రివ్యూలు, సాంకేతికాలు, స్క్రీన్ ప్లే సంగతులు...

టికెట్లు దొరకడం యోగం, సినిమాలు చూడడం భోగం, రివ్యూలు రాయడం రోగం!

Friday, August 10, 2018

671 : స్క్రీన్ ప్లే సంగతులు




       నిర్మాతలు పెట్టుబడి కథ మీద పెట్టాలా, పాయింటు మీద పెట్టాలా? హాలీవుడ్ లో సెన్సేషనల్ పాయింటు మీదే పెడతారు, కథ మీద కాదు. మార్కెట్ లో అమ్ముడుబోయే పాయింటునే కొంటారు, దాన్నే ప్రేక్షకులకి అట్టహాసంగా అలంకరించి అమ్ముతారు. ముందు కాన్ఫ్లిక్ట్ (పాయింట్) ఏమిటాని అడుగుతారు, అందులో కలెక్షన్స్ కన్పిస్తూంటే అప్పుడు కథేమిటో చూస్తారు. ‘హీరోకి కోటి రూపాయల లాటరీ తగిల్తే టికెట్ చించి పారేశాడు సర్!’  అని రచయిత క్రేజీగా పాయింటు చెప్పాడనుకుందాం, ‘కోటి రూపాయలు తగిల్తే చించి పారేశాడా? భలే వుందే, స్క్రిప్టు పంపు!’ అంటాడు ఎగ్జిక్యూటివ్ వెంటనే. ‘లవర్స్ చిన్నమాట తేడా వచ్చి విడిపోయారు సర్’ అని రచయిత టాలీవుడ్ తమాషా చెప్పాడనుకుందాం, ‘బొంద కాదూ, అందులో డాలర్స్ ఎక్కడ కనబడి చస్తున్నాయ్?’ అని సినిమా ఫీల్డుకి కొత్త పిచ్చోడిలా వున్నాడని, అసమర్ధుడని విరక్తిగా చూస్తాడు ఎగ్జిక్యూటివ్. అక్కడ కథంటే బిజినెస్సే. బిజినెస్ ఆలోచించే వాడే ప్రొఫెషనల్ రచయితా, దర్శకుడూ. ఏవో కవిత్వాలూ క్రియేటివిటీలూ తర్వాత. ముందు బిజినెస్ ఆలోచిస్తారు. రచయితలు ఏ కాన్ఫ్లిక్ట్ కి బిజినెస్ వుంటుందా ఆలోచిస్తూనే, పరిశోధిస్తూనే నెలలు గడిపేస్తారు. రచయితలూ పాయింటుని అమ్ముతారు, నిర్మాతలూ పాయింటునే కొంటారు. పాయింటుకుండే ప్రాముఖ్యం అంతటిది. దీన్నే ప్లాట్ పాయింట్ ఏమిటి, లేదా వాట్ ఇఫ్ (ఇలా జరిగితే?) ఫ్యాక్టర్ ఏమిటని కూడా టెక్నికల్ గా అడుగుతారు. రచయితల తరపున ఏజెంట్లు పిచింగ్ చేసినా పాయింటునే మార్కెటింగ్ చేస్తారు. అంతేగానీ ఈ రచయిత దగ్గర మంచి కథ వుందని ఎక్కడా సిల్లీగా చెప్పరు. అలా చెప్తే ప్రొఫెషన్ తెలియని వ్యక్తి అయిపోతారు. కథెవరిక్కావాలి? కథలూ, స్క్రీన్ ప్లేలూ, మాటలూ మురిపాలూ తర్వాత. ముందు కథకి పాయింటు విలువ తెలియని వాడు, హాలీవుడ్ బిజినెస్ మోడల్ తెలియని వాడు, ఏం రాసినా ర్యాగ్ పికర్ కూడా అవతల పారేస్తాడు.

        ‘శ్రీనివాస కళ్యాణం’ తో ఇదే జరిగింది. అనేక సినిమాల్లో జరుగుతోంది. పాయింటుని అమ్మాలనుకోకపోవడం. పాయింటు విలువని గుర్తించాలనుకోక పోవడం. కథ సంగతి తర్వాత, ముందుగా ఒక ఆకర్షణీయమైన, అర్ధవంతమైన, బలమైన పాయింటని ప్రేక్షకుల ముందు, వంద రూపాయల టికెట్టుకి సరిపడా అమ్మకానికి పెట్టాలనుకోకపోవడం. పాయింటు అంటే ఐడియానే. ఏ ఐడియా కమర్షియల్ గా భిన్నంగా వుంటుందాని ఆలోచించకపోవడం. ఐడియా దగ్గర్నుంచీ రాయలేక పోవడం. మూడంకాలతో పటిష్టంగా ఐడియాని నిర్మించుకోవాలనుకోక  పోవడం. మధించాలనుకోక పోవడం. ఎంత కాలమైనా సరే, స్ట్రక్చర్ లో ఐడియా కుదిరే వరకూ ఐడియా మీదే పని చేయాలనుకోక పోవడం. ఐడియా రీసెర్చిని కోరితే, ఆ రీసెర్చి క్షుణ్ణంగా చేయాలనుకోక పోవడం. కొత్త ఐడియా అని చెప్పి ప్రేక్షకులకి తప్పుడు సమాచారమివ్వకూడదనుకోక పోవడం. లోపభూయిష్ట ఐడియాకి స్క్రిప్టు రాసేసి, నిర్మాతల చేత పెట్టుబడులు పెట్టించకూడదనుకోక పోవడం.

     కథకి పాయింటు, కాన్ఫ్లిక్ట్, వాటిఫ్ ఫ్యాక్టర్, సమస్యా ఇవన్నీ ఒకటే. ఐడియాకి పర్యాయ పదాలే. ఇది ప్లాట్ పాయింట్ వన్ దగ్గర ఏర్పాటవుతుంది. అక్కడే కథని పుట్టించి, మొదటి మూల స్థంభాన్ని నిర్మిస్తుంది. రెండో మూల స్థంభం ప్లాట్ పాయిట్ టూ దగ్గర సమస్యకి పరిష్కార మార్గంగా ఏర్పాటవుతుంది. స్క్రీన్ ప్లే అనే చలనచిత్ర సౌధం ఈ రెండు మూల స్థంభాల మీదే నిలబడుతుంది. మొదటి మూల స్థంభం బలంగా లేకపోతే, రెండో మూల స్థంభం కూడా బలంగా వుండదు. అంటే క్లయిమాక్స్ హాస్యాస్పదంగా మారుతుంది. మొత్తం స్క్రీన్ ప్లే సౌధం కుప్పకూలుతుంది. 

          మొదటి మూల స్థంభం మొత్తం కథకి డీఎన్ఏ లాంటి ఐడియాని సరఫరా చేసే ప్రధాన కేంద్రం. ఇది అయోమయంగా, లోపాలమయంగా పుచ్చిపోయి వుంటే,  మిగతా వ్యవహారమంతా కూడా పుచ్చి పోతుంది. ఇందులో ఎలాంటి సందేహలవసరం లేదు. ఎంత సూపర్ స్టార్ అయినా ఏమీ చేయలేడు. ‘బ్రహ్మోత్సవం’ లో చూశాం, ఇప్పుడు ‘శ్రీనివాస కళ్యాణం’ లో చూస్తున్నాం. ఈ రెండిటి ఇంకో సమస్య ఏమిటంటే, వీటి పాయింటుల్లో అసలు యూత్ అప్పీల్ అనేదే లేకపోవడం. మార్కెట్ యాస్పెక్ట్ నే ఆలోచించకపోవడం. మొదటిది ఏదో ఏడుతరాల బంధువుల్ని వెతికే పాయింటైతే, రెండోది పెళ్లి సాంప్రదాయాలు నేర్పే పాయింటు. రెండూ యూత్ కే మాత్రం పట్టని, వాళ్ళు ఏ కోశానా కోరుకోని, వెనకటి తరం ప్రేక్షకులతో అరిగిపోయిన, ఇప్పుడు బిజినెస్ ని హుళక్కి చేసే పాయింట్లు. యూత్ అప్పీల్ లేని వయసు ముదిరిన పాయింట్లు. యూత్ కి నునులేత, కోడె గిత్తలా దూకే పాయింట్లు కావాలి. 

          ఓ పెద్ద మనిషికి ఓ కుర్రోడు పెళ్లి సాంప్రదాయాలు నేర్పడం కోడెగిత్తలా దూకే పాయింటవుతుందా? అసలిప్పుడు ఇంకా పెళ్లి సాంప్రదాయాల పాయింటుకి మార్కెట్ విలువుందా? అలాటి పెళ్లి సాంప్రదాయాల పాయింటే చెప్పాలనుకుంటే, ప్రయోగాలకి సిద్ధపడాలి. ఒక క్రేజీ ప్రాజెక్టుకి నడుం కట్టాలి. ప్రయోగాల్ని ప్రేక్షుకుల మీద రుద్దవచ్చు, కాలం చెల్లిన పాయింట్లని కాదు. కథా కాలాన్ని ఓ నలభై- యాభై ఏళ్ల వెనుక  ఏర్పాటు చేసి, అప్పట్లో పెళ్ళిళ్ళు ఎలా జరిగేవో, అప్పటి అన్ని సాంప్రదాయాలూ ఆచారాలూ సహా, అప్పటి మనుషుల ఆనందాలు సహా, ఉమ్మడి కుటుంబాలు సహా, కడు మధురంగా ఈతరం ప్రేక్షకులకి - క్రేజీ ప్రాజెక్టుగా సినిమా తీసి పరిచయం చేయవచ్చు. వీలయితే ‘సీతారాముల కళ్యాణము చూతము రారండి’ పాట కూడా అప్పట్లో పెళ్ళిళ్ళలో ఎలా మార్మోగేదో ఈతరం ప్రేక్షకులకి చూపించవచ్చు. గొప్ప నాస్టాల్జియాతో పీరియడ్ ఫిలింని (ఫిలిం లేదిప్పుడు) సృష్టించవచ్చు. అలాటి గొప్ప గొప్ప పెళ్ళిళ్ళ  వైభవాల్ని ఇప్పుడెలా కోల్పోయామో, తులనాత్మకంగా చూపిస్తూ చెబితే, యువతరం ఆలోచనలో పడవచ్చు. అప్పుడది యూత్ అప్పీలున్న, మార్కెటబిలిటీ వున్న పాయింటు అయ్యే అవకాశముంటుంది.

***
      అంతేగానీ, ఈ కాలపు పాత్రలతో, గ్లోబలైజ్డ్ అయిన యువ పాత్రలతో, ఈ కాలపు కథ చూపిస్తూ, ఒకప్పటి కాలపు గొప్పలు జొప్పిస్తే జీర్ణమై చావదు. ఏంట్రా ఈ సుత్తి అని విసుక్కుంటారు. ‘శంకరా భరణం’ శంకర శాస్త్రి పాప్ సంగీతాన్ని ద్వేషించలేదు. శాస్త్రీయ సంగీతం తెలిసిన తను పాప్ సంగీతం తనకి కరతలామలకమని, మంచినీళ్ళ ప్రాయమనీ అదే పాప్ గీతమందుకుని, గేలి చేసిన కుర్రాళ్ళ నోళ్ళు మూయిస్తాడు. ఇది నాలెడ్జి వినిమయం. శంకరశాస్త్రి తన నాలెడ్జితో తన కాలంలోనే బెల్లం కొట్టిన రాయిలా వుండిపోలేదు. కొత్త తరంతో పాత సాంప్రదాయాల వాదనలు పెట్టుకోలేదు. పాత నాలెడ్జిని కొత్త నాలెడ్జిలోకి  ప్రవహింపజేస్తూ (వినిమయం), దారీతెన్నూలేని కొత్త నాలెడ్జిని అర్ధవంతంగా మార్చాడు. కానీ ‘శ్రీనివాస కళ్యాణం’ లో నానమ్మ జయసుధ తన కాలంలో తానుండి పోయి, తన కాలపు సంస్కృతీ సంప్రదాయాల్ని ఈ కాలం మీద రుద్దాలన్నదుగ్ధతో – నాలెడ్జి వినిమయానికి దూరంగా వుండిపోయింది. డెబ్బై ఏళ్ల జీవితాన్ని చూస్తున్నానంటుంది. కానీ తన నాలెడ్జితో తనకి వూహ తెలిసిననాటి జీవితం దగ్గరే ఆగిపోయానని తెలుసుకోవడం లేదు. డెబ్బై ఏళ్ల జీవితంలో మారుతున్న అన్ని కాలాల ప్రవాహాలూ లేవా? శంకరశాస్త్రి సంధి కాలంలో ఇరుక్కోలేదు. జయసుధ గారు ఇరుక్కుపోయారు. కాలానికి హద్దుల్లేవు. ఆలోచనలకి హద్దు లేర్పరచుకుని, కాలంలో ఎక్కడో ఘనీభవించుకు పోతారు. వర్తమాన కాలాన్ని నిరసిస్తూ, వర్తమాన కాలపు కొత్త సౌఖ్యాలని అనుభవిస్తారు. 

          ఓ అపరాత్రి ఏమున్నాయా అని యూట్యూబ్ సర్ఫింగ్ చేస్తూంటే, బాలీవుడ్ గీత రచయిత జావేద్ అఖ్తర్ ప్రసంగం కన్పించింది. ఆయన పాతనీ కొత్తనీ మేళవించి చెప్తూంటే ఒకటే చప్పట్లు కొడుతున్నారు సభలో వున్న యువ ప్రేక్షకులు. ఇవాళ్టి పాట ఏమైంది, అవాళ్టి పాట ఇంకా ఎలా బతుకుతోందీ వివరిస్తూంటే, జోకులేస్తూంటే, ఘోల్లున నవ్వూలూ చప్పట్లూ. ఛానెల్స్ లో ఇండియన్ ఐడల్ లాంటి కార్యక్రమాల్లో పాడే కుర్రకారు ఎందుకు లతా, ఆశా, రఫీ, కిషోర్, ముఖేష్, మన్నాడే పాటలే పాడుతున్నారు- ఆ తర్వాతి తరం కొత్త పాటలెందుకు పాడ్డం లేదన్న ప్రశ్నకీ విశేష స్పందన. కాబట్టి కుర్రకారు పాతని  వదిలేసుకోరు. వాళ్ళకి తగిన వేదిక, అవకాశం లభిస్తే పాతనే  బైటికి తీస్తారని, దాన్ని బతికిస్తారనీ హామీ ఇచ్చారు. 

    అంతేగానీ పెద్దతరం పెత్తనం చేసి, కొత్తతరం పతనమై పోతున్నారని, పాతదాన్ని పాతరేస్తున్నారని, చించి పోగులెడుతున్నారనీ, వాళ్ళ నెత్తిన పాత అభిరుచులు రుద్దితే, తలంటు పోస్తే, వికర్షిస్తుంది కొత్త తరం. కొత్త తరానికి పాత దానితో సంబంధం వాళ్ళు నమ్మే దేవుడితో వుండే ఆత్మిక సంబంధం లాంటిది. అదెప్పుడు ఫీలవ్వాలి, ఎలా ఫీలవ్వాలి వాళ్ళకి తెలుసు. వాళ్ళు కూడా నిలువునా ఆత్మ నిబిడీకృతమైన అందరిలాంటి మనుషులే, మర మనుషులు కాదు. సినిమానీ, సంగీతాన్నీ, రచననీ కనుక్కున్నది కొత్తోళ్ళు కాదు, పాతోళ్ళే. ఆ మౌలిక విలువలు తరం నుంచి తరానికి వాటికవే ప్రవహిస్తాయి. ప్రతీదీ విద్యుత్ వలయంలా సర్క్యులేట్ అయ్యేదే. వలయంలోనే ప్రకృతి తిరుగుతుంది.

***
          ఇలా ‘శ్రీనివాస కళ్యాణం’ కథలో పాత్రల మధ్య పరిష్కరించడానికి ఏర్పాటు చేసిన సమస్యలో (పాయింటులో) ఇవన్నీ ఉపరితల సమస్యలు. ఇక సమస్యలోకి తొంగి చూస్తే చెప్పనవసరం లేదు. ఓ పల్లెటూళ్ళో సాంప్రదాయ ఉమ్మడి కుటుంబానికి చెందిన నితిన్, నగరంలో బిగ్ షాట్  ప్రకాష్ రాజ్ కూతురు రాశీ ఖన్నాని ప్రేమించి పెళ్లి ప్రతిపాదన చేస్తాడు. ప్రకాష్ రాజ్ కూతురి మాటలకి విలువిచ్చి ఒప్పుకుంటాడు. కానీ నితిన్ తో అహం అడ్డొచ్చి ఒక కండిషన్ పెడతాడు. తన పెద్దకూతురి విడాకుల కేసు తెగడం లేదు కాబట్టి, రేపొకవేళ నితిన్ తో కూడా ఇలా జరక్కుండా వుండేందుకు, వెంటనే విడాకులై పోయేందుకు, ప్రీ మారిటల్ అగ్రిమెంట్ మీద సంతకం పెట్టమంటాడు. ప్రీ మారిటల్ అగ్రిమెంట్ అమెరికాలో వుందనీ, ఈమధ్యే ఇండియా కొచ్చిందనీ అంటాడు. 

       ఇదెలా వుంటుందంటే, ఇదేదో వెర్రితలలేసిన విదేశీ విపరీత పోకడ అన్నట్టుగా నెగెటివ్ అర్ధంలో – ప్రీ మారిటల్ అగ్రిమెంట్ అని పెద్ద పెద్ద అక్షరాలేసి, క్లోజప్ లో కంగారు పెట్టించే ప్రయత్నం చేస్తారు. ఇదే బ్రహ్మాండమైన ప్లాట్ పాయింట్ వన్ మలుపన్నట్టుగా చిత్రిస్తారు. ఈ పాయింటునే ప్రేక్షకులకి అమ్మకానికి పెట్టినట్టుగా బిల్డప్ ఇస్తారు. కథంటే ఆర్గ్యుమెంట్ కాబట్టి, ఈ పాయింటుతో పాత్రల మధ్య ఆర్గ్యుమెంట్ ని రగిలించి, వాళ్ళ తప్పొప్పుల నిగ్గు తేల్చబోతున్నట్టుగా ఇంటరెస్ట్ క్రియేట్ చేస్తున్నట్టు - ప్రేక్షకులతో కనెక్ట్ అవబోతారు.  

          కానీ ఇలా ప్లాట్ పాయింట్ వన్ లో ఇన్ని లాభాలు చేకూరుస్తుందని సృష్టించిన సమస్యలోకి ఒకసారి తొంగి చూస్తే, అంతా డొల్ల అని తెలిసిపోతుంది.

          పెళ్ళికి ముందే విడాకుల పత్రాల మీద సంతకాలు పెట్టమనడం. ఇదీ పాయింటు. ఈ సమాచారం ఎక్కడ దొరికిందో గానీ, ఈ సీనులో చెప్పినట్టుగా అమెరికాలో ఇలాటిదేమీ లేదు. ప్రీ మారిటల్ అగ్రిమెంట్ అంటే విడాకుల పత్రాల మీద సంతకాలనే విధానం అక్కడ లేదు. ఒకవేళ విడిపోవాలనుకుంటే ఆస్తి పంపకాలేమిటి, పిల్లల పెంపకాలేమిటి మొదలైన వాటి గురించే ప్రీ మారిటల్ అగ్రిమెంట్ వుంటుంది. ఇది వధూవరులిద్దరి సమక్షంలో జరుగుతుంది. ఒకరి పరోక్షంలో థర్డ్ పార్టీ అగ్రిమెంట్ చెల్లదు. ఇదసలు ముందస్తు విడాకుల ఒప్పందం కూడా కాదు. 

          ఇక ప్రీ మారిటల్ అగ్రిమెంట్ ఈ మధ్యే అమెరికాలో చూసి ఇండియాకి వచ్చిందంటాడు ప్రకాష్ రాజ్. కానీ ఇది ఇండియాలో ఎప్పట్నించో వుంది. కావాలంటే గూగుల్ చేసుకోవచ్చు. బోలెడు పాత కేసులు కనబడతాయి. కాబట్టి ప్రీ మారిటల్ అగ్రిమెంట్ అర్థాన్నే మార్చేసి, ముందస్తు విడాకుల పత్రమనడం సరికాదు. అలాటి ఒప్పందాన్ని నితిన్ కూడా అంగీకరించ కూడదు. అతను సంస్కృతీ సాంప్రదాయాలకి కాణాచి అయిన నానమ్మ ప్రతినిధి.  పెళ్లిని పవిత్ర కార్యంలా భావిస్తాడు. అందులో ఇలాటి అపశకునానికి చోటివ్వకూడదు. తిప్పి కొట్టాలి. అప్పుడే పాత్ర తత్త్వమన్పించు కుంటుంది. 

          కానీ సంతకం పెట్టడానికి సిద్ధపడుతూ, తనొక కండిషన్ కూడా పెడతానంటాడు. పెళ్ళిలో ఒక తండ్రిగా సాంప్రదాయాలనుసారం ప్రకాష్ రాజ్ నడుచుకోవాలంటాడు. పెళ్లి తన వూళ్ళో ఒక ఉత్సవంలా  కొన్ని రోజుల పాటు జరుగుతుందనీ, అన్ని రోజులూ ప్రకాష్ రాజ్ అక్కడుండాలనీ అంటాడు. ప్రకాష్ రాజ్ కి అసలు సాంప్రదాయాలూ, పూజా పురస్కారాలూ, ముహూర్తాలూ అంటే వొళ్ళు మంట. టైంవేస్ట్ అనుకుంటాడు. టైంని డబ్బుతో కొలిచే మహా బిజినెస్ మాగ్నెట్. అలాటిది అతను కూడా నితిన్ కండిషన్ కి ఒప్పుకుంటాడు. 

     ఇక నితిన్ ఆ ప్రీ మారిటల్ అగ్రిమెంట్ అనే విడాకుల కాగితాల మీద సంతకం పెట్టేస్తాడు. అన్నేసి పేజీల్లో ప్రకాష్ రాజ్ ఏమేం ఘోరాలు రాశాడో చదవకుండానే. నితిన్ తన ప్రవచిత పవిత్ర పెళ్లి క్రతువుని మర్చిపోయాడే అనుకుందాం, ఒక చదువుకున్న యూత్ ఫుల్ క్యారెక్టర్ గానైనా, కథకి హీరోగా,  అంత అమాయకంగా విడాకుల కాగితాల మీద సంతకమెలా పెడతాడు? ప్రకాష్ రాజ్ చేతిలో బలిమేక ఐపోడా? ఎప్పుడంటే అప్పుడు ప్రకాష్ రాజ్ బ్లాక్ మెయిల్ చేయడా? బ్రతుకు నరకం చేస్తూ కక్ష తీర్చుకోడా? 

          రెండోది, ఈ అగ్రిమెంట్ సంగతి కూతురికి తెలుసా అనికూడా అడగడు నితిన్. ఆమె సమక్షంలోనే సంతకం పెడతానని కూడా అనడు. ఎందుకని? ఆమెకి తెలియకుండా ఆమె కోసం ఏమైనా త్యాగాలు చేస్తున్నాడా? అలాంటిదేమీ లేదు. ఆమెని పెళ్ళాడి తీరాలన్న యావ కొద్దీ అన్నట్టే సంతకం పెట్టేస్తాడు. 

          ఇదలా వుంచితే, అసలు ప్రకాష్ రాజ్ కి నితిన్ కండిషన్ పెట్టడ మేమిటి...తన స్థాయికాని ఓ పల్లెటూరి మధ్య తరగతి ఉమ్మడి కుటుంబానికి చెందిన నితిన్ ని మాటమాత్రం అనకుండా, అంతేసి బిగ్ షాట్ అయిన ప్రకాష్ రాజ్, కూతుర్నిచ్చి పెళ్లి చేస్తున్నాడంటేనే అతడి ఉన్నతాదర్శం బయట పడుతోంది. అతను ఇక్కడే చాలా కాంప్రమైజ్ అయ్యాడు. కూతురికి ఎలాటి ఉన్నత సంబంధం గురించి కలలు గన్నాడో. కామన్ గై నితిన్ కిచ్చి చేయడానికి సిద్ధపడ్డాడు. చాలా త్యాగం చేశాడు. వీటి ముందు నితిన్ సాంప్రదాయాలెంత! వాటికి  తలొగ్గాలని డిమాండ్ చేయడమేం గొప్ప? 

          ప్రకాష్ రాజ్ సంస్కారం ముందు నితిన్ ఇంటిల్లి పాదీ ప్రాకులాడే సాంప్రదాయాలు వెలవెలబోవా? ఆ మనోభావాలన్నీ క్యాన్సిల్ అయిపోవా? అంటే ఈ కథే వుండకుండా పోదా? మారు మాట్లాడకుండా ప్రకాష్ రాజ్ ఇష్టప్రకారమే పెళ్లి జరిపించుకుని వెళ్లిపోవాలి నిజానికి. ఇంకోటే మిటంటే, పెళ్లి తమ వూళ్లోనే తమ ఇంట్లోనే జరగాలంటాడు నితిన్. మగపెళ్లి వారింట పెళ్లి జరగడం ఏ సాంప్రదాయమో?

     వీళ్ళతో ఎందుకు గోల అనుకున్నాడో ఏమో ప్రకాష్ రాజ్, దానికి కూడా ఒప్పుకుని వాళ్ళింట్లోనే పెళ్లి తంతు వాళ్ళకే వదిలేసి,  ప్రేక్షకుడిలా కూర్చుంటాడు. ప్రకాష్ రాజ్ ఇంటి కొస్తే, బూట్లు తీసి కాళ్ళు కడుక్కుని ఇంట్లోకి వచ్చేలా టార్చర్ పెడతారు. అప్పుడు కూడా సాంప్రదాయపు క్లాసు పీకుతారు. తర్వాత చూస్తే, తామే చెప్పులేసుకుని ఇంట్లో తిరుగుతూంటారు. ప్రకాష్ రాజ్ బంగాళా కెళ్తే, కాళ్ళు కడుక్కుని లోపలి కొస్తాం నీళ్ళి మ్మంటారు. వొళ్ళు మండి పోతూంటుంది ప్రకాష్ రాజ్ కి. 

          నిశ్చితార్ధమప్పుడు, కట్నం గిట్నం అంటూ నసుగుతారు. ప్రకాష్ రాజ్ ఓ లుక్కేసే సరికి సర్దుకుని, ఇద్దరమ్మాయిలుంటే ఒకమ్మాయి ఆస్తి మనోడిదే కదా అని జోకులేసు
కుంటారు.

***
      పాయింటు కొద్దాం. ప్రకాష్ రాజ్ కి ఇచ్చే విడాకుల పత్రాల మీద నితిన్ సంతకం పెట్టడం పాయింటు. ప్రకాష్ రాజ్ కి నితిన్ సాంప్రదాయాల కండిషన్ పెట్టడం కౌంటర్ పాయింట్. ఇది మొదటి మూలస్థంభం. ఇక్కడ కథా ప్రారంభం. మరి కథ ప్రారంభమవడానికి తగిన ఎలిమెంట్లు ఈ పాయింట్స్ లో వున్నాయా? ఇక్కడ పాయింటు భవిష్యత్తులో అమలయ్యే అవకాశమున్నది. అది ప్రకాష్ రాజ్ అస్త్రం. కౌంటర్ పాయింటు తక్షణం అమలయ్యేది. ఇది నితిన్ చేతిలో అస్త్రం. తక్షణం అమలయ్యే కౌంటర్ పాయింటుతోనే కథ నడవాలి, నడిచింది కూడా.

          అయితే మార్కెట్ యాస్పెక్ట్ లో – ఈ కౌంటర్ పాయింటు కి యూత్ అప్పీలుందా? మార్కెటబిలిటీ వుందా? దీంతో బిజినెస్ అవుతుందా? దీన్ని ప్రేక్షకులకి అమ్మగలరా? పై పేరాల్లో ముందే విశ్లేషించుకున్నట్టు - ఓ పెద్ద మనిషికి ఓ కుర్రోడు పెళ్లి సాంప్రదాయాలు నేర్పడం ఏ విధంగానూ సేఫ్ పాయింటే కాదు. ఎలా కాదో పై పేరాల్లోనే సవివరంగా చెప్పుకున్నాం. 

          ఇక క్రియేటివ్ యాస్పెక్ట్ లో చూస్తే – ఇక్కడ తటస్థించిన ప్లాట్ పాయింట్ వన్ లో, నితిన్ కౌంటర్ పాయింటు వేశాడంటే ఏమిటర్ధం? అతడికి గోల్ ఏర్పడిందని అర్ధం. తన పెళ్ళిలో ప్రకాష్ రాజ్ సాంప్రదాయబద్ధంగా నడుచునేట్టు చేసి, అతణ్ణి మార్చెయ్యడం గోల్. అప్పుడీ గోల్ సక్సెస్ అవాలంటే అందులో ఎలిమెంట్స్ ఏవేవి వుండాలి? ఈ బ్లాగులోనే అనేక సార్లు చెప్పుకున్నట్టు – 1. కోరిక, 2. పణం, 3. పరిణామాల హెచ్చరిక, 4. ఎమోషన్.

          కోరిక : గొంతెమ్మ కోరిక. న్యూసెన్స్ చేయకుండా కూతుర్నిస్తున్న ప్రకాష్ రాజ్ ఉన్నతాదర్శమే, నితిన్ ఇంకేమీ కోరకుండా చేస్తోంది. కాబట్టి ఇంకా కోరికకి స్థానం లేదు. మొదటి ఎలిమెంట్  ఆవిరై పోయింది. 

          పణం : ప్రకాష్ రాజ్ ని మార్చడానికి నితిన్ దేన్ని పణంగా పెడుతున్నాడు? జీవితాన్నా? తను నమ్మిన సాంప్రదాయాల కోసం దేన్ని పణంగా పెడుతున్నాడు? దేన్నీ  లేదు. మొదటి ఎలిమెంట్ కోరికే క్యాన్సిలై నప్పుడు, ఆ కోరికకు కారణమైన సంప్రదాయాల వాదమే అప్రసుతమైపోయింది. దీంతో పణం కూడా అప్రస్తుతమైపోయింది. రెండో ఎలిమెంట్ కూడా ఆవిరైపోయింది. 

          పరిణామాల హెచ్చరిక :  ప్రకాష్ రాజ్ తో సాంప్రదాయాల చెలగాటంలో ఉత్పన్నమయ్యే అపాయాలేమిటి? పరిణామా లేమిటి? చూసి చూసి మంట రేగిపోయి ప్రకాష్ రాజ్ విడాకుల పత్రాలు పైకి తీసి నితిన్ పీచమణుస్తాడా? అప్పుడు పెళ్ళాగి పోతుందా? పెళ్ళే జరక్కుండా ప్రకాష్ రాజ్ అస్త్రాన్నేం చేసుకుంటాడు? దాంతో అతనే అల్లరవుతాడు. ఛీత్కారాలు పొందుతాడు. కాబట్టి ఆ అస్త్రాన్ని తీయడు. కాబట్టి నితిన్ కి రానున్న పరిణామాల హెచ్చరికేమీ లేదు. మూడో ఎలిమెంట్ కూడా ఆవిరి.

          ఎమోషన్ : పై మూడూ లేనప్పుడు ఎమోషన్ ఎక్కడిది?
          ఇలా గోల్ ఎలిమెంట్స్ నాల్గూ లుప్తమైనప్పుడు నితిన్ చేసేదేమిటి? అందుకే ఈ ఇంటర్వెల్ తర్వాత సెకండాఫ్ లో నిర్లిప్తంగా వుండిపోయాడు. అంటే పాసివ్ గా మారిపోయాడు. కథానాయకుడి బాధ్యత కోల్పోయాడు. మంచిదో చెడ్డదో, ఏర్పాటైన పాయింటుకి హీరో అనే వాడు బ్రాండ్ అంబాసిడర్ అవుతాడు. తన పాయింటుని ముందుకి నడిపించే కార్యశూర్యు డవుతాడు. ఇదేమీ కన్పించదు. 

      ప్లాట్ పాయిట్ వన్ దగ్గర ఒక పాయింటుతో కథ పుట్టిందంటే, మిడిల్ ప్రారంభమైనట్టే. మిడిల్ బిజినెస్ ప్రకారం ప్రధాన పాత్ర, ప్రత్యర్ధి పాత్రల మధ్య గోల్ కోసం యాక్షన్ రియక్షన్లతో సంఘర్షణ మొదలయినట్టే. ఇంతకంటే ఇంకేమీ జరగాల్సిన అవసరం లేదు. నితిన్ కి గోలే సరిగ్గా ఏర్పాటు కానప్పుడు, ప్రకాష్ రాజ్ తో ఇంకేమని సంఘర్షిస్తాడు. ఓ రెండు చోట్ల ప్రకాష్ రాజ్ టైముకి రాకపోతే వెళ్లి ఆ అడ్డంకుల్ని క్లియర్ చేస్తాడు తప్ప. 

          ఇక మిగతా విషయాల్లో నితిన్ పరివారమే ప్రకాష్ రాజ్ ని సాంప్రదాయాల్లో కలుపుకు
పోతూంటారు. ఇలా మిడిల్ బిజినెస్ ధర్మం కూడా ఆవిరైపోతుంది. అంతా నితిన్ పరివారపు పెళ్లి పనులూ, వాటికి పేరుపేరునా సాంప్రదాయాల నామకరణాల ప్రదర్శనగా సాగిపోతుంది.
ఏది కథ? ఏది నేపధ్యం? కథకి ఏది అవసరం? నేపధ్యమా? కథానాయకుడి కర్యశూర్య
త్వమా? ఇక్కడ పెళ్లి పనుల నేపధ్యమే కథై పోయి, కథతో వుండాల్సిన కథానాయకుడు నేపధ్యంలో కెళ్ళిపోయాడు! గోల్లేని హీరో గల్లంతే కదా?
          కౌంటర్ పాయింటుతో మార్కెట్ యాస్పెక్ట్ అలా వుంటే, క్రియేటివ్ యాస్పెక్ట్ కూడా ఇలా వుంది.
***

          ఇక విడాకుల అగ్రిమెంట్ పాయింటు గురించి. దీని మార్కెట్ యాస్పెక్ట్ ఎలా చెడిపోయిందో పైనే చెప్పుకున్నాం. ప్రేక్షకులు కన్విన్స్ అవ్వని పాయింటు. ప్రకాష్ రాజ్ రైటే, నితిన్ రాంగ్. తానేదో నమ్మే పెళ్లి పవిత్రతని పక్కన పెట్టి సంతకం పెట్టాడు. నైతికంగా దిగజారాడు. ప్రకాష్ రాజ్ హింసించి, బలవంతంగా సంతకం పెట్టించుకో లేదు. నితిన్ స్వచ్ఛందంగా సంతకం పెట్టాడు. మార్కెట్ యాస్పెక్ట్ కి చాలా బ్యాడ్. ఈ పాయింటుని ప్రేక్షకులకి అమ్మలేరు. 

          క్రియేటివ్ యాస్పెక్ట్ చూస్తే, కథలో ఈ పాయింటుకి స్థానం లేదు. ఈ అగ్రిమెంట్ సెటప్ అనేది కథలో పే ఆఫ్ అయ్యేది కాదు, అమలయ్యేదీ కాదు. పెళ్లి జరిగి, సంసారమేదో చేసుకుంటూ వుంటే, ఆ సంసారాన్ని చెడగొట్టడానికైతే పాయింటుకి స్థానం వుంటుంది. ఈ కథకి పెళ్ళే ముగింపు అయినప్పుడు, ఆ తర్వాత ప్రేక్షకుల్ని బయటికి పంపేసినప్పుడు, సంసారం కథ ఇక లేనట్టే. ఒకవేళ పెళ్లి చేసుకున్న పాత్రలు ప్రేక్షకులు వెళ్ళిపోయాక థియేటర్లో సంసారం చేసుకుంటూ వుంటే, ప్రకాష్ రాజ్ విడాకుల పత్రాలతో దుమారం రేపుతూంటే, అది ప్రేక్షకులు చూసే అవకాశం లేదు. కాబట్టి వున్నకథలో ఈ పాయింటుకి పౌరసత్వం లేదు. బంగ్లాదేశ్ పంపాల్సిందే. 

          ఇంటర్వెల్లో ఈ పాయింటుని ఏర్పాటు చేశారు. అప్పుడు ఇంటర్వెల్ తర్వాత పెళ్లి జరిగి సెకండాఫ్ కాపురం కథగా నడిస్తే, ఈ పాయింటుకి ప్లే అయ్యే అదృష్టం దక్కుతుంది. కథకావల ఎప్పుడో జరిగే అవకాశమున్న పాయింటుని సృష్టించి కథ నడడం సాధ్యం కాదు. కథకావల కాదు, కథలోనే క్లయిమాక్స్ లో పెళ్ళిపీటల మీద ఈ పాయింటే ప్లే అయింది కదా అనొచ్చు. నిజమే, అయితే ఎంత న్యాయంగా ప్లే అయిందో చూద్దాం. 

          సడెన్ గా నితిన్ కి పెళ్లి పీటల మీద అంతర్మథనం మొదలవుతుంది. తను విడాకుల పత్రాల మీద సంతకం చేశాడన్న విషయం దాచి అందరికీ ద్రోహం చేస్తున్నాడని. ఇలాటి బుద్ధితో పవిత్రమైన పెళ్లి పీటల మీద, సప్తర్షులు కొలువుదీరే కళ్యాణ మంటపంలో ఎలా పెళ్లి చేసుకోను? అని వాపోతాడు. ఒక్కో పెళ్లి మంత్రం చదువుతూ, మంత్రాలలా చెప్తూంటే,  ఇలాటి మనసుతో ఎలా తాళి కట్టను? అని కన్నీళ్లు పెట్టుకుంటాడు. 

          ఎవరూ ఎందుకు సంతకం పెట్టావని అడగరు, అతనూ చెప్పడు. చెప్పడానికి కారణం లేదు. వుంటే చెప్పుకునేది కాదు. ఎందుకు సంతకం పెట్టి వుంటాడో పై పేరాల్లోనే చెప్పుకున్నాం. దురదృష్టమేమిటంటే, ఆ సంతకం ఎందుకు పెడుతున్నాడో అప్పుడే ఏదో విధంగా తెలియజేయలేదు కథకుడు. దాటవేశాడు. అలాంటప్పుడు పాత్ర మనసులో ఏముందో ఎవరికెలా తెలుస్తుంది? అందుకే  హీరోయిన్ని పెళ్లి చేసుకుని కులకాలన్నఏకైక యావ కొద్దీ సంతకం పెట్టాడని అనుకోవాల్సి వస్తోంది.

          చెప్పుకుంటే ఇప్పుడా యావ గురించి చెప్పుకోవాలి. అందుకే ఎవరిచేతా సంతకం ఎందుకు పెట్టావని అడిగించలేదు కథకుడు. తెలివైన వాడు. సంతకం పెడుతున్నప్పుడు గుర్తుకు రాని సత్సాంప్రదాయాలు ఇప్పుడు గుర్తొచ్చాయా? సరే, అప్పుడేదో తప్పు చేశాడు, ఇప్పుడు దిద్దుకుంటున్నాడుగా అనొచ్చు. సత్సాంప్రదాయాలు తెలియని వాడు అప్పుడు తప్పు చేయవచ్చు, ఇప్పుడు కొత్తగా తెలుసుకుని తప్పు దిద్దుకోవచ్చు. ఈ క్యారక్టరైజేషన్ బావుంటుంది. అంతేగానీ, సత్సాంప్రదాయాలకే ఒక బ్రాండ్ అంబాసిడరైన వాడు తప్పు చేస్తాడా, అదిప్పుడే తెలుసుకుని దిద్దుకుంటాడా? బ్రాండ్ అంబాసిడర్ కాదు, గ్రాండ్ మాస్టర్. ఎందుకంటే, నితిన్ పాత్ర చిత్రణ తెలియకుండా ఇలా జరిగిపోయింది.

          ఎలాగంటే, క్లయిమాక్స్ లో నితిన్ పెళ్లి మంటపంలో విడాకుల పత్రాల్నివెల్లడి చేస్తూ తన ద్రోహం గురించి ప్రాయశ్చిత్తపు డైలాగులు చెప్తూంటే, ఎలాటి సెన్స్ వెళ్తూందంటే - ఇతను సంతకం పెట్టినప్పుడే ఇదంతా ప్లాన్ చేశాడనీ, ముందైతే సంతకం పెట్టేద్దాం, పెళ్లి సమయంలో దీన్ని రట్టు చేసి ప్రకాష్ రాజ్ ని ఇరికించేద్దాం, ఇక పెళ్లి చేసుకుని అవతల పడదాం – అనుకున్నట్టుందనీ అన్పిస్తుంది. దొంగాటకమాడుతున్నాడనే సెన్సే వెళ్తుంది. అదీ మళ్ళీ తను పెళ్లి పవిత్రత గురించి అంత చెప్తున్న మంటపం దగ్గరే!  
          పాయింటు కాని పాయింట్లు పెట్టుకుంటే ఇలాగే తప్పు మీద తప్పు చేసుకు పోవాల్సి వుంటుంది. ఏదీ నమ్మదు మార్కెట్.

***
          యథా ప్లాట్ పాయింట్ వన్, తథాప్లాట్ పాయింట్ టూ – ఇవి మారని స్క్రీన్ ప్లే శాస్త్రపు శిలాక్షరాలు. ఒక సినిమా జాతకమేమిటో అడ్డాల నాడే చెప్పవచ్చు. గడ్డాలు పెంచుకుని నెలల తరబడీ రాసి రాసి, తీసి రిలీజ్ చేసుకుని చూసుకునే దాకా ఆగనవసరం లేదు. ఓ మూడు లైన్ల అయిడియా వచ్చినప్పుడే దాని మార్కెట్ యాస్పెక్ట్, క్రియేటివ్ యాస్పెక్ట్ రెండూ క్షుణ్ణంగా ఎనాలిసిస్ చేసుకుని తెలుసుకోవచ్చు. కానీ ఎవరి కవసరం ఎనాలిసిస్ లు? వూరికే రివ్యూలు రాసుకోవడానికి అవసరం. స్క్రిప్టులు రాసే కథకుల కవసరం లేదు. వాళ్లకి ఇట్టే మ్యాజిక్కులు జరిగిపోతాయి. కథల్ని అమ్మాలి గానీ, పాయింట్లేమిటి? నాన్సెన్స్! విత్తనం లేకుండా చెట్టుని మొలిపించగలరు.

సికిందర్

Wednesday, August 8, 2018

670 : స్క్రీన్ ప్లే సంగతులు


       ‘సంజు’ ఫస్టాఫ్ డ్రగ్స్ కథలో (ఫ్లాష్ బ్యాక్ -1) డ్రగ్స్ మరిగిన సంజు పరిస్థితి తండ్రికి తెలియడం (ప్లాట్ పాయింట్ వన్) వరకూ చెప్పుకున్నాం. ఇక్కడ కొడుకుని సంస్కరించే బాధ్యతతో  గోల్ ఏర్పాటైంది. ఇలా మిడిల్ ప్రారంభమై, కొడుకుని సంస్కరించే తాలూకు సంఘర్షణ పుట్టింది. ఇప్పుడు మత్తులో రెండ్రోజులుగా నిద్రలో వున్నసంజుని గమనిస్తాడు తండ్రి. ఒకవైపు తల్లి క్యాన్సర్ ముదిరి హాస్పిటల్లో వుంది, మరోవైపు నటించిన మొదటి సినిమా ‘రాకీ’ విడుదల కాబోతోంది. నిద్ర లేచిన సంజుకి ఇవి గుర్తు చేస్తాడు తండ్రి. నీ సినిమా డిస్ట్రిబ్యూటర్ కి చూపిస్తే చించేశావని అన్నారు వాళ్ళు – అని వూరడిస్తాడు. ట్రీట్ మెంట్ కోసం వెళ్దామని సున్నితంగా అంటాడు. సంజు విపరీతంగా భయపడిపోయి బాత్రూంలో దాక్కుని అరుస్తాడు. హాస్పిటల్లో నిస్త్రాణగా పడున్న తల్లి దగ్గరే గడుపుతాడు. అక్కడ కూడా డ్రగ్స్ మత్తులో వుంటాడు. ఇంకా వుండలేక తల్లి ఎదుటే కొకైన్ షాట్ ఇంజెక్ట్ చేసుకుంటాడు. తల్లి అతడి తల నిమిరి చివరి శ్వాస విడుస్తుంది. పిచ్చివాడై పోతాడు. తను పోయినా ‘రాకీ’ ప్రీమియర్ షో అగకూడదన్న తల్లి చివరి కోరిక మేరకు షో ఏర్పాటవుతుంది. ఆ షో చూడలేక బయటి కొచ్చేసి ఏడుస్తాడు.

        క ట్రీట్ మెంట్ కి ఒప్పుకుని  తండ్రితో అమెరికా వెళ్తాడు. ఆ కేంద్రంలో చేరి తట్టుకోలేకపోతాడు. డ్రగ్స్ తీసుకోకపోతే వచ్చే సైడ్ ఎఫెక్ట్స్ తో విపరీతంగా బాధపడి అక్కడ్నుంచి పారిపోతాడు. కానీ డ్రగ్స్ కొనాలంటే చేతిలో డబ్బు లేదు. రెండు వేల మైళ్ళ దూరంలో ఫ్రెండ్ కమలేష్ వుంటాడు. అక్కడికెళ్ళాలన్నా డబ్బు లేదు. రోడ్డు పక్కన పడుకుంటే ఎవరో పెట్టిన ఆహారం తిని అడుక్కోవడం మొదలెడతాడు. అడుక్కున్న డబ్బుతో బస్సెక్కి ఫ్రెండ్ దగ్గరి కెళ్తాడు. అక్కడే తండ్రి వుండేసరికి కంగారు పడతాడు. ఇక వీడు మారడని తండ్రికి అనిపిస్తుంది. ఒక్క పెగ్గు తాగేసి వెళ్లిపోతానంటాడు సంజు. కడుపులో ఏదో వొక మందు పడకపోతే బతికే పరిస్థితి లేదు. పెగ్గులు పోస్తాడు తండ్రి. ఒక్క గుక్కలో లేపి పారేస్తాడు సంజు. అప్పుడు తల్లి ఒక టేపు ఇచ్చిపోయిందని చెప్తాడు తండ్రి. అది విన్పిస్తాడు. అందులో తల్లి మాటలకి విచలితుడవుతాడు సంజు. ఆమెకీ తండ్రికీ ఇష్టమైన పాట పాడి విన్పిస్తాడు తండ్రి – రుక్ జానా నహీఁ తూ కహీఁ హార్ కే...(పడిపోయానని నీ ప్రయాణం ఆపకు)...దీంతో సంజుకి ఎక్కడలేని బలం వస్తుంది. 

          దీంతో  మిడిల్ విభాగం ముగుస్తుంది. అంటే ప్లాట్ పాయింట్ టూ ఏర్పడిందన్న మాట.
          ప్లాట్ పాయింట్ వన్ దగ్గర్నుంచీ, ప్లాట్ పాయింట్ టూ వరకూ ఈ మిడిల్ విభాగంలో ప్రధాన పాత్ర సంజు తండ్రి అని చెప్పుకున్నాం. కాబట్టి సంజుని బాగుపర్చాలన్న గోల్ అతడికుంది. సంజుతో ఈ గోల్ తాలూకు ప్రయత్నం కావచ్చు, సంఘర్షణ కావచ్చు, ఇదంతా పై సీన్లలో కన్పిస్తుంది. 

          మిడిల్ సంఘర్షణ ముగిసే చోటు ప్లాట్ పాయింట్ టూ కాబట్టి, అక్కడ ఆ సంఘర్షణకో పరిష్కార మార్గం తోచడం కాబట్టి,  ఆ పరిష్కార మార్గమిక్కడ తండ్రి సంజుకి తల్లి మాటలతో కూడిన టేపు విన్పించడంగా వుంది. దీంతో సంజుకి కనువిప్పయ్యింది. ఇదీ ప్లాట్ పాయింట్ టూ.

          ఇక ఇక్కడ్నించీ వచ్చే సీన్లు ఎండ్ విభాగం. సంజు వెళ్ళిపోయి మళ్ళీ ఆ కేంద్రంలో చేరిపోయి బాగుపడతాడు. తిరిగి ముంబాయి కొచ్చాక, ఇక్కడి ఫ్రెండ్ మిస్త్రీ కలుస్తాడు డ్రగ్స్ తో. మిస్త్రీ ఇచ్చిన పాకెట్ కాకుండా మిస్త్రీ దగ్గరున్న పాకెట్ లాక్కుంటాడు సంజు. అది నోట్లో వేసుకుంటే అప్పుడు తెలుస్తుంది. అది గ్లూకోస్ పొడి. అంటే మిస్త్రీ గ్లూకోజ్ పొడి తిని నమ్మిస్తూ, ఇంతకాలం సంజుకి డ్రగ్స్ అమ్ముకుని బానిసని చేసి, తను బాగుపడ్డాడన్న మాట. వాణ్ణి  ఎడాపెడా కొట్టి తరిమేస్తాడు. ఇది తండ్రి చూసి సంతృప్తి చెందుతాడు. దీంతో ఈ ఫ్లాష్ బ్యాక్ లో ఈ డ్రగ్స్ ఎపిసోడ్ ముగుస్తుంది. 

 ప్రధాన కథతో ఉత్కంఠ
      ఫ్లాష్ బ్యాక్ ముగియడంతో మళ్ళీ ప్రధాన కథలోకి – అంటే సంజు ఈ ఫ్లాష్ బ్యాక్ చెప్పడం ప్రారంభించిన సీనుకొస్తాం. ఇప్పుడు ఈ ఫ్లాష్ బ్యాక్ విన్న రచయిత్రి సంజు కథ రాయడానికి ఒప్పుకుంటుంది. ఈ ప్రధాన కథ మరి కొంచెం మందుకు సాగుతుంది. ప్రధాన కథ ప్రారంభంలో ఈ రచయిత్రిని మిస్త్రీ కలిసి, సంజు కథ రాయవద్దంటాడు. ఎందుకు రాయవద్దన్నాడో  ఫ్లాష్ బ్యాక్ అంతా విన్న రచయిత్రికి ఇప్పుడు తెలిసిపోయి, అతడికి ఫోన్ చేసి చెప్పేస్తుంది. తన బండారం తెలిసిపోయిందన్న దుగ్ధతో మిస్త్రీ, అసలు సంజుకి కమలేష్ ఇరవై ఏళ్లుగా ఎందుకు దూరమయ్యాడో కూడా తెలుసుకోమని రెచ్చగొడతాడు. రచయిత్రి  అమెరికా వెళ్లి కమలేష్ ని కలుసుకుంటుంది. అతను సంజు మీద ద్వేషంతో వుంటాడు. సంజు మేలుకోరి తను డ్రగ్స్ బారి నుంచి కాపాడేందుకు సహకరిస్తే, సంజు ఇంకో దారుణానికి ఒడిగట్టాడని అంటాడు కమలేష్. 1993 ముంబాయి పేలుళ్ళ అప్పుడు ఆర్డీఎక్స్ పేలుడు పదార్ధాలున్న ట్రక్కుని ఇంట్లో పెట్టుకున్నాడని అంటాడు కమలేష్. ఇదెవరు చెప్పారంటే,సంజు తండ్రే చెప్పాడని షాకిస్తాడు కమలేష్. దీంతో ఇంటర్వెల్.

***
ఎపిసోడిక్ కథనం 
       ఇలా ఫస్టాఫ్ లో డ్రగ్స్ ఎపిసోడ్ తర్వాత, తిరిగి ప్రారంభమైన ప్రధానకథకి, సెకండాఫ్ లో ప్రారంభమవబోయే గన్స్ ఎపిసోడ్ తో లీడ్ ఇచ్చారు ఇంటర్వెల్ తో. ఫస్టాఫ్ లో ఒకటి, సెకండాఫ్ లో ఇంకొకటి, రెండు విడివిడి ఎపిసోడ్లని కలిపి వుంచే విధానం. cliff hanger moment. ఆర్డీ ఎక్స్ ట్రక్కు సంజు ఇంట్లో పెట్టుకున్నాడని చెప్పించి, సెకండాఫ్ ఎపిసోడ్ పట్ల ఆసక్తి రేపి విశ్రాంతి నివ్వడం.

          ఎపిసోడిక్ కథనాలతో సినిమాలెప్పుడూ గల్లంతే అవుతున్నాయి. కారణం, ఎపిసోడ్ లన్నీ ఒకే కథగా కాక, విడివిడి కథలుగా వుండడం. విడివిడి కథలు సినిమా అవదు, టీవీ షో అవచ్చు. సినిమా స్క్రీన్ ప్లే అంటేనే ఒక బిగినింగ్, ఒక మిడిల్, ఒక ఎండ్ అంటూ వుంటూ, ఒకే కథగా వుండడం. టీవీ ఎపిసోడ్లకీ బిగినింగ్, మిడిల్, ఎండ్ లుంటాయిఅయితే అవి ఎపిసోడ్ కా ఎపిసోడుగా వుంటాయి. సమస్యసంఘర్షణ - పరిష్కారం అనే పద్ధతిలో ఒక్కో ఎపిసోడ్ నడిచి, ఎపిసోడ్ కా ఎపిసోడ్ వాటి కథ ముగిసి పోతూంటుంది.  సినిమా స్క్రీన్ ప్లే అలాకాదు. ఒకే ఏక మొత్తం కథకి, ఒకే ప్రధాన సమస్యా, దాంతో సంఘర్షణా, దానికొక పరిష్కారమూ వుంటాయి. టీవీ ఎపిసోడ్లు కథల సంపుటి అయితే, సినిమా స్క్రీన్ ప్లే ఒకే నవల.

డ్రగ్స్ ఎపిసోడ్ కి తండ్రి పాత్ర సారధి 
         ఇలా విడివిడి ఎపిసోడ్లమయంగా సాగే కథనంతోనే 2003 లో టైగర్ హరిశ్చంద్ర  ప్రసాద్ఫ్లాపయ్యింది. 2014 లో తమిళ డబ్బింగ్ సిటిజన్ఫ్లాపయ్యింది. ఎంతో అనుభవజ్ఞుడైన స్టీవెన్ స్పీల్బెర్గ్ కూడా ఎపిసోడిక్ కథనానికి పాల్పడ్డంతో, 2001 లో తీసిన వార్ హార్స్ఫ్లాపయ్యింది. ఇక  2014 లో ‘ఆటోనగర్ సూర్య’ సరేసరి. 

         
కథ మీద కాక,  సీన్ల మీదా  సీక్వెన్సుల మీదా దృష్టి పెట్టడం వల్ల ఇలా జరుగుతుంది. దీన్నే స్టార్ట్ అండ్ స్టాప్ (ఎస్ ఎస్) టెక్నిక్ లేదా కథనం అంటారు. అంటే ఒక పాయింటుతో ఎపిసోడ్ ప్రారంభమై, ఆ పాయింటు గురించి చెప్పడం పూర్తవగానే, ఆ ఎపిసోడ్ స్టాప్ అయి, ఇంకో పాయింటుతో ఇంకో ఎపిసోడ్ స్టార్ట్ అవుతుంది. ఇలా ఒక్కో పాయింటుతో స్టార్ట్ అవుతూ, స్టాప్ అవుతూ – ఎక్కడపడితే అక్కడాగే పల్లె వెలుగు బస్సులా సాగుతూంటుంది మనం చూస్తున్న సినిమా. దీన్ని సినిమా అనుకుని వెళ్ళామా ఎపిసోడ్లకి చచ్చామే. హైదరాబాదుకే పోతోంది కదాని పల్లెవెలుగు బస్సెక్కినట్టు.

          ఉదాహరణకి ‘ఆటోనగర్ సూర్య’ (2014) లో ఇలా వుంటుంది... దీంట్లో ఒక ప్రధాన సమస్య దాంతో సంక్షోభం అనే కథా నడక వుండదు. ఎన్నో సమస్యలు, ఎన్నో సంక్షోభాలు, ఎన్నో ముగింపులూ!   డీజిల్ కారు తయారు చేస్తే, దాంతో ప్రత్యర్ధుల సంఘర్షణ, దానికో ముగింపు; తర్వాత బ్యాటరీ కారు తయారు చేస్తే, దాంతో ప్రత్యర్ధుల సంఘర్షణ, దానికో ముగింపు; మళ్ళీ తర్వాత కొచ్చిన్ ప్రయాణం కడితే, అక్కడ సంఘర్షణ, దానికో ముగింపూ; ఇంకాతర్వాత, యూనియన్ లో సభ్యత్వ సమస్యతో ఇంకో  సంఘర్షణా దానికో ముగింపూ; మళ్ళీ తర్వాత వాహనాల వేలం పాట సమస్య, దాంతో సంఘర్షణా, దానికో ముగింపూ...ఇలా ఎపిసోడ్ల సోడా బుడ్లు ఎడాపెడా పేలుతూంతాయి మనల్ని పారిపొమ్మంటూ!

          ఇలా ఎపిసోడ్ల సోడా బుడ్డి కథనాలతోనే ఇంకా
2003 లో టైగర్ హరిశంద్ర ప్రసాద్ఫ్లాపయ్యింది. 2014 లో తమిళ డబ్బింగ్ సిటిజన్ఫ్లాపయ్యింది. ఎంతో అనుభవజ్ఞుడైన స్టీవెన్ స్పీల్బెర్గ్ కూడా ఎపిసోడిక్ స్ట్రక్చర్ కి పాల్పడ్డం తో 2001 లో వార్ హార్స్ఫ్లాపయ్యింది.

గన్స్ ఎపిసోడ్ కి తండ్రి పాత్ర సారధి 
       ఈ బాపతు కథనం సినిమాలకి కాకుండా టీవీకీ, డాక్యుమెంటరీలకీ పనికొస్తుంది. పొరపాటున సినిమాల్లో పెట్టుకుంటే ఆరేడు ఎపిసోడ్లు వుండొచ్చు. కనీసం రెండు ఎపిసోడ్లు గడిస్తే గానీ ఇది ఎస్ఎస్ టెక్నిక్ అనీ, మనం బుక్కై పోయామనీ తెలుసుకోలేం. ఫస్టాఫ్ ప్రారంభమైనప్పుడు, ఓహో ఈ పాయింటుతో వెంటనే కథ ప్రారంభమైందని సంతోషిస్తాం. అది పుటుక్కున ముగిసిపోవడంతో, ఇదేమిటా అని చూస్తూంటాం. అప్పుడు ఇంకో పాయింటు ప్రారంభం కావడంతో, ఓహో ఇదన్నమాట అసలు కథనుకుని,  ఆసక్తిగా చూస్తూంటాం. అది కూడా పుసుక్కున ముగిసిపోవడంతో, అది కూడా ఇంటర్వెల్ లోపే కావడంతో, అప్పుడుగానీ అర్ధం కాదు – అడ్డదిడ్డంగా ఎపిసోడిక్ కథనాలకి బుక్కై పోయామని!

          వీటికి కనీసం ఇంటర్వెల్లో సెకండాఫ్ కి లీడ్ కూడా వుండదు.
There will be no hook at the mid - point to sustain the audiences interest anymore  - అన్నమాట. ఇక సెకండాఫ్ కోసం దేని గురించి కూర్చోవాలి? 

          ‘సంజు’ ఇలా కాదు. దీని ఎపిసోడ్లకి అపూర్వ లంకె పడింది. రెండు ఫ్లాష్ బ్యాక్  ఎపిసోడ్లని కలిపివుంచే ప్రధాన కథ తాలూకు ట్విస్టుతో ఇంటర్వెల్ మెలికపడింది
- cliff hanger moment. రెండూ విడివిడి ఎపిసోడ్లే అయినా, రెండిట్నీ నడిపే సారధి ఒకే పాత్ర- తండ్రి పాత్ర అవడంతో కథ తెగిపోయినట్టు వుండదు. ఈ రెండు ఎపిసోడ్స్ ని (ఫ్లాష్ బ్యాక్స్ ని) ప్రేరేపించేది ప్రధాన కథే కాబట్టి, ఇంకో డైమెన్షన్ లో ప్రధాన కథేమవుతుందన్న ఉత్కంఠ ఎలాగూ పనిచేస్తుంది. ఇలా 1. ఒక ఎపిసోడ్ నుంచి ఇంకో ఎపిసోడ్ కెళ్ళేందుకు ప్రధాన కథలో ఇంటర్వెల్ ట్విస్టు, 2. రెండు ఎపిసోడ్లనీ నడిపే సారధిగా తండ్రి పాత్ర సంఘర్షణ, 3. ప్రధాన కథతో ఉత్కంఠ – అనే మూడు డైమెన్షన్ లతో స్క్రీన్ ప్లే చెదిరిపోకుండా, ఫ్రాక్చర్ అవకుండా దిట్టంగా నిలబడింది.


సికిందర్



       రెండ్రోజులు ఆడే సినిమాకి రెండేళ్ళు రాసుకుంటూ కూర్చోనవసరం లేదు. రెండేళ్ళ పాటు రాసి రాసి, గీసి గీసి తీసిన సినిమా రెండ్రోజులాడక పోతే అ బాధ వర్ణనాతీతంగానే వుంటుంది. అది అర్ధం లేని బాధ. రెండేళ్ళు రాసి రాసి తీసిన సినిమా రెండ్రోజులు ఎందుకాడలేదో అర్ధంగాక పోతే ఆది అర్ధంపర్ధం లేని బాధే. రెండేళ్ళూ రాస్తున్నారంటే  ఏం రాస్తున్నారో, ఎందుకు రాస్తున్నారో, ఎలా రాస్తున్నారో తెలీని గుడ్డెద్దు చేలో పడ్డ చందం చమత్కృతి. రెండున్నర గంటల విస్తారమైన కథా సాగు భూమిలో రెండెకరాలు కూడా తెలీకపోతే దుక్కి దున్నడం దరిద్రమే. తన పొలం తనకే తెలీని కథారైతు నాగలిపట్టి దున్నితే రెండేళ్ళు కాదు, ఆరేళ్ళు కూడా పడుతుంది. ముందు పొలం తెలుసుకో, దాంట్లో ట్రాక్టర్ పెట్టి దున్ను....అప్పుడు ఎటూ రెండ్రోజులాడే సినిమా రెండ్రోజుల్లోనే రాసేయ్యొచ్చు. ఎలా? ఇదెలా?  ముందు సర్వే చేసి నీ పొలం హద్దులు, దిక్కులు తెలుసుకో. అప్పుడు ట్రాక్టర్ దాని పని అదే చేసుకుపోతుంది... I have to work from an outline. Every time I have not worked from an outline, I have been completely burned – Tony Gillory, Bourne Identity series screen writer. కానీ హద్దులు, దిక్కులు తెలుసుకోవడమంటే నే చిరాకు కదా, మరెలా? ఎంత జుట్టు పీక్కున్నా నాల్గు పేజీల్లో కథని సమగ్ర దర్శనం చేసుకోవడమే చేతగాదు కదా, మరెలా? నాగలి నాగయ్యల్ని ట్రాక్టర్ ఎక్కమంటే ఎలా? ఎలా? ఎలా?...


పొద్దున్నే పాత పాట!

Monday, August 6, 2018

669 : స్పెషల్ ఆర్టికల్



          72వ స్వాతంత్ర్య దినోత్సవం ఒక కొత్త చరిత్రని మోసుకొస్తోంది. అంతగా ఎవరికీ తెలియని చారిత్రక ఘట్టం. అది వెండితెర మీద విశాలంగా ఆవిష్కృతమవబోతోంది. ఆగస్టు పదిహేను బుధవారం ఉదయం అక్షయ్ కుమార్ గోల్డ్ మెడల్ తెచ్చి ప్రదర్శించబోతున్నాడు.  ఒలింపిక్స్ గోల్డ్ మెడల్. విజేతల్ని లెజెండ్స్ గా మార్చిన గోల్డ్ మెడల్. హాకీనీ, దేశభక్తినీ, అక్షయ్ బ్రాండ్ వేల్యూనీ కలగలిపి ‘గోల్డ్’ అనే బయోపిక్ కాని బయోపిక్ థియేటర్లని అలంకరించబోతోంది. జెండా పండగతో కలిపి ప్రేక్షకులు జల్సా చేసుకోవడానికి నర్తించబోతోంది.  పదేళ్ళ క్రితం 2009 లో ఇలాటివే రెండు పండగలు ఒకేరోజు సందడి చేశాయి. ఒకవైపు శివరాత్రి, మరోవైపు ఎఆర్ రెహమాన్ కి ఆస్కార్ అవార్డు. అంతే, ఆ రోజంతా శివోహం రావాలతో, జైహో రాగాలతో మార్మోగింది. ‘స్లమ్ డాగ్ మిలియనీర్’ లో రెహమాన్ స్వరకల్పన చేసిన ‘జైహో’ గీతానికి ఆస్కార్ అవార్డు.

         
ప్పుడు పంద్రాగస్టు నాడు అక్షయ్ కుమార్ ఒలింపిక్స్ గోల్డ్ మెడల్. ఇప్పటికే ట్రైలర్ వైరల్ అయింది. భారత హాకీ జట్టు లండన్లో సవాలు విసిరిన ఘనచరిత్ర. ‘లగాన్’ లో దాస్య విముక్తి పొందని జాతి, క్రికెట్లో ఆంగ్లేయుల్ని బలాదూరు చేసిన చరిత్ర కాల్పనికమైతే, ఇది కాల్పనిక చరిత్ర. ఇక్కడ అపుడప్పుడే దాస్య శృంఖలాలు తెంచుకున్న జాతి కథే. కాకపోతే తెల్లవాడి సొంత గడ్డ మీదే కళ్ళుతిరిగేలా గోల్ కొట్టి రావడం హాకీ స్టిక్స్ తో.

          అక్షయ్ కుమార్, కుణాల్ కపూర్, వినీత్ కుమార్ సింగ్, అమిత్ సాథ్, అబ్దుల్ అమీన్, సన్నీ కౌశల్, మౌనీ రాయ్, నిఖితా దత్తా తదితర నటీనట శ్రేణి ఈ స్పోర్ట్స్ డ్రామాకి లీడర్స్. రీమా కాగ్తీ దర్శకురాలు. ఇంత భారీ పీరియడ్ డ్రామాని భుజాన కెత్తుకున్న నారీ మణి రీమా కాగ్తీ ఎవరంటే, ‘హనీ మూన్ ట్రావెల్స్’, ‘తలాష్’ అనే రెండు పరాజయం పాలైన సినిమాలు తీసిన దర్శకురాలే. ఈసారి విజయ  ప్రయత్నంతో ముందడుగేస్తోంది. అక్షయ్ తొలిసారిగా బెంగాలీగా కన్పిస్తాడు. నిరాశానిస్పృహలతో కుంగిన స్వదేశీ హాకీ టీంని భుజం తట్టి, విజయపథం వైపు నడిపిస్తాడు. స్వాతంత్ర్య సమర నేపధ్యంలో 1936  - 48 మధ్య కాలంలో టీం ఎదుర్కొన్న కష్టనష్టాలు, చిట్టచివరికి సుదూర కల - ఒలింపిక్స్ గోల్డ్ నిజం చేసుకునే అపూర్వ ఘట్టానికి దారితీయడం. అప్పటి విజేతలెవరి కథా కాదిది. అన్నీ కల్పిత పాత్రలే. లండన్లో జరిగిన 14 వ ఒలింపిక్స్ లో గోల్డ్ మెడల్ సాధించడ మొక్కటే యదార్థ సంఘటన. కల్పిత కథలతో స్పోర్ట్స్ మూవీస్ ఇటీవలి కాలంలో కొన్ని వచ్చాయి. చక్ దే ఇండియా, దంగల్ వంటివి. కల్పితమైనా బయోపిక్స్ అయినా పరాజయాల పాలు కాలేదు. విజేతల కథలు చెప్పే సినిమాలకి పరాజయాలుండవు. క్రీడలు కాకుండా ఇతర కథలతో తీసే స్టార్ మూవీస్ కి జయమో పరాజయమో చెప్పలేం. ఆ పాత్రలు  స్పోర్ట్స్ మూవీస్ లో వుండేలాంటి గెలుపు గుర్రాల పాత్ర చిత్రణలతో వుండవు. స్టార్ మూవీస్ లో పాత్రలు బోరు కొడతాయోమో గానీ, స్పోర్ట్స్ మూవీస్ పాత్రలు క్షణం క్షణం ఉత్తేజాన్ని నింపుతాయి వెండితెర మీద. 

          బాలీవుడ్ లో మసాలా హీరో సినిమాల కాలం తీరింది. ఇక కమర్షియల్ సినిమాలని పునర్నిర్వచించుకోవాలి. నియో కమర్షియల్స్ ని కనిపెట్టాలి. ఇందులో భాగంగానే జరుగుతున్న ప్రయత్నం బయోపిక్స్ తీయడం, లేదంటే పీరియడ్ కథలు తీయడం. ఇవి పోటీలు పడి తెరకెక్కుతున్నాయి. అయితే అదే పనిగా చరిత్రలూ పీరియడ్ లూ చూపిస్తూంటే కూడా బోరు కొడుతుంది ప్రేక్షకులకి. ఈ ట్రెండ్ కి ఆయుష్షు తక్కువే. ఉన్న టైంలో సొమ్ము చేసుకోవడమే. వయసైపోతున్న ఇప్పుడున్న సీనియర్ స్టార్స్ కి ఇదే చివరి అవకాశం. ఇటు రజనీ, కమల్ లని చూసినా ఇదే పరిస్థితి. వీళ్ళకి రాజకీయాలైనా వున్నాయి, బాలీవుడ్ సీనియర్ స్టార్స్ కి అవీ లేవు. 


          ‘రోబో – 2’  టీజర్ లాంచింగ్ మీట్ లో సల్మాన్ ఖాన్ ఈ నిజమే చెప్పాడు. తాము  ఒకే రకమైన సినిమాలు చేసీ చేసీ ఘనీభవించుకు పోయామనీ, ఇలాకాక అక్షయ కుమార్ కొత్త ప్రయోగాలు చేసుకుంటూ విస్తరిస్తున్నాడనీ. 

          నిన్న అక్షయ్ కుమార్ చేసిన కామెంట్ కూడా అతడి ఈ పంథాని ఖాయం చేస్తోంది. తను తల్చుకుంటే ఇప్పుడు ‘రౌడీ రాథోడ్ -2’ తీసి పుష్కలంగా డబ్బు సంపాదించుకో గల ననీ, కానీ అలాటి సినిమాలపై ఆసక్తి చచ్చి పోయిందనీ స్పష్టం చేసేశాడు. 

           ప్యాడ్ మాన్, టాయిలెట్ – ఏక్ ప్రేమ్ కథా, రుస్తుం, ఏర్ లిఫ్ట్, బేబీ...ఇప్పుడు ‘గోల్డ్’... ఇదీ అక్షయ్ కుమార్ మూసని బద్దలు కొడుతున్న విధం. ఈ నేపధ్యంలో ఆగస్టు 15 న ఏ రికార్డులు బద్దలు కొడతాడో చూద్దాం!

సికిందర్
(తెలుగు రాజ్యం డాట్ కాం)

త్వరలో!


Friday, August 3, 2018


ఈవారం సంగతులు
    
జులై 25 వ తేదీ నాటి ఆర్టికల్ లో స్ట్రక్చర్  అప్డేట్స్ ఇచ్చినప్పుడు అవి ఏఏ  కథలకి వర్తించవచ్చో అందులోనే వివరించాం. సర్వసాధారణంగా సినిమాలు టాలీవుడ్ లోనైనా, బాలీవుడ్ లోనైనా, హాలీవుడ్ లోనైనా రెగ్యులర్ ఓపెన్ ప్లాట్ పాయింట్ వన్ తోనే వుంటాయి. అరుదుగా వ్యాసంలో చెప్పుకున్నట్టు రెండు క్లోజుడు ప్లాట్ పాయింట్ వన్స్ తో, లేదా రివర్స్ ప్లాట్ పాయింట్ వన్ తో వుంటాయి. ఉదాత్త కథలు చెప్పాలనుకున్నప్పుడు ఇవి బాగా పనిచేస్తాయి. ఉదాత్త కథల్లో ప్రధాన పాత్ర తీరుతెన్నులు కూడా మారిపోతాయి. పాసివ్ గా కూడా వుండొచ్చు. కాబట్టి  అప్డేట్స్ తెలిశాయి కదాని దగ్గరున్న కథల్ని అనాలోచితంగా మార్చుకునే ప్రయత్నం చేస్తే పతనం తప్పదు. ఇప్పటికే రెగ్యులర్ ప్లాట్ పాయింట్ వన్ తోనే కథల్ని బతికించుకో లేకపోతున్నారు. ఇంకా రెగ్యులర్ కథలతో ఇర్రెగ్యులర్ ప్రయోగాలు కూడా చేస్తే ఇటలీ వెళ్లి అవేవో వరల్డ్మూవీసట - అవి తీసుకుంటూ అక్కడుండాల్సిందే. 

          2. సినిమాల మార్కెట్ యాస్పెక్ట్ ప్రస్తుత కాలానికి రోమాంటిక్స్ లేదా, ఎకనమిక్స్ అని ఇటీవలి కాలంగా చెప్తూ వస్తున్నాం. ఇదింకెవరో పరిశీలకులు చెప్పింది కాదు. మనమే తీరికూర్చుని టార్గెట్ ప్రేక్షకులు - తీస్తున్న ఫ్లాపులు అనే శాంపిల్స్ ఆధారంగా ప్రతిపాదించాం. ఒప్పుకుంటే పాటించవచ్చు, లేదంటే లేదు. కెరీరిజం పొటమరించిన ఈతరం ప్రేక్షకులు పైకెన్ని చెప్పినా లోపల ఒకటే యదార్ధం : డబ్బూ రోమాన్స్ ఈ రెండే నిత్యావసరాలు. వీటితో బహుళజాతి సంస్థలు వలవేసే ఎంజాయ్ మెంట్సే సర్వస్వం. పల్లె నుంచి మహానగరం దాకా దీన్నుంచి తప్పించుకునే యూత్ లేరు. యూత్ బహుళజాతి సంస్థల గుప్పెట్లో వున్నారు. కాబట్టి ఈ రెండూ (ఎకనమిక్స్, రోమాంటిక్స్) ప్రతిఫలించే సినిమాలకి మార్కెట్ యాస్పెక్ట్ ఎక్కువ. ఇవ్వాళ సినిమా చూసే కుర్రాడు - నాకు అమ్మాయిలతో రోమాన్స్ నాకు తగ్గట్టుగా ఎక్కడ చూపించారు, నా డబ్బు (ఎకనమిక్స్) కోర్కెలు నాకు తగ్గట్టుగా ఎక్కడ తీర్చారు - అని అలిగి కూర్చుని ఫ్లాప్ చేస్తున్నాడు. ఎకనమిక్స్ అంటే బాగా రిచ్ గా చూపించాలనే లేదు, నాటి ‘ఆకలిరాజ్యం’ లో నిరుద్యోగుల బాధకూడా ఎకనమిక్స్ గురించే. ఇవ్వాళ  పింక్ స్లిప్స్ అందుకుని అవుటై పోవడం కూడా ఎకనమిక్స్ గురించే. కొలువుల్లో ఆటోమేషన్ జొరబడ్డం కూడా ఎకనమిక్స్ గురించే. కాబట్టి ఈ మార్కెట్ యాస్పెక్ట్ ని దృష్టిలో పెట్టుకుని ఎంటర్ టైన్ చేస్తూనే,  బలంగా చూపించగల్గినప్పుడు సినిమాలు కాలానికి తగ్గట్టు వుండవచ్చు. 

          3. దొంగరాముడు, ఇట్సే వండర్ఫుల్ లైఫ్ స్క్రీన్ ప్లే సంగతులు పెండింగులో వున్నాయి. ఆ మాటకొస్తే మొదలెట్టిన ‘ది క్లాసిక్’, ‘సంజు’ రెండిటి స్క్రీన్ ప్లే సంగతులూ  మూలనబడి చాలా కాలమైంది. ఇవి పూర్తి చేశాకే పై రెండిటి సంగతి. 


సికిందర్  

  




Saturday, July 28, 2018

667 : రివ్యూ




దర్శకత్వం : తిగ్మాంశూ ధూలియా
తారాగణం : సంజయ్ దత్. జిమ్మీ షేర్గిల్. మహీ గిల్, చిత్రాంగదా సింగ్, సోహా అలీ ఖాన్, నఫీసా అలీ, జాకీర్ హుస్సేన్, కబీర్ బేడీ, దీపక్ తిజోరీ తదితరులు
రచన : సంజయ్ చౌహాన్ - తిగ్మాంశూ ధూలియా, సంగీతం : రాణా మజుందార్. ఛాయాగ్రహణం : అమలేందు చౌదరి
బ్యానర్ : జే ఏ ఆర్ పిక్చర్స్
నిర్మాత : రాహుల్ మిత్రా
విడుదల : జులై 27, 2018
***

          ‘సాహెబ్ బీవీ ఔర్ గ్యాంగ్ స్టర్’  - 1, 2 లు దర్శకుడు తిగ్మాంశూ ధూలియాకి మంచి పేరు సంపాదించి పెట్టాయి. ఈ పరంపరని ఇంకా కొనసాగిస్తూ ఐదేళ్ళ తర్వాత ఇదే టైటిల్ తో ఇప్పుడు సీక్వెల్ తీశాడు. ‘సాహెబ్ బీవీ ఔర్ గ్యాంగ్ స్టర్ -2’ ఎక్కడైతే ముగిసిందో అక్కడ్నించి అదే ఆదిత్యా ప్రతాప్ సింగ్ కథని సీక్వెల్ గా కొనసాగించాడు. సీక్వెల్ లో ఈసారి ‘సంజు’ ఫేమ్ సంజయ్ దత్ జాయినయ్యాడు. డార్క్ మూవీ జానర్లో సంస్థానాల్లో జరిగే కుట్రలు కుహకాలని ఈసారి రష్యన్ రూలెట్ అనే మృత్యుక్రీడని జోడించి తీశాడు. అయితే ఆ మృత్యు క్రీడ ప్రేక్షకులతో ఆడుకున్నట్టయ్యింది. 

         
ప్రకాష్ ఝా రాజకీయాల్లో మహాభారతాన్ని చూపిస్తున్నానని చెప్పి,  2010 లో బోలెడు పాత్రలతో ‘రాజనీతి’ అనే బక్వాస్ చాటభారతం తీసి చంపినట్టే, ధూలియా కూడా సంస్థానం కథంటూ లెక్కలేనన్ని పాత్రలతో చావగొట్టి వదిలాడు. ఫస్టాఫ్ అంతా ఎవరెవరో పాత్రల పరిచయాలతోనే, వాళ్ళ ఉప కథలతోనే సరిపోతుంది. ఏం చూస్తున్నామో అర్ధంగాని గందరగోళం ఏర్పడుతుంది. నిద్రపోయి లేచినా వచ్చే నష్టమేమీ లేదు. ఎందుకంటే కథ ఎంతకీ ప్రారంభమే కాదు. ఒక సీనుకి ఇంకో సీనుకీ సంబంధమే వుండదు. అసలు ఏ సీను ఎందుకొస్తోందో అంతేబట్టదు. ఇంటర్వెల్లో లండన్ నుంచి సంజయ్ దత్ వస్తేగానీ కాస్త కదలిక రాదు. వచ్చాక సెకండాఫ్ లో వున్న కథ కూడా అంతంత మాత్రమే. కేవలం క్లయిమాక్స్ లో రష్యన్ రూలెట్ ని చూపించి థ్రిల్ చేయడానికి తప్ప, ఇంకో  సదాశయం పెట్టుకుని ఈ సీక్వెల్ తీయాలనుకున్నట్టు లేదు. పావుగంట రూలెట్ క్లయిమాక్స్ కోసం రెండుంపావు గంటల సినిమాని భరించాలి. విచిత్రమేమిటంటే,  ఇంత అవకతవక సినిమాలో క్లయిమాక్సే, దాంతో ముగింపే సీట్లకి కట్టేసి కూర్చోబెడుతుంది. 

          క్లయిమాక్స్ తప్ప సినిమాని ఏ కోశానా ఎంతగా పట్టించుకోలేదంటే, ఐదేళ్ళ తర్వాత తీసిన ఈ సీక్వెల్ కనీసం దీని ముందు భాగంలో జరిగిన కథేమిటో రీక్యాప్ కూడా వేయలేదు.  గత సీక్వెల్ చూడని ప్రేక్షకులకి, ఈ సీక్వెల్లో ఆదిత్యా ప్రతాప్ సింగ్ జైల్లో ఎందుకున్నాడో అర్ధం గాదు.  అతడి భార్య ఎమ్మెల్యే ఎప్పుడయిందో అస్సలర్ధంగాదు. 

      రష్యన్ రూలెట్ రివాల్వర్ తో ఆడే ఆట. ఐదు గ్లాసుల్లో నీరు, ఒక గ్లాసులో వోడ్కా వుంటుంది. ఏ  గ్లాసులో వోడ్కా వుందో గుర్తుపట్టి తాగని వ్యక్తి రివాల్వర్ తలకి పెట్టుకుని మీట నొక్కుకోవాలి. రివాల్వర్ లో వుండే ఆరు ఛాంబర్స్ లో ఒకటే తూటా వుంటుంది. అది ఏ ఛాంబర్లో వుందో తెలీదు. ఒకరి తర్వాత ఒకరు తలకి పెట్టుకుని మీట నొక్కుకునే క్రమంలో ఎవరి చేతిలోనో పేలవచ్చు. అప్పుడు చావడమే. ఎదుటి వాడు గెలవడమే. అమెరికాలో ప్రత్యర్దుల మధ్య మెక్సికన్ స్టాండాఫ్ ప్రతిష్టంభన కూడా ఇలాటిదే. కాకపోతే ఇద్దరి చేతుల్లో గన్స్ వుంటాయి. ఎవరు ముందు పేలిస్తే వాడు బతికి పోతాడు. 

          లండన్లో ఈ రష్యన్ రూలెట్ స్పెషలిస్టు ఉదయ్ ప్రతాప్ సింగ్ (సంజయ్ దత్). ఉత్తర ప్రదేశ్ లో ఒక సంస్థానానికి చెందిన ఇతను తల్లిదండ్రులని (నఫీసా అలీ, కబీర్ బేడీ) వదిలేసి గ్యాంగ్ స్టర్ అయ్యాడు. ఉత్తర ప్రదేశ్ లోని ఇంకో సంస్థానానికి చెందిన ఆదిత్యా ప్రతాప్ సింగ్ (జిమ్మీ షేర్గిల్) జైల్లో వుంటాడు. అతడి భార్య మాధవీ దేవి (మహీ గిల్) ఎమ్మెల్యేగా ఎంజాయ్ చేస్తూంటుంది. ఆమె కన్నీ దుష్టాలోచనలుంటాయి. రెండో భార్య  రంజన (సోహా ఆలీఖాన్) తాగుడుకి అలవాటుపడి ఆత్మహత్యా యత్నం చేస్తుంది. ఒకరోజు మాధవీ దేవి ఆమెని కాల్చి చంపి ఆత్మహత్యగా సృష్టిస్తుంది. ఇక భర్త మిగిలాడు. అతను బయటి కొస్తే తన జీవితమిలా వుండదు. మళ్ళీ బానిసలా బతకాలి. అందుకని భర్తని బెయిలు మీద విడిపించి చంపే పథకమేస్తుంది. కానీ ఈలోగా భర్తతో గర్భవతి అవుతుంది. లండన్ వెళ్ళినప్పుడు అక్కడ ఉదయ్ ప్రతాప్ సింగ్ పరిచయంతో ఆమె పథకానికి ఒక రూపు వస్తుంది. ఏ మగాణ్ణయినా ఇట్టే బుట్టలో వేసుకోగల ఆమె ఉదయ్ ని ఆకర్షించి తన వూరు రప్పించుకుంటుంది. అక్కడ భర్తని చంపే ఆలోచన చెప్తుంది. ఆదిత్యతో ఉదయ్ కీ ఒక వైరం వుంటుంది. దాంతో అతణ్ణి రష్యన్ రూలెట్ ఆటలోకి దింపి చచ్చేలా చేయాలనుకుంటాడు. మరోవైపు అతడి పూర్వ ప్రేయసి సుహానీ (చిత్రాంగదా సింగ్) ని తెచ్చి ఇంట్లో పెట్టుకుంటాడు. 


         ఈ రూలెట్ ఆటకి సన్నాహం, అతిధుల రాక, ఆట తీరూ మాత్రం  పకడ్బందీగా వుంటాయి. కావాల్సినంత సస్పన్స్ ని సృష్టిస్తాయి. దీని  ముగింపేమిటన్నది కూడా అనూహ్యంగా వుంటుంది.  భార్య చేసిన కుట్ర ఆదిత్యకి  తెలిసిపోతుంది. అయితే అతను చంపబోతే, ఆమె తెలివిగా కడుపులో వున్న నీ బిడ్డని కూడా చంపుకుంటావని చెప్పి ప్రాణాలు దక్కించుకుంటుంది. అప్పుడతను అంటాడు – నువ్వు కన్నాక, ఆ బిడ్డ ముందు నిన్ను నించోబెట్టి కాల్చి చంపుతానని. దీనికేం మంత్రమేసిందామె?  రూలెట్ క్రీడ దాకా ఎంత అవకతవకగా సాగి నరకయాతన పెట్టినా, ఈ క్రీడతో, దీనికిచ్చిన ముగింపుతో చచ్చినట్టూ మనం ఒక సలాము చేసి రావాల్సిందే. 

          నటనలో సాహెబ్ గా జిమ్మీ షేర్గిల్ తర్వాతే గ్యాంగ్ స్టర్ గా సంజయ్ దత్. రంగులు మార్చే బీవీగా మహీ గిల్ కి అందరికంటే ఎక్కువ మార్కులివ్వచ్చు. సెక్సీ చిత్రాంగదా సింగ్ వండర్ఫుల్. 

          టెక్నికల్ గా ఉన్నతంగా వుంది. ముఖ్యంగా అమలేందు చౌదరీ ఛాయగ్రాహణం – వాడిన రంగులు, కాంతులు. మూడు పాటలూ బావున్నాయి. లొకేషన్స్, భవనాలూ, కళాదర్శకత్వం కళాత్మకతని ప్రదర్శిస్తాయి. కానీ ఇంత ఔన్నత్యంతో కూడా ఫస్టాఫ్ ని చూడలేం. ధూలియా విషయం పట్టకుండా నిర్లక్ష్యంగా తీసిన సినిమా ఇదొక్కటే.

సికిందర్