రివ్యూలు, సాంకేతికాలు, స్క్రీన్ ప్లే సంగతులు...

టికెట్లు దొరకడం యోగం, సినిమాలు చూడడం భోగం, రివ్యూలు రాయడం రోగం!

30, మే 2024, గురువారం

1431 : స్పెషల్ ఆర్టికల్

 

దిలాబాద్ జిల్లాకి చెందిన యువతి నడిపే తెలుగు యాత్రి అనే యూట్యూబ్ ట్రావెల్ ఛానెల్లో  కొద్ది రోజుల క్రితం ఉజ్బెకిస్తాన్ నుంచి ఒక వీడియో పోస్ట్ చేసింది. ఆ వీడియోలో ఆమె ఎక్కిన క్యాబ్ లో డ్రైవర్ ఆమె ఇండియన్ అని తెలుసుకుని హిందీ పాట పాడడం మొదలెట్టాడు. ఆ పాట దోస్త్ దోస్త్ నా రహా అని రాజ్ కపూర్ నటించిన సంగం (1964) సినిమా లోనిది. ఇదేమీ ఆశ్చర్యపర్చే విషయం కాదు. ఎందుకంటే దశాబ్దాల  నుంచీ రష్యన్ ప్రజలకి హిందీ సినిమాలు తెలుసు. 1950, 60 లలో రాజ్ కపూర్ సినిమాలు రష్యాలో కూడా మ్యూజికల్ హిట్సే. కాబట్టి నాటి సోవియెట్ రష్యాలో భాగమైన ఉజ్బెకిస్తాన్లో క్యాబ్ డ్రైవర్ పాట పాడడం రొటీనే. రష్యన్లు రాజ్ కపూర్, మిథున్ చక్రవర్తి, హేమ మాలిని, షారూఖ్ ఖాన్ వంటి స్టార్స్ సినిమాలు చూస్తూ పెరిగారు. అయితే ఈ చారిత్రక సాంస్కృతిక అనుబంధాన్ని పునరుజ్జీవింపజేసేందుకు, రష్యాలో భారతీయ సినిమా షూట్‌లు, షోలు పెంచే పనిలో ఇరు దేశాల్లోని సినిమా పరిశ్రమలు పని చేస్తున్నాయని ఒక నివేదిక పేర్కొంటోంది.
        
లా ఎందుకు జరుగుతోంది? ఎందుకంటే, ఫిబ్రవరి 2022లో రష్యా యూక్రేన్ పై దాడి చేసినందుకు నిరసనగా హాలీవుడ్ సంస్థలు రష్యా నుంచి వైదొలిగాయి. పోతే పోయారనుకుని పుతిన్ ప్రభుత్వం ఇండియన్ నిర్మాతల్ని లాగడానికి, రష్యాలో ఇండియన్ సినిమాలని ప్రోత్సహించడానికి, నిర్మాణాలని పెంచడానికీ గట్టి ప్రయత్నం ప్రారంభించింది.
        
రష్యాలో చిత్రీకరించిన  సర్దార్ ఉద్దం సింగ్’, పఠాన్’, టైగర్ 3’, జుగ్ జుగ్ జియో’ వంటి ఇటీవలి హిట్స్ కి  సహాయ సహకారా లందించిన ముంబాయికి చెందిన ప్రొడక్షన్ లైన్ కంపెనీ కార్టినా ఎంటర్‌టైన్‌మెంట్ లైన్ ప్రొడ్యూసర్ గా పనిచేస్తోంది. ఇంకా ఈ కంపెనీ ప్రస్తుతం అంతరిక్షంలో ప్రయాణించిన తొలి భారతీయుడు రాకేష్ శర్మ బయోపిక్ కి, ధర్మా ప్రొడక్షన్స్, ఎక్సెల్ ఎంటర్‌టైన్‌మెంట్, ఎమ్మే ఎంటర్‌టైన్‌మెంట్, రోహిత్ శెట్టి ప్రొడక్షన్స్ వంటి కంపెనీలు చేపట్టిన అనేక ప్రాజెక్టులకి షూట్ కోసం సంప్రదింపులు జరుపుతోంది.
        
ఈ సంవత్సరం రష్యన్ అధికారులు నిర్మాణ ఖర్చుల్లో రాయితీలు అందించడం ద్వారా ఎక్కువ సంఖ్యలో భారతీయ నిర్మాతల్ని ఆకర్షించాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. తాము ఇండియన్ నిర్మాతల కోసం ఏవైనా సేవలకి ఫ్రంట్ ఆఫీసు లేదా సూపర్ మార్కెట్ లాగా వున్నామని, ఇక్కడ షూటింగ్ చేయడానికి తక్కువ ధరల్ని అందించడం ద్వారా నిర్మాణ ఖర్చుల్ని వీలైనంత వరకూ తగ్గించడానికి ప్రయత్నిస్తున్నామనీ, మాస్కోలో మేయర్ కార్యాలయానికి చెందిన డిప్యూటీ హెడ్ ఎవ్జెనీ కోజ్లోవ్ పేర్కొన్నారు.
        
గత నెలలో తమిళ యాక్షన్ మూవీ ది గ్రేటెస్ట్ ఆఫ్ ఆల్ టైమ్’  మాస్కో-సిటీ ఆఫ్ సినిమా కార్యక్రమంలో పాల్గొన్న మొదటి విదేశీ నిర్మాణంగా నిలిచింది. మాస్కోసిటీ ఆఫ్ సినిమా నిర్మాతలకి  రాయితీల్ని అందిస్తుంది. సినిమా నిర్మాతల్నిఆకర్షించే బాధ్యతగా మాస్కో సాంస్కృతిక శాఖ, బాలీవుడ్ నిర్మాతలతో సంబంధాలు ఏర్పరుచుకుంటోందని కోజ్లోవ్ చెప్పారు.
       
ఇదిలా వుండగా
, రష్యా అంతటా భారతీయ సినిమాల ప్రదర్శన పెరిగింది. మాస్కో, సెయింట్ పీటర్స్ బర్గ్ లతో పాటు, ఆర్ఖంగెల్స్క్, బెల్గోరోడ్, కజాన్, పెన్జా, సరతోవ్, తులా, ఉలియానోవ్స్క్, చెబోక్సరీతో సహా దేశవ్యాప్తంగా 40కి పైగా కేంద్రాల్లో భారతీయ చలనచిత్రాల్ని ప్రదర్శిస్తున్నారు.
        
బాలీవుడ్ స్టార్ షారూఖ్ ఖాన్ నటించిన  బ్లాక్ బస్టర్ 'పఠాన్' లో ఘనీభవించిన సరస్సు మీద ఉత్కంఠభరి హై-స్పీడ్ మోటర్‌బైక్ చేజ్ సీక్వెన్స్ దక్షిణ సైబీరియాలో చిత్రీకరించిందే. సల్మాన్ ఖాన్, కత్రినా కైఫ్ లు  నటించిన యాక్షన్-థ్రిల్లర్ 'టైగర్ 3' ని సెయింట్ పీటర్స్ బర్గ్ లో  పాక్షికంగా చిత్రీకరించారు. తమిళంలో అజిత్ కుమార్ 'వలిమై', విక్రమ్ 'కోబ్రా' సహా అనేక తమిళ సినిమాలని రష్యాలో షూట్ చేశారు. విజయ్ ఆంటోనీ  'అగ్ని సిరగుగల్' ని విపరీత వాతావరణ పరిస్థితుల్లో రష్యా, కజకిస్తాన్, ఇంకా మధ్య ఆసియాలోని ఇతర ప్రదేశాల్లో షూట్ చేశారు.
        
పూర్వపు యూనియన్ ఆఫ్ సోవియట్ సోషలిస్ట్ రిపబ్లిక్ (యూఎస్ ఎస్ ఆర్) -ఇండియాల మధ్య సాంస్కృతిక మార్పిడి 1950ల నాటి రాజ్ కపూర్ క్లాసిక్స్ 'ఆవారా',  'శ్రీ 420' తో ప్రారంభమైంది. రాజ్ కపూర్ తరువాతి 20 సంవత్సరాల పాటు రష్యాలో అభిమాన తారగా వెలుగొందారు.  'ఆవారా' - రష్యన్ భాషలో డబ్ అయి  'బ్రొడియాగా' గా విడుదలైంది. 1970లో రాజ్ కపూర్ 'మేరా నామ్ జోకర్' ఇండియాలో ఫ్లాపైనా రష్యాలో పెద్ద హిట్. ఆ తర్వాత అమితాబ్ బచ్చన్, రేఖ, మిథున్ చక్రవర్తిల సినిమాలు హిట్టవసాగాయి. మిథున్ చక్రవర్తి డిస్కో డాన్సర్ తో రష్యన్స్ ని గంగవెర్రులెత్తించాడు.
       
అయితే ఇప్పుడెన్ని షూటింగులు రష్యాలో జరిగినా
, ఎన్ని సినిమాలు ప్రదర్శించినా రష్యన్లకి ఇండియన్ సినిమాలంటే పాత సినిమాలే. పాటలంటే పాత పాటలే. సన్నగా వర్షం కురుస్తున్న నడి రాత్రి ఉజ్బెకిస్తాన్ క్యాబ్ డ్రైవర్, పక్కన తెలుగు యాత్రితో,  దోస్త్ దోస్త్ నా రహా పాడుకుంటూ డ్రైవ్ చేస్తూ, గతాన్ని స్మరించుకుంటూ తదాత్మ్యం చెందడం ఒక అపురూప  దృశ్యమే!

***