పాత్రకి లాగా. ఈ నేపథ్య బలంతో స్ట్రిక్టు ఆఫీసు బాస్ గా చక్కగా నటించింది. తల్లిగా నటించిన నదియా గురించి చెప్పాల్సిన అవసరం లేదు. సెకండాఫ్ కామెడీ ట్రాకు నడిపించిన సప్తగిరి కథలేని సినిమాకి కాస్త దిక్కు. కానీ వెన్నెల కిషోర్ కామెడీ మోస్ట్ ఎలిజిబుల్ బేచిలర్ లో లాగే మరోసారి విఫలమైంది.

        ఈ సినిమాలో రెండు పాటలు క్యాచీగా వుంటూ హిట్టయ్యాయి. మిగిలిన పాటలు- దిగు దిగు నాథ తో పాటు ఏవరేజి. ఇక విజువల్స్, నిర్మాణ విలువలూ ఫ్రెష్ గా రోమాంటిక్ ఫీల్ ని సరఫరా చేసేలా వున్నాయి-  ఈ ఫీల్ కథా కథనాలతో లేకపోయినా. 

చివరికేమిటి

     పాతబడిన రొటీన్ కథ, అందులోనూ సెకండాఫ్ సగం వరకూ కథేమిటో  తెలియని కథ కాని కథ. ఫస్టాఫ్ ముప్పావుగంటా హీరోహీరోయిన్ల కలుసుకోవడాలు, ముచ్చట్లాడు కోవడాలూ తప్ప ఏమీ జరగని విసుగు. ఆ తర్వాత హీరోహీరోయిన్లు విడిపోవడమనే ఒక మలుపుతో రిలీఫ్ పొందినా, సెకండాఫ్ లో షరా మామూలే. కాలేజీ ఫ్లాష్ బ్యాక్ ఒక పెద్ద విఫలమైన సృజనాత్మకత. పైన చెప్పుకున్న అసలు పాయింటు వచ్చి మళ్ళీ మనకి హుషారు వచ్చినా, ఆ పాయింటు కూడా ఎటూ కదలక మొరాయించడం. సప్తగిరి వచ్చి కామెడీ ట్రాకుతో లేపడం. ఇంకెలాగో కథని ముగించడం. హుషారు తెప్పించేలా వుండాల్సిన ప్రేమ సినిమాలు ఇలా ఓల్డేజీ హోమ్ లో వున్నట్టు ఎందుకుంటున్నాయో ప్రశ్నించుకుంటే బావుంటుంది. దీనికి సినిమా సమీక్షకుడు గణేశ్ రావూరి మాటలు రాశాడు. కానీ ఫ్రెష్ గా వున్న మాటలు విషయం లేని  ఇంత పురాతన కథని ఏం ఆదుకుంటాయి.

—సికిందర్