పదుల సంఖ్యలో సినిమాలు తీసినా అపజయా లెరుగని దర్శకులు
అరుదుగా వుంటారు. కోవెల మూడి బాపయ్య అలాటి అగ్ర దర్శకుల్లో ఒకరు. తీసిన 80
సినిమాల్లో నాలుగే అపజయాలతో అగ్రశ్రేణి కమర్షియల్ దర్శకుడుగా కొనసాగారు ఇటు తెలుగులో,
అటు హిందీలోనూ. తెలుగులో 39, హిందీలో 31 తీయడం రికార్డు. ఎన్టీఆర్, ఏఎన్నార్,
కృష్ణ, శోభన్ బాబు, కృష్ణం రాజు, చిరంజీవి, దిలీప్ కుమార్, ధర్మేంద్ర, రాజేష్
ఖన్నా, జితేంద్ర, సంజీవ్ కుమార్, జాకీ ష్రాఫ్, మిథున్ చక్రవర్తి, షారుఖ్ ఖాన్, శ్రీదేవి,
జయప్రద, జయసుధ, శారద, హేమమాలిని ... ఇలా హేమాహేమీలే ఆయన తారాతోరణం. సోగ్గాడు,
ఎదురులేని మనిషి, యుగ పురుషుడు, ముందడుగు, మండే గుండెలు, నాదేశం, మవాలి, దిల్దార్,
బందిష్, మక్సద్... ఇలా సూపర్ హిట్స్ తోనే ఆయన వైభవం. ఇలా 1970 - 95 మధ్య
పాతికేళ్ళూ 80 సినిమాలతో విజయ యాత్ర చేశారు. 1988 -95 మధ్య నైతే ఏడేళ్ళూ వరసగా 14
హిందీ సినిమాలే తీశారు.
అయితే 1970 లో ప్రారంభ చిత్రం నవల ఆధారంగా తీయడం విశేషం.
1954 లో జోసెఫ్ హేస్ అనే రచయిత రాసిన ‘డెస్పరేట్ అవర్స్’ అన్న నవల మొదట 1955 లో
నాటకంగా ప్రదర్శించారు. 1955 లో హాలీవుడ్ సినిమాగా తీశారు. 1970 లో కృష్ణం రాజు తో
బాపయ్య ‘ద్రోహి’ గా తీశారు. దీన్నేశివాజీ గణేశన్ తో కృష్ణన్ అనే దర్శకుడు తమిళంలో రీమేక్
చేశాడు. ఈ రెండూ ఫ్లాపయ్యాయి. ఆ తర్వాత ‘డెస్పరేట్ అవర్స్’ ఆధారంగా హిందీలో రాజ్
కుమార్, సునీల్ దత్, మాలాసిన్హా లతో ‘36 ఘంటే’ గా 1974 లో నిర్మించారు. ముగ్గురు
ఖైదీలు జైలు నుంచి తప్పించుకుని ఒక ఇంట్లో జొరబడే కథ ఇది.
కె. బాపయ్య నవలల ఆధారంగా దర్శకత్వం వహించిన
సినిమాలు రెండే. 1970 లో కృష్ణం రాజు తో ‘ద్రోహి’ తర్వాత, మళ్ళీ కృష్ణం రాజుతోనే
1981 లో యద్దనపూడి సులోచనా రాణి నవల ఆధారంగా ‘అగ్నిపూలు’ తీశారు. రెండూ పరాజయం
పాలయ్యాయి. కృష్ణం రాజు ద్విపాత్రాభినయం, జయప్రద, జయసుధ, జయంతి, శ్రీధర్, గుమ్మడి,
సత్యనారాయణలతో సురేష్ ప్రొడక్షన్స్
పతాకంపై ప్రసిద్ధ నిర్మాత డి. రామానాయుడు దీన్ని నిర్మించారు.
‘అగ్నిపూలు’
1981 మార్చి 12 న విడుదలయ్యింది. ‘అగ్నిపూలు’ కి ముందు ఫిబ్రవరి 14 న ఎన్టీఆర్,
శ్రీదేవిలతో బాపయ్యే దర్శకత్వం వహించిన ‘అగ్గి రవ్వ’ విడుదలైంది. అలాగే ‘అగ్నిపూలు’
విడుదలైన తొమ్మిది రోజుల్లో వెంటనే మార్చి 21 న ఏఎన్నార్, కృష్ణ నటించిన బాపయ్య
సినిమానే ‘గురు శిష్యులు’ విడుదలయ్యింది. ఇలా 35 రోజుల్లో బాపయ్య సినిమాలు మూడు
విడుదలవడం విశేషమైతే, మధ్యలో విడుదలైన ‘అగ్నిపూలు’ పరాజయం చెందడం అర్ధంగాని విషయం.
నిజానికి పరాజయం చెందేంత చెడ్డ విషయమేమీ లేదిందులో. పైపెచ్చు కథాకథనాలు, నటనలు,
చిత్రీకరణ నాణ్యతతో వున్నాయి. కుటుంబ కథా చిత్రాలంటే గత రెండు దశాబ్దాలుగా
వస్తున్న మాఫియా - ఫ్యాక్షన్ కుటుంబాల హింసాత్మక సినిమాల్లాగా కాకుండా, అచ్చమైన
కుటుంబ సంబంధాల మానసిక సంఘర్షణగా మనకి కన్పిస్తుంది. రెండున్నర గంటలు యూట్యూబ్ లో
ఏకబిగిన చూసేలా చేస్తుంది.
అయితే ఆ నాటి ప్రేక్షకులు ఇందులోని వినోదం పాలు తక్కువ, విషయ గాంభీర్యం
ఎక్కువవడం ఇష్టపడ లేదేమో. ప్రథమార్ధంలో గంట సేపటికి గానీ ఒక కామెడీ సీను అల్లు రామలింగయ్యతో
రాదు. అలాగే కృష్ణం రాజు - జయప్రదలతో సినిమా మొత్తంమీద వున్న ఒక్క యుగళ గీతమూ గంట
తర్వాత గానీ రాదు. నవలని మార్చకుండా యధాతథంగా తీశామన్నారు. కమర్షియల్ విజయాలు
సాధించే బాపయ్య, నవలకి న్యాయం చేయబోయి సినిమాని నాటి ప్రేక్షకుల కోసం తగిన వ్యాపార
విలువలతో తీయలేక పోయారేమో.
అగ్నిపూలెంతో
ఇష్టం
విహార యాత్ర కెళ్ళిన ‘పక్షుల వేసవి విడిది
కేంద్రం’ లో కింద రాలిపడి పూలుంటాయి. ఏడాది కొకసారి వచ్చే వలస పక్షుల్లాగే, అమెరికా
నుంచి వచ్చిన స్కర్ట్ ధరించిన ఆధునికురాలు జయసుధ, అవేం పూలని అడుగుతుంది.
ఇంగ్లీషులో ఫ్లవర్స్ ఆఫ్ ది ఫారెస్ట్ అనీ,
తెలుగులో మోదుగ పూలనీ, లేకపోతే అగ్నిపూలనీ అంటారని వివరిస్తాడు సత్యనారాయణ. పగదీర్చుకోవడానికి
అమెరికా నుంచి వచ్చి వుంటున్న జయసుధ, మొదటి సారిగా ఆనందంగా చూసి, ‘బ్యూటిఫుల్’
అంటుంది. తర్వాత ఆ పూలు పట్టుకుని వుంటే, ఆ పూలంటే అంతిష్టమా అనడుగుతాడు
సత్యనారాయణ. అవునంటుంది జయసుధ, ‘నా గుండెల్లో రేగుతున్న మంటల్లా వున్నాయి... నా
కళ్ళు చూస్తే అగ్ని పూలు కన్పించడం లేదా డాక్టర్?’ అంటుంది.
ఇలా టైటిల్ జస్టిఫై అవుతుంది. ఈ
సీను ప్రథమార్ధం మధ్యలో వస్తుంది. ఇంతకీ జయసుధ ప్రతీకారం దేనికి, ఎవరి మీద?
తుపాకీతో కాల్చి పారేసేంత గుండె మంటతో వున్న తనని ఈ పరిస్థితి లోకి నెట్టేసిందెవరు?
అతను విరూపాక్షి రాజా (కృష్ణం రాజు). ఆమె
రాజేశ్వరి (జయంతి). ఇద్దరూ దేనికైనా తెగించే స్వార్ధ పరులు. ఆమె జమీందారు గోవింద
వల్లభ రాజా (గుమ్మడి) కూతురు. అతను అల్లుడు. రాజులు పోయినా, రాజ్యాలు పోయినా దర్పం
పోని వల్లభ రాజా లంకకి లంకంత రాజ భవనం (మైసూరు మహారాజా ప్యాలెస్), వందల ఎకరాల
ఎస్టేటూ గల సంపన్నుడు. వంశ కట్టుబాట్లకి
ప్రాణమిస్తాడు. భార్య అన్నపూర్ణ (నిర్మలమ్మ) కి కట్టుబాట్లు కాదు, మనుషుల మధ్య
సత్సంబంధాలు ముఖ్యం. గుర్రమెక్కి తుపాకీ పట్టుకుని, పులుల్ని వేటాడే అల్లుడు విరూపాక్ష
రాజా, ఎస్టేట్ కూలీలకి కొరడా దెబ్బలు కూడా పంచుతూంటాడు. పెంపుడు కుక్క సుల్తాన్ కి
సరిగా ఆహారం పెట్టకపోతే చావ బాదుతూంటాడు. ఇలా కూతురూ అల్లుడూ స్వార్ధంతో
ఆస్తిపాస్తులెలా కాజెయ్యాలా అని కాచుకుని వుంటారు.
వీళ్ళ
పంట పండి అమెరికాలో వుంటున్న వల్లభ రాజా కొడుకు శివ ప్రసాద్ (శ్రీధర్) అక్కడ మేరీ అనే అమెరికన్ అమ్మాయిని పెళ్లి
చేసుకున్నట్టు ఉత్తరం రాస్తాడు. ఆ ఉత్తరం పట్టుకుని కూతురూ అల్లుడూ పథక రచన
చేస్తారు. ఆ ఉత్తరం చూసి రెచ్చిపోయిన వల్లభ రాజా, కట్టుబాటు తప్పిన కొడుకు మొహం ఇక
చూడనంటాడు. విరూపాక్ష రాజా ఇంకా రెచ్చ గొడతాడు. ఇక తన చావుక్కూడా వాణ్ణి పిలవొద్దంటాడు
వల్లభ రాజా. తల కొరివి అల్లుడే పెట్టాలంటాడు.
అలా జమీందారీ వారసత్వం అల్లుడికే అప్పగించేస్తాడు
.
దీంతో
కూడా వూరుకోడు విరూపాక్ష రాజా. మామ గతించాక జమీందారీ చేతిలో పెట్టుకుని భార్య
రాజేశ్వరి సహకారంతో శివప్రసాద్ కీ, అతడి భార్య మేరీకీ పూర్తిగా అన్యాయం తలపెడతాడు.
ఈ విషయం పెద్దయ్యాక శివప్రసాద్ కూతురు జానకి అలియాస్ జేనీ (జయసుధ) తల్లి రాసిన
డైరీలో తెలుసుకుంటుంది. ఇటు విరూపాక్ష రాజా కూడా గతించడంతో జమీందారీ వ్యవహారాలు
కొడుకు కృష్ణ చైతన్య (కృష్ణం రాజు) చేతికొస్తాయి. ఇతడికో తమ్ముడు రాహుల్ (శరత్
బాబు), చెల్లెలు భవానీ (సుమలత) వుంటారు. కృష్ణ చైతన్య మెత్తటి స్వభావం కలవాడు. ఓ
నాట్య ప్రదర్శనలో నాట్యం చేస్తున్న రుక్మిణి (జయప్రద) ని చూసి పెళ్లి చేసుకుంటాడు.
రుక్మిణి ప్రమాదంలో కాళ్ళు దెబ్బతిని చక్రాల కుర్చీకి పరిమితమై పోతుంది. వీళ్ళ
కిద్దరు పిల్లలు.
ఈ
నేపథ్యంలో ఇప్పుడు అన్నపూర్ణ కోరికపై అమెరికానుంచి మనవరాలు జేనీ, మనవడు బాబీ (సుధాకర్)
వస్తారు. జేనీ ఎవరితోనూ కలవక ఎడమొహం పెడ మొహంగా వుంటుంది. ఎలాగైనా బావ కృష్ణ
చైతన్యని చంపి పగదీర్చుకోవాలనుకుంటుంది. బాబీ కృష్ణ చైతన్య చెల్లెలు భవానీతో
ప్రేమలో పడతాడు. భవానీకి మిర్యాల పురం సంబంధం చేసుకోవాలని పట్టుదలతో వుంటుంది ఆమె
తల్లి రాజేశ్వరి. మరో వైపు కాళ్లులేని కోడలు రుక్మిణిని రెండో పెళ్ళికి కొడుకు
కృష్ణ చైతన్యని ఒప్పించమని ఆదేశిస్తుంది. ఇక తల్లిని యధాతథంగా ఇబ్బంది
పెడుతూంటుంది.
ఇలా
ఆనాడు రాజేశ్వరి భర్తతో కలిసి పన్నిన పన్నాగం వల్ల ఇప్పటికీ తండ్రి ఆస్తికి ఆమె అక్రమ వారసురాలై, ముగ్గురు ఆడవాళ్ళు నానా
కష్టాలూ పడుతూంటారు. తల్లి అన్నపూర్ణ,
కోడలు రుక్మిణి, మేనకోడలు జేనీ... పూర్వం జేనీ
తల్లి మేరీ కూడా బాధితురాలే. ఆమెతో కలుపుకుని నల్గురు ఆడవాళ్లు నరకం అనుభవిస్తారు.
ఈ మొత్తం సంక్షోభానికి కారణమైన రాజేశ్వరి ఆట ఎలా కట్టింది? రుక్మిణి రెండో
పెళ్ళికి భర్త కృష్ణ చైతన్యని ఒప్పించిందా? జేనీ తల్లిదండ్రులేమయ్యారు? జెనీకి బావ
కృష్ణచైతన్య మీద పగకి కారణ మేమిటి? అతణ్ణి చంపిందా? ఆనాడు మేరీని పెళ్లి
చేసుకున్నట్టు శివప్రసాద్ రాసిన ఉత్తరంతో ప్రారంభమైన కుటుంబ సంక్షోభం, ఈనాడు మేరీ
రాసిన డైరీ వల్ల పరిష్కారమైందా? ... ఇవీ మిగతా కథలో తేలే ఆసక్తికర అంశాలు.
నల్గురు
అతివల గాథ
ఇది కుటుంబ కథా చిత్రమే కాకుండా నాలుగు
స్త్రీ పాత్రలతో కూడిన మహిళా చిత్రమని కూడా చెప్పుకోవచ్చు. కాకపోతే అభ్యుదయం కోసం మహిళల
తిరుగుబాటులా కాకుండా, కుటుంబ సంబంధాల్లో మానసిక సంఘర్షణల కుమ్ములాట. దీనికి
విరూపాక్ష రాజా పాత్రలో మొదటి కృష్ణం రాజు చిచ్చు పెట్టి పోతే, అతడి కొడుకు పాత్ర కృష్ణ
చైతన్యగా రెండో కృష్ణం రాజు కథలో నిమిత్త మాత్రుడుగా, పాసివ్ గా వుండి పోతాడు. కథంతా
స్త్రీ పాత్రల చుట్టే వుంటుంది. ఈ స్త్రీ పాత్రల కథ, సన్నివేశాల కూర్పు
అర్ధవంతంగా, ఆలోచనాత్మకంగా వుంటాయి. కథా బలం కోసం వినోదాత్మక విలువల్నే త్యాగం
చేశారు. అయితే ఇది కమర్షియల్ సినిమా
లెక్కల్లో వుండాల్సిన ఒక ప్రధాన పాత్ర, దాని సమస్య, సమస్యతో దాని సంఘర్షణా అనే
చట్రంలో ఒక కథగా గాకుండా - ఓ ప్రధాన పాత్రంటూ లేని నాల్గు స్త్రీ పాత్రల ఉమ్మడి
వృత్తాంతం గావడంతో, కథా లక్షణాలు కోల్పోయి గాథగా మారింది. కథల్లో పాత్ర కథని
నడిపిస్తుంది, గాథల్లో గాథే పాత్రల్ని నడిపిస్తుంది. గాథలు నవలలకి బావుంటాయి,
కమర్షియల్ సినిమాలకి కావాల్సింది కథలే, గాథలు కాదు. అందువల్ల ఈ కారణం చేత
ప్రేక్షకులకి నచ్చలేదేమో. గాథల్ని ‘పెదరాయుడు’ లా తీసి నిలబెట్టడం అరుదుగా జరుగుతూంటుంది.
ఇది
గాథైనప్పటికీ పాత్ర చిత్రణలు ఆకర్షిస్తాయి. జయంతి, నిర్మలమ్మ, జయప్రద, జయసుధ,
అమెరికా పాత్ర నటించిన హిందీ నటి. ఈ ఐదుగురు కాకుండా పని మనిషి నీలి పాత్రలో సుభాషిణి
కూడా. అయితే సుభాషిణి పాత్ర సమస్య అనవసరమైనదిగా కనిపిస్తుంది. ఇదెలాగో తర్వాత
చూద్దాం.
మొదట రాజేశ్వరి : ఈ ప్రతి
నాయకి పాత్రలో జయంతి ఒక ప్రధానాకర్షణ. ఇలాటి ‘దుష్ట’ పాత్ర ఆమెకిదే మొదటిసారి. జమీందారిణీ
దర్పం, అహం, పొగరు, దుర్నీతి ఆమె నటనతో విలనీకే వన్నె తెస్తాయి. తండ్రి ఆస్తి
తమ్ముడికి అంగుళం దక్కకుండా తనే కాజేసి కూర్చుంటుంది. తల్లిని నోరెత్త నివ్వదు. తల్లి
కోరిక మేరకు కూతురు భవానీ పెళ్లి తమ్ముడి కొడుకు బాబీతో జరగనివ్వదు. ఆ పెళ్లి
ఇక్కడే చేసి చూపిస్తానని తల్లి అన్నపూర్ణ అంటే, ‘ఏమిటీ ఇక్కడ చేస్తావా? ఇది ధర్మ
సత్రం కాదు, అడ్డమైన వాళ్ళ పెళ్ళిళ్ళు చేయడానికి!’ అని ఎదురు దాడికి దిగుతుంది.
‘ఎవడే
అడ్డమైన వాళ్ళూ? వాళ్ళకి చెందాల్సిన ఇల్లూ వాకిలీ మీరు కాజేసి?’ అని తల్లి అంటే,
‘అమ్మా, మాటలు జాగ్రత్తగా రానీయ్!’ అని హెచ్చరిస్తుంది.
‘నోర్ముయ్యవే.
గుడ్డొచ్చి పిల్లని వెక్కిరించిందనీ నన్ను
మాటలు జాగ్రత్తగా రానీ అం టావటే నువ్వు? పుట్టినప్పుడు
జానెడు లేవు. అనవే నీ ఇష్టమొచ్చినట్టు అను. ఇదంతా మీ నాన్న చేసిన నిర్వాకం. నా
ఇంట్లోనే నన్ను పనిమనిషిని చేసి వున్నదంతా నీకు కట్ట బెట్టి పోయాడా మారాజు’ అని
తల్లి వాపోతే, ‘ఆఁ కట్టబెట్టాడు! నా నెత్తిన ముళ్ళ కిరీటం పెట్టి వెళ్ళాడమ్మా మీ ఆయన.
ఆడా మగా అంతా నేనే సర్దుకోలేక చస్తున్నాను. ఇన్నేళ్ళుగా పెట్టి పోషిస్తున్న
దాన్ని, కన్న కూతుర్ని నా కంటే ఇవ్వాళ వచ్చిన కొడుకు పిల్లలు ఎక్కువై పోయారు నీకు!’
అని రెచ్చిపోతుంది.
‘ఇదిగో
వాళ్ళ పేరెత్తితే వూరుకోను!’ అని తల్లి మందలిస్తే, ‘వూరుకోక పోతే వూరేగు!’ అంటుంది
ఈసడింపుగా. మంచి మర్యాదలు, దయ, జాలి ఏవీ వుండవు. ఆస్తిని ఆజమాయిషీ చేస్తున్న
కొడుకు కృష్ణ చైతన్యతోనే ప్రేమ. ఫ్యూడల్ కుటుంబాల్లో పురుషులు స్త్రీలని అణిచేసే
సంగతులుంటాయి. ఇక్కడ స్త్రీయే స్త్రీలని అణిచి పారేస్తోంది.
అన్నపూర్ణ
: మాట వినని భర్త, పులిగోరు మెళ్ళో వేసుకునే మేకవన్నె పులి అల్లుడు, ఆస్తి
నొక్కేసిన విశ్వాసం లేని కూతురు...వీళ్ళతో ఏళ్లకేళ్ళు నలిగిపోయి విముక్తి కోసం
ఎదురు చూసే పాత్ర. విడిపోయిన కుటుంబాన్ని కొడుకు పిల్లల్నైనా ప్రయోగించి తిరిగి
ఏకం చేయాలన్న తాపత్రయం తనది. తన శైలిలో నీటుగా పాత్ర పోషణ చేస్తుంది నిర్మలమ్మ. అప్పట్లో
ఆమె గ్లామర్ కూడా బావుంది.
రుక్మిణి
: ఇది జయప్రద వేదనాభరిత పాత్ర. చక్రాల కుర్చీకి అంకితమై భర్త సుఖం కోసం
కుమిలిపోయే పాత్ర. పైగా అత్త రాజేశ్వరి అల్టిమేటంతో ఇంకింత కుంగుబాటు. భర్తని
రెండో పెళ్లి చేసుకోమని ఒప్పించలేక, అతడి బేషరతు ప్రేమకి పాత్రురాలూ కాలేక నలిగి పోతూంటుంది. తనకి విముక్తి ఎలా
లభిస్తుంది? ఇదొక విషాదకర ముగింపు. ఈ పాత్రలో జయప్రద అత్యంత రూపవతిగా
కన్పిస్తుంది. డాన్సర్ పాత్రలో ఆమె చేసే సర్ప నృత్యం సినిమాకే హలైట్ అనొచ్చు. నేల
మీద సర్పమంత వేగంగా సరసర ప్రాకే శరీర విన్యాసాలతో ఆశ్చర్య పరుస్తుంది.
మేరీ : హిందీ నటి పోషించిన
మరో బాధిత పాత్ర. భర్త శివప్రసాద్ తో వస్తే రాజ భవనంలో కాకుండా అవుట్ హౌజ్ లో
పెట్టి అవమానించిన మామ మీద ఆమె కేం కోపముండదు. మామ చావుకి దగ్గరికి కూడా
రానివ్వకుండా, కొరివి పెట్టనివ్వకుండా, భర్తని వెలివేసిన తీరని బాధ ఓ వైపుండగా, ఆ
భర్తకి విరూపాక్ష రాజా భర్తకి తలపెట్టిన కీడు దహించి వేస్తుంది. అదంతా డైరీలో
రాసిపెట్టి తనూ అన్యాయమైపోతుంది. విరూపాక్ష రాజా పెంపుడు కుక్క సుల్తాన్ అంత పనీ
చేస్తుందని వూహించదు.
జేనీ : జయసుధ పాత్ర. ఈ పాత్రని చెక్కిన తీరు గుర్తుండి పోతుంది. తండ్రి పులిగోరు
మెళ్ళో వేసుకున్న కృష్ణ చైతన్యని చంపాలన్న ఏకైక లక్ష్యంతో రహస్య ఎజెండా అమలు
చేస్తూంటుంది. డాక్టర్ విశ్వం (సత్యనారాయణ) తో మాత్రమే తన బాధ చెప్పుకుంటూ
వుంటుంది. మా ఇంటికి మేం పరాయి వాళ్ళల్లా వచ్చామని అక్కసు వెళ్ళ గ్రక్కుతుంది.
తల్లి రాసిన డైరీ చదువుతూ, ఆనాడు అసలేం జరిగిందో తెలుసుకుంటూ వుంటుంది. ఈ ఆ స్తిపాస్తులకి
నిజమైన వారసులు తను, తన అన్న బాబీ. ఇది కాదు తనకి ముఖ్యం, ఆ మేనమామ విరూపాక్ష రాజా
చేసిన అన్యాయానికి గుర్తుగా మిగిలిన బావ కృష్ణ చైతన్యని తుపాకీ తో కాల్చి చంపడం
ముఖ్యం. అదే మేనత్త రాజేశ్వరికీ శిక్ష. అప్పుడే తనకి ఈ మానసిక క్షోభ నుంచి
విముక్తి. ముగింపు దృశ్యాల్లో జయసుధ టెర్రిఫిక్ గా వుంటుంది. అప్పటికామె ఇంకా లేత వయసులో
స్లిమ్ గా వుంది. బీజ్ కలర్ జీన్స్, బ్రౌన్ కలర్ టీస్ లో యూత్ అప్పీల్ తో టెర్రిఫిక్
గా కన్పిస్తుంది.
నీలి : పని మనిషిగా సుభాషిణి పాత్ర.
జేనీ అన్న బాబీ ఈమెని గర్భవతిని చేస్తాడు. ఈ నిజం చెబితే బాబీ చిక్కుల్లో పడతాడు.
కారకుడెవరో చెప్పితీరాలని కుటుంబమంతా నిలదీస్తారు. చెప్పలేక కుమిలిపోతుంది.
చివరికి మూగ వాడైన పనివాడిని చూపిస్తుంది. ఆ మూగ వాడితో పెళ్ళయి పోతుంది.
చివర్లోనే
రెండో కృష్ణం రాజు
ఇలా
స్త్రీ పాత్రల సమాహారంగా వుంటుంది. జయప్రద, జయసుధ పాత్రలకి ఫ్లాష్ బ్యాకులుంటాయి.
ఫ్లాష్ బ్యాక్ అనగానే మొత్తం ఒకేసారి బారెడు చూపించే ఆచారం ఇప్పటికీ ఒకటుంది.
దీంతో ఫ్లాష్ బ్యాక్ మొదలవుతోందంటే అసహనం మొదలై పోతుంది. ఇక్కడ మొత్తం ఒకేసారి
ప్రారంభించకుండా, ముందుగా చిన్న చిన్న దృశ్యాలు అప్పుడప్పుడు ఫ్లాష్ బ్యాక్స్ గా
వేస్తూ ఆసక్తి రేపుతారు. మనకి ఆసక్తి పుట్టాక, మిగిలిన దృశ్యాలన్నీ ఒకే ఫ్లాష్
బ్యాకుగా వేసేసి ముగిస్తారు. ప్రేక్షకుల్ని భాగస్వాముల్ని చేసే టెక్నిక్ తో
మాత్రమే సృజనాత్మకత రాణిస్తుంది. ఒక హాలీవుడ్ రచయిత చెప్పినట్టు, సినిమా రచన అనేది
సినిమాతో రచయిత రోమాన్స్ కాదు. అదొక ట్రయాంగిల్ ఎఫైర్. ఈ ముక్కోణ వ్యవహారంలో
సినిమా, రచయిత, ప్రేక్షకులూ వుంటారు. సినిమాతో బాటు ప్రేక్షకుల ప్రతిస్పందనలని
దృష్టిలో పెట్టుకోని రచయిత విఫలమవుతాడు.
కృష్ణం
రాజు ద్విపాత్రాభినయం కూడా ఆకర్షణీయమైనదే. అయితే మొదటి పాత్రకున్నంత బలం రెండో
పాత్రకి లేదు. స్త్రీ పాత్రల కథ కావడం వల్ల. స్త్రీ పాత్రల సమస్యల్ని చక్కబెట్టే
బాధ్యత కూడా వుండదు. ప్రేక్షకులు ఏదో చేస్తాడని ఆశిస్తే నిరాశే ఎదురవుతుంది. చివర్లో
నిజాలు తెలుసుకుని తల్లిపాత్రని నిలదీసే సన్నివేశంలో మాత్రం హైలైట్ అవుతాడు. తల్లి
ముందు డైరీ పడేసి, ‘ఏడుస్తావేంటమ్మా, ఆనందించు. నీ ఘన కార్యపు ప్రతిఫలం ఎంత
ముచ్చటగా వుందో చూసి సంతోషించమ్మా. నువ్వూ నాన్నగారూ చేసిన పాపాల చిట్టా చూడు.
ఇన్నాళ్ళూ నాకు తెలియకుండా దాచిన మీ నేరాల్నీ ఘోరాల్నీ ఎత్తి చూపి నాకు కర్తవ్యాన్ని
భోదించిన గీతమ్మా అదీ. మంచి మనుషుల్ని బాధించీ పీడించే రాక్షసుల చరిత్రతో నిండిన
రామాయణమమ్మా... జోహార్లమ్మా నీకూ...’ ఇలా విచలితుడవుతూ
భావోద్వేగాల్ని పండిస్తాడు.
కృష్ణం
రాజు తమ్ముడి పాత్రలో శరత్ బాబుకి ప్రాధాన్యం లేదు. జయసుధ అన్న బాబీగా సుధాకర్
పాత్ర మాత్రం అభ్యంతర కరంగా వుంటుంది. శివ ప్రసాద్ కొడుకుగా అతణ్ణి కాముకుడిగా
చిత్రించారు. నిజానికి జయసుధ పాత్రతో బాటు తను సానుభూతి పొందాల్సిన బాధిత పాత్ర. అలాటిది కాముక చర్యలతో మొదట మరదలు భవానీ మీద
కన్నేసి, సాధ్యం కాకపోవడంతో, ‘ఇది విస్కీ ఇది బ్రాందీ’ అని తాగి పాడి పని మనిషిని
గర్భవతిని చేస్తాడు. భవానీని పెళ్లి చేసుకుంటాడు. జయసుధ పాత్ర, తండ్రి శివప్రసాద్
పాత్రతో బాటు తనూ, నీతితో వుంటేనే తమకి జరిగిన అన్యాయం చెప్పుకోవడాని కుంటుంది. ఇంతా
చేసి బాబీ ప్రవర్తనతో ఏర్పడిన సమస్య కథ కుపయోగ పడిందీ లేదు. దాన్ని పనివడి మీదే
తోసేసి ముగించారు.
సినిమాలో
వినోదానికి కథతో సంబంధం లేకుండా, అల్లు రామలింగయ్య సీతాపతి కామెడీ ట్రాక్ వుంది.
తనని అన్నయ్యా అనీ, పిల్లల్ని తమ్ముళ్ళూ చెల్లెళ్ళూ అని పిలిచే పిచ్చి భార్యతో
కామెడీ.
జంధ్యాల
మాటలు బావున్నాయి. ఆయన చాలా ఆణిముత్యాలే అందించారు : జమీందార్ల ఇంటి గోడలే కాదు,
గుండె గోడలు కూడా అతి మందంగా వుంటాయి...మీ మమత నన్ను చావనివ్వదు, నా మనసు నన్ను
బతక నివ్వదు... గొప్పింట్లో పుట్టడం గొప్ప కాదు, పుట్టి గొప్ప మనసు పెంచుకోవడం
గొప్పతనం... మనిషికి రీజన్ పెరిగి సీజన్ పోయింది...పిల్లల్ని కనడం గురించి మీ
అమ్మకే నువ్వు చెప్తావటే?...
పాటలు ఆత్రేయ రాశారు. వీటిలో జయప్రద మీద ‘ప్రియుడా
పరాకా’ బాగా హిట్టయింది. ‘వయసు కోతి వంటిది’ అనే కృష్ణం రాజు- జయప్రదల మీద యుగళ గీతం
లో అశ్లీలం ఎక్కువైంది – ‘తొలిరేయి నీ చేయి తెలియకనే ఎక్కడో తగిలెను...నీకు
గిలిగింత అక్కడనే అప్పుడే తెలిసెను...’ అంటూ. కేవీ మహదేవన్ స్వరాలు కూర్చారు.ఎ. వెంకట్
ఛాయాగ్రహణం, కేఏ మార్తాండ్ కూర్పు అందించారు. నిర్మాణ విలువలు డి. రామానాయుడు
స్థాయిలో వున్నాయి.
టీవీ
సీరియల్స్ వచ్చి కుటుంబ సినిమాల్ని మింగేశాయి. దాంతో కుటుంబ సినిమాలు మాఫియా
యాక్షన్, లేదా ఫ్యాక్షన్ కలిసిన కథలుగా మారిపోయాయి. నేటికీ ఒక ‘అగ్నిపూలు’ లాగా
కుటుంబ సంబంధాల మీద కుటుంబ సినిమాలు రాకపోవడం ఒక విచారకర సన్నివేశం.
―సికిందర్
(పాలపిట్ట - జులై 2020 సంచిక)