రివ్యూలు, సాంకేతికాలు, స్క్రీన్ ప్లే సంగతులు...

టికెట్లు దొరకడం యోగం, సినిమాలు చూడడం భోగం, రివ్యూలు రాయడం రోగం!

5, నవంబర్ 2021, శుక్రవారం

1076 : రివ్యూ


 రచన - దర్శకత్వం : మారుతి
తారాగణం : సంతోష్ శోభ‌న్‌, మెహ్రీన్ పీర్జాదా, అజ‌య్ ఘోష్‌, శ్రీనివాసరావు, వెన్నెల కిశోర్‌, స‌ప్త‌గిరి, శ్రీనివాస‌రెడ్డి, ప్ర‌వీణ్, రజిత త‌దిత‌రులు
సంగీతం : అనూప్‌ రూబెన్స్ , ఛాయాగ్రహణం : సాయి శ్రీరామ్‌
బ్యానర్స్: వీ సెల్యులాయిడ్‌, ఎస్‌.కె.ఎన్‌.

నిర్మాత : ఎస్‌.కె.ఎన్‌.
విడుదల : నవంబర్ 4, 2021
***

        లాక్ డౌన్ సమయంలో దర్శకుడు మారుతీ ఖాళీగా వుండ కూడదని, ఓ రెండు లొకేషన్స్ లో  లో -బడ్జెట్ ప్లాన్ చేసుకుని తక్కువ రోజుల్లో పూర్తి చేసిన మంచి రోజులొచ్చాయి మంచి సమయం చూసుకుని విడుదలైంది. దీపావళికి పెద్దన్న’, ఎనిమీ అనే రెండు డబ్బింగులు తప్ప తెలుగు సినిమాలు లేక పోవడంతో విడుదల లాభసాటి అవకాశంగా మారింది. 2011 నుంచి హీరోగా నిలదొక్కుకోవడానికి స్ట్రగుల్ చేస్తున్న సంతోష్ శోభన్, 2018 లో పేపర్ బాయ్ తో తిరిగి పరాజయాన్ని చవిచూశాక  వెబ్ సిరీస్ మీద దృష్టి పెట్టాడు. వెబ్ సిరీస్ నుంచి మారుతీ దర్శకత్వంలో సినిమాలో కొచ్చాడు ప్రస్తుతం. ఇప్పుడైనా తనకి మంచి రోజులొస్తాయా లేదా అనేది తేలిపోయే సమయమిది. ఇదేమిటో చూద్దాం...

కథ

    సంతోష్ (సంతోష్ శోభన్), పద్మ (మెహ్రీన్ పీర్జాదా) లు బెంగుళూరులో ఐటీ జాబ్స్ చేస్తూ ప్రేమలో పడతారు. లాక్ డౌన్ ప్రకటించడంతో వర్క్ ఫ్రమ్ హోమ్ కి హైదరాబాద్ వచ్చేస్తారు. ఇక్కడ పద్మ తండ్రి గోపాలం (అజయ్ ఘోష్) కి మూర్తి, కోటేశ్వర్రావ్ అనే ఇద్దరు మిత్రులుంటారు. వీళ్ళు ఇద్దరు కూతుళ్ళున్న గోపాలం ఏ చీకూచింతా లేనట్టు ఆనందంగా గడపడాన్ని చూసి ఓర్వలేక పోతారు. కోటేశ్వర్రావ్ కి తన కూతురు ఒకడితో లేచిపోయిన అవమాన భారముంటుంది. దీంతో గోపాలం ఆనందంగా జీవిస్తూంటే మండి పోతూంటాడు. గోపాలం కూతురు పద్మ బెంగుళూరు నుంచి వచ్చెయ్యడంతో, సంతోష్ తో ఆమె వరస కనిపెట్టి, మూర్తీ కోటేశ్వర్రావ్ లు గోపాలంలో అనుమాన బీజాలూ, దాంతో భయాందోళనలూ బలంగా నాటుతారు. నీ కూతురు కూడా లేచిపోయి పరువు తీస్తుందని.

        దీంతో గోపాలం కూతుర్ని అనుమానించడం మొదలెడతాడు. సంతోష్ తో ఆమె ప్రేమకి అడ్డంకులు సృష్టిస్తూంటాడు. తండ్రికి కలుగుతున్న అనవసర భయాలకి సంతోషే కారణమని అతడికి దూరమవుతుంది పద్మ. ఇప్పుడు సంతోష్ ఈ తండ్రీ కూతుళ్ళ సమస్యల్ని ఎలా తొలగించి, వాళ్ళకి దగ్గరయ్యాడన్నది మిగతా కథ.

ఎలావుంది కథ

    మారుతి ప్రారంభించిన సైకాలజీ సిరీస్ సినిమా కథల్లో ఇది మూడో కథ. భలేభలే మగాడివోయ్’, మహానుభావుడు అనే రెండు ప్రయత్నాలకి రెండు మానసిక సమస్యల్ని తీసుకున్నాడు. మొదటిది మతిమరుపు  సమస్యతో, రెండోది ఓసీడీ సమస్యతో. ఇప్పుడు అతి భయం - ఫియర్ యాంగ్జయిటీని చూపించాడు. మారుతితో వచ్చిన సమస్యేమిటంటే, ఈ మానసిక సమస్యలు అసలేంటో రీసెర్చి చేసి తెలుసుకోకుండా ఇష్టానుసారం తీసేయడం. భలేభలే మగాడివోయ్ లో మతిమరుపుని  పక్కనబెడితే, తర్వాత తీసిన రెండూ అసహజ కథలు. మహానుభావుడు ని ఓసీడీ గురించి తీశానని హైప్ ఇచ్చాడు. తీరా చూస్తే అది ఓసీడీ (అబ్సెసివ్ కంపల్సివ్ డిజార్డర్) కాదు, మామూలు ఎలర్జీ అని సన్నివేశాలే తేల్చేశాయి. 

ఇప్పుడు అతి భయం తీసుకుని కథగా చేస్తే తగిన శాస్త్రీయ మూలాల్లేక, తన కల్పితాలతో సగానికే విషయం లేకుండా తేలిపోయింది కథ. అతిభయం - ఫియర్ యాంగ్జయిటీని పెంచితే ఫోబియాగా మారి, సమస్య మరింత తీవ్రమయ్యేది. కథలేని కొరత తీరుస్తూ విస్తరించుకుంటూ పోయేది. కొత్త పుంతలు తొక్కెది. ఆ ఫోబియాని మాన్పే క్లినికల్ పరిష్కారాల డ్రామాతో ముగింపు అర్ధవంతంగా వుండేది. కథని అసలేమీ ప్లాన్ చేయకపోవడంతో, ఒక జంటకి సగం పెళ్ళి  చేసి వదిలేస్తే ఎలా వుంటుందో అలా తయారైంది కథ. మారుతి తను సైకాలజీ కథల స్పెషలిస్టు అన్పించుకోవాలని నిజంగా అనుకుంటే తత్సంబంధ విషయ సేకరణ వైపూ కాస్త తొంగి చూస్తే బావుంటుంది.

నటనలు- సాంకేతికాలు
     సంతోష్ శోభన్ 2015 లో తను- నేను లో నటించినప్పుడే మంచి ఈజ్ వున్న డైనమిక్ హీరో అవుతాడని భావించాం. అదే డైనమిజం ఇప్పుడూ వుంది. అతనేమీ ఓవరాక్షన్ చేసో, లేదా మసాలా మాస్ యాక్టింగ్ చేసో దృష్టి నాకర్షించే ప్రయత్నం చెయ్యడు. సింపుల్ నటనతోనే ప్రేక్షకుల దృష్టిని తన వైపు తిప్పుకుంటాడు. ప్రస్తుత మూవీలో లవర్ బాయ్ పాత్ర నటించాడు. ఉన్నది కాసేపే. ఇదే సమస్య. దర్శకుడు మారుతీ ప్రధాన పాత్ర హీరోయిన్ తండ్రిగా వేసిన అజయ్ ఘోష్ అన్నట్టు, అతడి చుట్టే కథ నడిపి, సంతోష్ ని పక్కన పడేశాడు. పేరుకి మాత్రమే సంతోష్ హీరో. కథ మాత్రం అజయ్ ఘోష్ దే. ఇలా కూడా సినిమా తీయొచ్చా అంటే ఏమో. జీవితమే ఒక నాటకరంగం’, సంసారం-సాగరం’, మొరటోడు’, ‘,దేవుడే దిగివస్తే లాంటి సినిమాలు క్యారక్టర్ ఆర్టిస్టు కైకాల సత్యనారాయణ హీరోగా నటించినవి వున్నాయి. ఇవి వేరు.

        సంతోష్ పాత్ర పని కాసేపు అజయ్ ఘోష్ భయాన్ని వదిలించడమైతే, ఈ ప్రయత్నాలు చాలా సిల్లీగా వున్నాయి. హీరోయిన్ మెహ్రీన్ డిటో సంతోష్. ఈమెకి కూడా పాత్ర తక్కువే. చేసేదేమీ వుండదు, స్లిమ్ గా మారి కనువిందు చేయడం తప్ప. అజయ్ ఘోష్ మాత్రం సింహభాగం సినిమా నాక్రమించేశాడు. కూతురి పట్ల ఎంతో ప్రేమ వున్న వాడిగా మొదలై, కూతురిని తల్చుకుని భయపడే వాడుగా మారే పాత్ర ప్రయాణం ఫస్టాఫ్ వరకే ఫర్వా లేదనిపించుకుని వినోద పరుస్తాడు. ఇక్కడితో మారుతీ చేతిలో కథ అయిపోవడంతో, సెకండాఫ్ లో అవే రిపీట్ సీన్లతో, అవే భయాలతో బోరు కొట్టేస్తాడు.

        అతడ్ని భయపెట్టే పాత్రధారులిద్దరూ మూర్తీ, శ్రీనివాసరావులు కూడా కాసేపటికి వాళ్ళ ప్రయత్నాలతో చీకాకు పెట్టేస్తారు. హీరో హీరోయిన్లకి ఫుటేజీ తగ్గి, చాలా మంది కమెడియన్లు స్పేస్ నాక్రమించేశారు. కానీ ఒక్క ప్రవీణ్ తప్ప ఇంకెవరితోనూ కామెడీ పేలకుండా పేలవంగా తయారైంది. వెన్నెల కిషోర్, సప్తగిరి, శ్రీనివాస రెడ్డి, సత్యం రాజేష్, వైవా హర్ష  కామెడీ పాత్రలు ఎందుకొస్తాయో, ఎందుకు పోతాయో తెలీదు. ప్రవీణ్ అప్పడాల విజయలక్ష్మి ఆడవేషం కామెడీ చీప్ కామెడీయే అయినా, మొత్తం సినిమా కామెడీ కంటెంట్ లో ఇదే నయం.

        చాలా కాలం తర్వాత అనూప్ రూబెన్స్ సంగీతంలో రెండు పాటలు బావున్నాయి. లో - బడ్జెట్  పేరేగానీ ఖర్చు మాత్రం బాగానే పెట్టి విజువల్స్ తీశారు. రెండు లొకేషన్స్ లోనే నిర్మాణం జరిపేశారు.

చివరికేమిటి

    ఫస్టాఫ్ ఇంకా కథలోకి వెళ్ళే సమయం కాబట్టి పాత్రల పరిచయాలతో, కామెడీలతో, అజయ్ భయాలతో సరదాగానే వుంటుంది. కథలోకి వెళ్ళాక మాత్రం కథలేక, సరైన కాన్ఫ్లిక్ట్ లేక, హీరో పాత్రకి స్థానం లేక, అజయ్ చుట్టూ వచ్చిన సీన్లే వస్తూ- సీరియస్ గా మారిపోతుంది కథ. భయం అనే పాయింటుకి ఇచ్చిన మెసేజి కూడా తూతూ మంత్రపు వ్యవహారమే. ఇది చెప్పడానికి రెండు గంటల 20 నిమిషాల సేపు లాగారు. పైగా యూత్ ఫుల్ కథనం లేక, ఓల్డ్ స్కూల్ మేకింగ్ తో లేజీగా వుంటుంది. ట్రెండ్ కి తగ్గ మార్కెట్ యాస్పెక్ట్, దానికి తగ్గ క్రియేటివ్ యాస్పెక్ట్ కన్పించవు.     

        మరి మంచి రోజులు దేనికొచ్చాయి? మారుతీ ప్రారంభంలో తీసిన ఈరోజుల్లో’, బస్టాప్ టైపు బూతు కామెడీకా? బూతులు మాత్రం ధారాళంగా పారించేశారు. కాన్సెప్ట్ సరిగ్గా వుంటే ఇంత బూతు మీద ఆధారపడే అవసరం రాక పోయేదేమో. తెలుగులో పోటీ లేకుండా విడుదలైన పండగ సినిమా తీరు ఇలా వుంది. పైగా కోవిడ్ మహమ్మారిని కామెడీ చేశారు. కోవిడ్ తో దేశం అల్లకల్లోలమై జనం చస్తే, మారుతీ కిందులో కామెడీ కని పించడం సృజనాత్మకతే అనాలా!

—సికిందర్