రివ్యూలు, సాంకేతికాలు, స్క్రీన్ ప్లే సంగతులు...

టికెట్లు దొరకడం యోగం, సినిమాలు చూడడం భోగం, రివ్యూలు రాయడం రోగం!

Wednesday, April 11, 2018

633 : రైటర్స్ కార్నర్


          చయిత - దర్శకుడు సాకేత్ చౌదరి 2006 లో ‘ప్యార్ కే సైడ్ ఎఫెక్ట్స్’ తో వెలుగులో కొచ్చారు. ఆ తర్వాత చాలాకాలం విరామం తర్వాత,  2014 లో ‘షాదీ కే సైడ్ ఎఫెక్ట్స్’ తో ముందు కొచ్చారు. 2017 లో ఆయన తీసిన ‘హిందీ మీడియం’ తో గుర్తింపు పొందారు.  అయితే ఈ మూవీ బెంగాలీ నుంచి కాపీ అని వివాదా స్పదమైంది. అసలు సాకేత్ చౌదరి సినిమా రంగంలో కెలా వచ్చారు, సినిమా సినిమాకీ  అంతంత ఎడం ఎందుకుంటోంది, హిందీ మీడియం వివాదమేమిటి, ఆయన రచనా విధానమెలా వుంటుంది... మొదలైన విషయాలు ఆయనిచ్చిన ఈ ఇంటర్వ్యూలో తెలుసుకుందాం...

మీరు సినిమాల్లో కెలా వచ్చారు?
         
నేను పంజాబీని, ఢిల్లీలో పుట్టి పెరిగాను. మా నాన్న ఫార్మాస్యూటికల్స్ మార్కెటింగ్ లో వుండేవారు. నేను ఫిజిక్స్ లో గ్రాడ్యుయేషన్ చేశాక JEE రాసినా, ఆ విద్యా సంబంధ వృత్తుల్లోకి వెళ్ళాలన్పించలేదు. నేను బాగా ఎంజాయ్ చేయగల రచనా రంగాన్ని  ప్రయత్నిద్దామనుకున్నాను, అది జర్నలిజమైనా సరే, అడ్వర్టైజింగ్ అయినా సరే. దీంతో పుణెలో మాస్ కమ్యూనికేషన్స్ లో మాస్టర్స్ చేశాను. అక్కడే అంతర్జాతీయ సినిమాలతో, వివిధ కళాత్మక మూవీ మేకింగ్స్ తో పరిచయ మేర్పడింది. అది నన్ను అడ్వర్టైజింగ్ రంగంలో కాపీ రైటర్ గా  కాకుండా మూవీ మేకింగ్ వైపు మళ్ళించింది. అయినా కూడా ఎందుకో యాడ్  ఫిలిం కంపెనీలో అసిస్టెంట్ డైరెక్టర్ గా చేరాను. అప్పుడు నాకు 21 ఏళ్ళు. చిన్న చిన్న టీవీ షోలు కూడా రాయడం ప్రారంభించాను. అలా శేఖర్ సుమన్  ‘మూవర్స్ అండ్ షేకర్స్’ పాపులర్ టీవీ ప్రోగ్రాం కి హెడ్ రైటర్ గా పని చేసే అవకాశం వచ్చింది. ఇక సినిమాల మీద ఓ చెయ్యేస్తే బావుంటుందన్పించింది. దర్శకుడు అజీజ్ మీర్జా దగ్గర అసిస్టెంట్ గా చేరాను. ఆయన అప్పుడు షారుఖ్ ఖాన్ తో ‘ఫిర్ భీ దిల్ హై హిందూస్తానీ’ తీస్తున్నారు. అదే నేను సినిమాలకి రాయడం మొదలు. దానికి సంతోష్ శివన్ సినిమాటోగ్రాఫర్ గా పనిచేస్తున్నారు. ఆయన నా పనితనం చూసి, ‘అశోకా’ కి రాస్తావా అనడిగారు. అలా నేను సినిమా రచయితనై పోయాను.

ఈ ప్రయాణంలో మిమ్మల్ని ప్రోత్సహించిన వారెవరు? 

       సొంతంగా నా మొదటి స్క్రిప్టు ‘ప్యార్ కే సైడ్ ఎఫెక్ట్స్’ రాసినప్పుడు నిర్మాతలెవరూ దొరకలేదు. నటుడు రాహుల్ బోస్ ని కలుకున్నప్పుడు నా రూటు క్లియరైంది. ఆయన నిర్మాత రంగితా నందికి పరిచయం చేశారు. రంగితా నంది ప్రొడ్యూస్ చేయడానికి అంగీకరించారు. నేను ముంబాయి వచ్చినప్పుడు,  మొదటి సంవత్సరమంతా  ఆర్ధికంగా నా పేరెంట్స్ ఆదుకున్నారు. ఆ తర్వాత  ఆర్ధికంగా నేను దారిలో పడ్డాను. ఇలా నన్ను ప్రోత్సహించిన వారిలో అజీజ్ మీర్జా ముఖ్యులు. ఆయన దగ్గర నేను సెవెంత్ అసిస్టెంట్ నైనా,  కథా రచనలో నన్ను అనుమతించే వారు. తన ముందు నిస్సంకోచంగా నా అభిప్రాయాలు వెల్లడించమనే వారు.  సూపర్ స్టార్ షారుఖ్ ఖాన్ దగ్గరికి కూడా నన్నుతీసికెళ్లి  నా అభిప్రాయాలు వెల్లడించే అవకాశం కల్పించారు. దీంతో నాకు ఆత్మవిశ్వాసం బాగా పెరిగింది. ఆయన చాలా ఓపెన్ గా వుండేవారు. ఎవరూ తన ముందు భయపడ్డాన్నిఆయన  ఒప్పుకునే వారు కాదు. ఆయన దర్బారులో విస్కీ సేవనంలో మమ్మల్ని కూడా కూర్చో బెట్టుకునే  వారు. మేమంతా ఆయనతో విస్కీ సేవిస్తూ మా అభిప్రాయాలు వెల్ల డిస్తూంటే ఆయన గర్వంగా ఫీలయ్యే వారు. స్వతంత్రంగా ఆలోచించడం ఆయన దగ్గరే నేను నేర్చుకున్నాను. 

          తర్వాత సంతోష్ శివన్. నాకప్పుడు పాతికేళ్ళే. అయినా ‘అశోకా’ స్క్రిప్టు రాయడానికి ఆయన నన్ను ప్రోత్సహించారు. ధైర్య మిచ్చారు. ఛాయాగ్రహణంలో   ఆయన నిష్ణాతుడు. ఏం చేయాలనుకున్నా ఆయన నిర్భయంగా చేసేస్తారు. నేను ఢిల్లీలో ఐదో తరగతి చదువుకుంటున్నప్పుడు, నేను రచయితనవుతానని టీచర్స్ తో చెప్పినట్టు గుర్తుంది. వాళ్ళు నన్ను చూసి నవ్వలేదు,  పైగా ప్రోత్సహించారు. నా పేరెంట్స్ కూడా నన్ను మందలించలేదు. ఐదో తరగతిలో వున్నప్పుడే నేను కథలు రాయడం చూసి ప్రోత్సహించే వారు.

మీరు తీసిన షాదీ కే సైడ్ ఎఫెక్ట్స్ లో ఫర్హాన్ అఖ్తర్, విద్యా బాలన్ లు నటించారు. ఫర్హాన్ అఖ్తర్ తో మీ అనుభవాలేమిటి?
          ఆ స్క్రిప్టు లో ఆయన పూర్తిగా ఇన్వాల్వ్ అయిపోయారు. నటుణ్ణి రూపొందించేది స్క్రిప్టే నని ఆయన నమ్ముతారు. దీంతో స్క్రిప్టుల్ని శ్రద్ధగా చదువుతారు. నా స్క్రిప్టులో ఏవైనా తనకి  అభ్యంతరాలుంటే  సున్నితంగా చెప్పేవారు. ఆయన చెప్పే విధానానికే నేను పడిపోయే వాణ్ణి. ఆయనతో ఒకటే జరుగుతుంది.  ఆయన చెప్పిందైనా నేనొప్పుకోవాలి, లేదా నేను చెప్పిందైనా ఆయనొప్పుకోవాలి. ఇద్దరూ ఒప్పుకోక నాన బెడితే ఆయన ఒప్పుకోరు. ఆయన  చాలా కాన్సంట్రేషన్ తో పనిచేస్తారు. సెట్లోఅల్లరి, ఆరుపులు వినిపిస్తే భరించలేరు. అన్నీ నిశ్శబ్దంగా పద్ధతిగా జరిగిపోవాలని కోరుకుంటారు. సెట్స్ లో ప్రశాంతతని కాపాడుతూ నటీనటులకి వాళ్ళ స్పేస్ నివ్వాలని అప్పట్నించే నేర్చుకున్నాను.

విద్యాబాలన్ గురించి? 
     ఆమె నాల్గు సార్లు స్క్రిప్టు చదివారు. రెండు సార్లు నాతో కథ చెప్పించుకున్నారు. ప్రాజెక్టు మీద ఆమెకు నమ్మకం కుదిరితే ఇక పూర్తిగా అంకితమైపోతారు. ఆ మూవీలో ఆమె, ఫర్హాన్ నివసించే ఇల్లొకటి చూసి సిద్ధం చేశాం. షూటింగ్ కి ఒకరోజు ముందామె  అక్కడికి వెళ్లి ఆ ఇంట్లో గడిపి  ఆ ఇంటికి అలవాటు పడ్డారు. తన పాత్ర ఇష్టాయిష్టాల ప్రకారం ఇల్లెలా వుండాలో అలా సామాన్లు అటూ ఇటూ మార్చారు. అది తన పాత్ర ఇల్లే అనుకుని లీనమైపోయి దాన్ని ఓన్ చేసుకునే దాకా రోజంతా అక్కడే వుండిపోయారు. ఎడతెరిపి లేకుండా ఆమె స్క్రిప్టు గురించి చర్చిస్తూ నా జీవితానుభవాలనీ అడిగి తెలుసుకునే వారు. అలాగే తన జీవితా నుభవాలేమైనా వుంటే వాటిని  కూడా రిఫరెన్సులుగా తీసుకునే వారు. తనేదో  కల్పించిన నటనని పాత్ర మీద రుద్దకుండా, జీవితానుభవాల్లోంచి తీసుకుని నటించేవారు.

          ఆ సినిమా కథ ఒక జంటకి బిడ్డ పుడితే వాళ్ళ జీవిత మెలా వుంటుందనే దాని గురించి. విద్య సోదరి తల్లి కాబట్టి ఆమెనుంచి రిఫరెన్సులు తీసుకున్నారు. ఫర్హాన్ ప్రశాంత వాతావరణంలో పని చేయడాని కిష్టపడితే, విద్య  గందరగోళ వాతావరణమున్నా లెక్క చెయ్యరు. ఇద్దరూ దర్శకత్వ నేపధ్య మున్న వాళ్ళే. ఫర్హాన్ తనే ఒక దర్శకుడు, విద్య ఒక టీవీ దర్శకుడి దగ్గర అసిస్టెంట్ గా పని చేశారు. నటులు స్క్రిప్టు లు చదివితే నాకెంతో ఆనందంగా వుంటుంది. కానీ అలా చదివేవాళ్ళు తక్కువ, వినే వాళ్ళే  ఎక్కువ. ఫర్హాన్,  విద్యా బాలన్ లు స్క్రిప్టు క్షుణ్ణంగా చదవడమే కాదు, నోట్సు కూడా రాసుకుని చర్చిస్తారు.

రచయితల సంఘంలో ఎగ్జిక్యూటివ్ సభ్యుడిగా మీరేం చెప్తారు?
         
రచయితల సంఘంతో నాకు విడదీయరాని అనుబంధముంది. రచయితలకి పారితోషికాల విషయంలో, గుర్తింపు విషయంలో అశ్రద్ధ చేయకూడదని నేనంటాను. విజయవంతమైన సినిమాకి కథే మూలమంటాం గానీ, ఆ రాసేవాళ్ళని చిన్న చూపు చూస్తాం. బాలీవుడ్ లో రచయితలకి పది లక్షల నుంచి ఎనభై లక్షల  దాకా ఇస్తున్నారు. కానీ ఒక సినియర్ దర్శకుడికి 7 - 8  కోట్లు ఇస్తున్నారు. నేను రచయితని, దర్శకుణ్ణి కూడా. నాలో రచయిత కంటే దర్శకుడే కొన్ని రెట్లు ఎక్కువ పొందుతున్నాడు. రచయిత ఒక కథని అందించడం ద్వారా ఎందరికో ఉపాధిని  కల్పించే వాడవుతాడు. అతను రాస్తేనే సినిమాలో మిగతావాళ్ళకి పనీపాటలు లభిస్తాయి. మరి దర్శకుడు పొందే పారితోషికంలో రచయిత కేవలం పది శాతమే పొందడ మేమిటి? రచయిత రాయకపోతే దర్శకుడెలా దర్శకత్వం వహిస్తాడు? నిర్మాత అనొచ్చు, నేను డబ్బు పెట్టక పోతే మీరేం సినిమా తీయలేరని. కానీ సినిమా తీయడానికి కథే లేకపోతే, ఆయన దగ్గరున్న డబ్బు మీద బ్యాంకు వడ్డీకి మించి ఆదాయాన్ని గడించలేరు. కాబట్టి రచయితకి న్యాయమైన  రాయల్టీ, ఇవ్వాల్సిన  గుర్తింపూ ఇవ్వడం నాగరిక సమాజపు లక్షణమంటాను.  

స్క్రిప్టుని మీరెలా కాపాడుకుంటారు?
         
రచయితల సంఘంలో నేను డిస్ప్యూట్ కమిటీలో వున్నప్పుడు,  రచయితలు సాటి రచయితల  కథల్ని ఎలా దొంగిలిస్తారో తెలుసుకున్నాను. అప్పట్నించీ లీగల్ ప్రాసెస్ ని అనుసరించాను. లాయర్ని పెట్టుకుని కథని రిజిస్ట్రేషన్ చేయించుకున్న తర్వాతే ఎవరికైనా కథ  విన్పించడం మొదలెట్టాను.

మీ మొదటి సినిమా ప్యార్ కే సైడ్ ఎఫెక్ట్స్ తర్వాత ఏడేళ్ళు మీరు కన్పించలేదు,  ఏమయ్యారు?
జీనత్ లఖానీ 

       ప్యార్ కే సైడ్ ఎఫెక్ట్స్  తర్వాత రాసిన స్క్రిప్టు బాగా రాలేదు. ఏడాదిన్నర కాలం దాంతో వృధా అయింది. అప్పుడు షాదీ కే సైడ్ ఎఫెక్ట్స్  రాశాను. రెండో మూవీగా ఇది రాయడం కూడా మొదట్లో నాకిష్టం లేదు. తర్వాత సమాధాన పడ్డాను. మళ్ళీ కొన్ని నెలలు పొద్దున్నే లేచి కంప్యూటర్ ముందు కూర్చుని రాయడమంటే,  లేని గ్యారంటీ కోసం చెమటోడ్చడమే. పైగా ఈ పనితో ఒంటరిగా పాట్లు పడాలి. ఎదురుగా బ్లాంక్ గా  కన్పించే పేజీ తర్వాత పేజీని అక్షరాలతో నింపడం మామూలు పని కాదు. అప్పుడు నా భవిష్యత్తు ఏమిటో నాకే అంచనా కందట్లేదు.  కాబట్టి కనీసావసరాలు కూడా వీలైనంత తగ్గించుకుని గడిపాను. చుట్టూ మన ఫ్రెండ్స్ మన కంటే మంచి స్థితిలో వుండడం చూస్తూ కూడా మన కోసం మనం  ఏమీచేసుకోలేని పరిస్థితుల్లో వుండడమనేది బాధాకరమే. ఫైనల్ గా అప్పుడొకటే అనుకున్నాను – ఏమైనా రాయడమే నా వృత్తి. మరి రాయడమే నా వృత్తిగా స్వీకరించినప్పుడు సుందర భవిష్యత్తుని వూహించలేను. ఇతరుల్లాగా  సుఖవంతమైన జీవితాన్ని కోరుకోలేను. కాబట్టి జీవితంలో నేనెక్కువ ఆశలు పెట్టుకోకుండా జీవించక తప్పదు...


          నా కో- రైటర్ అంటే నా భార్య జీనత్ లఖానీ రచయిత్రే కాబట్టి నా ప్రయాణం కొంత సులభమైంది. షాదీ కే సైడ్ ఎఫెక్ట్స్ ఆమెకి మొదటి సినిమా కాబట్టి, దాని కోసం ఏళ్ల  తరబడి నిరీక్షించడం రైటర్ గా ఆమెకూ భారమైపోయింది. ఈ కాలంలో నా పేరెంట్స్ కూడా నా గురించి ఆందోళన చెందారు. కానీ పైకి చెప్పుకోలేదు. మనకి ఎమోషనల్ ఫ్రీడం ఇచ్చి, స్వతంత్రంగా మనం ఏం చేపట్టినా మనకి అభ్యంతరం చెప్పని పేరెంట్స్ వుండడం ఒక అదృష్టమే. నేనేం చేసినా సంతృప్తి కోసమే చేయాలి గానీ,  ఇతరులని సంతృప్తి పర్చడం కోసం కాదు కదా?

షాదీ కే సైడ్ ఎఫెక్ట్స్ పురుష భావజాలంతో వుందని, స్త్రీ గళం మిస్ అయిందనీ  విమర్శలొచ్చాయి కదా, దీనికేమంటారు?
          విమర్శల్ని నేనర్ధం జేసుకోగలను. కానీ అది పురుష భావజాలమనుకోను. ఆ పాత్ర దృక్కోణం. ఒక స్క్రిప్టు రాస్తున్నప్పుడు ఒక నిర్ణీత దృక్కోణాన్ని దృష్టిలో పెట్టుకుంటాం. ఒక పాత్ర దృక్కోణం మొత్తం ఆ పాత్ర జెండర్ భావజాలం కానవసరం లేదు.

ప్యార్ కే సైడ్ ఎఫెక్ట్స్ యూత్ ని టార్గెట్ చేస్తూ మల్టీప్లెక్స్ మూవీగా తీశారా? చిన్న బడ్జెట్ సినిమాలకి బాక్సాఫీసు కలెక్షను వుండాలంటే యూత్ ని టార్గెట్ చేసే స్క్రిప్టు లుండాలం
టారా?
         
ఈ రోజుల్లో ఏ సినిమానైనా యూత్ నే టార్గెట్ చేస్తూ తీయాలి. బాధ్యతలు వుండని వాళ్ళ దగ్గర ఖర్చు పెట్టుకోవడానికి పుష్కలంగా డబ్బులుంటాయి. థియేటర్లని పట్టుకుని వేలాడుతూ వుండేది కూడా వాళ్ళే.

సినిమాకి కథని ఎంపిక చేసుకోవాలంటే  మీ థాట్ ప్రాసెస్ ఏమిటి?
         
ఐడియా నాకు స్పూర్తి నివ్వాలి. ఆ ఐడియాతో జీవితం గురించి, మనుషుల గురించి, ఇంకా నా దృష్టికి రాని ప్రపంచం గురించీ చెప్పడానికి వీలవ్వాలి.

సినిమాకి సినిమాకీ మీరింత గ్యాప్ తీసుకుంటున్నారంటే మీరు వుడీ అలెన్ కాదల్చుకో లేదా?  ఆయన ప్రతీ ఏటా ఒక సినిమా తీసి విడుదల చేస్తారు...
         
నేను దర్శకుడుగా ఎదిగే క్రమంలో ఆయనలా గొప్ప దర్శకుడు కావాలనే ఆశయం పెట్టుకున్నాను. అయితే ఆయనకున్న టాలెంట్స్ నాకున్నాయనుకోను.

రచించడం కష్ట సాధ్యమైన పని. నెలల తరబడి బ్లాంక్ పేజీలని చూస్తూ గడపడం గురించి మీరే చెప్పారు. అసలు మీ రైటింగ్ ప్రాసెస్ ఏమిటి?
         
నేనొక ప్రాసెస్ ని క్రియేట్ చేయడానికి ప్రయత్నించాను. నేను రాయడానికి కూర్చున్నప్పుడు బ్లాంక్ పేజీ లనేవి వుండకూడదు. అంటే ఏం రాయాలో,  ఎలా రాయాలో మైండ్ లో ముందే రూపు దిద్దుకుని వుండాలి. రాస్తున్న విషయం మీద వీలైనంత రీసెర్చి కూడా చేసి వుండాలి. రీసెర్చి చేసినప్పుడు మన ఆలోచనలు వికసిస్తాయి. విషయం మీద అవగాహనా, పట్టూ పెరుగుతాయి. కొత్త కోణాలు స్ఫురిస్తాయి. ఎంత  ఎక్కువ రీసెర్చి చేస్తే, రాయడంలో అంత శ్రమ తగ్గుతుంది.

మీ ఆవిడతో మీరు కలిసి రాస్తున్నప్పుడు అదెలా జరుగుతుంది? ఏ రచయిత కా రచయితా తన భావాలతో అంత ఉదారంగా వుండరు కదా?
         
మా ఇద్దరి విషయంలో ప్రధానంగా చెప్పాల్సిందేమిటంటే,  నా కథ - నీ కథ అని అనుకోం,  మన కథ అనుకుంటాం. మనకథ అనుకుని భావాలు పంచుకుంటూ కలిసి ఇద్దరం రాస్తాం. ఒకరు పైచేయిగా చెప్తూంటే ఇంకొకరు తలవంచుకుని రాసే విధానం పాటించం.

మీ సినిమాలు స్త్రీ పురుష సంబంధాల గురించే వుంటున్నాయి. వివాహం ప్రధానాంశంగా
వుంటోంది. మీ మూడో ప్రయత్నం ‘హిందీ మీడియం’ సహా. ప్రత్యేక కారణా లేమైనా వున్నాయా?

          ఒక ఐడియా గురించి ఆలోచిస్తూంటే అందులోంచి మరికొన్ని ఐడియాలు పుట్టుకొస్తూంటాయి. ప్యార్ కే సైడ్ ఎఫెక్ట్స్ గురించి ఆలోచిస్తున్నప్పుడు,  షాదీ కే సైడ్ ఎఫెక్ట్స్ ఐడియా వచ్చింది. షాదీ కే సైడ్ ఎఫెక్ట్స్ కి రీసెర్చి చేస్తున్నప్పుడు,  హిందీ మీడియం ఐడియా తట్టింది. అందువల్ల మూడూ వివాహం  ప్రధానాంశంగా వచ్చాయి. ఐతే వాటి జానర్స్ ని బట్టి టోన్ మారింది. 

మీ తాజా హిందీ మీడియం గురించి చెప్పండి, దీనికి బాగా గుర్తింపు వచ్చినట్టంది?  
      అవును, ఇది పూర్తిగా వేరే సెటప్. ఇది కయ్యాలు పెట్టుకునే జంట కథ కాదు. ముగ్గురు సభ్యులున్న కుటుంబ కథ. భార్య, భర్త, వాళ్ళ కూతురు. చుట్టూ బిజీ ప్రపంచం మధ్య వాళ్ళ జీవితం. ముగ్గురూ ముఖ్యులే. ముగ్గురి మాటకీ విలువుంది. సమాజంలో స్థానంకోసం తాపత్రయ పడే మధ్య తరగతి కుటుంబ కథ. మరో వైపు సంపన్న కుటుంబానికి చెందిన ఇంకో  జంట. వీళ్ళకి సామాన్యులు ఎలా జీవితాల్ని నెట్టుకొస్తారో, తమ అందుబాటులో అవకాశాల్లేక ఎలా పైకొస్తారో అంతా ఆశ్చర్యంగా వుంటుంది.

కానీ ఈ కథ బెంగాలీ మూవీ ‘రాంధను’ నుంచి కాపీ చేశారని ఆరోపణ లొచ్చాయి కదా? కథల దొంగతనం గురించి చెప్పిన మీరే కథని దొంగిలించారంటారా?          
        తొందరపడి వివాదం చేశారు. హిందీ మీడియం గురించి మరింత మరింత సమాచారం బయటి కొస్తూంటే నిజాలేమిటో తెలిశాయి. ఈ మూవీ కథ ఒరిజినల్ మెటీరియల్. మా ఆవిడా నేనూ డెవలప్ చేశాం. షాదీ కే సైడ్ ఎఫెక్ట్స్ కథ కోసం రీసెర్చి చేస్తూంటే, అనుకోకుండా ఒక ఆర్టికల్ మా దృష్టికొచ్చింది. ఒకాయనకి కేవలం ఆర్ట్స్ డిగ్రీ వుందని ఆయన కుమార్తెకి స్కూల్లో అడ్మిషన్ నిరాకరించారు. దీంతో ఆయన కుమార్తెకి స్కూల్లో అడ్మిషన్ పొందడం కోసం  ఎంబీఏ కోర్సులో చేరాడు. ఇది మమ్మల్ని కదిలించింది. ఒక స్టోరీ ఐడియాగా ఫిక్స్ అయిపోయింది. ఈ అంశం మీద మేమెందరో పేరెంట్స్ ని కూడా కలిసి సమచారం సేకరించాం.

ఈ స్క్రిప్టు రాయడంలో ఎదుర్కొన్న సవాళ్ళేమిటి? 
           
కథలో కుమార్తెకి ఇంగ్లీష్ మీడియం స్కూల్లో అడ్మిషన్ కోసం ఆ పేరెంట్స్ ఇంటర్వ్యూ నెగ్గాలని అనుకున్నాం.  మొదటి డ్రాఫ్టు అంత బాగా రాలేదు. మళ్ళీ కథని దిద్దాం. విద్యా హక్కు చట్టాన్ని కథలో ఒక ఎలిమెంటుగా ప్రవేశ పెట్టాం. ఈ చట్ట ప్రకారం పిల్లలూ పేరెంట్స్ ఎవరూ కూడా స్కూళ్ళల్లో  అడ్మిషన్ కోసం ఇంటర్వ్యూలు ఎదుర్కోవాల్సిన అవసరం లేదు. ఈ ముఖ్య సందేశం మేమనుకున్న కామెడీ కథలోంచి రావాలనుకున్నాం. ఈ మేరకు కథని  సరిదిద్దాక బలంగా వచ్చింది.      

హిందీ మీడియం ప్రధాన స్రవంతి కమర్షియల్ సినిమాలనుంచి పక్కకెళ్ళింది. ఈ మార్పు మీకు సవాలుగా  అన్పించలేదా?
          ఈ సమస్య పర్సనల్ గా మమ్మల్ని కదలించింది. అదృష్టం కొద్దీ ప్రధాన స్రవంతి ప్రేక్షకుల్ని కూడా కదిలించింది. దీంతో వూపిరి పీల్చుకున్నాం. ఇది ప్రధాన స్రవంతి సినిమా కాకపోయినా సీరియస్ సినిమా ఏమీ కాదు, ఫన్నీగా ఎమోషనల్ గా తీశాం.

హిందీ మీడియం రైటింగ్ ప్రాసెస్ చెప్పండి? 
     ఒక టాప్ స్కూల్లో తమ కుమార్తెకి అడ్మిషన్ నిరాకరించిన  నేపధ్యంలో ఆమె పేరెంట్స్ పడే సంఘర్షణ మా కథ ఐడియా. ఐడియాకి ఇదే లాగ్ లైన్. దీంతోనే స్ట్రక్చర్ కెళ్ళాం. ఇందాకే చెప్పినట్టు చాలా రీసెర్చి చేశాం. రాయడానికి మొదలెట్టినప్పుడు రాసింది పూర్తిగా వేరు. అది పక్కన బెట్టి తిరిగి ఫ్రెష్ గా  రాయడం మొదలెట్టాం. పరస్పరం మాకొచ్చే ఐడియాలని శల్యపరీక్ష చేసేవాళ్ళం. సెట్ అయిన ఐడియాలతో సీన్లు రాసే వాళ్ళం. ఆ సీన్లన్నీ సినిమాలో రాకపోవచ్చు గానీ, మేం రాయాలనుకుంటున్న దాని గురించి ఒక స్పష్ట వచ్చేందుకవి ఉపయోగపడ్డాయి. అలా వంద పేజీలు  రాశాక, మళ్ళీ వెనక్కొచ్చి పోస్ట్ మార్టం మొదలెట్టాం.  
  
          పేరెంట్స్ ఎవరైనా పిల్లలకి మంచి విద్యే ఇవ్వాలనుకుంటారు. మన  దేశంలో చాలామంది పేరెంట్స్ కి మంచి విద్య అంటే ఇంగ్లీషు మీడియమే. పిల్లలుగా తాము నోచుకోని ఇంగ్లీషు మీడియం విద్యని తమ పిల్లలకివ్వాలనుకుంటారు. మేం ఇలా చాలా మంది ఇలాటి పేరెంట్స్ ని కలిశాం. వాళ్ళు ప్రభుత్వ పాఠశాలల్లోనే చదువుకున్నారు. ఐదో తరగతో ఆరో తరగతో వచ్చేదాకా ఇంగ్లీషే నేర్చుకోలేదు. ప్రభుత్వ బళ్ళల్లో ఇంగ్లీషు నేర్చుకోవడం మొదలెట్టాక ధారాళంగా మాట్లాడ్డం కూడా వాళ్లకి రాలేదు. వాళ్ళు ఉద్యోగాల వేటలో పడ్డాక, వాళ్ళ విద్యార్హతలతో వాళ్లకి ఉద్యోగాలు కూడా రాలేదు. ఎమ్మెస్సీ చదివిన ఒకాయన్నికలిశాం. ఆయన ఒక మాల్ లో సెక్యురిటీ గార్డు ఉద్యోగానికి అర్హుడయ్యాడు. ఇంగ్లీషు  విద్య లేకపోతే జాబ్ మార్కెట్ లో జీవితాలెలా డిసైడ్ అయిపోతాయో దీన్నిబట్టి అర్ధం జేసుకున్నాం.

          కథ చేస్తున్నప్పుడు ఇవన్నీ పనికొచ్చాయి. ఈ రీసెర్చి వల్ల విద్యారంగం గురించి తెలియని చాలా విషయాలు తెలిశాయి. మంచి విద్య అంటే ఇంగ్లీషు విద్యే, ఆ ఇంగ్లీషు విద్య పొందాలంటే తాహతుకి మించిన టాప్ కార్పొరేట్ స్కూళ్ళల్లో చదివించాల్సిందే. ఇదంతా పక్కన బెడితే,  అసలు తల్లిదండ్రులకి ఆ స్కూళ్ళు డిమాండ్ చేసే క్వాలిఫికేషన్స్ వుండి తీరాలి. కానీ ఇంకో కోణంలో చూడగల్గితే, ఇవన్నీ కాదు –తల్లిదండ్రులు తమ పిల్లలకిచ్చే గొప్ప బహుమతి ఏమిటంటే,  ఆకలి. అంటే అన్నంతో తీర్చుకునే కడుపాకలి కాదు, జ్ఞానంతో తీర్చుకునే బౌద్ధిక ఆకలి. ఈ ఆకలి పుట్టిస్తే పిల్లలు వాళ్ళేం  చేయాలో మార్గం వాళ్ళే వెతుక్కుంటారు. ఏదైనా సాధిస్తారు. బౌద్ధిక ఆకలి పుట్టించాలి. చాలా మంది పేరెంట్స్ కి  తమ పిల్లలు చదువుకోవడంలో, కష్టపడి పనిచేయడంలో మధ్య తరగతి విలువల్ని ఎందుకని ప్రతిబింబించరో  అర్ధం గాకుండా వుంటోంది. కారణం వాళ్ళల్లోనే వుంది. పిల్లలు కోరిందల్లా కోరికలు తీర్చేస్తున్నారు. కొరత ఏర్పర్చి నప్పుడే పిల్లలు మధ్య తరగతి విలువలతో వుంటారు. లేకపోతే  వాళ్ళు అలవాటు చేసుకున్న సంస్కృతిని ఎవరూ ఆపలేరు.

కథలో రెండు థీమ్స్ ప్రతిఫలిస్తూ వుంటాయి : మంచి స్కూల్లో చేర్పించే స్ట్రగుల్, రెండవది ఇంగ్లీసు భాషతో అభద్రతా భావం. దేన్ని మీరెక్కువ ఫోకస్ చేశారు? 
     రెండూ పెనవేసుకుని వుంటాయి. పాయింటేమిటంటే,  ఈ దేశం పిల్లలకు ఎదిగే అవకాశాలు కల్పించాలి. మనమందరం సమానస్థాయికి ఎదగ లేకపోవచ్చు, కానీ ఎదిగేందుకు సమాన స్థాయి అవకాశాలు కల్పించాలి. బాల్యంలోనే ఈ అవకాశాలకు దూరం చేస్తున్నారు. విద్యారంగం సమానస్థాయిలో లేదు. ఒక వైపు కార్పొరేట్ స్కూళ్ళు, ఇంకోవైపు ప్రభుత్వ బళ్ళు. లేదా ఇంగ్లీష్ మీడియం స్కూళ్ళు, హిందీ మీడియం స్కూళ్ళు. బాల్యం లోనే పిల్లలు ఇంత వ్యత్యాసం తో వుంటే, వాళ్ళు ఎదిగాక ఎంత అశాంతి  వుంటుందో మీరే వూహించండి. ఈ తేడాలు వెన్నాడుతూ జీవితాల్ని ప్రభావితం చేస్తాయి.

ఏ రకమైన కామెడీని ఇందులో సృష్టించారు?
         
కథావస్తువుని చూసినప్పుడు అందులో  ఏది సహజంగా హాస్యం పుట్టిస్తోందో తెలిసిపోతుంది. కథలో పేరెంట్స్ పాత్రలకి అది కామెడీగా అన్పించక పోవచ్చు. చూసే చుట్టూ పాత్రలకి చాలా  కామెడీగానే వుంటాయి  ఆ పేరెంట్స్ పాట్లు. ఈ పోటీ ప్రపంచంలో పెద్ద స్కూల్లో ప్రవేశం సంపాదించడానికి ఎంతకైనా తెగిస్తున్నారు సామాన్యులు. ఆ తెగింపుని  హాస్యం చేయడమే మేం సృష్టించిన కామెడీ.

హీరో పాత్రకి ఇర్ఫాన్ ని ముందే అనుకున్నారా?
          లేదు, రాస్తున్నప్పుడు సినీమా నటులెవరి గురించీ ఆలోచించలేదు. ఢిల్లీ కరోల్ బాగ్ లో ఒకడుంటాడు, డిజైనర్ లంగాలు కుట్టే వాడు. అతను సరిగ్గా సరిపోతాడన్పించేది. అతడిలా సింపుల్ హాస్యాన్ని ఒలికించే నటుడు తర్వాత ఇర్ఫానే తోచాడు. ఇర్ఫాన్ గ్రేట్ యాక్టర్.  ఆయన పాత్రలోకి దూరి నటిస్తున్నట్టు, నవ్విస్తున్నట్టు కన్పించడు. పాత్రగానే పుట్టినట్టు అన్పిస్తాడు. ఇర్ఫాన్ ని అనుకున్నాక ఇక వెనక్కి తిరిగి చూళ్ళేదు.

హీరోయిన్ గా పాకిస్తానీ నటి సబా ఖమర్ ని తీసుకున్నారు, ఇబ్బందులేమీ రాలేదా? 
      కొన్ని పాకిస్తానీ సీరియల్స్ లో ఆమెని చూశాక ఇక రెండో ఛాయిస్ ఆలోచించలేదు. ఆమె జాతీయత గురించికూడా ఆలోచించకుండా ఆమెనడిగాం. 2016 లో ఇక షూటింగ్ పూర్తవుతోందనగా పాకిస్తానీ  నటుల మీద నిషేధపు గొడవలు ప్రారంభమయ్యాయి. మాది చిన్న సినిమా కావడంతో సమస్యలు ఎదురుకాలేదు. అప్పటికే ఆమె సీన్లు షూట్ చేసేశాం. కొద్ది రోజులు గడిచాక ఆ  నిషేధపు గొడవలు సద్దుమణిగి పోయాయి. కాబట్టి సినిమా విడుదలయ్యాక ఆమె టార్గెట్ కాలేదు.

హిందీ మీడియం విజయం సాధించింది...దాన్ని తీసుకుని ఎందరు నిర్మాతల దగ్గర మీరు తిరిగారు? ఇలాటి కొత్త ఐడియాలని  నిర్మాతలు సంయమనంతో జడ్జి చేయడం అంత సులభంగా సాధ్యపడుతుందా?
         
మూల కథ మా ఆవిడ జీనత్ కి స్ఫురించింది. ఆమే నిర్మాతల్ని ప్రయత్నించింది. ఇంకా ఐడియాగా వున్నప్పుడే నిర్మాతలకి చెప్పేది. నిర్మాతలు భూషణ్ కుమార్, కృష్ణ కుమార్ లు వెంటనే దాని లాభదాయకతని  జడ్జి చేసేశారు. అంతకి ముందే వాళ్ళకి సినిమా చేయడనికి అడ్వాన్సు తీసుకున్నాను కాబట్టి, స్టోరీ డెవలప్ మెంట్ ఫండింగ్ పెద్ద రిస్కు కాలేదు. సాధారణంగా తెలిసున్న రెగ్యులర్ కథకి, హీరోని ఒప్పించుకుంటే,  స్టోరీ డెవలప్ మెంట్ ఫండింగ్ నిర్మాతలే చేస్తారు. కానీ ‘హిందీ మీడియం’ లాంటి విభిన్న కథలకి ఈ ఫండింగ్ కష్టమే. నిర్మాతలు స్టోరీ డెవలప్ మెంట్ అని కొంత తీసి పక్కన పెట్టేసి,  దాని మీద రాబడి ఆలోచించక పోతే, మంచి కథలు పుట్టే  అవకాశముంది.

విదేశాల్లో సినిమా పరిశ్రమలకి ఒక సిస్టం వుంటుంది. వాళ్ళనుంచి మనం ఏం నేర్చుకోవా లంటారు?
         
మంచి స్క్రిప్టుకి మంచి చెల్లింపులు చేయడం నేర్చుకోవాలి. విదేశాల్లో ఒక రచయిత రిచ్ గా జీవించాలంటే ఇరవై సినిమాలో,  మూడు వేల టీవీ ఎపిసోడ్లో రాస్తూ కూర్చోవాల్సిన అవసరం లేదు. ఇంకోటి, విదేశాల్లో దర్శకుల నుంచి, రచయితల నుంచీ  కూడా చాలా నేర్చుకోవడానికి ప్రయత్నించాలి. మన దగ్గర చాలా స్క్రిప్టులు చెడ్డగా రాస్తారు. సరైన ఫార్మాటింగ్ కూడా వుండదు. విదేశాల్లో ఇలా వుండదు. ప్రీ ప్రొడక్షన్ పనుల్ని అక్కడి దర్శకులు చాలా సీరియస్ గా తీసుకుంటారు. ఇలా మనం నేర్చుకోవాల్సినవి చాలా వున్నాయి. వాళ్లకి మనం యోజనాల దూరంలో వున్నాం.

మంచి స్క్రిప్టులు  రాయాలంటే యువ రచయితలకి మీరిచ్చే సలహా ఏమిటి? 
     నేను మాస్ కమ్యూనికేషన్స్ లో మాస్టర్స్ చేశాను గానీ రచనా వ్యాసంగంలో ప్రాథమిక శిక్షణ లేదు. ‘అశోకా’ రాస్తున్నప్పుడు స్ట్రక్చర్ గురించి కూడా నాకేమీ తెలీదు. ఈ లోపం కొట్టొచ్చినట్టు ఆ సినిమాలో కనపడుతుంది. యువ రచయితలకి నా సూచన ఏమిటంటే, ఫలితాలతో సంబంధంలేకుండా రాస్తూనే వుండాలి. రాసిన మొదటి స్క్రిప్టే తెరకెక్కాలనుకోవద్దు. తెరకెక్కనంత వరకూ రాస్తున్నవి చెడ్డ స్క్రిప్టులే.  ఎన్నో చెడ్డ స్క్రిప్టుల  తర్వాతే తెరకెక్కే అదృష్టం లభిస్తుంది – అప్పటికది మంచి స్క్రిప్టు అవుతుందన్నమాట.


ఏజెన్సీస్


Wednesday, April 4, 2018

632 : స్క్రీన్ ప్లే సంగతులు

మర్షియల్ సినిమా కథంటే సమస్యల్ని పరిష్కరించేదే. సమస్యని పరిష్కరిస్తేనే కథ, లేకపోతే ప్రేక్షకులకి వ్యధ. కమర్షియల్ సినిమా కథంటే ఆర్గ్యుమెంట్ కాబట్టి సమస్యల్ని పరిష్కరించాల్సిందే. ఆర్గ్యుమెంట్ లేకుంటే అవి కథలు కావు, గాథ లవుతాయి. సమస్య వల్ల ఆర్గ్యుమెంట్ పుడుతుంది. ఆ ఆర్గ్యుమెంట్ ఆ సమస్యని పరిష్కరిస్తుంది. అందుకే కమర్షియల్ సినిమా కథలు సమస్యల్ని పరిష్కరించే దృష్టితో వుంటాయి. సమస్య –ఆర్గ్యుమెంట్ – పరిష్కారం ఇదీ కమర్షియల్ సినిమా కథల  లక్షణం. ఆర్గ్యుమెంట్ అంటే రెండు పాత్రలు, లేదా రెండు వర్గాలు సంఘర్షించుకోవడమే . అందుకే సమస్య – సంఘర్షణ – పరిష్కారం అని మౌలికంగా నిర్వచిస్తారు కమర్షియల్ సినిమాల కథల్ని. ఎటొచ్చీ ఒక సమస్యని  లేవనెత్తి దాన్ని పరిష్కరించేందుకే వుంటాయి కమర్షియల్ సినిమాల  కథలు. లేకపోతే వాటికి కమర్షియల్ సినిమాల్లో పనిలేదు, దగ్గర్లోని ఓ  చెత్తకుండీలో ఇంత  చోటు చూసుకుని హాయిగా విశ్రమించడం తప్ప. ఇక్కడ సినిమా కథంటే  సరిపోతుందిగా, కమర్షియల్ సినిమా కథంటూ పదేపదే నొక్కి చెప్పడ మెందుకని సందేహం రావచ్చు. అసలు సమస్యంతా ఇక్కడే వుంది. కథకి ఆర్గ్యుమెంట్ సంగతే పట్టకుండా రాసేసి తీసేస్తే అదికూడా సినిమానే అవుతుందని అనుకుంటున్నారు, ఆర్టు సినిమా అవుతుందని తెలీక.  ఈ బ్లాగులోనే చాలా సార్లు కొన్ని సినిమాల రివ్యూల్లో  చెప్పుకున్నాం – స్టార్ సినిమాలనేవి కమర్షియల్ సినిమాల  ముసుగేసుకున్న ఆర్ట్ సినిమాలే అని! ఇప్పుడు కూడా కావాలంటే ఈవారం, గతవారం విడుదలైన రెండు పెద్ద సినిమాలు చూడొచ్చు. కాకపోతే కొన్నిసార్లివి బిగ్ నేమ్స్ వల్ల ఆడేస్తాయి.

          ర్గ్యుమెంట్ లేని కథలు ఆర్ట్ సినిమా గాథలు... కథకీ గాథకీ తేడా ఏమిటంటే, కథ సమస్యని పరిష్కరించే ఆర్గ్యుమెంట్ ని ప్రతిపాదిస్తే, గాథ సమస్యని ఏకరువు పెట్టి వాపోతుంది( స్టేట్ మెంట్). అంటే గాథలు సమస్య గురించి వాపోతూ ఓ స్టేట్ మెంట్ ఇచ్చే మాత్రంగా వుంటే, కథలు ఆ సమస్య అంతు తేల్చి జడ్జిమెంటు ఇచ్చేవిగా వుంటాయి.  ఇందుకే గాథలు చప్పగా వుంటే, కథలు హాట్ హాట్ గా వుంటాయి. సినిమా ప్రేక్షకులకి జడ్జి మెంటు నిచ్చే హాట్ హాట్ సంఘర్షణాత్మక కథలే కావాలి, ఏ సంఘర్షణా జడ్జిమెంటూ  వుండని చప్పటి ‘గాథలు’ కాదు. కథల్లో యాక్టివ్ పాత్రలుంటాయి, అందుకే ఆర్గ్యుమెంట్ పుడుతుంది. గాథల్లో పాసివ్ పాత్రలుంటాయి, అందుకే ఆర్గ్యుమెంట్ పుట్టదు. కమర్షియల్ సినిమాలు యాక్టివ్ పాత్రల వల్ల జనసామాన్యంలో ఆడతాయి. ఆర్ట్ సినిమాలు పాసివ్ పాత్రలతో మేధావి వర్గాల మెప్పు కోసం వుంటాయి. వాటితో ఎవరికీ ఏ ప్రయోజనమూ వుండదు. ఆ పాత్రల్ని చూసి అయ్యో పాపమని అవసరం లేని బాధ పడ్డం తప్ప. ఈ తేడా తెలుసుకోకుండా కథా రచన చేపడుతున్నారు కాబట్టి – సినిమాల్లో  కమర్షియల్ సినిమాలు వేరయా అని పాట పాడాల్సివస్తోంది. ఎంత పాడినా కమర్షియల్ సినిమాలు మాత్రం పదుల కోట్ల రూపాయలతో అజ్ఞానపు వ్యాపారంగానే, బిగ్ నేమ్స్ ని ఆసరా చేసుకుని, ప్రేక్షకుల్ని మభ్య పెడుతూనే వుంటాయి. ప్రేక్షకులు అసలీ నోట్లిచ్చుకుని నకిలీ సినిమాలు ఏంచక్కా  చూస్తూనే వుంటారు. 

You Cannot Avoid Screenplay Structure


          ఇలా కమర్షియల్ సినిమా కథ కమర్షియల్ సినిమా కథ కాకుండా పోయే ప్రమాదం ఏ దశ నుంచీ  ప్రారంభమయ్యే అవకాశముంది? ఐడియా దశనుంచే. తేజాబ్ దగ్గర్నుంచీ ఖల్ నాయక్,  సౌదాగర్, రంగ్ దే బసంతీ వరకూ 40  సినిమాలకి కథలు రాసిన సీనియర్ బాలీవుడ్ రచయిత కమలేష్ పాండే, స్క్రిప్టు రాయాలంటే మొట్ట మొదట చేపట్టాల్సిన కథకి ఐడియా నిర్మాణ ప్రక్రియగురించి,  దాని ప్రాముఖ్యం గురించీ  స్క్రీన్ ప్లే క్లాసుల్లో పట్టుబట్టి బోధిస్తున్నారు. హాలీవుడ్ లో కూడా ఐడియా దశే కీలక దశ. మనకి ఐడియా, పకోడా  ఏమీ వుండవు - పేజీలకి పేజీలు ముందేసుకుని తోచినట్టూ ఏకంగా కథని బరుక్కుంటూ  పోవడమే. బరుకుతున్నది కథో గాథో, ఇంకేదో కతో అధోగతో, దారో గోదారో తెలియకుండా. బాక్సాఫీసు దగ్గర అసలీ నోట్లిచ్చుకునే అమాయక ప్రేక్షకులున్నంత కాలం కథకులు మారే ప్రసక్తే లేదు.  


          ఐడియాతో ప్రారంభిస్తే ఆ ఐడియాలో కథే వుందో,  కొంపలుముంచే గాథే వుందో ముందే తెలిసి  జాగ్రత్త పడే వీలవుతుంది. ఐడియాలో కథ వుండేట్టు చూసుకున్నాక (ఇదంతా బ్లాగు సైడ్ బార్లో పెట్టిన పీడీఎఫ్ ప్రతులలో ఆల్రెడీ వివరించి వుంది),  కథకి వుండే స్ట్రక్చర్ లో ఫస్టాఫ్ లో ప్లాట్ పాయింట్ వన్ (సమస్య ఏర్పాటు), సెకండాఫ్ లో ప్లాట్ పాయింట్ టూ (సమస్యకి పరిష్కారం) అనే రెండు మూల స్థంభాలు స్క్రీన్ ప్లేకి రక్షణగా నిలబడతాయి. ఇక్కడ మొదటి మూలస్థంభం బలంగా వుంటేనే మిగతా కథంతా బలంగా వస్తుంది. బిగినింగ్ ని ముగిస్తూ ప్లాట్ పాయింట్ వన్ (మొదటి మూలస్థంభం) ఏర్పాటు చేయడమంటే,  కథని ప్రారంభించడమే.  అంటే ఆర్గ్యుమెంట్ ని ప్రతిపాదించడమే. కాబట్టి ఇక్కడ కథ ఎలా ప్రారంభిస్తే, ఆర్గ్యుమెంట్ ని ఎలా ప్రతిపాదిస్తే,  మిగతా కథ అలా వస్తుంది. సినిమాల్లో స్ట్రక్చర్ లేకపోయినా ఎక్కడో ఒక మలుపు వచ్చి కథ ప్రారంభమవుతోంది నిజమే. కానీ ఈ మలుపులో వచ్చే సన్నివేశ సృష్టినే నిర్లక్ష్యం చేసి,  ఏదో తూతూ మంత్రంగా  లాగించేసినప్పుడు, ఈ మొదటి మూలస్థంభానికి బలం లేకుండా పోతోంది. సినిమా ప్రారంభిస్తూ ఒక అద్భుతమైన ఓపెనింగ్ బ్యాంగ్ కోసం కృషి చేస్తారు. కానీ ప్లాట్ పాయింట్ వన్ దగ్గర అంతకంటే ముఖ్యంగా కథని  ప్రారంభిస్తూ ఆ సన్నివేశ సృష్టిని నీరు గార్చేస్తారు. అంటే కథా ప్రారంభం ప్లాట్ పాయింట్ వన్ దగ్గర కాదనీ, సినిమా ప్రారంభంలోనే  ఓపెనింగ్ బ్యాంగే కథా ప్రారంభమనే అపోహలో పడి ఇలా చేస్తారన్నమాట. 

          స్ట్రక్చర్ స్కూలు కాదని తమదేదో సొంతంగా కనిపెట్టిన క్రియేటివిటీని  పట్టుకుని పోయే కథకులు, కథకి తామిచ్చే మలుపు దగ్గరైనా  తమ సొంత క్రియేటివ్ ప్రతిభా వ్యుత్పత్తులేవో  గొప్పగా  ప్రదర్శించుకోవాలి కదా? ఎందుకని ప్రదర్శించుకోవడం లేదు? ఎందుకంటే స్క్రీన్ ప్లేలో ఆ ఘట్టం విలువ తెలీక. ఎందుకని తెలీక? స్ట్రక్చర్ ని పట్టించుకుంటే కదా కథనంలో ఇలాటి డైనమిక్స్ విషయం తెలిసేది. స్ట్రక్చర్ నియమాలతోనే కథా కథనాలేర్పడతాయని  తెలిస్తే, క్రియేటివిటీతో ఏ కథా పుట్టించి నడపలేరని తెలిస్తే, ప్లాట్ పాయింట్ వన్నులు ఇంత మన్ను తిన్న పాముల్లా  వుండవు.

          హాలీవుడ్ సినిమాల్లో ప్లాట్ పాయింట్ వన్నులు అద్భుత సృష్టులుగా వుంటాయి. అవొక ప్రత్యేక సెట్ పీస్ సీన్లు గా ప్రాణం పోసుకుంటాయి. బిగినింగ్ విభాగానికి ప్లాట్ పాయింట్ వన్ క్లయిమాక్స్ లాంటిది కాబట్టి, కథా ప్రారంభం కాబట్టి, దాన్ని అంత ఉద్విగ్న భరితంగా రిజిస్టర్ చేస్తారు. ఆ దృశ్యంలో కాన్సెప్ట్ ఉట్టిపడే నేపధ్య సృష్టి వుంటుంది. జానర్ ని బట్టి దాని రసపోషణ వుంటుంది.  రోమాంటిక్ కామెడీ జానర్ అయితే ఫన్నీగా, సెక్సీగా వుంటుంది. యాక్షన్ థ్రిల్లర్ జానరైతే  ఛేజింగో ఫైటింగో వుంటుంది. డిజాస్టర్ జానరైతే ఏదో ఉపద్రవం ముంచుకొస్తుంది. ఏదున్నా సంఘటనతోనే వుంటుంది తప్ప, డైలాగులతో కాదు. కొన్ని తెలుగు సినిమాల్లో లాగా ఈ ప్లాట్ పాయింట్ వన్ ని ఇంటర్వెల్ దాకా లాగిలాగి, అప్పుడు ఎక్కడో వున్న హీరోకి, హీరోయిన్ ఫోన్ చేసి బ్రేకప్ చెప్పేసేలాంటి బలహీన వెర్బల్ సీన్లు మాత్రం వుండవు. సినిమా అంటే డైలాగులు కాదు, సంఘటనలే. వెర్బల్ సీన్ల కోసం కోట్లు పెట్టి సినిమా తీయనవసరం లేదు, నాటకం వేసుకోవచ్చు.నాటకంలో సాధ్యం కాని సంఘటనల కోసమే సినిమా వుంది! సంఘటనలో డైలాగులవసరమనుకుంటే పలికించుకోవచ్చు. సంఘటనే లేకుండా డైలాగులతో కథని మలుపు తిప్పాలనుకోవడంతో సృజనాత్మకత లేదు, రసపోషణా లేదు. కథా ప్రారంభమే రిజిస్టర్ కాదు. కథా ప్రారంభమంటే సమస్యా, దాంతో సంఘర్షణా మొదలయ్యాయని గణగణ గంట మోగించి తెలియజెప్పడమే. ప్రేక్షకుల్ని ఎలర్ట్ చేయడమే. చిన్న రైల్వే స్టేషన్లో నైనా రైలొస్తోందని గంట మోగించి ప్రయాణికుల్ని అప్రమత్తం చేస్తారు. ఆ రైలు ఆగి ఆ ప్రయాణికుల్ని ఎక్కించుకుని మరీ పోతుంది. సినిమాల్లో ఏ గంటా మోగదు. ప్రేక్షకుల్ని వాళ్ళ ఖర్మానికి వొదిలేసి, కథకుడు ప్రేక్షకుల్ని ఎక్కించుకోకుండా,  చుక్ చుక్ బండి మీద తన మానాన తను నాన్ స్టాప్ గా,  యమ ఫాస్టుగా ఎటెటో వెళ్లిపోతూనే వుంటాడు. పైగా ప్రేక్షకుల ఇన్వాల్వ్ మెంట్ గురించి గొప్ప లెక్చర్ లిస్తాడు. కథల్ని రచయితల సంఘంలో రిజిస్టర్ చేయించుకోవడమే  కాదు, స్క్రీన్ ప్లేలో కథా ప్రారంభాన్ని కూడా రిజిస్టర్ చేసే ఇంగితముండాలి. లేకపోతే రచయితల సంఘంలో అజ్ఞాతవాసం పూర్తి చేసుకుని బయటి కొచ్చే కథలు బాక్సాఫీసు దగ్గర భోరు మంటాయి!

       హాలీవుడ్ ‘అన్ ఫెయిత్ ఫుల్’  వుంది. ఇందులో పదినిమిషాల్లో టైటిల్స్ పడుతున్న
ప్పుడే ప్లాట్ పాయింట్ వన్ వచ్చేస్తుంది. రోడ్డు మీద ఆమె సుడిగాలిలో చిక్కుకుంటుంది. పట్టుకోవడానికి ఆధారం దొరకదు. ఎదురుగా పాత పుస్తకాల విక్రేత వస్తూంటాడు. అతనూ పుస్తకాలు మోస్తూ కిందామీదా అవుతూంటాడు. ఇద్దరూ ఢీ కొట్టుకుని కింద పడిపోతారు. అంతే, మొదలైపోయింది కథ. సమస్యలో పడిందామె. అతడితో వివాహేతర సంబంధానికీ,  తద్వారా కుంటుంబంలో సంఘర్షణకీ బీజం పడిపోయింది. ఆ సుడిగాలేదో వాళ్ళని కలపడానికి ఉద్దేశం పెట్టుకుని కథకుడు సృష్టించలేదు. అది లేకి ఆలోచన. ఆ సుడిగాలికి కాన్సె ప్చ్యువల్ మీనింగుంది : అది ఆమె వైవాహిక జీవితంలో ఏర్పడబోయే ప్రకంపనలకి సూచన. పరిణామాల హెచ్చరిక ... ఇలా ఈ సినిమా విడుదలై పదహారేళ్ళు గడిచిపోయినా మర్చిపోలేనంత బలంగా, ఎమోషనల్ గా, వివరంగా సృష్టించారు ఈ ప్లాట్ పాయింట్ వన్ ఘట్టాన్ని. 

          ‘ట్రయాంగిల్’  అనే థ్రిల్లర్ వుంది. ఇందులో ఆమె ఫ్రెండ్స్ తో సముద్రం మీద బోటు షికారు కెళ్ళి తూఫానులో  చిక్కుకుని బోటు తలకిందులై సముద్రంలో పడిపోతుంది. ఈ బీభత్స భరిత ప్లాట్ పాయింట్ వన్ ని ఏదో ఆమె అడ్వెంచర్ చేయడం కోసమన్నట్టు సృష్టించలేదు. అది లేకి ఆలోచన. ఈ తూఫాను రావడానికి కాన్సె ప్చ్యువల్ మీనింగుంది. ఇలా ఫ్రెండ్స్ తో ఎంజాయ్ చేయడానికి వచ్చే ముందు,  ఆమె ఇంటి దగ్గర శారీరక లోపమున్న కొడుకుతో నిర్దయగా ప్రవర్తించి వచ్చింది. కాబట్టి ఆమె అందుకు అనుభవించాల్సిందే తప్ప, ఎంజాయ్ చేస్తే కాదు.  కాన్సె ప్చ్యువల్ మీనింగు లేకుండా,  ఉత్తుత్తి ఎమోషన్లతో ప్లాట్ పాయింట్ వన్నులు సృష్టిస్తే పని జరగదు.

       ఇలా యూహేవ్ గాట్ మెయిల్,  సెన్స్ అండ్ సెన్సిబిలిటీ,  సీ ఆఫ్ లవ్, న్యూ ఇన్ టౌన్, ది ప్రపోజల్, రైడర్స్ ఆఫ్ ది లాస్ట్ ఆర్క్, జాస్, సైలెన్స్ ఆఫ్ ది లాంబ్స్...ఇలా ఏ హాలీవుడ్ చూసినా ప్లాట్ పాయింట్ వన్స్ విజువల్ గా, ఆర్భాటంగా వుంటాయి. 

         
 ‘భజరంగీ భాయిజాన్' లో  కూడా ప్లాట్ పాయింట్ వన్ సంచలనాత్మకంగా వుంటుంది. టీవీలో క్రికెట్ చూస్తున్నపుడు తమతో వున్నబాలిక ముస్లిం మాత్రమే కాదనీ, పాకిస్తానీ కూడాననీ బయటపడి,  పెద్ద దుమారంతో డ్రమెటిక్ గా ప్లాట్ పాయింట్ వన్ ఏర్పాటవుతుంది. 

          (1) సకాలంలో ప్లాట్ పాయింటు రావడం, (2) అందులో సంఘర్షణ పుట్టడం, (3) ఆ సంఘర్షణ లోంచి గోల్ ఏర్పడడం, ఆ గోల్ లో – (4) కోరిక, (5) పణం, (6), పరిణామాల హెచ్చరిక, (7) ఎమోషన్ వుండడం,

          దీనికి ముందు బిగినింగ్ విభాగంలో - (8) ప్రథాన పాత్ర, (9) ఇతర ముఖ్య పాత్రల పరిచయం (10) కథా నేపధ్య సృష్టి, (11)  ప్రధాన పాత్ర సమస్యలో పడేందుకు తగిన పరిస్థితుల కల్పన, (12 ) చివరికి సమస్య ఏర్పాటుతో బిగినింగ్ ముగించడం,  

          ఇంకా ప్రధాన పాత్ర పాత్ర చిత్రణలో - (13) అంతర్గత సమస్యల కల్పన, (14) దాని క్యారక్టర్ ఆర్క్, మొత్తంగా బిగినింగ్ విభాగపు (15) టైం అండ్ టెన్షన్ గ్రాఫు...


       ఈ పదిహేనూ క్రియేటివిటీ టూల్స్ కావు. క్రియేటివిటీకి టూల్సూ పాడూ ఏవీ వుండవు. అంతా తాడూ బొంగరం లేని స్వకపోల స్వైరకల్పనల వ్యవహారమే. ఇవి స్ట్రక్చర్ టూల్స్. ఇవి వుంటేనే వీటితో ఆ తర్వాత క్రియేటివిటీ. ఆఁ...  నువ్వేదో చెప్పే ప్రధాన పాత్ర సమస్యలో పడేందుకు తగిన పరిస్థితుల కల్పన నాకెందుకనో, లేదా గోల్ ఎలిమెంట్సా బొంగరమా అనో,  ఇంకా లేదా - ప్లాట్ పాయింటా నా బొందా – నీ క్రియేటివిటీ నీ దగ్గరుంచుకో, నా క్రియేటివిటీ బంపర్...చూడు ఎలా క్రియేట్ చేస్తానో...అని తొడలు కొట్టుకుని కొట్టి పారెయ్యడానికి ఈ పదిహేనూ క్రియేటివ్ వంటింటి చిట్కాలు కావు. స్ట్రక్చర్ ఎలిమెంట్స్. ఏదీ తీసేయడానికి లేదు. బిగినింగ్ విభాగం ఇరవై సీన్లలో ఈ నట్లూ బోల్టులూ  బిగించుకుని, ఆ పైన  నీ క్రియేటివిటీ బండేదో నువ్వు నడిపించుకో - అని సదరు కథకుడికి ఎదురు చెప్పాల్సి వస్తుంది. 

          ప్లాట్ పాయింట్ వన్ లో ఈ మూలాలు లేకపోతే, దీన్ని పైన చెప్పిన హాలీవుడ్ క్రియేషన్ తో దృశ్యపరంగా బలంగా  రిజిస్టర్ చేయకపోతే, ఇంకో కథ రచయితల సంఘంలో రిజిస్టర్ చేయించడానికి డబ్బులుండక పోవచ్చు.

సికిందర్



631 : సందేహాలు -సమాధానాలు



Q :    గత వారం Q & A లో, కథ ప్రారంభిస్తూ విలన్ చేసే నేరాన్నిచూపించి టైటిల్స్ వేశాక, హీరో ని ప్రవేశ పెట్టివెంటనే విలన్ మీదికి హీరోని  ప్రయోగిస్తే తప్పవుతుందా? అనే ప్రశ్న, దానికి మీ సమాధానం చదివాను. పరుచూరి గోపాల కృష్ణ గారు ఒక చోట కథలో హీరో పాత్రని లక్ష్యం తో అయితే పరిచయం చేశామో అదే ముగింపు కావాలన్నారు. ఉదాహరణగా ఖైదీ’  గురించి చెప్పారు. అదే కథని మన త్రీ యాక్ట్ ప్రకారం హీరో, హీరోయిన్ ప్రేమతో మొదలయ్యే కథగా ప్రారంభించాలని,  కానీ కథలో ముగింపు హీరో పగ తీర్చుకోవడంగా వుంది కాబట్టి ఇలా వుండకూడదనీ, కాబట్టే ఖైదీ’ కి ఇప్పుడున్న ఆర్డర్ వుందనీ  అన్నారు. అంటే హీరో పరిచయం పగ తీర్చుకోవడం కోసం వస్తున్నట్టు వుంటే, ఆ పగ తీర్చుకున్నట్టే ముగింపు ఇచ్చామని అన్నారాయన. కథని మామూలుగా హీరో, హీరోయిన్ ప్రేమతో మొదలు పెట్టకూడదా?
పేరు వెల్లడించ వద్దన్న దర్శకుడు

A : హీరో, హీరోయిన్ ప్రేమతో కథని మొదలెట్టవచ్చు. అప్పుడది బిగినింగ్ – మిడిల్ – ఎండ్ బాపతు లీనియర్  కథవుతుంది. అప్పుడు ‘ఖైదీ’ లో చిరంజీవి - మాధవిలు ప్రేమించుకుంటూ వుంటే ప్లాట్ పాయింట్ వన్ దగ్గర రావుగోపాలరావు దాడి చేస్తాడు. రావు గోపాలరావు ఎవరు, ఎందుకు దాడి చేశాడనేది ఇప్పుడొచ్చే ఫ్లాష్ బ్యాక్ లో తెలుస్తుంది. ఫ్లాష్ బ్యాక్ అయ్యాక,  చిరంజీవి రావుగోపాలరావు పనిబట్టడంతో కథ ముగుస్తుంది. ఫ్యాక్షన్ టెంప్లెట్ లో లాగా అన్నమాట. కాకపోతే ఫ్యాక్షన్ టెంప్లెట్ లో హీరో ఎవరు, ఎందుకొచ్చాడని   హీరో ఫ్లాష్ బ్యాక్ వుంటుంది. 

          ఏ ఫ్లాష్ బ్యాకు లేకుండా ప్రేమకథని లీనియర్ గా చెప్పాలంటే ‘ఒక్కడు’ వుంది.  ‘ఖైదీ’ కథని నాన్ లీనియర్ గా, అంటే ఫ్లాష్ బ్యాక్ లో చెప్పారు. అంటే మిడిల్ – బిగినింగ్ - ఎండ్ గా అంకాల్ని జంబ్లింగ్ చేశారు.  ‘ఖైదీ’ ప్రారంభం చిరంజీవి కత్తి పెట్టకుని తిరుగుతూ పోలీసు అధికారి అయిన రంగనాథ్ కి దొరకడమనే మిడిలే గా? ప్రేమ కథనే బిగినింగ్ లేకపోతే కత్తి పెట్టుకుని తిరిగే మిడిల్ ఎక్కడ్నించి వస్తుంది?  ఇలా పగతో వున్న (మిడిల్ తో) ప్రారంభించారు కాబట్టి సహజంగానే తిరిగి మిడిల్ కే వచ్చి ఎండ్ తో పగదీర్చుకోవడం పూర్తయింది. మధ్యలో చిరంజీవి అలా  తయారవడానికి కారణాలేమిటో తెలిపే ప్రేమకథ (బిగినింగ్)  చెప్పారు. పగకి కారణమైన ప్రేమ కథ ఫ్లాష్ బ్యాకులో చెప్పారు. ఒక లక్ష్యం ఏర్పడ్డాక లక్ష్యం పూర్తవడంతోనో, లేదా ఆ లక్ష్యం విఫలమవడంతోనో (హేరామ్, డే ఆఫ్ ది జాకాల్) ముగింపు దానికదే వుంటుంది. 

          ‘ఖైదీ’ ని సిల్వెస్టర్ స్టాలోన్ నటించిన ‘ఫస్ట్ బ్లడ్’ ఆధారంగా తీశారు. ‘ఫస్ట్ బ్లడ్’ లో భారీ మార్పులు చేసి ప్రేమ కథగా మార్చారు. ఐతే చిరంజీవి రంగనాథ్ కి దొరికే ప్రారంభం,  పోలీస్ స్టేషన్ లో పోరాటం  యథాతధంగా ‘ఫస్ట్ బ్లడ్’ లోనివే. 

          ఇక మీరన్నట్టు
కథని హీరో, హీరోయిన్ ప్రేమతో లీనియర్ గా మొదలు పెట్టే విషయం. కేవలం ప్రేమ కథయితే ప్రేమ కథని లీనియర్ గా మొదలెట్టడంలో ఏ ఇబ్బందీ వుండదు. యాక్షన్ ప్రధాన ప్రేమకథైనప్పుడు, దాన్ని  లీనియర్ గా ‘ఒక్కడు’ లోలాగా  చేసుకొచ్చినప్పుడు, ఆ ప్రేమని మిడిల్లో ప్రారంభించారు (పరుచూరి బ్రదర్సే రచన). బిగినింగ్ ముగుస్తూ ప్లాట్ పాయింట్ వన్ దగ్గర (45 వ నిమిషం) ప్రకాష్ రాజ్ బారి నుంచి భూమికని మహేష్ బాబు కాపాడి ఇంటికి తెచ్చుకోవడం, అక్కడ్నించీ మిడిల్లో ప్రేమకథని  ‘లీనియర్’  గా నడపడం. మహేష్ బాబుకైనా, ప్రకాష్ రాజ్ కైనా లక్ష్యాలు భూమికతో ప్లాట్ పాయింట్ వన్ దగ్గర ఏర్పడి కథ మొదలైంది కాబట్టి,  తిరిగి ఆ లక్ష్యాల సంఘర్షణతోనే కథ ముగిసింది. లీనియర్ అయితే ఇలా, నాన్ లీనియర్ అయితే అలా (ఖైదీ).

Q :  నా షార్ట్ ఫిలింని సినిమా కథగా విస్తరించాలనుకుంటున్నాను. ఎలా విస్తరించాలి, ఆ పద్ధతులేమిటి చెప్పగలరు.
 
వీ ఆర్ అనంత్

A :    ఫిలిమే లేకపోయాక ఇంకా షార్ట్ ఫిలిం ఏమిటి, షార్ట్ మూవీ అనాలి గాని. మొన్న ఇండియా వచ్చిన క్రిస్టఫర్ నోలాన్ ఫిలిం అన్నాడంటే  అర్ధముంది. ఆయన డిజిటల్ ని ఇష్టపడడు, ఎనలాగ్ (అంటే ఫిలిం) మీదే ఇక తీస్తానంటున్నాడు. ఆ మాటకొస్తే ఆయన సెల్ ఫోన్, ఈ- మెయిల్, ఫేస్ బుక్, ఇతర సోషల్ మీడియా దేని జోలికీ పోకుండా ప్రత్యక్ష సంబంధాలతో పాత కాలం నాటి మనిషిలా జీవిస్తున్నాడంటే నమ్ముతారా? ప్రకృతి సిద్ధమైన తన ఆలోచనలకి పదును పెట్టాలంటే టెక్నాలజీకి దూరంగా, ప్రకృతికి మాత్రమే దగ్గరగా వుండాలని అవన్నీ త్యజించిన ధన్యజీవి.  

          ఇక షార్ట్ మూవీని వెండి తెరకి విస్తరించే విషయం. అది షార్ట్ మూవీకి తీసుకున్న ఐడియాని బట్టి వుంటుంది. అన్ని షార్ట్ మూవీ ఐడియాలూ వెండి తెరకి పనికి రావాలని లేదు. పైగా షార్ట్ మూవీ మేకర్లు వాళ్ళ సొంత క్రియేటివిటీని వాడతారు. కమర్షియల్ సినిమా డిమాండ్ చేసే స్ట్రక్చర్ ని వాడరు.  ముందు కమర్షియల్ సినిమా అంటే ఏమిటో, దాని సూత్రాలేమిటో అంగీకరించడానికి మనస్కరించాలి. చాలా వరకూ మనస్కరించదు. ఎందుకంటే తమది సార్వజనీన స్ట్రక్చర్ స్కూలు కాక సొంత క్రియేటివిటీ స్కూలు కాబట్టి. ఆ కుటీర పరిశ్రమలోంచి బయటికి రాలేరు కాబట్టి. పెద్దపెద్ద యంత్రాలంటే జడుసుకుంటారు కాబట్టి. షార్ట్ మూవీస్ కథకి  పునాది లేకపోయినా చెల్లిపోతుంది. కమర్షియల్ సినిమాల కథలకి స్ట్రక్చరే పునాది. లక్షల మంది ప్రేక్షకులతో కూడిన మాస్ మీడియా అయిన కమర్షియల్ సినిమాలకి  స్ట్రక్చర్ అనే పునాది లేకుండా ఉత్త  క్రియేటివిటీ ప్రదర్శిస్తే చెల్లదు. పునాది లేకుండా ఉత్త క్రియేటివిటీతో కమర్షియల్ సినిమా కథ తయారవదు, ఆర్ట్ సినిమా కథ తయారవుతుంది. కమర్షియల్ సినిమా కథని భారీ చక్కర పరిశ్రమలా పెద్ద పెద్ద యంత్రాలతో నడపాల్సిందే.  

          కాబట్టి మీ షార్ట్ కి  వెండితెర సౌభాగ్యం కల్గించాలనే ఆలోచన చేసేముందు, అసలు పైన చెప్పిన కమర్షియల్ సినిమాల బేసిక్స్ ని అంగీకరించే సహనం మీకుందో లేదో పరిశీలించుకోండి.  బేసిక్స్ పట్ల సహనమే మీకు లేదని తేలిపోతే సినిమా ఆలోచన చెయ్యకండి. ఆ నిర్మాతా మీరూ అందరూ వీధిన పడతారు - కేవలం మీ ఒక్కరి వల్ల. 

          రెండోది, చేసిన షార్టునే పట్టుకుని సినిమా చేయాలనీ, ఆ తర్వాత సీరియల్ చేయాలనీ, వెబ్ సిరీస్ చేయాలనీ.. ఇన్ని గుడ్లు పెట్టె ఆలోచన చేయడమెందుకు? సినిమా చేయాలంటే ఇంకేమీ సినిమా ఐడియాలే రావా? షార్ట్ తో చేయదగ్గ బెస్ట్ ప్రయత్నమేమిటంటే, దాన్ని నాటికగా మార్చడం. షార్ట్ కంటే, సినిమా కంటే ఇంకా ఎక్కువ ప్రశంసలు పొందే అవకాశముంటుంది. 

          మూడోది, చిన్న హీరోలతో, కొత్త వాళ్ళతో కోటి -3 కోట్ల సినిమా చేయాలనుకున్నప్పుడు మొట్ట మొదట చేయాల్సిన పని - ఇటు చూసిన, తీసిన షార్ట్ మూవీస్ మేకింగ్ ఆలోచనలు, వరల్డ్ మూవీస్ మేకింగ్ ఆలోచనలూ - మళ్ళీ అటు చూసివున్న అనేకానేక బిగ్ కమర్షియల్ సినిమాల మేకింగ్ ఆలోచననలూ బుర్రలోకి రానీయకుండా, రెండు వైపులా తలుపులు గట్టిగా బిడాయించేసి, చేస్తున్న స్మాల్ కమర్షియల్ మూవీ మేకింగ్ ఆలోచనలనే అనుమతిస్తూ వాటితోనే పనిచేసుకోగల్గాలి. పెద్ద గోల్స్ కోసం నోలాన్ అలా చేస్తూంటే, చిన్న గోల్స్ కోసం మీరిలా చేయాలి.

Q :  పరిశీలనకు సినాప్సిస్ పంపితే సరిపోతుందా, డైలాగ్ వెర్షన్ పంపమంటారా?
మోహన్ (మారుపేరు), అసోషియేట్ 

 
A :   సినాప్సిస్ మాత్రమే పంపండి. పంపేముందు గమనించాల్సిన విషయం, మీ కథ మార్కెట్ యాస్పెక్ట్, స్ట్రక్చర్ స్కూలు పట్టకుండా,  కేవలం మీ సొంత క్రియేటివిటీతో, సబ్జెక్టివ్ గా, కమర్షియల్ సినిమాలకి వ్యతిరేకంగా,  తోచినట్టూ రాసుకుని వుంటే (ఇదే ఎక్కువ జరుగుతోంది), దాన్ని మార్కెట్ యాస్పెక్ట్ కి, స్ట్రక్చర్ స్కూల్లో పెట్టి ఆబ్జెక్టివ్ గా మార్చుకోవడానికి ఇష్టపడితేనే పంపండి. లేకపోతే మీరు నమ్మినట్టు మీరు తెరకెక్కించుకోండి. దీనికి వేరే సలహాసంప్రదింపులు అవసరం లేదు, సమయం వృధా.

Q :   ఏది స్క్రీన్ ప్లే, ఏది కాదు?
కె. రజనీకాంత్, పాఠకుడు

 
A :   స్ట్రక్చర్ వుంటే స్క్రీన్ ప్లే, లేకపోతే టెంప్లెట్. ఇది పెద్ద సినిమాల విషయం. చిన్న సినిమాల విషయం వచ్చేసి, స్ట్రక్చర్ వుంటే స్క్రీన్ ప్లే, లేకపోతే అట్టర్ ఫ్లాప్ ప్లే. ఎలాపడితే అలా రాసేసుకుని, దానికి స్క్రీన్ ప్లే అని పేరేసుకోవడం స్క్రీన్ ప్లేల పరువు తీయడమే. స్క్రీన్ ప్లే అంటే తోచిన సొంత క్రియేటివిటీ అనుకుంటూ, కనీసం పాత్ర చిత్రణలు కూడా తెలియకుండా  రాసుకుంటున్న వాళ్ళు చాలా అదృష్టవంతులు. వాళ్ళు చాలా ఈజీగా స్క్రిప్టులు రాసెయ్యగలరు. వాళ్ళు నేర్చుకోవడానికి ఇష్టపడరు, ఎందుకంటే తామే మాస్టర్లు కాబట్టి. ఫ్లాప్ మాస్టర్ జనరల్స్ కాబట్టి.

సికిందర్