రచన- దర్శకత్వం : టీజే జ్ఞానవేల్
తారాగణం సూర్య, ప్రకాష్ రాజ్, రావు రమేష్,, మణికంఠన్, జీషా విజయన్, లిజోమోల్ జోసీ తదితరులు.
సంగీతం: సీన్ రోల్డన్, ఛాయాగ్రహణం : ఎస్ ఆర్ కదీర్
బ్యానర్: 2డి ఎంటర్ టైన్మెంట్
నిర్మాతలు : సూర్య, జ్యోతిక
విడుదల : నవంబర్ 2, 2021, అమెజాన్ ప్రైమ్
***
గత సంవత్సరం లాక్
డౌన్ పరిస్థితుల్లో సూర్య ‘సూరరై పొట్రు’ తో ఓటీటీ ప్లాట్ ఫామ్ కెళ్ళింతర్వాత, ఈ సంవత్సరం లాక్
డౌన్ లేకపోయినా తర్వాతి సినిమా ‘జై భీమ్’ తోనూ తిరిగి ఓటీటీకే వెళ్ళడం ఓ టాపిక్ గా వుంది తమిళనాడులో. వెంట వెంటనే
ఈ రెండూ నిజవ్యక్తుల మీద తీసిన సినిమాలు కావడం ఇంకా హాట్ టాపిక్ అయింది. ‘జై భీమ్’ ని తనూ జ్యోతిక కలిసి నిర్మించడం ఇంకో
టాపిక్. ఎందుకంటే ఇది రెగ్యులర్ కమర్షియల్ కాదు. టైటిల్ ని బట్టే సామాజిక వాస్తవిక
కథా చిత్రమని అర్ధమవుతోంది. స్టార్ గా ఇలాటి సమాంతర సినిమా బాధ్యతలు మీదేసుకుని
నిర్మించడం- అందులోనూ ఓటీటీ ద్వారా తమిళ తెలుగు మలయాళ కన్నడ హిందీ భాషల్లో
అందించడం, సూర్య తన స్టార్ డమ్ ని పునర్నిర్వచించుకుంటున్న వైనాన్ని
తెలుపుతోంది.
స్టార్లు
సామాజిక బాధ్యత ఫీలైనప్పుడే ‘జై భీమ్’ లాంటి
రియలిస్టిక్ ప్రయత్నాలు సవినయంగా చేస్తారు- కాసేపు ఫ్యాన్స్ కోరికల్ని పక్కన బెట్టి.
ఈ దీపావళికే రేపు 4వ తారీఖున సూపర్ స్టార్ రజనీకాంత్ పండగ కుటుంబ సినిమా ‘అన్నాతే’ (పెద్దన్న) తో థియేటర్ల మీద దండెత్తుతూంటే, తనేమో సూర్య ఇంటి పట్టునే ముందు ‘జై భీమ్’ చూసుకుని వెళ్ళమన్నట్టు ఓటీటీ లోంచి పిలుపు నిస్తున్నాడు. కానీ ఇది పండగ
మూడ్ కి వ్యతిరేకమైన చాలా సీరియస్ సినిమా. దీన్ని చూడాలంటే మనసు రాయి చేసుకోవాలి.
పండగంటే మన ఆనందాలే కాదు, ఇతరుల ఆక్రందనలు కూడా. రెండూ
అనుభవించాలి. ఏమిటా ఆక్రందనలు? ఎవరివా ఆక్రందనలు? ఓసారి చూసి వద్దాం...
ఓ గిరిజన ప్రాంతంలో రాజన్న (మణికందన్)
పాములు పట్టే వాడుగా వుంటాడు. ఒక రోజు వూళ్ళో రాజకీయనాయకుడి ఇంట్లో పాము జొరబడితే
వెళ్ళి పట్టుకుంటాడు. రాజన్న భార్య చిన్నతల్లి (లీజోమోల్ జోసీ) తో, ఓ కూతురితో ఆనందంగా గడుపుతూంటాడు. ఇంతలో రాజకీయ నాయకుడి ఇంట్లో నగలు
పోయాయని కంప్లెయింట్ వస్తే, ఆ రోజు పాము పట్టడానికి వచ్చిన
రాజన్నే ఈ పనిచేసి వుంటాడని పట్టుకెళ్ళి కొడతారు పోలీసులు. తనకి తెలియదన్నా విపరీతంగా
కొట్టి గాయపరుస్తారు. రాజన్న కోసం భార్య వస్తే తప్పించుకుని పారిపోయాడని చెప్తారు.
ఇక దిక్కు తోచని చిన్నతల్లి నాల్గు చోట్ల చెప్పుకుని, ఎక్కడా
లాభం లేక లాయర్ చంద్రు (సూర్య) దగ్గరి కెళ్తుంది. కేసు సానుభూతితో విన్న చంద్రు, హైకోర్టులో రాజన్న ఆచూకీ గురించి హేబియస్ కార్పస్ కేసు వేస్తాడు.
ఇప్పుడీ కేసు సీరియస్ గా చేపట్టిన
చంద్రుకి రాజకీయంగా ఎలాటి సవాళ్ళు ఎదురయ్యాయి? కేసు వాపసు
తీసుకోవాలని చిన్న తల్లి మీద పోలీసులు ఎలాటి కుట్రలు చేశారు?
అసలు రాజన్న ఏమయ్యాడు? ఈ కేసులో చంద్రు న్యాయం సాధించగల్గాడా? ఏ ఏ వృత్తి నైపుణ్యాలు ప్రయోగించి గెలిచాడు? ఈ
ప్రశ్నలకి సమాధానమే మిగతా కథ.
తమిళనాడు కడలూర్ జిల్లాలో బుట్టలు అల్లే
కురుంబర్ గిరిజన తెగకి చెందిన 4 కుటుంబాలు ఇరవై ఏళ్ళకి పైగా అక్కడ నివాసముండేవి. ఆ
కుటుంబాల్లో రాజకన్ను కుటుంబం ఒకటి. వీరు
పంట కోతల సమయంలో చుట్టు పక్కల పొలాల్లో కూలీకి వెళ్ళే వాళ్ళు. ఇలా వుండగా, 1993 లో ఓ రోజు గోపాల పురం అనే
వూరికి కూలీ కెళ్ళారు. అక్కడ కూలీ పూర్తి చేసుకుని డబ్బులూ ధాన్యాలతో తిరిగొచ్చేశారు.
ఇంతలో ఆ వూళ్ళో ఒకింట్లో నగలు దొంగతనం జరిగాయని పోలీసులకి ఫిర్యాదు అందింది. పోలీసులు
రాజకన్నుని పట్టుకెళ్ళి దొంగతనం మోపి చిత్రహింసలు పెట్టారు. రాజకన్ను భార్య పోలీస్
స్టేషన్ కెళ్ళి అడిగితే, తప్పించుకుని పారిపోయాడని చెప్పారు.
దీన్ని నమ్మని ఆమె పై పోలీసు అధికారుల్నీ, కలెక్టర్నీ కూడా కలిసింది. ఫలితం లేకపోవడంతో కమ్యూనిస్టు పార్టీ నాశ్రయించింది.
రాజకన్నుని పోలీసులే కొట్టి చంపేశారని కమ్యూనిస్టు పార్టీ ఆందోళన చేపట్టింది. ఇది
కూడా నిష్ఫలమవడంతో లాయర్ చంద్రు సాయం చేస్తాడని చెప్పారు పార్టీ నేతలు. రాజకన్ను భార్య
లాయర్ చంద్రుని కలిసి చెప్పుకుంది. అతను హైకోర్టు లాయర్. మానవ హక్కుల కేసుల్ని
ఫీజులు తీసుకోకుండా వాదిస్తాడు.
చంద్రు హేబియస్ కార్పస్ కేసు వేయడంతో
విచారణ చేపట్టిన హైకోర్టు, మధ్యంతర ఉత్తర్వులిచ్చింది.
బాధితురాలి కుటుంబానికి 3 సెంట్ల భూమి, 2.65 లక్షల నగదు
తాత్కాలిక సాయంగా అందించాలని. తర్వాత హైకోర్టు
ఆదేశాలందుకుని దర్యాప్తుకి దిగిన పోలీసులు ఒక పడవలో దొరికిన మృతదేహం రాజకన్నుతో
సరిపోలడాన్ని రిపోర్టు చేశారు. దీంతో రాజకన్ను అదృశ్య కేసు హత్య కేసు గా నమోదై తాజాగా
విచారణ కొనసాగింది. చిట్టచివరికి 13 ఏళ్ళ తర్వాత
2006 లో, కడలూర్ కోర్టులోనూ, ఫాస్ట్
ట్రాక్ కోర్టులోనూ విచారణ పూర్తయి తీర్పు వెలువడింది. కేసులో మొత్తం 12 మందిని దోషులుగా
నిర్ధారించారు. అందులో డిఎస్పీ, ఇన్స్ పెక్టర్, అసిస్టెంట్ ఇన్స్ పెక్టర్, ఒక డాక్టర్ కూడా వున్నారు.
వీళ్ళందరికీ జైలు శిక్షలు పడ్డాయి. రాజకీయ పార్టీల నుంచి అనేక బెదిరింపులూ
వేధింపులూ ఎదుర్కొంటూనే కేసు పోరాడి విజయం సాధించాడు లాయర్ చంద్రు. అతను ప్రస్తుతం
రిటైర్డ్ హైకోర్టు జడ్జి. 75 ఏళ్ళ రాజకన్ను భార్య జీవించే వుంది.
ఈ ఉదంతమంతా కొన్ని మార్పులతో ‘జైభీమ్’ కథగా తెరకెక్కింది. ఇది 2016 లో వెట్రిమారన్ టెర్రిఫిక్ తీసిన ‘విశారనై’ ని గుర్తు చేస్తుంది. ఇది కూడా మానవ హక్కుల
ఉల్లంఘన కేసు ఆధారంగానే తీశారు. 1983 లో గుంటూరులో నల్గురు తమిళనాడు వలస కూలీల్ని
దొంగతనం కేసులో ఇరికించి పోలీసులు చిత్ర హింసలు పెడుతూంటే, దీని
వెనుకున్న కొన్ని రాజకీయ రహస్యాలు బయట పడకూడదని, చెన్నై
పోలీసులు వాళ్ళని పట్టుకెళ్ళి లాకప్ డెత్తులూ, ఎన్కౌంటర్లూ చేసి
చేతులు దులుపు కున్నారు.
ఈ నిజ కథా చిత్రం కూడా మానవ హక్కుల దుస్థితిని
దృశ్యీకరిస్తుంది. ‘విశారనై’, ‘జై భీమ్’ రెండిట్లోనూ
బాధితులు ఏ దిక్కూ లేని బడుగు జనాలే. న్యాయం కోసం వాళ్ళు చేసే ఆక్రందనలే. వీళ్ళతో
ముందూ వెనుకా చూడకుండా పోలీసులు పాల్పడే అకృత్యాలే. ఏ దోలా డ్యూటీ పూర్తవడానికి ఈజీ
టార్గెట్లు గా కన్పించే వీళ్ళని నిలువునా బలి చేయడాలే. ఇలా పోలీసులు పాల్పడే మానవ హక్కుల ఉల్లంఘనల మీద అనేక సినిమాలు వివిధ
భాషల్లో వచ్చి వుంటాయి. కానీ ‘విశారనై’
అంత పచ్చిగా ఇంకోటి రావడం ఇప్పుడు ‘జై భీమ్’ రూపంలోనే. చాలా పచ్చిగా, గగుర్పాటు కల్గించేదిగా. పోలీసు రెండో ముఖాన్నినిర్మొహమాటంగా విప్పి చూపించే వాస్తవిక సినిమాలివి. దేశంలో ఇంకెవరూ ప్రయత్నించని స్థాయిలో ఈ రెండు పచ్చి వాస్తవికాలు
తమిళంలోనే ప్రయోజనాత్మకంగా వచ్చాయి.
‘విశారనై’ తో లాగే ‘జై భీమ్’ తో కూడా పోలీసులేం నీతి తెలుసుకుంటారో
గానీ- ఎవరో రాజకీయ నాయకుల కోసం ఇలాటి దుశ్చర్యలకి పాల్పడితే - ఆ రాజకీయనాయకులే దృశ్యంలోకే రాకుండా, కేసుతో సంబంధం లేకుండా ఎక్కడో
వుంటారు- పోలీసులు కటకటాల వెనక్కి వెళ్ళి ఏడ్వడమే.
‘విశారనై’ కి మూడు జాతీయ అవార్డులు లభించడంతో
బాటు, ఆస్కార్ అవార్డులకి ఎంపిక కూడా అయి సంచలనం
సృష్టించింది. అయితే హద్దుల్లేని హింస చూపించిన కారణంగా ఆస్కార్ నామినేషన్ కి నోచుకోకుండా ఎంపిక దగ్గరే ఆగిపోయింది. దేశంలో
ఇంకే సినిమా చూపించనంత హింసతో పోలీసుల అకృత్యాల్ని చూపించాడు వెట్రిమారన్. వాస్తవంగా
జరుగుతున్న మానవ హక్కుల ఉల్లంఘన ఏ స్థాయిలో జరుగుతోందో నిజాన్ని ప్రజలకి తెలియజేయకపోతే
ఈ కథల్లో సదరు బాధితులకి న్యాయం చేసినట్టవదు. ఈ కథల్లో జరిగినట్టు ఎక్కడైనా ఎవరికైనా జరగవచ్చన్న
హెచ్చరిక వీటిలో ప్రధానంగా వుంది.
ఆల్రెడీ ఇలాటి కథగా ‘విశారనై’ వచ్చేశాక, తను చూపించిన తేడా ఏమిటనేది ‘జైభీమ్’ దర్శకుడు జ్ఞానవేల్ ముందుండే ప్రశ్న. దీనికి - అడవి
మృగాల కంటే పట్టణ మనిషే గిరిజన జీవితాలకి అత్యంత ప్రమాదకరమని దీటైన సమాధానమిచ్చేలా
విషయం చెప్పాడు. అయితే ఈ కథ కోర్టు రూమ్ డ్రామా జానర్ కావడంతో,
సహజంగానే అలాటి టెంప్లెట్ రొటీన్ దృశ్యాల పరంపరకి లోనవక తప్పలేదు.
‘సూరరై పొట్రు’ లో ‘ఏర్ డెక్కన్’
వ్యవస్థాపకుడు కెప్టెన్ జీఆర్ గోపీనాథ్
బయోపిక్ నటించిన సూర్య, ఈసారి నాటి లాయర్, నేటి రిటైర్డ్ హైకోర్టు జడ్జి చంద్రుగా నటించాడు. తన రెగ్యులర్ కమర్షియల్
హంగూ ఆర్భాటాలూ అన్నీ తీసి పక్కన పెట్టాడు. కెప్టెన్ గోపీనాథ్ గా నటించినప్పుడు మాత్రం
అన్ని మసాలాలూ కలిపి రెగ్యులర్ సూర్య లాగే నటించాడు. లాయర్ చంద్రుగా నటనలో వ్యాపార
ధోరణిని పక్కన పెట్టేసి, తనకో హీరోయిన్ వుండాలన్న ఆలోచనే చేయకుండా, మానవ హక్కుల కార్యకర్త పాత్ర అత్యంత సహజ ధోరణిలో పోషించాడు. బాధిత పాత్ర చిన్నతల్లి
తో అతడి ఔదార్యం చూసినా, ఒక సమయంలో ఆగ్రహం చూసినా, అలాగే కోర్టు దృశ్యాల్లో వృత్తితత్వంతో కూడిన వాద ప్రతివాదాల ధోరణి చూసినా- నటుడిగా
తనని తాను పరీక్షించుకునే అవకాశంగానే దీన్ని తీసుకున్నాడు. ఈ పరీక్ష సునాయాసంగా నెగ్గేశాడు.
రెండో ముఖ్య పాత్ర చిన్నతల్లిగా లిజోమోల్
జోసీ ఒక వండర్. గిరిజనురాలి పాత్రలో రంగూ హంగూ అచ్చం సరిపోయి, ఆమె నటి అని చెప్తే తప్ప తేడా గుర్తించలేనంత ప్రాంతీయత కలగలిసిపోయి కనిపిస్తుంది.
పాత్ర నిడివీ ఎక్కువే. సంఘర్షణా చూసినా సూర్య పాత్రతో సమానమే. ఆమె పాత్ర తీరుకి, న్యాయ పోరాటానికీ ముక్తాయింపుగా ‘మట్టిలో తేమ వుంది, రేయికో వెన్నెలుంది’ అని అర్ధవంతమైన పాట రాశాడు కవి.
ఇక ప్రకాష్ రాజ్, రావు రమేష్ పాత్రలు రెండూ రెండు ధృవాలు. ప్రకాష్ రాజ్ సూర్యకి సహకరించే, హూందాగా మాట్లాడే ఉన్నత పోలీసు అధికారైతే, రావు రమేష్ సూర్యని వ్యతిరేకించే, వ్యంగ్యంగా మాట్లాడే
పబ్లిక్ ప్రాసిక్యూటర్. ఇద్దరూ ఈ వాస్తవిక సినిమాకి ఓ నిండుదనాన్ని తెచ్చారు.
రాజన్నగా నటించిన మణికందన్ తప్పకుండా
ఉత్తమ నటుడవుతాడు. తొలి సన్నివేశాలు వదిలేసి తర్వాత చూస్తే, ఎప్పుడు
చూసినా పోలీస్ టార్చర్ తో గావు కేకలే. గావు కేకలేయడం కూడా నటనేనా అంటే, ఒక కేక ఇంకో కేకలా అన్పించకుండా వేయడం కష్టమైన నటనే. సూర్య లాయర్ పాత్ర అసిస్టెంట్
గా జీషా విజయన్ నటించింది. ఇంకా 205 మంది సహాయ నటీనటులున్నారు.
సాంకేతికంగా 1990 లనాటి వాతావరణ సృష్టి
ప్రదర్శిస్తున్నట్టుగాక, సన్నివేశాల్లో సంలీనమైపోయి వుంటుంది.
కళాదర్శకత్వం కే కదీర్. టార్చర్, యాక్షన్ దృశ్యాల కొరియోగ్రాఫర్
అన్బీరవ్. ఛాయాగ్రహణం ఎస్ఆర్ కదీర్, సంగీతం సీన్ రోల్డన్ (కర్ణాటక
సంగీత కారుడు రాఘవేంద్ర రాజా రావు), కూర్పు ఫీలోమిన్ రాజ్...వీళ్ళందరూ
గిరిజన తత్వాన్ని యావత్తూ రంగరించేశారు. సూర్య స్టార్ హవా కోసం ఎక్కడా ప్రయత్నించ లేదు.
కాకపోతే నిడివి రెండు గంటల 44 నిమిషాలు చాలా ఎక్కువ.
మధ్య మధ్యలో బాధితుల ఫ్లాష్ బ్యాక్స్ తో, సాక్షుల మల్టీపుల్
ఫ్లాష్ బ్యాక్స్ తో ఈ కథ నడిపారు. త్రీయాక్ట్స్ స్ట్రక్చర్లో కాల నియమాలు పాటిస్తూ
వేగవంతమైన కథనం చేశారు. కాకపోతే మొత్తం కలిపి నిడివి ఎక్కువై పోయింది. మొదటి పాతిక
నిమిషాలు సూర్య లేకున్నా, మణికందన్ పాత్రతో కాలమే తెలియనంత వేగంగా
అడవిలో గిరిజన జీవన నేపథ్యాన్ని ఏర్పాటు చేసేసి, అతను అరెస్టయి, భార్య న్యాయ సహాయం కోసం సూర్య దగ్గరి కొచ్చే మొదటి మలుపు వరకూ లీనియర్ కథనమే
నడుస్తుంది.
‘ఏం జరిగిందో చెప్పు, ఎక్కువ చెప్పకు’ అని సూర్య ఆమెతో అనడంతో, ఆమె ఫ్లాష్ బ్యాక్ లో జరిగింది చెప్పుకొస్తుంది. ‘ఎక్కువ చెప్పకు’ అని డైలాగు రాసి, ఎక్కువ కంటే ఎక్కువన్నర ఫ్లాష్ బ్యాక్ చెప్పుకుంటూ వెళ్లిపోయాడు కథకుడు. ‘ఎక్కువ చెప్పకు’ అని సూర్య కథకుడికి చెప్పి వుండాల్సింది. ఈ ఎక్కువ చెప్పడం వల్లే రెండు గంటల 44 నిమిషాలు పట్టింది. ఇది రియలిస్టిక్ సినిమా ధర్మం కాదు.
ఈ ఫ్లాష్ బ్యాక్ లో పోలీస్ టార్చర్ చూపిన విధం రెగ్యులర్ మాస్ సినిమాల్లోలాగా లేదు. రెగ్యులర్ మాస్ సినిమాల్లో టార్చర్ ఎంటర్ టైన్ చేస్తుంది. ఇక్కడ వెంట్రుకలు నిక్కబొడుచుకుంటాయి. ఎవరైనా పోలీసులు ఈ టార్చర్ ఐడియాలు ఇచ్చారా అన్నట్టు షాకింగ్ గా వుంటాయి. దీని తర్వాత సూర్య హైకోర్టులో కేసు వేయడంతో మొదలవుతుంది కోర్టు రూమ్ డ్రామా. దీని ఆధారంగానే మిగతా సెకండాఫ్ కథ.
కోర్టు రూమ్ డ్రామా టెంప్లెట్ తెలిసిందే. ఒక కోర్టు సీను, తర్వాత బయట ఒక రిలీఫ్ సీను, మళ్ళీ కోర్టు సీను, బయట ప్రత్యర్ధులతో ఒక యాక్షన్ సీను, మళ్ళీ కోర్టు సీను...ఇలా లోపలా బయటా సీన్లు నడుస్తూంటాయి. చూసి చూసి వున్న ఈ టెంప్లెట్ ని దర్శస్కుడు బ్రేక్ చేసి వుండాల్సింది.
ఒక రిలీఫ్ సీన్లో చిన్నతల్లి భర్తతో తల్చుకునే రోమాంటిక్ సీను వేసి పాట కూడా పెట్టారు. ఈ కోర్టు రూమ్ డ్రామా మొదటి దశలో రాజన్న అదృశ్యం గురించే వాదోప వాదాలుంటాయి. సూర్య ఇన్వెస్టిగేషన్లో రాజన్న గురించి అసలు నిజం తెలియడం రెండో దశ. ఈ దశ కోర్టు రూమ్ డ్రామాలో మెడికల్ సాక్ష్యాల పరిశీలన వుంటుంది. తర్వాత పోలీసుల వాదనతో మూడో దశ వుంటుంది. ఈ దశలో సాక్షులుగా పోలీసులతో నడుస్తుంది. ఈ మొత్తం వాదోపవాదాల్లో మల్టీపుల్ ఫ్లాష్ బ్యాకుల్లో రాజన్న అరెస్టు దగ్గర్నుంచీ చివరి వరకూ ఏమేం జరిగాయో దృశ్యాలు వస్తూంటాయి.
మొత్తంగా చూస్తే ఇదొక మిస్టరీ కథ. మిస్టరీని తేల్చే లాజిక్స్, ఇల్లాజిక్స్ ల సంఘర్షణ. ఏకాగ్రతతో ఫాలో అయి చూస్తే వ్యవస్థ ఎలా పనిచేస్తుందో తెలుస్తుంది. అంతర్లీనంగా న్యాయంకోసం ఆక్రందన ఈ ఇన్వెస్టిగేషన్ కథనానికి జీవం పోస్తుంది. అయితే చివర కోర్టు తీర్పూ, అందులో చేసిన వ్యాఖ్యలూ బలహీనంగా లేకుండా చూసుకోవాల్సింది. దర్శకుడు జ్ఞానవేల్ కి రచించి చిత్రీకరించడంలో రియలిస్టిక్ జానర్ మీద మంచి పట్టు వుందనేది మాత్రం ఒప్పుకోవాల్సిన విషయం. కొత్త దర్శకులు చాలా నేర్చుకోవచ్చు. తెలుగులో ఇలా తీస్తారో లేదో అనేది దేవుడెరుగు.
—సికిందర్