రివ్యూలు, సాంకేతికాలు, స్క్రీన్ ప్లే సంగతులు...

టికెట్లు దొరకడం యోగం, సినిమాలు చూడడం భోగం, రివ్యూలు రాయడం రోగం!

Tuesday, December 31, 2024

1361 : న్యూ ఇయర్ నోట్స్!

CLICK THE VIDEO 


పాఠక మిత్రులందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు! ఈ సందర్భంగా టాపిక్ ఏమిటంటే, తెల్లారి లేస్తే జనాలు సోషల్ మీడియాలో వుంటున్నారు. సినిమాలెందుకు వుండకూడదు. సోషల్ మీడియాలో సినిమా యాడ్స్, ప్ర మోషన్స్, సాంగ్స్ వంటి పబ్లిసిటీ మెటీరీయల్ సమస్తం వుంటోంది. సినిమాలెందుకు వుండకూడదు? సోషల్ మీడియాలో వుంటున్న జనాలు తెలుసుకుంటున్న సమాచారం సినిమాలో వుంటోందా? వుండకపోతే సినిమాలెలా కనెక్ట్ అవుతాయి? సోషల్ మీడియాలో మునిగి తేలుతున్న జనాలు  సృష్టిస్తున్న ట్రెండ్స్ సినిమాలు పట్టుకోగలుగుతున్నాయా? ఒక కాలంలో రోమాంటిక్ కామెడీల ట్రెండ్ అని, ఇంకో కాలం లో సస్పెన్స్ థ్రిల్లర్ల ట్రెండ్ అనీ  సినిమాలకి ట్రెండ్స్ అనేవి కొత్తేం కాదు. కానీ ప్రేక్షకులే ట్రెండ్స్ ని సృష్టించడం ఇప్పుడు కొత్త. ప్రేక్షకులు సృష్టిస్తున్న ఈ ట్రెండ్స్ నుపయోగించుకుని సినిమాలు కొత్త రూపురేఖలు సంతరించుకునే అవకాశమున్నా ఇంకా అవే రీసైక్లింగ్, కాపీ, టెంప్లెట్ సీన్లతో కాలం వెళ్ళబుచ్చుతున్నాయి. సోషల్ మీడియాలోంచి ప్రేక్షకులు సినిమా హాల్లోకి వచ్చి కూర్చుంటే సినిమాల్లో తమ ప్రపంచం, తమ జీవితం, తమ ఇష్టాయిష్టాలు కనిపించడమే లేదు.
 
నునిత్యం లక్షలాది ప్రజలు ఇంటర్నెట్ లో తమక్కావాల్సిన సమాచారం కోసం సెర్చి చేస్తూంటారు. లక్షల మంది ఒక సమాచారం కోసం సెర్చి చేస్తూంటారు. ఏ సమాచారం గురించి ఎక్కువ సెర్చిలు చేస్తున్నారో అదే ఆ రోజుకి ట్రెండ్ అవుతుంది. ఉదాహరణకి 'హేపీ న్యూ ఇయర్ ఈవెంట్ 2025' గురించి ఇప్పుడు రాత్రి 8. 40 గం. వరకూ ఇండియాలో ఇరవై లక్షల మందికి పైగా సెర్చి చేశారు. లక్ష సెర్చి లతో 'మాన్ వర్సెస్ న్యూ కాజిల్'  వుంది, అలాగే 50 వేల సెర్చి లతో 'సంబద్ లాటరీ' వుంది. ఇలా ర్యాంకింగ్ ఏర్పడుతుంది. ఈ ట్రెండ్స్ 'గూగుల్ ట్రెండ్స్' వెబ్సైట్ లోకి వెళ్తే తెలుస్తాయి. ఎంతమంది ఏ విషయం మీద సెర్చి చేస్తున్నారో గూగుల్ ట్రెండ్స్ ద్వారా తెలుసుకుని యూట్యూబ్ లో ఆ విషయం తాలూకు వీడియోలు సృష్టించి వ్యూస్ పెంచుకుంటారు. వెబ్సైట్స్ లో ఆ విషయం తాలూకు కంటెంట్ ని పోస్ట్ చేసి రీడర్స్ ని పెంచుకుంటారు. యూట్యూబర్ లు, వెబ్ కంటెంట్ క్రియేటర్లు ఇలా గూగుల్ ట్రెండ్స్ నుపయోగించుకుని ఆదాయం పెంచుకుంటున్నారు. ట్రెండింగ్ టాపిక్స్ ని సెర్చి చేస్తున్న ప్రజలకి ఆ సమాచారాన్ని ఈ రెండు మీడియాలు అందుబాటులో వుంచే మార్కెటింగ్ వ్యూహానికి సినిమాలు దూరంగా వుండిపోవడం చూస్తున్నాం. అంటే సినిమాలు ప్రజలతో బాటు సోషల్ మీడియాలో వుండడం లేదు. సోషల్ మీడియాలో ప్రజలు వెతుక్కుంటున్న సమాచారమమమేంటో, ఆసక్తులేమిటో, మొత్తానికి ప్రేక్షకుల టేస్ట్ అసలేమిటో తెలుసుకోకుండా, చూసి చూసి వున్న అవే పాత రొటీన్ సీన్లు సృష్టించి చేతులు దులుపుకుంటున్నారు.
     
నెట్ లో ప్రజలు సెర్చి చేసే అంశాల్లో దేశం లో జరిగిన ఏదైనా సంఘటన
, రాజకీయ పరిణామాలు, ప్రముఖుల ఈవెంట్లు, కొత్త ఫ్యాషన్లు, హాబీలు, ఫుడ్స్, డ్రింక్స్, ఇలా ఒకటేమిటి ఎన్నో వుంటాయి. ఒక ట్రెండింగ్ అవుతున్న ఫుడ్ తీసుకుని సినిమా సీన్లో పార్టీ సీను క్రియేట్ చేశామనుకోండి- వెంటనే ఆడియెన్స్ ఆ సీనుతో కనెక్ట్ అయిపోయి ఎంజాయ్ చేస్తారు. ఒక ట్రెండింగ్ అవుతున్న హాబీనో, ఫ్యాషన్ నో కూడా సీన్స్ లో చూపిస్తే ఆడియెన్స్ కి అది తమ జీవితమే అన్పించి లీనమైపోతారు. ఏదైనా సమస్య మీద అభిప్రాయాలూ కూడా ట్రెండ్ అవుతూంటాయి. ఇవి కూడా పాత్రలు చర్చిస్తే సీన్లు  వైరల్ అవుతాయి.
       
ప్రపంచవ్యాప్తంగా దేశాల వారీగా ఈ ట్రెండ్స్ వుంటాయి. మనకి ఇండియా సరిపోతుంది. దీన్ని 
'గూగుల్ ట్రెండ్స్ ఇండియా' అందిస్తుంది. అయితే ఇవాళ ట్రెండ్ అయ్యే టాపిక్ సినిమా రిలీజయ్యేనాటికి పాతబడి పోతుంది కదా అన్పించవచ్చు. సినిమా సీన్స్ లో ట్రెండ్స్ ని అప్పుడే స్క్రిప్టులో చేర్చ కూడదు. షూటింగ్ కేళ్ళేముందు అప్పడు ట్రెండ్ అవుతున్న టాపిక్స్ ని సీన్స్ లో కలుపుకుంటే సరిపోతుంది. అప్పటికి రాసుకున్న డైలాగ్  వెర్షన్లో ఎక్కడెక్కడ బావుంటుందన్పిస్తే అక్కడ యాడ్ చేయవచ్చు. అలాగని అన్ని సీన్స్  లో ట్రెండ్స్ ని చూపిస్తే ఎబ్బెట్టుగా వుంటుంది. అప్పటికి కూడా షూటింగ్ మొదలెట్టి రిలీజయ్యే నాటికి నాల్గైదు నెలలు పడుతుంది కదా అన్పించవచ్చు. జ్ఞాపకాలు ఎక్కడికీ పోవు. నాల్గైదు నెలల క్రితం ప్రేక్షకులు తాము సెర్చి చేసిన టాపిక్ లేదా ఐటెమ్ ఇప్పుడు సినిమాలో కన్పిస్తే ఆ జ్ఞాపకాలు గిలిగింతలు పెట్టకమానవు. సినిమా సీన్లు ఎలా వుంటున్నాయంటే అవి ప్రేక్షకులు పాసివ్ గా చూసే చప్పిడి సీన్లు. సోషల్ మీడియాలో మునిగి తేలుతున్న ప్రేక్షకులకి యాక్టివ్ గా చూసే సీన్లు కావాలి. అవి సోషల్ మీడియాలోంచే వస్తాయి. 
     

  స్క్రిప్టు రచయితల పని దీంతో అయిపోలేదు. వైరల్ వీడియోలు కూడా వున్నాయి. కొన్ని వీడియోలు ఎందుకు వైరల్ అవుతున్నాయి
? వాటివెనుకున్న నిజమేంటి? ఇది కూడా స్టడీ చేస్తేనే నిజమైన స్క్రిప్టు రచయితలవుతారు. కాలంతో పాటు మారకపోతే కనుమరుగై పోతారు. వైరల్ వీడియోల్ని స్టడీ చేస్తే అప్పుడు సీన్లు మామూలుగా వుండవు. సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వీడియోల్లాగే ఒక్కో  సినిమా సీన్ని వైరల్ చేసి ప్రేక్షకులకి పిచ్చెక్కించవచ్చు. దీని గురించి  ఇంకోసారి తెలుసుకుందాం. సినిమాల నుంచి ఇతర మీడియాలు చాలా తీసుకున్నాయి. ఇప్పుడు సోషల్ మీడియాలోంచి సినిమాలు తీసుకోకపోతే ఇప్పుడున్న ఎనిమిది శాతం విజయాలు నాలుగు శాతానికి, ఇంకొన్నాళ్ళకి రెండు శాతానికి, మరికొన్నాళ్ళకి సున్నా శాతానికీ పడిపోయి  అదృశ్యమైపోతాయి. సోషల్ మీడియా కింద తవ్వకాలు జరిపితే అక్కడ కనపడతాయి.

—సికిందర్


Wednesday, December 18, 2024

1360 : స్క్రీన్ ప్లే సంగతులు

    సాధారణంగా సీక్వెల్స్ సక్సెస్ కావు. కానీ పుష్ప సీక్వెల్ అన్ని రికార్డులూ  బ్రేక్ చేస్తూ తెలుగు, హిందీ భాషల్లో సూపర్ హిట్టయిన సీక్వెల్. అల్లు అర్జున్ పోషించిన పుష్పరాజ్ క్యారక్టర్. పుష్ప-1 తో ఈ క్యారక్టర్, దాంతో అల్లు అర్జున్ నటనా ఎంత సంచలనం సృష్టించాయంటే పాకిస్తాన్ లో సైతం పుష్ప క్యారక్టర్ నటిస్తూ వీడియోలు వైరల్ చేశారు. పుష్పతో అల్లు అర్జున్ ఏం చేశాడంటే, ఒక గబ్బర్ సింగ్ - ఒక పుష్ప మధ్యలో ఇంకెవరూ లేరన్నట్టుగా చరిత్రలో నిలబెట్టేశాడు. కథాకథనాలతో దర్శకుడు సుకుమార్ స్కిల్స్ కి మించి పాత్ర నటించిన అల్లు అర్జున్ స్కిల్సే ఈ రెండు భాగాలుగా వచ్చిన పుష్ప  ఊర సక్సెస్ కి కారణమయ్యాయని చెప్పుకోవాలి.

        'పుష్ప 1 లాగే పుష్ప 2 కథనం కూడా వివిధ పాయింట్లతో వివిధ ఎపిసోడ్ల మయంగా సాగుతుంది. ఎప్పుడైతే వివిధ ఎపిసోడ్లుగా కథనం సాగుతుందో అప్పుడు ఎమోషన్లు ఖతమై  పోతాయి. ఎమోషన్లనేవి ఒకే కథతో, అందులో వుండే ఒకే సమస్యతో, ఆ సమస్యతో వుండే ఒకే పోరాటంతో, ఆ పోరాటంతో వుండే ఒకే పరిష్కారంగా వున్నప్పుడు మాత్రమే బలంగా వుంటాయి. ఈ నిర్మాణంలో వుండేదే కథ. ఇలాగాక వివిధ సమస్యలతో వివిధ పోరాటాలుగా, వివిధ పరిష్కారాలుగా వుంటే అది కథ అన్పించుకోదు, అందులో భావోద్వేగాలు నిలబడవు. ఈ ఎపిసోడిక్ కథనాల్ని కథకాదు కాబట్టి డాక్యుమెంటరీలకి వాడతారు, సినిమాలకి కాదు. అయినా  ఆటోనగర్ సూర్య’, టైగర్ హరిశ్చంద్ర ప్రసాద్’, సిటిజన్ వంటి అనేక సినిమాలు ఇలా వచ్చి ఫ్లాపయ్యాయి. డాక్యుమెంటరీలకి వాడే ఈ కథనాన్ని స్టార్ట్ అండ్ స్టాప్ టెక్నిక్ అంటారనేది తెలిసిందే. దీని గురించి బ్లాగులో చాలాసార్లు చెప్పుకున్నాం,హెచ్చరించుకున్నాం.

ఎపిసోడిక్ కథనం ఎలా  వుంటుందో పక్కన పటం చూడండి. ఉదాహరణకి- ఆటోనగర్ సూర్య లో డీజిల్ కారు తయారు చేస్తేదాంతో ప్రత్యర్ధుల సంఘర్షణదానికో ముగింపుతర్వాత బ్యాటరీ కారు తయారు చేస్తేదాంతో ప్రత్యర్ధుల సంఘర్షణదానికో ముగింపుమళ్ళీ తర్వాత కొచ్చిన్ ప్రయాణం కడితేఅక్కడ సంఘర్షణదానికో ముగింపూ,  ఇంకాతర్వాతయూనియన్ లో సభ్యత్వ సమస్యతో ఇంకో  సంఘర్షణా దానికో ముగింపూ. మళ్ళీ తర్వాత వాహనాల వేలం పాట సమస్యదాంతో సంఘర్షణాదానికో ముగింపూ...ఇలా ఎపిసోడ్లమయంగా సాగే కథనం  స్టార్ట్ అండ్ స్టాప్ టెక్నిక్ అయింది. ఇదే పుష్ప 2 లో ప్రత్యక్షమైంది.

సబ్ ఫ్లాట్స్ వేరు, ఎపిసోడిక్ కథనాలు వేరు. సబ్ ఫ్లాట్స్ (ఉప కథలు) వాటి వాటి విడివిడి సమస్య
లతో ప్రధాన కథని డిస్టర్బ్ చేయకుండా సమాంతరంగా సాగుతాయి. ఎపిసోడ్లు అలా కాదు, ఇవి ప్రధాన కథలేకుండా వివిధ ఎపిసోడ్లుగా పైన చెప్పిన విధంగా కథనాలతో వచ్చిపోతూంటాయి.

ఆయితే
పుష్ప2 లో కొత్త విధానం అమలైనట్టుంది- అదేమిటంటే, ఇందులో ప్రధాన కథ వుంది. ఆ ప్రధాన కథని మధ్య మధ్యలో ఆపేస్తూ వేరే సమస్యలతో ఎపిసోడ్లు ప్రారంభమై ముగుస్తూంటాయి. కొన్ని ఎపిసోడ్లకి ఎలివేషన్లు. దీంతో ప్రధాన కథనీ ఫీలవలేక, ఎపిసోడ్లనీ ఫీలవలేక, కేవలం అల్లు అర్జున్ యాక్టింగ్ స్కిల్స్ కోసం ఈ సినిమా చూడాలన్నట్టు తయారయ్యింది. అత్యంత మతిపోయే విషయమేమిటంటే,
ఎంతో అనుభవజ్ఞుడైన స్టీవెన్ స్పీల్బెర్గ్ కూడా ఈ ఎపిసోడిక్ స్ట్రక్చర్ కి పాల్పడ్డం తో 2001 లో వార్ హార్స్ఫ్లాపయ్యింది!

1. ఎపిసోడ్లతో విజయవంతమైన ప్రయోగం

    ఇలా వుంటే,  పుష్ప2 తో చెన్నైలో ఇంకో ప్రయోగం చేశారు. సినిమా విడుదలైన మూడోరోజు మల్టీప్లెక్స్ లో షో నడుస్తోంది. ప్రేక్షకులు ఉత్కంఠతో చూస్తున్నారు. గంటన్నర తర్వాత బొమ్మ ఆగి లైట్లు పడ్డాయి. అది ఇంటర్వెల్ అనుకున్నారు. కానీ కాదు, అది ది ఎండ్. తాము చూసింది ఫస్టాఫ్ కాదు సెకండాఫ్ అని అర్ధమై గోల గోలచేశారు. మల్టీప్లెక్స్ నిర్వాహకులు జరిగిన పొరపాటు గ్రహించి ఆందర్నీ కూర్చోబెట్టి ఫస్టాఫ్ వేశారు. ఇది ప్రపంచంలో ఎవరికీ ఎదురుకాని అరుదైన అనుభవం. సెకండాఫ్ చూశాక ఫస్టాఫ్ చూడడం.     ప్రేక్షకులకి తాము చూస్తున్నది ఫస్టాఫ్ కాదని ఎందుకు అర్ధం కాలేదు? ఎందుకంటే ఏ ఎపిసోడ్ కా ఎపిసోడ్ గా ముగిసిపోతూంటే ఎందుకొస్తుంది డౌటు. ఇంకేవైనా సందేహాలుంటే సెకండాఫ్ లో తీరుతాయని చూస్తూ కూర్చున్నారు. నాన్ లీనియర్ కథల కాలం కదా? ఇలా ఎపిసోడిక్ కథనం కూడా సక్సెస్ అయిందన్న మాట. అసలు పుష్పా2 లో ఎలా చూపించినా, ఏది చూపించినా, అసలేమీ చూపించకపోయినా అది సక్సెస్సే!

సినిమా అందరూ చూసే వుంటారు కాబట్టి పూర్తి కథ ఇక్కడ ఇవ్వడం లేదు. ఇందులో ప్రధాన కథ, ఎపిసోడ్లు ఎలా సెట్ అయ్యాయో మాత్రమే చూద్దాం.

2. ఎలివేషన్ కి రాంగ్ అడ్రసు

    ఓపెనింగ్ లో జపాన్ కి ఎర్ర చందనం సరఫరా చేసిన పుష్పతో యాక్షన్ సీన్ వస్తుంది. దీంట్లో భాగంగా ఒక మాంటేజ్ : పుష్ప చిన్నప్పుడు తండ్రి నుంచి సంక్రమించాల్సిన ఇంటి పేరు పెట్టుకోలేని బాధ తో కూడిన ఒక ఫ్లాష్ బ్యాక్ (ఈ సమస్య మొదటి భాగంనుంచి క్యారీ  అయింది). నిజానికి ఓపెనింగ్లో దాదాపు 15 నిమిషాలు సాగే ఈ యాక్షన్ ఎపిసోడ్ తీసేసినా నష్టమేం లేదు. పైగా సినిమా నిడివి తగ్గుతుంది. నిజానికిది ఓపెనింగ్ లో కాకుండా తర్వాత వచ్చి వుంటే అభ్యంతరముండేదీ కాదేమో. ఎందుకంటే ఓపెనింగ్ లో ఈ ఎపిసోడ్ ని నిజానికి పుష్ప క్యారక్టర్ ఎలివేషన్ సీనుగా అర్ధం జేసుకోవాలి. ఇలాటి ఎలివేషన్ సీన్లు ఫస్టాఫ్ లో ఇంకో రెండున్నాయి. అవి కథనంలో భాగంగా వచ్చాయి కాబట్టి తెలియలేదు. ఇవి ప్రధాన కథ ఫ్లోని దెబ్బ తీశాయన్నది వేరే విషయం. ఇలాగే ఈ ఓపెనింగ్ లో జపాన్ ఎపిసోడ్ కూడా కథనంలో భాగంగా తర్వాత వచ్చి వుంటే సెట్ అయ్యేది. కథనమే ప్రారంభం కాకుండా రావడంతో అది ఎలివేషన్ సీన్ అని అర్ధంగాక విమర్శలొచ్చాయి.

3. విలన్లు కాని విలన్లు


    ఇప్పుడు ప్రధాన కథకి బిగినింగ్ విభాగం (ఉపోద్ఘాతం) వస్తుంది- శ్రీవల్లి (రశ్మికా మందన్న) ని పెళ్ళిచేసుకున్న పుష్ప సంసారం
, భార్య మాటే మంత్రమని భావించే అతడి వ్యక్తిగత క్యారక్టరైజేషన్ వగైరా. పుష్ప మొదటి భాగంలో కూలీగా వున్న పుష్ప ఇప్పుడు ఎర్ర చందనం స్మగ్లింగ్ సిండికేట్ బాస్ గా వుండడం చూస్తాం. సిండికేట్ సభ్యులు స్మగ్లింగ్ చేస్తూ పోలీసులకి పట్టుబడితే పుష్ప వెళ్ళి విడిపించడం. అనుచరులని టార్చర్ చేసిన ఎస్పీ భవర్ (భన్వర్ కాదు- Bhanwar అని ఇంగ్లీషు స్పెల్లింగ్ వుంటుంది గానీ హిందీలో పలికేది భవర్ అనే. భవర్ అంటే సుడిగుండం) సింగ్ షేకావత్ కి సవాలు విసురుతూ మొత్తం పోలీస్ స్టేషన్ స్టాఫ్ ని కొనేయడం. తర్వాత సీఎం నరసింహారెడ్డి (ఆడుకాలం నరేన్) దగ్గరికి వెళ్తూ వుంటే ఆయనతో ఫోటో దిగి రమ్మని  భార్య చెప్పడంతో ఆమె మాట కాదనలేని  పుష్ప సీఎం తో ఫోటో దిగాలని కోరితే సీఎం కాదనడం. దీంతో పుష్ప పట్టుదలకి పోయి సీఎం నే పదవిలోంచి దింపేస్తానని ప్రతిన బూనడం వగైరా.

ఇక్కడితో స్క్రీన్ టైమ్ 45 నిమిషాలు గడిచి బిగినింగ్ విభాగం ముగిసి- సీఎం ని దింపేసే పుష్ప గోల్ తో ప్లాట్ పాయింట్ 1 వస్తుంది. ఇలా పుష్ప గోల్ ఏర్పాటయ్యాక దీన్ని అడ్డుకునే ప్రయత్నాలతో సీఎం యాక్టివ్ గా వుండాల్సింది
, కనపడకుండా పోతాడు. అంటే పాసివ్ అయిపోయాడు. పాసివ్ ప్రత్యర్ధి పాత్రతో సంఘర్షణ ఏం వుంటుంది? సంఘర్షణ లేకపోతే కథేం వుంటుంది? కథ లేకపోతే స్క్రీన్ ప్లే ఏం వుంటుంది? (ఇవి సిడ్ ఫీల్డ్ మాటలు). ఇక్కడ్నించే ప్రారంభమయ్యే మిడిల్ 1 విభాగంతో  పుష్ప వర్సెస్ సీఎం సంఘర్షణగా కథ వేడెక్కి టైమ్ అండ్ టెన్షన్ గ్రాఫ్ పెంచుకుంటూ పోవాల్సింది అలా జరగలేదు.

పుష్పకి ప్రత్యర్ధి ఎస్పీ భవర్ సింగ్ వున్నాడుగా అన్పించవచ్చు. అతడి గోల వేరే. మొదటి భాగంలో పుష్ప తీవ్రంగా అవమానించాడన్న కోపంతో వ్యక్తిగత కక్ష పెంచుకుని అతను వున్నాడు. అంతేగానీ ఇప్పుడు ప్రధాన కథలో పుట్టిన సంఘర్షణతో అతను మమేకం కాలేదు. అసలు సీఎం మీద పుష్ప కుట్ర చేస్తున్నాడన్న స్పృహ కూడా తనకి లేనట్టే వుంటాడు. ఎంతసేపూ వ్యక్తిగత కక్షే. సీఎం కూడా ఇతడ్ని పిలిచి పుష్ప కుట్రని అడ్డుకోవాలని చెప్పడు. 

    ఇంకా ఈ కథలో ముందు ముందు తెరపైకొచ్చే ప్రత్యర్ధులు వున్నారు. కేంద్రమంత్రి వీరప్రతాప రెడ్డి( జగపతి బాబు), పుష్ప అన్న మొల్లేటి మోహన్రాజ్ (అజయ్), ఇంటర్నేషనల్ స్మగ్లర్ హమీద్( సౌరభ్ సచ్ దేవా), కేంద్రమంతి తమ్ముడి కొడుకు బుగ్గారెడ్డి (తారక్ పొన్నప్ప) మొదలైన వారు. వీళ్ళెవరూ కూడా సీఎం ని గద్దె దింపాలన్న పుష్ప ప్రధాన కథతో కనెక్ట్ అయి వుండరు. ఎవరి కారణాలు వాళ్ళ కుంటాయి.


ఇలా ఒకే ప్రధాన కథ గొడుగు కిందికి రావాల్సిన ప్రత్యర్ధులు చెదిరిపోవడంతో ప్రధాన కథ- దాంతో ఏకధాటిగా ప్రవహించాల్సిన పుష్ప భావోద్వేగాలూ తెగిపోయాయి. అంటే ప్రధాన కథకలో సీఎంని దింపాలన్న ఒక సమస్య ఏర్పాటయ్యాక, సంఘర్షణకి బలాబలాల సమీకరణ జరగలేదు. 'అంధా కానూన్' (చట్టానికి కళ్ళు లేవు) లో ఒక సాంగ్ వుంటుంది: రజనీకాంత్- మాధవిల మీద- 'ఏక్ తరఫ్ హమ్ తుమ్- ఏక్ తరఫ్ సారే'  అని. అంటే ఒక వైపు నువ్వూ నేనూ -ఇంకో వైపు వాళ్ళందరూ అని.  ఇలాగే 'పుష్ప2' లో  -ఒకవైపు నువ్వూ నేనూ(పుష్ప- శ్రీవల్లీ) - ఇంకోవైపు సీఎం, భవర్ సింగ్, మోహన్రాజ్, వీర ప్రతాప రెడ్డి, బుగ్గారెడ్డి తదితర ప్రత్యర్ధులూ అన్న స్పష్టమైన గీత గీసి, ఆటకి రంగాన్ని సిద్ధం చేసే బలాబలాల సమీకరణ జరగలేదు ప్రధాన కథకి.

ఆటకి రంగాన్ని సిద్ధం చేసే ప్లాట్ పాయింట్ వన్ అనేది మొత్తం సినిమా స్క్రీన్ ప్లే అనే మహాసౌధానికి మూలస్థంభం లాంటిదన్నమాట. ఈ మూలస్థంభం బలహీనంగా వుంటే మొత్తం కథ బలహీనమైపోతుంది. సీఎం ని దింపాలన్న లక్ష్యంతో పుష్ప, దీన్ని అడ్డుకోవాలన్న లక్ష్యంతో ప్రత్యర్ధులందరూ నిలబడితే ఎలా వుంటుంది. ఎంత బాగా అర్ధమవుతుంది కథ. భార్యకిచ్చిన మాట కోసం పుష్ప ఈ లక్ష్యాన్ని సాధించాడా లేదా అన్న డ్రమెటిక్ క్వశ్చన్ ఎంత బలమైన భావోద్వేగంతో కథనానికి తోడ్పడేది? ఇదీ పాయింటు. ప్రత్యర్ధులందరూ కట్టకట్టుకుని ప్లాట్ పాయింట్ 1  దగ్గరే పుష్పకి వ్యతిరేకంగా నిలబడనవసరం లేదు. ముందు సీఎం, భవర్ సింగ్, ఆ తర్వాత మిగతా ప్రత్యర్థులూ సినిమాలో చూపించిన పేసింగ్ తో ఈ పోరాటంలో కలుస్తూంటే చాలు. వెళ్తున్న కొద్దీ ప్రత్యర్ధులు పెరుగుతూంటే పుష్పకి చాలెంజీ ఆరోహణ క్రమంలో పెరుగుతూ పతాక స్థాయికి చేరుకునే క్రమం ఒకటి వుంటుంది.

ఎవరైనా అనుసరించే త్రీ యాక్ట్స్ స్క్రీన్ ప్లే స్ట్రక్చర్ 



    'పుష్ప' లాంటి హై కాన్సెప్ట్ సినిమాల్ని హాలీవుడ్ లో ఇంతే సింపుల్ స్టోరీ లైను తో తీస్తారు. పాత్ర- లక్ష్యం- సంఘర్షణ- పరిష్కారమనే సింపుల్ స్టోరీలైను మీద అటూ ఇటూ పాత్రల్ని పోగేసి- దాని మీద హెవీ యాక్షన్ ని మౌంట్ చేస్తారు. దీంతో సినిమా వీక్షణ మెదడుకి భారమైపోదు. అదే ఏదేదో కలిపేసి హెవీ కథ తయారు చేసి, దాని మీద మళ్ళీ హెవీ యాక్షన్ ని మౌంట్ చేస్తే రెండూ కలిసి మెదడు తట్టుకోలేనంత భారమై పోతాయి. అదే రోమాంటిక్ కామెడీల్లాంటి చిన్న సినిమాలు యాక్షన్ లేకుండా కథ మీదే ఆధారపడాలి కాబట్టి ఆ కథని సింపుల్ గా వుంచరు- వీలైనంత సంక్లిష్టం చేస్తారు. దీంతో కథలో ఇన్వాల్వ్  అయిపోయి యాక్షన్ లేని లోటు ఫీలవరు ప్రేక్షకులు. ఇదీ హాలీవుడ్ అనుసరించే మూవీ మేకింగ్ సైకాలజీ.

సరే, ఈ సినిమా స్క్రీన్ ప్లేకి  సూత్రాలన్నీ పక్కనబెట్టి సొంత మార్గాన్ని అనుసరించినట్టున్నారు. దీన్ని ఎపిసోడ్లు, ఎలివేషన్లు, ఎక్స్ టెన్షన్లు అని మనం చెప్పుకోవాలి కొత్తగా. ఇలాటి ప్రతిష్టాత్మక భారీ సినిమాలు తీసినప్పుడు పేరున్న ఆ దర్శకుడు మార్గదర్శకుడవుతాడు. ఎవరైనా అతన్ననుసరించి ఇలాగే సినిమాలు తీయొచ్చు. అప్పుడవి నిలబడతాయా? కాబట్టి మార్గదర్శకుడు దీన్ని దృష్టిలో పెట్టుకుని సినిమాలు నిర్మించాల్సి వుంటుంది. 

4. మిడిల్ 1 ఎపిసోడ్లు
    ప్లాట్ పాయింట్ 1 దగ్గర సీఎం ని దింపాలన్న లక్ష్యంతో వున్న పుష్ప  గోల్ ఏర్పాటయ్యాక- ఇప్పుడు ముందుకెళ్తే మిడిల్ 1 లో కథ ఎలా  వుందో చూద్దాం. సీఎం నరసింహారెడ్డిని దింపి తనతో క్లోజ్ గా వుండే సిద్ధప్ప నాయుడు (రావు రమేష్) ని సీఎం ని చేయాలి. ఇప్పుడు ప్రధాన కథతో సంబంధం లేని మరొక ఎలివేషన్ తో ఒక ఎపిసోడ్ వస్తుంది.  కేంద్రమంత్రి వీరప్రతాప రెడ్డి ని 5 కోట్లు చెల్లించాలని పుష్ప బెదిరించే ఎలివేషన్.  దీని తర్వాత వెంటనే ఇంకో యాక్షన్ ఎలివేషన్. ఇంటర్నేషనల్ స్మగ్లర్ హమీద్ తో  ఎపిసోడ్. ఈ రెండూ పూర్తయ్యాక- ఎస్పీ భవర్ సింగ్ పుష్ప తలపెట్టబోతున్న భారీ స్మగ్లింగ్ ని అడ్డుకునే, ప్రధాన కథతో భవర్ కి సంబంధం లేని ఒక యాక్షన్ ఎపిసోడ్ కాదుగానీ, భవర్ పాత కక్ష కథే. ఈ యాక్షన్ లో సిండికేట్ అనుచరుడ్ని ఇతను చంపడంతో పుష్ప తిరగబడతాడు. దీంతో  ఇద్దరి మధ్యా గొడవలు రూపుమాపడానికి సిద్ధప్పనాయుడు పూనుకుంటాడు. పుష్ప చేత సారీ చెప్పిస్తాడు. సారీ చెప్పిన పుష్ప మళ్ళీ వచ్చి భవర్ బట్టలు విప్పించి ఘోరంగా అవమానిస్తాడు. ఇది ఇంటర్వెల్ సీను. గంటా 40 నిమిషాలకి ఇది వస్తుంది.
       
ఇప్పుడు కూడా నువ్వు  సీఎం ని ఎలా దింపుతావో చూస్తాననడు భవర్. పుష్ప భార్య మాట కోసం సీఎం ని దింపాలన్న లక్ష్యం పెట్టుకున్నాడని అతడికి తెలియనే తెలియదు. మరొకటేమిటంటే
, పుష్పతో సారీ చెప్పించేందుకు వచ్చిన సిద్దప్ప నాయుడే పుష్ప నియమించబోయే సీఎం అని కూడా భవర్ కి తెలియదు. దీనికోసం 100 మంది ఎమ్మెల్యేలని కొనడానికి కావల్సిన 500 కోట్ల రూపాయల కోసమే పుష్ప భారీ ఎత్తున స్మగ్లింగ్ కి తెగబడ్డాడని కూడా భవర్ కి తెలీదు. అతడికి ఈ కథలో ఏం జరుగుతోందో ఏమీ తెలీదు. అయినా కథలో  ప్రధాన విలన్ గా వున్నాడు. అతడికి వున్నదల్లా పాత వ్యక్తిగత కక్ష్ణ తీర్చుకోవాలనే. ఇలా ప్రధాన కథ వదిలేసి ప్రత్యర్ధులందరూ వేర్వేరు లక్ష్యాలు పెట్టుకుంటే ప్రధాన కథేమై పోవాలి. పైగా భవర్ సింగ్ ఈ పాసివ్ నెస్ కి తోడు ఒక జోకర్ లాంటి క్యారక్టర్! ఇలా ప్రధాన కథకి ఒక విలన్ అంటూ లేకుండా పోయిన పుష్ప కి ఇక భావోద్వేగాలతో ప్రేక్షకుల్ని కట్టి పడేసే అవకాశ మెక్కడిది?

5. సెకండాఫ్ - మిడిల్ 2

    భవర్ ని అలా అవమానించిన పుష్ప తిరిగి స్మగ్లింగ్ చేస్తూంటే, దాన్ని విఫలం చేసే యాక్షన్ సీక్వెన్స్ మొదలవుతుంది. అయితే భవర్ పట్టుకున్నది ఎర్రచందనం గాక ఉత్త దుంగలని తెలిసి మళ్ళీ దెబ్బతింటాడు. దీంతర్వాత పుష్ప భార్య గర్భవతి అవడం, ఆడపిల్ల కావాలని కోరుకుంటూ ఆడవేషం వేసుకుని పుష్ప  జాతరలో డాన్సు చేయడం వగైరా వుంటాయి. దీని తర్వాత అన్న మోహన్రాజ్ ఎపిసోడ్. ఇక్కడ పుష్ప ఇంటిపేరు  ప్రస్తావన వచ్చి అతుకుపడుతుంది.  దీని తర్వాత సీఎం నరసింహారెడ్డి దిగిపోవడం, కొత్త సీఎం గా సిద్ధప్ప నాయుడు ప్రమాణస్వీకారం చేయడం జరిగిపోతాయి. ఇదెలా జరిగిందనేందుకు స్మగ్లింగ్ ఎపిసోడ్ మొదలవుతుంది. భవర్  ని తప్పించుకుంటూ పుష్ప సరుకుని రామేశ్వరానికి తరలించడం, అక్కడ్నించి శ్రీలక బోర్డర్ దాటించడం వగైరా. ఆ డబ్బుతో ఎమ్మెల్యేలని కొనేసి సీఎం ని దింపేసి సిద్దప్ప నాయుడ్ని సీఎం చేశాడన్న మాట. తర్వాత విందులో కొత్త సీఎం తో ఫోటో దిగి భార్యకి చూపించడం- ఇలా ప్లాట్ పాయింట్ 1 లో
ఒక సీనుతో, ఇప్పుడు రెండు మూడు సీన్లతో ఆషామాషీగా ముగిసిపోయింది ప్రధాన కథ.  తర్వాత భవర్ సింగ్ ఎర్ర చందనాన్ని తగులబెట్టి అందులో భస్మమైపోతాడు. ఈ ప్లాట్ పాయింట్ త 2 తో మిడిల్ ముగిసి ఎండ్ విభాగానికి చేరుకుంటుంది- కథ కాదు- స్క్రీన్ ప్లే. ఇది లీడ్ ఎపిసోడ్.

6. ఎండ్ విభాగానికి లీడ్ ఎపిసోడ్

    ఇప్పుడు పుష్ప అన్న మోహన్రాజ్ కూతురు కావేరీ (కరణం పావని) కిడ్నాప్ తో ప్రధాన కథతో సంబంధం లేని ఇంకో ఎపిసోడ్ ప్రారంభమవుతుంది. ఈ కిడ్నాప్ కేంద్రమంత్రి తమ్ముడి కొడుకు బుగ్గారెడ్డి చేస్తాడు. పుష్ప ఈ  అన్నకూతుర్ని కాపాడేక పుష్పని  అతడి అన్న కుటుంబంలో కలుపుకుంటాడు. ఈ అన్నకూతురి పెళ్ళి జరుగుతూంటే ఒక ప్రేలుడు జరిగి పుష్ప మూడో భాగాన్ని సూచిస్తుంది ముగింపు. అంటే ఈ 15 నిమిషాల సుదీర్ఘ ఎపిసోడ్ ని రాబోయే 'పుష్ప3' కోసం లీడ్ గా వేశారన్న మాట!

        ఈ రకమైన స్క్రీన్ ప్లేతో ఎవరైనా ప్రయోగాలు చేస్తే చేసుకోవచ్చు. అయితే దానికి పుష్ప లాటి పాత్రని క్రియేట్ చేయాలి. అల్లు అర్జున్ లాంటి స్టార్ ని నమ్ముకోవాలి. ఇలాటి స్క్రీన్ ప్లేకి ఇదే క్రైటేరియా అన్పిస్తే అనుసరించాల్సిందేతప్పక ! సుకుమార్ కా గ్యారంటీ!

—సికిందర్ 
 

Tuesday, December 17, 2024


 

డియర్  రీడర్స్,
       
కొన్ని అనివార్య కారణాల వల్ల- ముఖ్యంగా కొందరి స్క్రిప్టులు పరిశీలించాల్సి రావడం వల్ల- బ్లాగు ఆర్టికల్స్ కి అంతరాయం తప్పలేదు. స్క్రిప్టుల్లో విషయముంది. అయితే హీరోలు, నిర్మాతలు కోరుకుంటున్నది వేరు. అందుకని నెలల తరబడి తిరిగి చివరికి నో అన్పించుకునేకన్నా, స్క్రిప్టు గొప్పతనాలు కాసేపు పక్కనబెట్టి- హిట్టో ఫ్లాపో వారెలా కోరుకుంటున్నారో అలా తీసేసి ముందుకు సాగడమే మంచిదని చెప్పక తప్పడం లేదు. దర్శకులు పెరిగిపోయి పోటీ ఎక్కువగా వుంది. అలాగే దర్శకులకి కనీసం కొత్తగా వస్తున్న చిన్న హీరోలూ దొరకనంతగా బిజీగా వున్నారు. ఒకసారి ఓకే చెప్పిన హీరో మళ్ళీ నో చెప్పే సరికి మేకర్ల పరిస్థితి మొదటికొస్తోంది. వందమంది ప్రయత్నాలు చేస్తే ఇద్దరో ముగ్గురో అవకాశాలందుకుంటున్నారు. ఇలా రకరకాల సమస్యలున్నాయి. చూస్తే జాలేస్తోంది. చేయడానికేమీ లేదు. ఇక్కడ క్వాంటం థియరీని  పనిచేయించడం సాధ్యమేమో చూడాలి. ఎందుకంటే పదార్థం వెంటపడితే అది పరిమితం. అందరికీ పంచిపెట్టడం కుదరదు. శక్తి అనంతం. శక్తి తన అభివ్యక్తికి క్రియేటర్స్ ని కోరుకుంటుంది. అందుకని పదార్ధాన్ని అడుక్కునే బెగ్గర్స్ కాకుండా, తామే క్రియేటర్స్ గా శక్తిని ఆశ్రయిస్తే పని సులువవుతుందేమో. శక్తి దానికదే అవకాశాల్ని తెచ్చి ముందు పెడుతుంది. కానీ సింపుల్ స్క్రీన్ ప్లే స్ట్రక్చరే అర్ధంగాని వాళ్ళకి ఈ క్వాంటం థియరీ ఏమర్ధమవుతుంది. అందుకని ఇలా పాట్లు పడక తప్పదు. అన్నట్టు ఒక సినిమా తీసిన దర్శకుడికి ఈ థియరీ చెప్తే ఆయన జీవితమే ఆశావహంగా మారిపోయింది!


        పోతే
, ఈ రోజునుంచి రోజుకొక బ్లాగ్ పోస్టు వుండేలా ప్రయత్నిద్దాం. దేశ విదేశాల నుంచి చాలామంది ఎదురు చూస్తున్నారు. ముందుగా ఈ రోజు అర్ధరాత్రి పుష్ప-2 స్క్రీన్ ప్లే సంగతులు. తర్వాత రేపటి నుంచి గత వారం విడుదలైన బోగన్ విల్లా’, ఫియర్ సంగతులు. తమిళంలో అజిత్ నటిస్తున్న విడామయుర్చీ హాలీవుడ్ థ్రిల్లర్ బ్రేక్ డౌన్ కి కాపీ అని వార్తలొస్తున్నాయి- ఆ బ్రేక్ డౌన్ సంగతులు, అలాగే వేర్ ది క్రాడాడ్స్ సింగ్ అనే మరో హాలీవుడ్ మూవీ సంగతులు, ఇటీవలి సినిమాల్లో భావోద్వేగాలు కరువై ఫ్లాపవుతున్న సమస్యని దృష్టిలో పెట్టుకుని గుప్పెడు ఎమోషన్లు కావలెను అనే ఆర్టికల్ వరుసగా పోస్ట్ చేద్దాం. 
అలాగే ఒక దర్శకుడు అసంపూర్తిగా వదిలేసిన మహారాజా స్క్రీన్ ప్లే సంగతులు పూర్తి చేయమని పదేపదే కోరుతున్నారు. అది కూడా పూర్తి చేద్దాం. సెలవు.


-సికిందర్