రివ్యూలు, సాంకేతికాలు, స్క్రీన్ ప్లే సంగతులు...

టికెట్లు దొరకడం యోగం, సినిమాలు చూడడం భోగం, రివ్యూలు రాయడం రోగం!

Wednesday, April 4, 2018

632 : స్క్రీన్ ప్లే సంగతులు

మర్షియల్ సినిమా కథంటే సమస్యల్ని పరిష్కరించేదే. సమస్యని పరిష్కరిస్తేనే కథ, లేకపోతే ప్రేక్షకులకి వ్యధ. కమర్షియల్ సినిమా కథంటే ఆర్గ్యుమెంట్ కాబట్టి సమస్యల్ని పరిష్కరించాల్సిందే. ఆర్గ్యుమెంట్ లేకుంటే అవి కథలు కావు, గాథ లవుతాయి. సమస్య వల్ల ఆర్గ్యుమెంట్ పుడుతుంది. ఆ ఆర్గ్యుమెంట్ ఆ సమస్యని పరిష్కరిస్తుంది. అందుకే కమర్షియల్ సినిమా కథలు సమస్యల్ని పరిష్కరించే దృష్టితో వుంటాయి. సమస్య –ఆర్గ్యుమెంట్ – పరిష్కారం ఇదీ కమర్షియల్ సినిమా కథల  లక్షణం. ఆర్గ్యుమెంట్ అంటే రెండు పాత్రలు, లేదా రెండు వర్గాలు సంఘర్షించుకోవడమే . అందుకే సమస్య – సంఘర్షణ – పరిష్కారం అని మౌలికంగా నిర్వచిస్తారు కమర్షియల్ సినిమాల కథల్ని. ఎటొచ్చీ ఒక సమస్యని  లేవనెత్తి దాన్ని పరిష్కరించేందుకే వుంటాయి కమర్షియల్ సినిమాల  కథలు. లేకపోతే వాటికి కమర్షియల్ సినిమాల్లో పనిలేదు, దగ్గర్లోని ఓ  చెత్తకుండీలో ఇంత  చోటు చూసుకుని హాయిగా విశ్రమించడం తప్ప. ఇక్కడ సినిమా కథంటే  సరిపోతుందిగా, కమర్షియల్ సినిమా కథంటూ పదేపదే నొక్కి చెప్పడ మెందుకని సందేహం రావచ్చు. అసలు సమస్యంతా ఇక్కడే వుంది. కథకి ఆర్గ్యుమెంట్ సంగతే పట్టకుండా రాసేసి తీసేస్తే అదికూడా సినిమానే అవుతుందని అనుకుంటున్నారు, ఆర్టు సినిమా అవుతుందని తెలీక.  ఈ బ్లాగులోనే చాలా సార్లు కొన్ని సినిమాల రివ్యూల్లో  చెప్పుకున్నాం – స్టార్ సినిమాలనేవి కమర్షియల్ సినిమాల  ముసుగేసుకున్న ఆర్ట్ సినిమాలే అని! ఇప్పుడు కూడా కావాలంటే ఈవారం, గతవారం విడుదలైన రెండు పెద్ద సినిమాలు చూడొచ్చు. కాకపోతే కొన్నిసార్లివి బిగ్ నేమ్స్ వల్ల ఆడేస్తాయి.

          ర్గ్యుమెంట్ లేని కథలు ఆర్ట్ సినిమా గాథలు... కథకీ గాథకీ తేడా ఏమిటంటే, కథ సమస్యని పరిష్కరించే ఆర్గ్యుమెంట్ ని ప్రతిపాదిస్తే, గాథ సమస్యని ఏకరువు పెట్టి వాపోతుంది( స్టేట్ మెంట్). అంటే గాథలు సమస్య గురించి వాపోతూ ఓ స్టేట్ మెంట్ ఇచ్చే మాత్రంగా వుంటే, కథలు ఆ సమస్య అంతు తేల్చి జడ్జిమెంటు ఇచ్చేవిగా వుంటాయి.  ఇందుకే గాథలు చప్పగా వుంటే, కథలు హాట్ హాట్ గా వుంటాయి. సినిమా ప్రేక్షకులకి జడ్జి మెంటు నిచ్చే హాట్ హాట్ సంఘర్షణాత్మక కథలే కావాలి, ఏ సంఘర్షణా జడ్జిమెంటూ  వుండని చప్పటి ‘గాథలు’ కాదు. కథల్లో యాక్టివ్ పాత్రలుంటాయి, అందుకే ఆర్గ్యుమెంట్ పుడుతుంది. గాథల్లో పాసివ్ పాత్రలుంటాయి, అందుకే ఆర్గ్యుమెంట్ పుట్టదు. కమర్షియల్ సినిమాలు యాక్టివ్ పాత్రల వల్ల జనసామాన్యంలో ఆడతాయి. ఆర్ట్ సినిమాలు పాసివ్ పాత్రలతో మేధావి వర్గాల మెప్పు కోసం వుంటాయి. వాటితో ఎవరికీ ఏ ప్రయోజనమూ వుండదు. ఆ పాత్రల్ని చూసి అయ్యో పాపమని అవసరం లేని బాధ పడ్డం తప్ప. ఈ తేడా తెలుసుకోకుండా కథా రచన చేపడుతున్నారు కాబట్టి – సినిమాల్లో  కమర్షియల్ సినిమాలు వేరయా అని పాట పాడాల్సివస్తోంది. ఎంత పాడినా కమర్షియల్ సినిమాలు మాత్రం పదుల కోట్ల రూపాయలతో అజ్ఞానపు వ్యాపారంగానే, బిగ్ నేమ్స్ ని ఆసరా చేసుకుని, ప్రేక్షకుల్ని మభ్య పెడుతూనే వుంటాయి. ప్రేక్షకులు అసలీ నోట్లిచ్చుకుని నకిలీ సినిమాలు ఏంచక్కా  చూస్తూనే వుంటారు. 

You Cannot Avoid Screenplay Structure


          ఇలా కమర్షియల్ సినిమా కథ కమర్షియల్ సినిమా కథ కాకుండా పోయే ప్రమాదం ఏ దశ నుంచీ  ప్రారంభమయ్యే అవకాశముంది? ఐడియా దశనుంచే. తేజాబ్ దగ్గర్నుంచీ ఖల్ నాయక్,  సౌదాగర్, రంగ్ దే బసంతీ వరకూ 40  సినిమాలకి కథలు రాసిన సీనియర్ బాలీవుడ్ రచయిత కమలేష్ పాండే, స్క్రిప్టు రాయాలంటే మొట్ట మొదట చేపట్టాల్సిన కథకి ఐడియా నిర్మాణ ప్రక్రియగురించి,  దాని ప్రాముఖ్యం గురించీ  స్క్రీన్ ప్లే క్లాసుల్లో పట్టుబట్టి బోధిస్తున్నారు. హాలీవుడ్ లో కూడా ఐడియా దశే కీలక దశ. మనకి ఐడియా, పకోడా  ఏమీ వుండవు - పేజీలకి పేజీలు ముందేసుకుని తోచినట్టూ ఏకంగా కథని బరుక్కుంటూ  పోవడమే. బరుకుతున్నది కథో గాథో, ఇంకేదో కతో అధోగతో, దారో గోదారో తెలియకుండా. బాక్సాఫీసు దగ్గర అసలీ నోట్లిచ్చుకునే అమాయక ప్రేక్షకులున్నంత కాలం కథకులు మారే ప్రసక్తే లేదు.  


          ఐడియాతో ప్రారంభిస్తే ఆ ఐడియాలో కథే వుందో,  కొంపలుముంచే గాథే వుందో ముందే తెలిసి  జాగ్రత్త పడే వీలవుతుంది. ఐడియాలో కథ వుండేట్టు చూసుకున్నాక (ఇదంతా బ్లాగు సైడ్ బార్లో పెట్టిన పీడీఎఫ్ ప్రతులలో ఆల్రెడీ వివరించి వుంది),  కథకి వుండే స్ట్రక్చర్ లో ఫస్టాఫ్ లో ప్లాట్ పాయింట్ వన్ (సమస్య ఏర్పాటు), సెకండాఫ్ లో ప్లాట్ పాయింట్ టూ (సమస్యకి పరిష్కారం) అనే రెండు మూల స్థంభాలు స్క్రీన్ ప్లేకి రక్షణగా నిలబడతాయి. ఇక్కడ మొదటి మూలస్థంభం బలంగా వుంటేనే మిగతా కథంతా బలంగా వస్తుంది. బిగినింగ్ ని ముగిస్తూ ప్లాట్ పాయింట్ వన్ (మొదటి మూలస్థంభం) ఏర్పాటు చేయడమంటే,  కథని ప్రారంభించడమే.  అంటే ఆర్గ్యుమెంట్ ని ప్రతిపాదించడమే. కాబట్టి ఇక్కడ కథ ఎలా ప్రారంభిస్తే, ఆర్గ్యుమెంట్ ని ఎలా ప్రతిపాదిస్తే,  మిగతా కథ అలా వస్తుంది. సినిమాల్లో స్ట్రక్చర్ లేకపోయినా ఎక్కడో ఒక మలుపు వచ్చి కథ ప్రారంభమవుతోంది నిజమే. కానీ ఈ మలుపులో వచ్చే సన్నివేశ సృష్టినే నిర్లక్ష్యం చేసి,  ఏదో తూతూ మంత్రంగా  లాగించేసినప్పుడు, ఈ మొదటి మూలస్థంభానికి బలం లేకుండా పోతోంది. సినిమా ప్రారంభిస్తూ ఒక అద్భుతమైన ఓపెనింగ్ బ్యాంగ్ కోసం కృషి చేస్తారు. కానీ ప్లాట్ పాయింట్ వన్ దగ్గర అంతకంటే ముఖ్యంగా కథని  ప్రారంభిస్తూ ఆ సన్నివేశ సృష్టిని నీరు గార్చేస్తారు. అంటే కథా ప్రారంభం ప్లాట్ పాయింట్ వన్ దగ్గర కాదనీ, సినిమా ప్రారంభంలోనే  ఓపెనింగ్ బ్యాంగే కథా ప్రారంభమనే అపోహలో పడి ఇలా చేస్తారన్నమాట. 

          స్ట్రక్చర్ స్కూలు కాదని తమదేదో సొంతంగా కనిపెట్టిన క్రియేటివిటీని  పట్టుకుని పోయే కథకులు, కథకి తామిచ్చే మలుపు దగ్గరైనా  తమ సొంత క్రియేటివ్ ప్రతిభా వ్యుత్పత్తులేవో  గొప్పగా  ప్రదర్శించుకోవాలి కదా? ఎందుకని ప్రదర్శించుకోవడం లేదు? ఎందుకంటే స్క్రీన్ ప్లేలో ఆ ఘట్టం విలువ తెలీక. ఎందుకని తెలీక? స్ట్రక్చర్ ని పట్టించుకుంటే కదా కథనంలో ఇలాటి డైనమిక్స్ విషయం తెలిసేది. స్ట్రక్చర్ నియమాలతోనే కథా కథనాలేర్పడతాయని  తెలిస్తే, క్రియేటివిటీతో ఏ కథా పుట్టించి నడపలేరని తెలిస్తే, ప్లాట్ పాయింట్ వన్నులు ఇంత మన్ను తిన్న పాముల్లా  వుండవు.

          హాలీవుడ్ సినిమాల్లో ప్లాట్ పాయింట్ వన్నులు అద్భుత సృష్టులుగా వుంటాయి. అవొక ప్రత్యేక సెట్ పీస్ సీన్లు గా ప్రాణం పోసుకుంటాయి. బిగినింగ్ విభాగానికి ప్లాట్ పాయింట్ వన్ క్లయిమాక్స్ లాంటిది కాబట్టి, కథా ప్రారంభం కాబట్టి, దాన్ని అంత ఉద్విగ్న భరితంగా రిజిస్టర్ చేస్తారు. ఆ దృశ్యంలో కాన్సెప్ట్ ఉట్టిపడే నేపధ్య సృష్టి వుంటుంది. జానర్ ని బట్టి దాని రసపోషణ వుంటుంది.  రోమాంటిక్ కామెడీ జానర్ అయితే ఫన్నీగా, సెక్సీగా వుంటుంది. యాక్షన్ థ్రిల్లర్ జానరైతే  ఛేజింగో ఫైటింగో వుంటుంది. డిజాస్టర్ జానరైతే ఏదో ఉపద్రవం ముంచుకొస్తుంది. ఏదున్నా సంఘటనతోనే వుంటుంది తప్ప, డైలాగులతో కాదు. కొన్ని తెలుగు సినిమాల్లో లాగా ఈ ప్లాట్ పాయింట్ వన్ ని ఇంటర్వెల్ దాకా లాగిలాగి, అప్పుడు ఎక్కడో వున్న హీరోకి, హీరోయిన్ ఫోన్ చేసి బ్రేకప్ చెప్పేసేలాంటి బలహీన వెర్బల్ సీన్లు మాత్రం వుండవు. సినిమా అంటే డైలాగులు కాదు, సంఘటనలే. వెర్బల్ సీన్ల కోసం కోట్లు పెట్టి సినిమా తీయనవసరం లేదు, నాటకం వేసుకోవచ్చు.నాటకంలో సాధ్యం కాని సంఘటనల కోసమే సినిమా వుంది! సంఘటనలో డైలాగులవసరమనుకుంటే పలికించుకోవచ్చు. సంఘటనే లేకుండా డైలాగులతో కథని మలుపు తిప్పాలనుకోవడంతో సృజనాత్మకత లేదు, రసపోషణా లేదు. కథా ప్రారంభమే రిజిస్టర్ కాదు. కథా ప్రారంభమంటే సమస్యా, దాంతో సంఘర్షణా మొదలయ్యాయని గణగణ గంట మోగించి తెలియజెప్పడమే. ప్రేక్షకుల్ని ఎలర్ట్ చేయడమే. చిన్న రైల్వే స్టేషన్లో నైనా రైలొస్తోందని గంట మోగించి ప్రయాణికుల్ని అప్రమత్తం చేస్తారు. ఆ రైలు ఆగి ఆ ప్రయాణికుల్ని ఎక్కించుకుని మరీ పోతుంది. సినిమాల్లో ఏ గంటా మోగదు. ప్రేక్షకుల్ని వాళ్ళ ఖర్మానికి వొదిలేసి, కథకుడు ప్రేక్షకుల్ని ఎక్కించుకోకుండా,  చుక్ చుక్ బండి మీద తన మానాన తను నాన్ స్టాప్ గా,  యమ ఫాస్టుగా ఎటెటో వెళ్లిపోతూనే వుంటాడు. పైగా ప్రేక్షకుల ఇన్వాల్వ్ మెంట్ గురించి గొప్ప లెక్చర్ లిస్తాడు. కథల్ని రచయితల సంఘంలో రిజిస్టర్ చేయించుకోవడమే  కాదు, స్క్రీన్ ప్లేలో కథా ప్రారంభాన్ని కూడా రిజిస్టర్ చేసే ఇంగితముండాలి. లేకపోతే రచయితల సంఘంలో అజ్ఞాతవాసం పూర్తి చేసుకుని బయటి కొచ్చే కథలు బాక్సాఫీసు దగ్గర భోరు మంటాయి!

       హాలీవుడ్ ‘అన్ ఫెయిత్ ఫుల్’  వుంది. ఇందులో పదినిమిషాల్లో టైటిల్స్ పడుతున్న
ప్పుడే ప్లాట్ పాయింట్ వన్ వచ్చేస్తుంది. రోడ్డు మీద ఆమె సుడిగాలిలో చిక్కుకుంటుంది. పట్టుకోవడానికి ఆధారం దొరకదు. ఎదురుగా పాత పుస్తకాల విక్రేత వస్తూంటాడు. అతనూ పుస్తకాలు మోస్తూ కిందామీదా అవుతూంటాడు. ఇద్దరూ ఢీ కొట్టుకుని కింద పడిపోతారు. అంతే, మొదలైపోయింది కథ. సమస్యలో పడిందామె. అతడితో వివాహేతర సంబంధానికీ,  తద్వారా కుంటుంబంలో సంఘర్షణకీ బీజం పడిపోయింది. ఆ సుడిగాలేదో వాళ్ళని కలపడానికి ఉద్దేశం పెట్టుకుని కథకుడు సృష్టించలేదు. అది లేకి ఆలోచన. ఆ సుడిగాలికి కాన్సె ప్చ్యువల్ మీనింగుంది : అది ఆమె వైవాహిక జీవితంలో ఏర్పడబోయే ప్రకంపనలకి సూచన. పరిణామాల హెచ్చరిక ... ఇలా ఈ సినిమా విడుదలై పదహారేళ్ళు గడిచిపోయినా మర్చిపోలేనంత బలంగా, ఎమోషనల్ గా, వివరంగా సృష్టించారు ఈ ప్లాట్ పాయింట్ వన్ ఘట్టాన్ని. 

          ‘ట్రయాంగిల్’  అనే థ్రిల్లర్ వుంది. ఇందులో ఆమె ఫ్రెండ్స్ తో సముద్రం మీద బోటు షికారు కెళ్ళి తూఫానులో  చిక్కుకుని బోటు తలకిందులై సముద్రంలో పడిపోతుంది. ఈ బీభత్స భరిత ప్లాట్ పాయింట్ వన్ ని ఏదో ఆమె అడ్వెంచర్ చేయడం కోసమన్నట్టు సృష్టించలేదు. అది లేకి ఆలోచన. ఈ తూఫాను రావడానికి కాన్సె ప్చ్యువల్ మీనింగుంది. ఇలా ఫ్రెండ్స్ తో ఎంజాయ్ చేయడానికి వచ్చే ముందు,  ఆమె ఇంటి దగ్గర శారీరక లోపమున్న కొడుకుతో నిర్దయగా ప్రవర్తించి వచ్చింది. కాబట్టి ఆమె అందుకు అనుభవించాల్సిందే తప్ప, ఎంజాయ్ చేస్తే కాదు.  కాన్సె ప్చ్యువల్ మీనింగు లేకుండా,  ఉత్తుత్తి ఎమోషన్లతో ప్లాట్ పాయింట్ వన్నులు సృష్టిస్తే పని జరగదు.

       ఇలా యూహేవ్ గాట్ మెయిల్,  సెన్స్ అండ్ సెన్సిబిలిటీ,  సీ ఆఫ్ లవ్, న్యూ ఇన్ టౌన్, ది ప్రపోజల్, రైడర్స్ ఆఫ్ ది లాస్ట్ ఆర్క్, జాస్, సైలెన్స్ ఆఫ్ ది లాంబ్స్...ఇలా ఏ హాలీవుడ్ చూసినా ప్లాట్ పాయింట్ వన్స్ విజువల్ గా, ఆర్భాటంగా వుంటాయి. 

         
 ‘భజరంగీ భాయిజాన్' లో  కూడా ప్లాట్ పాయింట్ వన్ సంచలనాత్మకంగా వుంటుంది. టీవీలో క్రికెట్ చూస్తున్నపుడు తమతో వున్నబాలిక ముస్లిం మాత్రమే కాదనీ, పాకిస్తానీ కూడాననీ బయటపడి,  పెద్ద దుమారంతో డ్రమెటిక్ గా ప్లాట్ పాయింట్ వన్ ఏర్పాటవుతుంది. 

          (1) సకాలంలో ప్లాట్ పాయింటు రావడం, (2) అందులో సంఘర్షణ పుట్టడం, (3) ఆ సంఘర్షణ లోంచి గోల్ ఏర్పడడం, ఆ గోల్ లో – (4) కోరిక, (5) పణం, (6), పరిణామాల హెచ్చరిక, (7) ఎమోషన్ వుండడం,

          దీనికి ముందు బిగినింగ్ విభాగంలో - (8) ప్రథాన పాత్ర, (9) ఇతర ముఖ్య పాత్రల పరిచయం (10) కథా నేపధ్య సృష్టి, (11)  ప్రధాన పాత్ర సమస్యలో పడేందుకు తగిన పరిస్థితుల కల్పన, (12 ) చివరికి సమస్య ఏర్పాటుతో బిగినింగ్ ముగించడం,  

          ఇంకా ప్రధాన పాత్ర పాత్ర చిత్రణలో - (13) అంతర్గత సమస్యల కల్పన, (14) దాని క్యారక్టర్ ఆర్క్, మొత్తంగా బిగినింగ్ విభాగపు (15) టైం అండ్ టెన్షన్ గ్రాఫు...


       ఈ పదిహేనూ క్రియేటివిటీ టూల్స్ కావు. క్రియేటివిటీకి టూల్సూ పాడూ ఏవీ వుండవు. అంతా తాడూ బొంగరం లేని స్వకపోల స్వైరకల్పనల వ్యవహారమే. ఇవి స్ట్రక్చర్ టూల్స్. ఇవి వుంటేనే వీటితో ఆ తర్వాత క్రియేటివిటీ. ఆఁ...  నువ్వేదో చెప్పే ప్రధాన పాత్ర సమస్యలో పడేందుకు తగిన పరిస్థితుల కల్పన నాకెందుకనో, లేదా గోల్ ఎలిమెంట్సా బొంగరమా అనో,  ఇంకా లేదా - ప్లాట్ పాయింటా నా బొందా – నీ క్రియేటివిటీ నీ దగ్గరుంచుకో, నా క్రియేటివిటీ బంపర్...చూడు ఎలా క్రియేట్ చేస్తానో...అని తొడలు కొట్టుకుని కొట్టి పారెయ్యడానికి ఈ పదిహేనూ క్రియేటివ్ వంటింటి చిట్కాలు కావు. స్ట్రక్చర్ ఎలిమెంట్స్. ఏదీ తీసేయడానికి లేదు. బిగినింగ్ విభాగం ఇరవై సీన్లలో ఈ నట్లూ బోల్టులూ  బిగించుకుని, ఆ పైన  నీ క్రియేటివిటీ బండేదో నువ్వు నడిపించుకో - అని సదరు కథకుడికి ఎదురు చెప్పాల్సి వస్తుంది. 

          ప్లాట్ పాయింట్ వన్ లో ఈ మూలాలు లేకపోతే, దీన్ని పైన చెప్పిన హాలీవుడ్ క్రియేషన్ తో దృశ్యపరంగా బలంగా  రిజిస్టర్ చేయకపోతే, ఇంకో కథ రచయితల సంఘంలో రిజిస్టర్ చేయించడానికి డబ్బులుండక పోవచ్చు.

సికిందర్