రివ్యూలు, సాంకేతికాలు, స్క్రీన్ ప్లే సంగతులు...

టికెట్లు దొరకడం యోగం, సినిమాలు చూడడం భోగం, రివ్యూలు రాయడం రోగం!

Thursday, August 15, 2019

860 : టిప్స్




        చాలా చాలా కాలం క్రితం రాబిన్ భట్ చేసిన ఒక సూచన ఈ పుస్తకం మీద దృష్టి సారించేలా చేసింది : హంగేరియన్ నాటక రచయిత లాజోస్ ఏగ్రీ 1946 లో రాసిన మాస్టర్ పీస్ ‘దిఆర్ట్ ఆఫ్ డ్రమెటిక్ రైటింగ్’ ... ఈ పుస్తకాన్ని సినిమా రచయితలనదగ్గ వాళ్ళు తప్పకుండా దగ్గరుంచు కోవాలని కోరాడు సీనియర్ సినిమా రచయితైన రాబిన్ భట్ (మహేష్ భట్ సోదరుడు). ఈ పుస్తకం నాటక శాస్త్రమే అయినా, సినిమా రచనతో బాటు నవలా రచనకీ, కథా రచనకీ పనికొచ్చే విజ్ఞాన కోశంలా వుంది. 300 పేజీల ఈ పుస్తకం73 ఏళ్ళుగా, అంటే మూడు తరాలుగా ఇప్పటికీ రీప్రింట్లు అవుతూనే వుంది. ఇక నాల్గో తరం ప్రారంభం కాబోతోంది...ఈ సందర్భంగా ఇందులోని విషయాల్నికొన్నిటిప్స్ గా పరిచయం చేస్తే ఎలా వుంటుందని ఓ శుభోదయాన తోచింది. 
          బాగానే వుంటుంది. బాముకునే దెవరు? ఎవరి సొంత జ్ఞానం వాళ్ళకి పుష్కలంగా  వుంది. వేరే శాస్త్రం గీస్త్రం చల్తానై. దాంతో వద్దన్నా హిట్సే తీస్తున్నారు. ప్రేక్షకులు తట్టుకో లేకపోతున్నారు. నిర్మాతలు నోట్ల కట్టలు మోయలేక పోతున్నారు (ఖర్చు పెడుతూ ఈ నోట్ల కట్ట మళ్ళీ చూస్తానా అన్నాడో నిర్మాత). అందుకని ఈ టిప్స్ ని కాలక్షేపంగా చదివి వదిలెయ్యాలి. ఈ బ్లాగు వున్నదే కాలక్షేపం కోసం, నథింగ్ బట్ కాలక్షేపం.
         పుస్తకంలో థీమ్ మొదలుకొని క్యారక్టర్ స్ట్రక్చర్, కాన్ఫ్లిక్ట్ అనే మూడు చాప్టర్లు ప్రధానంగా రాసుకొస్తూ, జనరల్ చాప్టర్ కింద కొన్ని వ్యావహారిక అంశాల్ని పొందుపర్చాడు ఏగ్రీ. ఈ పుస్తకం నాటకాల గురించి కాబట్టి వాక్యాల్లో ‘నాటకం’ అనే పదం విరివిగా దొర్లింది. దీన్ని’కథ’ గా మార్పు చేసుకుని ముందుగా థీమ్ కి సంబంధించిన టిప్స్ చూద్దాం...
        1. శాస్త్రాన్ని అర్ధం జేసుకోలేని వాళ్ళు  కథ రాయడానికి రూల్స్ లేవంటారు. ఏగ్రీ కథ రాయడానికి రూల్స్ వున్నాయంటాడు. మనం భోజనం చేయడానికి, నడవడానికి, ఊపిరి పీల్చడానికీ రూల్స్ వున్నాయ్....చిత్ర కళకి, సంగీతానికీ, నాట్యానికీ రూల్స్ వున్నాయ్...ఎగరడానికి, వంతెన కట్టడానికీ రూల్స్ వున్నాయ్...జీవితంలో, ప్రకృతిలో ప్రతీదానికీ రూల్స్ వున్నాయ్... రూల్స్ నుంచి రచనల్ని మినహాయించాలని ఎలా అంటారు. అది కుదరదు...అంటాడు. 


          2. కథకి థీమ్ వుండాలి. థీమ్ వుంటే రచయిత తానేం చెప్పదల్చుకున్నాడో ఆ గమ్యానికి కథనికి చేరవేయడానికి తోడ్పడుతుంది. ఉదాహరణకి, గొప్ప ప్రేమ మరణాన్ని కూడా లక్ష్య పెట్టదని  ‘రోమియో అండ్ జూలియెట్’ థీమ్. గుడ్డి నమ్మకం సర్వ నాశనాన్ని కొనితెస్తుందని ‘కింగ్ లియర్’ థీమ్. అలాగే - మేథస్సు అంధ విశ్వసాల్ని జయిస్తుందని ‘షాడో అండ్ సబ్స్ స్టెన్స్’ థీమ్. థీమ్ నే థీసిస్, సెంట్రల్ ఐడియా, గోల్, లేదా సబ్జెక్ట్ అంటారు (తెలుగులో ఇతివృత్తం).
          3. మంచి కథల్లో ఏకవాక్య థీమ్ వ్యూహాత్మకంగా నిర్మాణమై వుంటుంది. అది శాంపిల్ సినాప్సిస్ లాగా వుంటుంది. ‘గొప్ప ప్రేమ మరణాన్ని కూడా లక్ష్య పెట్టదు’ అన్న ‘రోమియో అండ్ జూలియెట్’  ఏకవాక్య థీమ్ నే తీసుకుంటే, ఇది మూడు భాగాల కలయిక : పాత్రలు, కాన్ఫ్లిక్ట్, ముగింపు. గొప్ప ప్రేమ ఎవరిదీ? రోమియో అండ్ జూలియెట్ పాత్రలది. వాళ్ళ కాన్ఫ్లిక్ట్ ఏమిటి? మృత్యువు. వాళ్ళేం  చేశారు? మృత్యువుని కూడా లెక్క చెయ్యకుండా ప్రేమ కోసం సంఘర్షించారు.

          [స్క్రీన్ ప్లేల విషయానికి వస్తే దీన్నే అయిడియా నిర్మాణం అంటున్నాం. ఐడియాలో బిగినింగ్, మిడిల్, ఎండ్ ఉండేట్టు. పై ఏకవాక్య థీమ్ నే తీసుకుంటే ఇవే కన్పిస్తాయి. గొప్ప ప్రేమ (బిగినింగ్), మరణాన్ని(మిడిల్) కూడా లక్ష్య పెట్టదు (ఎండ్)]

         
4. థీమ్ ఆలోచించకపోతే, వచ్చిన ఆలోచనకి మార్పు చేర్పులు చేస్తూ, విస్తరిస్తూ పోతూ, వచ్చిన ఆలోచనే మారిపోయి ఇంకో ఆలోచన మొదలయ్యే పరిస్థితి వస్తుంది. దీంతో ఎక్కడికి వెళ్ళాలో తెలియక కథకోసం తడుముకోవడమే జరుగుతుంది. ఎలాగో బ్రెయిన్ కి పని చెప్పి ముగింపుకి తెచ్చినా, కథ మాత్రం తయారవదు.

          5. ఎమోషన్, లేదా ఎమోషన్ లో వుండే ఎలిమెంట్లు, జీవితంలో మౌలిక అంశాల్ని కలిగి వుంటాయి. ఎమోషన్ అంటే జీవితం, జీవితమంటే ఎమోషన్. అందువల్ల ఎమోషన్ అంటే డ్రామా, డ్రామా అంటే ఎమోషన్ - అన్నాడు మోజెస్ మలేవిన్ స్కీ తను రాసిన ‘ది సైన్స్ ఆఫ్ ప్లే రైటింగ్’ లో. కనుక ఏ పరిస్థితులు ఎమోషన్స్ కి దారితీస్తున్నాయో మనకి తెలియకపోతే, మంచి కథ కుదరడం అసాధ్యం. శునకానికి మొరగడం ఎలాగో కథకి ఎమోషన్ అలాగ.

          6. మలేవిన్ స్కీ ఎమోషన్స్ లో వుండే కొన్ని మౌలిక ఎలిమెంట్స్ ఏమిటో చెప్తాడు : కోరిక, భయం, జాలి, ప్రేమ, ద్వేషం మొదలైనవి. ఈ ఎమోషన్స్ కి కార్యాచరణతో కూడిన గోల్ లేకపోతే కేవలం ఎమోషన్స్ గానే వుండి పోతాయి.

          7. రెండు థీమ్స్ తో ఒక కథ రాయవచ్చా? రాయవచ్చు, అయితే మంచి కథవదు. ఏక కాలంలో రెండు దిశల్లో ప్రయాణం కుదురుతుందా? ఒక థీమ్ తో చెబుతున్న విషయాన్ని రుజువు చేయడంలోనే  రచయితకి సరిపోతుంది, రెండు మూడు థీమ్స్ కి ఎక్కడ వీలవుతుంది? ఒక కథలో ఒకటి కన్నా ఎక్కువ థీమ్స్ వుంటే ఆ కథ తికమకగా వుంటుంది.

          8. దీనికి రెండు ఉదాహరణలున్నాయి : ‘ది ఫిలడెల్ఫియా స్టోరీ’ అనే నాటకమొకటి, ‘స్కై లార్క్’ అనే నాటకమొకటి. మొదటి దాంట్లో రెండు థీమ్స్ ఏమిటంటే, పండంటి కాపురానికి ఇరువైపులా త్యాగాలు అవసరమని ఒకటి,  మనిషి క్యారక్టర్ ని డబ్బుండడం లేకపోవడం నిర్ణయించవని మరొకటి. రెండో నాటకంలో సంపన్నురాలైన స్త్రీకి తోడు అవసరమని ఒకటి, ప్రేమించే భర్త భార్య కోసం త్యాగాలు చేస్తాడని మరొకటి. ఈ రెండు నాటకాల్లో రెండేసి థీమ్స్ చలన రహితంగా వుండడమే కాదు, విషయం చెప్పడం కూడా కుదరలేదు.

          9.  రచయిత పాత్రలతో ఏదో ఒక పక్షం వహించకపోతే థీమ్ విఫలమవుతుంది. ఇగో మిత్రుల్ని దూరం చేస్తుందనే థీమ్ వుందనుకుందాం. ఈ థీమ్ తో పాత్రలు రెండు వర్గాలుగా విడిపోతే, రచయిత ఏదో ఒక వర్గాన్ని సమర్ధించాల్సి వుంటుంది. ఇగో వల్ల మిత్రులు దూరమవుతారో కాదో ఏదో ఒకటి తేల్చాలి. ఇగో వల్లమిత్రులు దూరమవుతారనే దాంతో రచయిత విభేదిస్తే, అందుకు తగిన కారణాలు ఆధారాలతో సహా చూపించాలి. దీంతో ప్రేక్షకులు ఏకీభవించకపోయినా రచయితకి తన జడ్జిమెంట్ తనకుండాలి.
           
సికిందర్