రివ్యూలు, సాంకేతికాలు, స్క్రీన్ ప్లే సంగతులు...

టికెట్లు దొరకడం యోగం, సినిమాలు చూడడం భోగం, రివ్యూలు రాయడం రోగం!

Monday, August 6, 2018

669 : స్పెషల్ ఆర్టికల్



          72వ స్వాతంత్ర్య దినోత్సవం ఒక కొత్త చరిత్రని మోసుకొస్తోంది. అంతగా ఎవరికీ తెలియని చారిత్రక ఘట్టం. అది వెండితెర మీద విశాలంగా ఆవిష్కృతమవబోతోంది. ఆగస్టు పదిహేను బుధవారం ఉదయం అక్షయ్ కుమార్ గోల్డ్ మెడల్ తెచ్చి ప్రదర్శించబోతున్నాడు.  ఒలింపిక్స్ గోల్డ్ మెడల్. విజేతల్ని లెజెండ్స్ గా మార్చిన గోల్డ్ మెడల్. హాకీనీ, దేశభక్తినీ, అక్షయ్ బ్రాండ్ వేల్యూనీ కలగలిపి ‘గోల్డ్’ అనే బయోపిక్ కాని బయోపిక్ థియేటర్లని అలంకరించబోతోంది. జెండా పండగతో కలిపి ప్రేక్షకులు జల్సా చేసుకోవడానికి నర్తించబోతోంది.  పదేళ్ళ క్రితం 2009 లో ఇలాటివే రెండు పండగలు ఒకేరోజు సందడి చేశాయి. ఒకవైపు శివరాత్రి, మరోవైపు ఎఆర్ రెహమాన్ కి ఆస్కార్ అవార్డు. అంతే, ఆ రోజంతా శివోహం రావాలతో, జైహో రాగాలతో మార్మోగింది. ‘స్లమ్ డాగ్ మిలియనీర్’ లో రెహమాన్ స్వరకల్పన చేసిన ‘జైహో’ గీతానికి ఆస్కార్ అవార్డు.

         
ప్పుడు పంద్రాగస్టు నాడు అక్షయ్ కుమార్ ఒలింపిక్స్ గోల్డ్ మెడల్. ఇప్పటికే ట్రైలర్ వైరల్ అయింది. భారత హాకీ జట్టు లండన్లో సవాలు విసిరిన ఘనచరిత్ర. ‘లగాన్’ లో దాస్య విముక్తి పొందని జాతి, క్రికెట్లో ఆంగ్లేయుల్ని బలాదూరు చేసిన చరిత్ర కాల్పనికమైతే, ఇది కాల్పనిక చరిత్ర. ఇక్కడ అపుడప్పుడే దాస్య శృంఖలాలు తెంచుకున్న జాతి కథే. కాకపోతే తెల్లవాడి సొంత గడ్డ మీదే కళ్ళుతిరిగేలా గోల్ కొట్టి రావడం హాకీ స్టిక్స్ తో.

          అక్షయ్ కుమార్, కుణాల్ కపూర్, వినీత్ కుమార్ సింగ్, అమిత్ సాథ్, అబ్దుల్ అమీన్, సన్నీ కౌశల్, మౌనీ రాయ్, నిఖితా దత్తా తదితర నటీనట శ్రేణి ఈ స్పోర్ట్స్ డ్రామాకి లీడర్స్. రీమా కాగ్తీ దర్శకురాలు. ఇంత భారీ పీరియడ్ డ్రామాని భుజాన కెత్తుకున్న నారీ మణి రీమా కాగ్తీ ఎవరంటే, ‘హనీ మూన్ ట్రావెల్స్’, ‘తలాష్’ అనే రెండు పరాజయం పాలైన సినిమాలు తీసిన దర్శకురాలే. ఈసారి విజయ  ప్రయత్నంతో ముందడుగేస్తోంది. అక్షయ్ తొలిసారిగా బెంగాలీగా కన్పిస్తాడు. నిరాశానిస్పృహలతో కుంగిన స్వదేశీ హాకీ టీంని భుజం తట్టి, విజయపథం వైపు నడిపిస్తాడు. స్వాతంత్ర్య సమర నేపధ్యంలో 1936  - 48 మధ్య కాలంలో టీం ఎదుర్కొన్న కష్టనష్టాలు, చిట్టచివరికి సుదూర కల - ఒలింపిక్స్ గోల్డ్ నిజం చేసుకునే అపూర్వ ఘట్టానికి దారితీయడం. అప్పటి విజేతలెవరి కథా కాదిది. అన్నీ కల్పిత పాత్రలే. లండన్లో జరిగిన 14 వ ఒలింపిక్స్ లో గోల్డ్ మెడల్ సాధించడ మొక్కటే యదార్థ సంఘటన. కల్పిత కథలతో స్పోర్ట్స్ మూవీస్ ఇటీవలి కాలంలో కొన్ని వచ్చాయి. చక్ దే ఇండియా, దంగల్ వంటివి. కల్పితమైనా బయోపిక్స్ అయినా పరాజయాల పాలు కాలేదు. విజేతల కథలు చెప్పే సినిమాలకి పరాజయాలుండవు. క్రీడలు కాకుండా ఇతర కథలతో తీసే స్టార్ మూవీస్ కి జయమో పరాజయమో చెప్పలేం. ఆ పాత్రలు  స్పోర్ట్స్ మూవీస్ లో వుండేలాంటి గెలుపు గుర్రాల పాత్ర చిత్రణలతో వుండవు. స్టార్ మూవీస్ లో పాత్రలు బోరు కొడతాయోమో గానీ, స్పోర్ట్స్ మూవీస్ పాత్రలు క్షణం క్షణం ఉత్తేజాన్ని నింపుతాయి వెండితెర మీద. 

          బాలీవుడ్ లో మసాలా హీరో సినిమాల కాలం తీరింది. ఇక కమర్షియల్ సినిమాలని పునర్నిర్వచించుకోవాలి. నియో కమర్షియల్స్ ని కనిపెట్టాలి. ఇందులో భాగంగానే జరుగుతున్న ప్రయత్నం బయోపిక్స్ తీయడం, లేదంటే పీరియడ్ కథలు తీయడం. ఇవి పోటీలు పడి తెరకెక్కుతున్నాయి. అయితే అదే పనిగా చరిత్రలూ పీరియడ్ లూ చూపిస్తూంటే కూడా బోరు కొడుతుంది ప్రేక్షకులకి. ఈ ట్రెండ్ కి ఆయుష్షు తక్కువే. ఉన్న టైంలో సొమ్ము చేసుకోవడమే. వయసైపోతున్న ఇప్పుడున్న సీనియర్ స్టార్స్ కి ఇదే చివరి అవకాశం. ఇటు రజనీ, కమల్ లని చూసినా ఇదే పరిస్థితి. వీళ్ళకి రాజకీయాలైనా వున్నాయి, బాలీవుడ్ సీనియర్ స్టార్స్ కి అవీ లేవు. 


          ‘రోబో – 2’  టీజర్ లాంచింగ్ మీట్ లో సల్మాన్ ఖాన్ ఈ నిజమే చెప్పాడు. తాము  ఒకే రకమైన సినిమాలు చేసీ చేసీ ఘనీభవించుకు పోయామనీ, ఇలాకాక అక్షయ కుమార్ కొత్త ప్రయోగాలు చేసుకుంటూ విస్తరిస్తున్నాడనీ. 

          నిన్న అక్షయ్ కుమార్ చేసిన కామెంట్ కూడా అతడి ఈ పంథాని ఖాయం చేస్తోంది. తను తల్చుకుంటే ఇప్పుడు ‘రౌడీ రాథోడ్ -2’ తీసి పుష్కలంగా డబ్బు సంపాదించుకో గల ననీ, కానీ అలాటి సినిమాలపై ఆసక్తి చచ్చి పోయిందనీ స్పష్టం చేసేశాడు. 

           ప్యాడ్ మాన్, టాయిలెట్ – ఏక్ ప్రేమ్ కథా, రుస్తుం, ఏర్ లిఫ్ట్, బేబీ...ఇప్పుడు ‘గోల్డ్’... ఇదీ అక్షయ్ కుమార్ మూసని బద్దలు కొడుతున్న విధం. ఈ నేపధ్యంలో ఆగస్టు 15 న ఏ రికార్డులు బద్దలు కొడతాడో చూద్దాం!

సికిందర్
(తెలుగు రాజ్యం డాట్ కాం)