రివ్యూలు, సాంకేతికాలు, స్క్రీన్ ప్లే సంగతులు...

టికెట్లు దొరకడం యోగం, సినిమాలు చూడడం భోగం, రివ్యూలు రాయడం రోగం!

Wednesday, February 7, 2018

599 : స్ట్రక్చర్ సంగతులు

Sorry, some unexpected brief assignments
have  caused interruption in the blog affairs.
Here is the promised article now…



రోమాంటిక్ డ్రామాలు రోగం, రోమాంటిక్ కామెడీలు భోగం! 


    విద్యా బాలన్ నటించిన బేగం జాన్లో అధికారులు దేశ విభజన రేఖ గీస్తున్నప్పుడు, ఆ వేశ్యా గృహం సరీగ్గా విభజన రేఖ మీది కొస్తుంది. విభజించడానికి వీల్లేదని వేశ్యలంతా తిరగబడి పోరాడి ప్రాణాలు పోగొట్టుకుంటారు. ఇప్పుడు ఛలోలో 1953 లో తమిళ నాడు లోంచి ఆంధ్ర ప్రాంతాన్ని విడదీస్తున్నప్పుడు విభజన రేఖ పక్కపక్కనే తమిళ తెలుగు గ్రామాల మధ్యగా పోతుంది. ఠాఠ్, మమ్మల్ని విడదీయడానికి  వీల్లేదంటే వీల్లేదని,  కలసి వుంటే కలదు సుఖమని  డైలాగు కొట్టి రెండూళ్ళ ప్రజలు అడ్డుకుంటారు. మళ్ళీ రాజీ కుదిరి విభజనకి ఒప్పుకుంటారు. అంతలోనే తెల్లారే గొడవలు మొదలై మధ్యలో కంచె కట్టేసుకుని శత్రువుల్లా విడి పోతారు. ఈ కథా పూర్వ స్థితి కథాకాలంలోనూ కొనసాగుతూనే  వుంటుంది.

          లో’ లోనే ఇంటర్వెల్ కొచ్చేసరికి ఠాఠ్, మమ్మల్ని కలిపి వుంచడానికి వీల్లేదంటే వీల్లేదని, విడిపోతేనే ఎవరికివారే యమునా తీరే అని,  ఫస్టాఫ్ – సెకండాఫ్ లు పంచాయితీ తేలక పంచనామా పెట్టుకుంటాయి. పంచనామా దేనికి జరుగుతుంది? మృతదేహానికి జరుగుతుంది. 

          ఇదంతా కాకుండా, ‘రెఫ్యూజీ’ లో అభిషేక్ బచ్చన్ పాకిస్తాన్ లో ప్రేమిస్తున్న కరీనా కపూర్ దగ్గరికి సరిహద్దులే లేనట్టు ఎడాపెడా రాకపోకలు సాగిస్తూంటాడు, బెజవాడ – కోదాడల మధ్య ఫ్రీగా షోకిల్లాలాగా తిరిగేస్తున్నట్టు.  ‘ఛలో’  స్క్రీన్ ప్లేకి వుండా ల్సింది ఇదీ! నిజానికి ఇదే వుంది – ఇంటర్వెల్  ఏదో బ్యాంగ్ ఇస్తూ  ఆగదు. యాక్షన్ సీను మధ్యలో ఆగుతుంది. సెకండాఫ్ లో అది కంటిన్యూ అవుతుంది. ఇలా ఫస్టాఫ్ - సెకండాఫ్ లని కలిపి వుంచే వంతెన వేసిన  ఒకే ఇంటర్వెల్  సీను తర్వాత కూడా అవి విడిపోయాయి. ఇది క్రియేటివిటీ దెబ్బ. క్రియేటివిటీకి స్ట్రక్చర్ అనే రేఖాగణితం లేకపోతే  ఆ దెబ్బతో పంచాయితీ తెగక పంచనామాలే జరుగుతాయి. ఇప్పుడు  రివ్యూలు రాయడానికి ఈ కొత్త దర్శకుడు ఒక కొత్త పదకోశాన్ని అందించడం బావుంది. ఇక పంచాయితీ లుండవ్, పంచనామాలే – అని హీరోకి  విలన్ వార్నింగ్ ఇచ్చే డైలాగు. అలాంటప్పుడు  హీరో పంగనామాలు పెట్టే ఆలోచనలు చెయ్యాలి. ఇదే చెయ్యలేకపోయాడు, తనకి వెన్నెముక (స్ట్రక్చర్) లేక.


           క్రియేటివిటీ కేవలం ఊహే, స్ట్రక్చర్ వాస్తవం.  ‘ఛలో’  సమస్యంతా ఐడియా దగ్గరే వుంది. అసలు ఐడియాని సరీగ్గా కనిపెట్టలేదు. దాంతో ఫస్టాఫ్ సెకండాఫ్ లని కలిపి వుంచే ఎమోషనల్ థ్రెడ్ పుట్టకుండానే పోయింది. దాంతో కథతో సంబంధం లేకుండా సెకండాఫ్ దారితప్పి తిరిగింది. సమగ్ర ఐడియా ఎప్పుడైనా - ఇలా జరిగితే? అన్న ప్రశ్నలోంచే పుడుతుంది. హాలీవుడ్ లో ఇలాగే  పుట్టిస్తారు. What if? -  ఇలా జరిగితే? అన్న  ప్రశ్న హై పాయింటుని ప్రేరేపించాల్సి వుంటుంది. నగరంలో పెద్ద పులి వచ్చి పడితే?... ఇద్దరు ప్రేమికులు తమ చూడరాని ఫోటోలున్న సెల్ ఫోన్ పోగొట్టుకుంటే? ... ఇలా హైపాయింటుతో కూడిన ఐడియా కథకి లభించినప్పుడు కథలు ఆసక్తి కరంగా మారిపోయే అవకాశ ముంటుంది. ఊహల్లోంచి మొదట హై పాయింటే తట్టాలి తప్ప, కథనే  వూహించే ప్రయత్నం చేయడం దండగ.  హై పాయింటు తెలిస్తే, అప్పుడు స్ట్రక్చర్ లో కథ దానికదే వచ్చేస్తుంది

          ఛలోలో హీరోకి పెట్టుకున్న సమస్య  - అతడి ప్రేమ ఫలించాలంటే రెండూళ్ల  మధ్య అడ్డు గోడల్ని పడగొట్టాలనేది స్పష్టంగా తెలిసిపోతోంది. ఇది సరిపోతుందా? ఇది హైపాయింటేనా? ఒకప్పటి కాలంలో చెల్లుబాటైన రొటీన్ పాత పాయింటుకి నేడు మార్కెట్ అప్పీల్ వుంటుందా?  నేటి గ్లోబల్ యుగంలో వర్కౌటయ్యే, ఆకట్టుకునే  ప్లేలు రెండే రెండు  - రోమాన్స్, లేదా ఎకనమిక్స్. కథలో ప్లే చేస్తే రోమాన్స్ ప్లే చేయాలి, లేదా  ఎకనమిక్స్ ప్లే చేయాలి.   రెండిటితో ముడి పడి  వుండే ఎమోషన్స్ తప్ప వేరేవి వర్కౌటయ్యే పరిస్థితి లేదు ప్రస్తుత గ్లోకల్వాతావరణ పరిస్థితుల్లో మానసంబంధాల దృష్ట్యా. ఇదికాని ఇంకే పాత చాదస్తాలూ  ఇంకా పని చెయ్యవు. ఇలా వున్న పాత ముసలి వాళ్ళ కథలో హీరో అనే వాడు ఖచ్చితంగా జనరేషన్ గ్యాప్ ఫీలవకుండా వుండలేడు. అప్పుడు ఇలా వున్న కథలోనే  తనదైన ఇంకో కొత్త రక్తపు  కథని ప్లే చేస్తేనే ముసలి వాళ్లకి చెక్ పెట్టినట్టు, తను అప్డేట్ అయినట్టు. కాలంలో ఇవ్వాల్టి యూత్ కి తగ్గట్టు హీరోగా తను  వున్నట్టూ. 


          పాత మూసగా రెండూళ్ల మధ్య పగల్ని  చల్లార్చినంత మాత్రానా హీరోయిన్ తండ్రి ప్రేమకి ఒప్పుకుంటాడని  హీరో ఎలా నమ్మగలడు? అసలు పగలు చల్లార్చడం ఏదో కాలక్షేపంగా సినిమా కోసమని తప్ప,  వాస్తవంలో ఎవరికైనా సాధ్యమా?  హీరోయిన్ తండ్రికి పగలు సామాజిక హోదానిస్తున్నాయి. అవుంటేనే మంది నేసుకుని పెద్దమనిషిలా చెలామణి ఆవుతాడు. వాటినెలా వదులుకుంటాడు? ఎందర్నో చంపినవాడు హీరోని చంపెయ్యడం లెక్కా

          పగలతో అతడికున్న మూర్ఖత్వం వదలాలంటే అంతకి మించిన సమాంతర సమస్య తో హై పాయింటు హీరో సృష్టించాలి.  వూరి గొడవల్ని సబ్ ప్లాట్ కింద నెట్టేసి, తను మెయిన్ ప్లాట్ సృష్టించాలి.  వూళ్ళ మధ్య పగలు వేరు, సొంత కుటుంబ ప్రతిష్ఠ వేరు. అందుకని హీరోయిన్ తో ముడి పెట్టి కుటుంబ ప్రతిష్ఠ మీద హీరో దెబ్బ కొట్టే ప్రయత్నం చేస్తే, కూతురితో కుటుంబ పరువుపోయే సమస్యే  ప్రధానమైపోయి, వూళ్ళ మధ్య పగలు అప్రధానమైపోయే అవకాశముంది  హీరోయిన్ తండ్రికి. ఇప్పుడే కథకి ముఖ్యావసరమైన  రోమాంటిక్ ఫ్లేవర్ కూడా పోరాటంలో కొనసాగుతూ,  యూత్ అప్పీల్  పరిపుష్టమవుతుంది. 

          ఆఫ్టరాల్ హీరో అంటే ఎవరు? యాక్టివ్ గా  వుంటూ రోమాంటిక్  గానో, ఎకనమికల్ గానో కొత్త కొత్త సంఘటనల్ని క్యాలిక్యులేటివ్ గా కనిపెట్టి సృష్టించి, తద్వారా మోత మోగిస్తూ కలర్ ఫుల్ క్యారక్టర్ గా ఎదిగే వాడేగా? కథని ఎక్కడో తీసికెళ్ళి ఆకాశానికి తాటించే వాడేగా

          ఇది  కథకుడికి తట్టలేదని కాదు, తట్టింది ఆలస్యంగా చిట్ట చివరికి. అదీ హీరోతో కాదు, రాంగ్ గా రెండూళ్ల పంచాయితీలు తీర్చే పెద్ద మనిషితో! హీరో ఖాతాలో పడాల్సిన క్యారెక్టర్ గ్రోత్ ఎలిమెంటు, తురుపు ముక్క, శుభ్రంగా ఎవరో పెద్ద మనిషి  జోలెలో  పడిపోయింది.  ఇంకొకటేమిటంటే,   పెద్ద మనిషే కథకి  ప్రధాన ప్రత్యర్ధి అవుతాడని కూడా  కథకుడు గుర్తించలేదు. అసలీ యాక్షన్ కామెడీ కథలో బలాబలాల సమీకరణ అనే బేసిక్స్ నే పట్టించుకోలేదు కథకుడు. హీరోకి సరైన ప్రత్యర్దులే లేరు. అంత కర్కోటకుడుగా పరిచయమయ్యే హీరోయిన్ తండ్రి కూడా క్యారెక్టరైజేషన్ ని వదులుకుని చల్లబడిపోతాడు. 
          ఓసారి ఫస్టాఫ్ సెకండాఫ్ కథ చూసుకుంటూ పోతే ఇవన్నీ ఎలా జరిగాయో తెలుస్తుంది.

పంచాయితీ!

ఫస్టాఫ్ : 
          బిగినింగ్ : హరి (నాగశౌర్య) కి చిన్నప్పట్నుంచీ ఎవరైనా గొడవలు పడుతూంటే చూసి ఎంజాయ్ చేయడం అలవాటు. నాల్గు తన్ని తన్నించుకోవడంలో ఆనందం.  ఇది భరించలేక తండ్రి (నరేష్) ఇంజనీరింగ్ చదువుకోవడానికి ఆంధ్రా తమిళనాడు సరిహద్దులో తిరుప్పురం అనే వూరుకి పంపేస్తాడు. పక్కనే తెలుగు వూరు వుంటుంది. తెలుగు వాళ్ళకీ,  తమిళులకీ పడక కొట్టుకుంటూ వుంటారు. రెండూళ్ళ మధ్య కంచె వేసుకుని, దాటి వస్తే చంపేస్తూంటారు. తమిళ వూరి పెద్ద వైరముత్తు, తెలుగు వూరి పెద్ద కేశవ. తెలీక తమిళ వూళ్ళో దిగిన హీరో,  వైరముత్తు మనుషులు   చంపడానికి వెంటపడితే పారిపోయి తెలుగూళ్ళో వచ్చి పడతాడు . రెండూళ్ళ కి కలిపి వున్న ఉమ్మడి కాలేజీలో చేరతాడు. రెండూళ్ళ గొడవలు తీర్చడానికి పంచాయితీ పెద్ద వుంటాడు. ఇతను కాలేజీలో గొడవలని పూర్తిగా నిషేధిస్తాడు. రెండూళ్ళ విద్యార్ధులందరూ  ఇక్కడే  చదువుకుంటూ వుంటారు.  

          ఇక్కడ కార్తీక (రశ్మిక) ని  చూడగానే ప్రేమలో పడిపోతాడు హీరో. ఆమె కూడా ప్రేమిస్తుంది. క్రమంలో కార్తీక తండ్రి కేశవ భోజనానికి పిలుస్తాడు. తనని అల్లుడిగా స్వీకరిస్తున్నాడనుకుని ఆనందించి  కార్తీక ఇల్లు వెతుక్కుంటూ వెళ్తాడు హరి.

          ప్లాట్ పాయింట్ వన్ :  అక్కడ కార్తీక వుంటుంది, వైరముత్తు కూడా వుంటాడు. కార్తీక వైరముత్తు కూతురు. ఈమె ఎం కార్తీక అయితే కేశవ కూతురు ఎల్ కార్తీక. హరి కన్ఫ్యూజన్ లో భోజనానికి వైరముత్తు ఇంటికెళ్ళి పోయాడు. కార్తీక తమిళ అమ్మాయని ఇప్పుడు తెలుస్తుంది. వైరముత్తు  తెలుగు వాడైన హరికి కత్తులు కటార్లతో  ‘భోజనంవడ్డించడానికి రెడీ అవుతాడు... ఇంటర్వెల్.

సెకండాఫ్ : 
      మిడిల్ : వైరముత్తు భారీ స్థాయిలో భోజనంవడ్డిస్తూంటే హరి ఫ్రెండ్ ని ఇరికించి హాస్టల్ కి పారిపోతాడు. ఇటు వీరముత్తు కూతుర్ని కాలేజీ మానెయ్యమంటే, పరీక్షల్లో ఫస్ట్ వచ్చానని ఒప్పించుకుంటుంది కార్తీక. కానీ తండ్రి భయంతో  ప్రేమించలేనని హరికి చెప్పేస్తుంది. ఇక ప్రేమ ఫలించాలంటే రెండూళ్ళ కలపాలన్న నిర్ణయానికొస్తాడు హరి. వైరముత్తు హరి మీద పంచాయితీ పెట్టిస్తే,  ఇక్కడి విషయాల్లో జోక్యం చేసుకుంటే ప్రాణాలుండవని హెచ్చరిస్తాడు పంచాయితీ పెద్ద. ఇక కూతురికి సంబంధం చూడ్డం మొదలెడతాడు వైరముత్తు. హరికి ఇటు వూళ్ళ మధ్య గొడవలకి ఫ్లాష్ బ్యాక్ లో కారణం తెలుస్తుంది. 

          ప్లాట్ పాయింట్ టూ :  తండ్రి కూడా పాత భూ రికార్డులు తెచ్చివ్వడంతో, వాటితో పంచాయితీ పెద్ద బండారం బయట పెడతాడు హరి. 
          ఎండ్ :  పంచాయితీ పెద్దే  గొడవల్ని పెంచి పోషించాడని తెలుసుకున్న ప్రజలు ఒక్కటవుతారు.  హరి కార్తీకని పెళ్లి చేసుకుంటాడు.

పంచనామా!

          స్వాభావికంగా కథ పూర్తిస్థాయి రోమాంటిక్ కామెడీ యాక్షన్ జానర్ లో వుండాల్సింది. కానీ  కొన్ని జానర్ మర్యాదలు తప్పి, సగం నుంచి మొత్తంగా జానరే  మారిపోయి, ఫక్తు రోమాంటిక్ డ్రామా జానర్ గా సాగుతుంది. ఇది రాంగ్ క్రియేటివ్ యాస్పెక్ట్.  బాక్సాఫీసు భరోసా  పూర్తి  స్థాయి రోమాంటిక్ కామెడీలకే  వుంటుంది గానీ, యూత్ అప్పీల్ సన్నగిల్లే రోమాంటిక్ డ్రామాలకి కాదు. రోమాంటిక్ కామెడీ అంటే ఆద్యంతం హుషారుగా ఉరక కలేసే కథ. ఇందులో హీరోహీరోయిన్లు ఎప్పుడూ విడిపోవడమంటూ జరగదు. కలిసి వుండడానికి అడ్డు పడే శక్తుల్నే కామెడీగా  తమాషాగా ఎదుర్కొనే ప్రయత్నం చేస్తూంటారు. ఇద్దరూ యాక్టివ్ పాత్రలై వుంటారు. ఇందులో పెద్ద వయసు పాత్రలకి అంతగా ప్రాధాన్యముండదు. ఎందుకంటే జానర్ యువశక్తికి గుర్తుగా,  హీరోహీరోయిన్ల సాధికారికతని చూపిస్తుంది. తాము ఇరుక్కున్న  సమస్య లోంచి తామే బయటపడే  శక్తి యుక్తుల్ని ప్రదర్శిస్తుంది. స్వశక్తి పట్ల యూత్ ని మోటివేట్ చేసేవే రోమాంటిక్ కామెడీలు. ఇందులో పెద్ద వయసు పాత్రలు హెల్ప్ చేసినా, బుద్ధి చెప్పి మార్చినా, జానర్ తప్పి నష్ట దాయకంగా రోమాంటిక్ డ్రామా జానర్ లోకి జారిపోతుంది. రోమాంటిక్ డ్రామాలు చేతకాని  హీరోహీరోయిన్ల ఏడ్పు కథలు. వాళ్ళవి పెద్ద వాళ్ళమీద ఆధారపడే పాసివ్ పాత్రలు. పెద్ద వాళ్ళ అదిలింపులు, విడదీయడాలు, కలపడాలూ వుంటాయి పాత వాసనేస్తూ. ఇందులో హీరోహీరోయిన్లు మధ్యలో విడిపోతారు. ఎమోషన్ పేరుతో కథనంలో విషాద ఛాయలు అలుముకుని వుంటాయి బాక్సాఫీసు డిమాండ్ కి వ్యతిరేకంగా.

          ఇలా రోమాంటిక్ యాక్షన్ కామెడీ జానర్ కథ ఐడియా స్థాయిలోనే ఏకసూత్రత లేక సగం దెబ్బతింది. ఇక స్క్రీన్ ప్లేలో టెంప్లెట్సే ఎక్కువున్నాయి. కథనంలో టెంప్లెట్స్ గురించి చెప్పుకోవాలంటే కొన్నే శాశ్వత వాడకానికి పనికొచ్చేవి. హీరోహీరోయిన్లు ప్రేమలో పడడమనే టెంప్లెట్ శాశ్వతం. ప్రేమలో సమస్య పుట్టడమనే టెంప్లెట్ శాశ్వతం. ఇవి లేకపోతే కథ వుండదు. కానీ సమస్య పుట్టాక హీరోయిన్ తండ్రి వేరే సంబంధం చూడ్డమనే,  పేరే పెళ్లి చూపులు జరగడమనే, హీరోయిన్ ఏడుస్తూ కూర్చోవడమనే టెంప్లెట్స్ కి శాశ్వత తత్వమనేది లేదు. ఇంకో కాలంలో అవి పాత బడిపోతాయి. అన్ని కాలాల్లో మానవ ప్రవర్తన ఒకేలా వుండదు. పాత టెంప్లెట్స్ లేకపోతే కథకే ప్రమాదమూ రాదు.  అలాగే హీరోని చిన్నప్పటి కథ సహా చూపించే టెంప్లెట్ కూడా ఇప్పుడు కాలం చెల్లిన టెంప్లెట్టే.       

          ‘మెంటల్ మదిలోలాగే మళ్ళీ స్క్రీన్ ప్లే కూడా బిగినింగ్ విభాగం ప్రారంభం చైతన్యవంతంగా వుండక,  చల్లారిన పదార్దంలా వుంటుంది. ఎదిగిన హీరో ఫలానా ఇలాటి వాడని చెప్పడానికి అరిగిపోయిన టెంప్లెట్ ని వాడుతూ,   చిన్నప్పట్నుంచీ అంతా నీరసంగా చూపించుకొస్తారు. హీరోని లైవ్ గా ప్రెజెంట్ చేసి, చేష్టలేవో ఇప్పుడే చూపిస్తూ,  చిన్నప్నట్నుంచీ ఇతను ఇంతేనని ఒక మాట చెప్పేస్తే పోయేదానికి - ప్రేక్షకులకి ఇంకా స్పూన్ ఫీడింగ్ చేసే కాలంలోనే వున్నారు యువదర్శకులు చాదస్తంగా. కొన్ని లక్షలు వెచ్చించి మార్కెట్ యాస్పెక్ట్ కీ, బాక్సాఫీసు అప్పీల్ కీ   మాత్రం కలిసిరాని   చిన్నప్పటి దృశ్యాలు షూట్ చేయడం అంతా వృధాయే. క్యారెక్టర్ ఏంటోమొదటే అంతా విప్పి చెప్పేసి, రసం పిండేసిన చెరుకు గడలా చేసి పడేస్తే, ఇక ఏం సస్పెన్స్ వుంటుందని ఆసక్తితో చూడడానికి

          బిగినింగ్ లో ప్రారంభం తీసేస్తే,  మిగతా ఇంటర్వెల్ వరకూ అంతా బాగానే వుంది. కాకపోతే హీరో పేరెంట్స్ పాత్రల ఉనికి వల్ల జానర్ మర్యాద తప్పింది. హీరో దెబ్బలాడే మనస్తత్వం, పేరెంట్స్ పరిచయం, హీరోని ఇక్కడ వుంచకూడదని దెబ్బలాడుకునే తెలుగు - తమిళ వూళ్ళకి కాలేజీకి తెలిసే  పంపించడం వగైరా. దెబ్బలాడే హీరోని దెబ్బలాడుకునే వూ ళ్లోనే  పడేస్తే దెబ్బలాడడం మానేస్తాడని తండ్రి నమ్మకం. ఏడుస్తున్న పిల్లల మధ్య ఇంకో  ఏడుస్తున్న పిల్లాణ్ణి  పడేస్తే  ఏడుపాపేస్తాడని లాజిక్ కూడా చెప్తాడు. రోమాంటిక్ కామెడీ జానర్ గా ప్రారంభమైన కథనంలో,  హీరోకి మార్గ నిర్దేశం చేసే తల్లిదండ్రుల పాత్రలే పానకంలో పుడకలయ్యాయి. కథలో హీరోకి పేరెంట్స్ గోలే వుండకూడదు. దెబ్బలాడుకునే రెండూళ్ళ గురించి హీరోకే తెలిసి, ఐతే అక్కడ ఇంకా బాగా దెబ్బ లాడ వచ్చని  ఇనుమడించిన ఉత్సాహంతో తనే ప్రయాణం కట్టాలి. అదీ క్యారక్టరైజేషన్ అంటే!

          పేరెంట్స్  పాత్రల వల్ల సెకండాఫ్ జానర్ మర్యాద పూర్తిగా చెడి, ప్లాట్ పాయింట్ టూ  కూడా దెబ్బతింది అక్కడ హీరో మరింత  హీరో అవ్వాల్సింది పోయి డమ్మీ అయిపోతూ. రోమాంటిక్ కామెడీల్లో ఇలాటి పేరెంట్స్ పాత్రలు యూత్ అప్పీల్ కి ఎందుకూ కొరగాని కోన్ కిస్కా పాత్రలు. 

          ఇక రెండూళ్ళలో తమిళ ప్రత్యర్ధి వైరముత్తు, తెలుగు ప్రత్యర్ధి కేశవతో బాటు,  పంచాయితీ  తీర్చే పెద్ద కూడా వుండే సెటప్ అంతా ఓకే. అక్కడే కేశవ కూతురనుకుని హీరో వైరముత్తు కూతుర్ని ప్రేమించడం మంచి డైనమిక్సే. రెండూళ్ళ  శత్రుత్వాల నేపధ్యంలో ప్రేమలో పడడమన్నది స్ట్రక్చర్ ప్రకారం సమస్యకి దారితీసే పరిస్థితుల కల్పనకి నాంది. హీరోని కేశవ భోజనానికి పిలవడం నేరుగా ప్లాట్ పాయింట్ వన్ కి దారితీస్తుంది. అక్కడ హీరో వెళ్ళింది కేశవ అనుకుని వైరముత్తు ఇంటికే. అలా వెళ్లి ఇరుక్కున్న హీరో వైరముత్తుతో ముఖాముఖీ అవుతాడు. 

           ప్లాట్ పాయింట్ వన్ సీనుని ఇంటర్వెల్ లో ఏర్పాటు చేశారు. కాబట్టి ప్లాట్ పాయింట్ వన్,  ఇంటర్వెల్ రెండూ ఒకటే అయ్యాయి. ప్లాట్ పాయింట్ వన్ సీన్ కూడా సంపూర్ణం కాదు. వైరముత్తుకి దొరికిపోయిన హరితో సస్పెన్స్ క్రియేట్ చేస్తూ ఇంటర్వెల్ పడుతుంది. అంటే ఇదే  సీను సెకండాఫ్ ప్రారంభంలో కొనసాగి ప్లాట్ పాయింట్ వన్ పూర్తవుతుంది. అప్పుడే సమస్య, గోల్ ఏర్పాటవుతాయన్న మాట. 

          ఇక్కడి వరకూ బిగినింగ్ విభాగంలో పైన చెప్పుకున్న జానర్ మర్యాదకి సంబందించిన లోపాలు తప్ప, ప్రారంభంలో చైల్డ్ స్టోరీ అనే పాత టెంప్లెట్  తప్ప, స్ట్రక్చర్ తో సమస్యల్లేవు. 

          సమస్యలు ఇంటర్వెల్ తర్వాత సెకండాఫ్ లో మిడిల్ విభాగంలోనే జొరబడి తినేశాయి. ఇంటర్వెల్ తర్వాత నుంచి స్ట్రక్చర్ లో లేదు కథ. ముందుగా ఇక్కడ ప్లాట్ పాయింట్ వన్ ఎలా ఏర్పాటయ్యిందో చూద్దాం. ఇంటర్వెల్లో ఆపిన ప్లాట్ పాయింట్ వన్ యాక్షన్ సీను ఇప్పుడు కంటిన్యూ అయి ఫ్రెండ్ ని ఇరికించి వైరముత్తు బారి నుంచి తప్పించుకుని పారిపోతాడు హరి. 

          హీరో ఎక్కడైనా ప్లాట్ పాయింట్ వన్ నుంచి తప్పించుకుని పారిపోతాడా?  ఇది కథ చెప్పే పద్ధతేనా? స్ట్రక్చర్ వదిలేసి జంప్ అవుతాడా హీరో? క్రియేటివిటీకి స్ట్రక్చర్ తెలియనప్పుడు తప్పకుండా జంప్ అవుతాడు సుడిగుండంలోకి. ప్లాట్ పాయింట్ వన్ అంటేనే సమస్యలో పడ్డ హీరో ఇక సంఘర్షణకి సంసిద్ధమయ్యే ఘట్టం. పారిపోతే ఘట్టం నేలమట్టం అవకుండా వుంటుందా? సెకండాఫ్ కథలో సమస్య లన్నిటికీ మూలం ప్లాట్ పాయింట్ వన్ లోనే వుంది. ప్లాట్  పాయింట్ వన్ స్క్రీన్ ప్లేకి  మొదటి మూలస్థంభమని తెలిసిందే. మూల స్థంభంలో ఏఏ ఎలిమెంట్స్ వుండాలో అవి లేకపోతే  మిడిలూ వుండదు, ఎండ్ కూడా సరిగ్గా కుదరదు. కథే దారి తప్పి తిరుగుతూంటుంది. 

          ప్లాట్ పాయింట్ వన్ లో హరి, వైరముత్తుతో సమస్యలో పడ్డప్పుడు, హరికి గోల్ ఏర్పడాలి. గోల్ లో 1. కోరిక, 2. పణం, 3. పరిణామాల హెచ్చరిక, 4. ఎమోషన్ అనే నాల్గు ఎలిమెంట్స్ కనిపించాలి. 

          ఇక్కడ హరి కేశవ ఇల్లనుకుని వచ్చి, అనుకోకుండా  విలన్ వైరముత్తుతో ఇరుక్కున్నాడు. ఇప్పుడేం  చేయాలి? తప్పించుకుని పారిపోవాలా? పారిపోకూడదని స్ట్రక్చర్ చెప్తోంది. స్ట్రక్చర్ ఒక చట్టం. క్రియేటివిటీ ఉల్లంఘన. మొదటి మూలస్థంభం దాని ఎలిమెంట్స్ ని డిమాండ్ చేస్తోంటే ఎక్కడికి పారిపోతాడు హరి?  అప్పుడలా  అనూహ్యంగా వచ్చి ఇరుక్కున్నప్పటికీ,  హరి అప్పటికప్పుడు తన ప్రేమ ( సీన్లో చూపించినట్టుగా తన ప్రాణాలు కాదు) ప్రమాదంలో పడిందని సమయస్ఫూర్తిని  ప్రదర్శించ వచ్చు. ఇదే ప్రేక్షకుల్ని ఆకట్టుకునే హీరోయిజమంటే, కథ పెరుగుతున్న కొద్దీ క్యారక్టర్ ఎదుగుదల అంటే. 

          వైరముత్తు గ్యాంగ్ తో పద్మ వ్యూహంలో ఇరుక్కున్న హరి,   రెండూళ్ళలో  శత్రుత్వాలనే  ముసలి మూర్ఖపు కథకి, తనదైన యువ కథానిక సృష్టించ వచ్చు. యాక్షన్ లో రోమాంటిక్ ఫీల్ కోసం మిస్సవకుండా, హీరోయిన్ ని లాగెయ్య వచ్చు. ఒక్కడులో మహేష్ బాబు, ప్రకాష్ రాజ్ మధ్య యాక్షన్ కథలో రోమాంటిక్ ఫ్లేవర్ తో భూమిక కూడా యాక్టివ్ పాత్రయి వుండకపోతే,   సినిమా ఎండిన ఎడారిలా వుండేది. హీరోయినెందుకని కథలో భూమికని పక్కన పెట్టి, హీరో విలన్లు కొట్టుకునే  ఉత్త యాక్షన్ కథగా లేదది. 

        అందుకని ఇక్కడ హీరోయిన్ కార్తీక ని సమస్యలోకి నిరభ్యంతరంగా లాగ వచ్చు హరి. అంటే సీన్లో చూపించినట్టు తనని తాను కాపాడుకుంటూ ఫ్రెండ్ ని ఇరికించి పారిపోయిన హరి కార్తీకని కూడా తీసుకుని పారిపోవచ్చు.  కార్తీకతో సన్నిహితంగా వున్న ఫోటోలేమైనా వుంటే వాటిని వైరముత్తు మొహాన ఫార్వర్డ్ కొట్టి పోవచ్చు. ముసలి వాళ్ళ కథకి జనరేషన్ గ్యాప్ ఫీలైన హరి,  తన యువకథానిక ఇలా ప్రారంభిస్తే - అప్పుడు డైనమిక్స్ కలిసి వచ్చి ప్లాట్ పాయింట్ వన్ కి థ్రిల్ వస్తుంది. ఆఫ్టరాల్  హీరో అంటే ఎవరు? అనుకోని సంఘటనలు సృష్టించి కలర్ఫుల్ క్యారెక్టర్ గా మెరిసిపోయే వాడేగా? - (“What is character but the determination of incident? And what is incident but the illumination of character?” – Henry James). పైగా What if? –  ప్రశ్నతో  హై పాయింటు సృష్టించిన వాడవుతాడు హరి. ఇరుక్కున్న పరిస్థతి లోంచి అన్నటికీ తెగించి,  హీరోయిన్ ని తీసుకుని పారిపోతే? అనేది What if? ప్రశ్న

            హీరో అంటే రిస్కు తీసుకునే వాడు కూడా కదా? ఇలా చేసి  హరి, కార్తీకతో  పారిపోయి తెలుగు వూళ్లోనే మకాం పెట్టేస్తే, అది ప్రిస్టేజిగా తీసుకుని తెలుగు ప్రజలు రక్షణ వలయమైపోతారు. రెండూళ్ళ మధ్య పాత ముసలి గొడవలు భగ్గు మంటాయి. కానీ తమిళ వైరముత్తు కూతురి కోసం తెలుగు వూరు మీద దాడి చేసే పరిస్థితి వుండదు. యాంటీగా హరి క్రియేట్ చేసిన యూత్ స్టోరీలో, వైరముత్తు  మోహన కొట్టి పోయిన కన్న కూతురి అపురూప ఛాయాచిత్రాలుంటాయి.  అవి బయటపడితే  రెండూళ్ళ లో అతడి పరువే పోతుంది. ఇప్పుడు  బ్యాక్ డ్రాప్ గా వున్నరెండూళ్ల కథతో, ఫోర్ గ్రౌండ్ లో వున్న  ప్రేమకథ కనెక్ట్ అయింది. ఇలా లేకనే కదా బాబీఫ్లాపయింది. 

          ఇలా చేయడం వల్ల హరికి 1. ప్రేమని సాధించుకోవాలన్నకోరికతిరుగులేకుండా బలీయమైంది, 2. కర్కోటకుడైన వైరముత్తుతో తన ప్రాణాలనే పణం’  గా పెట్టాడు, 3. రెండూళ్ళూ అగ్గిగుగ్గిల మవ్వచ్చన్న పరిణామాల హెచ్చరికనీ అనుభవిస్తున్నాడు, 4. వీటన్నిటితో తీవ్రమైన ఎమోషనల్ క్యారక్టర్ గా మారాడు.

          ఇదీ మొదటి మూలస్థంభం వుండాల్సిన స్థితి. ఇదంతా కథకి  ప్రధాన రసమైన హాస్యరస ప్రధానంగానే వుంటుంది ఎంటర్ టైన్మెంట్ కి.

కానీ ఏం జరిగింది? 

          ఉత్త చేతులతో పిరికిగా ( ఎందుకో కామెడీ అనుకోవాలని కథకుడి ఉద్దేశం)  పారిపోయి ఏం చేయాలో తెలీక మిడిల్ అంతా తిరిగాడు హరి. హాస్టల్ కి పారిపోయి వచ్చి కూడా కార్తీక గురించి ఫీలవ్వడు. మీల్స్ చేద్దామంటాడు  ఫ్రెండ్ తో. మళ్ళీ ఇంకో సీన్లో కూడా బిర్యానీ తిందామా అంటాడు ఫ్రెండ్ తో. ఫ్రెండ్ ని తీసుకుని కేశవ ఇంటికి పోతాడు- ఫస్టాఫ్ లో అతను భోజనానికి రమ్మన్న ఆహ్వానాన్ని పురస్కరించుకుని. ఇదిప్పుడు అవసరమా? ఫస్టాఫ్ లో కేశవ ఆహ్వానంతోనే  దారితప్పి వైరముత్తు ఇంటి కెళ్ళి- ప్లాట్ పాయింట్ వన్ ఏర్పడ్డాక, దానికి దోహదం  చేసిన అయిపోయిన పాత సంగతికి మళ్ళీ వెళ్ళడం క్యారక్టర్ ని, కథనీ  ముందుకు దౌడు తీయించడానికి విధంగా సాన బట్టింది?

          ఇప్పుడు భోజనానికి వచ్చిన హరి ఇక్కడ కేశవ కూతుర్ని చూసి మొహం తిప్పుకోవడం, ఆశలు పెట్టుకున్న కేశవ మండి పడ్డం, హరి తను వైరముత్తు కూతుర్ని  ప్రేమిస్తున్నాననగానే కేశవ యూ టర్న్ తీసుకుని, అయితే దాన్ని పెళ్లి చేసుకో, వీరముత్తు పొగరు అణుగుతుంది, అదే నాక్కావాలని అందుకు సాయంగా వుంటాననడం జరుగుతాయి. 

          హరి ఏం చేయాలో తెలియని పాసివ్ పాత్రయిపోవడానికే సీను పనికొచ్చింది. పాసివ్ పాత్రయితే ఇలాగే ఇతర పాత్రలు కథని తమ చేతిలోకి తీసుకుని తామే నడిపిస్తాయి....ఇప్పుడు రోమాంటిక్ కామెడీ లక్షణాలు చెదిరి, రోమాంటిక్ డ్రామా రోగ లక్షణాలు కన్పిస్తున్నాయా? పెద్ద వయసు పాత్రలు  జొరబడుతున్నాయా? ఇంకా జొరబడతాయి.

          అసలు సీను ఆలోచనే ఎంత పెద్ద తప్పో ఇలా చెప్పవచ్చు ఇంటర్వెల్ సీను వరకూ హరి తను ప్రేమిస్తున్న కార్తీక కేశవ కూతురేనని నమ్మాడు. కేశవ భోజనానికి రమ్మనగానే, అతను తన  ప్రేమకి గ్రీన్ సిగ్నల్ ఇస్తున్నాడనే ఆనందించి ఇతరులకి  చెప్పాడు హరి.  తీరా వెళ్ళింది వైరముత్తు ఇంటికనీ, వైరముత్తు కూతురే తను ప్రేమిస్తున్న కార్తీక అనీ తెలుసుకున్నాడు. 

           నేపధ్యంలో హరి ఆలోచనలు ఎలా వుంటాయి? అలా కేశవ ఇంటికి వెళ్ళకపోవడమే మంచిదయ్యింది, వెళ్లి వుంటే అతడి కూతురు తను ప్రేమిస్తున్న కార్తీక కాదని తెలిసేది, ఇది తెలిసి గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన కేశవ మెడ బట్టి బయటికి గెంటేసే వాడు అని కదా? అలాంటప్పుడు మళ్ళీ అతడి పాత ఆహ్వానాన్ని పురస్కరించుకుని ఇప్పుడెలా వెళ్తాడు, తప్పించుకు తిరుగుతాడు గానీ? ఇదంతా మూలస్థంభం మర్చిపోయి దారితప్పిన క్రియేటివ్ ఆట! స్ట్రక్చర్ అవసరం లేదనుకుంటే ఏం జరుగుతుందో ఇంకా చెప్పాలా ఇలా తప్పుడు సీన్లు, తప్పుడు కథే! 

           సీన్లో యూ టర్న్ తీసుకుని హరికి అండగా  వుంటానన్న కేశవే వెంటనే తోక ముడుస్తాడు. వైరముత్తు కూతురి విషయంగా హరితో పంచాయితీ పెట్టిస్తాడు. పంచాయితీ పెద్ద ప్రాణాలు జాగ్రత్తని  హరిని హెచ్చరిస్తాడు. వైరముత్తు కూడా ఇక పంచాయితీ లుండవ్, పంచానామాలే అంటాడు. తను ఆడాలనుకుంటున్న గేమ్ కూడా బయటపడి  కేశవ తోక ముడుస్తాడు. కేశవ సెటప్ కి ఇలాటి పే ఆఫ్ తో ఇంకోటేం  జరిగిందంటే, ఇతడితో ముందు కెళ్ళే కథకూడా ఇలా స్టార్ట్ అండ్ స్టాప్ కథనం బారిన పడి తెగిపోయింది. మళ్ళీ అతికించి కొనసాగించాలి. ఇది జరగదు. ఆటలోంచి ఇతను ఔటయ్యాడు. 

          పంచాయితీలో ఇన్ని బెదిరింపులొస్తున్నా హరి పల్లెత్తు మాటనడు. మనసులో ఏముందో అర్ధమవదు ప్రేక్షకులకి. ఏమైనా అనడానికి ఒక వ్యూహమంటూ వుంటే కదా? అది ప్రేక్షకులకి తెలిస్తే కదా? విలన్ బెదిరిస్తున్నా  నోర్మూసుకుని వుంటాడు.

          ఇలా ఒకదాని తర్వాత ఒకటి అర్ధం లేని సీన్లు. కార్తీకని కలుస్తాడు హరి. నువ్వు తమిళ్ కాదని కాదంటుంది కార్తీక. నువ్వు తెలుగే అనుకున్నానంటాడు హరి.  సరేనని, మళ్ళీ తండ్రి  వూరుకోడనీ, తనని మర్చిపొమ్మనీ అంటుంది. ఏమిటీమె సమస్య భాషా? తండ్రా? ప్రేమకి భాష అడ్డు కానప్పుడు నసే పెట్టకూడదు, నేరుగా పాయింటుకొచ్చి తండ్రితో వున్న భయం గురించే  చెప్పుకోవాలి. సీనైనా ఒక్క పాయింటు మీదే నడవాలి పాత్ర చిత్రణని కాపాడడం కోసం. 

          ఇక్కడొక ప్లేటు ఫిరాయింపు వుంది. దీనికి పూర్వం సీన్లో తండ్రి కాలేజీ మానెయ్యమని ఆర్డరేస్తే తెలివిగా,  చిలిపిగా,  కొంటెగా ఫస్టాఫ్ లోని రోమాంటిక్ కామెడీ హీరోయిన్ పాత్ర పోషణ చేస్తూ తండ్రిని న్యూట్రల్ చేసేస్తుంది. తన ప్రేమ కోసమే. కానీ ఇప్పుడొచ్చి హీరోతో తండ్రి భయం చెప్పి విడిపోదామంటుంది. ఇలా రోమాంటిక్ కామెడీ హీరోయిన్ కాస్తా రోమాంటిక్ డ్రామా ఏడ్పుల హీరోయిన్ గా మారిపోయి విడిపోతుంది. కథలో వుండక రోమాంటిక్ ప్లేవర్ వదులుకుని, మూల కూర్చుంటుంది. ఇలా కథలో (ప్లాట్ పాయింట్ వన్ లో) పుట్టని కృత్రిమ కథగా విషయం మారిపోతుంది. 

          ఇప్పుడు ప్రేమ కుదరాలంటే రెండూళ్ళని కలపాలని హరికి ఆలోచన వస్తుంది ఇంతాలస్యంగా. ఆలోచన ఇంటర్వెల్ ప్లాట్ పాయింట్ వన్ సీన్లోనే వచ్చి, అక్కడ వైరముత్తుకి దీటుగా గోల్ ఏర్పడాలి. ఎప్పుడో కార్తీక విడిపోయాక కాదు. ఇలావున్నాయి స్ట్రక్చర్  వదిలేసిన క్రియేటివిటీ సంగతులు. 

          అసలు హరికి ఎవరికీ లేని రెండూళ్ళని కలపాలన్న తపన ఎందుకు? ఏంటా చాదస్తపు సెంటిమెంటు? అవి తన వూళ్ళా?  ఏవో వూళ్ళు ఎలా తగలెడితే తనకెందుకు? కార్తీకని తీసుకుని పారిపో....ఊళ్ళని కలిపితే ఎక్కడైనా వైరముత్తు వచ్చి కళ్ళ కద్దుకుని కన్యాదానం చేసిపోతాడా? కృత్రిమ డ్రామాకి కృత్రిమ గోల్ ఇది.

          మళ్ళీ ఏమైందో, హరి ఫోన్ చేయగానే  కార్తీక వచ్చేసి డ్యూయెట్ పాడేసి వెళ్ళిపోతుంది. ఇక హరి ఫ్రెష్ గా ప్రిసిపాల్ కారు అడుక్కుని, రెండూళ్ళలో ముసలి వాళ్ళని కిడ్నాపులు చేయడం మొదలెడతాడు. అసలు గొడవలు ఎందుకు మొదలయ్యాయి చెప్పమంటాడు. 

          ఫ్లాష్ బ్యాక్ మొదలవుతుంది. వాళ్ళు ఆంధ్ర రాష్ట్ర విభజన నేపధ్యం చెప్పుకొచ్చి, రెండూళ్ళ జమీందార్లయిన ఇద్దరు ఒక గదిలోకి వెళ్లి,  కత్తిపోట్లతో వచ్చి పరస్పరం వ్యతిరేక ఆరోపణలు చేసుకుని,  రెండూళ్ళ ప్రజల్ని రెచ్చగొట్టి చచ్చిపోయారనీ, అసలు గదిలో ఏం జరిగిందో ఎవరికీ తెలీదనీ,  అప్పట్నుంచీ రెండూళ్ళ మధ్య శత్రుత్వాలు నెలకొన్నాయనీ వివరిస్తారు.   రోజు గదిలో ఏం జరిగింది? ఇదీ హరి ముందున్న ప్రశ్న. 

          హరి ఇలా కిడ్నాపులు చేస్తూంటే, అటు వైరముత్తుకి, ఇటు కేశవకీ, పంచాయితీ పెద్దకీ తెలియదా? తెలిసీ వూరుకున్నారా అంత హెచ్చరిక చేసీ? ఇలా అర్ధం లేకుండా వున్నాయి స్ట్రక్చర్ పట్టని క్రియేటివిటీ పాలబడ్డ సీన్లు. 

          నిజానికి ఫ్లాష్ బ్యాక్ మంచిదే,  ఫన్నీగా కూడా వుంది. ఐతే ఇదంతా నిష్ప్రయోజన మైపోయింది. కథలో విలన్ ఎవరు? ప్లాట్ పాయింట్ వన్ తో వైరముత్తు విలన్ గా కన్పించాడు. అదే సమయంలో ఇంకో విలన్ గా కేశవ  కన్పించాల్సింది కన్పించలేదు. హరి తన కూతుర్ని ప్రేమిస్తున్నాడని వైరముత్తు విలన్ అయ్యాడు ( కానీ అక్కడ్నించీ విలన్ లా ప్రవర్తించలేదనేది వేరే సంగతి). ఇక కేశవ విషయానికొస్తే, అతనూ విలనే. హరిని అల్లుణ్ణి చేసుకుందామని భోజనానికి పిలిస్తే,  రాకుండా శత్రువు వైరముత్తు ఇంటికెళ్ళి వాడి అమ్మాయి వల్లో పడ్డాడన్న కడుపుమంటతో రెండో విలన్ అవుతాడు. మొదట్లో చెప్పుకున్నట్టు, కథలో కనిపిస్తున్న బలాబలాల సమీకరణనే గుర్తించలేదు కథకుడు. హరికి ఆల్రెడీ ఇద్దరు విలన్లుంటారు. ఇప్పుడు అసలు విలన్ పంచాయితీ పెద్ద అవుతాడు. 

          ఎలాగంటే, హరి ముసలి వాళ్ళనేసుకుని ఫ్లాష్ బ్యాక్ తవ్వుతున్నాడు. ఫ్లాష్ బ్యాక్ బయట పడితే పంచాయితీ పెద్ద అసలు విలన్ గా దొరికిపోతాడు. విధంగా రెండూళ్ళలో హింసని ప్రేరేపిస్తూ తన చెప్పు చేతల్లో వుంచుకున్నాడో బయట పడిపోతుంది. ఫ్లాష్ బ్యాక్ లో,   రోజు గదిలో ఏం జరిగింది? అన్న హరి ముందుకొచ్చిన ప్రశ్న కథకుడి కథలోనే పంచాయితీ  పెద్దతో ముడి పడి వుంది! 

          కనుక ఫ్లాష్ బ్యాక్ తవ్వుతూంటే పంచాయితీ పెద్ద ధూంధాం చేస్తూ హరి అంతు చూడమని విలన్లని ఆదేశించకుండా వుండలేడు. ఇలా అర్ధవంతమైన యాక్షన్ కి స్కోపుంటుంది. అసలు యాక్షన్ మిస్సయ్యే కదా కామెడీగా పేలవంగా తేలిపోయింది ముగింపు

          ఎప్పుడైతే ఇక్కడ పంచాయితీ పెద్ద అసలు విలన్ అని ఝలక్ ఇస్తాడో కథ మొనాటనీ వదిలించుకుని ఇంకో లెవెల్ కెళ్ళే అవకాశాముంటుంది.  కానీ ఇలా జరగ లేదు. హీరో సంచలనంగా ఫ్లాష్ బ్యాక్ తవ్వుతున్నా విలన్లు నిమ్మకు నీరెత్తినట్టు వుంటారు. తన కెదురైన ప్రశ్నతో ముందు కెళ్లకుండా హరి కూడా స్తబ్దుగా వుండిపోతాడు. డైనమిక్స్ ఇలా కిల్ అవుతూ చప్పబడి పోతోంది సెకండాఫ్. 

          అటు కార్తీక ని చూస్తే ఆమె తండ్రి వైరముత్తు సంబంధాలు చూడ్డం. పాత చింతకాయ టెంప్లెట్స్  సీన్లలో వెన్నెల కిషోర్ నేసుకుని సెకండాఫ్ ని కొంత భర్తీ చేయడం. హరి అటు డైవర్ట్ అవడం. ఇందులోకి ఇతడి పేరెంట్స్ కూడా  దూరి  రోమాంటిక్ డ్రామా రోగ లక్షణాల్ని పరిపూర్ణం చేయడమూనూ. 

          ఫ్లాష్ బ్యాక్ తెలుసుకున్న తర్వాత, రోజు గదిలో ఏం జరిగిందన్న ప్రశ్నకి హరి- వూరి గొడవలు తనకేం అర్ధంగావడం లేదని కార్తీకతో అనేస్తాడు. ఆమెని తనతో వచ్చేయమంటాడు. మా ఫ్యామిలీ బాధపడతారని ఆమె అంటుంది. ఇద్దరికీ ఏం చేయాలో ర్ధంగాక ఒకటే ఏడ్పులు! ఇదీ వరస. పాసివ్ లో కూడా మరీ దివాలా తీసిన పాసివ్. ఇలా ఏడ్పిస్తే  ప్రేక్షకుల్లో సానుభూతి వచ్చేస్తుందని కాబోలు రోమాంటిక్ కామెడీని రోమాంటిక్ డ్రామాగా కిచిడీ చేసిన కథకుడి తప్పుడు భావోద్వేగాలే ఇవి. 

        ఈ ఏడ్పుల హరి ఇక తాగి బార్లో పాటేసుకుంటాడు. మధ్య హిందీలో వచ్చిన  పక్కా ఫన్నీ రోమాంటిక్ కామెడీ బరేలీకీ బర్ఫీలో ఉండుండి క్లయిమాక్స్ లో ఇలాటి పాట వేసే అంతవరకూ కాపాడుకొచ్చిన జానర్ మర్యాద చెడగొట్టారు. తన ప్రేమ పాడయ్యిందని ఆయుష్మాన్ ఖురానా భారీ సెట్టింగుతో ఏడ్పు పాట భీకరంగా  వేసుకుంటాడు. దీంతో కథ మూడ్ అంతా పాత గచ్చీ బౌలీ రోడ్డులా పిచ్చి పిచ్చిగా అయి పోతుంది. నిజానికిక్కడ క్లయిమాక్స్ ని లేపుతూ,  ఆయుష్మాన్ ఖురానా ప్రేమని చెడగొట్టిన రాజ్ కుమార్ రావ్ ఇరగదీసే పాట వుండాలి విజయంతో. అప్పుడే జానర్ మర్యాద సహా అన్నీ భద్రంగా వుంటాయి. 

          కథానాయకుడు హరి ఏడ్పు పాటతో సినిమాని పూర్తిగా దిగజార్చి, రోడ్డు పక్కన పాత దేవదాసులా కూర్చుంటే,  తండ్రి వచ్చి కాగితాలు చేతిలో పెడతాడు. అవి పాత భూ పత్రాలు. ఇద్దరు జమీందార్ల  ఆస్తులు సగం సగం మరొకరి పేర బదిలీ అయ్యాయని పుత్ర రత్నానికి జ్ఞానోదుం కల్గిస్తాడు.

          రోమాంటిక్ కామెడీ కాస్తా రోమాంటిక్ డ్రామా చర్మం కప్పుకున్నాక, ఇలాగే చేతకాక కూర్చున్న హీరో అనే వాడికి (కొడుక్కి) పేరెంట్సే  ఆదుకుని ఓదార్చి సమస్యలోంచి ఒడ్డున పడేస్తారు. ఇది మిడిల్ విభాగం ముగుస్తూ ప్లాట్ పాయింట్ టూ సన్నివేశం! ప్లాట్ పాయింట్ టూ అంటే ఏమిటి? ప్లాట్ పాయింట్ వన్ కి సమాధానం. సమాధానం బాగానే దొరికింది. సమాధానం ఎవరు స్వయంగా కనుక్కోవాలి? హీరో అంటే ఇక్కడ హరియే కనుక్కోవాలి. కానీ ఫ్లాష్ బ్యాక్ లేవనెత్తిన ప్రశ్నకి సమాధానం కనుక్కునే ప్రయత్నమే చెయ్యకుండా, కార్తీకతో పాటు కలిసి ఏడ్చి, ఏడ్పు పాట వేసుకున్న హరి ఇంకేం కనుక్కుంటాడు. 

          ఇందువల్ల ప్లాట్ పాయింట్ టూ,  అంటే రెండవ మూలస్థంభం కూడా విఫల మయింది. ప్లాట్ పాయింట్ వన్, ప్లాట్ పాయింట్ టూ రెండూ స్క్రీన్ ప్లే అనే మహా సౌధానికి రెండు మూల స్థంభాలు. మూల స్థంభాలు పుచ్చి పోయి వుంటే స్క్రీన్ ప్లే అనే మహా సౌధమే వుండదు. కుప్ప కూలుతుంది. ఇలా సినిమాలో స్క్రీన్ ప్లే అనేది లేదు. ఉన్నది ఏదో  మనసుకి తోచిన క్రియేటివిటీ మాత్రమే. 


        యథా ప్లాట్ పాయింట్ వన్ - తథా ప్లాట్ పాయింట్ టూ అన్నాడు. ఎవరో కాదు,  నాల్గు ఆస్కార్ల మహా దర్శకుడు బిల్లీ వైల్డర్. ప్లాట్ పాయింట్ వన్ ఎలా వస్తే ప్లాట్ పాయింట్ టూ కూడా అలాగే వస్తుందన్నాడు. ప్లాట్ పాయింట్ వన్ బలహీనంగా వుంటే, ప్లాట్ పాయింట్ టూ కూడా బలహీనంగానే వస్తుందన్నాడు. ముగింపుకి దారితీసే ప్లాట్ పాయింట్ టూతో ముగింపు సరిగ్గా కుదరకపోతే, వెనక్కి వెళ్లి ప్లాట్ పాయింట్ వన్ ని రిపేరు చేసుకోవాలన్నాడు. అదీ సంగతి!

          కథానాయకుడు ఇంటర్వెల్ దగ్గర,  ప్లాట్ పాయింట్ వన్ లో ఏమీ చేయలేక బలహీనం చేసి అలా పారిపోయాడు కాబట్టే, మిడిల్ అంతా ఏమీ చేయలేక, దొరికిన ప్రశ్నతో కూడా ఏం చేయాలో అర్ధంగాక, ఇప్పుడు ముగింపుకి వెళ్ళే  ప్లాట్ పాయింట్ టూని అంతే బలహీనంగా మారుస్తూ రోడ్డు పక్కన పాత దేవదాసులా కూర్చున్నాడు. అప్పుడు తండ్రి వచ్చి సాయం చేయాల్సి వచ్చింది. ఇక ఇప్పుడు  పెద్ద హీరో గారైపోయి, కాగితాలతో పంచాయితీ పెద్ద దగ్గరికెళ్లి పోయి,  ప్రశ్నకి సమాధానం తెలుసు కున్నాడు!

          సమాధానం తెలుసుకున్నాక, వైరముత్తు, కేశవలు తిరగబడితే పొడుచుకు చచ్చిన మీ తాతల బతుకుల గురించి నేను నోరువిప్పితే మీ పరువే పోతుంది కాబట్టి,  కలిసి వుంటే కలదు సుఖమని పంచాయితీ పెద్ద బ్లాక్ మెయిల్ చేస్తాడు. దీంతో రెండూళ్ళూ కలిసివుంటే కలదు సుఖమని నినాదాలు చేసుకుని కలిసిపోతాయి. ఇక హరి, కార్తీకల పెళ్లి  సీను మీద శుభం! ఏనాటి శుభాలివి!!

          ఉత్త డైలాగులతో నడిచే క్లయిమాక్స్ తో పాటు ముగింపూ చూస్తే చాలా పాత సినిమా చూస్తున్నట్టు వుంటుంది. ఇందాక చెప్పుకున్నట్టు బలాబలాల సమీకరణ మర్చిపోవడంతో యాక్షన్ తో కలిపి క్లయిమాక్స్ చేసేందుకు లేకుండా పోయింది.  

          ఇంకా పంచానామా చేస్తే చాలా వుంది కానీ,  ఇంతచాలు. ఇలా సినిమాని విమర్శిస్తున్నామని కాదు స్ట్రక్చర్ నేర్చుకోవడానికి ఒక చక్కటి మోడల్ గా దృష్టికి తేవడమే ఉద్దేశం. టెంప్లెట్ సినిమాలతో ఇది వీలుపడదు.

సికిందర్








         

 
         



           





Saturday, February 3, 2018

598 : రివ్యూ!




రచన - దర్శకత్వం: వెంకీ కె.
తారాగణం : నాగశౌర్య,  రశ్మిక,  నరేష్,  వెన్నెల కిషోర్, సత్య, వైవా హర్ష, పోసాని కృష్ణమురళి తదితరులు.
సంగీతం: మహతీ స్వర సాగర్, ఛాయాగ్రహణం : సాయి శ్రీరామ్   బ్యానర్‌: ఐరా క్రియేషన్స్ 
నిర్మాత: ఉషా ముల్పూరి
విడుదల :  ఫిబ్రవరి 2, 2018
***
      లవర్ బాయ్ హీరో నాగశౌర్య కొత్త దర్శకుడితో మరో కొత్త ప్రయత్నంగా విజయాన్ని కాంక్షిస్తూ వచ్చాడు. కొంత కాలంగా ప్రచారంలో వుంటూ ఆసక్తి రేపుతున్న ‘ఛలో’ తో అనిల్ కపూర్ ‘సాహెబ్’ లాగా, చిరంజీవి ‘విజేత’ లాగా ఎక్కడికో బయల్దేరినట్టు డఫెల్ బ్యాగు తగిలించుకుని విచ్చేశాడు. ఎక్కడికి బయల్దేరినా చేరాల్సింది తను కోరుకుంటున్న ఒక్క హిట్టు గట్టుకే. మరి ఆ డఫెల్ బ్యాగులో  హిట్టుకి తగ్గ ట్రావెల్ సరంజామా అంతా వుందా, లేక ఉత్తి బ్యాగేనా అది? ఆర్ట్ డైరెక్టర్ ఉత్తి బ్యాగే ఇస్తాడని మనకి తెలుసు. అందులో తన ఆలోచనలు, కొత్త దర్శకుడి  ఆలోచనలూ వుండాలిగా? అవి వున్నాయా? వుంటే ఏ మేరకున్నాయి? ఎంతవరకూ ప్రేక్షకుల్ని అలరించడానికి సరి తూగుతున్నాయి? ప్రేక్షకులు అలక పాన్పెక్కకుండా ఎంతవరకూ కాపాడుతున్నాయి?...ఒకసారి ఈ కింద టూరేసి చూద్దాం...

కథ 
      హరి (నాగశౌర్య) కి చిన్నప్పట్నుంచీ ఎవరైనా గొడవలు పడుతూంటే చూసి ఎంజాయ్ చేయడం అలవాటు. నాల్గు తన్ని తన్నించుకోవడంలో ఆనందం.  ఇది భరించలేక తండ్రి (నరేష్) ఇంజనీరింగ్ చదువుకోవడానికి ఆంధ్రా –తమిళనాడు సరిహద్దులో తిరుప్పురం అనే వూరుకి పంపేస్తాడు. పక్కనే తెలుగు వూరు వుంటుంది. ఆ తెలుగు వాళ్ళకీ,  తమిళులకీ పడక కొట్టుకుంటూ వుంటారు. రెండూళ్ళ మధ్య కంచె వేసుకుని, దాటి వస్తే చంపేస్తూంటారు. తెలుగు వూళ్ళో చేరిన హరి కాలేజీలో జాయినవుతాడు. రెండూళ్ళ ఆ ఉమ్మడి కాలేజీని తమ సాంప్రదాయ గొడవల్నుంచి మినహాయిస్తారు. రెండూళ్ళ విద్యార్ధులందరూ  అక్కడే చదువుకుంటూ వుంటారు.  అక్కడ హరి కార్తీక (రశ్మిక) ని  చూడగానే ప్రేమలో పడిపోతాడు. ఆమె కూడా ప్రేమిస్తుంది. తీరా చూస్తే ఈమె తెలుగు అమ్మాయి కాదనీ, అవతలి వూరు ఘరానా మనిషి తమిళ వీరముత్తు కూతురనీ  తెలుస్తుంది. కూతురి వ్యవహారం తెలుసుకున్న వీరముత్తు హరిని  చంపమని ముఠాని తోలుతాడు. హరి పారిపోతాడు. 

          ఇప్పుడు కార్తీకని పొందాలంటే హరి ఏం చేశాడు?  రెండూళ్ళ  మధ్య గొడవల్ని  చల్లా ర్చాలంటే ఏం చేశాడు? అలా చేసి కార్తీకని పొందగలిగాడా? ... అన్నదే మిగతా కథ.  

ఎలావుంది కథ 
      రోమాంటిక్ యాక్షన్ కామెడీ  జానర్ గా ప్రారంభమై,  అంతలో యూటర్న్ తీసుకుని,  బాధాకరంగా జానర్ మర్యాదని వదిలేస్తూ,  రోమాంటిక్ డ్రామా జానర్లోకి తిరగబెట్టింది. సగం వరకూ యూత్ అప్పీల్,  మార్కెట్ యాస్పెక్ట్, క్రియేటివ్  యాస్పెక్ట్ లకి  మంచి న్యాయంచేకూరుస్తూ కూడా, మిగతా సగాని కొచ్చేసరికి ఇవి అవసరం లేదనుకుని వదిలేసి, ఏటో వెళ్ళిపోయింది.  హీరోహీరోయిన్ల ప్రేమకి రెండూళ్ళు అడ్డు అనే ఐడియా ఇప్పటిది కాదు. గతంలో చాలా వచ్చాయి, ఇప్పుడింకా  ఒకటో రెండో కూడా రాబోతున్నాయి. కాబట్టి  ప్రస్తుత కథలో ప్రాంతాలు మార్చినంత మాత్రాన  కొత్తదనమేమీ రాలేదు. సాంస్కృతిక పరమైన విభేదాల కథ కూడా కాదు. కనుక ఏదో మెసేజీ వినాల్సిన బాధ కూడా ప్రేక్షకులకి లేదు. రెండూళ్ళ  జిగ్రీ దోస్తులైన ఇద్దరు తెలుగు తమిళ తాతలు మదమెక్కి తన్నుకుని,  రెండూళ్ళ మధ్య గీత గీసిపోయిన మూర్ఖత్వమిది. దీన్ని పట్టుకుని అసలు నిజమేంటో తెలీని ఇప్పటి జనం, తాతల మూర్ఖత్వాన్నే కంటిన్యూ చేస్తూ కొట్టుకు ఛస్తున్నారు. ఈ నేపధ్యంలో హస్యభరితంగా టైం పాస్ ప్రేమ కామెడీ చెప్పాలి. కానీ  పాతదే అయినా,  ఎంతో యూత్ ఫుల్  కాన్సెప్ట్ గా కొత్తగానే , హాస్య భరితంగానే  కొనసాగిస్తూ పోతున్న కొత్త దర్శకుడైన కథకుడు, తీరా ఒక్కసారిగా నస భరితం చేయడం చాలా శోచనీయమైన విషయం. నాణేలకి సైడ్ ‘బి’ వుంటుంది గానీ, ‘షోలే’ నాణేనికి రెండు  వైపులా సైడ్ ‘ఏ’ లే వుంటాయి. సినిమాల కథలు కూడా ‘షోలే’ నాణెం లాంటివే. పూర్వార్ధంలాగే ద్వితీయార్ధమూ కొనసాగాలని నాల్గు డబ్బులిచ్చుకుని కూర్చున్న ప్రేక్షకుడు ఆశిస్తాడు. అలా లేనిపక్షంలో బాక్సాఫీసు దగ్గర అచ్చు బొమ్మ జూదమాడేస్తాడు. 

ఎవరెలా చేశారు 
     నాగశౌర్యకి  చాలాకాలం తర్వాత ఓ మంచి సినిమాయే దొరికింది.  కాకపోతే పాక్షికంగా మాత్రమే. తను కథ వినేటప్పుడు - తన పాత్ర పుట్టు లక్షణమైన కొట్లాటల పిచ్చి, సెకండాఫ్ లో చచ్చిపోయిందేమిటని అనుమానమే రాలేదా? యాక్టివ్ క్యారెక్టర్ పాసివ్ క్యారెక్టర్ అయిందేమిటని అన్పించనే లేదా? ఇక్కడే తను సినిమాని నిలబెట్టడంలో పూర్తిగా సఫలం కాలేకపోయాడు. రోటీన్ మూస –మాస్- ఆవారా పాత్రచిత్రణలకి  భిన్నంగా,  ఎంతో ఫ్రెష్ గా, విలక్షణమైన ఫన్నీ పాత్రగా అలరిస్తున్న తను, నవ్విస్తున్న తను, ప్రేక్షకుల చేత ఈలలేయించుకుంటూ వున్న తనే, తీరా సెకండాఫ్ కొచ్చేసరికి  ఆ కిక్ నంతా వదిలేసుకోవడమేమిటి? అక్కడ్నించీ యూత్ అప్పీల్ కి దూరమైపోవడమేమిటి? ముగింపు ఉస్సూరు మన్పించడమేమిటి? అంతవరకూ సన్నివేశ బలాలతో,  వాటిలోంచి పుట్టిన పర్ఫెక్ట్ పాటలతో అంతకంతకూ పాత్రని ప్రేక్షకులు ప్రేమించేలా చేసుకోగల్గిన తను, ఒక్క పాట విషయంలో పప్పులో కాలేసినట్టు గమనించలేదా? అప్పటికే డీలా పడిపోయిన కథని లేవనెత్తకుండా, ఇంకా డీలా పడిపోయేలా చేస్తూ,  బార్ లో ఆ భగ్న ప్రేమ తాలూకు తాగుడు పాటేమిటి?  

          నాగశౌర్యకి ఈసారి మంచి క్రియేటివ్ విజన్, తనదైన ఒక శైలి నేర్పాటుచేసుకుని ముద్ర వేయాలన్న తపనా గల, కొత్త దర్శకుడు దొరికాడు. కానీ కథకుడుగా పాక్షిక రైటింగ్ పవరే వుండడంతో,  కొత్త దర్శకుడి చేతిలో తను పూర్తిగా రాణించలేకపోయాడు. ఈ సినిమా తో నాగశౌర్య  మెసేజీ లేమీ ఇవ్వలేదు గానీ, సినిమాయే శౌర్యకి గట్టి మెసేజి ఇస్తోంది – భవిష్యత్తులో పూర్తిస్థాయి రైటింగ్ పవర్ వుండేట్టు కూడా చూసుకోవాలని. 

          కొత్త హీరోయిన్ రస్మిక,  వూళ్ళల్లో వుండే  కామన్ గర్ల్ పాత్రకి సరిపోయే శారీరక తత్వంతో, హీరోతో ఎత్తు చాలకపోయినా  సహజ నటనతో,  కాలేజీ అమ్మాయిలతో కలిసిపోయే క్రేజీ యూత్ అప్పీల్ తో వుంది. సహజ నటనే అయినా, స్పాంటేనియస్ గా నటించడం తెలియడంతో ఆమె వున్న సీన్లు చైతన్యవంతంగా వున్నాయి.

       ఇక తెలుగు, తమిళ కాలేజీ గ్యాంగ్ అంతా ఫన్నీ కమెడియన్స్. వీళ్ళల్లో సత్యకి ఫుటేజీ ఎక్కువ. ఎవరూ వెకిలి కామెడీలు చేయకపోవడం పెద్ద రిలీఫ్. లెక్చరర్ గా పోసానీ కామెడీ పర్ఫెక్ట్. ప్రిన్సిపాల్ గా రఘుబాబు కూడా మోటు కామెడీకి దూరంగా,  నీటుగా తక్కువ మాటలతో నవ్వించడం ఎక్సెలెంట్. సెకండాఫ్ లో పెళ్లి కొడుకుగా వెన్నెల కిశోర్ ది మెంటల్ కామెడీ.
         
మహతీ స్వర సాగర్ ఇచ్చిన సంగీతం చాలా పెద్ద ఎసెట్ ఈ సినిమాకి. ఆ రెండూళ్ల నేటివిటీని  దృష్టిలో పెట్టుకుని కూర్చిన నేటివ్ బాణీలూ, అందుకు తగ్గ సాహిత్యం పాటల్లో ఇన్వాల్వ్ చేసేట్టున్నాయి ప్రేక్షకుల్ని. చాలాకాలం తర్వాత తెలుగు తెరమీద ఇది చూస్తున్నాం. ఒక్క చివరి బార్ సాంగ్ మాత్రం కథ బలహీనపడ్డ నేపధ్యంలో గల్లంతయ్యింది. 

          అలాగే సాయిశ్రీరాం ఛాయాగ్రహణం మంచి విజువల్స్ ని క్రియేట్ చేయగల్గింది విషయ పరమైన ఫీల్ ని దృష్టిలో పెట్టుకుని. కొత్త దర్శకుడి షాట్ కంపోజింగ్ లో లాలిత్యముండడంతో  కెమెరా వర్క్ నాణ్యత కూడా పెరిగింది. అందమైన కొత్త లొకేషన్స్ బాగా కలిసి వచ్చాయి.  బ్రిటిష్ కాలంనాటి కాలేజీ, హాస్టల్ భవనాలు కాలేజీ సీన్స్ కి మంచి డాబుసరి నేపధ్యాలు. ప్రొడక్షన్ ప్రమాణాలన్నీ ఉన్నతంగా వున్నాయి. 

చివరికేమిటి 
        కొత్తదర్శకుడు వెంకీ ‘ఛలో’ అన్నాడే గానీ, సెకండాఫ్ ని కూడా వెంట తీసికెళ్ళ లేదు. ఫస్టాఫ్ తో సెకండాఫ్ ‘చలేంగే సాథ్ మిల్ కే’  అని చేయిచాపి అడుగుతున్నా, కలిసి సాగేందుకు ఫస్టాఫ్ ఒప్పుకోలేదు. రెండూళ్ళ పంచాయితీ లాగే అయింది. ఇంత మాత్రానా కొత్త దర్శకుణ్ణి తక్కువ చేయడానికి వీల్లేదు. అతడి క్రియేటివిటీనీ, సెన్సాఫ్ హ్యూమర్ నీ  గుర్తించాల్సిందే. ఈ సెన్సాఫ్ హ్యూమర్ తో కూడిన డైలాగుల్ని కింది క్లాసు ప్రేక్షకులు కూడా తెగ ఎంజాయ్ చేయడాన్నిబట్టే కొత్త దర్శకుడి టాలెంట్ తెలుస్తోంది. డైలాగులకి ఈ తాజాదనం పాత్రలు మాటాడ్డం వల్ల వచ్చింది. దీంతో టెంప్లెట్ మూస డైలాగుల బాధ తప్పింది. టెంప్లెట్ మూస డైలాగులు పాత్రలు మాట్లాడేవి కావు, అవి దర్శకుడో రైటరో సినిమా ప్రపంచంలో మునిగి వుండి  రాసేవి. పాత్రలు సినిమా ప్రపంచంలో ఛస్తే వుండవు, , అవి వాటివైన  కథా ప్రపంచంలోనే వుండి మాట్లాడాలనుకుంటాయి. అందుకని అవి మాట్లాడితే మూస వాసనెయ్యదు. 


          కొత్త దర్శకుడి దగ్గర అపారమైన క్రియేటివ్ టాలెంట్ వుంది. దీనికి స్ట్రక్చర్ జతపడక పోవడంతో  సెకండాఫ్ కి సమస్య వచ్చింది. ఇది చూసైనా ఇప్పటికైనా ఇంకెవరైనా స్ట్రక్చర్ కూడా ఎంత ముఖ్యమో  గ్రహిస్తే క్రియేటివిటీకి అర్ధముంటుంది.  ఈ కొత్త దర్శకుడే విలన్ తో ఒక డైలాగు అన్పిస్తాడు - ఇక పంచాయితీలుండవ్, పంచనామాలే వుంటాయని. ఇలాగే  ఈ ఫస్టాఫ్ - సెకండాఫ్ ల పంచాయితేమిటో, పంచనామా ఏమిటో,  స్క్రీన్ ప్లే సంగతులు చేసి సోమవారం చూద్దాం.

సికిందర్




         


  



         

Friday, February 2, 2018

597 : రివ్యూ!


దర్శకత్వం : విక్రం సరికొండ
కథ : వక్కంతం వంశీ, టెంప్లెట్  : దీపక్ రాజ్, మాటలు : శ్రీనివాస రెడ్డి , అడిషనల్ డైలాగ్స్ : రవి రెడ్డి, కేశవ్
తారాగణం : రవితేజ, రాశీ ఖన్నా, సీరత్ కపూర్, ఫ్రెడ్డీ దారూవాలా
సంగీతం : జామ్ 8,  ఛాయాగ్రహణం : ఛోటా కే నాయుడు
బ్యానర్ : శ్రీ లక్ష్మీ నరసింహా ప్రొడక్షన్స్
నిర్మాత : నల్లమలుపు బుజ్జి,  వల్లభ నేని వంశీ
విడుదల : ఫిబ్రవరి 2, 2018

***
          క త్వరత్వరగా సినిమాలు చేసెయ్యాలనుకుంటున్న రవితేజ మూడు నెలలకల్లా మరో సినిమాతో వచ్చాడు. దీనికి కొత్త దర్శకుడికి అవకాశమిచ్చాడు. పాత్రలు, నటన, కథలు కూడా మారకుండా అవే రిపీట్ చేస్తూ చేస్తూ మాస్ మహారాజా అన్పించుకుంటున్న రవితేజకి,  ఈ వ్యూహం ఇంకెంత కాలం వర్కౌటవుతుంది? రవితేజ అంటే ఇదేనా, ఇంకేమైనా వుందా?  మాస్ మహారాజా మూస మహారాజాగా వుండి పోవాల్సిందేనా? ఇలా వుంటేనే చూస్తారా ప్రేక్షకులు? ఇప్పుడు ఇదే వ్యూహంతో  మళ్ళీ టచ్ చేసి చూడ మంటున్నాడా? ఏ సంగతి ఈ కింద రివ్యూలో చూద్దాం ...

కథ 
      కార్తికేయ (రవితేజ)  పాండిచ్చేరిలో వ్యాపారం చేస్తూంటాడు. కుటుంబం వుంటుంది. కుటుంబం మీద ఈగ వాలనివ్వడు. పెళ్లి చేద్దామనుకుంటారు తల్లిదండ్రులు. పెళ్లి చూపుల్లో పుష్ప (రాశీ ఖన్నా) ని చూస్తాడు. ఆమె కాదన్నా వెంటపడి తనకి పడేలా చేసుకుంటాడు. ఆమె ఎందుకో అలుగుతుంది. వేరే పెళ్లి చూపులని నాటకమాడతాడు.  ఆమె పూర్తిగా  దూరమవుతుంది. ఇంతలో అతడి చెల్లెలు ఒక హత్య చూస్తుంది. సాక్ష్యం చెప్పమని పోలీసుల దగ్గరికి తీసుకుపోతాడు. ఆమె చూసిన హంతకుడు ఇర్ఫాన్  లాలా (ఫ్రెడ్డీ దారూవాలా)  అని కార్తికేయకి తెలుస్తుంది. అంతలో అట్నుంచి  పోతున్న ఇర్ఫాన్ లాలా వెంట పడతాడు. ఇర్ఫాన్ లాలా తప్పించుకుంటాడు. కార్తికేయ కమీషనర్ ( మురళీ శర్మ) కి ఫోన్ చేసి,  ఐదేళ్ళ క్రితం చనిపోయిన ఇర్ఫాన్ లాలా ఎలా బతికున్నాడని నిలదీస్తాడు. ఇక ఏసీపీ క్యాప్ పెట్టుకుని పోలీసు ఆఫీసర్ గా ఇంటర్వెల్ కి బయల్దేరతాడు. మనం కూడా బయల్దేరతాం. 
          ఇంతకీ ఎవరీ ఇర్ఫాన్ లాలా? ఇతడికీ కార్తికేయకీ ఏమ  సంబంధముంది? గతంలో అసలేం జరిగింది? ఇవి తెలుసుకోవడానికి  ఇంటర్వెల్ తర్వాత లోపలి కెళ్ళాలి.

ఎలా వుంది కథ
     కథా? అదేమిటి?  కథేమైనా వుంటుందా తెలుగు సినిమాకి? వున్నా అదే పురాతన అరగదీసిన మూస ఫార్ములా టెంప్లెట్ కాక వేరే ఏదైనా వుంటుందా? కథ ఎలా వుందని  అడగడమంటే అమాయకత్వాన్ని వెళ్ళబోసుకోవడమే. అయితే ఇక్కడ ఈ టెంప్లెట్ గురించే  కొంత చెప్పుకోవాలి.  టెంప్లెట్ ని కూడా స్టార్ హీరోతో ‘బి’ గ్రేడ్ టెంప్లెట్ గా తీసేసిన ధైర్యానికి మెచ్చుకుని తీరాలి.  టెంకాయ కొట్టక ముందే ఫస్టాఫ్ ఫ్లాప్, సెకండాఫ్ అట్టర్ ఫ్లాప్ అని తెలిసిపోయే 'బి'  గ్రేడ్ టెంప్లెట్ ని,  ‘ఏ’ గ్రేడ్ స్టార్ తో నిర్లక్ష్యంగా తీసి అవతల పడేసే స్థాయికి చేరుకోవడమంటే మామూలు మాట కాదు. కోటప్పకొండ తిరునాళ్ళ ల్లో రికార్డింగ్ డాన్స్ నాటకాల  స్థాయికి  టెంప్లెట్ కూడా పడిపోయింది. ఈ వ్యాసకర్త ఇంటర్వెల్ కల్లా పారిపోయే ప్లానేస్తే, అవతల బండి  తీయరాక మళ్ళీ బందీ అయిపోవాల్సివచ్చింది  హారిబుల్  మహారాజాకి!  ఇక శివరాత్రికి కోటప్పకొండ కెళ్ళి నాల్గు రికార్డింగ్ డాన్సులు  టచ్ చేసి చూస్తేనే బూజు వదిలేది! 

ఎవరెలా చేశారు 
      ‘బి’  గ్రేడ్ లో ఎవరైనా బేకారుగానే కన్పిస్తారు. మాస్ మహారాజా మనసు పెట్టి నటించలేదు. అది బిగుసుకుపోయిన ముఖ భావాల్లోనే స్పష్టంగా తెలిసిపోతూంటుంది. పైగా వయసు కూడా తెలిసిపోతూం
డడంతో ఫైట్లూ, పాటల్లో డాన్సులూ తప్ప, మిగతా హీరోయిన్లతో  రెగ్యులర్ కామెడీలు, టీజింగులూ వగైరాలు  ఇదివరక
టంతటి గ్లామరస్ గా కన్పించవు. ఎక్కడో వ్యాపారం చేసుకునే పాత్ర, పోలీసు ఆఫీసర్ గా బయటపడే ఫ్లాష్ బ్యాక్ లాంటి ఫ్యాక్షన్ వయా బాషా క్యారెక్టర్లకి ఇది కాలమా అని ఆలోచించకుండా నటించిన రవితేజ,  అభిమానులకి కూడా ‘అజ్ఞాత వాసి’ తో పవన్ కళ్యాణ్  ఇచ్చినంత షాకు నిచ్చాడు. రవితేజ కెరీర్ లోనే ఇది అట్టడుగు స్థాయి ప్రయత్నం. 

         టెంప్లెట్ హీరోయిన్లు ఇద్దరి గురించీ నో కామెంట్. ఇతర నటుల గురించి కూడా చెప్పుకోవడానికి లేదు. విలన్ గా  నటించిన ఫ్రెడ్డీ దారూవాలాకి  విలన్ కి సరిపోయే సీను లేదు.  

          ఎందుకనో ఛోటా కే నాయుడు ఈసారి తనదైన మార్కు కెమెరా పనితనం చూపెట్ట లేకపోయారు. పెద్ద సినిమాలు తీసే నల్లమలుపు శ్రీనివాస్ ప్రొడక్షన్ విలువలు ‘బి’గ్రేడ్ గా వున్నాయి. బాలీవుడ్  ప్రీతమ్ గ్రూపు జామ్ 8 సంగీతంలో పాటలు కుదరలేదు. మణిశర్మ నేపధ్య సంగీతం మొదట్లో కుదిరి, తర్వాత ఆయనా చేతులెత్తేశారు. రవితేజకి మాటలేం రాశారు – అవే అటు ఇటు మార్చిన టెంప్లెట్ డైలాగులు. ఇవ్వాళ్టి  హీ- మాన్ డైలాగుల సరళిని ‘ఫాస్ట్ అండ్ ఫ్యూరియస్ – 8’  చూసి ఎప్పుడు నేర్చుకుంటారో!  


చివరికేమిటి 
       కొత్త దర్శకుడు విక్రం దృష్టిలో సినిమా అంటే తలపోటు తెప్పించే  షాట్లు అన్నట్టుంది. ఆ షాట్లకీ నేపధ్య సంగీతానికీ లంకె కుదరకపోతే తలపోటే వస్తుంది. ఇది గతంలో బాలకృష్ణ నటించిన ‘లక్ష్మీ నరసింహా’ తోనే స్పష్టమయింది. మైక్రో షాట్లతో పరుగులెత్తే ‘బోర్న్ సుప్రమసీ’ కి  డీఐనే చేయలేక చేతులెత్తేశారు టెక్నీషియన్లు. అది డీఐ లేకుండానే విడుదలయ్యింది. ఇక అందులోని మైక్రో షాట్లతో చిన్న చిన్న బిట్లుగా వేగంగా మారిపోయే సీన్లకి ఎఫెక్ట్సూ, మ్యూజిక్కూ ఇవ్వడం దుస్సాధ్యమై పోయింది.

          కొత్త దర్శకుడు సినిమాలో కంటెంట్ సరీగ్గా వుండేట్టు చూసుకోవాలి గానీ, కంటెంటే లే ని విషయం కప్పిపుచ్చుతూ ఇలాటి టెక్నికల్ హంగామాలు చేస్తే తలపోటు వచ్చే కాలుష్యమే మిగులుతుంది. టెంప్లెట్ సినిమాలు ఫ్లాపవుతున్నాయని తెలిసి కూడా టెంప్లెట్ నే ఆశ్రయించాడంటే,  తీస్తున్నది టెంప్లెట్ అని తెలియక తీశాడనుకోవాలా? చిన్న పిల్లలు కూడా నవ్విపోయే కంటెంట్ ఒక కంటెంటేనా స్టార్ హీరోకి? ఎవరైనా పాత మూస కంటెంట్ తో సెకండాఫ్ లో గంటపాటు ఫ్లాష్ బ్యాక్ పెడతారా? అసలు స్క్రీన్ ప్లే అంటే ఏమిటి?  తోచినట్టూ తోసేసే సొంత క్రియేటివిటీలా? స్క్రీన్ ప్లే అని వేసుకోకూడదు దాని విలువ తీస్తూ – టెంప్లెట్ అని వేసుకోవాలి. 

          రవితేజయినా టెంప్లెట్ ఇప్పుడిక మాస్ మహారాజా స్టేటస్ కి కష్టమని గ్రహించి, కాస్త ఈడియెట్ మార్కు నటనలు కూడా మార్చుకుని, పదిహేనేళ్ళ క్రిందటి ప్రేక్షకులు ఇప్పుడు లేరని గ్రహించి, ఇప్పటి మార్కెట్ కి   ఏది సూటవువుతుందో అదిచ్చే ప్రొఫెషనల్ దర్శకులని చేరదీస్తే, ఇంకో పదేళ్ళు నిలదొక్కుకోగలిగే అవకాశముంటుంది. లేకపోతే ఇంకా క్వాలిటీ పడిపోయి ‘సి’ గ్రేడ్ కి చేరుకోవాల్సి వస్తుంది.

సికిందర్