రివ్యూలు, సాంకేతికాలు, స్క్రీన్ ప్లే సంగతులు...

టికెట్లు దొరకడం యోగం, సినిమాలు చూడడం భోగం, రివ్యూలు రాయడం రోగం!

Wednesday, August 21, 2019

862 : సందేహాలు - సమాధానాలు



Q :  బహిర్ముఖంగా తల్లిని ఎదుర్కొంటున్న వాడు, తల్లిని అనారోగ్యం పాల్జేశానన్న చింతతో తనకి తనే ప్రత్యర్ధి అయి, తనతో తానే అంతర్ముఖీనంగా సంఘర్షించడం మొదలెడతాడు. ఇలాటి పాత్ర వరల్డ్ మూవీస్ లో, ఆర్టు మూవీస్ లో, గాథల్లో వుంటుంది.కమర్షియల్ మూవీస్ లో కాదుఅని మన్మథుడు - 2  స్క్రీన్ ప్లే సంగతులులో రాశారు.  మీరన్నట్టు ఇంటర్నల్ కాన్ఫ్లిక్ట్  ఎక్కువగా ఆర్ట్ సినీమాలలోనే చూస్తాము.  కానీ తెలుగు సినిమాలలో ఖుషీ, మన్మధుడు -1, అర్జున్ రెడ్డి, ఇవన్నీ ఇంటర్నల్ కాన్ఫ్లిక్ట్ తో నడిచిన సినిమాలే కదా...మరి అవి బాగా ఆడాయి కదా? ఎందువల్ల? క్యారక్టర్ డ్రివెన్ స్టోరీస్ ముఖ్యంగా ఇంటర్నల్ కాన్ఫ్లిక్ట్ మీదే ఆధారపడి వుంటాయి కదా, మరి వాటి సంగతి ఏంటి? అవి తెలుగులో ఆడే అవకాశం లేదంటారా
పేరు రాయలేదు

 
A :  ఏ కథయినా క్యారక్టర్ డ్రివెన్ స్టోరీగానే వుంటుంది. క్యారక్టర్ నడపక పోతే కథ ఎక్కడిది?  గాథ వుంటుంది. వరల్డ్ మూవీ వుంటుంది, ఆర్ట్ సినిమా అవుతుంది. ఆ క్యారక్టర్ పాసివ్ పాత్రవుతుంది. కాబట్టి క్యారక్టర్ డ్రివెన్ స్టోరీస్ - ఇంటర్నల్ కాన్ఫ్లిక్ట్ రెండూ రెండు ధృవాలు. కలిసి వుండవు. క్యారక్టర్ డ్రివెన్ స్టోరీస్ లో ఎక్స్ టర్నల్, ఇంటర్నల్ కాన్ఫ్లిక్టులు రెండూ వుంటాయి. అప్పుడే అది యాక్టివ్ పాత్రగా నిలబడుతుంది.

          మన్మథుడు - 2 తో మీరు పేర్కొన్న సినిమాల్ని పోల్చకూడదు.
మన్మథుడు -2  లో నాగార్జున ప్రత్యర్ధి అయిన తల్లి పాత్రతో  ఎక్స్ టర్నల్, ఇంటర్నల్ కాన్ఫ్లిక్టులు రెండిటితో ప్రారంభమవుతాడు. ఎప్పుడైతే తన ఎత్తుగడలతో ఆమెని అనారోగ్యం పాల్జేస్తాడో - ఇక ఆ అపరాధభావంతో ఆమెతో - అంటే ఆ ప్రత్యర్ధితో - ఎక్స్ టర్నల్ కాన్ఫ్లిక్ట్ నుంచి వైదొలగి. లోలోన ఇంటర్నల్ కాన్ల్ఫిక్ట్ తో వుండి పోతాడు. కథ మధ్యలో ప్రత్యర్థి పాత్ర కనుమరుగయ్యాక ఇక నాగార్జునకి పనేముంటుంది. ఇందుకే ఆయన పాత్ర విఫలమయింది. పాత్ర విఫలమైతే కథ విఫలమైనట్టే. సింపుల్ గా చెప్పాలంటే, మన్మథుడు -2 ఫస్టాఫ్ కమర్షియల్ సినిమా, సెకండాఫ్ ఆర్టు సినిమా. మన తెలుగు సినిమాలు తెలియక కమర్షియల్ సినిమాల ముసుగేసుకుంటున్న ఆర్ట్ సినిమాలే. ఇది ఎన్నటికీ అర్ధం జేసుకోలేరు. ఇలాగే భారీగా పదుల కోట్లు బంగాళాఖాతంలో కలుస్తూంటాయి. ఈ డబ్బు అమరావతి కిచ్చినా రాజధాని తయారై  కళ్ళ ముందుంటుంది.

          మీరు పేర్కొన్న సినిమాల్లో ప్రత్యర్థి పాత్రలు మొదట్నించీ వుండవు. మొదట్నించీ ప్రత్యర్ధి పాత్ర వుండనప్పుడు, ఇలాటి రోమాంటిక్ డ్రామాలు తప్ప, ఆ ఇంటర్నల్ కాన్ఫ్లిక్ట్ తో రోమాంటిక్ కామెడీలు, ఇతర కమర్షియల్ - యాక్షన్ - మాస్ - స్టార్ వగైరా సినిమాలు సక్సెస్ కావు. మీరు చెప్పినవే కాదు, చాలా పూర్వం దేవదాసు, మేఘసందేశం, సాగరసంగమం లాంటివి కూడా ప్రత్యర్థి లేని ఇంటర్నల్ కాన్ఫ్లిక్టుతో రోమాంటిక్ డ్రామాలుగా హిట్టయ్యాయి.

Q :  మీరు తెలుగు సినిమాల సక్సెస్ రేటు 10 శాతమేనని తరచూ పేర్కొంటుంటారు. ఈ అంశాన్ని నా ‘తెలుగు ఫిలిం అడాప్టేషన్స్’ పరిశోధనలో భాగంగా చేర్చాను. పూర్వం దర్శకులు సాహిత్యం నుంచి కథలు తీసుకునే వారు. ఈ తరం దర్శకులు సినిమాల నుంచి మాత్రమే రిఫరెన్సులు తీసుకుని సినిమాలు నిర్మిస్తున్నారు. ఇది నిజమేనంటారా? పోతే, 1990 లకి పూర్వం తెలుగు సినిమాల సక్సెస్ రేటు తెలుసుకోవాలనుకుంటున్నాను. ఎందుకంటే నా అధ్యయనం 1960 - 80 మధ్య కాలానికి సంబంధించినది. ఈ కాలంలోనే నవలలు ఎక్కువగా సినిమాలుగా వచ్చాయి. ఇకపోతే, మీరొక చోట ఇలా రాశారు: ‘తెలుగు సినిమాల తొలి స్వర్ణయుగమైన 1931-51 మధ్య (భక్తప్రహ్లాద నుంచీ పాతాళ భైరవిదాకా) వచ్చిన లాంటి సినిమాలు మలిస్వర్ణ యుగంలో లేవు. మలిస్వర్ణ యుగం 1951 -71 మధ్య (మల్లీశ్వరినుంచీ చెల్లెలి కాపురంవరకూ) సాగింది. మలిస్వర్ణయుగంలో వచ్చిన లాంటి సినిమాలు తర్వాత వ్యాపారయుగంలో లేవు. వ్యాపారయుగం 1971- 91 మధ్య (‘దసరాబుల్లోడు నుంచీ గ్యాంగ్ లీడర్వరకూ) కొనసాగింది. ఇంతే, మూడు యుగాల్లో సుమారు తరానికోమారు  సినిమాల తీరుతెన్నులు మారుతూ వచ్చాయి. అంటే, రెండు దశాబ్దాలకో మారు కొత్త  తరం నిర్మాతలూ దర్శకులూ వచ్చేస్తూ సినిమాల్ని కొత్తబాట పట్టించసాగారన్నమాట!' అని. ఈ సమాచారం మూలాల గురించి తెలియజేయగలరు.
దిలీప్ కుమార్, eflu 

A :  ఈ సమాచారం ఆయా కాలాల సినిమాలని పరిశీలించి స్వయంగా రూపొందించుకున్నది.  వెనుక చరిత్ర తెలియకపోతే  ముందు ప్రయాణం తెలియదు కాబట్టి. మీకు కావాలంటే సవివర సమాచారమిస్తాను. మీరు వ్యక్తిగతంగా కలుసుకున్నప్పుడు, పరిశోధనాకాలం తొలినాటి నుంచీ వుండాలని చర్చించినట్టు గుర్తుంది. అంటే తెలుగు సినిమాలు మూకీలుగా ప్రారంభమైన 1921 నుంచీ. 1921 లో తెలుగుసినిమా పితామహుడు రఘుపతి వెంకయ్యనాయడు తొలి మూకీగా ‘భీష్మ ప్రతిజ్ఞ’ నిర్మించారు. ఇది పౌరాణిక నాటకం. కాబట్టి అడాప్టేషన్స్ అన్నవి మొదటి మూకీతో పౌరాణిక నాటకాలతోనే ప్రారంభమయ్యాయి. నడుస్తున్న నాటకాన్ని నడుస్తున్నట్టే షూట్ చేసే వాళ్ళు. తర్వాత టాకీలుగా వచ్చిన సినిమాలు 1937 వరకూ పౌరాణిక నాటకాలే. అంటే అడాప్టేషన్సే. 1936 లో మొట్ట మొదటి సారి సినిమాకి కథ ఎలా రాయాలో తెలుసుకుని, కృతివెంటి నాగేశ్వరరావు, తన సొంత నాటకాన్ని’ ప్రేమ విజయం’ అనే కాల్పనిక సాంఘీక చిత్రంగా మల్చారు. ఇలా ఇలా తెలుగు, ఇంగ్లీషు, బెంగాలీ మొదలైన భాషల నవలలూ నాటకాలూ కాలక్రమంలో ఎన్నో సినిమాలుగా వచ్చాయి మీరు తీసుకున్న 1960 - 80 కాలావధి వరకూ. మీరిదే కాలావధి తీసుకున్నా పూర్వరంగాన్ని పరిచయం చేయాల్సి వుంటుందేమో ఒకసారాలోచించండి.

          ఇక 1980- 90 లలో సక్సెస్ రేటు విషయానికొస్తే, 1980 లో 60 నిర్మిస్తే 44 హిట్టయ్యాయి. దీన్నిబట్టి వూహించుకోవచ్చు. ఇప్పుడు వస్తున్నన్ని సినిమాలు అప్పట్లో లేవు. ఇప్పుడున్నన్ని వివిధ దృశ్య మాధ్యమాలు అప్పట్లో లేవు. కొన్ని సినిమాలు 200, 500 రోజులు కూడా ఆడేవి. అప్పట్లో కాలం, క్వాలిటీ, సంఖ్యా కలిసొచ్చాయి. 2000 తర్వాత నుంచి ఏదీ కలిసిరావడం లేదు. రణరంగం, డియర్ కామ్రేడ్ లాంటి ఎండుగడ్డి స్టార్ సినిమాలు అప్పట్లో వూహించం.


          ఇక
ఈ తరం దర్శకులు నవలల్ని అడాప్ట్ చేసుకోవడానికి చేతన్ భగత్ లా తెలుగులో ఈ తరం నవలలు రాసే వాళ్ళు లేరు. రాసినా చదివే వాళ్ళు లేరు. సోషల్ మీడియా వల్ల రచనా వ్యాసంగాలు మట్టి కొట్టుకుపోయాయి. సోషల్ మీడియాలో పోస్టులే సాహిత్యసేవ అనుకుంటున్నారు. అందువల్ల ఈ తరం దర్శకులు విదేశీ సినిమాలతో హాత్ కీ సఫాయీ చేసుకుంటున్నారు. 

 
Q :   సార్, మీరు చాలా గ్రేట్ సార్. కథలు రాసేవాళ్ళకి చాలా వ్యాసాలు అందిస్తున్నారు. కన్నడ, తెలుగు సినిమా రైటర్లకి మీ వల్ల చాలా ఉపయోగం. నేను మూడు నెలలు ఫిలిం ట్రైనింగ్ పొందాను. నాకు నిర్మాతలు, లేదా దర్శకులు ఎలా దొరుకుతారో చెప్పగలరు. ఎన్. కన్నయ్య, రైటర్

A :  ఇలాటి సిల్లీ ప్రశ్నలు అడగొచ్చా?  రైటర్ గా మీరు నిర్మాతలకో, దర్శకులకో కథ లివ్వాలనుకోవడం మర్చిపోండి. కథ రాసుకుంటే దర్శకులై పోండి, లేదా దర్శకుల కథలకి అవకాశముంటే పని చేయండి. ఈ రెండూ కాదంటే, డైలాగ్ రైటర్ గా కృషి చేయండి. ముందు వ్యవస్థ ఎలా వుందో తెలుసుకుని ఫోకస్డ్ గా ప్రణాళికలేసుకోండి. రైటర్ నుంచి కథ తీసుకునే పద్ధతి గత ఇరవై ఏళ్లుగా లేదు. 

సికిందర్



Monday, August 19, 2019

861 : రివ్యూ


        రుసగా దేశ భద్రతకి  సంబంధించిన అంశాలతో సినిమాలు నటిస్తూ వస్తున్న యాక్షన్ స్టార్ జాన్ అబ్రహాం, మరో అలాటి టాపిక్ తో ‘బాట్లా హౌస్’ నటించాడు. ఫోర్స్ - 2, పరమాణు, సత్యమేవ జయతే, రోమియో అక్బర్ వాల్టర్ ల తర్వాత, ‘బాట్లా హౌస్’ తో ప్రేక్షకులకి మరింత దగ్గరయ్యే  ప్రయత్నం చేశాడు. ‘బాట్లా హౌస్’ దేశవ్యాప్తంగా సంచలనమైన నిజంగా జరిగిన కథ  కావడంతో దీనికెక్కువ ఆదరణ కన్పిస్తోంది. దావూద్ ఇబ్రహీంని పట్టుకునే కథతో 2013 లో  ‘డీ –డే’ అనే హిట్ రియలిస్టిక్ యాక్షన్ తీసిన ‘కల్ హో నహో’ ఫేమ్ దర్శకుడు నిఖిల్ అద్వానీ, కొంత గ్యాప్ తర్వాత  ‘బాట్లా హౌస్’ అనే మరో రియలిస్టిక్ యాక్షన్ తో వచ్చాడు. ‘పింక్’ అనే థ్రిల్లర్ తో  పేరు తెచ్చుకున్న రచయిత రీతేష్ షా, క్షుణ్ణంగా రీసెర్చి చేసి రాసిన ఈ ఎన్కౌంటర్ కథతో మరోసారి ‘పింక్’ లాంటి కోర్టు రూమ్ డ్రామాకి తెర తీశాడు. ఈ నేపథ్యంలో  ఢిల్లీలో జరిగిన బాట్లా హౌస్ ఎన్కౌంటర్ సంఘటన ఎలా తెరానువాదమైందో చూద్దాం...
కథ
         
టీవీ న్యూస్ యాంకరైన భార్య నందిత (మృణాల్ ఠాకూర్) ఆరోపణలతో విసిగిన ఢీల్లీ పోలీస్ స్పెషల్ సెల్ ఎసిపి సంజయ్ కుమార్ (జాన్ అబ్రహాం), ఆమె ఇక పుట్టింటికి వెళ్లిపోతానంటే - పోతే పో అని  ఏర్ పోర్టులో దిగబెట్టడానికి తీసుకుని బయల్దేరతాడు. కానీ తను అర్జెంటుగా బాట్లా హౌస్ ఆపరేషన్ కెళ్ళాలి. ఆమె మనసు మార్చుకుని మధ్యలో దిగిపోతుంది. తను బాట్లా హౌస్ కి చేరుకునే సరికి అక్కడ కాల్పులు జరుగుతూంటాయి. టెర్రరిస్టుల కాల్పుల్లో ఇన్స్ పెక్టర్ వర్మ (రవి కిషన్) తీవ్రంగా గాయపడతాడు. ఎసిపి సంజయ్ వెంటనే రంగంలోకి దిగి ఇద్దరు టెర్రరిస్టుల్ని హతమారుస్తాడు, మరో ఇద్దరు తప్పించుకుంటారు, ఒకడు దొరుకుతాడు.

        వీళ్ళు టెర్రరిస్టులు కాదనీ, యూనివర్సిటీ విద్యార్ధులనీ, జరిగింది బూటకపు ఎన్కౌంటర్ అనీ ప్రజలు, విద్యార్థులు, హక్కుల కార్యకర్తలు, రాజకీయ పార్టీలూ ఆందోళన చేస్తారు. సంజయ్ ని తీవ్రంగా తూలనాడుతారు. మరోవైపు ఇన్స్ పెక్టర్ వర్మ ఆస్పత్రిలో చనిపోతాడు. ఎంక్వైరీ చేయమంటే ఎందుకు ‘ఎంగేజ్’ అయ్యారని పోలీస్ కమిషనర్ మనీష్ చౌదరి (జైవీర్) నిలదీస్తాడు. ఇన్స్ పెక్టర్ వర్మ తన ఆదేశాల్ని ఉల్లంఘించాడని అంటాడు సంజయ్. దీంతో డిపార్ట్ మెంట్లో అంతర్గత కుమ్ములాటలు ఈ బూటకపు ఎన్కౌంటర్ కి కారణమని గొడవ చేస్తుంది మీడియా కూడా. మనమీద యీ దుష్ప్రచారం ఆగాలంటే తప్పించుకున్న టెర్రరిస్టుల్ని పట్టుకోవాలంటాడు సంజయ్. మళ్ళీ ఈ ప్రయత్నం కూడా చేస్తే ప్రజలు తంతారని వారిస్తాడు కమీషనర్ చౌదరి.  సంజయ్ మానసిక క్షోభకి లోనవుతాడు. బూటకపు ఎన్కౌంటరని ప్రజల దూషణలు ఒకవైపు, సహకరించని కమీషనర్ ఇంకోవైపు, భార్యతో సమస్యలు మరోవైపు, వీటన్నిటికీ మించి చనిపోయిన టెర్రరిస్టులు తనని కాలుస్తున్నట్టు చిత్తభ్రాంతులు మరింకోవైపు...ఇన్నిటి మధ్య సంజయ్ విచలితుడవుతాడు. ఇప్పుడేం చేశాడు? వాళ్ళు బాంబులు పేల్చిన టెర్రరిస్టులేనని, జరిగింది నిజమైన ఎన్కౌంటరేనని, తను తప్పు చేయలేదని ఎలా నిరూపించాడు? ఇదీ కథ. 

      2008 సెప్టెంబర్ 13 న ఢిల్లీలో ఐదుచోట్ల బాంబు పేలుళ్లు సంభవించి ముప్పై మంది చనిపోయారు,133 మంది గాయపడ్డారు. ఇండియన్ ముజాహిదీన్ ఈ దాడుల వెనుక వుందని  పసిగట్టిన ఢీల్లీ పోలీస్ స్పెషల్ సెల్ దళం ఆ టెర్రరిస్టుల్ని ఆరా తీసి, 19వ తేదీన బాట్లా హౌస్ ఫ్లాట్ మీద దాడి చేశారు. ఆ సందర్భంగా పరస్పరం జరుపుకున్న కాల్పుల్లో ఎన్కౌంటర్ స్పెషలిస్టు ఇన్స్ పెక్టర్  మోహన్ చంద్ శర్మతో బాటు, ఇద్దరు టెర్రరిస్టులు చనిపోయారు, ఇద్దరు పారిపోయారు, ఒకడు దొరికాడు. దీనిమీద నిరసనలు పెల్లుబికాయి. విద్యార్ధుల్ని బూటకపు ఎన్కౌంటర్ లో చంపారంటూ న్యాయవిచారణ జరిపించాలన్నారు. దీన్ని ఢిల్లీ హైకోర్టు తిరస్కరించి, జాతీయ మానవ హక్కుల సంఘాన్ని నివేదిక కోరింది. జాతీయ మానవ హక్కుల సంఘం విచారణ జరిపి పోలీసులకి క్లీన్ చిట్ ఇచ్చింది. దీంతో మళ్ళీ ఆందోళనలు చెలరేగాయి. అది నిజమైన ఎన్కౌంటర్ అయితే ఒక మృతుడి తల మీద నాల్గు బుల్లెట్లు ఎలా తగులుతాయని, కూర్చోబెట్టి కాల్చారని, ఇంకో మృతుడి వీపు చర్మం చిత్ర హింసలకి గురి కాకపోతే ఎలా చిట్లుతుందని, ఆ ఫ్లాట్ కి ఒకే తలుపు వుండగా, కింద ఒకే ద్వారం వుండగా ఇద్దరు ఎలా పారిపోతారనీ, అక్కడ నిజంగా టెర్రరిస్టులే దాగి వున్నారని తెలిస్తే, ఇన్స్ పెక్టర్ శర్మ బుల్లెట్ ప్రూఫ్ జాకెట్ ధరించకుండా ఎలా వెళ్ళాడని...కాబట్టి ఇది పోలీసుల అంతర్గత కుమ్ములాటల వల్ల జరిగిందనీ...ఇలా ఆరోపణలు  కురిపించాయి హక్కుల సంఘాలు, రాజకీయ పార్టీలు. 2013 లో సెషన్స్ కోర్టు తీర్పు వెలువడింది. దొరికిన ఒక టెర్రరిస్టుకి శిక్ష విధించింది. దీని మీద అప్పీలు కెళ్ళారు. 


          కేసు అప్పీల్ లో వుండగా ఈ సినిమా తీసిన దర్శకుడు నిఖిల్ అద్వానీ, రచయిత రీతేష్ షాలు తమ సుదీర్ఘమైన డిస్ క్లెయిమర్ తో,  సినిమా కోసం తాము చేసిన కల్పనని, సృజనాత్మక స్వేచ్ఛని  సీరియస్ గా తీసుకోరాదన్నారు. సంఘటనకి తమదైన వెర్షన్ తో చేసిన చిత్రణలతో  ఏ అభ్యంతరమూ వుండదు. నిద్ర పుచ్చే చివరి కోర్టు దృశ్యాల తోనే సినిమాటిక్ గా అభ్యంతరముంటుంది. కోర్టులో వాదోపవాదాల మధ్య ‘మేము ఏ వాదం వైపూ లేము’ అని ఇంకో  డిస్ క్లెయిమర్ వేయడమూ అభ్యంతరమే. ఎటువైపూ లేకపోవడం వల్లే  కోర్టు దృశ్యాలు స్లీపింగ్ పిల్స్ లా వున్నాయి. అంతవరకూ హీరో చుట్టూ మాంచి ఎమోషనల్ యాక్షన్ థ్రిల్లర్ గా వున్న కథని, కోర్టుకు చేర్చడమే పొరపాటుగా వుంది. 


        అంత కష్టపడి చివరికి తప్పించుకున్న టెర్రరిస్టుని పట్టుకున్న హీరో,  కోర్టుకి తీసికెళ్ళడ మేమిటి? ఎంత మంది మృతికి, వికలాంగులవడానికి  కారకుడయ్యాడో, ఇన్స్ పెక్టర్ కుటుంబం సహా, ఆ బాధిత కుటుంబాలందరి ముందూ హాజరుపర్చి, వాళ్ళు వేసే కఠిన ప్రశ్నలకి జవాబు చెప్పుకునేలా చేసి-  టెర్రరిజం సినిమా కథల టెంప్లెట్ ని మార్చవచ్చు కదా? అసలైన కోర్టు ఇది కదా? హీరో మతగ్రంథం చదివి వినిపిస్తే టెర్రరిస్టులు మారతారా? ఇలాటి కథల్లో ఎప్పుడూ స్టేక్ హోల్డర్లయిన వందలాది బాధిత కుటుంబాల ఉనికే లేకుండా చేయడమేమిటి?

         
దీన్నొక ఎన్కౌంటర్ ఎలా జరిగిందనే కేవలం సస్పెన్స్ థ్రిల్లర్ కథకి పరిమితం చేశారు. కథా ప్రయోజనాన్ని నెక్స్ట్ లెవెల్ కి తీసికెళ్ళ లేదు. కోర్టు వాదోపవాదాల్లో మొత్తం ఆ రోజు అసలేం జరిగిందీ సైంటిఫిక్ ఆధారాలతో, రెండు వైపుల నుంచీ చెప్పుకువచ్చే డ్రామా స్థాయికి కుదించారు. ఇలాటి సామాజిక నేరాల్లో జరిగిందానికి  లాజిక్కులు జోడించుకు వచ్చే, మన తార్కిక బుద్ధిని పరీక్షించే, కథ అవసరం లేదు. ఈ కథకి విశాల ప్రాతిపదికన మనలోని మానవీయ, సామాజిక కోణాలని తట్టిలేపే ఎమోషనల్ డ్రామా అవసరం. ఇది సరయిన కథా ప్రయోజనమవుతుంది. దొరికిన వాణ్ణి  సామూహిక బాధితుల కోర్టులో నిలబెట్టి, వాడు జవాబు చెప్పుకోలేని ప్రశ్నలు సంధింపజేయడం అవసరం. టెర్రరిస్టులకి ఈ కొత్త అనుభవం రుచి చూపిస్తే మత్తు వదుల్తుంది. మతగ్రంథాలు, చట్టాలు వాళ్ళ అంతరాత్మల్ని తాకలేవు. టెర్రరిస్టులు మౌలికంగా సమాజంతో తెగతెంపులు జేసుకున్నారు. వాళ్ళని అక్కడికే తెచ్చి భావజాలాన్ని చంపాల్సి వుంటుంది.

          ఈ సినిమాలో ఒకటి మాత్రం యాదృచ్ఛికంగా, తులనాత్మకంగా కళ్ళకి కడుతుంది- ఎన్కౌంటర్ ని అనుమానించి ఉద్యమించిన వాళ్ళెవరినీ అప్పటి ప్రభుత్వం జాతివ్యతిరేకులు, దేశద్రోహులు అనకపోవడం, నిర్బంధించక పోవడం. మీడియా గొంతు నొక్కకపోవడం. 

ఎవరెలా చేశారు 
     జాన్ అబ్రహాం ఈ మల్టీ డైమెన్షనల్ క్యారక్టర్ ని అజేయంగా పోషించాడు. క్యారక్టర్ని చూస్తున్నప్పుడు తనలోకి ప్రేక్షకుల దృష్టి చొచ్చుకెళ్ళేలా  చేశాడు. క్యారక్టర్ బాధ ప్రేక్షకుల బాధ అయ్యేలా చూశాడు. సినిమాల్లో అలవాటుగా చూపించే అతి కూడా చేశాడు. జాతీయ పతాకాన్ని చూడగానే దేశభక్తి పొంగుకు రావడం. జాతీయ పతాకం, దేశభక్తి తర్వాతి సంగతి. అది యుద్ధ చిత్రాల్లో సైనికులు చూసుకునే సంగతి. అంతదాకా పోనవసరం లేదు. ఇలాటి పోలీసు కథల్లో ముందు న్యాయదేవత చేతిలో త్రాసుతో వుంటుంది. ఈ కథ ఈమెతో సంబంధం. తన ఇమ్మీడియెట్ దైవం న్యాయదేవత కావాలి. 

          ఇంకో అతి ఏమిటంటే, ఎన్కౌంటర్ సమయంలో దొరికిన అనుమానితుణ్ణి ఇంటరాగేట్ చేస్తున్నప్పుడు గ్రీన్ షర్టు వేసుకుని, మతగ్రంథంతో రెడీ అన్నట్టు తను వుండడం. అనుమానితుడు “అయోధ్య చేస్తే, గుజరాత్ చేస్తే మేం వూరుకోవాలా?” అంటాడు. అప్పుడు గ్రీన్ షర్టు వేసుకున్న అబ్రహాం, గ్రీన్ సంచీలోంచి మతగ్రంధం తీసి, కళ్ళకద్దుకుని, ముద్దాడి బాగా ఓవర్ డ్రామా చేస్తాడు. అరబ్బీ చదివి అర్ధం చెప్తాడు. తను పోషిస్తున్న ఎసిపి సంజయ్ పాత్రకి అరబ్బీ ఎలా వచ్చింది? సంస్కృతం కూడా వచ్చా? నేపాళ భాష కూడా? టెర్రరిస్టులతో ఎప్పుడూ ఇవే టెంప్లెట్ ఇంటరాగేషన్ సీన్లు. గ్రీన్ షర్టు వేసుకున్న తను అసలైనది మరిచాడు – మత గ్రంథం తెరచినప్పుడు తల మీద టోపీయో, చేతి రుమాలో వేసుకోవడం! అసలు ఏ మత గ్రంథాలనీ ఇంటరాగేషన్ చేసే, హింసించే దుర్గంధభూయిష్ట గదుల్లోకే తీసికెళ్ళరు. 

          ఈ కథకి ప్లాట్ డివైస్ గా ఇంటరాగేషన్లో వుండాల్సింది వాడు తిప్పికొట్టే అభౌతిక మతగ్రంథ సూక్తులు కాదు. వాడి బాంబు దాడుల్లో మరణించిన, వికలాంగులైన వాళ్ళ భౌతిక మైన, లౌకికమైన, హృదయవిదారక విజువల్స్. ఇవి చూపించి కదా వాడి జవాబు కోరాలి? 

          తను చంపిన ఇద్దరు టెర్రరిస్టులు భూతాలై తనని కాలుస్తున్నట్టు చిత్తభ్రాంతులతో అబ్రహాం పోస్ట్ ట్రామాటిక్ స్ట్రెస్ డిజార్డర్ పేషంట్ కూడా అవుతాడు. ఆత్మహత్య చేసుకోవాలనుకుంటాడు. తను చూసే విజువల్స్ లో ఆ భూతాల వెనుక ముస్లిం సమూహాలే వుంటాయి హాహాకారాలు చేస్తూ. పదే పదే ఇది రిపీటవుతుంది. తనని దూషిస్తూ ఆందోళన చేస్తున్న సమూహాల్లో అన్ని వర్గాల వాళ్ళూ వున్నారు. ఒక వర్గమే మత ఫీలింగుతో తన మీదికి వస్తున్నట్టు సెలెక్టివ్ గా మార్క్ చేసుకుని చిత్తభ్రాంతులకి లోనవడమెందుకు? దర్శకుడూ రచయితా నిష్పక్షపాత ధోరణి నుంచి అక్కడక్కడా పక్కకెళ్ళి పోతూంటారు.

        భార్యతో ఆ గొడవేమిటో అర్ధమేగాదు. సినిమా మొదటి దృశ్యమే భార్య సణుగుడుతో ప్రారంభమవుతుంది. ఈ మొదటి షాట్ ని బ్లర్ చేసి చూపించడం, గొడవేమిటో దర్శకుడికి స్పష్టత లేదనేమో. ఈ గొడవైనప్పుడల్లా బ్లర్ చేసి చూపిస్తే సరిపోయేది. ఇక ఇది బూటకపు ఎన్కౌంటర్ కాదని నిరూపించే అంశానికి సంబంధించి-  తప్పించుకున్నటెర్రరిస్టు వేటలో  పాత్రచిత్రణకి, నటనకి, సంఘర్షణకి అబ్రహాం ఏ - వన్ యాక్టర్. కమీషనర్ నుంచీ హోంమంత్రి (చిదంబరం?) వరకూ ఎవరి ఆమోదంలేని ఆపరేషన్ కి తెగించడం, దెబ్బతినడం, తెగించడం చీవాట్లు తినడం...ఇలా సానుభూతి ఎక్కువ పొందుతాడు. చివరికి కోర్టు దృశ్యాలు మళ్ళీ మైనస్. 

          భార్య పాత్రలో నటి మృణాల్ ఠాకూర్ కి మంచి ఫేసు, ఎక్స్ ప్రెషన్స్ వున్నాయి. ఆమెకి వ్యక్తిగతంగా భర్తతో, న్యూస్ యాంకర్ గా వృత్తిగతంగా ఛానెల్ నిర్వాహకులతో పాత్రచిత్రణ సరీగా లేదు. భర్తతో గొడవేమిటో అర్ధమేగాదు. ఇక భర్త నకిలీ ఎన్కౌంటర్ చేశాడని విమర్శిస్తూ న్యూస్ కవర్ చేస్తున్న ఛానెల్ నిర్వాహకులు, ఆమెని సెలవు మీద వెళ్ళ మంటారు. ఆమె ప్రతిఘటిస్తుం ది. తర్వాతేం చేస్తుందో కొనసాగింపు లేదు. భర్తతో వుంటుంది. 

         
భోజ్ పురీ స్టార్ రవికిషన్ ది సంక్షిప్త ఇన్స్ పెక్టర్ పాత్ర. ఎన్కౌంటర్ లో వెంటనే చనిపోతాడు. తర్వాత అబ్రహాం జ్ఞాపకాల్లో మాంటేజెస్ లో కన్పిస్తాడు. చివర కోర్టు దృశ్యాల్లో సస్పెన్స్ రివీలవుతున్నప్పుడు అసలెలా చనిపోయిందీ తిరిగి మాంటేజెస్ లో వస్తాడు. జడ్జిగా నటించిన ఉత్కర్ష్ రాయ్, కమీషనర్ గా నటించిన జైవీర్, డిఫెన్స్ లాయర్ గా నటించిన రాజేష్ శర్మ, తప్పించుకున్న టెర్రరిస్టుగా నటించిన సాహిదుర్ రెహ్మాన్ వాళ్ళ లుక్స్ తో, నిజ జీవితంలో ఆ పాత్రల్ని చూస్తున్నట్టే వుంటారు. అబ్రహాం ఇంటరాగేట్ చేసే అనుమానిత టెర్రరిస్టుగా అలోక్ పాండే ఇంకో ఎట్రాక్షన్.

          ఇక ఉత్తర ప్రదేశ్ లో దాక్కున్న టెర్రరిస్టు ప్రియురాలిగా, రష్యన్ డాన్సర్ గా నోరా ఫతేహీతో ఒక  ఐటెం పాట మాస్ కోసం. సాంకేతికంగా అత్యున్నత స్థాయిలో వుంది, సందేహం లేదు. నటింపజేసుకోవడంలో, దృశ్య చిత్రీకరణల్లో నిఖిల్ అద్వానీ ఉత్తమ అభిరుచిని కనబర్చాడు. 

చివరికేమిటి 
      చివర్లో కోర్టు దృశ్యాలు తప్పిస్తే,  త్రీయాక్ట్స్ లో వున్న స్క్రీన్ ప్లే మల్టీ డైమెన్షనల్ క్యారక్టర్ తో సూటి కథగా సాగుతుంది. తొలి ముప్పావుగంటలో బిగినింగ్ ని ముగించి, న్యాయ విచారణ డిమాండ్ కి హీరో అప్రమత్తమై, గోల్ తీసుకోవడం చూపిస్తారు.ఇక్కడ ప్రారంభమయ్యే కథ తప్పించుకున్న టెర్రరిస్టు ని పట్టుకుని ఎన్కౌంటర్ ని నిరూపించే ఒకేఒక్క సూటి గీత మీద పరిగెట్టుతుంది. ఈ వేట రెండు ఎపిసోడ్లుగా వుంటుంది. మొదటి ఎపిసోడ్ ఉత్తరప్రదేశ్ లో విఫలమయ్యాక, రెండో ఎపిసోడ్ నేపాల్ సరిహద్దులో విజయవంతమవుతుంది. నేపాల్ సరిహద్దులో పట్టుకోవడాన్ని వేరే కేసులోంచి తీసుకుని వాడుకున్నట్టున్నారు. ఇండియన్ ముజాహిదీన్ ముఖ్యుడు యాసీన్ భత్కల్ ని పట్టుకుంది నేపాల్ సరిహద్దులోనే. ఇలా భారీ కథకి హాలీవుడ్ టైపులో సింపుల్ లైను, ఇంతే. ఈ రెండు యాక్షన్ ఎపిసోడ్లు చాలా బర్నింగ్ గా, థ్రిల్లింగ్ గా, ఎమోషనల్ గా వుంటాయి. చివరికి పట్టుకున్న టెర్రరిస్టుని కోర్టులో నిలబెట్టడం మాత్రం మానవీయకోణం లేని అదే పాత వ్యవహారంలా వుంది.


-సికిందర్
Watched at PVR, Moosarambagh
7 pm, 18.8.19


Friday, August 16, 2019

For writers : 'Invisible Guest' (Evaru) Hindi version.




రచన - దర్శకత్వం : సుజోయ్ ఘోష్ తారాగణం : అమితాబ్ బచ్చన్, తాప్సీ, అమృతా సింగ్, టోనీ ల్యూక్, తన్వీర్ ఘనీ, మానవ్ కౌల్ తదితరులు
మాటలు : రాజ్ వసంత్, సంగీతం : ఆమాల్ మాలిక్, అనుపమ్ రాయ్, క్లింటన్ సెరేజో, ఛాయాగ్రహణం : అవీక్ ముఖోపాధ్యాయ్
బ్యానర్స్ : రెడ్ చిల్లీస్ ఎంటర్ టైన్మెంట్, అజురే ఎంటర్ టైన్మెంట్
నిర్మాతలు : గౌరీ ఖాన్, సునీర్, అక్షయ్, గౌరవ్
 విడుదల : 8 మార్చి, 2019
***
          ‘పింక్’ జంట మరో క్రైం థ్రిల్లర్ తో వచ్చారు. అమితాబ్ బచ్చన్, తాప్సీ మరో కోర్ట్ రూమ్ డ్రామాకి తెరలేపారు. కాకపోతే ఈసారి హోటల్ గదిలో. క్రైం థ్రిల్లర్స్ ని ప్రొఫెషనల్ కథా కథనాలతో తీస్తున్న బెంగాలీ దర్శకుల్లో ఒకడైన సుజోయ్ ఘోష్ ఈసారి లొకేషన్ ని యూరప్ కి మార్చేశాడు. ‘పింక్’ తో పాపులరైన అమితాబ్ - తాప్సీల కాంబినేషన్ లో మరో థ్రిల్లర్ అంటే, ‘పింక్’ ని సూపర్ హిట్ చేసిన ప్రేక్షక సమూహం ‘బద్లా’ కి బదలాయింపు జరగడమే. మరి అలా జరిగిందా? దీని పరిధి ఎంత? అసలీ ప్రతీకార (బద్లా) -  రివెంజి డ్రామా దేని గురించి? ఇవి తెలుసుకుందాం...

కథ
      స్కాట్లాండ్ బిజినెస్ వుమన్ నైనా సేథీ (తాప్సీ - తాపసీ?) బాయ్ ఫ్రెండ్ అర్జున్ (టోనీ ల్యూక్)  హత్యకేసులో నిందితురాలు. ఆమె కంపెనీ లాయర్ జిమ్మీ (మానవ్ కౌల్) ఈ కేసు వాదించడానికి ప్రముఖ సీనియర్ లాయర్ బాదల్ గుప్తా (అమితాబ్ బచ్చన్) ని మాట్లాడి పంపిస్తాడు. నైనాని కలుసుకున్న బాదల్, ప్రాసిక్యూషన్ కి కొత్త సాక్షి దొరికాడనీ, ఆ కీలక సమాచారమున్న సాక్షిని ఇంకో  మూడు గంటల్లో జడ్జి ముందు ప్రవేశ పెట్టబోతున్నారనీ, కనుక  ఏం జరిగిందో త్వరగా చెప్తే కోర్టులో ఆ సాక్షిని ఎదుర్కొంటాననీ అంటాడు. 

          నైనా చెప్పుకొస్తుంది - పెళ్ళయి భర్తా కూతురూ వున్న తను పెళ్ళయిన అర్జున్ తో సంబంధం పెట్టుకోవడం తప్పని తెలుసుకుని కొన్ని నెలల క్రితమే విడిపోయింది. ఐతే ఎవరో బ్లాక్ మెయిలర్ కాల్ చేసి వాళ్ళిద్దర్నీ డబ్బు తీసుకుని హోటల్ కి రమ్మంటే వెళ్లారు. అక్కడ ఎవరో కొడితే నైనా కళ్ళు తిరిగి పడిపోయింది. లేచి చూస్తే అర్జున్ చచ్చి పడున్నాడు. పోలీసులకి అర్ధం గాలేదు. డోర్ లోపలి నుంచి లాక్ చేసి వుంటే, హంతకుడు బయటికి ఎలా వచ్చి వెళ్ళిపోయాడు? అనుమానం నైనా మీదికే వెళ్ళింది. అరెస్ట్ చేసి బెయిల్ మీద వదిలారు. 


        ఇది విన్న బాదల్, ఆమెని కాపాడడానికి ఇది సరిపోదనీ, సరీగ్గా పూర్తి నిజం చెప్పమనీ వొత్తిడి చేస్తాడు. అప్పుడు నైనా చెప్తుంది - ఆమే, అర్జున్ ఒక రిసార్ట్స్ లో గడిపి వస్తూ ఈ రిలేషన్ షిప్ ని ముగిద్దామని మాట్లాడుకుంటు ప్పుడు, కారు కంట్రోలు తప్పడంతో అవతలి కారు ప్రమాదానికి గురైంది. ఆ కారులో సన్నీ అనే యువకుడు చనిపోయాడు. అతడి సెల్ ఫోన్ చూస్తే డ్రైవింగ్ చేస్తూ మెసేజీలు పెడుతున్నట్టు వుంది. ఇందులో తన తప్పేం లేదనీ, ఇతనే మెసేజీలు పెడుతూ కంట్రోలు తప్పాడనీ, పోలీసులకి కాల్ చేద్దామని ఆమె చెప్పినా అర్జున్ వినలేదు. అలాచేస్తే తమ సంబంధం తెలిసిపోతుందనీ, వీడి కారు సహా నీట్లోకి తోసెయ్యమనీ చెప్తే తోసేసింది తను. 

          ఆ సన్నీ తల్లి రాణి (అమృతా సింగ్) ఎలాగో తెలుసుకుని తనని పట్టుకుని, కొడుకు శవం ఎక్కడుందో చెప్పకపోతే అంతు చూస్తానని బెదిరించింది... ఇదీ సమస్య. ఇప్పుడు ఒకటి కాదు, రెండు హత్యల్లోంచి నైనాని బాదల్ ఎలా కాపాడేడు? కాపాడేడా లేక...


ఎలావుంది కథ
      ఇది ‘ది ఇన్విజిబుల్ గెస్ట్’ అనే స్వీడిష్ క్రైం థ్రిల్లర్ కి అధికారిక రీమేక్. ఇలాటి క్రైం థ్రిల్లర్స్ లో, ఇంకా ఫిలిం నోయర్ జానర్ క్రైం థ్రిల్లర్స్ లో, కథలు కర్మ ఫలాన్ని అనుభవించేలా చేస్తాయి. చట్టానిదే పై చేయిగా వుంటాయి. కర్మ ఫలం, విధి, నైతిక విలువలు అనే ఫిలాసఫీల్ని బేస్ చేసుకుని చట్ట కథలు చెప్తాయి. నైనా, అర్జున్ లు రహస్య సంబంధాన్ని ముగించుకుని జీవిత భాగస్వాములతో వుందామనుకున్నారు. అది కూడా జీవిత భాగస్వాముల్ని మోసం చేయడమే. తప్పు చేశామని వాళ్లకి చెప్పేస్తే అది వేరు. అందుకని విధి కారు ప్రమాదం రూపంలో ముంచుకొచ్చి వాళ్ళని ఇరుక్కునేలా చేసింది. అలా జీవిత భాగస్వాములకి తెలిసిపోయేలా చేసి కర్మ ఫలాన్నిఅనుభవించమంది. మరి ఇందుకు అన్యాయంగా ఒకణ్ణి బలి తీసుకుందే అంటే, కాదు. అవతలి కారులో చనిపోయిన వాడు తక్కువేమీ కాదు, బ్యాంకులో అవినీతి చేస్తున్నాడు. 

          అయితే ఈ కథని రీమేక్ చేస్తూ రోల్ రివర్సల్ చేశాడు దర్శకుడు. ఒరిజినల్ లో లాయర్ గా ఫిమేల్ ఆర్టిస్టు వుంటుంది, నిందితుడుగా  మేల్ ఆర్టిస్టు వుంటాడు. ఈ రీమేక్ లో లాయర్ గా అమితాబ్ వుంటే, నిందితురాలిగా తాప్సీ వుంటుంది. అయితే కహానీ, కహానీ - 2 ల వంటి రెండు హిట్ క్రైం జానర్లు తీసిన దర్శకుడు సుజోయ్ ఘోష్, ఈసారి రీమేక్ కి వెళ్ళాడు. తనదైన మరో వొరిజినల్ కంటెంట్ తో రావాల్సింది.
ఎవరెలా చేశారు 
      ఇది అమితాబ్ కి పింక్’ లాంటి పవర్ఫుల్ పాత్ర. ‘పింక్’ లో తాప్సీని కాపాడే క్రిమినల్ లాయర్ గా ఆవేశంతో దృశ్యాల్ని జ్వలింప జేసినట్టు గాక, చాలా కూల్ గా వ్యవహరించే పాత్ర. ఒక గదిలోనే  డైలాగ్ ఓరియెంటెడ్ గా సాగే ఈ డ్రామాలో నిజాన్ని బయటికి తీయడానికి ఎత్తుకి పై ఎత్తులేసే, ఎనలైటికల్ స్కిల్స్ వున్న పాత్ర. కేసు వివరాలతో,  క్లూస్ విశ్లేషణలతో అమితాబ్ వాక్ప్రవాహం కట్టి పడేస్తుంది. ఒక్క కేసూ ఓడిపోని నలభై ఏళ్ల ట్రాక్ రికార్డ్ వున్న క్రిమినల్ లాయర్ పాత్రగా ఓ గదిలో అంతసేపూ నటించి మెప్పించడానికి వయస్సు అడ్డురాలేదు. పైగా స్టామినా పెరిగిపోయింది. అమితాబ్ కాకుండా మరొకరు ఈ డ్రామాతో ఆకట్టుకోవడం కష్టమే. 

          ఎదుటి పాత్రగా తాప్సీ ఆత్మరక్షణలో పడినప్పటికీ, ఆలోచనాత్మకంగా ఆచితూచి తూకం వేసి విషయాలు వెల్లడిస్తుంది. ఈ సైకలాజికల్ గేమ్ లో అవకాశం దొరికినప్పుడల్లా అమితాబ్ ని ఔట్ చేసేస్తూంటుంది. ఈ మానసిక చదరంగపు ఆటలో థ్రిల్లింగ్ గా పావులు కదపడం- అదీ నలబై ఏళ్ల అనుభవమున్న మహా క్రిమినల్ లాయర్ తో - ఆమెకెలా సాధ్యమంటే,  అప్పటికే ఆమె కొమ్ములు తిరిగిన బిజినెస్ వుమన్. ఈ పాత్రలో తాప్సీ ఓ మెట్టు పైకెక్కింది. 



          మూడో పాత్ర నాటి పాపులర్  హీరోయిన్ అమృతా సింగ్ పోషించిన రాణి పాత్ర. ‘కలియుగ్’ లో పోర్న్ వెబ్ సైట్ ఓనర్ గా నెగెటివ్ పాత్రని గుర్తుకు తెచ్చే నటన. కొడుకు చావుకి ప్రతీకారం తీర్చుకునే టైటిల్ రోల్ పోషించింది. ప్రతీకారం తీర్చుకునే టెక్నిక్ తో క్లాస్ నటన. భర్త నిర్మల్ గా తన్వీర్ ఘనీ ముగింపు ట్విస్టుకి పనికొచ్చే కీలక పాత్ర. 

          ఇందులో ఐదు పాటలు సందర్భానుసారంగా వచ్చేవే. టైటిల్ సాంగ్ ‘బద్లా’ రెండర్ధాలతో ఇలా సాగుతుంది - ఏయ్ పిల్లోడా లోకం మారింది జాగ్రత్త. కురుల స్టయిల్, నకిలీ నవ్వు, అబద్ధపు ప్రొఫైల్ మారాయి జాగ్రత్త. కథలో ఎప్పుడు కర్త మారతాడో ఎవరికీ తెలీదు జాగ్రత్త. పెట్రోలు ఎనభై అయింది, పాకెట్ సైజు మారింది జాగ్రత్త. ఆధునిక ప్రేమలు,  సూపర్ స్టార్ బజార్లు మారాయి జాగ్రత్త. పాత కల్చర్ ఇంటింటా రావాలి, లోకం మారింది జాగ్రత్త.... కళ్ళని కళ్ళతో తీర్చుకో పగ. కలల్ని కలలతో తీర్చుకో పగ. మాటల్ని మాటలతో తీర్చుకో పగ. స్నేహాన్ని స్నేహంతో తీర్చుకో పగ...డాలర్ ధర, వడపావ్ ఆకారం మారాయి జాగ్రత్త. వార్తలు, పేపర్లు మారాయి జాగ్రత్త. చావు బతుకులు డైలీ చూస్తూ దేవుడు మారలేదు రోయ్...

          చాలా క్రేజీ పాట. పగా ప్రతీకారాలకీ, ఏదైనా మారిందనడానికీ బద్లా అనే ఒకే పదం వుంది హిందీలో. మారిందనడానికి లేదా మారాడనడానికీ బదల్ గయా అని కూడా అనొచ్చు. అదన్న మాట. ఇలా ఒక చరణం బద్లా అంటూ మారిన సంగతులు చెప్తూ, ఇంకో చరణం బద్లా అంటూ ప్రతీకారాల గురించి చెప్పడం. నిజానికి ఈకథ ప్రతీకారం గురించే నడిచినా, ముగింపులో కథంతా ఎలా మారిపోయిందో కూడా చూపిస్తుంది. ఇలా ‘బద్లా’ టైటిల్ ని చాలా క్రియేటివ్ గా రెండంచుల కత్తిలా కథకి రెండర్దాలతో వాడారు. మనోజ్ యాదవ్, అనుపమ్ రాయ్ లు రాశారీ పాట. అనుపమ్ రాయ్ పాడేడు.  

          నేపధ్య సంగీతంలో కూడా క్రియేటివిటీ వుంది. ప్రారంభం నుంచీ ముగింపు దాకా ఒకటే రేంజిలో ట్యూన్ చేయకుండా, సన్నివేశాలు మామూలుగా వున్నప్పుడు రేంజి తగ్గిస్తూ, సన్నివేశం విషమించినప్పుడు సడెన్ గా పెంచి షాకిస్తూ -  నేపధ్య సంగీతంతో కూడా కథ చెప్పారు. కారు ప్రమాదం జరిగి నైనా, అర్జున్ లిద్దరూ మంతనాలడుకుంటున్నప్పుడు, ఇంకో కారు వచ్చేస్తూంటే, ప్రమాదంలో పడ్డామనుకుని  అర్జున్ తమ కారు కేసి కంగారుగా నడిచి వస్తున్న  సీనుకి ఆర్ ఆర్ టెర్రిఫిక్. 

          మంచు కురిసిన స్కాట్ లాండ్ లొకేషన్స్ -  మర్డర్ మిస్టరీలకిచ్చే లేత బ్లూ మసక వెలుతురులో మిస్టీరియస్ వాతావరణాన్ని సృష్టిస్తూ వుంటుంది. ఈ క్రైం థ్రిల్లర్ యాక్షన్ సీన్స్ లేకుండానే బోలెడు వెర్బల్ యాక్షన్ తో వుంది.


చివరికేమిటి 
       మెదడుకి మేత. పొరలు పొరలుగా వీడే సస్పెన్స్. ఒక సస్పెన్స్ పొర విప్పగానే అందులోంచి ఇంకో సస్పెన్స్  పొర. గదిలో అమితాబ్ తాప్సీల వెర్బల్ యాక్షన్, ఫ్లాష్ బ్యాక్స్ లో ఆమె  చెప్పే జరిగిన సంఘటనలు.  వాటిని ఇంకోలా సరిచేసే  అమితాబ్ వూహాగానాల మాంటేజెస్. రెండు మిస్టరీలున్నాయి : లోపలినుంచి లాక్ చేసిన హోటల్ గదిలో హంతకుడు హత్య చేసి ఎలా వెళ్ళాడు? రెండోది, నైనా యువకుడి శవం సహా కారుని నీట్లోకి తోసినప్పుడు నిజంగానే చచ్చి పోయి వున్నాడా? అసలు గదిలో హంతకుడి వేలిముద్రలే లేకపోవడం నైనా కథనాన్ని అబద్ధం చేసేసే ఫోరెన్సిక్ సాక్ష్యం. నైనా కారుని నీట్లోకి తోసినప్పటికే యువకుడు చనిపోయి వుంటే ఇలాకూడా  నైనా ని పట్టించే అటాప్సీ సాక్ష్యం.

          అయితే హోటల్ గది క్రైం సీన్లో పోలీసులు చేతులకి గ్లవ్స్ లేకుండా అన్నీ ముట్టుకోవడం, అలాగే నైనా పాయింటాఫ్ వ్యూలో హంతకుడు ఆ గదిలో చేతులకి గ్లవ్స్ లేకుండా అన్నీ ముట్టుకోవడం వంటివి బావుండవు. హోటల్ గదిలో ఎవరో తనని కొడితే కళ్ళు తిరిగి పడిపోయానని చెప్పిన నైనాకి వైద్యపరీక్షలు నిర్వహిస్తే నిజమో అబద్ధమో తెలిసిపోతుంది. ఈ పని చేయకుండా,  లాక్ చేసిన గదిలో అర్జున్ తో పాటు ఆమె ఒక్కతే  వుందన్న బలహీన సర్కమ్ స్టేన్షియల్ ఎవిడెన్స్ ఆధారంగా పోలీసులు ఆమె మీద కేసు పెడతారు. 

          తల్లులైన నైనా, రాణీ ల మధ్య ఇంటర్వెల్ సీను వస్తుంది. నా కొడుకుని బలిగొన్న నువ్వు  నీకో కూతురుందని మర్చి పోయావ్. నాకు కొడుకే లేకపోయాక నేను పోగొట్టుకునే దేమీ వుండదింకా... బిడ్డకి దూరమవడంలోని నరకమెలా వుంటుందో ఇక నీకు రుచి చూపిస్తా - అన్న రాణి హెచ్చరిక మదర్ సెంటి మెంటుతో ఈ మర్డర్ల కథకి బలమైన ఎమోషనల్ డెప్త్ నిస్తుంది. మహిళా దినోత్సవం నాడు విడుదలైన ఇది నెగెటివ్ కోణంలో చిత్రించినట్టయింది. రోల్ రివర్సల్ వల్ల ఇలా జరిగింది. ఒరిజినల్ లో వున్నట్టుగా అమితాబ్ స్థానంలో తాప్సీ వుంటూ, తాప్సీ స్థానంలో అమితాబ్ వుంటే  మహిళా విజయంగా వుండేది.



       రోల్ రివర్సల్ వల్ల ప్రేక్షకుల్ని పరిమితం చేసుకున్నట్టు కూడా అయింది. ‘పింక్’ అంత ఘన విజయం సాధించడానికి కారణం అది అమ్మాయిల్నీ కుటుంబాల్నీ కూడా ఆకర్షించడం. హైదరాబాద్ లో తెలుగు అమ్మాయిలూ కుటుంబాలూ కూడా విపరీతంగా చూశారు. ఇందులో నైట్ లైఫ్ పేరిట యూత్ పాల్పడుతున్న కార్యకలాపాల్లో తాప్సీ ఇరుక్కుని, లైంగిక దాడిని ప్రతిఘటించి, హత్యా యత్నం కేసులో వుంటుంది. ఆమె లాయర్ గా అమితాబ్ బచ్చన్ కోర్టులో మొత్తం అమ్మాయిలందరి ప్రతినిధిగా వాదిస్తాడు. ఈ రియల్ లైఫ్ డ్రామా అన్నివర్గాల ప్రేక్షకుల్నీ ఆకర్షించింది. ‘బద్లా’ కి ఈ అవకాశం లేకుండా పోయింది. రోల్ రివర్సల్ వల్ల ఇది హీరోయిన్ తాప్సీ వివాహేతర సంబంధం పెట్టుకుని, అకృత్యాలకి పాల్పడ్డ నెగెటివ్ షేడ్ గల కథగా మారిపోయింది. దీంతో ప్రేక్షకుల్లో మగ మహానుభావులకే పరిమితమైంది. 

          మరొకటేమిటంటే, ఇందులో అమితాబ్ లాంటి మహానటుడు కేసులో తాప్సీ ని పట్టుకునే కథ పిచ్చుక మీద బ్రహ్మాస్త్రంలా వుంది. ‘పింక్’ లో పిచ్చుక లాంటి తాప్సీ ని అమితాబ్ కాపాడడం సరైన డ్రామాగా వుంది. ‘బద్లా’ లో  జరగాల్సింది ఒరిజినల్ లోని పాత్రల్ని మార్చడం కాదు, ‘పింక్’ ని రివర్స్ చేయడం. ‘పింక్’ లో లాయర్ గా అమితాబ్ తాప్సీని కాపాడేడు. ‘బద్లా’ లో లాయర్ గా తాప్సీ  అమితాబ్ ని కిల్లర్ గా పట్టుకుని వుంటే భలే మజా వచ్చేది. ఈ మార్కెట్ యాస్పెక్ట్ ని పట్టుకోలేదు.  


          
ఈ మర్డర్స్ మిస్టరీతో ఎండ్ సస్పెన్స్ కథ ఎండ్ సస్పెన్స్ కథనపు సుడిగుండంలో పడి గల్లంతవకుండా వున్న ఏకైక ఫార్ములాని అనుసరించారు. ‘టు ఛేజ్ ఏ క్రూకెడ్ షాడో’ ప్రవేశ పెట్టిన ఫార్ములా. దీని రీమేక్ గా హిందీ ‘ధువాఁ’  అనుసరించిన ఫార్ములా -  ముసుగు తొడిగిన కథ!

సికిందర్ 
Watched at : Prasads
 9 pm,  March 8, 2019


Thursday, August 15, 2019

860 : టిప్స్




        చాలా చాలా కాలం క్రితం రాబిన్ భట్ చేసిన ఒక సూచన ఈ పుస్తకం మీద దృష్టి సారించేలా చేసింది : హంగేరియన్ నాటక రచయిత లాజోస్ ఏగ్రీ 1946 లో రాసిన మాస్టర్ పీస్ ‘దిఆర్ట్ ఆఫ్ డ్రమెటిక్ రైటింగ్’ ... ఈ పుస్తకాన్ని సినిమా రచయితలనదగ్గ వాళ్ళు తప్పకుండా దగ్గరుంచు కోవాలని కోరాడు సీనియర్ సినిమా రచయితైన రాబిన్ భట్ (మహేష్ భట్ సోదరుడు). ఈ పుస్తకం నాటక శాస్త్రమే అయినా, సినిమా రచనతో బాటు నవలా రచనకీ, కథా రచనకీ పనికొచ్చే విజ్ఞాన కోశంలా వుంది. 300 పేజీల ఈ పుస్తకం73 ఏళ్ళుగా, అంటే మూడు తరాలుగా ఇప్పటికీ రీప్రింట్లు అవుతూనే వుంది. ఇక నాల్గో తరం ప్రారంభం కాబోతోంది...ఈ సందర్భంగా ఇందులోని విషయాల్నికొన్నిటిప్స్ గా పరిచయం చేస్తే ఎలా వుంటుందని ఓ శుభోదయాన తోచింది. 
          బాగానే వుంటుంది. బాముకునే దెవరు? ఎవరి సొంత జ్ఞానం వాళ్ళకి పుష్కలంగా  వుంది. వేరే శాస్త్రం గీస్త్రం చల్తానై. దాంతో వద్దన్నా హిట్సే తీస్తున్నారు. ప్రేక్షకులు తట్టుకో లేకపోతున్నారు. నిర్మాతలు నోట్ల కట్టలు మోయలేక పోతున్నారు (ఖర్చు పెడుతూ ఈ నోట్ల కట్ట మళ్ళీ చూస్తానా అన్నాడో నిర్మాత). అందుకని ఈ టిప్స్ ని కాలక్షేపంగా చదివి వదిలెయ్యాలి. ఈ బ్లాగు వున్నదే కాలక్షేపం కోసం, నథింగ్ బట్ కాలక్షేపం.
         పుస్తకంలో థీమ్ మొదలుకొని క్యారక్టర్ స్ట్రక్చర్, కాన్ఫ్లిక్ట్ అనే మూడు చాప్టర్లు ప్రధానంగా రాసుకొస్తూ, జనరల్ చాప్టర్ కింద కొన్ని వ్యావహారిక అంశాల్ని పొందుపర్చాడు ఏగ్రీ. ఈ పుస్తకం నాటకాల గురించి కాబట్టి వాక్యాల్లో ‘నాటకం’ అనే పదం విరివిగా దొర్లింది. దీన్ని’కథ’ గా మార్పు చేసుకుని ముందుగా థీమ్ కి సంబంధించిన టిప్స్ చూద్దాం...
        1. శాస్త్రాన్ని అర్ధం జేసుకోలేని వాళ్ళు  కథ రాయడానికి రూల్స్ లేవంటారు. ఏగ్రీ కథ రాయడానికి రూల్స్ వున్నాయంటాడు. మనం భోజనం చేయడానికి, నడవడానికి, ఊపిరి పీల్చడానికీ రూల్స్ వున్నాయ్....చిత్ర కళకి, సంగీతానికీ, నాట్యానికీ రూల్స్ వున్నాయ్...ఎగరడానికి, వంతెన కట్టడానికీ రూల్స్ వున్నాయ్...జీవితంలో, ప్రకృతిలో ప్రతీదానికీ రూల్స్ వున్నాయ్... రూల్స్ నుంచి రచనల్ని మినహాయించాలని ఎలా అంటారు. అది కుదరదు...అంటాడు. 


          2. కథకి థీమ్ వుండాలి. థీమ్ వుంటే రచయిత తానేం చెప్పదల్చుకున్నాడో ఆ గమ్యానికి కథనికి చేరవేయడానికి తోడ్పడుతుంది. ఉదాహరణకి, గొప్ప ప్రేమ మరణాన్ని కూడా లక్ష్య పెట్టదని  ‘రోమియో అండ్ జూలియెట్’ థీమ్. గుడ్డి నమ్మకం సర్వ నాశనాన్ని కొనితెస్తుందని ‘కింగ్ లియర్’ థీమ్. అలాగే - మేథస్సు అంధ విశ్వసాల్ని జయిస్తుందని ‘షాడో అండ్ సబ్స్ స్టెన్స్’ థీమ్. థీమ్ నే థీసిస్, సెంట్రల్ ఐడియా, గోల్, లేదా సబ్జెక్ట్ అంటారు (తెలుగులో ఇతివృత్తం).
          3. మంచి కథల్లో ఏకవాక్య థీమ్ వ్యూహాత్మకంగా నిర్మాణమై వుంటుంది. అది శాంపిల్ సినాప్సిస్ లాగా వుంటుంది. ‘గొప్ప ప్రేమ మరణాన్ని కూడా లక్ష్య పెట్టదు’ అన్న ‘రోమియో అండ్ జూలియెట్’  ఏకవాక్య థీమ్ నే తీసుకుంటే, ఇది మూడు భాగాల కలయిక : పాత్రలు, కాన్ఫ్లిక్ట్, ముగింపు. గొప్ప ప్రేమ ఎవరిదీ? రోమియో అండ్ జూలియెట్ పాత్రలది. వాళ్ళ కాన్ఫ్లిక్ట్ ఏమిటి? మృత్యువు. వాళ్ళేం  చేశారు? మృత్యువుని కూడా లెక్క చెయ్యకుండా ప్రేమ కోసం సంఘర్షించారు.

          [స్క్రీన్ ప్లేల విషయానికి వస్తే దీన్నే అయిడియా నిర్మాణం అంటున్నాం. ఐడియాలో బిగినింగ్, మిడిల్, ఎండ్ ఉండేట్టు. పై ఏకవాక్య థీమ్ నే తీసుకుంటే ఇవే కన్పిస్తాయి. గొప్ప ప్రేమ (బిగినింగ్), మరణాన్ని(మిడిల్) కూడా లక్ష్య పెట్టదు (ఎండ్)]

         
4. థీమ్ ఆలోచించకపోతే, వచ్చిన ఆలోచనకి మార్పు చేర్పులు చేస్తూ, విస్తరిస్తూ పోతూ, వచ్చిన ఆలోచనే మారిపోయి ఇంకో ఆలోచన మొదలయ్యే పరిస్థితి వస్తుంది. దీంతో ఎక్కడికి వెళ్ళాలో తెలియక కథకోసం తడుముకోవడమే జరుగుతుంది. ఎలాగో బ్రెయిన్ కి పని చెప్పి ముగింపుకి తెచ్చినా, కథ మాత్రం తయారవదు.

          5. ఎమోషన్, లేదా ఎమోషన్ లో వుండే ఎలిమెంట్లు, జీవితంలో మౌలిక అంశాల్ని కలిగి వుంటాయి. ఎమోషన్ అంటే జీవితం, జీవితమంటే ఎమోషన్. అందువల్ల ఎమోషన్ అంటే డ్రామా, డ్రామా అంటే ఎమోషన్ - అన్నాడు మోజెస్ మలేవిన్ స్కీ తను రాసిన ‘ది సైన్స్ ఆఫ్ ప్లే రైటింగ్’ లో. కనుక ఏ పరిస్థితులు ఎమోషన్స్ కి దారితీస్తున్నాయో మనకి తెలియకపోతే, మంచి కథ కుదరడం అసాధ్యం. శునకానికి మొరగడం ఎలాగో కథకి ఎమోషన్ అలాగ.

          6. మలేవిన్ స్కీ ఎమోషన్స్ లో వుండే కొన్ని మౌలిక ఎలిమెంట్స్ ఏమిటో చెప్తాడు : కోరిక, భయం, జాలి, ప్రేమ, ద్వేషం మొదలైనవి. ఈ ఎమోషన్స్ కి కార్యాచరణతో కూడిన గోల్ లేకపోతే కేవలం ఎమోషన్స్ గానే వుండి పోతాయి.

          7. రెండు థీమ్స్ తో ఒక కథ రాయవచ్చా? రాయవచ్చు, అయితే మంచి కథవదు. ఏక కాలంలో రెండు దిశల్లో ప్రయాణం కుదురుతుందా? ఒక థీమ్ తో చెబుతున్న విషయాన్ని రుజువు చేయడంలోనే  రచయితకి సరిపోతుంది, రెండు మూడు థీమ్స్ కి ఎక్కడ వీలవుతుంది? ఒక కథలో ఒకటి కన్నా ఎక్కువ థీమ్స్ వుంటే ఆ కథ తికమకగా వుంటుంది.

          8. దీనికి రెండు ఉదాహరణలున్నాయి : ‘ది ఫిలడెల్ఫియా స్టోరీ’ అనే నాటకమొకటి, ‘స్కై లార్క్’ అనే నాటకమొకటి. మొదటి దాంట్లో రెండు థీమ్స్ ఏమిటంటే, పండంటి కాపురానికి ఇరువైపులా త్యాగాలు అవసరమని ఒకటి,  మనిషి క్యారక్టర్ ని డబ్బుండడం లేకపోవడం నిర్ణయించవని మరొకటి. రెండో నాటకంలో సంపన్నురాలైన స్త్రీకి తోడు అవసరమని ఒకటి, ప్రేమించే భర్త భార్య కోసం త్యాగాలు చేస్తాడని మరొకటి. ఈ రెండు నాటకాల్లో రెండేసి థీమ్స్ చలన రహితంగా వుండడమే కాదు, విషయం చెప్పడం కూడా కుదరలేదు.

          9.  రచయిత పాత్రలతో ఏదో ఒక పక్షం వహించకపోతే థీమ్ విఫలమవుతుంది. ఇగో మిత్రుల్ని దూరం చేస్తుందనే థీమ్ వుందనుకుందాం. ఈ థీమ్ తో పాత్రలు రెండు వర్గాలుగా విడిపోతే, రచయిత ఏదో ఒక వర్గాన్ని సమర్ధించాల్సి వుంటుంది. ఇగో వల్ల మిత్రులు దూరమవుతారో కాదో ఏదో ఒకటి తేల్చాలి. ఇగో వల్లమిత్రులు దూరమవుతారనే దాంతో రచయిత విభేదిస్తే, అందుకు తగిన కారణాలు ఆధారాలతో సహా చూపించాలి. దీంతో ప్రేక్షకులు ఏకీభవించకపోయినా రచయితకి తన జడ్జిమెంట్ తనకుండాలి.
           
సికిందర్

Tuesday, August 13, 2019

859 : స్క్రీన్ ప్లే సంగతులు


        న్మథుడు - 2 కథా వస్తువు అటు పాత తరం ప్రేక్షకులకి కాక, ఇటు కొత్త తరం ప్రేక్షకులకీ కాకుండా త్రిశంకు స్వర్గపు మార్కెట్లో వేలాడినట్టుంది. కానీ ఒకప్పుడు అక్కినేని నాగేశ్వర రావుతో అప్పటి పాత తరంతో పాటు కొత్త తరం కూడా ‘ప్రేమ నగర్’ ని ఎంజాయ్ చేశారు. ‘లేలే నా రాజా’ పాట బెడిసి కొట్టలేదు. కానీ ఇప్పుడు నాగార్జునతో అడల్ట్ కంటెంట్ బాగానే బెడిసి కొట్టింది. దీంతో కుటుంబ ప్రేక్షకులు కూడా దూరమైపోయారు. పాతబడిన ఈ రోమాంటిక్ కామెడీ / డ్రామెడీ ఫార్ములా కథ వచ్చేసి, రోమాన్స్ లో ఫార్ములా కథలు ఇక చాలించుకొమ్మనే మెసేజిని కూడా కొత్త తరం ప్రేక్షకుల వైపు నుంచి ఘాటుగా అందిస్తోంది. 2006 నాటి ఫ్రెంచి మూవీని ఇలా రీమేక్ కి తీసుకోవాలనుకున్నప్పుడు, దీనికి పై కారణాల చేత మార్కెట్ యాస్పెక్ట్ లేదని, త్రిశంకు స్వర్గంలో తల కిందులుగా వేలాడ దీయాల్సి వస్తుందని, అక్కడలా  వేలాడుతూ ఏ ప్రేక్షకులూ వుండాల్సిన అగత్యం లేదనీ వెంటనే గుర్తించ వచ్చు. 

        ర్శకుడు రాహుల్ రవీంద్రన్ కి ఈ మూవీ విడుదలైన రోజునే తను తీసిన క్రితం మూవీ ‘చిలసౌ’ కి గాను జాతీయ ఉత్తమ స్క్రీన్ ప్లే అవార్డు రావడం ట్రాజడీలో కామెడీ. ‘చిలసౌ’ లో హీరోహీరోయిన్లే  ఒకరికొకరు ప్రత్యర్ధులు. ‘మన్మథుడు -2’ లో నాగార్జున, లక్ష్మిలు ప్రత్యర్ధులుగా మొదలై మధ్యలో విరమించుకున్నారు. ఇదీ క్రియేటివ్ యాస్పెక్ట్ లో ప్రధాన లోపం. ఒక సినిమాకి మార్కెట్ యాస్పెక్టే కాకుండా, క్రియేటివ్ యాస్పెక్ట్ కూడా లోపించడం సర్వసాధారణమై పోయింది. 

        కథంటే ఆర్గ్యుమెంట్. రెండు పాత్రల మధ్య వాటి వైఖరులతో ఆర్గ్యుమెంట్. ఆర్గ్యుమెంటే కథకి ఊపిరి. లేదంటే అది కమర్షియల్ సినిమాలకి పనికిరాని గాథ. ఇంకా తేలిక భాషలో చెప్పాలంటే, కథంటే పాయింట్. పెళ్ళే వద్దనే నాగార్జునకి మూడు నెలల్లో చేసుకోవాలని లక్ష్మి షరతు పెట్టడం పాయింట్. చేసుకోనని ఇతను, చేసుకోవాలని ఆమె ఆర్గ్యుమెంట్. ఎవరు నెగ్గుతారన్నది ప్రశ్న. దీంతో నడిచేదే కథ. ఇలా ఒక పాయింటు పుట్టిందంటే దాని కిరువైపులా రెండు పాత్రలున్నట్టే. అవి ప్రత్యర్ధి పాత్రలైనట్టే. ఈ ప్రత్యర్ధి పాత్రల్లో ఒకదాన్ని నిర్వీర్యం చేస్తే అది సజావైన కథవుతుందా? 

           1. పాయింటు పుట్టిందంటే రెండు ప్రత్యర్ధి పాత్రలేర్పడతాయి, 2. రెండు ప్రత్యర్ధి పాత్రలేర్పడ్డాయంటే వాటి మధ్య ఆర్గ్యుమెంట్ పుడుతుంది, 3. ఆర్గ్యుమెంట్ పుట్టిందంటే ఎవరు నెగ్గుతారన్న ప్రశ్న పుడుతుంది,  4. ఎవరు నెగ్గుతారన్న ప్రశ్న పుట్టిందంటే ప్రత్యర్ధి పాత్రలమధ్య సంఘర్షణ పుడుతుంది, 5. ప్రత్యర్ధి పాత్రల మధ్య సంఘర్షణ పుట్టిందంటే, ఇవన్నీ కడుపున మోస్తూ కథ పుడుతుంది. ఇలా ఈ ఐదింటిలో ఏది లోపించినా అవిటి కందుని పడేసి పారిపోతుంది కథ. పాయింటు - ప్రత్యర్ధి పాత్రలు - ఆర్గ్యుమెంట్ - ప్రశ్న- సంఘర్షణ - ఈ అయిదింటి జెనెటిక్ ఇంజనీరింగే కమర్షియల్ సినిమా కథ. వరల్డ్ మూవీస్ కి ఈ  లెక్కలుండవు. అవి గాథలు. యూరోపియన్ ప్రేక్షకులు అలవాటు పడ్డ ఆర్టు సినిమా తరహా గాథలు. 

వరల్డ్ మూవీస్ జ్వరం 
       వరల్డ్ మూవీస్ హాలీవుడ్ మూవీస్ లాగా ప్రపంచమంతా ఆడవు. ఆడేట్టయితే ఇండియాలో ఏ డిస్ట్రిబ్యూటరూ ఆగడు. హైదరాబాద్ పంజాగుట్ట సెంటర్లో కూడా ఆడించుకుంటాడు. వరల్డ్ మూవీస్ అక్కడి యూరోపియన్ ప్రేక్షకుల స్థానిక అభిరుచి. తెలుగువాళ్ళ అభిరుచి కాదు. ఈ వాస్తవాన్ని డిస్ట్రిబ్యూటర్లు గుర్తించినప్పుడు మేకర్లు ఎందుకు తెలుసుకోకుండా వరల్డ్ మూవీస్ ని రీమేకులు చేసి తెలుగు ప్రేక్షకుల మీద పడేస్తున్నారు? ప్రపంచంలో రెండిటికే సార్వజనీన ఆమోదముంది: ఒకటి హాలీవుడ్, రెండు కొరియన్. కాబట్టే కొరియన్ ‘మిస్ గ్రానీ’ ని ‘ఓ బేబీ’ గా  తెలుగులో రీమేక్ చేస్తే హిట్టయ్యింది. కొరియన్ మూవీస్ పక్కా కమర్షియల్స్. కమర్షియల్స్ అంటే స్ట్రక్చర్. అందుకే హాలీవుడ్ తో పోటీ పడుతున్నాయి. సినిమాల్లో స్ట్రక్చర్ ని ఎవరెంత కాదన్నా, ద్వేషించి సొంత క్రియేటివిటీలు చేసుకున్నా (క్రియేటివ్ స్కూల్)  - కమర్షియల్ సినిమాలంటే తిరుగులేకుండా త్రీయాక్ట్ స్ట్రక్చర్ లో వుండే స్క్రీన్ ప్లేనే. వరల్డ్ మూవీస్ కి ఈ స్ట్రక్చర్ వుండదు. అందుకే అవి కథలు కాని గాథలు, ఆర్టు సినిమాలు. అయినా ఇవన్నీ పక్కనపెట్టి, ఇంకా ఇలాగే ఈ  రీమేకులు చేసుకుంటామంటే, నిరభ్యంతరంగా చేసుకుని నష్టపోవచ్చు. ఎవరు కాదంటారు? 

జనరేషన్ గ్యాప్? 
         నిజానికి ఈ సినిమా స్క్రీన్ ప్లే గురించి చెప్పుకోవడానికి ‘విషయం’ లేదు. ముందే చెప్పుకున్నట్టు కాలం చెల్లిన కథ కావడం వల్ల. వయసు ముదిరిన నాగార్జునకి పెళ్లి ఇష్టం లేకపోతే, మదర్ లక్ష్మి పెట్టిన కండిషన్ వల్ల అందుకు ఒప్పుకోవాల్సి వచ్చి, ఆ  పెళ్లిని తప్పించుకోవడానికి రకుల్ ప్రీత్ సింగ్ తో నాటక మాడ్డమనే కథ, 2006 లో ప్రెంచి మూవీ వచ్చిన నాడే  రీమేక్ చేసి వుంటే సరిపోయేదేమో. సుమారు దశాబ్దంన్నర తర్వాత కూడా ఈ ఫార్ములా కథకి చెల్లుబాటు వుంటుందని రిస్కు చేశారు. ఫలితం కనపడింది. ఈ కథావస్తువు సంగతలా వుంచి, అసలు నాగార్జున  వరకూ చూస్తే, ఆయనింకా హీరోగా నటించడం మైనస్ అయ్యిందా అనుకుందామనుకున్నా - విడుదల రోజు మార్నింగ్ షోకి క్లాస్, మాస్ యూతే ‘ఇస్మార్ట్ శంకర్’ కి, ‘రాక్షసుడు’ కీ దండయాత్ర చేసినట్టు చేసి హౌస్ ఫుల్ చేశారు. క్రిక్కిరిసిన ముప్పై రూపాయలు, పది రూపాయలు టికెట్ల క్యూల్లో 15, 16 ఏళ్ల బస్తీ కుర్రాళ్ళు సైతం వీరోచితంగా పోరాడి టికెట్లు సాధించుకున్నారు. అంటే నాగార్జున ఇప్పటికీ కింగే. ఇందులో ఏ మాత్రం డౌటు లేదు. జనరేషన్ గ్యాపుని జయించిన ఆల్ టైం కింగ్. 

         ఈ ప్రేక్షకుల తాకిడి తర్వాతి ఆటలకి ఖాళీ అయింది, ఫ్లాప్ టాక్ రావడంతో. కాబట్టి నేరం కింగ్ ది కాదు, కింగ్ ని మింగిన ఈ సినిమా కహానీది. కహానీ కూడా జనరేషన్ గ్యాపుని జయించి వుంటే కింగ్ కి కిరీటమయ్యేది. పాత కహానీ జనరేషన్ గ్యాపుని జయించే అవకాశం కూడా వుంది. హిందీలో రోహిత్ శెట్టి ఈ పనే చేస్తాడు. ఏం చేస్తాడు? నేటి ప్రేక్షకుల కోసం తిరగ రాస్తాడు. నేటి ప్రేక్షకుల కేం కావాలి? ఎంటర్ టైన్మెంట్ కావాలి. మిగతా బాధలు, దుఃఖాలు, ఏడ్పులు చూసే ఓపిక లేదు. రోహిత్ శెట్టియే గనుక కింగ్ నాగార్జున కోసం ఈ మూవీ చేస్తే చిట్ట చివరి దాకా నవ్వించి గానీ వదలడు. 

ఏం నేర్పుతున్నారు?
       పాత రోజుల్లో తెలుగు రోమాంటిక్ కామెడీలు చివరంటా రోమాంటిక్ కామెడీలు గానే వుండేవి. కాకపోతే రోమాంటిక్ కామెడీలనో, రోమ్ కాంలనో అప్పట్లో పిలవలేదు. కామెడీలనే అనేవాళ్ళు. చివర్లో ఓ ఐదు నిముషాలు కాస్త బాధ పెట్టడం తప్ప; ఫీలో, సెంటి మెంట్లో కాస్త రగిలించడం తప్ప, ప్రధానంగా నవ్వించడమే ధ్యేయంగా వుండేవి. రేలంగి నరసింహారావు, విజయబాపినీడు, జంధ్యాల, వంశీ, ఈవీవీ సత్యనారాయణ...ఇలా ఆ తరం దర్శకుల కామెడీలుండేవి. 

         2000  నుంచి కొత్త తరం వచ్చాక రోమాంటిక్ కామెడీలనో, రోమ్ కాంలనో  ఫ్యాషన్ గా అనడం మొదలెట్టి ఇప్పటికీ చేస్తున్నదేమిటంటే, సగం నవ్వించి సగం ఏడ్పించేస్తున్నారు. పేరుకే రోమాంటిక్ కామెడీలు. ఫస్టాఫ్ వరకే రోమాంటిక్ కామెడీ, సెకండాఫ్ రోమాంటిక్ డ్రామా. ఫస్టాఫ్ గిటార్ సినిమా, సెకండాఫ్ వీణ సినిమా. రేపు వీణ తీసేసి సన్నాయి సెకండాఫ్ పెట్టినా పెట్టొచ్చు జో కొట్టడానికి. కలియుగం యాక్షన్లో వుంటే ఇంకా ఈ ఫీల్, సెంటి సెంటిమెంట్లు, ఏడ్పులు వంటి పాసివ్ చిత్రణలు. పైన చెప్పుకున్న పూర్వ దర్శకులకి కలియుగం డైనమిక్సు  తెలుసు గనుకే హాస్యాన్ని విషాదం చేయకుండా, చివరి ఐదు నిమిషాలకి విషాదాన్ని పరిమితం చేసేవాళ్ళు. ‘ముత్యాల ముగ్గు’ వంటి మౌలికంగా విషాదం నిండి వున్న కథని కూడా  అద్భుత, హాస్య రసాల మేళవింపుతో వినోదాత్మకం చేశారు బాపూ రమణలు. జీవితాల్లో విషాదం వుండదని కాదు, వుంటుంది. ఆ విషాదాన్ని త్రోసి రాజని జీవించడం నేర్పాలబ్బా సినిమాలు, జీవించడం నేర్పాలి. రోమాంటిక్ కామెడీలు జీవించడం నేర్పుతాయి, రోమాంటిక్ డ్రామాలు ఏడ్వడం నేర్పుతాయి. 

పాంచ్ పటాకా 
         నాగార్జున సినిమాలోని ఈ పాత పాయింటు జానర్ మర్యాద కాపాడుతూ, నేటి ప్రేక్షకుల నిమిత్తం పూర్తి నిడివి రోమాంటిక్ కామెడీగా చేసి వుంటే బొమ్మ ఆడేదా అంటే మరో రోహిత్ శెట్టి చేస్తే ఆడుద్ది. ఇది కాదు విషయం, ఈ కథ మరమ్మత్తుల జోలికి పోకుండా, తస్మాత్ జాగ్రత్త అంటూ దీని కథనం చేస్తున్న హెచ్చరికని దృష్టికి తీసుకు రావడమే ఈ వ్యాసం ఉద్దేశం.  రోమాంటిక్ కామెడీని సగం నుంచీ రోమాంటిక్ డ్రామా చేయడం ఎలా తప్పో శాస్త్రీయంగా మనకి వివరణ దొరికింది. 

          పెళ్లి అనే పాయింటు చుట్టూ నాగార్జునకి మదర్ క్యారక్టర్ లక్ష్మితో, ప్లస్ రకుల్ తో, ఈ రోమాంటిక్ కామెడీ ఫస్టాఫ్ వరకూ రోమాంటిక్ కామెడీయే. ఇంటర్వెల్ నుంచీ ఇది రో మాంటిక్ డ్రామాగా మారిపోయింది. పటాకా ఎప్పుడు పేల్తుంది? పైన చెప్పుకున్న పాయింటు - ప్రత్యర్ధి పాత్రలు - ఆర్గ్యుమెంట్ - ప్రశ్న- సంఘర్షణ - అనేవి పాంచ్ పటాకాగా వున్నప్పుడే. ఫస్టాఫ్ లో నాగార్జున, లక్ష్మిలు ఈ అయిదింటి జెనెటిక్ ఇంజనీరింగ్ లోనే వున్నారు. ఇంటర్వెల్ నుంచి లక్ష్మి ప్రత్యర్ధిత్వం లోంచి తప్పుకోవడంతో పాంచ్ పటాకా కాస్తా చార్ చటాకా అయి తుస్సుమని పేలకుండా కూర్చుంది. లేలే నా రాజా పాట కూడా ఇక లేపే పరిస్థితి లేదు. ఒరేమావా యేసుకోరా సుక్కా అన్నా కూడా ఇంతే. మాయదారి సిన్నోడు మనసే లాగేసిండు... అని రెచ్చగొట్టినా కూడా!

ఆత్మ బలిదానం 
      నువ్వొచ్చి నా గర్ల్ ఫ్రెండ్ గా నటించు, తీరా పెళ్లి సమయంలో పారిపో, దీంతో మళ్ళీ నా పెళ్లి మాటెత్తదు అమ్మ - అని రకుల్ తో నాగార్జున ప్లాను. ఇంటర్వెల్లో రకుల్ ఇలాగే చేసేసరికి స్పృహ తప్పి ఆ తర్వాత కోమాలోకి  వెళ్ళిపోతుంది లక్ష్మి. తర్వాత కోలుకున్నా ఆమె ఇక పాసివ్ పాత్ర. నాగార్జునకి ప్రత్యర్ధి కాదు. నాగార్జునకి అపరాధ భావం పుట్టుకొచ్చి అంతర్ముఖీనుడై పోతాడు. బహిర్ముఖంగా తల్లిని ఎదుర్కొంటున్న వాడు, తల్లిని అనారోగ్యం పాల్జేశానన్న చింతతో తనకి తనే ప్రత్యర్ధి అయి, తనతో తానే అంతర్ముఖీనంగా సంఘర్షించడం మొదలెడతాడు. ఇలాటి పాత్ర వరల్డ్ మూవీస్ లో, ఆర్టు మూవీస్ లో, గాథల్లో వుంటుంది. కమర్షియల్ మూవీస్ లో కాదు. కమర్షియల్ మూవీస్ లో కథ నడవడానికి బహిర్ముఖంగా, భౌతికంగా, విజువల్ గా వున్న ప్రత్యర్ధితో సంఘర్షిస్తుంది పాత్ర. ఇక్కడ బాహిర్ సంఘర్షణతో మొదలైన నాగ పాత్ర. అంతర్ సంఘర్షణతో ప్లేటు ఫిరాయించింది. కథ ఎక్కడైనా ఇలా వుంటుందా? 

         లక్ష్మి ప్రత్యర్ధి హోదా కోల్పోయాక ఇక  సెకండాఫ్ కమర్షియల్ మూవీగా,  పైసలొచ్చే లక్ష్మీగా కాకుండా పోయింది. సెకండాఫ్ లో ఆ లక్ష్మి ఈ లక్ష్మి కూడా లేకుండా వెళ్ళిపోయాక ప్రేక్షకులు కూడా వెళ్ళిపోయారు. లక్ష్మిలో కథకుడు నాగార్జున  కోసం మదర్ ని చూశాడు. అందువల్ల సెంటుమెంటుకి పోయి ఆమెని అయ్యోపాపం అనేలా చేశాడు. కానీ నాగార్జున పాత్రకి ఆమె మదర్ కాదు. ఆమె పెట్టిన సమస్యతో ఆమెని ఎదుర్కోవాల్సిన ప్రత్యర్ధి. తర్వాత్తర్వాత ఎలాగూ ఆమెలో మదర్ ని చూస్తాడు, మనసు మార్చుకుంటాడు, అది చివరి దశ సంగతి. నాగార్జున పాత్ర కోసం కథకుడు ఎందుకు తొందర పడ్డాడు? పాత్ర కోసం తనే కథ ఆలోచిస్తున్నాడు కాబట్టి. పాత్ర తన కథని తనే ఆలోచించుకుంటుందని మరిచాడు కాబట్టి. ఇలా పాంచ్ పటాకాలోంచి ప్రత్యర్ధిని తీసేసి సెకండాఫ్ ని సెంటిమెంటల్ చేద్దామన్న కథా పథకం బెడిసి కొట్టింది. 

          నిజ జీవితాల్లో ప్రత్యర్ధి కళ్ళు తిరిగి పడిపోయి తప్పుకోదా అంటే, కమర్షియల్ సినిమా జీవితంలా వుండదు. జీవితంలో జరగనివి, తమకి అందుబాటులో వుండనివి తెర పైన చూడాలనుకుంటారు కమర్షియల్ సినిమా ప్రేక్షకులు. ఇకపోతే, మొదట ఒక ప్లానుతో మదర్ ని అనారోగ్యం పాల్జేసిన నాగార్జునే మళ్ళీ ఆమెకి ప్రమాదం తలపెడుతూ రెండో ప్లాను అమలు చేయడం ఎలా పాత్రోచితమవుతుందో తెలీదు. ఇది ప్లాట్ పాయింట్ టూ ఘట్టం, ఈసారి ఘోర పరాభవం చేసి వెళ్లి పొమ్మంటాడు రకుల్ తో. మొదటి ప్లానుతోనే కోమాలోకి వెళ్ళిన మదర్ తో మళ్ళీ ఇదేం అన్యాయం? ఆమె మరణాన్ని కోరుకుంటున్నాడా? ఇలా ప్లాట్ పాయింట్ టూ కూడా విఫలమయింది. 

        ప్లాట్ పాయింట్ వన్, ప్లాట్ పాయింట్ టూలు పరస్పరాధార భూతాలు. అంటే పిశాచాలు కాదు. ఆ సమాసం అలా వుంది. ప్లాట్ పాయింట్ వన్ కథలో పుట్టిన సమస్య అయితే, ప్లాట్ పాయింటూ ఆ సమస్యకి పరిష్కారం. ప్లాట్ పాయింట్ వన్లో లక్ష్మి పెళ్లి అనే సమస్య పెడితే, ఈ సమస్యతో ప్లాట్ పాయింట్ టూలో ఇంకా మారని నాగార్జునకి ఎదురు దెబ్బ తగలాలి, తను లక్ష్మిని దెబ్బ తీయడం కాదు. తనే  దెబ్బతిని దారికి రావాలి. 

          వరల్డ్ మూవీస్ కి ఎమోషన్లు తప్ప లాజిక్ వుండదు. కానీ నిత్యజీవితాల్లో కుటుంబ సంబంధాల్లో లాజిక్ ని కూడా చూసి ప్రవర్తించే ప్రేక్షకులు- ఇలా రెండో సారి మదర్ మీద మానసిక దాడిని తప్పకుండా నిరసిస్తారు. 

          నాగార్జున కోసం లక్ష్మిలో మదర్ ని చూసిన కథకుడే చివరికి ప్రత్యర్ధిని చూశాడు, సంతోషం. కానీ ఆమె మీద రెండో దాడి అనేది అసందర్భం, అర్ధరహితం. ప్లాట్ పాయింట్ టూలో దెబ్బ పడాల్సింది ఇంకా మారని నాగార్జున మీద. ప్లాట్ పాయింట్ టూ రగులుతున్న సమస్యకి పరిష్కార ప్రాంగణం. కథ అన్నాక దానికో అనుక్రమణిక వుంటుంది, అప్పుడే అది దివ్యమైన కళ అన్పించుకుంటుంది. 

          మన్మథుడు - 2 అయ్యింది ఫ్లాప్ కాదు, ఆత్మ బలిదానం చేసుకుంది. చేసుకుంటూ దృశ్యాత్మక ఆధారాలు ఇచ్చి పోయింది... రోమాంటిక్ కామెడీల్లో హీరోహీరోయిన్ల మీద కథ వుంటే వాళ్ళే ప్రత్యర్ధులు. రోమాంటిక్ కామెడీని ఇంటర్వెల్ నుంచి ఏదో ఫీలైపోతూ రోమాంటిక్ డ్రామాగా మార్చారా, ఇక  పాంచ్ పటాకా పేలదు. ఒక ప్రత్యర్ధి లేకపోయాక ఆ సెకండాఫ్ డిటో లక్ష్మీ విహిత మన్మథుడు టూ అవుతుంది. రోం కాం అంటూ అందులో రోం డ్రాంని తెచ్చి  దూర్చడమెందుకు?  రెండు డ్రాములు పట్టించి ఫుల్ రేంజి రోమ డ్రామా తీస్తే సరి. 

సికిందర్