రివ్యూలు, సాంకేతికాలు, స్క్రీన్ ప్లే సంగతులు...

టికెట్లు దొరకడం యోగం, సినిమాలు చూడడం భోగం, రివ్యూలు రాయడం రోగం!

Wednesday, August 8, 2018

670 : స్క్రీన్ ప్లే సంగతులు


       ‘సంజు’ ఫస్టాఫ్ డ్రగ్స్ కథలో (ఫ్లాష్ బ్యాక్ -1) డ్రగ్స్ మరిగిన సంజు పరిస్థితి తండ్రికి తెలియడం (ప్లాట్ పాయింట్ వన్) వరకూ చెప్పుకున్నాం. ఇక్కడ కొడుకుని సంస్కరించే బాధ్యతతో  గోల్ ఏర్పాటైంది. ఇలా మిడిల్ ప్రారంభమై, కొడుకుని సంస్కరించే తాలూకు సంఘర్షణ పుట్టింది. ఇప్పుడు మత్తులో రెండ్రోజులుగా నిద్రలో వున్నసంజుని గమనిస్తాడు తండ్రి. ఒకవైపు తల్లి క్యాన్సర్ ముదిరి హాస్పిటల్లో వుంది, మరోవైపు నటించిన మొదటి సినిమా ‘రాకీ’ విడుదల కాబోతోంది. నిద్ర లేచిన సంజుకి ఇవి గుర్తు చేస్తాడు తండ్రి. నీ సినిమా డిస్ట్రిబ్యూటర్ కి చూపిస్తే చించేశావని అన్నారు వాళ్ళు – అని వూరడిస్తాడు. ట్రీట్ మెంట్ కోసం వెళ్దామని సున్నితంగా అంటాడు. సంజు విపరీతంగా భయపడిపోయి బాత్రూంలో దాక్కుని అరుస్తాడు. హాస్పిటల్లో నిస్త్రాణగా పడున్న తల్లి దగ్గరే గడుపుతాడు. అక్కడ కూడా డ్రగ్స్ మత్తులో వుంటాడు. ఇంకా వుండలేక తల్లి ఎదుటే కొకైన్ షాట్ ఇంజెక్ట్ చేసుకుంటాడు. తల్లి అతడి తల నిమిరి చివరి శ్వాస విడుస్తుంది. పిచ్చివాడై పోతాడు. తను పోయినా ‘రాకీ’ ప్రీమియర్ షో అగకూడదన్న తల్లి చివరి కోరిక మేరకు షో ఏర్పాటవుతుంది. ఆ షో చూడలేక బయటి కొచ్చేసి ఏడుస్తాడు.

        క ట్రీట్ మెంట్ కి ఒప్పుకుని  తండ్రితో అమెరికా వెళ్తాడు. ఆ కేంద్రంలో చేరి తట్టుకోలేకపోతాడు. డ్రగ్స్ తీసుకోకపోతే వచ్చే సైడ్ ఎఫెక్ట్స్ తో విపరీతంగా బాధపడి అక్కడ్నుంచి పారిపోతాడు. కానీ డ్రగ్స్ కొనాలంటే చేతిలో డబ్బు లేదు. రెండు వేల మైళ్ళ దూరంలో ఫ్రెండ్ కమలేష్ వుంటాడు. అక్కడికెళ్ళాలన్నా డబ్బు లేదు. రోడ్డు పక్కన పడుకుంటే ఎవరో పెట్టిన ఆహారం తిని అడుక్కోవడం మొదలెడతాడు. అడుక్కున్న డబ్బుతో బస్సెక్కి ఫ్రెండ్ దగ్గరి కెళ్తాడు. అక్కడే తండ్రి వుండేసరికి కంగారు పడతాడు. ఇక వీడు మారడని తండ్రికి అనిపిస్తుంది. ఒక్క పెగ్గు తాగేసి వెళ్లిపోతానంటాడు సంజు. కడుపులో ఏదో వొక మందు పడకపోతే బతికే పరిస్థితి లేదు. పెగ్గులు పోస్తాడు తండ్రి. ఒక్క గుక్కలో లేపి పారేస్తాడు సంజు. అప్పుడు తల్లి ఒక టేపు ఇచ్చిపోయిందని చెప్తాడు తండ్రి. అది విన్పిస్తాడు. అందులో తల్లి మాటలకి విచలితుడవుతాడు సంజు. ఆమెకీ తండ్రికీ ఇష్టమైన పాట పాడి విన్పిస్తాడు తండ్రి – రుక్ జానా నహీఁ తూ కహీఁ హార్ కే...(పడిపోయానని నీ ప్రయాణం ఆపకు)...దీంతో సంజుకి ఎక్కడలేని బలం వస్తుంది. 

          దీంతో  మిడిల్ విభాగం ముగుస్తుంది. అంటే ప్లాట్ పాయింట్ టూ ఏర్పడిందన్న మాట.
          ప్లాట్ పాయింట్ వన్ దగ్గర్నుంచీ, ప్లాట్ పాయింట్ టూ వరకూ ఈ మిడిల్ విభాగంలో ప్రధాన పాత్ర సంజు తండ్రి అని చెప్పుకున్నాం. కాబట్టి సంజుని బాగుపర్చాలన్న గోల్ అతడికుంది. సంజుతో ఈ గోల్ తాలూకు ప్రయత్నం కావచ్చు, సంఘర్షణ కావచ్చు, ఇదంతా పై సీన్లలో కన్పిస్తుంది. 

          మిడిల్ సంఘర్షణ ముగిసే చోటు ప్లాట్ పాయింట్ టూ కాబట్టి, అక్కడ ఆ సంఘర్షణకో పరిష్కార మార్గం తోచడం కాబట్టి,  ఆ పరిష్కార మార్గమిక్కడ తండ్రి సంజుకి తల్లి మాటలతో కూడిన టేపు విన్పించడంగా వుంది. దీంతో సంజుకి కనువిప్పయ్యింది. ఇదీ ప్లాట్ పాయింట్ టూ.

          ఇక ఇక్కడ్నించీ వచ్చే సీన్లు ఎండ్ విభాగం. సంజు వెళ్ళిపోయి మళ్ళీ ఆ కేంద్రంలో చేరిపోయి బాగుపడతాడు. తిరిగి ముంబాయి కొచ్చాక, ఇక్కడి ఫ్రెండ్ మిస్త్రీ కలుస్తాడు డ్రగ్స్ తో. మిస్త్రీ ఇచ్చిన పాకెట్ కాకుండా మిస్త్రీ దగ్గరున్న పాకెట్ లాక్కుంటాడు సంజు. అది నోట్లో వేసుకుంటే అప్పుడు తెలుస్తుంది. అది గ్లూకోస్ పొడి. అంటే మిస్త్రీ గ్లూకోజ్ పొడి తిని నమ్మిస్తూ, ఇంతకాలం సంజుకి డ్రగ్స్ అమ్ముకుని బానిసని చేసి, తను బాగుపడ్డాడన్న మాట. వాణ్ణి  ఎడాపెడా కొట్టి తరిమేస్తాడు. ఇది తండ్రి చూసి సంతృప్తి చెందుతాడు. దీంతో ఈ ఫ్లాష్ బ్యాక్ లో ఈ డ్రగ్స్ ఎపిసోడ్ ముగుస్తుంది. 

 ప్రధాన కథతో ఉత్కంఠ
      ఫ్లాష్ బ్యాక్ ముగియడంతో మళ్ళీ ప్రధాన కథలోకి – అంటే సంజు ఈ ఫ్లాష్ బ్యాక్ చెప్పడం ప్రారంభించిన సీనుకొస్తాం. ఇప్పుడు ఈ ఫ్లాష్ బ్యాక్ విన్న రచయిత్రి సంజు కథ రాయడానికి ఒప్పుకుంటుంది. ఈ ప్రధాన కథ మరి కొంచెం మందుకు సాగుతుంది. ప్రధాన కథ ప్రారంభంలో ఈ రచయిత్రిని మిస్త్రీ కలిసి, సంజు కథ రాయవద్దంటాడు. ఎందుకు రాయవద్దన్నాడో  ఫ్లాష్ బ్యాక్ అంతా విన్న రచయిత్రికి ఇప్పుడు తెలిసిపోయి, అతడికి ఫోన్ చేసి చెప్పేస్తుంది. తన బండారం తెలిసిపోయిందన్న దుగ్ధతో మిస్త్రీ, అసలు సంజుకి కమలేష్ ఇరవై ఏళ్లుగా ఎందుకు దూరమయ్యాడో కూడా తెలుసుకోమని రెచ్చగొడతాడు. రచయిత్రి  అమెరికా వెళ్లి కమలేష్ ని కలుసుకుంటుంది. అతను సంజు మీద ద్వేషంతో వుంటాడు. సంజు మేలుకోరి తను డ్రగ్స్ బారి నుంచి కాపాడేందుకు సహకరిస్తే, సంజు ఇంకో దారుణానికి ఒడిగట్టాడని అంటాడు కమలేష్. 1993 ముంబాయి పేలుళ్ళ అప్పుడు ఆర్డీఎక్స్ పేలుడు పదార్ధాలున్న ట్రక్కుని ఇంట్లో పెట్టుకున్నాడని అంటాడు కమలేష్. ఇదెవరు చెప్పారంటే,సంజు తండ్రే చెప్పాడని షాకిస్తాడు కమలేష్. దీంతో ఇంటర్వెల్.

***
ఎపిసోడిక్ కథనం 
       ఇలా ఫస్టాఫ్ లో డ్రగ్స్ ఎపిసోడ్ తర్వాత, తిరిగి ప్రారంభమైన ప్రధానకథకి, సెకండాఫ్ లో ప్రారంభమవబోయే గన్స్ ఎపిసోడ్ తో లీడ్ ఇచ్చారు ఇంటర్వెల్ తో. ఫస్టాఫ్ లో ఒకటి, సెకండాఫ్ లో ఇంకొకటి, రెండు విడివిడి ఎపిసోడ్లని కలిపి వుంచే విధానం. cliff hanger moment. ఆర్డీ ఎక్స్ ట్రక్కు సంజు ఇంట్లో పెట్టుకున్నాడని చెప్పించి, సెకండాఫ్ ఎపిసోడ్ పట్ల ఆసక్తి రేపి విశ్రాంతి నివ్వడం.

          ఎపిసోడిక్ కథనాలతో సినిమాలెప్పుడూ గల్లంతే అవుతున్నాయి. కారణం, ఎపిసోడ్ లన్నీ ఒకే కథగా కాక, విడివిడి కథలుగా వుండడం. విడివిడి కథలు సినిమా అవదు, టీవీ షో అవచ్చు. సినిమా స్క్రీన్ ప్లే అంటేనే ఒక బిగినింగ్, ఒక మిడిల్, ఒక ఎండ్ అంటూ వుంటూ, ఒకే కథగా వుండడం. టీవీ ఎపిసోడ్లకీ బిగినింగ్, మిడిల్, ఎండ్ లుంటాయిఅయితే అవి ఎపిసోడ్ కా ఎపిసోడుగా వుంటాయి. సమస్యసంఘర్షణ - పరిష్కారం అనే పద్ధతిలో ఒక్కో ఎపిసోడ్ నడిచి, ఎపిసోడ్ కా ఎపిసోడ్ వాటి కథ ముగిసి పోతూంటుంది.  సినిమా స్క్రీన్ ప్లే అలాకాదు. ఒకే ఏక మొత్తం కథకి, ఒకే ప్రధాన సమస్యా, దాంతో సంఘర్షణా, దానికొక పరిష్కారమూ వుంటాయి. టీవీ ఎపిసోడ్లు కథల సంపుటి అయితే, సినిమా స్క్రీన్ ప్లే ఒకే నవల.

డ్రగ్స్ ఎపిసోడ్ కి తండ్రి పాత్ర సారధి 
         ఇలా విడివిడి ఎపిసోడ్లమయంగా సాగే కథనంతోనే 2003 లో టైగర్ హరిశ్చంద్ర  ప్రసాద్ఫ్లాపయ్యింది. 2014 లో తమిళ డబ్బింగ్ సిటిజన్ఫ్లాపయ్యింది. ఎంతో అనుభవజ్ఞుడైన స్టీవెన్ స్పీల్బెర్గ్ కూడా ఎపిసోడిక్ కథనానికి పాల్పడ్డంతో, 2001 లో తీసిన వార్ హార్స్ఫ్లాపయ్యింది. ఇక  2014 లో ‘ఆటోనగర్ సూర్య’ సరేసరి. 

         
కథ మీద కాక,  సీన్ల మీదా  సీక్వెన్సుల మీదా దృష్టి పెట్టడం వల్ల ఇలా జరుగుతుంది. దీన్నే స్టార్ట్ అండ్ స్టాప్ (ఎస్ ఎస్) టెక్నిక్ లేదా కథనం అంటారు. అంటే ఒక పాయింటుతో ఎపిసోడ్ ప్రారంభమై, ఆ పాయింటు గురించి చెప్పడం పూర్తవగానే, ఆ ఎపిసోడ్ స్టాప్ అయి, ఇంకో పాయింటుతో ఇంకో ఎపిసోడ్ స్టార్ట్ అవుతుంది. ఇలా ఒక్కో పాయింటుతో స్టార్ట్ అవుతూ, స్టాప్ అవుతూ – ఎక్కడపడితే అక్కడాగే పల్లె వెలుగు బస్సులా సాగుతూంటుంది మనం చూస్తున్న సినిమా. దీన్ని సినిమా అనుకుని వెళ్ళామా ఎపిసోడ్లకి చచ్చామే. హైదరాబాదుకే పోతోంది కదాని పల్లెవెలుగు బస్సెక్కినట్టు.

          ఉదాహరణకి ‘ఆటోనగర్ సూర్య’ (2014) లో ఇలా వుంటుంది... దీంట్లో ఒక ప్రధాన సమస్య దాంతో సంక్షోభం అనే కథా నడక వుండదు. ఎన్నో సమస్యలు, ఎన్నో సంక్షోభాలు, ఎన్నో ముగింపులూ!   డీజిల్ కారు తయారు చేస్తే, దాంతో ప్రత్యర్ధుల సంఘర్షణ, దానికో ముగింపు; తర్వాత బ్యాటరీ కారు తయారు చేస్తే, దాంతో ప్రత్యర్ధుల సంఘర్షణ, దానికో ముగింపు; మళ్ళీ తర్వాత కొచ్చిన్ ప్రయాణం కడితే, అక్కడ సంఘర్షణ, దానికో ముగింపూ; ఇంకాతర్వాత, యూనియన్ లో సభ్యత్వ సమస్యతో ఇంకో  సంఘర్షణా దానికో ముగింపూ; మళ్ళీ తర్వాత వాహనాల వేలం పాట సమస్య, దాంతో సంఘర్షణా, దానికో ముగింపూ...ఇలా ఎపిసోడ్ల సోడా బుడ్లు ఎడాపెడా పేలుతూంతాయి మనల్ని పారిపొమ్మంటూ!

          ఇలా ఎపిసోడ్ల సోడా బుడ్డి కథనాలతోనే ఇంకా
2003 లో టైగర్ హరిశంద్ర ప్రసాద్ఫ్లాపయ్యింది. 2014 లో తమిళ డబ్బింగ్ సిటిజన్ఫ్లాపయ్యింది. ఎంతో అనుభవజ్ఞుడైన స్టీవెన్ స్పీల్బెర్గ్ కూడా ఎపిసోడిక్ స్ట్రక్చర్ కి పాల్పడ్డం తో 2001 లో వార్ హార్స్ఫ్లాపయ్యింది.

గన్స్ ఎపిసోడ్ కి తండ్రి పాత్ర సారధి 
       ఈ బాపతు కథనం సినిమాలకి కాకుండా టీవీకీ, డాక్యుమెంటరీలకీ పనికొస్తుంది. పొరపాటున సినిమాల్లో పెట్టుకుంటే ఆరేడు ఎపిసోడ్లు వుండొచ్చు. కనీసం రెండు ఎపిసోడ్లు గడిస్తే గానీ ఇది ఎస్ఎస్ టెక్నిక్ అనీ, మనం బుక్కై పోయామనీ తెలుసుకోలేం. ఫస్టాఫ్ ప్రారంభమైనప్పుడు, ఓహో ఈ పాయింటుతో వెంటనే కథ ప్రారంభమైందని సంతోషిస్తాం. అది పుటుక్కున ముగిసిపోవడంతో, ఇదేమిటా అని చూస్తూంటాం. అప్పుడు ఇంకో పాయింటు ప్రారంభం కావడంతో, ఓహో ఇదన్నమాట అసలు కథనుకుని,  ఆసక్తిగా చూస్తూంటాం. అది కూడా పుసుక్కున ముగిసిపోవడంతో, అది కూడా ఇంటర్వెల్ లోపే కావడంతో, అప్పుడుగానీ అర్ధం కాదు – అడ్డదిడ్డంగా ఎపిసోడిక్ కథనాలకి బుక్కై పోయామని!

          వీటికి కనీసం ఇంటర్వెల్లో సెకండాఫ్ కి లీడ్ కూడా వుండదు.
There will be no hook at the mid - point to sustain the audiences interest anymore  - అన్నమాట. ఇక సెకండాఫ్ కోసం దేని గురించి కూర్చోవాలి? 

          ‘సంజు’ ఇలా కాదు. దీని ఎపిసోడ్లకి అపూర్వ లంకె పడింది. రెండు ఫ్లాష్ బ్యాక్  ఎపిసోడ్లని కలిపివుంచే ప్రధాన కథ తాలూకు ట్విస్టుతో ఇంటర్వెల్ మెలికపడింది
- cliff hanger moment. రెండూ విడివిడి ఎపిసోడ్లే అయినా, రెండిట్నీ నడిపే సారధి ఒకే పాత్ర- తండ్రి పాత్ర అవడంతో కథ తెగిపోయినట్టు వుండదు. ఈ రెండు ఎపిసోడ్స్ ని (ఫ్లాష్ బ్యాక్స్ ని) ప్రేరేపించేది ప్రధాన కథే కాబట్టి, ఇంకో డైమెన్షన్ లో ప్రధాన కథేమవుతుందన్న ఉత్కంఠ ఎలాగూ పనిచేస్తుంది. ఇలా 1. ఒక ఎపిసోడ్ నుంచి ఇంకో ఎపిసోడ్ కెళ్ళేందుకు ప్రధాన కథలో ఇంటర్వెల్ ట్విస్టు, 2. రెండు ఎపిసోడ్లనీ నడిపే సారధిగా తండ్రి పాత్ర సంఘర్షణ, 3. ప్రధాన కథతో ఉత్కంఠ – అనే మూడు డైమెన్షన్ లతో స్క్రీన్ ప్లే చెదిరిపోకుండా, ఫ్రాక్చర్ అవకుండా దిట్టంగా నిలబడింది.


సికిందర్