రివ్యూలు, సాంకేతికాలు, స్క్రీన్ ప్లే సంగతులు...

టికెట్లు దొరకడం యోగం, సినిమాలు చూడడం భోగం, రివ్యూలు రాయడం రోగం!

5, ఆగస్టు 2020, బుధవారం

965 :


‘డానీ’ (తమిళం) రివ్యూ
రచన, దర్శకత్వం: సిఎల్ సంతాన మూర్తి
వరలక్ష్మీ శరత్ కుమార్, యోగి, సాయాజీ షిండే, అనితా సంపత్, వినోద్ కిషన్ తదితరులు సంగీతం: సాయి భాస్కర్, ఛాయాగ్రహణం: ఆనంద్ కుమార్        
బ్యానర్: పిజి మీడియా వర్క్స్
నిర్మాతలు : పిజి ముత్తయ్య, ఎం దీపా
విడుదల: జీ 5

***
        టీటీలో వరుసగా జ్యోతికతో ‘పొన్మంగళ్ వందాళ్’, కీర్తీ సురేష్ తో ‘పెంగ్విన్’, ఇప్పుడు వరలక్ష్మీ శరత్ కుమార్ తో ‘డానీ’ అనే మూడు తమిళ సస్పెన్స్ థ్రిల్లర్స్ విడుదలయ్యాయి. ముగ్గురు హీరోయిన్లూ హీరోయిన్ ఓరియెంటెడ్ సస్పెన్స్ థ్రిల్లర్స్ ప్రయత్నించి ఫ్లాపయ్యారు. ఇంకా అటు కన్నడ నుంచి కొత్త హీరోయిన్ రాగిణీ ప్రజ్వల్ కూడా  ‘లా’ తో ఫ్లాపయ్యింది. జానరేంటో తెలీని కొత్త దర్శకులు హీరోయిన్ల జీవితాలతో ఆటలాడుతున్నారు. వరలక్ష్మి చాలనట్టు డాగ్ ని కూడా ప్రయోగించి ‘డానీ’ అని దానికి టైటిల్ రోల్ ఇచ్చేశాడు దర్శకుడు. టైటిల్ రోల్ తీసుకున్న డానీ డాగ్, పారితోషికం ఎగ్గొట్టారనో ఏమో, మొరగడమే తప్ప కరిచే పని పెట్టుకోలేదు. ఎప్పుడొస్తుందో, ఎందుకొస్తుందో, వచ్చి మొరుగుతుంది, పరుగు దీస్తుంది, మళ్ళీ వచ్చి మొరుగుతుంది, మళ్ళీ పరుగు దీస్తుంది. దాని బాధ దర్శకుడికి అర్ధంగానట్టుంది. విశ్వాసం లేని మీకు గెస్ట్ రోల్ చాల్లే అని అది మొరిగి వెళ్లి పోతోంది.      
  
        సస్పెన్స్ థ్రిల్లర్ ఎంత వేళాకోళంగా వుందంటే, డాగ్ కి లాగే వరలక్ష్మీ శరత్ కుమార్ తనూ నవ్వులపాలయ్యేంత. బడ్జెట్ లేని ఇంత నాసిరకం సినిమా ఎందుకు చేసిందో ఆమెకే తెలియాలి. తను పోలీస్ ఇన్స్ పెక్టర్ పాత్ర. తన చుట్టూ పాత్ర లేసిన నటీనటులు సాయాజీ షిండే, యోగిబాబు తప్ప, ఒక్కరూ సరైన రూపు రేఖలతో లేరు. సినిమా కాకుండా రైస్ మిల్లులో లేబర్ ని చూస్తున్నట్టుంటుంది. యూత్ అప్పీల్ అనే మాటే లేదు. ఇక ఈ సినిమాకి స్క్రిప్టు కాగితాల్లో రాసుకున్న కథ అనే పదార్ధం ఎంత అందంగా వుందంటే, ఆ కాగితాలు ఇడియప్పం ఉప్మా చుట్టడానికి కూడా పనికిరావు. 

కథ అనే పదార్ధం:


     తంజావూరులో డ్రగ్స్ పట్టుకోవడానికి చెకింగ్ జరుగుతూంటుంది. సమాచారమందిన బస్సులో డ్రగ్స్ దొరకవు. పోలీసులు కంగారు పడుతూంటారు. ఇంతలో పారితోషికం కోసం చెంగు చెంగున దూకుతూ డానీ డాగ్ వచ్చేస్తుంది. వచ్చేసి బ్యాగుని పట్టేసుకుంటుంది. అన్ని బ్యాగులూ వెతికి ఆ ఒక్క బ్యాగు మాత్రమే డానీ డాగ్ పట్టుకోవడానికి అట్టి పెట్టారన్న  మాట పోలీసులు. ఆ బ్యాగులో పారితోషికం లేకపోవడం చూసి తీవ్రంగా మండిపడుతుంది డానీ.

        వూరి పొలిమేరలో ఒక కాలుతున్న శవం దొరుకుతుంది. శవం మీద గొలుసుతో భర్తని పట్టుకుంటారు పోలీసులు. ఒక బస్తీలో పాత మిద్దె ఇల్లున్న కంధవాయి (వరలక్ష్మి) తల్లితో, చెల్లెలు మధీ (అనితా సంపత్) తో వుంటుంది. చెల్లెలు మధీ అంధ బాలల పాఠశాలలో యంగ్ పంతులమ్మ. కంధవాయి మురికిగా వున్న తమ ఇంటి దొడ్లో పిల్లలకి లో- బడ్జెట్ మేరకు కరాటే నేర్పుతుంది. పొలం వెళ్లి ట్రాక్టర్ తో దున్నుతుంది. పోలీస్ స్టేషన్ కెళ్ళి కొత్త ఇన్స్ పెక్టర్ గా జాయినైపోయి, చుట్టు పక్కల ముప్ఫై పోలీస్ స్టేషన్లలో వున్న ఎఫ్ ఐ ఆర్ లని తెమ్మంటుంది. ఒక సర్కిల్లో ముప్పై పోలీస్ స్టేషన్ లుండడం తమిళనాడు స్పెషాలిటీనేమో. కొత్త ఇన్స్ పెక్టర్ వస్తే ఆ ముప్పై మంది ఎస్సైలకి వచ్చి కలవాలన్పించక పోవడం విధి వశాత్తూ మెగా బడ్జెట్ లోపించడం వల్లేమో. 


        వూళ్ళో కాలిన శవం కేసు పట్టుకుంటుంది కంధవాయి. భర్త హంతకుడు కాదని వదిలేస్తుంది. మరెవరు? ఇంతలో డాగ్ హేండ్లర్ కూడా మర్డరై పోతాడు. మరింతలో చెల్లెలు మధీ కూడా సఫా అయిపోతుంది. కమెడియన్లే మిగుల్తారు కామెడీలు చేసుకోవడానికి. వూళ్లోనే ఒక డాక్టర్ (సాయాజీ షిండే) వుంటాడు. ఇతను డ్రగ్స్ పిచ్చిగల కొడుకుని గారం చేస్తూంటాడు. ఈ కొడుకే హత్యలు చేస్తున్నాడా? ‘పెంగ్విన్’ లో తనలాంటి వాడే ఒకడు అమ్మాయిలని మర్డర్ చేశాడని, రోల్ మోడల్ గా తీసుకుని తనూ చేశాడా? ఉత్కంఠ రేపే హిచ్ కాక్ సస్పెన్స్ ఇది.


నటనలు – సాంకేతికాలు :
      స్క్రిప్టు కూడా చూసి టైటిల్ రోల్ ని గెస్టు రోలుగా కుదించేసుకుంది డానీ ది పోలీస్ డాగ్. తోచినప్పుడు రావడం, తోచనప్పుడు వెళ్ళిపోవడం. వరలక్ష్మి కూడా జీవకారుణ్యంతో దాన్ని తంజావూరు గెస్టుగా ఉదారంగా వుండనిచ్చింది. తను కూడా కంధవాయిగా అంధకారంలో వుంది. ఇది యాక్షన్ సినిమానా లేక దానికి మించి కమెడియన్ల గోలనా అర్ధంగాని పరిస్థితి. ఉన్న సదుపాయాలతో సరిపెట్టుకుని ఇన్వెస్టిగేషన్ చేద్దామంటే కామెడీలు పెట్టేస్తాడు దర్శకుడు. డానీ కాకుండా, తనూ కాకుండా కమెడియన్ల భుజాల మీద వేశాడు సినిమాని. సరైన విలన్ని కూడా పెట్టలేకపోయాడు. పోలీస్ ఇన్స్ పెక్టర్ పాత్ర డానీ పక్కన నిలబడ్డానికేనా. బాధితులు ఈ సినిమాలో హతులైన పాత్రలు కాదు, తనూ డానీ. కొత్త దర్శకులు బాగా తీస్తున్నారని అవకాశమిస్తే ఇరవయ్యేళ్ళు వెనక్కి తోశాడు తనని. అప్పట్లో కూడా సినిమాలు ఇలా తీయలేదు. తమిళ దర్శకులు క్రియేటివిటీకి పెట్టింది పేరని మన్మోహన్ సింగ్ కీర్తిస్తే చాలా కచరా చేస్తున్నారు కొత్త దర్శకులు.            

     యోగిబాబు కామెడీ, లొకేషన్స్, కాస్ట్యూమ్స్, సహాయ నటీనటులు, కెమెరా సంగీతం, ప్రతీదీ దర్శకుడికి సినిమా సెన్స్ లోపించిందనడానికి నిదర్శనాలు. 

కథాకథనాలు :

      మేకర్ లేబర్ కేటగిరీ అయితేనే ఇలాటి లేబర్ కథే రాసి తీస్తాడు. తీస్తున్నది గొప్ప సస్పెన్స్ థ్రిల్లర్ అనుకుంటూ తీసింది లేబర్ కామెడీ. సస్పెన్స్ థ్రిల్లర్ జానర్ మర్యాదలే పట్టని కన్నడ ‘లా’ లో ఎంటర్ టైన్మెంట్ వుండాలన్నట్టు ఫీలై కోర్టులో, ఆ కోర్టులో జడ్జితో చీప్ కామెడీలు పెట్టినట్టు, ఇక్కడ కూడా కొత్త దర్శకుడికి కామెడీ లేకపోతే  సినిమా ఆడదన్న అభద్రత ఎక్కువయ్యింది. ఉన్న సస్పెన్స్ కథయినా కథలా వుందాంటే, పరస్పరం సంబంధం లేని, కథకి అవసరం లేని సీన్లు. అంధ బాలలకి చెల్లెలి పాత్ర పాఠాలు చెప్తూ, పక్షుల్లా అరవమంటుంది. ఒక బాలిక అరిచిందో లేదో, కట్ చేసి ఇంకో సౌండ్ విన్పించి -ఇది ఏ వాహనం శబ్దమో చెప్పమంటుంది. ఒక సీనులో సీను ఎలా ముక్కలుగా వుందో, కథ కూడా ఇలా ముక్కలు ముక్కలుగా వుంటుంది. అవసరం లేని విషయాలతో ముక్కలైన కథతో సస్పెన్స్ ఏముంటుంది. పాత్ర చిత్రణలు కూడా ముక్కలు ముక్కలై వుంటాయి. కరాటే తెలిసిన వరలక్ష్మి పాత్ర చివర్లో విలన్ని పట్టుకున్నప్పుడు కరాటేతో కొట్టకుండా, హెల్ప్ కోసం డానీ డాగ్ ని కేకేస్తుంది. డాగ్ జన్మెత్తి నందుకు ‘జాలి గుండె లేని దర్శకుడి కన్నా కుక్క మేలురా’ అని తిట్టుకుంటూ వస్తుంది డానీ డాగ్.

సికిందర్