రివ్యూలు, సాంకేతికాలు, స్క్రీన్ ప్లే సంగతులు...

టికెట్లు దొరకడం యోగం, సినిమాలు చూడడం భోగం, రివ్యూలు రాయడం రోగం!

4, ఏప్రిల్ 2018, బుధవారం

631 : సందేహాలు -సమాధానాలు



Q :    గత వారం Q & A లో, కథ ప్రారంభిస్తూ విలన్ చేసే నేరాన్నిచూపించి టైటిల్స్ వేశాక, హీరో ని ప్రవేశ పెట్టివెంటనే విలన్ మీదికి హీరోని  ప్రయోగిస్తే తప్పవుతుందా? అనే ప్రశ్న, దానికి మీ సమాధానం చదివాను. పరుచూరి గోపాల కృష్ణ గారు ఒక చోట కథలో హీరో పాత్రని లక్ష్యం తో అయితే పరిచయం చేశామో అదే ముగింపు కావాలన్నారు. ఉదాహరణగా ఖైదీ’  గురించి చెప్పారు. అదే కథని మన త్రీ యాక్ట్ ప్రకారం హీరో, హీరోయిన్ ప్రేమతో మొదలయ్యే కథగా ప్రారంభించాలని,  కానీ కథలో ముగింపు హీరో పగ తీర్చుకోవడంగా వుంది కాబట్టి ఇలా వుండకూడదనీ, కాబట్టే ఖైదీ’ కి ఇప్పుడున్న ఆర్డర్ వుందనీ  అన్నారు. అంటే హీరో పరిచయం పగ తీర్చుకోవడం కోసం వస్తున్నట్టు వుంటే, ఆ పగ తీర్చుకున్నట్టే ముగింపు ఇచ్చామని అన్నారాయన. కథని మామూలుగా హీరో, హీరోయిన్ ప్రేమతో మొదలు పెట్టకూడదా?
పేరు వెల్లడించ వద్దన్న దర్శకుడు

A : హీరో, హీరోయిన్ ప్రేమతో కథని మొదలెట్టవచ్చు. అప్పుడది బిగినింగ్ – మిడిల్ – ఎండ్ బాపతు లీనియర్  కథవుతుంది. అప్పుడు ‘ఖైదీ’ లో చిరంజీవి - మాధవిలు ప్రేమించుకుంటూ వుంటే ప్లాట్ పాయింట్ వన్ దగ్గర రావుగోపాలరావు దాడి చేస్తాడు. రావు గోపాలరావు ఎవరు, ఎందుకు దాడి చేశాడనేది ఇప్పుడొచ్చే ఫ్లాష్ బ్యాక్ లో తెలుస్తుంది. ఫ్లాష్ బ్యాక్ అయ్యాక,  చిరంజీవి రావుగోపాలరావు పనిబట్టడంతో కథ ముగుస్తుంది. ఫ్యాక్షన్ టెంప్లెట్ లో లాగా అన్నమాట. కాకపోతే ఫ్యాక్షన్ టెంప్లెట్ లో హీరో ఎవరు, ఎందుకొచ్చాడని   హీరో ఫ్లాష్ బ్యాక్ వుంటుంది. 

          ఏ ఫ్లాష్ బ్యాకు లేకుండా ప్రేమకథని లీనియర్ గా చెప్పాలంటే ‘ఒక్కడు’ వుంది.  ‘ఖైదీ’ కథని నాన్ లీనియర్ గా, అంటే ఫ్లాష్ బ్యాక్ లో చెప్పారు. అంటే మిడిల్ – బిగినింగ్ - ఎండ్ గా అంకాల్ని జంబ్లింగ్ చేశారు.  ‘ఖైదీ’ ప్రారంభం చిరంజీవి కత్తి పెట్టకుని తిరుగుతూ పోలీసు అధికారి అయిన రంగనాథ్ కి దొరకడమనే మిడిలే గా? ప్రేమ కథనే బిగినింగ్ లేకపోతే కత్తి పెట్టుకుని తిరిగే మిడిల్ ఎక్కడ్నించి వస్తుంది?  ఇలా పగతో వున్న (మిడిల్ తో) ప్రారంభించారు కాబట్టి సహజంగానే తిరిగి మిడిల్ కే వచ్చి ఎండ్ తో పగదీర్చుకోవడం పూర్తయింది. మధ్యలో చిరంజీవి అలా  తయారవడానికి కారణాలేమిటో తెలిపే ప్రేమకథ (బిగినింగ్)  చెప్పారు. పగకి కారణమైన ప్రేమ కథ ఫ్లాష్ బ్యాకులో చెప్పారు. ఒక లక్ష్యం ఏర్పడ్డాక లక్ష్యం పూర్తవడంతోనో, లేదా ఆ లక్ష్యం విఫలమవడంతోనో (హేరామ్, డే ఆఫ్ ది జాకాల్) ముగింపు దానికదే వుంటుంది. 

          ‘ఖైదీ’ ని సిల్వెస్టర్ స్టాలోన్ నటించిన ‘ఫస్ట్ బ్లడ్’ ఆధారంగా తీశారు. ‘ఫస్ట్ బ్లడ్’ లో భారీ మార్పులు చేసి ప్రేమ కథగా మార్చారు. ఐతే చిరంజీవి రంగనాథ్ కి దొరికే ప్రారంభం,  పోలీస్ స్టేషన్ లో పోరాటం  యథాతధంగా ‘ఫస్ట్ బ్లడ్’ లోనివే. 

          ఇక మీరన్నట్టు
కథని హీరో, హీరోయిన్ ప్రేమతో లీనియర్ గా మొదలు పెట్టే విషయం. కేవలం ప్రేమ కథయితే ప్రేమ కథని లీనియర్ గా మొదలెట్టడంలో ఏ ఇబ్బందీ వుండదు. యాక్షన్ ప్రధాన ప్రేమకథైనప్పుడు, దాన్ని  లీనియర్ గా ‘ఒక్కడు’ లోలాగా  చేసుకొచ్చినప్పుడు, ఆ ప్రేమని మిడిల్లో ప్రారంభించారు (పరుచూరి బ్రదర్సే రచన). బిగినింగ్ ముగుస్తూ ప్లాట్ పాయింట్ వన్ దగ్గర (45 వ నిమిషం) ప్రకాష్ రాజ్ బారి నుంచి భూమికని మహేష్ బాబు కాపాడి ఇంటికి తెచ్చుకోవడం, అక్కడ్నించీ మిడిల్లో ప్రేమకథని  ‘లీనియర్’  గా నడపడం. మహేష్ బాబుకైనా, ప్రకాష్ రాజ్ కైనా లక్ష్యాలు భూమికతో ప్లాట్ పాయింట్ వన్ దగ్గర ఏర్పడి కథ మొదలైంది కాబట్టి,  తిరిగి ఆ లక్ష్యాల సంఘర్షణతోనే కథ ముగిసింది. లీనియర్ అయితే ఇలా, నాన్ లీనియర్ అయితే అలా (ఖైదీ).

Q :  నా షార్ట్ ఫిలింని సినిమా కథగా విస్తరించాలనుకుంటున్నాను. ఎలా విస్తరించాలి, ఆ పద్ధతులేమిటి చెప్పగలరు.
 
వీ ఆర్ అనంత్

A :    ఫిలిమే లేకపోయాక ఇంకా షార్ట్ ఫిలిం ఏమిటి, షార్ట్ మూవీ అనాలి గాని. మొన్న ఇండియా వచ్చిన క్రిస్టఫర్ నోలాన్ ఫిలిం అన్నాడంటే  అర్ధముంది. ఆయన డిజిటల్ ని ఇష్టపడడు, ఎనలాగ్ (అంటే ఫిలిం) మీదే ఇక తీస్తానంటున్నాడు. ఆ మాటకొస్తే ఆయన సెల్ ఫోన్, ఈ- మెయిల్, ఫేస్ బుక్, ఇతర సోషల్ మీడియా దేని జోలికీ పోకుండా ప్రత్యక్ష సంబంధాలతో పాత కాలం నాటి మనిషిలా జీవిస్తున్నాడంటే నమ్ముతారా? ప్రకృతి సిద్ధమైన తన ఆలోచనలకి పదును పెట్టాలంటే టెక్నాలజీకి దూరంగా, ప్రకృతికి మాత్రమే దగ్గరగా వుండాలని అవన్నీ త్యజించిన ధన్యజీవి.  

          ఇక షార్ట్ మూవీని వెండి తెరకి విస్తరించే విషయం. అది షార్ట్ మూవీకి తీసుకున్న ఐడియాని బట్టి వుంటుంది. అన్ని షార్ట్ మూవీ ఐడియాలూ వెండి తెరకి పనికి రావాలని లేదు. పైగా షార్ట్ మూవీ మేకర్లు వాళ్ళ సొంత క్రియేటివిటీని వాడతారు. కమర్షియల్ సినిమా డిమాండ్ చేసే స్ట్రక్చర్ ని వాడరు.  ముందు కమర్షియల్ సినిమా అంటే ఏమిటో, దాని సూత్రాలేమిటో అంగీకరించడానికి మనస్కరించాలి. చాలా వరకూ మనస్కరించదు. ఎందుకంటే తమది సార్వజనీన స్ట్రక్చర్ స్కూలు కాక సొంత క్రియేటివిటీ స్కూలు కాబట్టి. ఆ కుటీర పరిశ్రమలోంచి బయటికి రాలేరు కాబట్టి. పెద్దపెద్ద యంత్రాలంటే జడుసుకుంటారు కాబట్టి. షార్ట్ మూవీస్ కథకి  పునాది లేకపోయినా చెల్లిపోతుంది. కమర్షియల్ సినిమాల కథలకి స్ట్రక్చరే పునాది. లక్షల మంది ప్రేక్షకులతో కూడిన మాస్ మీడియా అయిన కమర్షియల్ సినిమాలకి  స్ట్రక్చర్ అనే పునాది లేకుండా ఉత్త  క్రియేటివిటీ ప్రదర్శిస్తే చెల్లదు. పునాది లేకుండా ఉత్త క్రియేటివిటీతో కమర్షియల్ సినిమా కథ తయారవదు, ఆర్ట్ సినిమా కథ తయారవుతుంది. కమర్షియల్ సినిమా కథని భారీ చక్కర పరిశ్రమలా పెద్ద పెద్ద యంత్రాలతో నడపాల్సిందే.  

          కాబట్టి మీ షార్ట్ కి  వెండితెర సౌభాగ్యం కల్గించాలనే ఆలోచన చేసేముందు, అసలు పైన చెప్పిన కమర్షియల్ సినిమాల బేసిక్స్ ని అంగీకరించే సహనం మీకుందో లేదో పరిశీలించుకోండి.  బేసిక్స్ పట్ల సహనమే మీకు లేదని తేలిపోతే సినిమా ఆలోచన చెయ్యకండి. ఆ నిర్మాతా మీరూ అందరూ వీధిన పడతారు - కేవలం మీ ఒక్కరి వల్ల. 

          రెండోది, చేసిన షార్టునే పట్టుకుని సినిమా చేయాలనీ, ఆ తర్వాత సీరియల్ చేయాలనీ, వెబ్ సిరీస్ చేయాలనీ.. ఇన్ని గుడ్లు పెట్టె ఆలోచన చేయడమెందుకు? సినిమా చేయాలంటే ఇంకేమీ సినిమా ఐడియాలే రావా? షార్ట్ తో చేయదగ్గ బెస్ట్ ప్రయత్నమేమిటంటే, దాన్ని నాటికగా మార్చడం. షార్ట్ కంటే, సినిమా కంటే ఇంకా ఎక్కువ ప్రశంసలు పొందే అవకాశముంటుంది. 

          మూడోది, చిన్న హీరోలతో, కొత్త వాళ్ళతో కోటి -3 కోట్ల సినిమా చేయాలనుకున్నప్పుడు మొట్ట మొదట చేయాల్సిన పని - ఇటు చూసిన, తీసిన షార్ట్ మూవీస్ మేకింగ్ ఆలోచనలు, వరల్డ్ మూవీస్ మేకింగ్ ఆలోచనలూ - మళ్ళీ అటు చూసివున్న అనేకానేక బిగ్ కమర్షియల్ సినిమాల మేకింగ్ ఆలోచననలూ బుర్రలోకి రానీయకుండా, రెండు వైపులా తలుపులు గట్టిగా బిడాయించేసి, చేస్తున్న స్మాల్ కమర్షియల్ మూవీ మేకింగ్ ఆలోచనలనే అనుమతిస్తూ వాటితోనే పనిచేసుకోగల్గాలి. పెద్ద గోల్స్ కోసం నోలాన్ అలా చేస్తూంటే, చిన్న గోల్స్ కోసం మీరిలా చేయాలి.

Q :  పరిశీలనకు సినాప్సిస్ పంపితే సరిపోతుందా, డైలాగ్ వెర్షన్ పంపమంటారా?
మోహన్ (మారుపేరు), అసోషియేట్ 

 
A :   సినాప్సిస్ మాత్రమే పంపండి. పంపేముందు గమనించాల్సిన విషయం, మీ కథ మార్కెట్ యాస్పెక్ట్, స్ట్రక్చర్ స్కూలు పట్టకుండా,  కేవలం మీ సొంత క్రియేటివిటీతో, సబ్జెక్టివ్ గా, కమర్షియల్ సినిమాలకి వ్యతిరేకంగా,  తోచినట్టూ రాసుకుని వుంటే (ఇదే ఎక్కువ జరుగుతోంది), దాన్ని మార్కెట్ యాస్పెక్ట్ కి, స్ట్రక్చర్ స్కూల్లో పెట్టి ఆబ్జెక్టివ్ గా మార్చుకోవడానికి ఇష్టపడితేనే పంపండి. లేకపోతే మీరు నమ్మినట్టు మీరు తెరకెక్కించుకోండి. దీనికి వేరే సలహాసంప్రదింపులు అవసరం లేదు, సమయం వృధా.

Q :   ఏది స్క్రీన్ ప్లే, ఏది కాదు?
కె. రజనీకాంత్, పాఠకుడు

 
A :   స్ట్రక్చర్ వుంటే స్క్రీన్ ప్లే, లేకపోతే టెంప్లెట్. ఇది పెద్ద సినిమాల విషయం. చిన్న సినిమాల విషయం వచ్చేసి, స్ట్రక్చర్ వుంటే స్క్రీన్ ప్లే, లేకపోతే అట్టర్ ఫ్లాప్ ప్లే. ఎలాపడితే అలా రాసేసుకుని, దానికి స్క్రీన్ ప్లే అని పేరేసుకోవడం స్క్రీన్ ప్లేల పరువు తీయడమే. స్క్రీన్ ప్లే అంటే తోచిన సొంత క్రియేటివిటీ అనుకుంటూ, కనీసం పాత్ర చిత్రణలు కూడా తెలియకుండా  రాసుకుంటున్న వాళ్ళు చాలా అదృష్టవంతులు. వాళ్ళు చాలా ఈజీగా స్క్రిప్టులు రాసెయ్యగలరు. వాళ్ళు నేర్చుకోవడానికి ఇష్టపడరు, ఎందుకంటే తామే మాస్టర్లు కాబట్టి. ఫ్లాప్ మాస్టర్ జనరల్స్ కాబట్టి.

సికిందర్