రివ్యూలు, సాంకేతికాలు, స్క్రీన్ ప్లే సంగతులు...

టికెట్లు దొరకడం యోగం, సినిమాలు చూడడం భోగం, రివ్యూలు రాయడం రోగం!

6, నవంబర్ 2016, ఆదివారం

రచన- ద‌ర్శ‌క‌త్వం: ఆర్పీ ప‌ట్నాయ‌క్‌
తారాగణం:  ఆర్పీ ప‌ట్నాయ‌క్‌, అనిత, సాయికుమార్‌, తనికెళ్ళ భరణి, నాజర్, గొల్లపూడి మారుతీరావు, జయప్రకాష్ రెడ్డి, రాజారవీంద్ర, సందేశ్, బెనర్జీ, రఘుబాబు, శ్రీముఖి, దువ్వాసి మోహన్ తదితరులు. 
మాటలు : తిరుమల్ నాగ
, సంగీతం: ఆర్పీ ప‌ట్నాయ‌క్‌ఛాయాగ్రహణం : సిద్ధార్థ్
బ్యానర్ :
  యూనిక్రాఫ్ట్ మూవీ
స‌హ నిర్మాత‌లు
: ఉమేశ్ గౌడ‌, బాల‌సుబ్ర‌హ్మ‌ణ్యం
నిర్మాత‌
: జ‌గ‌న్ మోహ‌న్‌
విడుదల : 4 నవంబర్
, 2016
***
        ర్శకుడుగా నటుడుగా సంగీత దర్శకుడు ఆర్పీ పట్నాయక్ వాస్తవిక కథా చిత్రాల పంథా నెంచుకున్నారు. ఈ కోవలో శీను వాసంతి లక్ష్మి’, ‘బ్రోకర్అనే రెండు ప్రయోగాలు చేశారు. ఆర్ధిక ఫలితాలెలా వుంటున్నా పంథా వీడకుండా తిరిగి ఇప్పుడు మనలో ఒకడుతో వచ్చారు. ఈసారి మీడియాని ప్రశ్నించదల్చుకున్నారు- ముఖ్యంగా ఎలక్ట్రానిక్ మీడియాని. మొన్నే పూరీ జగన్నాథ్ ఇజంతో మీడియాని ఆకాశానికెత్తేస్తే, పట్నాయక్ నేలకు దించి వాస్తవాలెలా   చెప్పారో ఈ కింద చూద్దాం...
కథ 

     కృష్ణమూర్తి ( పట్నాయక్) ఓ కాలేజీ లెక్చరర్. విద్యార్ధుల్లో మంచిగౌరవం సంపాదించుకుంటాడు. భార్య శ్రావణి (అనిత) పిల్లలకి సంగీతం నేర్పుతూంటుంది. ఇద్దరూ హాయిగా వుంటారు. ఓ రోజు ఓ స్టూడెంట్ మూడోకన్నుఅనే ఛానెల్ కి ఫోన్ చేసి తనమీద కృష్ణమూర్తి  లైంగిక వేధింపులకి పాల్పడుతున్నాడని ఫిర్యాదు చేస్తుంది. ఆ ఛానెల్ కృష్ణ మూర్తి ఫోటోతో ఈ వార్తని ప్రసారం చేస్తుంది. దీంతో కలకలం రేగి ఇంటాబయటా కృష్ణమూర్తి పరువు పోగొట్టుకుంటాడు. హాస్టల్లో ఆ అమ్మాయిని పట్టుకుని అడిగితే ఛానల్ వాళ్ళు తప్పుగా వేశారని, తన ఉద్దేశం లాబ్ టెక్నీషియన్ కృష్ణమూర్తి అనీ చెప్పి మాయమై పోతుంది. అయినా కాలేజీ యాజమాన్యం కృష్ణమూర్తిని సస్పెండ్ చేస్తుంది.  ప్రిన్సిపాల్ మాత్రం కృష్ణమూర్తి పట్ల సానుభూతిగా వుంటూ దీన్నెలా ఎదుర్కోవాలో సలహాలిస్తూంటాడు. శ్రీ (సందేశ్) అనే ఇంకో లెక్చరర్ కృష్ణమూర్తికి వచ్చిన ఈ కష్టంలో తోడుగా ఉంటాడు. కృష్ణ మూర్తి ఇంటిదగ్గర పరిస్థితి చెడిపోతుంది. భార్య అతణ్ణి  అసహ్యించుకుంటూ మాట్లాడ్డం మానేస్తుంది. ఇరుగు పొరుగూ కృష్ణమూర్తిని వెలివేస్తారు. ఒంటరివాడై పోయిన కృష్ణమూర్తి ఇక తన నిర్దోషిత్వాన్ని నిరూపించుకోవడానికి ఆ ఛానెల్ కి వెళ్లి అసలు విషయం చెప్తాడు. ఛానెల్ వాళ్ళు చేసిన పొరపాటు గ్రహించినా సవరణ వేయడానికి ఒప్పుకోరు. ప్రసారం చేసిన వార్త తప్పని సవరణ వేస్తే  తమ ఛానెల్ ప్రతిష్ట దెబ్బ తింటుందని ఛానెల్ అధినేత ప్రతాప్ (సాయికుమార్) తిరస్కరిస్తాడు. కృష్ణమూర్తి అక్కడ ఘర్షణపడి లాభంలేక కోర్టు కెక్కుతాడు. కోర్టులో తాను పెట్టుకున్న లాయర్ (తనికెళ్ళ భరణి) ఛానెల్ వైపు ప్లేటు ఫిరాయిస్తాడు. 
        ఇలా దారులు మూసుకుపోతూంటే కృష్ణమూర్తి ఛానెల్ మీద ఎలా పోరాడి గెలిచాడనేది మిగతా కథ. 

ఎలావుంది కథ 
      ఓ శక్తివంతమైన ఛానెల్ మీద సామాన్యుడి పోరాటమనే, వినోదానికి ఆస్కారం లేని,  ఆసక్తికర కథకి అవకాశమున్న కాన్సెప్ట్ ఇది. స్కూళ్ళలో కాలేజీల్లో కామవికారాల ఉపాధ్యాయులకి బడితె పూజ, కటకటాల్లో లాఠీ సేవ - అనే బ్రేకింగ్ న్యూసులు రొటీన్ అయిపోయాయి. విద్యాలయ్యాల్లో గురువుల ఈ కామవికారాలు ఎప్పుడు అంతమవుతాయా అని జనం ఉత్కంఠతో ఎదురుచూస్తున్నారు.  దీన్నలా వుంచి, పట్నాయక్  రివర్స్ లోవచ్చి,  ఉపాధ్యాయుడినే  లైంగిక వేధింపుల తప్పుడు ఆరోపణల బాధితుడిగా నడుస్తున్న చరిత్రకి తద్విరుద్ధ దృశ్యం చూపెట్టారు. ఇక్కడ ఉద్దేశం విద్యార్ధినులతో కూడా ఉపాధ్యాయులు జాగ్రత్తగా వుండాలని హెచ్చరించడం కాదు, వాస్తవాలు తెలుసుకోకుండా అత్యుత్సాహంతో వార్తలు ప్రసారం చేసే  మూడోకన్నుఅనే కల్పిత ఛానెల్ ని ఎండగట్టడం మాత్రమే. పట్నాయక్  వాస్తవాలు తెలుసుకుని మరీ వార్తలు ప్రసారం చేయాలని చెప్పుకొచ్చారు. అయితే ఛానెల్ ని అవతలి పక్షం చేసి నిందించినప్పుడు, ఇవతలి తన స్వపక్షంలో వాదం నిర్దుష్టంగా నిర్మించుకోవాలని  చూసుకోలేదు. భూస్వామి వుంటాడు, అతను తనకి అన్యాయం చేశాడని కూలీ ఆరోపించినప్పుడు, ఆ అన్యాయానికి తోటి కూలీ బాధ్యత కూడా వుందని తెలుస్తూంటే  ఆ కథ కళారూపంగా రక్తికట్టడం కష్టం.  ఇదే జరిగింది పట్నాయక్ కథలో. ఛానెల్ మీద పోరాటానికి వెళ్ళే ముందు సంఘటన పూర్వాపరాలు నిర్దుష్టంగా వుండాలని చూసుకోలేదు- ఎందుకంటే నిజాయితీగా రియలిస్టిక్ జానర్ ని నమ్ముకోలేదు- మళ్ళీ ఇందులో లాజిక్ ని వదిలేసిన ఫార్ములా కథనాన్ని  జొప్పించడం వల్ల బలహీనపడి- మీడియా వాళ్లకి ఆయన ఇచ్చిన సందేశంతో  మీడియా వాళ్ళే ముక్కున వేలేసుకునేలా చేశారు- మా తప్పేంటో మాకర్ధమయ్యేలా చెప్పండి బాబూ ఆ తర్వాత మేం మారే సంగతి ఆలోచించుకుంటాం అనుకునేట్టు చేశారు. నిజమే, ‘మూడోకన్నుఛానెల్ చేసిన తప్పేంటి? చేశారంటున్న తప్పుని సవరించుకోక పోవడమేనా? ఐతే ఆ తప్పుఛానెల్ దాకా వెళ్ళకుండా నివారించగల అవకాశం వుండీ, ఫార్ములా కథనంతో సరిపెట్టేద్దాం అనుకోవడం వల్ల  ఛానెల్ చేసిన తప్పేంటన్న ప్రశ్న తలెత్తుతోంది. 

ఎవరెలా చేశారు 
      పట్నాయక్ ప్రధాన పాత్ర పోషించారు. ఆయన ఒక సభకి వస్తూ పోతూ వున్నట్టు కన్పిస్తారే  తప్ప, సన్నివేశాల్లో నటిస్తున్నట్టు కన్పించరు. ఐతే నాకేంటీ?’ అని ఒకచోట ఎఫెక్టివ్ గా ఎదురు తిరిగినట్టు,  మిగతా చోట్ల కూడా తనకి జరిగిన న్యాయానికి జ్వలిత హృదయుడై  అగ్నిజ్వాలలు రేగ్గొట్టాల్సింది! ఒక అద్దంలో చూసుకుని ఏడ్చినప్పుడే పాత్ర కుదేలైపోయే క్రమం ఏర్పడింది. ఏడిస్తే ఏడ్చారుగాని, ఆ ఏడ్పు చివర అగ్నిపర్వతం బద్దలై –‘చూస్తా వాడి సంగతి!’  అని కనీసం ఆ అద్దాన్ని పగలగొట్టేసి పారేసి వున్నా పరిస్థితి డిమాండ్ చేస్తున్న యాక్టివ్ నెస్ అక్కడ ఇగ్నైట్ అయ్యేది. కోర్టులో లాయర్ చేసే మోసం దగ్గర, వివిధ ఛానెళ్ళ వాళ్ళు  సహకరించనప్పుడూ, వాళ్ళు చెప్పేది విని వెళ్ళిపోయే పద్ధతిలో లేదా ఈ కథకోసం సమాచారాన్ని సేకరిస్తున్న విధానంలో- చేసిన పాత్రచిత్రణ, దానికి తగ్గ నటనా  ఒకసారి రివ్యూ చేసుకోవాల్సింది.  ‘మనవూరి రామాయణంలో ప్రకాష్ రాజ్ కూడా దర్శకత్వం వహిస్తూ నటించారు- వేశ్యతో ఇరుక్కున్న ఒకానొక సందర్భంలో క్షణం క్షణం మారిపోయే పరిస్థితులమధ్య ఆయన నటన, కథా నిర్వహణ ఎంత టెన్షన్ పుట్టిస్తాయో చూసిందే. అలాటిది ఒక క్రైం ఎలిమెంట్ తో కూడిన కథతో, పాత్రతో పట్నాయక్ ఇంకెంత చేసివుండాలి.

        భార్య పాత్రవేసిన అనితది రొటీన్ మూసపాత్ర. దీంతో ఈ రియలిస్టిక్ కథలో అంతా పాత డ్రామా చొరబడింది. భర్త గురించి ఛానెల్లో చూసిందే తడవు నమ్మేసి కర్కశంగా మారిపోవడం, సూటిపోటి మాటలతో సాధించడం, పురుగుని చూసినట్టు చూడ్డం  అతిగా వుంటుంది. పిల్లలకి సంగీతం నేర్పే ఓ కళాకారిణికి ఈ రకం పాత్రచిత్రణ, మళ్ళీ భర్త అమాయకుడని తెలియగానే ఎక్కడాలేని ప్రేమానురాగాలూ, అంతలోనే మురిసిపోతూ నాల్గోనెల అని చెప్పడాలూ- ఇవన్నీ ఈ పాత్రని అవకాశవాదిగా నిలబెట్టాయి.  అన్నేళ్ళు కలిసి కాపురం చేసిన భర్త ఎలాటివాడో ఆమెకి తెలియలేదంటే ఆమె భర్తతో చేసింది కాపురంలా  అన్పించదు, విడిది చేసినట్టు వుంది.
 

        కనీసం జరిగిందేమిటో అతను  చెప్పుకునే అవకాశం కూడా ఇవ్వదు. మరి తను అంత ద్వేషించేబయట అమ్మాయిల్ని పాడు చేస్తున్నాడని నమ్మే,  ఆ భర్త బిడ్డనే కడుపులోఎలా భరించింది? పైగా తన అపార్ధాలు తొలిగాక తనేదో భర్తకిస్తున్న కానుక అన్నట్టు నాల్గో నెల అని చెప్పుకోవడం. భర్త మంచి వాడని తెలిశాకఓ ఆవిడ ఏదో వాగితే లెంపకాయ కొట్టడంలో కూడా అర్ధం లేదు. అదే ఆవిడ ముందు చెప్పిన ఇవే మాటల్ని నమ్మి భర్తని ద్వేషించిన తను కూడా లెంపకాయ తినాలిగా అప్పుడు? 

        ఆ ఆవిడ భర్తే తనని లైంగికంగా వేధిస్తూంటాడు. ఇతణ్ణి కేవలం పోరాఅంటుందే తప్ప లాగి కొట్టాలనుకోదు. తనకీ పరిస్థితి ఏర్పడడానికి భర్తే కారణమని కుమిలిపోతూ అతడి మీద కసి ఇంకా పెంచుకుంటుంది. బయట తను సంగీతం నేర్పే అవకాశాలు కోల్పోవడానికీ భర్తే కారణమని గొడవపడుతుంది. భర్తని శత్రువుగా భావిస్తే  లోకం తనతో ఆడుకుంటుందని మాత్రం గ్రహించదు.
  
        ఇలాటిదే అసంబద్ధ భార్య పాత్ర చిత్రణ ఈ సినిమాతోపాటే విడుదలైన నరుడా డోనరుడాలోనూ  చూశాం. ఆడదాన్ని తక్కువ జ్ఞానం గలదానిగా చూపించడం ఇంకా ఒక ఫార్ములాగా వాడేస్తున్నారు. ముందు ఎంతో పాజిటివ్ గా వుండే భార్య పాత్ర నెగెటివ్ గా మారిపోవడం, చివరికి మళ్ళీ పాజిటివ్ గా మారడం ఈ అరిగిపోయిన  పాత గిమ్మిక్కులే మళ్ళీ చూడాల్సిన పరిస్థితి.  రియలిస్టిక్ కథలో సినిమాటిక్ సంగతులు. 

        ఒక భర్తని సాధించే గయ్యాళి వుంటుంది. భర్త మీద ఇలాటి ఆరోపణలు రాగానే లోకం మీద కయ్యిన లేస్తుంది నా మొగుడు బంగారమని! ఇలాగే వుంటాయి రియలిస్టిక్   జీవితాలు. సినిమాటిక్ చేసుకునే ఇంటరెస్టు వుండదు. భార్య పాత్రని మొదట ఎడమొహం పెడమొహంగా చూపిస్తూ, భర్తకి సమస్య తలెత్తగానే అతడి  పక్షం వహించే మెచ్యూరిటీతో  చిత్రించి  వుంటే ఏంతో ఉన్నతంగా వుండేది. ఇలా చేయకపోగా, ఇంకా బయటి చెప్పుడు మాటలు కూడా విని భర్తమీద కక్ష పెంచుకునే మూర్ఖురాలిగా తయారు చేశారు. బయట భర్త  గురించి వంద అనుకోనీ, అవి నమ్మి భర్తకి వ్యతిరేకంగా సాక్ష్యమిస్తానన్నా  క్రిమినల్ లా కూడా ఒప్పుకోదు. దేశంలో రాజకీయ పార్టీలు ఎంతైనా కీచులాడుకోనీ, దేశం మీదకి ఒకడు దండెత్తి వస్తున్నాడంటే అన్నీ ఒకటై  తిప్పికొడతాయి!  

        తనికెళ్ళ భరణి లాయర్ పాత్ర కూడా అసంబద్ధమైనదే. దీని గురించి స్క్రీన్ ప్లే సంగతుల్లో చెప్పుకుందాం. ఛానెల్ యజమాని పాత్రలో సాయికుమార్ అత్యంత ప్రతిభావంతమైన నటనని కనబర్చారు. హీరో ఆరోపించే ఇగోని ప్రదర్శిస్తూ కుహనా ప్రతిష్ఠ కోసం పాకులాడే పాత్రలో సాయికుమార్ కథకి వన్నె తెచ్చారు. తనూ- కేంద్రమంత్రి పాత్రలో నాజర్ తమతమ వాదనలతో పాల్గొనే ఒక లైవ్ షో హైలైట్ గా నిలుస్తుంది. దీని పకడ్బందీ చిత్రీకరణ క్రెడిట్ పట్నాయక్ కి దక్కుతుంది. 

        ఇక సహాయపాత్రలు చాలా వున్నాయి- కానీ మూడోకన్నుఛానెల్ ఎడిటర్ గా రఘుబాబు ప్రారంభంలో కన్పించి- మళ్ళీ కంటికి కన్పించకుండా  మాయమైపోయి- చివర్లో కళ్ళు తెరచుకుని రావడం కాల్షీట్లు కుదరక జరిగిందేమో. ఛానెల్ లో వచ్చిన తప్పుడు వార్త ప్రహసనమంతా  ఒక మూడోకన్నుఎడిటర్ గా తను ఎక్కడుంటాడో తెలీదు. ఇకపోతే సామాజిక కథ అనగానే కామెంట్లు చేస్తూ తిరిగే ఓ పిచ్చివాడి పాత్ర తప్పని సరేమో. అలా దువ్వాసి మోహన్ ఆకలై అన్నమడిగితే పిచ్చోడన్నారు నాయాళ్ళు’  అన్న టైపులో 1973 నాటి  ‘దేశోద్ధారకులులోలాగా  ఇంకా పద్మనాభంలా తిరుగుతూంటాడు.

        సాంకేతికంగా కెమెరా వర్క్ బాగానే వుంది గానీ కలర్స్ లో బ్లూ టింట్ డామినేషన్ ఎక్కువయ్యింది. పాటలు ఫర్వాలేదు, జేసుదాస్ చేత ఓ బ్యాక్ గ్రౌండ్ సాంగ్ పాడించారు.

   - సికిందర్ 

4, నవంబర్ 2016, శుక్రవారం

రివ్యూ

దర్శకత్వం: మల్లిక్‌రామ్‌
తారాగణం : సుమంత్, పల్లవీ  సుభాష్, తనికెళ్ల భరణి, సుమన్ శెట్టి, శ్రీలక్ష్మి తదితరులు
కథ : జుహీ స్క్రీన్ ప్లే- మాటలు : డైలాగ్స్ః కిట్టు విస్సాప్ర‌గ‌డ‌, సాగ‌ర్ రాచ‌కొండ‌, సంగీతం : శ్రీర‌ణ్ పాకాల‌ఛాయాగ్రహణం : షానియల్ డియో
బ్యానర్: ర‌మా రీల్స్‌, ఎస్‌.ఎస్‌.క్రియేష‌న్స్
నిర్మాతలు: వై.సుప్రియ, జాన్‌ సుధీర్‌ పూదోట
విడుదల : 4 నవంబర్, 2016
***
      హీరోగా నిలదొక్కుకోవడానికి విశ్వప్రయత్నాలు చేసి కొంత కాలం విరామం తీసుకున్న సుమంత్ ఇప్పుడు రొటీన్ ఫార్ములాకి దూరంగా ఓ క్రాసోవర్ సినిమాతో ప్రేక్షకుల ముందుకొచ్చాడు. హిందీ నుంచి తెలుగులోకి రీమేక్ చేస్తున్న క్రాసోవర్ సినిమాలు తెలుగు ప్రేక్షకులకి నచ్చడం అంతంత మాత్రంగానే జరుగుతున్న సమయంలో సుమంత్ చేసింది ధైర్యమే. పైగా ఇందులో విషయంకూడా కొత్తది- అభ్యుదయకరమైనది-తెర మీద ప్రేక్షకులకి పరిచయం లేనిదీ. ఈ కొత్త తోనే కొత్త దర్శకుడు మల్లిక్ రామ్ రీమేక్ ని తెలుగులో ఎంతవరకు నిలబెట్టాడో ఈ కింద చూద్దాం...

కథ :
     షరామామూలుగా నిరుద్యోగిగా నేస్తాలతో తిరిగే యూత్ విక్కీ అలియాస్ విక్రం(సుమంత్). తల్లి స్వీటీ (శ్రీలక్ష్మి)  ఒక బ్యూటీ పార్లర్ నడుపుతూ కుటుంబాన్ని పోషిస్తూంటుంది. సైనికుడైన ఆమె భర్త కార్గిల్ యుద్ధంలో పోయాడు. తనవి సాంప్రదాయ భావాలు- తన అత్తగారివి ఆధునిక భావాలు. ఇద్దరూ  తెలుగింగ్లీషు మాట్లాడుకుంటూ  ఫ్రెండ్స్ లా వుంటారు. షరామామూలుగా సంపాదన లేని విక్కీకి తల్లి చీవాట్లు తప్పవు. ఇలాటి విక్కీ ఆంజనేయులు అనే ఒక డాక్టర్ దృష్టిలో పడతాడు. డాక్టర్ ఆంజనేయులు (తనికెళ్ళ భరణి) ఒక సంతాన సాఫల్య కేంద్రాన్ని నడుపుతూంటాడు. ఓ అసిస్టెంట్ (సుమన్ శెట్టి)  తోడు వుంటాడు. ఈ కేంద్రంలో ఇతను పిల్లలు లేని వాళ్ళకి స్పెర్మ్  సేకరించి పిల్లలు పుట్టేలా చేస్తూంటాడు. ఈ మధ్య ఇలాటి కేసులు ఫెయిలవుతూండడంతో, మంచి పుష్టిగల స్పెర్మ్ డోనర్ కోసం వేటలో వున్నప్పుడు విక్కీ దృష్టిలో పడతాడు. ఇతడి చరిత్ర తెలుసుకుంటే ఇతడి తాతలు డజను మందికి పైగా పిల్లల్ని కన్న వాళ్ళు. దీంతో  ఇతను తనకి పనికొస్తాడని ఒప్పించే ప్రయత్నాలు మొదలుపెడతాడు. 

        పెద్దగా జనరల్ నాలెడ్జి లేని విక్కీకి ఈ కాన్సెప్ట్ ఏమిటో అర్ధంగాదు, పైగా అసహ్యించు కోవడం మొదలెడతాడు. చచ్చీ చెడీ ఇతడికి అర్ధమయ్యేలా చేసి, తిరిగి తన బిజినెస్ నిలబెట్టుకుంటాడు డాక్టర్ ఆంజనేయులు. విక్కీ చేస్తున్న వీర్యదానానికి భారీగా డబ్బులు కూడా అందుతూంటాయి. దీంతో ఇంట్లో ఆర్ధిక పరిస్థితి కూడా మెరుగుపడి కొడుకు ప్రయోజకుడయ్యాడని పెళ్లి సంబంధాలు చూస్తూంటుంది తల్లి. విక్కీ ఆసిమా రాయ్ (పల్లవీ సుభాష్) అనే బ్యాంకు ఉద్యోగిని  ప్రేమలో పడతాడు. ఈమెకి పెళ్లయి విడాకులు తీసుకుందని తెలిసినా పెళ్లి చేసుకోవడానికి సిద్ధపడతాడు. పెళ్లి తర్వాత ఈమె పిల్లలు పుట్టని వ్యంధురాలని తెలుస్తుంది. మరోవైపు బిజినెస్ పేరుతో విక్కీ చేస్తున్న అసలు వృత్తి  ఈమెకి తెలిసిపోతుంది. దీంతో అతణ్ణి వదిలేసి వెళ్ళిపోతుంది. ఇప్పుడు ఈ పరిస్థితిని విక్కీ ఎలా చక్కదిద్దుకున్నాడనేది మిగతా కథ.

ఎలావుంది కథ
       ప్రేక్షకులకి కొత్త కాన్సెప్ట్ ని పరిచయం చేసే క్రాసోవర్ కథ. హిందీలో ‘విక్కీ డోనర్’ పేరుతో  సుజీత్ సర్కార్ దర్శకత్వంలో 2012 లో విడుదలయ్యింది. సుజీత్ సర్కార్ ఇటీవలే ‘పింక్’ నిర్మాతగా సంచలనం సృష్టించాడు. ‘విక్కీ డోనర్’ ప్రేక్షకుల ప్రశంసలూ ప్రభుత్వాల అవార్డులూ అందుకుంది. ‘విక్కీడోనర్’ కి వరల్డ్ మూవీ( కెనడా) ‘స్టార్ బక్’ (2011) ఆధారం. ‘స్టార్ బక్’ కి 2013లో ‘డెలివరీ మాన్’ హాలీవుడ్ రీమేక్. మరో ఫ్రెంచి మూవీ ‘ఫోంజీ’ (2013) కూడా రీమేక్. ఇలా ఒక ఐడియాని పంచుకుని వెనువెంటనే ఇన్ని పిల్లలు పుట్టాయన్న మాట తెలుగు సహా. 

          ఇది ఫ్యామిలీ డ్రామా జానర్. వీర్య దానం చేస్తూ ఎందరి జీవితాల్లోనో  వెలుగులు నింపుతున్న తనకే పిల్లలు పుట్టని పరిస్థితి ఎదురయితే? అన్న పాయింటుతో ఈ కథని అల్లారు. హిందీలోనే  అర్ధంలేని పాత్రచిత్రణతో సిల్లీ డ్రామాగా వున్న  దీన్ని- అలాగే తెలుగులో రిమేక్ చేసేశారు. పైన చెప్పుకున్న హాలీవుడ్, ఫ్రెంచ్ సినిమాలు ఒరిజినల్ కెనడా సినిమాకి సొంతకవిత్వాలు చెప్పకుండా విధేయంగా వుంటే- హిందీ, దాంతో బాటు తెలుగూ సొంతకవిత్వాలు చేసుకుని అవిధేయతతో హాస్యాస్పదంగా, కథా ప్రయోజనం నెరవేర్చకుండా నిర్వీర్యంగా వున్నాయి. 

ఎవరెలా చేశారు
     సుమంత్ ఈ సినిమాకోసం బాగానే కష్టపడ్డాడు. ప్రేక్షకుల దృష్టినాకర్షించే కృషితో పాత్రని నిలబెట్టుకుంటూ పోయాడు. సుమంత్ కీ పాత్ర- ఒక గ్లామర్ హీరోయిన్ వేశ్యపాత్ర వేయడంతో సమానం. ఇంతవరకూ ఏ హీరో వేయని ఈ పాత్ర కాల్పనిక పాత్ర కాదు- సమాజంలో ఇలాటి వాళ్ళు ఉంటున్నదే. ఇదేం చట్టవ్యతిరేక పాత్ర కూడా కాదు. అయితే తెలుగులో ఈ కొత్త పాత్ర జనసామాన్యానికి ఇంకా బాగా భావోద్వేగ పూరితంగా పరిచయమవాలంటే, అతడి ‘దానానికి’  సరిపడా ఇరుపార్శ్వాల కథా నిర్వహణ కూడా జరిగి వుండాలి. కనీసం పిల్లల కోసం తపిస్తున్న ఒకజంటని కూడా ఇంకోవైపు కథలో ప్రధానభాగంగా చేసి, సుమంత్ పాత్రవల్ల వాళ్ళ ఇంట్లో పూసే సంతోషాల్ని ప్రత్యక్షంగా చూపించివుంటే- సుమంత్ పాత్ర కెరీర్ ఔన్నత్యం, ఉదాత్తత జనసామాన్యాన్ని బాగా కదిలించేదిగా వుండేది. ఇలాటి జంటల్ని డాక్టర్ దగ్గర కామెడీగా చూపించడంతో, ద్వంద్వార్ధాలు పలికించడంతో  సరిపెట్టేశారు. అదే డాక్టర్ తను చేపట్టిన ఈ వృత్తి ఏంతో ఉదాత్తమైనదని అంటాడు. డాక్టర్ కి ఉదాత్తమైన కాన్సెప్ట్ ని దర్శకుడు పరిహాసం చేసి ఎలా చూపిస్తాడు?  

        సుమంత్ కి డాక్టర్ గా వేసిన తనికెళ్ళ తో కామిక్ కెమిస్ట్రీ బాగా కుదిరింది. అలాగే కుటుంబంలో భార్యతో రేగే పొరపొచ్చాల్లో నలిగిపోయే సన్నివేశాలు కూడా అతడిలో నటుణ్ణి బయటపెట్టాయి. ఇక తనికెళ్ళ ఈ సినిమాకి పెద్ద ఎస్సెట్. ఆయన నటించిన ప్రతీ సన్నివేశమూ నవ్వించేదే. ఆయన వెంట సుమన్ శెట్టీ డిటో. హీరోయిన్ పల్లవీ సుభాష్ ది హూందాతనం గల పాత్ర. ఈ పాత్ర పోషణలో సాధ్యమైనంత మెచ్యూరిటీ ప్రదర్శించింది. ఐతే సెకండాఫ్ లో పాత్రచిత్రణే తప్పు. ఇక సీనియర్ హాస్యనటి శ్రీలక్ష్మి చాలాకాలం తర్వాత తెర మీద కన్పించారు హాస్యోక్తులతో మధ్యతరగతి జీవితాన్ని ప్రదర్శిస్తూ.

        పాటలు మాంటేజెస్ గా వచ్చేవే. ఒక విషాద గీతం వుంది. ఛాయాగ్రహణం, కళాదర్శకత్వం అంతంత మాత్రమే. కొత్త దర్శకుడు మల్లిక్ రామ్ పాతస్కూలు చిత్రీకరణ చేశాడు ఈ ఆధునిక కాన్సెప్ట్ తో. సినిమా ప్రారంభమే పాతసినిమా చూస్తున్నట్టు- పేలవమైన క్లినిక్ సెట్, కళాదర్శకత్వాలతో, లౌడ్ కామెడీతో ఉస్సూరన్పిస్తుంది. పోనుపోనూ మెరుగుపడ్డా అదీ  పూర్తి  స్థాయిలో కాదు. అలాగే అత్యధిక భాగం కామెడీగా వచ్చే సన్నివేశాలకి తగ్గ పంచ్ కూడా కుదరలేదు. మాటలు ద్వంద్వార్థాలతో కూడుకుని  కాన్సెప్ట్ లైసెన్స్ ఇచ్చేస్తోంది కదాని యధేచ్చగా ప్రవహించాయి.

చివరికేమిటి 
 వీర్య దానం చేస్తూ ఎందరి జీవితాల్లోనో వెలుగులు నింపుతున్న తనకే పిల్లలు పుట్టని పరిస్థితి ఎదురైతే ఎలాటి వుంటుంది- అన్న పాయింటు ముందుగా చెప్పుకోవాలంటే సమం జసమైనదేమీ కాదు. ఎందుకు కాదో తర్వాత చెప్పుకుందాం. సమంజసం కాని ఈ పాయింటు కూడా పాలన కొచ్చేసరికి చీలిపోయింది. వేరు కుంపటి పెట్టింది. ఇది హీరోయిన్ పాత్రపరంగా జరిగింది. ఒకసారి విడాకులై జీవితంపట్ల మెచ్యూరిటీతో వున్న హీరోయిన్ పాత్ర అంత సిల్లీగా ఎలా ప్రవర్తిస్తుంది. తనకి విడాకులయ్యాయి. అయినా హీరో రెండో పెళ్లి చేసుకున్నాడు. అంతలో తనకి పిల్లలు పుట్టరని తెలిసింది. దీన్నీ కూడా హీరో భరించి తనని ఓదార్చాడు. మరంతలో అతను వీర్యదానాలు చేస్తున్నాడని తెలిసి అసహ్యించుకుని తూలనాడి వెళ్లి పోవడమేమిటి? తనని రెండో పెళ్లి చేసుకోవడమే గాక, పిల్లలు పుట్టరని తెలిశాక కూడా అడ్జస్ట్ అయిపోయిన అతణ్ణి అనే హక్కు ఆమెకెక్కడ వుంది. ఈ లాజిక్ మనల్ని వేధిస్తూనే వుంటుంది- సెకండాఫ్ ఇలా పుట్టే ఈ బరువైన డ్రామాతో చివరిదాకా చూశాక, అప్పుడామె తండ్రి ఇదే లాజిక్ లేవనెత్తి ఆమె కళ్ళు తెరిపిస్తాడు. ఈ మాత్రం ఆమెకి ముందు తెలీదా? సెకండాఫ్ ఇంత డ్రామా సృష్టించడం కోసం ఇలా హీరోయిన్ పాత్రని కిల్ చేసి చివరికి ఆమెకే నీతి బోధించడంతో ఈ ఫ్యామిలీ కథ అల్లరై పోయింది. ఫ్యామిలీ కథల్లో ఎప్పుడైనా సంబంధబాంధవ్యాల్లో లాజిక్ ని ఎగేయ కూడదని ఇదివరకు చెప్పుకున్నాం. ఎందుకంటే ఇవి ప్రతినిత్యం ప్రేక్షకులకి వాళ్ళ కుటుంబాల్లో ప్రత్యక్షంగా అనుభవం లోకొస్తూనే వుంటాయి. 

        పైగా అతను డబ్బులు తీసుకుని వీర్యదానాలు చేయడాన్ని అదేదో డబ్బుకోసం వొళ్ళు అమ్ముకున్నంత అసహ్యంతో మాటలంటుంది.  ఈపని మెడికల్లీ లీగల్లీ రైటేనని బ్యాంకు అసిస్టెంట్ మేనేజర్ అయిన ఈమెకి తెలీదా? 

        లోపం చూపిస్తే పాత్రకి ఒకే లోపం చూపించాలన్న పాత్రచిత్రణ సూత్రాన్ని కూడా మరిచారు. హీరోయిన్ పాత్రకి విడాకులవడం ఒకలోపం, పులిమీద పుట్రలా పిల్లలు పుట్టే అవకాశం లేదనడం మళ్ళీ మరొకటీ! సిల్లీ కదూ? ఆడవాళ్లంటే బాగా కడువుమండి వున్నవాడెవడో రాసే రాతలివి ( ఐతే హిందీ ‘విక్కీ డోనర్’ కథ మాటలు స్క్రీన్ ప్లే రాసింది జుహీ చతుర్వేది అనే రచయిత్రి- పది సార్లు పాలిషింగ్ జరిగిందట స్క్రిప్టుకి. స్త్రీ పాత్ర చిత్రణలు సినిమాల్లో రచయిత్రులు చేపడితే ఎంత కంగాళీ చేసిపెడతారో చాలా చాలా ఉదాహరణ లున్నాయి- అదే ఇదీ - దీనికి తెలుగు అనుసరణా ఇదే). ఇంకా నయం, చివరికి ఆమెని విధవని కూడా చేస్తే ఎలావుంటుందని ఆలోచించలేదు.

      విడాకుల వల్ల ఈ కథకి ఒరిగిందేమిటో అర్ధం గాదు. ఆనాడు పెళ్లి చేసుకున్నవాడు ఇష్టం లేని పెళ్లి చేసుకున్నానని శోభనం రాత్రే ప్లేటు ఫిరాయించాడని చెప్పారు. మంచి పనిచేశాడు- లేకపోతే  వాడికి ఈమెతో పిల్లలు పుట్టే వాళ్ళా? ఈ వ్యవహారం హీరోయిన్ పాత్రనే ఖూనీ చేసేలా లేదా? ఈమెమీద సానుభూతి పుడుతుందా- సరేలేమ్మా నోర్మూసుకో అన్నట్టుంటుందా?

        ఒకే ఒక్క పిల్లలు పుట్టని లోపం అనేదాన్ని పెట్టుకున్నా ఈ కథ సమంజసంగా వుండే అవకాశం లేదు. ఒక వీర్య దాత కుటుంబంలో వచ్చే సమస్యలు చూపించాలంటే ఆ కుటుంబంలో అరుదైన పరిస్థితి వుండకూడదు- పిల్లలు పుట్టని కుటుంబాలు అరుదుగా వుంటాయి. వీర్య దాత లెవరైనా వుంటే వాళ్ళందరి కుటుంబాల్లో ఇదే  అరుదైన పరిస్థితి వుండదు. వీర్యదానం అనే ఒక కొత్త ట్రెండ్ ని చూపించాలనుకున్నప్పుడు ఆ వీర్యదాతల ఇంట్లో అరుదైన పరిస్థితితో ముడి పెట్టి కథ చెప్పకూడదు. అరుదైన పరిస్థితి ఇంట్లో పిల్లలు పుట్టకపోవడం. సామాన్య పరిస్థితి భార్య భర్తల సంబంధాల్లో ఉద్రిక్తతలు నెలకొనడం. ఎక్కువగా జరిగే అవకాశమున్నది ఇదే. ఈ రెండో దాన్ని చూపించి దీన్ని పరిష్కరించాలి. ఇలాటి వీర్యదాతలు ఇంట్లోభార్యలతో ఈ సమస్యని ఎలా టాకిల్ చేయాలో చూపించాలి. అప్పుడే కథా ప్రయోజనమూ నెరవేరుతుంది. ఇలాకాక మొదటిదే  చూపిస్తే ‘మీరు వీర్య దానాలు చేస్తే మీకే పిల్లలు పుట్టని పాపం చుట్టుకుంటుంది జాగ్రత్త’ అన్నవ్యతిరేకార్ధం తీసినట్టుంటుంది కాన్సెప్ట్ కి. కాన్సెప్ట్ ఇంత పవిత్రమైనదని చెప్తూ దాన్నే దెబ్బ తీసే అసమంజస కథ తయారు చేసి జనం మీద రుద్దితే ఎలా- ‘ఇజం’ లో రుద్దినట్టు? ‘ఇజం’ లో జర్నలిజం వృత్తి ఎంత గొప్పదో చూపిస్తూనే- ఇంకోవైపు ఒక జర్నలిస్టు ఆత్మహత్యని చూపించి, కడుపులు నింపని జర్నలిజమంటూ అతడి తల్లి చేత శాపనార్ధాలు పెట్టించడం ఇలాటిదే.

        ఇక హీరో పాత్రవైపు కూడా తప్పులున్నాయి. తనకి విడకులైనట్టు పెళ్ళికి ముందే నిజాయితీగా హీరోయిన్ చెప్పేస్తుంది. అలాంటప్పుడు హీరో కూడా అంతే  నిజాయితీగా తను  వీర్యదానాలు చేసి డబ్బులు సంపాదిస్తున్నట్టూ, పెళ్ళయితే మానేస్తాననీ ఆమెకి ముందే ఎందుకు చెప్పడు? ఆమెని రెండో పెళ్లి చేసుకోవడం గొప్పే, ఆమె వ్యంధురాలనీ తెలిసీ ఓకే అనుకోవడం గొప్పే- కానీ తన వీర్యదానాన్ని ఆమె నుంచి దాచడం వల్ల ఈ గొప్పలన్నీ చిప్పలై పోయాయి కదా? 

        రెండోది- పెళ్ళికాకుండా వీర్యదానాలు చేస్తున్నప్పుడు తను ఇంకో అమ్మాయివైపు కన్నెత్తి చూడాలంటే మొట్టమొదట అడ్డుపడేది అంతరాత్మే. ముందు తన ఆ కొత్త జీవితాన్ని పునర్నిర్వచించుకుని అమ్మాయిల వైపు చూడాల్సి వుంటుంది. ఓపెన్ గా రిలేషన్ షిప్ లోకి వెళ్ళాల్సి వుంటుంది. ఇలా చిత్రీకరణ వుండనప్పుడు ఇలాటి సినిమా తీస్తూ ఏం చెప్తున్నారో ఎవరికీ అర్ధంగాదు.

        మూడోది, చట్టబద్ధంగానే మీరు స్పెర్మ్ డోనర్ అయినా మీ భార్యతో మీకెదురయ్యే సమస్యల్ని మీరు పరిష్కరించుకోలేరు జాగ్రత్త- మరొకరు వచ్చి మిమ్మల్ని ఒడ్డున పడేయాల్సి వస్తుంది- అని ఈ పవిత్రమైన కాన్సెప్ట్ నుంచి ఇలా డోనర్ అవ్వాలనుకునే వాళ్ళని దూరంగా తరిమికొట్టే ముగింపూ మెసేజీ ఇస్తున్నట్టుందీ సినిమా!!  అంటే,  పిల్లల్లేని వాళ్ళూ మీరిక సంతాన సాఫల్య కేంద్రాల మీద ఆశలు పెట్టుకోకండీ అన్నట్టన్న మాట!

        ముక్కచెక్కలైన సంసారాన్ని హీరో అనేవాడు సరిదిద్దుకోలేక చేతులెత్తేస్తే,  డాక్టర్ పాత్ర పూనుకుని అన్నీ సరిదిద్ది సుఖాంతం చేసిపెడతాడు! ఒక్క ముక్కలో చెప్పాలంటే,  ఈ సంసారపు  కథ చెప్పడానికి  ఎంపిక చేసుకోవాల్సింది స్పెర్మ్ డోనర్ డొమైన్ ని కాదు, ఇంకేదైనా ఫార్ములా సెటప్ సరిపోతుంది. 

        పైన చెప్పుకున్న ఒరిజినల్ కెనడా సినిమా, హాలీవుడ్, ఫ్రెంచ్ రీమేకులు రెండిట్లో  వీర్యదాత ఐడెంటిటీ, అలాగే చట్టపరంగా, సెంటిమెంటల్ గా దీంతో వచ్చే సమస్యలూ తీసుకుని కథ చేసుకున్నారే  తప్ప- పొసగని సిల్లీ ఫ్యామిలీ కథ చేయలేదు. ఈ డ్రామాలో  హీరోకి గర్ల్ ఫ్రెండ్ తో పిల్ల కూడా పుడుతుంది.


-సికిందర్
http://www.cinemabazaar.in


       






1, నవంబర్ 2016, మంగళవారం

తెలుగు సినిమా స్క్రీన్ ప్లే స్ట్రక్చర్ -ఉపసంహారం- 2





        స్క్రీన్ ప్లే సూత్రాల్ని ఎవరికి వాళ్ళు ఆకాశంలోకి చూస్తూ సృష్టించలేదు. వచ్చిన సినిమాలనే చూస్తూ వాటి కథానిర్మాణాల్లోంచి సిద్ధాంతాలు చేశారు. పదార్ధం లేకుండా శాస్త్రం లేదు. నాట్యం పుట్టక ముందు నాట్య శాస్త్రం లేదు, సినిమాలు పుట్టక ముందు స్క్రీన్ ప్లే శాస్త్రమూ  లేదు. కొన్ని వందల స్క్రిప్టులు చదివిన అనుభవంతోనే సిడ్ ఫీల్డ్ స్క్రీన్ ప్లే మీద పుస్తకాలు రాయగలిగాడు. ఇరవై ఏళ్ళూ సినిమాల్నీ పురాణాల్నీ పరిశీలన చేసిన మీదటే జేమ్స్ బానెట్  అలాటి సంచలన పుస్తకం రాయగలిగాడు. కాబట్టి స్క్రీన్ ప్లే సూత్రాలు సొంత కవిత్వాలనీ,  అలాటి ఒకడి సొంత కవిత్వం మనకక్కర్లేదనీ  విజ్ఞత గలవాళ్ళు అనుకోరు!

          కావాల్సింది  సూత్రాల్ని తెలుగు సినిమాలకి అడాప్ట్ చేసుకునే మెళకువే. ఎలా అడాప్ట్ చేసుకోవాలన్న దానిపైనే ఈ తెలుగు సినిమా స్క్రీన్ ప్లే స్ట్రక్చర్ వ్యాసాలు  ఆధారపడ్డాయి. విభిన్న అభిరుచులు గలవాళ్ళకి విభిన్న  స్క్రీన్ ప్లేలు రాస్తున్నప్పుడు జరిగే మేధోమథనంలోంచి ఈ అన్వయింపు సులభంగా జరిగిపోతూ వచ్చింది. మరొకటేమిటంటే,  ఆయా కాలాల్లో స్క్రీన్ ప్లే పుస్తకాల్లో  ఇచ్చిన సమాచారమే సమాచారం కాదు. వాటి మీద ఆధారపడితే  క్రియేటివిటీ అక్కడికక్కడే ఘనీభవించి పోతుంది. సినిమా రచన అనేది నిత్య చలనశీలమైనది. కొత్త కొత్త సమాచారాన్ని ప్రతినిత్యం తనలో కలుపుకుంటూ ముందుకు సాగుతూంటుంది. ఈ సమాచారాన్ని గానీ, టిప్స్ ని గానీ హాలీవుడ్ నుంచి వెలువడే అనేక స్క్రీన్ ప్లే వెబ్ సైట్స్ అందిస్తూంటాయి. వీటి మీద కూడా ఓ కన్నేసి వుంచాల్సి ఉంటుంది. 

       ఉదాహరణకి, స్క్రీన్ ప్లే లో ప్లాట్ పాయింట్ వన్ దగ్గర హీరోకి ఒక గోల్ ఏర్పడాలని అన్ని స్క్రీన్ ప్లే పుస్తకాల్లోనూ  చెప్తారు. తెలిసిందే కదా, ‘శివ’ లో కూడా నాగార్జున జేడీని సైకిలు చైను తో కొట్టడంతో  మాఫియాని అంతమొందించే గోల్ పెట్టుకున్నాడని అర్ధమవుతోంది  కరెక్టే, ఏ సినిమాలోనైనా ఇలా ఏదో ఒక గోల్ ఏర్పడుతుంది నిజమేనని  సింపుల్ గా అన్పించవచ్చు. ఐతే  ఏ స్క్రీన్ ప్లే పుస్తకాల్లోనైనా  ఈ భౌతిక స్థితే చెప్పి వదిలేస్తారు. కానీ చాలా పూర్వం, ఒక స్క్రీన్ ప్లే వెబ్ సైట్ లో ఒక గెస్ట్ రైటర్ ఈ గోల్ కి కళ్ళెదుట వున్న భౌతిక స్థితితే  కాకుండా, కంటికి కన్పించని మానసిక స్థితి కూడా ఉంటుందనీ, అప్పుడే అది సజీవ పాత్రగా కన్పిస్తుందనీ ఒక ఆర్టికల్ రాసుకొచ్చాడు. ఇదెక్కడ్నించీ తెలుసుకున్నాడు? సినిమాల్లోంచే. ప్లాట్ పాయింట్ వన్ దగ్గరే  కంటికి కన్పించే గోల్ తో పాటూ, కంటికి కన్పించని మానసిక స్థితిలో కోరిక, పణం, పరిణామాల హెచ్చరిక, ఎమోషనూ అనే నాల్గు ఎలిమెంట్స్ ఉంటాయనీ  తేల్చాడు. పరిశీలిస్తే ఇవి ‘శివ’ లో లేవా? వున్నాయి. దీన్ని కూడా స్ట్రక్చర్ లో భాగంగా చేసి  గోల్ ఎలిమెంట్స్ అధ్యాయంలో చెప్పుకున్నాం. ఇలా గోల్ కో  అంతర్నిర్మాణం ఉంటుందనీ, ఆ అంతర్నిర్మాణంలో వుండే నాల్గు ఎలిమెంట్స్ ని కూడా ప్లే చేస్తూ కథ నడిపితే బలంగా వస్తుందనీ తెలుసుకున్నాక, ఒక కొత్త స్పృహతో  స్క్రీన్ ప్లేలు రాసుకుంటారు కదా?     
 
        ఇలాగే సినిమాలకి కథలు మాత్రమే పనికొస్తాయనీ, గాథలు పనికి రావనీ ఒక గొప్ప సత్యాన్ని ఇంకో వెబ్ సైట్లో ఇంకో నిపుణుడు రాసుకొచ్చాడు. ఇది కూడా నిజమే కదా, గాథలుగా తీసిన ‘బ్రహ్మోత్సవం’, ‘పైసా’ లాంటి తెలుగు సినిమాలు ఎలావున్నాయో చూశాం. అంటే కథకీ, గాథకీ తేడా తెలుసుకుని జగ్రత్తపడ్డం కూడా అవసరమే నన్న మాట. ఇలాగే టైం అండ్ టెన్షన్ థియరీ గురించి, ప్లాట్ పాయింట్ వన్ లోనే కథకి ముగింపూ ఉంటుందన్న అవగాహన గురించీ, ఇలా మరెన్నో స్క్రిప్టింగ్ టూల్స్ ని పుస్తకాలు గాక ఇతర  ప్రాప్తి స్థానాల్లో గమనించాక,  వీటిని ‘శివ’ కి అన్వయించి చూసుకుని ఇలా తెలుగు స్ట్రక్చర్ లో భాగం చేశామన్నమాట. కథకి క్లయిమాక్స్ తెలిపోయిందంటే ఆ లోపం ప్లాట్ పాయింట్ వన్ లోనే  ఉంటుందని ఏ పుస్తకాల్లో చెప్తారు? దివంగత దర్శకుడు బిల్లీ  వైల్డర్ అనుభవంలోంచి వచ్చిందీ సంగతి. 

      ఇక ఇప్పటి తెలుగు సినిమాల దృష్ట్యా జోసఫ్ క్యాంప్ బెల్ గ్రంథంలోని గొప్ప విషయాల్ని తీసుకోలేం. దర్శకుడు దేవ కట్టా 2005 లో మొదటి సినిమా ‘వెన్నెల’ తీశాక, యూఎస్ నుంచీ ఈ వ్యాసకర్తకి ఫోన్ చేసి కథ అడిగినప్పుడు, అయిన పరిచయంలో, జోసెఫ్  క్యాంప్ బెల్ ని చదువు కున్నానన్నారు. తర్వాత ‘ప్రస్థానం’ తీసినప్పుడు ఆ ఛాయలు కొంతమేర కన్పించాయి గానీ, ఆ తర్వాత తీసిన ‘ఆటోనగర్ సూర్య’, ‘డైనమైట్’ లలో ఆచరణ సాధ్యం కాలేదు. గొప్ప క్లాసిక్స్ తీయాలంటే క్యాంప్ బెల్ ని అనుసరించవచ్చు, ‘బాహుబలి’ తీయాలంటే కూడా అనుసరించవచ్చు. అప్పట్లో ‘స్టార్ వార్స్’ క్యాంప్ బెల్ ని అనుసరించి తీసిందే. 

           
అలాగే జేమ్స్ బానెట్ నుంచి కూడా మొత్తం తీసుకోలేం. ప్రేక్షకులకి కథతో ఏర్పడాల్సిన బలమైన సైకలాజికల్ కనెక్షన్ కి  బానెట్ చెప్పుకొచ్చిన కాన్షస్ - సబ్ కాన్షస్ మైండ్ ల ఇంటర్ ప్లే అనే టూల్ ని మాత్రమే తెలుగు స్క్రీన్ ప్లేలకి చాలునని  దాన్ని మాత్రం తీసుకుని స్ట్రక్చర్ లో భాగంగా చేశాం.  ఇలా తెలుగు స్క్రీన్ ప్లేల పటిష్టతకి ఏవేవి అవసరపడతాయో పరిశీలించి, వాటిని స్ట్రక్చర్ లో చేర్చుకున్నాం.  

        కథా చర్చల్లో తెలిసివస్తున్న ఇంకో ప్రధానాంశం ఏమిటంటే, ఐడియా దగ్గరే వైఫల్యం చెందడం. రెండు వాక్యాల్లో తమ కథల లైన్ ఏమిటో చెప్పలేకపోవడం, కథంతా చెప్పుకు రావడం. ఇది చాలా తీవ్రంగా పరిగణించాల్సిన అంశం. విత్తనం దగ్గరే తత్తర పాటుతో వుంటే ఇక కథా వ్యవసాయం ఇంకేం చేయగలరు. ఎవరైనా మా విత్తనం ఇదీ అని చెప్పినా ఆ విత్తనం పుచ్చి పోయి ఉంటోంది. ఇది తీవ్ర ఆందోళనకి లోను జేసింది. తెలుగుకి స్క్రీన్ ప్లే స్ట్రక్చర్ వ్యాసాలు రాయాలంటే ఇక్కడ్నించే ప్రారంభించాలన్న అవగాహనా కుదిరింది. ఔత్సాహికులు రాసుకొస్తున్న కథల్లో కన్ఫ్యూజన్ అంతా తొట్టతొలుత కథకి బీజం పడే ఐడియా దగ్గరే ఉంటోందని అర్ధమైంది. అంటే స్ట్రక్చర్ సంగతులు  అయిడియా దగ్గర్నుంచే మొదలెట్టాలన్నమాట.  స్క్రీన్ ప్లే పుస్తకాల్లో బేసిక్ స్ట్రక్చర్ మాత్రమే వుంటుంది. బిగినింగ్, మిడిల్, ఎండ్ విభాగాల్లో వాటి తాలూకు బిజినెస్ గురించి వుంటుంది. వాటిలో ప్రధాన పాత్ర ప్రయాణం గురించి వుంటుంది. లైన్ ఆర్డర్ ఎలా వేసుకోవాలో వుండదు. అలాగే అసలు కథకి  ఐడియాని ఎలా నిర్మించుకోవాలో వుండదు. 

        హాలీవుడ్ లో లిటరరీ ఏజెంట్లు మార్కెట్ దృక్కోణంలో ఐడియా ఎలా ఉండాలో చెప్తూంటారు. ఈ లిటరరీ  ఏజెంట్లే స్క్రీన్ రైటర్ల స్క్రిప్టుల్ని స్టూడియో ఎగ్జిక్యూటివ్ లకి చేరవేసి బేరసారాలు చేసే పనిలో వుంటారు. వీళ్ళు ఈ ట్రెండ్ కి, ఇప్పటి సీజన్ కి ఫలానా ఈ ఈ అయిడియాలు వర్కౌట్ అవుతాయని చెబుతూంటారు. మనదగ్గర ఇది మాత్రమే చాలదని అర్ధమయ్యింది. ఐడియాకి మార్కెట్ దృక్కోణమే గాకుండా, ఐడియాకి క్రియేటివ్ దృక్కోణం కూడా తప్పని సరి చేయాలన్న ఆలోచనపుట్టింది. మొట్టమొదట సినిమా తీయడానికి పుట్టే ఐడియాలోనే  మొత్తం స్క్రీన్ ప్లేకి సంబంధించిన డీఎన్ఏ అంతా లేకపోతే, ఆపైన ఆ స్క్రీన్ ప్లే నిలబడదనీ, దాంతో సినిమా కూడా నిలబడదనీ  పరమసత్యం బోధపడింది. ఆ డీఎన్ఏ ‘ఆర్గ్యుమెంట్ + స్ట్రక్చర్ + లాగ్ లైన్’ అయి వుండాలని నిర్ణయించి- కథలు పట్టుకొచ్చే వాళ్ళతో కూర్చుని మూడు నాల్గు రోజులు ముందు  ఈ దృష్టితోనే  ఐడియాల మీద కసరత్తు చేయడం, చేయించడం మొదలైంది. అలా క్రియేటివ్ దృక్కోణాన్ని కూడా కలుపుకుని ‘ఐడియాలో కథ వుందా?’ అన్న మూడవ అధ్యాయం పుట్టింది. ఇక్కడ్నించే మిగిలిన అధ్యాయాలకి బాట పడింది.

        హాలీవుడ్ లో సినాప్సిస్ రైటింగ్ కే ప్రత్యేక శిక్షణాలయాలు ఎందుకున్నాయో నాల్గవ అధ్యాయంలో చెప్పుకున్నాం. దీని ప్రాముఖ్యాన్ని గుర్తించినందునే, ‘ఐడియా’ తర్వాత ‘సినాప్సిస్ రైటింగ్’ అధ్యాయాన్ని సృష్టించాం.  వీటి తర్వాతే స్క్రీన్ ప్లే కి బిగినింగ్ మిడిల్ ఎండ్ విభాగాల చర్చలో కెళ్ళాం. ఈ విభాగాల వేర్వేరు బిజినెస్సుల్ని, లైన్ ఆర్డర్ సహితంగా చెప్పుకుంటూ వచ్చాం. దీనికి ఉదాహరణగా ‘శివ’ ఎందుకు తీసుకోవాల్సి వచ్చిందంటే, ఇందులో ఒకే కథ  వుంటుంది, కథకి అడ్డుపడే వేరే ఉపకథలూ, కామెడీ ట్రాకులూ వగైరా వుండవు. సీను తర్వాత సీనుగా ఒకే కథ సూటిగా సాగుతూంటే,  స్ట్రక్చర్ ని ఫాలో అవడం చాలా  సులభంగా వుంటుంది. పైగా సిడ్  ఫీల్డ్ బుక్కు, ‘శివ’ ఒక్కటే. 

         ఈ వ్యాసకర్త సరళమైన, బలమైన సమకాలీన తెలుగు కమర్షియల్ సినిమా కథలకి సిడ్ ఫీల్డ్ నే నమ్ముకోవాలని పక్కగా ఏనాడో డిసైడ్ అయ్యాడు. సిడ్ ఫీల్డ్ నమూనా ప్రకారం ప్లాట్ పాయింట్స్ -1, 2 లు, పించ్ పాయింట్స్ -1, 2 లు, ఒక మిడ్ పాయింట్ – ఈ 5 మాత్రమే గుర్తుపెట్టుకుంటే చాలు- ఏ కథయినా సులభంగా వచ్చేస్తుంది. పండితులకి మాత్రమే అర్ధమయ్యే సంక్లిష్ట శాస్త్రంగా ఉంటున్న స్క్రీన్ ప్లే కోర్సుని యువతరం కోసం నేలకు దించి, సరళతరం చేసి,  సుబోధకం చేశాడు ఫీల్డ్. ఇంకా తర్వాత చాలామంది త్రీ యాక్ట్స్ కాదు, ఫోర్ యాక్ట్స్ అనీ, ఎయిట్ యాక్ట్స్ అనీ నానా  సంక్లిష్టం  చేసి పుస్తకాలు రాస్తున్నారు. ఇవన్నీ ఔత్సాహికులు ఈ వ్యాసకర్త దృష్టికి తెచ్చి ప్రశ్నిస్తున్నారు. ఎందుకీ సందేహాలు. తెలుగు సినిమాలు ఎప్పుడైనా త్రీయాక్స్ట్ కి మించి ఉన్నాయా? పోనీ ఇతర భాషల సినిమాలూ,  హాలీవుడ్ సినిమాలైనా అలా ఉన్నాయా? ఉన్న త్రీ యాక్ట్స్ నే విభజించి 4, 8, 16, 32 ...ఎన్నైనా చేయవచ్చు. ఒక టీని మహా అయితే  1/3 చేసుకుని తాగవచ్చు, 1/4, 1/8, 1/16, 1/32 చేసుకుని ఎలా తాగుతారు. ఏం చేస్తున్నారంటే -జోసెఫ్ క్యాంప్ బెల్, జేమ్స్ బానెట్ లలో కన్పించే  హీరోస్ జర్నీ తాలూకు పదీ పన్నెండు మజిలీల్నే యాక్స్ట్ కింద పెంచి చూపిస్తున్నారు. లేదా ఏ కథలోనైనా వుండే ఎనిమిది సీక్వెన్సుల్ని ఎనిమిది యాక్ట్స్ గా చూపిస్తున్నారు. ఇవన్నీ బాగా పాపులర్ అయిపోయిన సిడ్ ఫీల్డ్ అంటే ఈర్ష్యతో చేస్తున్న పనులు. ఒక పాత స్కూలు పండితుడు తన స్క్రీన్ ప్లే పుస్తకంలో  సిడ్ ఫీల్డ్ ని పరోక్షంగా తిట్టాడు కూడా. ఈ పీఠాల కోసం జరిగే పోరాటాల్లో లేగ దూడల్లా మనం నలిగిపోనవసరంలేదు. సింపుల్ గా ‘శివ’ కి సరిపోయిన సిడ్ ఫీల్డ్ నమూనానే తీసుకుని, దీనికి స్థానిక  అవసరాలకి అనుగుణంగా, పైన చెప్పుకున్నలాంటి  ఆయా ఎలిమెంట్స్ ఎన్నింటినో కలుపుకుని, మన నమూనా తయారు చేసుకున్నాం. 

         ఇలా డీ ఫాల్టుగా వున్న శాస్త్రాన్ని తెలుగుకి కస్టమైజ్ చేస్తూ పోతూంటే ‘తెలుగు సినిమా స్క్రీన్ ప్లే స్ట్రక్చర్’ అనే  సబ్జెక్టు చేతికొచ్చింది. ఇదంతా సుదీర్ఘ కాలంగా ఎంతోమంది అసోషియేట్ డైరెక్టర్లతో, కొందరు కో- డైరెక్టర్లతో, డైరెక్టర్లతో  చేస్తూ వచ్చిన స్క్రీన్ ప్లేల వల్ల ప్రాక్టికల్ అనుభవంతోనే సాధ్యమైంది. మరొకటేమిటంటే,  శాస్త్రాన్ని శాస్త్రంగా చూడక, దాన్ని ఓన్ చేసుకుని, మన ఐడియాలజీగా, ఫిలాసఫీగా వొంటబట్టించుకుంటే తప్ప ఇది రాయడానికి ధైర్యం చాల్లేదు.

        ఇక ఎన్నారై రాజేంద్ర ఆక్షేపించినట్టు ఈ వ్యాసాల్ని అకడెమిక్ భాషలో రాయలేదు. సినిమా జర్నలిజం పండిత భాషలో వుండదు. ముళ్ళపూడి వెంటకరమణ గారు పండిత భాషలో సినిమా వ్యాసాలు రాయలేదు. సిడ్ ఫీల్డ్, జేమ్స్ బానెట్ లు కూడా పండిత భాషలో రాయలేదు. ఈ వ్యాసాల్ని పదో తరగతి చదివిన సినిమా అసిస్టెంట్ కుర్రాడికి కూడా సులభంగా అర్ధమయ్యే వాడుక భాషలోనే రాశాం.

        చివరిగా, ఈ వ్యాసాల్ని తమ సాహిత్య మాసపత్రిక ‘పాలపిట్ట’ లో ప్రచురిస్తూ వచ్చిన ఎడిటర్ గుడిపాటి వెంకటేశ్వర్లు, వర్కింగ్ ఎడిటర్ కె.పి. అశోక్ కుమార్ గార్లకు ధన్యవాదాలు. ‘సినిమా బజార్ డాట్ కాం’ లో ఈ వ్యాసాల్ని ప్రచురణకి తీసుకున్న పి. సతీష్ గారికీ ధన్యవాదాలు. ఈ వ్యాసాల్ని హిందీలోకి అనువదించి, యూనివర్శిటీ తరపున పుస్తకంగా వేస్తామని తెలిపిన రాజస్థాన్ సెంట్రల్ యూనివర్సిటీ అసోషియేట్ ప్రొఫెసర్ డాక్టర్ ఎన్. లక్ష్మీ అయ్యర్ గారికి కూడా ప్రత్యేక ధన్యవాదాలు.



-సికిందర్ 

30, అక్టోబర్ 2016, ఆదివారం

తెలుగు సినిమా స్క్రీన్ ప్లే స్ట్రక్చర్ - ఉపసంహారం!




      తెలుగు సినిమా స్క్రీన్ ప్లే స్ట్రక్చర్- అనే ఈ శీర్షిక   అంటేనే సింహస్వప్నంలా వుండేది ఈ వ్యాసకర్తకి. ఈ శీర్షిక నిర్ణయించి దీనికింద తెలుగు సినిమా స్క్రీన్ ప్లే లు ఎలా రాసుకోవాలో  తెలియజెప్పడం చాలా సాహసం కిందే లెక్క. 1998 లో సినిమా రివ్యూలు రాయడానికే తగిన అర్హత వుండాలని స్వీయ నిబంధన విధించుకుని,  స్క్రీన్ ప్లే సబ్జెక్టు మీద పుస్తకాలూ అవీ  చదువుకుని  – అర్హతల సంగతెలా వున్నా- కాస్త జ్ఞానం మాత్రం సంపాదించుకున్నాక, రివ్యూలు రాయడం కొనసాగిస్తూంటే  వచ్చిన ధైర్యంతో,  ‘తెలుగు సినిమా స్క్రీన్ ప్లే స్ట్రక్చర్’ అంటూ ఇంకో పతాకం ఎగరేయడమన్నది  తొందరపాటుతనమే అవుతుందని చాలా కాలం దీని జోలికే పోలేదు. అయినా చేతులు వూరుకోక  2003 లో  సిడ్ ఫీల్డ్ స్ట్రక్చర్ నమూనాతో పోలుస్తూ తెలుగు సినిమాల స్క్రీన్ ప్లేలు ఎన్నిరకాలుగా ఇష్టానుసారంగా వుండి  విఫలమవుతున్నాయో ఒక పెద్దవ్యాసం ‘ఆంధ్రభూమి’ లో రాసినప్పుడు భారీ స్పందన వచ్చింది. అలా స్పందించిన ముఖ్యుల్లో  దర్శకుడు కె. దశరథ్ -  ‘స్క్రీన్ ప్లే మీద పుస్తకం రాయండి, నిధులు నేను సమకూరుస్తా’ నన్నారు. రిఫరెన్స్  పుస్తకాలు కూడా ఇచ్చారు. అవన్నీ చదివి రాయడం మొదలుపెట్టి  మొదటి అధ్యాయాన్ని అన్నపూర్ణా స్టూడియోలో వున్న ఆయనకి చూపిస్తే,  మొదటి పేజీ చదువుతూనే విసిరికొట్టారు. ఆ కాగితాలు ఏరుకుని సారీ చెప్పి వచ్చేశాడీ వ్యాసకర్త. అక్కడితో ఆ ప్రయత్నం ఆగిపోయింది.


          ర్వాత 2005 లో సినిమాల ఆసక్తి వున్న రాజేంద్ర అనే ఎన్నారై  ఈ వ్యాసకర్తని వెతుక్కుంటూ వచ్చి, స్క్రీన్ ప్లే పుస్తకం రాసే ఆఫరిచ్చి, కొన్ని ఇంగ్లీషు పుస్తకాలిచ్చారు. మళ్ళీ కొత్త ప్రయత్నం మొదలు.  అది రాస్తూ  కొన్ని పేజీలు  చూపిస్తే, ఆయన ఇంకెవరికో చూపించి, భాష అకడెమిక్ గా లేదన్నారు. అది కూడా అలా ఆగిపోయింది. ఈ రెండు అనుభవాలతో తేలిందేమిటంటే, సినిమాలు చూసిన అనుభవంతో, రివ్యూలు రాస్తున్నామన్న ధైర్యంతో,  స్క్రీన్ ప్లే మీద పుస్తకాలు చూసి రాయలేమనీ, చేసి రాయాలనీ!

        ఇంగ్లీషులో నాలుగు స్క్రీన్ ప్లే పుస్తకాలు ముందేసుకుని అందులోంచి కొంతా ఇందులోంచి కొంతా మిశ్రమం చేసి తెలుగులో ఓ స్క్రీన్ ప్లే పుస్తకం అచ్చేస్తే బ్రహ్మాండంగా అమ్ముడుబోతుందని తెలుసు. తెలుగులో స్క్రీన్ ప్లే పుస్తకాల కొరత చాలా వుంది. పైగా ఇంగ్లీషు పుస్తకాల్లో లభించే పరిపూర్ణ జ్ఞానాన్ని భాషా సమస్య వల్ల చాలా మంది నోచుకోలేకపోతున్నారు. టాలీవుడ్ రచనా పరంగా ఎదగకపోవడానికి ఇదొక కారణం. ఓ నాలుగు ఇంగ్లీషు పుస్తకాల్ని తెలుగులో కాపీ కొట్టి అచ్చేసినా భారీగా అమ్ముడుపోతాయి. కానీ ఇది మోసం చేయడమే అవుతుంది. అలా రాసిన పుస్తకాలు ఎవరికీ ప్రాక్టికల్ గానూ ఉపయోగపడవు. వాటిని చదివి ఎవరైనా తెలుగులో స్క్రీన్ ప్లేలు రాసే ప్రయత్నం చేస్తే, అవి అస్థిపంజరాల్లా  తయారవుతాయే తప్ప, రక్త మాంసాలేర్పడవు. ఎవరికైనా రక్తమాంసాల్లాగా  తెలుగులో ఈ పుస్తకాలు ఉపయోగపడాలంటే, ప్రాక్టికల్ అనుభవం సంపాదించుకున్న తర్వాతే అలాటి పుస్తకాలు రాయాలని అర్ధమయ్యింది. ఈ రక్తమాంసాల అన్వేణషకే  ప్రాక్టికల్ అనుభవం అనే కూడలికి చేరాల్సి వచ్చింది....కూలివాని చెమటలోనే ధనమున్నదిరా అన్నట్టు.  



       రివ్యూలు రాయడానికి ఎంత స్క్రీన్ ప్లే జ్ఞానం సంపాదించుకున్నా, ఆ జ్ఞానం స్క్రీన్ ప్లే మీద క్షుణ్ణంగా పుస్తకాలు  రాయడానికి చాలదు. 2003 లో సుభాష్ రెడ్డి అనే ఎన్నారై  ఓ జర్నలిస్టు మిత్రుడి ద్వారా ఈ వ్యాసకర్తని సోలో రైటర్ గా పెట్టుకుని సినిమా తీయడం ప్రారంభించారు. ప్రారంభంలో సోలో రైటర్ గా వున్న ఈ వ్యాసకర్త కాస్తా, ఆయనే రాసేస్తూంటే  ఫేర్ చేసేసే బంటులా మారిపోయాడు. ఆ సినిమా పేరు ‘సిటీ’.     
   
        తర్వాత  2005 లో చల్లా శ్రీనివాస్ తో కలిసి ఈ వ్యాసకర్త ‘భూకైలాస్’ అనే కథని, స్క్రీన్ ప్లేని  శివ నాగేశ్వర రావు గారికిచ్చి, మంచి బలమైన ఆత్మవిశ్వాసంతో వుంటే, తీరా డైలాగ్ వెర్షన్ వచ్చేసరికి  సమూలంగా రూపు రేఖలే మారిపోయి- ఆ దశలో వెనక్కి తీసుకునే అవకాశం కూడా లేక- పేర్లు వేయవద్దని బతిమాలుకుని, ఆయన బాధ పడ్డా తప్పుకోవాల్సి వచ్చింది.

        2008 లో టి. ప్రభాకర్ గారితో ‘బతుకమ్మ’ చేసినప్పుడు మధుఫిలిం ఇనిస్టిట్యూట్ నటరాజ్ గారు, ఆయన మిత్రుడు రచయిత దేవరాజ్ కలిసి ఈ వ్యాసకర్తని ప్రభాకర్ గారి ఎదుట హాజరుపర్చారు. ఆ కథంతా విని- ‘ఇందులో మీరు భావకవిత్వం చెబుతున్నారా, విప్లవ కవిత్వమా? ఈ కథ విప్లవ కవిత్వంలో భావకవిత్వం చెప్తున్నట్టుంది’ అన్నాడీ వ్యాసకర్త (అప్పటికి జానర్ మర్యాద గురించి ఏమాత్రం జ్ఞానం లేదు ఈ వ్యాసకర్తకి.  ఇప్పుడు సింహావలోకనం చేసుకుంటే జానర్ మర్యాద గురించిన మాటలే ఆనాడు వచ్చేశాయని అర్ధమవుతోంది).

        ఆ మాటతో ఈ వ్యాసకర్తని పట్టేసుకుని వదల్లేదు  ప్రభాకర్ గారు. ‘బతుకమ్మ’ డైలాగ్ వెర్షన్ కూడా పూర్తి చేసేదాకా ఆయనతో వుండాల్సివచ్చింది. సినిమాకి స్ట్రక్చర్ అనేది ఒకటుంటుందని తెలుసుకుని, ఇది తెలీకుండానే పది సినిమాలు తీసినందుకు పశ్చాత్తాపపడ్డారు. స్ట్రక్చర్ ని గుర్తించి గౌరవించినందుకు ఈ వ్యాసకర్త గర్వపడ్డాడు. ఆయనే కాదు, ఇంకా నటరాజ్, దేవరాజ్ లతో బాటు కో- డైరెక్టర్ త్రినాథ్, అసోసియేట్ శ్రీనివాస్ కూడా స్ట్రక్చర్ రుచి తెలుసుకుని దానికే సలాం చేశారు. మూలాలు ఆంధ్రాలో వున్నా,  తెలంగాణలో పుట్టిపెరిగి తిరుగుతున్న ఈ వ్యాసకర్తకి తెలంగాణా జీవితం, చరిత్ర బాగానే తెలుసు. ‘బతుకమ్మ’ లాంటి తెలంగాణా సినిమాకి రాయడం ఓ అదృష్టంగానే ఫీలయ్యాడు. కానీ తీరా సినిమా పూర్తయ్యాక చూస్తే  అదే స్ట్రక్చర్ అనే పదార్థాన్ని వెతుక్కోవాల్సి వచ్చింది. 



        తిరిగి 2010 లో ప్రభాకర్ గారే మెడికల్ కాలేజీల్లో ర్యాగింగ్ గురించి పరిశోధనాత్మక కథ మొదలెట్టారు. ఇది రెండేళ్ళూ సాగింది. వరంగల్ మెడికల్ కాలేజీకి బృందంగా వెళ్లి, హైదరాబాద్ గాంధీ మెడికల్ కాలేజీకి ఈ వ్యాసకర్త ఒక్కడే వెళ్లి  మెడికల్ కాలేజీల, హాస్టల్స్ ల, లాబ్స్ ల పనితీరు, ర్యాగింగ్ సమస్యా  పరిశీలించి వచ్చి రెండేళ్ళూ రాశారు. స్క్రిప్టుని లాక్ చేసి వెళ్ళిపోయాక, కథంటే ఏమిటో ఏమీ తెలీని ఒక కొత్త రచయిత ఎంటరై మార్చేశాడు. దాని స్క్రీన్ ప్లే కి ఈ వ్యాసకర్త పేరు వేయవద్దని చెప్పినా వేసేశారు. ఆ సినిమా ఒక్క రోజు ఆడింది. విజయవాడలో ఒక్క ఆట ఆడింది. అందులో వుండాల్సిన స్ట్రక్చర్, కంటెంట్, పాయింట్ ఏవీ లేవు. ఆ సినిమా పేరు ‘కాలేజీ స్టోరీ’ గా ఆ రచయిత వచ్చాకే మారిపోయింది. 

        ఈ అనుభవాలన్నీ మంచివే, ఈ దర్శకులందరూ మంచి వాళ్ళే. ఎన్నారై రాజేంద్ర కి ఈ వ్యాసకర్త వర్క్ నచ్చకపోయినా ఆయన ఇచ్చిన జేమ్స్ బానెట్ పుస్తకం కొత్తలోకాలకి కళ్ళు తెరిపించింది. తెలుగు సినిమాల కథల్లో ఇంకేం కీలకాంశం లోపిస్తోందో, ఆ పుస్తకంవల్ల తెలిసి వచ్చింది. దశరథ్ కాగితాలు విసిరికొట్టే పూర్తి హక్కు ఆయనకుంది. దీంతో ఆయనకేదో నిరూపించి చూపించాలని  ఈనాటి వరకూ అనుకోలేదు. అది నెగెటివిజం అవుతుంది. ఆయన వల్ల స్క్రీన్ ప్లే పుస్తకాన్ని కేవలం పుస్తకాలు చదివి రాయలేమన్న గొప్ప జ్ఞానోదయమైంది, ఇంతకంటే ఏం కావాలి? అసలు స్క్రీన్ ప్లే మీద పుస్తకం ఎందుకు రాయాలి, రాయకపోతే ఎవరైనా కొడతారా, సినిమా ఫీల్డు మునిగిపోతుందా, ఏం ఘోరం జరుగుతుందని?  ఏదో రివ్యూలు రాసుకోవడానికి స్క్రీన్ ప్లే జ్ఞానాన్ని సముపార్జించుకుని, ఈ అనుభవంతో స్క్రీన్ ప్లే మీద రక్తమాంసాల్లేని పుస్తకం రాయకూడదని దూరంగా వుంటూంటే, ఎవరో ఒకళ్ళు  ముందుకు తోయడం ఎందుకు జరుగుతోందో తెలీదు. దశరథ్ అయినా, రాజేంద్ర అయినా 
ఇంకో పబ్లిషర్ అయినా, మరో పత్రికా యజమాని అయినా  సికిందర్ అనే వాడు స్క్రీన్ ప్లే బుక్ రాయగలడు, రాస్తాడు, రాయించాలి వీడి చేత - అని ఎలా అంచనా కొచ్చేవారో అర్ధంగాదు. ఈ అంచనాలని అందుకోలేకపోయాక- రక్తమాంసాల కోసం ప్రాక్టికల్ అనుభవం అనీ ఒకటి పెట్టుకున్నాక, ఒక సమస్య వుంది. స్వభావరీత్యా ఈ వ్యాసకర్త దేనికీ ఎవర్నీ అప్రోచ్ కాడు. ఎవరైనా వచ్చి అడగాల్సిందే. అడిగితేనే  చేసి పెడతాడు. అడగక పోతే తన మానాన తాను  రివ్యూలు రాసుకుంటూ కన్పించకుండా వుంటాడు. అప్పుడప్పుడు అలా అడిగిన వాళ్ళతోనే  ప్రాక్టికల్  అనుభవాన్ని గడించాల్సి వస్తోంది. ఎప్పుడో దశరథ్ అడిగితే ఎన్టీఆర్ ని దృష్టిలో పెట్టుకుని ఒక కథ- స్క్రీన్ ప్లే ఇచ్చినా, ఇంకో అసోసియేట్ కి రవితేజ కోసం స్క్రీన్ ప్లే చేసినా, మరో పెద్ద సినిమాల కో- డైరెక్టర్ కి రవితేజ కోసమే ఒకటి, జగపతి బాబుకోసం మరొకటీ రాసిపెట్టినా,  ఇంకో  దర్శకుడు కల్యాణ్ రామ్ కి చెప్పడానికి ఫ్యామిలీ కథ అడిగి రాయించుకున్నా- ఇలా ఇలాటివన్నీ ‘అడిగితేనే ఇచ్చివేయు’ పథకం కింద కొనసాగినవే- సాగుతున్నవే. అయితే ఇవేవీ తెరరూపం దాల్చ లేదు, దాలుస్తాయన్న నమ్మకమూ లేదు- ఏదో అద్భుతం జరిగితే తప్ప!




      ఇలా అడిగే వాళ్ళల్లో అదేం విచిత్రమో గానీ, అసోషియేట్లు పెరిగిపోయారు, ఇంకా పెరుగుతున్నారు. కో డైరెక్టర్లు, డైరెక్టర్లూ తక్కువే. గత ఎనిమిదేళ్ళుగా మొత్తం కలిపి 23 మందికి 48 స్క్రీన్ ప్లేలు రాశాడీ వ్యాసకర్త. ఇవన్నీ చిన్న, మధ్యతరహా సినిమాలే. అయినా రకరకాల కారణాలవల్ల (కంటెంట్ కారణంగా కాదు) పట్టాలెక్కించలేక స్ట్రగుల్ చేస్తున్నారు. వీళ్ళల్లో ఓ ముగ్గురు మాత్రం ఇప్పుడిప్పుడే పట్టాలెక్కుతున్నారు.  


(ఇంకా వుంది)

-సికిందర్
       
       



28, అక్టోబర్ 2016, శుక్రవారం

రివ్యూ!

రచన- దర్శకత్వం : గోకుల్
తారాగణం : కార్తీ, శ్రీ దివ్య, నయనతార, వివేక్, శరత్ లోహితశ్వా, మధుసూదన రావు, సిద్ధార్థ్ విపిన్ తదితరులు
సంగీతం : సంతోష్ నారాయణ్, ఛాయాగ్రహణం : ఓం ప్రకాష్
బ్యానర్ : పివిపి సినిమా- డ్రీమ్  వారియర్ పిక్చర్స్
నిర్మాతలు
: పెరల్‌ వి. పొట్లూరి, పరమ్‌ వి.పొట్లూరి, కవిన్‌ ఏన్, ఎస్‌.ఆర్‌.ప్రకాష్‌ బాబు,
ఎస్‌.ఆర్‌.ప్రభు
        తెలుగు ప్రేక్షకుల్లో కూడా ఫాలోయింగ్ సంపాదించుకున్న తమిళ స్టార్ కార్తీ మొన్నా మధ్య ‘ఊపిరి’ లో కన్పించి ఎంటర్ టైన్ చేశాడు. తిరిగి ఇప్పుడు ‘కాష్మోరా’ అనే మరో ఎంటర్ టైనర్ తో భారీ రేంజిలో దిగుమతయ్యాడు ద్విపాత్రాభినయం చేస్తూ. మంత్ర తంత్ర మాయాజాలాల డార్క్ ఫాంటసీలు అప్పుడప్పుడు వస్తున్నవే కానీ, కార్తీ నటించిన ఈ డార్క్ ఫాంటసీ అనేక విషయాల్లో వేరు. రొడ్ద కొట్టుడుగా వస్తున్న హార్రర్ కామెడీలకి దూరంగా దర్శకుడు గోకుల్ దీన్నో సాటరికల్ ఫాంటసీగా తీశాడు. దేవుణ్ణి నమ్మే వాళ్ళ మీద అమీర్ ఖాన్ తో ‘పీకే’ తీసినట్టు, దెయ్యాల్ని నమ్మే వాళ్ళ మీద గోకుల్ ‘కాష్మోరా’ తో వ్యంగ్య బాణా లేశాడు. ఐతే ఇది కేవలం సెటైరేనా ఇంకేదైనా విషయముందా ఇందులో, ఒకసారి ఈ కింద పరిశీలిద్దాం....


కథ : 
     కాష్మోరా (కార్తీ) అనే భూత వైద్యుడు ‘దెయ్యాల్ని వదిలిస్తూ’ డబ్బులు  సంపాదిస్తూంటాడు. ఇతడి ఖాతాదార్లుగా మూఢ నమ్మకాల సామాన్యుల నుంచీ, అడ్డ మార్గాల  రాజకీయ నాయకుల వరకూ చాలామంది వుంటారు. భక్తులుగా మారిపోయిన ఇలాంటి వాళ్ళ కోసం కాష్మోరా తల్లి దండ్రులు, బామ్మ, చెల్లెలూ ఆశ్రమం కూడా నడుపుతూ,  పాలూ గుడ్ల దగ్గర్నుంచీ డబ్బులూ నగలూ నైవేద్యాల రూపంలో స్వాహా చేస్తూంటారు. కాష్మోరా టీవీ స్టార్ కూడా అయిపోతాడు. దెయ్యాలున్నాయంటూ అతను ఇచ్చే టీవీ కార్యక్రమాలకి విపరీతమైన టీఆర్పీ వుంటుంది. తమ కుటుంబ సభ్యులం ఐదుగురం రోహిణీ నక్షత్రంలో పుట్టామనీ, ఇలా అలెగ్జాండర్ కుటుంబంలో, ఆతర్వాత శ్రీకృష్ణ దేవరాయాలి కుటుంబంలో మాత్రమే ఐదుగురు సభ్యులు రోహిణీ నక్షత్రంలో పుట్టారనీ  పోల్చుకుని  గొప్పలు చెప్పుకుంటాడు. 

        దెయ్యాల మీద రీసెర్చి చేస్తున్న యామిని (శ్రీ దివ్య) కాష్మోరా దగ్గర చేరుతుంది. క్యాష్ అనే ముద్దు పేరుగల కాష్మోరా జనాల మూఢ నమ్మకాల్ని క్యాష్ చేసుకుంటున్నాడనీ, అతడికే విద్యా రాదనీ ఆమెకి అనుమానం. ఇంకో ధనకోటి (శరత్ లోహితశ్వా) అనే మంత్రి ఓ హత్య చేయించి అందులోంచి బయట పడేందుకు కాష్మోరాని ఆశ్రయిస్తాడు. కాష్మోరా తన చేతబడి గిమ్మిక్కులతో ధనకోటి సమస్య పరిష్కరిస్తాడు. కోర్టులో కేసు కొట్టేసే సరికి అది కాష్మోరా ఎఫెక్టే నని నమ్మకం పెరుగుతుంది ధనకోటికి.  ఓ రోజు ఐటీ వాళ్ళు దాడులు చేయబోతున్నారని తెలిసి బ్లాక్ మనీ, భూముల పత్రాలూ మూటలు కట్టి కాష్మోరా ఆశ్రమంలో కాష్మోరా తండ్రి దగ్గర దాస్తాడు. కాష్మోరా తండ్రి పెళ్ళాం, తల్లీ, కూతురూ సహా ఆ 500 కోట్ల సొత్తుతో ఉడాయిస్తాడు. ఈ ఘనకార్యం తెలిసి కాష్మోరా కూడా హేపీగా వాళ్లతో జాయినవుతాడు. అంతా కలిసి పారిపోతూ బెంగుళూరు మార్గంలో ఓ పురాతన కోటలో పడతారు. 

        ఆ కోటే కాష్మోరా పాలిట యమలోకం అవుతుంది. దెయ్యాల పేరు చెప్పుకుని వ్యాపారం చేసుకున్న అతడికి ఇప్పుడు నిజ దెయ్యాలతో పీకులాట మొదలవుతుంది. ఇక్కడి పదమూడు దెయ్యాల్లో  రాజానాయాక్ (కార్తీ) అనే హెడ్ దెయ్యం కాష్మోరాకి కండిషన్ పెడుతుంది. ఓ శాపం వల్ల తను భూమ్మీదే ఏడు శతాబ్దాలుగా ప్రేతాత్మలా వుండిపోయాననీ, రోహిణీ నక్షత్రంలో పుట్టిన ఐదుగురు కుటుంబ సభ్యులే తనకి శాప విముక్తి కలిగించగలరని తాళపత్రాల్లో రాసి ఉందనీ, కాష్మోరా టీవీ ప్రోగ్రాంలో ఇచ్చిన స్టేట్ మెంట్ చూశాక- తన శాప విముక్తికి ఇతనే తగిన వాడని తెలిసి ఇక్కడికి రప్పించుకున్నాననీ అంటుంది. తనకి శాప విముక్తి కల్గిస్తేనే ఇక్కడ్నించీ బయటపడతారనీ భయపెడుతుంది. టీవీ ప్రోగ్రాంలో వాగిన వాగుడు ఇలా కొంపలు ముంచుతుందని తెలీని, మంత్ర తంత్రాలు రాని కాష్మోరా ఇప్పుడేం చేశాడన్నది మిగతా కథ.

ఎలావుంది కథ 
      డార్క్ ఫాంటసీ జానర్లో క్షుద్ర విద్యలతో మూఢనమ్మకాల మీద సెటైర్ గా ఉంటూ వినోద ప్రధానంగా వుంది. ప్రథమార్ధమంతా ‘పీకే’ నీ, ‘ఓ మై గాడ్’ నీ గుర్తుకు తెచ్చే సోషల్ కామెంట్ లా వుంది- కాకపోతే ఈ రెండు సినిమాలూ దైవ భక్తి  మీద వ్యంగ్యాస్త్రాలు. భూతవైద్యాల పేరుతో జరుగుతున్న మోసాలకి, మధ్య యుగాలనాటి ఓ శాపాన్ని సవాలుగా పెట్టి- జయించేది సహజ బుద్ధి వికాసాలే తప్ప, వక్రబుద్ధులతో ఏదీ సాధించలేరనీ చెబుతున్నట్టూ వుంది.  బీభత్స భయానకాలకంటే కూడా హస్యరస- అద్భుత రసాల సమ్మేళనంగా అర్ధవంతంగానూ వుంది. 


ఎవరెలా చేశారు 
        ద్విపాత్రాభినయంతో కార్తీ ఈ ఫాంటసీకి చాలా హైలైట్ అనే చెప్పాలి. మొదటి బోగస్ మంత్ర గాడి పాత్రని అతను రొటీన్ ఆవారా తాగుబోతు మాస్ పాత్రలా చేయకుండా రక్షించాడు. బయట బ్లాక్ మ్యాజిక్ లు చేస్తూ, కాలేజీలో చేరి హీరోయిన్ వెంటపడే, పాటలు పాడే, రొష్టు ఫార్ములా పాత్రగా కూడా కన్పించకపోవడం చాలాచాలా రిలీఫ్. ఇలా జరిగి వుంటే ఆద్యంతం అతడి పాత్ర  ఉత్థాన పతనాల క్యారక్టర్ ఆర్క్ ఏర్పడి తేజోవంతంగా కన్పించేది కాదు. చిన్న పిల్లల్ని కూడా అలరించే విధంగా వుండేది కూడా కాదు.  చేతబడులంటూ చేసే మోసాల్ని బాగా నవ్వొచ్చే విధంగా నటించి చూపే ఏకైక ఎజెండా ముందు, ఎలాటి ప్రేమ ట్రాకులూ డ్యూయెట్లూ అవసరపడలేదు. ముందు బోగస్ మంత్ర గాడిగా  తనలోకంలో తను ఎదురు లేని కింగ్, తర్వాత దెయ్యాల కోటలో పడ్డాక పడే తిప్పలతో తానొక జోకర్, చివరికి  తంటాలు పడి తనలోని – మరుగున పడిపోయిన అసలు మానవ బుద్ధికి పని చెప్పాకే తానొక మొనార్క్! మోస బుద్ధుల కొద్దీ నరకంలో పడితే, ఆ మోస బుద్ధులే కాపాడలేవు, మంచి బుద్ధులు  ఉపయోగిస్తే వాటికి బయటి నుంచి పాజిటివ్ శక్తులు తోడ్పడతాయి- ఇలా పాజిటివ్ శక్తుల్ని ఆకర్షించే మంచి బుద్ధులతోనే బ్రతికి పైకెదగాలే తప్ప మరో షార్ట్ కట్ లేదనే- ఈ కొట్టొచ్చి నట్టుండే ‘క్యారక్టర్ నోట్’ తో ఇంత కలర్ఫుల్ గా ముగిసే పాత్ర - చాలా కాలం తర్వాత దక్షిణ భారత వెండి తెర మీద ఒక క్లాసిక్ ఎగ్జాంపుల్ అనొచ్చు. ఐతే సమస్య ఎక్కడొచ్చిందంటే,  ఈ కాలంలో మనం ఇన్వాల్వ్ మెంట్ లేకుండా సినిమాల్ని పైపైన చూసేసి వదిలేస్తున్నాం. ఇన్వాల్వ్ మెంట్ తో అంతగా పనుండదు కాబట్టే ఆవారా టపోరీ పాత్రలకి అంత బాగా ఎడిక్ట్ ఐపోయాం. 

        దుష్టపాత్రగా రెండో పాత్ర కార్తీక్ లాంటి ఇంకా జ్యూనియర్ స్టార్ కి పెద్ద పరీక్షే అయినా, ఇదేం  లెక్క కాదన్నట్టు అవలీలగా నటించేశాడు. దురదృష్టమేమిటంటే, ఇలా రెండో పాత్రగా దుష్ట పాత్ర పోషించే స్టార్స్ కి ఎంతబాగా నటించినా ఉత్తమ విలన్ అవార్డు లివ్వరు! మొండెం నుంచి తల వేర్పడి మాట్లాడే, పోరాడే రాజానాయక్ దుష్ట పాత్రలో కార్తీక్ ని పోల్చుకోలేం, అది కార్తీక్ అని చెప్తే తప్ప. 

        నయనతార మధ్యయుగాలనాటి వీరత్వమున్న, దగాపడిన యువరాణి రత్నమహాదేవిగా తన అనుభవంతో పాత్రని నిలబెట్టింది. ఆమెతో సీన్స్ అన్నీ ఉద్విగ్నభరితంగా వున్నాయి. ఇక మిగతా పాత్రల్లో కార్తీ తండ్రిగా నటించిన కమెడియన్ వివేక్ (వివేకానందన్) ఇంకో ఎట్రాక్షన్. మంత్రి పాత్రలో విలన్ గా శరత్ లోహితశ్వావి అచ్చం విలన్ కుండే విగ్రహం, కళ్ళూ. 

        టెక్నికల్ గా క్వాలిటీ వుంది. సీజీ చేసిన దృశ్యాలు వున్నతంగా వున్నాయి. భారతీయ సినిమాల్లో మొదటి సారిగా వాడామని చెప్తున్న 360- డిగ్రీల ఆమ్ని డైరెక్షనల్ కెమెరా, దక్షిణ భారత సినిమాల్లో తొలిసారిగా ఉపయోగించామంటున్న త్రీడీ ఫేస్ స్కాన్ టెక్నాలజీలతో కెమెరామాన్ ఓం ప్రకాష్ ఎక్కడా కృత్రిమత్వం లేకుండా, ఎగుడుదిగుళ్ళు కన్పించకుండా చిత్రీకరణ జరపడం మంచి పనితనం. అయితే సంతోష్ నారాయణ్ సంగీతం పాటలకి తప్ప, బిజిఎం కి ఘోరంగా వుంది. 

చివరికేమిటి 
      దర్శకుడు గోకుల్ కథ చెప్పాడు, టెక్నాలజీ చూపించుకోలేదు. టెక్నాలజీని డామినేట్ చేయకుండా కథలో కలిపేసుకున్నాడు. ఇలాటి చాలా భారీ సినిమాల్లో టెక్నాలజీ ముందడుగు వేస్తూ, ఎప్పటికప్పుడు అప్ డేట్ అవుతూ కనిపిస్తూ వుంటుంది. కానీ కథా కథనాలు, విషయమూ యోజనాల వెనకబడిపోయి అనాగరికంగా మనమీద స్వారీ చేస్తూంటాయి. ఇలాటిది జరగ లేదిక్కడ. దీని కథా కథనాలు స్ట్రక్చరల్ ఫ్రేమ్ వర్క్ లో టెక్నాలజీనే మరిపించేస్తాయి. ఒక అనుభూతికి లోను జేస్తాయి. అయితే రెండు లోపాలు కూడా లేకపోలేదు- ప్రధాన కథలో నేటివిటీకి, ఎమోషనల్ కనెక్ట్ కీ సంబంధించి. కార్తీ పాత్ర పోరాటం ఎమోషనల్ గా మనల్ని కూడా తీసుకుపోవాలంటే,  ఈ పాత్ర విలువైనదేదో  కోల్పోయే, అయ్యో పాపం అన్పించే,  పరిస్థితిని ఎదుర్కోవాలి. ఇది జరగలేదు. అలాగే మధ్య యుగాలనాటి పాజిటివ్ శక్తికి ప్రతీకగా నయనతార పాత్ర,   నేటివిటీకి కనెక్ట్ అయ్యే సెంటిమెంట్లతో- ఒక స్పిరిచ్యువల్ అనుభవాన్నివ్వాలి. ఇలాటివి కోడి రామకృష్ణ బాగా ఆలోచిస్తారు. గోకుల్ కూడా ఆలోచించి వుంటే మరింత సమగ్రంగా వుండేది ఈ ఫాంటసీ.


-సికిందర్
http://www.cinemabazaar.in