రివ్యూలు, సాంకేతికాలు, స్క్రీన్ ప్లే సంగతులు...

టికెట్లు దొరకడం యోగం, సినిమాలు చూడడం భోగం, రివ్యూలు రాయడం రోగం!

Friday, May 31, 2024

1432 : స్పెషల్ ఆర్టికల్

 

  హాలీవుడ్ బాక్సాఫీసు స్థితిని చూస్తే 2024 ప్రత్యేక సంవత్సరం. జనవరి ఒకటి నుంచి ఈ రోజు మే 22 వరకు మొత్తం 176 హాలీవుడ్ సినిమాలు విడుదలయ్యాయి. వీటిలో 10 బ్లాక్ బస్టర్లున్నాయి. ఇది హాలీవుడ్ మనుగడకి సరిపోతుందా? 2020-21 కోవిడ్ మహమ్మారి- లాక్ డౌన్ ల తర్వాత మొదటిసారిగా అమెరికాలో సినిమా టిక్కెట్ల అమ్మకాలు 9 బిలియన్ డాలర్లకి చేరుకున్న స్థితి 2023 లో కన్పించింది. కోవిడ్ పూర్వ స్థితిని బట్టి చూస్తే ఇది తక్కువే. కాబట్టి హాలీవుడ్‌ బాక్సాఫీసుని కోవిడ్ పూర్వ స్థితికి చేర్చాలంటే ఏం చేయాలి? హాలీవుడ్ జర్నలిస్టు రేయాన్ స్కాట్ దీనికి సమాధానం చెప్పాడు. బాధ్యత పూర్తిగా ప్రేక్షకుల మీద వుంచాడు. ఒక్కమాటలో చెప్పాలంటే, ప్రేక్షకులు సినిమాలు ఎక్కువగా చూడాలని చెప్పడమే!

        మెరికా బాక్సాఫీసుని కోవిడ్ పూర్వ స్థాయికి తిరిగి రావడానికి సగటు వ్యక్తి సంవత్సరానికి ఇన్ని సినిమాలు థియేట్రికల్‌గా చూడాలని రికమెండ్ చేసే గణితానికి సంబంధించిన ఆసక్తికర విశ్లేషణ ఇది. ప్రస్తుతం మన దేశంలో వున్న పరిస్థితికి కూడా దీన్ని వర్తింపజేసుకోవచ్చు. టాలీవుడ్ నిలబడాలంటే తెలుగు రాష్ట్రాల్లో ప్రేక్షకులు యేటా ఎన్ని సినిమాలు థియేటర్లకి వెళ్ళి విధిగా చూడాలన్నది. హాలీవుడ్ కి సంబంధించి, 2009 నుంచి 2019 వరకు ప్రతి సంవత్సరం అధిగమిస్తూ వచ్చిన 10 బిలియన్ డాలర్ల బాక్సాఫీసుని లక్ష్యంగా పెట్టుకుని 2024 ని చూడాలి.
       
ప్రస్తుత అమెరికా జనాభా లెక్కల ప్రకారం
, అక్కడ 336.4 మిలియన్ల (33 కోట్ల 64 లక్షలు) మంది ప్రజలు నివసిస్తున్నారు. స్టాటిస్టా ప్రకారం 2022 నాటికి అమెరికాలో  82% మంది వ్యక్తులు కనీసం కొన్నిసార్లు సినిమాలకి వెళ్తున్నారు. జర్మనీకి చెందిన
స్టాటిస్టా అనేది 170 వివిధ రణగాల్లోని  80, 000 కంటే ఎక్కువ అంశాలపై గణాంకాలు, నివేదికలు, అంతర్దృష్టులతో కూడిన సమాచారాన్ని అందించే గ్లోబల్ డేటా - బిజినెస్ ఇంటెలిజెన్స్ ప్లాట్‌ఫామ్. ఇది మన దేశపు బాక్సాఫీసు గణాంకాల్ని కూడా ఎప్పటికప్పుడు విడుదల చేస్తూంటుంది.
       
స్టాటిస్టా చెప్పిన 2022 నాటికి అమెరికాలో కనీసం కొన్నిసార్లు సినిమాలకి వెళ్తున్న వ్యక్తుల శాతాన్ని సౌలభ్యం కోసం 80% అనుకుంటే
, ఇది  దాదాపు 269 మిలియన్ల (26 కోట్ల తొమ్మిది లక్షలు) మంది ప్రేక్షకుల సంఖ్యని సూచిస్తుంది. అమెరికాలో సినిమా టిక్కెట్ ప్రస్తుత సగటు ధర 10.78 డాలర్లుగా వుంది.  కాబట్టి, సగటు వ్యక్తి సంవత్సరానికి ఎన్ని సినిమాలు చూడాలి?
       
సగటు టిక్కెట్ ధర 10.78 డాలర్లని
, 10 బిలియన్ డాలర్ల బాక్సాఫీసు టార్గెట్ తో భాగిస్తే 927,643,785 టిక్కెట్లని విక్రయించాల్సి వుంటుంది. దీన్ని జనాభాలో 80% ప్రేక్షకుల సంఖ్యతో భాగిస్తే, ఒక్కొక్కరికి సంవత్సరానికి 3.44 టిక్కెట్‌లకి చేరుకుంటుంది. దీన్ని 4 టికెట్లుగా రౌండప్ చేస్తే, హాలీవుడ్ ని సేఫ్ జోన్ లో వుంచడానికి సగటు వ్యక్తి సంవత్సరానికి మూడు లేదా నాలుగు సినిమాలు విధిగా థియేటర్లలో చూడవలసి వుంటుంది. సంవత్సరానికి మూడు నాల్గు సినిమాలు చూడ్డం సమస్యే కాకూడదు. అవుతోందంటే ఈ మాత్రం కూడా ప్రతీ సగటు వ్యక్తి సినిమాలు చూడడం లేదన్న మాట.
       
సినిమా చూడడం అనేది సగటు వ్యక్తికి సాధారణ అభిరుచి
, అలవాటు. దురదృష్టవశాత్తూ, ఓటీటీ స్ట్రీమింగులు రావడంతో కొత్త సినిమాలు థియేటర్లలోకి వచ్చిన కొద్ది వారాలకే ఓటీటీల్లో ఇంటింటి పండుగగా మారడాన్ని నిర్మాతలు అనుమతించడం, కూర్చున్న కొమ్మని నరుక్కున్నట్టు బాక్సాఫీసుని దెబ్బ దీసుకోవడమే.
       
నిజం చెప్పాలంటే
, సంవత్సరానికి 10 బిలియన్ డాలర్ల హాలీవుడ్ బాక్సాఫీసు టార్గెట్ అనేది అత్యాశేమీ కాదు. 11.3 బిలియన్ డాలర్లకి చేరుకున్న 2019 సంవత్సరం వుండనే వుంది. మరిన్ని సినిమాలు చూడమని ప్రేక్షకుల్ని అభ్యర్ధించడం కూడా అన్యాయం కాదు. సంవత్సరానికి మూడు నాల్గు సినిమాలే థియేటర్లకి వెళ్ళి చూడమనడం. అంటే నెలకు 0.25 నుంచి 0.33 సినిమా మాత్రమే. ఇంతకంటే హీనంగా అడుక్కోవడమేముంటుంది?
       
అయినా దీన్ని ఖాతరు చేస్తారా ప్రేక్షకులు
? హాలీవుడ్ తో బాటు థియేటర్ చైన్‌లు ఈ సమస్యని పరిష్కరించాలి. నీర్మాతలు తమ సినిమాలతో ప్రేక్షకుల సమయాన్ని వృధా చేయబోమని భరోసా ఇస్తూ నాణ్యమైన సినిమాలందించాలి. ఐమాక్స్, 4 డీఎక్స్, డ్రైవ్ ఇన్ వంటి ప్రీమియం థియేటర్ల సంఖ్యని పెంచుకుంటూ పోవడం కాదు, వాటిలో ప్రదర్శించే సినిమాలు కూడా ప్రీమియం సినిమాలుగా వుండాలి. రాబోయే సంవత్సరాల్లో థియేట్రికల్ సినిమా వ్యాపారం మారు మూల ప్రాంతాల్లో కూడా ఆరోగ్యంగా వుండాలంటే ఇది తప్పక దృష్టి పెట్టాల్సిన ముఖ్యాంశం.

***