మన్మథుడు - 2 కథా వస్తువు అటు
పాత తరం ప్రేక్షకులకి కాక, ఇటు కొత్త తరం ప్రేక్షకులకీ కాకుండా త్రిశంకు స్వర్గపు
మార్కెట్లో వేలాడినట్టుంది. కానీ ఒకప్పుడు అక్కినేని నాగేశ్వర రావుతో అప్పటి పాత
తరంతో పాటు కొత్త తరం కూడా ‘ప్రేమ నగర్’ ని ఎంజాయ్ చేశారు. ‘లేలే నా రాజా’ పాట
బెడిసి కొట్టలేదు. కానీ ఇప్పుడు నాగార్జునతో అడల్ట్ కంటెంట్ బాగానే బెడిసి
కొట్టింది. దీంతో కుటుంబ ప్రేక్షకులు కూడా దూరమైపోయారు. పాతబడిన ఈ రోమాంటిక్
కామెడీ / డ్రామెడీ ఫార్ములా కథ వచ్చేసి, రోమాన్స్ లో ఫార్ములా కథలు ఇక చాలించుకొమ్మనే
మెసేజిని కూడా కొత్త తరం ప్రేక్షకుల వైపు నుంచి ఘాటుగా అందిస్తోంది. 2006 నాటి ఫ్రెంచి
మూవీని ఇలా రీమేక్ కి తీసుకోవాలనుకున్నప్పుడు, దీనికి పై కారణాల చేత మార్కెట్
యాస్పెక్ట్ లేదని, త్రిశంకు స్వర్గంలో తల కిందులుగా వేలాడ దీయాల్సి వస్తుందని,
అక్కడలా వేలాడుతూ ఏ ప్రేక్షకులూ వుండాల్సిన
అగత్యం లేదనీ వెంటనే గుర్తించ వచ్చు.
దర్శకుడు రాహుల్ రవీంద్రన్ కి ఈ మూవీ విడుదలైన రోజునే తను తీసిన క్రితం మూవీ ‘చిలసౌ’ కి గాను జాతీయ ఉత్తమ స్క్రీన్ ప్లే అవార్డు రావడం ట్రాజడీలో కామెడీ. ‘చిలసౌ’ లో హీరోహీరోయిన్లే ఒకరికొకరు ప్రత్యర్ధులు. ‘మన్మథుడు -2’ లో నాగార్జున, లక్ష్మిలు ప్రత్యర్ధులుగా మొదలై మధ్యలో విరమించుకున్నారు. ఇదీ క్రియేటివ్ యాస్పెక్ట్ లో ప్రధాన లోపం. ఒక సినిమాకి మార్కెట్ యాస్పెక్టే కాకుండా, క్రియేటివ్ యాస్పెక్ట్ కూడా లోపించడం సర్వసాధారణమై పోయింది.
కథంటే
ఆర్గ్యుమెంట్. రెండు పాత్రల మధ్య వాటి వైఖరులతో ఆర్గ్యుమెంట్. ఆర్గ్యుమెంటే కథకి
ఊపిరి. లేదంటే అది కమర్షియల్ సినిమాలకి పనికిరాని గాథ. ఇంకా తేలిక భాషలో
చెప్పాలంటే, కథంటే పాయింట్. పెళ్ళే వద్దనే నాగార్జునకి మూడు నెలల్లో చేసుకోవాలని
లక్ష్మి షరతు పెట్టడం పాయింట్. చేసుకోనని ఇతను, చేసుకోవాలని ఆమె ఆర్గ్యుమెంట్.
ఎవరు నెగ్గుతారన్నది ప్రశ్న. దీంతో నడిచేదే కథ. ఇలా ఒక పాయింటు పుట్టిందంటే దాని
కిరువైపులా రెండు పాత్రలున్నట్టే. అవి ప్రత్యర్ధి పాత్రలైనట్టే. ఈ ప్రత్యర్ధి
పాత్రల్లో ఒకదాన్ని నిర్వీర్యం చేస్తే అది సజావైన కథవుతుందా?
1. పాయింటు పుట్టిందంటే రెండు ప్రత్యర్ధి పాత్రలేర్పడతాయి,
2. రెండు ప్రత్యర్ధి పాత్రలేర్పడ్డాయంటే వాటి మధ్య ఆర్గ్యుమెంట్ పుడుతుంది, 3. ఆర్గ్యుమెంట్
పుట్టిందంటే ఎవరు నెగ్గుతారన్న ప్రశ్న పుడుతుంది, 4. ఎవరు నెగ్గుతారన్న ప్రశ్న పుట్టిందంటే ప్రత్యర్ధి
పాత్రలమధ్య సంఘర్షణ పుడుతుంది, 5. ప్రత్యర్ధి పాత్రల మధ్య సంఘర్షణ పుట్టిందంటే, ఇవన్నీ
కడుపున మోస్తూ కథ పుడుతుంది. ఇలా ఈ ఐదింటిలో ఏది లోపించినా అవిటి కందుని పడేసి
పారిపోతుంది కథ. పాయింటు - ప్రత్యర్ధి పాత్రలు - ఆర్గ్యుమెంట్ - ప్రశ్న- సంఘర్షణ -
ఈ అయిదింటి జెనెటిక్ ఇంజనీరింగే కమర్షియల్ సినిమా కథ. వరల్డ్ మూవీస్ కి ఈ లెక్కలుండవు. అవి గాథలు. యూరోపియన్ ప్రేక్షకులు అలవాటు
పడ్డ ఆర్టు సినిమా తరహా గాథలు.
వరల్డ్ మూవీస్ జ్వరం
వరల్డ్ మూవీస్ హాలీవుడ్ మూవీస్
లాగా ప్రపంచమంతా ఆడవు. ఆడేట్టయితే ఇండియాలో ఏ డిస్ట్రిబ్యూటరూ ఆగడు. హైదరాబాద్
పంజాగుట్ట సెంటర్లో కూడా ఆడించుకుంటాడు. వరల్డ్ మూవీస్ అక్కడి యూరోపియన్
ప్రేక్షకుల స్థానిక అభిరుచి. తెలుగువాళ్ళ అభిరుచి కాదు. ఈ వాస్తవాన్ని
డిస్ట్రిబ్యూటర్లు గుర్తించినప్పుడు మేకర్లు ఎందుకు తెలుసుకోకుండా వరల్డ్ మూవీస్
ని రీమేకులు చేసి తెలుగు ప్రేక్షకుల మీద పడేస్తున్నారు? ప్రపంచంలో రెండిటికే
సార్వజనీన ఆమోదముంది: ఒకటి హాలీవుడ్, రెండు కొరియన్. కాబట్టే కొరియన్ ‘మిస్ గ్రానీ’
ని ‘ఓ బేబీ’ గా తెలుగులో రీమేక్ చేస్తే
హిట్టయ్యింది. కొరియన్ మూవీస్ పక్కా కమర్షియల్స్. కమర్షియల్స్ అంటే స్ట్రక్చర్. అందుకే
హాలీవుడ్ తో పోటీ పడుతున్నాయి. సినిమాల్లో స్ట్రక్చర్ ని ఎవరెంత కాదన్నా,
ద్వేషించి సొంత క్రియేటివిటీలు చేసుకున్నా (క్రియేటివ్ స్కూల్) - కమర్షియల్ సినిమాలంటే తిరుగులేకుండా త్రీయాక్ట్
స్ట్రక్చర్ లో వుండే స్క్రీన్ ప్లేనే. వరల్డ్ మూవీస్ కి ఈ స్ట్రక్చర్ వుండదు.
అందుకే అవి కథలు కాని గాథలు, ఆర్టు సినిమాలు. అయినా ఇవన్నీ పక్కనపెట్టి, ఇంకా ఇలాగే
ఈ రీమేకులు చేసుకుంటామంటే, నిరభ్యంతరంగా
చేసుకుని నష్టపోవచ్చు. ఎవరు కాదంటారు?
జనరేషన్ గ్యాప్?
నిజానికి ఈ సినిమా స్క్రీన్ ప్లే
గురించి చెప్పుకోవడానికి ‘విషయం’ లేదు. ముందే చెప్పుకున్నట్టు కాలం చెల్లిన కథ
కావడం వల్ల. వయసు ముదిరిన నాగార్జునకి పెళ్లి ఇష్టం లేకపోతే, మదర్ లక్ష్మి పెట్టిన
కండిషన్ వల్ల అందుకు ఒప్పుకోవాల్సి వచ్చి, ఆ
పెళ్లిని తప్పించుకోవడానికి రకుల్ ప్రీత్ సింగ్ తో నాటక మాడ్డమనే కథ, 2006
లో ప్రెంచి మూవీ వచ్చిన నాడే రీమేక్ చేసి
వుంటే సరిపోయేదేమో. సుమారు దశాబ్దంన్నర తర్వాత కూడా ఈ ఫార్ములా కథకి చెల్లుబాటు
వుంటుందని రిస్కు చేశారు. ఫలితం కనపడింది. ఈ కథావస్తువు సంగతలా వుంచి, అసలు
నాగార్జున వరకూ చూస్తే, ఆయనింకా హీరోగా
నటించడం మైనస్ అయ్యిందా అనుకుందామనుకున్నా - విడుదల రోజు మార్నింగ్ షోకి క్లాస్,
మాస్ యూతే ‘ఇస్మార్ట్ శంకర్’ కి, ‘రాక్షసుడు’ కీ దండయాత్ర చేసినట్టు చేసి హౌస్
ఫుల్ చేశారు. క్రిక్కిరిసిన ముప్పై రూపాయలు, పది రూపాయలు టికెట్ల క్యూల్లో 15, 16 ఏళ్ల
బస్తీ కుర్రాళ్ళు సైతం వీరోచితంగా పోరాడి టికెట్లు సాధించుకున్నారు. అంటే
నాగార్జున ఇప్పటికీ కింగే. ఇందులో ఏ మాత్రం డౌటు లేదు. జనరేషన్ గ్యాపుని జయించిన ఆల్
టైం కింగ్.
ఈ
ప్రేక్షకుల తాకిడి తర్వాతి ఆటలకి ఖాళీ అయింది, ఫ్లాప్ టాక్ రావడంతో. కాబట్టి నేరం
కింగ్ ది కాదు, కింగ్ ని మింగిన ఈ సినిమా కహానీది. కహానీ కూడా జనరేషన్ గ్యాపుని
జయించి వుంటే కింగ్ కి కిరీటమయ్యేది. పాత కహానీ జనరేషన్ గ్యాపుని జయించే అవకాశం
కూడా వుంది. హిందీలో రోహిత్ శెట్టి ఈ పనే చేస్తాడు. ఏం చేస్తాడు? నేటి ప్రేక్షకుల
కోసం తిరగ రాస్తాడు. నేటి ప్రేక్షకుల కేం కావాలి? ఎంటర్ టైన్మెంట్ కావాలి. మిగతా
బాధలు, దుఃఖాలు, ఏడ్పులు చూసే ఓపిక లేదు. రోహిత్ శెట్టియే గనుక కింగ్ నాగార్జున
కోసం ఈ మూవీ చేస్తే చిట్ట చివరి దాకా నవ్వించి గానీ వదలడు.
ఏం నేర్పుతున్నారు?
పాత రోజుల్లో తెలుగు రోమాంటిక్ కామెడీలు
చివరంటా రోమాంటిక్ కామెడీలు గానే వుండేవి. కాకపోతే రోమాంటిక్ కామెడీలనో, రోమ్
కాంలనో అప్పట్లో పిలవలేదు. కామెడీలనే అనేవాళ్ళు. చివర్లో ఓ ఐదు నిముషాలు కాస్త బాధ
పెట్టడం తప్ప; ఫీలో, సెంటి మెంట్లో కాస్త రగిలించడం తప్ప, ప్రధానంగా నవ్వించడమే
ధ్యేయంగా వుండేవి. రేలంగి నరసింహారావు, విజయబాపినీడు, జంధ్యాల, వంశీ, ఈవీవీ
సత్యనారాయణ...ఇలా ఆ తరం దర్శకుల కామెడీలుండేవి.
2000 నుంచి కొత్త తరం వచ్చాక రోమాంటిక్ కామెడీలనో,
రోమ్ కాంలనో ఫ్యాషన్ గా అనడం మొదలెట్టి
ఇప్పటికీ చేస్తున్నదేమిటంటే, సగం నవ్వించి సగం ఏడ్పించేస్తున్నారు. పేరుకే
రోమాంటిక్ కామెడీలు. ఫస్టాఫ్ వరకే రోమాంటిక్ కామెడీ, సెకండాఫ్ రోమాంటిక్ డ్రామా.
ఫస్టాఫ్ గిటార్ సినిమా, సెకండాఫ్ వీణ సినిమా. రేపు వీణ తీసేసి సన్నాయి సెకండాఫ్
పెట్టినా పెట్టొచ్చు జో కొట్టడానికి. కలియుగం యాక్షన్లో వుంటే ఇంకా ఈ ఫీల్, సెంటి సెంటిమెంట్లు,
ఏడ్పులు వంటి పాసివ్ చిత్రణలు. పైన చెప్పుకున్న పూర్వ దర్శకులకి కలియుగం
డైనమిక్సు తెలుసు గనుకే హాస్యాన్ని విషాదం
చేయకుండా, చివరి ఐదు నిమిషాలకి విషాదాన్ని పరిమితం చేసేవాళ్ళు. ‘ముత్యాల ముగ్గు’
వంటి మౌలికంగా విషాదం నిండి వున్న కథని కూడా
అద్భుత, హాస్య రసాల మేళవింపుతో వినోదాత్మకం చేశారు బాపూ రమణలు. జీవితాల్లో
విషాదం వుండదని కాదు, వుంటుంది. ఆ విషాదాన్ని త్రోసి రాజని జీవించడం నేర్పాలబ్బా
సినిమాలు, జీవించడం నేర్పాలి. రోమాంటిక్ కామెడీలు జీవించడం నేర్పుతాయి, రోమాంటిక్
డ్రామాలు ఏడ్వడం నేర్పుతాయి.
పాంచ్ పటాకా
నాగార్జున సినిమాలోని ఈ పాత
పాయింటు జానర్ మర్యాద కాపాడుతూ, నేటి ప్రేక్షకుల నిమిత్తం పూర్తి నిడివి రోమాంటిక్
కామెడీగా చేసి వుంటే బొమ్మ ఆడేదా అంటే మరో రోహిత్ శెట్టి చేస్తే ఆడుద్ది. ఇది కాదు
విషయం, ఈ కథ మరమ్మత్తుల జోలికి పోకుండా, తస్మాత్ జాగ్రత్త అంటూ దీని కథనం చేస్తున్న
హెచ్చరికని దృష్టికి తీసుకు రావడమే ఈ వ్యాసం ఉద్దేశం. రోమాంటిక్ కామెడీని సగం నుంచీ రోమాంటిక్ డ్రామా
చేయడం ఎలా తప్పో శాస్త్రీయంగా మనకి వివరణ దొరికింది.
పెళ్లి అనే పాయింటు చుట్టూ నాగార్జునకి మదర్ క్యారక్టర్ లక్ష్మితో, ప్లస్ రకుల్ తో, ఈ రోమాంటిక్ కామెడీ ఫస్టాఫ్ వరకూ రోమాంటిక్ కామెడీయే. ఇంటర్వెల్ నుంచీ ఇది రో మాంటిక్ డ్రామాగా మారిపోయింది. పటాకా ఎప్పుడు పేల్తుంది? పైన చెప్పుకున్న పాయింటు - ప్రత్యర్ధి పాత్రలు - ఆర్గ్యుమెంట్ - ప్రశ్న- సంఘర్షణ - అనేవి పాంచ్ పటాకాగా వున్నప్పుడే. ఫస్టాఫ్ లో నాగార్జున, లక్ష్మిలు ఈ అయిదింటి జెనెటిక్ ఇంజనీరింగ్ లోనే వున్నారు. ఇంటర్వెల్ నుంచి లక్ష్మి ప్రత్యర్ధిత్వం లోంచి తప్పుకోవడంతో పాంచ్ పటాకా కాస్తా చార్ చటాకా అయి తుస్సుమని పేలకుండా కూర్చుంది. లేలే నా రాజా పాట కూడా ఇక లేపే పరిస్థితి లేదు. ఒరేమావా యేసుకోరా సుక్కా అన్నా కూడా ఇంతే. మాయదారి సిన్నోడు మనసే లాగేసిండు... అని రెచ్చగొట్టినా కూడా!
ఆత్మ బలిదానం
నువ్వొచ్చి
నా గర్ల్ ఫ్రెండ్ గా నటించు, తీరా పెళ్లి సమయంలో పారిపో, దీంతో మళ్ళీ నా పెళ్లి
మాటెత్తదు అమ్మ - అని రకుల్ తో నాగార్జున ప్లాను. ఇంటర్వెల్లో రకుల్ ఇలాగే
చేసేసరికి స్పృహ తప్పి ఆ తర్వాత కోమాలోకి
వెళ్ళిపోతుంది లక్ష్మి. తర్వాత కోలుకున్నా ఆమె ఇక పాసివ్ పాత్ర.
నాగార్జునకి ప్రత్యర్ధి కాదు. నాగార్జునకి అపరాధ భావం పుట్టుకొచ్చి అంతర్ముఖీనుడై
పోతాడు. బహిర్ముఖంగా తల్లిని ఎదుర్కొంటున్న వాడు, తల్లిని అనారోగ్యం పాల్జేశానన్న
చింతతో తనకి తనే ప్రత్యర్ధి అయి, తనతో తానే అంతర్ముఖీనంగా సంఘర్షించడం మొదలెడతాడు.
ఇలాటి పాత్ర వరల్డ్ మూవీస్ లో, ఆర్టు మూవీస్ లో, గాథల్లో వుంటుంది. కమర్షియల్
మూవీస్ లో కాదు. కమర్షియల్ మూవీస్ లో కథ నడవడానికి బహిర్ముఖంగా, భౌతికంగా, విజువల్
గా వున్న ప్రత్యర్ధితో సంఘర్షిస్తుంది పాత్ర. ఇక్కడ బాహిర్ సంఘర్షణతో మొదలైన నాగ పాత్ర.
అంతర్ సంఘర్షణతో ప్లేటు ఫిరాయించింది. కథ ఎక్కడైనా ఇలా వుంటుందా?
లక్ష్మి ప్రత్యర్ధి హోదా
కోల్పోయాక ఇక సెకండాఫ్ కమర్షియల్ మూవీగా, పైసలొచ్చే లక్ష్మీగా కాకుండా పోయింది. సెకండాఫ్
లో ఆ లక్ష్మి ఈ లక్ష్మి కూడా లేకుండా వెళ్ళిపోయాక ప్రేక్షకులు కూడా వెళ్ళిపోయారు.
లక్ష్మిలో కథకుడు నాగార్జున కోసం మదర్ ని
చూశాడు. అందువల్ల సెంటుమెంటుకి పోయి ఆమెని అయ్యోపాపం అనేలా చేశాడు. కానీ నాగార్జున
పాత్రకి ఆమె మదర్ కాదు. ఆమె పెట్టిన సమస్యతో ఆమెని ఎదుర్కోవాల్సిన ప్రత్యర్ధి. తర్వాత్తర్వాత
ఎలాగూ ఆమెలో మదర్ ని చూస్తాడు, మనసు మార్చుకుంటాడు, అది చివరి దశ సంగతి. నాగార్జున
పాత్ర కోసం కథకుడు ఎందుకు తొందర పడ్డాడు? పాత్ర కోసం తనే కథ ఆలోచిస్తున్నాడు
కాబట్టి. పాత్ర తన కథని తనే ఆలోచించుకుంటుందని మరిచాడు కాబట్టి. ఇలా పాంచ్
పటాకాలోంచి ప్రత్యర్ధిని తీసేసి సెకండాఫ్ ని సెంటిమెంటల్ చేద్దామన్న కథా పథకం
బెడిసి కొట్టింది.
నిజ జీవితాల్లో ప్రత్యర్ధి కళ్ళు తిరిగి పడిపోయి తప్పుకోదా అంటే, కమర్షియల్ సినిమా జీవితంలా వుండదు. జీవితంలో జరగనివి, తమకి అందుబాటులో వుండనివి తెర పైన చూడాలనుకుంటారు కమర్షియల్ సినిమా ప్రేక్షకులు. ఇకపోతే, మొదట ఒక ప్లానుతో మదర్ ని అనారోగ్యం పాల్జేసిన నాగార్జునే మళ్ళీ ఆమెకి ప్రమాదం తలపెడుతూ రెండో ప్లాను అమలు చేయడం ఎలా పాత్రోచితమవుతుందో తెలీదు. ఇది ప్లాట్ పాయింట్ టూ ఘట్టం, ఈసారి ఘోర పరాభవం చేసి వెళ్లి పొమ్మంటాడు రకుల్ తో. మొదటి ప్లానుతోనే కోమాలోకి వెళ్ళిన మదర్ తో మళ్ళీ ఇదేం అన్యాయం? ఆమె మరణాన్ని కోరుకుంటున్నాడా? ఇలా ప్లాట్ పాయింట్ టూ కూడా విఫలమయింది.
ప్లాట్
పాయింట్ వన్, ప్లాట్ పాయింట్ టూలు పరస్పరాధార భూతాలు. అంటే పిశాచాలు కాదు. ఆ సమాసం
అలా వుంది. ప్లాట్ పాయింట్ వన్ కథలో పుట్టిన సమస్య అయితే, ప్లాట్ పాయింటూ ఆ
సమస్యకి పరిష్కారం. ప్లాట్ పాయింట్ వన్లో లక్ష్మి పెళ్లి అనే సమస్య పెడితే, ఈ
సమస్యతో ప్లాట్ పాయింట్ టూలో ఇంకా మారని నాగార్జునకి ఎదురు దెబ్బ తగలాలి, తను
లక్ష్మిని దెబ్బ తీయడం కాదు. తనే దెబ్బతిని దారికి రావాలి.
వరల్డ్ మూవీస్ కి ఎమోషన్లు తప్ప లాజిక్ వుండదు. కానీ నిత్యజీవితాల్లో కుటుంబ సంబంధాల్లో లాజిక్ ని కూడా చూసి ప్రవర్తించే ప్రేక్షకులు- ఇలా రెండో సారి మదర్ మీద మానసిక దాడిని తప్పకుండా నిరసిస్తారు.
నాగార్జున కోసం లక్ష్మిలో మదర్ ని చూసిన కథకుడే చివరికి ప్రత్యర్ధిని చూశాడు, సంతోషం. కానీ ఆమె మీద రెండో దాడి అనేది అసందర్భం, అర్ధరహితం. ప్లాట్ పాయింట్ టూలో దెబ్బ పడాల్సింది ఇంకా మారని నాగార్జున మీద. ప్లాట్ పాయింట్ టూ రగులుతున్న సమస్యకి పరిష్కార ప్రాంగణం. కథ అన్నాక దానికో అనుక్రమణిక వుంటుంది, అప్పుడే అది దివ్యమైన కళ అన్పించుకుంటుంది.
మన్మథుడు
- 2 అయ్యింది ఫ్లాప్ కాదు, ఆత్మ బలిదానం చేసుకుంది. చేసుకుంటూ దృశ్యాత్మక ఆధారాలు ఇచ్చి
పోయింది... రోమాంటిక్ కామెడీల్లో హీరోహీరోయిన్ల మీద కథ వుంటే వాళ్ళే ప్రత్యర్ధులు.
రోమాంటిక్ కామెడీని ఇంటర్వెల్ నుంచి ఏదో ఫీలైపోతూ రోమాంటిక్ డ్రామాగా మార్చారా, ఇక
పాంచ్ పటాకా పేలదు. ఒక ప్రత్యర్ధి లేకపోయాక
ఆ సెకండాఫ్ డిటో లక్ష్మీ విహిత మన్మథుడు టూ అవుతుంది. రోం కాం అంటూ అందులో రోం డ్రాంని తెచ్చి దూర్చడమెందుకు? రెండు డ్రాములు పట్టించి ఫుల్ రేంజి రోమ డ్రామా తీస్తే సరి.
―సికిందర్