రచన- దర్శకత్వం : ప్రశాంత్ వర్మ
తారాగణం : తేజ సజ్జా, అమృతా అయ్యర్,
వరలక్ష్మీ శరత్ కుమార్, సముద్రకని, వినయ్ రాయ్, సత్య, గెటప్ శ్రీను తదితరులు
సంగీతం : అనుదీప్ దేవ్, హరి గౌర, కృష్ణ సౌరభ్, ఛాయాగ్రహణం : దాశరధి శివేంద్ర
బ్యానర్ : ప్రైమ్‌షో ఎంటర్‌టైన్‌మెంట్, నిర్మాత : నిరంజన్ రెడ్డి
విడుదల : జనవరి 12, 2024
***
కల్కి,
జాంబీరెడ్డి వంటి విభిన్న సినిమాలు తీసిన దర్శకుడు ప్రశాంత్ వర్మ సూపర్ హీరో
ఫాంటసీ కథతో హనుమాన్ తీశాడు. మధ్యతరహా సినిమాగా యువహీరో తేజ సజ్జా తో తీసిన దీన్ని
సంక్రాంతి పెద్ద సినిమాల పోటీలో విడుదల చేయడం ఒక సాహసం. అయితే ఈ సాహసం ఫలించింది.
తెలుగులోనే కాకుండా ఇతర భాషల్లో విజయవంతగా ప్రదర్శనలకి నోచుకుంటోంది. దీని విశేషాలేమిటో
చూద్దాం...
కథ
1998 లో ఓ మహానగరంలో మైకేల్ అనే
దుష్ట బాలుడు సూపర్ మాన్ అవ్వాలని ప్రయత్నిస్తూంటాడు. సూపర్ మాన్ శక్తుల్ని
మంచికోసం ఉపయోగించాలని తల్లిదండ్రులు ఉద్బోధిస్తే వాళ్ళని చంపేస్తాడు. ప్రస్తుతానికొస్తే, అంజనాద్రి అనే మారు మూల గ్రామం. అక్కడ హనుమంతు (తేజ సజ్జా) అనే చిల్లర దొంగ. ఇతను
అక్క అంజమ్మ (వరలక్ష్మీ శరత్ కుమార్)
పెంపకంలో పెరిగాడు. మీనాక్షి (అమృతా అయ్యర్) ని ప్రేమించాడు. ఆమె మెడిసిన్
చదువుకుని వచ్చింది. గ్రామంలో గజపతి (రాజ్ దీపక్ శెట్టి) అనే పాలెగాడు ప్రజల నుంచి పన్నులు వసూలు
చేస్తూ పీడిస్తూంటాడు. ఇతడ్ని ఎదిరించిన మీనాక్షి ప్రమాదంలో పడుతుంది. ఈమెని
కాపాడబోయిన హనుమంతు నదిలో పడిపోతాడు. నదిలో ఒక హనుమతుడి అంశగల రుధిరమణి దొరుకుతుంది.
దాంతో అతడికి సూపర్ హీరో శక్తులు వచ్చేస్తాయి. ఆ శక్తులతో గజపతిని ఎదిరిస్తూ వుంటే,
రుధిరమణిని చేజిక్కించుకుని సూపర్ మాన్ అవుదామని మైకేల్ (వినయ్ రాయ్) వచ్చేసి
దాడులు మొదలెడతాడు.
ఇప్పుడు రుధిరమణితో మంచికోసం
హనుమంతు, చెడుకోసం మైకేల్ ల మధ్య పోరాటంలో ఎవరు గెలిచారన్నది
మిగతా కథ.
అప్పట్లో చిరంజీవి- శ్రీదేవి
నటించిన కె. రాఘవేంద్రరావు దర్శకత్వంలో వచ్చిన ‘జగదేక వీరుడు
అతిలోక సుందరి’ లాంటి సోషియో ఫాంటసీ కథ. హాలీవుడ్ నుంచి అదే
పనిగా వస్తున్న మార్వెల్ స్టూడియోస్ కామిక్స్ సూపర్ హీరో సినిమల్లాంటి కథ. అయితే
దీన్ని ఆధునిక ప్రపంచంలో, ఆధునిక పాత్రలతో, హైఫై గా కాకుండా, నేటివిటీతో కూడిన గ్రామీణ ప్రపంచంలో, సాధారణ
గ్రామీణ పాత్రలతో, దైవభక్తిని కూడా జోడించి తీయడంతో, క్లాస్ -మాస్ ప్రేక్షకులకి చేరువగా వెళ్ళగలుగుతోంది.
యాక్షన్ సినిమాలంటే నరుకుడు సినిమాలుగా పేరుపొందిన ఈ రోజుల్లో హింసకి దూరంగా కామెడీతో కూడిన అడ్వెంచర్ థ్రిల్లర్ గా తీయడంతో ఒక తాజాదనం చేకూరింది. పైగా మాస్- యాక్షన్ హీరోయిజం ఇమేజి వున్న నటుడ్ని తీసుకోకుండా సామాన్య యువకుడిలా కన్పించే ఏ ఈమెజీ లేని తేజ సజ్జాని తీసుకోవడం కూడా ఈ ప్రయత్నానికి ప్లస్ అయింది. ఏ ప్రత్యేకతలూ లేని ఒక సామాన్య పల్లెటూరి వాడు సూపర్ హీరోగా మారి శత్రువుల్ని ఎదుర్కొనే పరిణామ క్రమమాన్ని ఎస్టాబ్లిష్ చేసేందుకు ఫస్టాఫ్ లో గంటకి పైగా తీసుకుంది. రుధిరమణి దొరికిన తర్వాత అతీతశక్తులతో అతను సూపర్ హీరోగా మారే ఘట్టం వచ్చేసరికి ప్రేక్షకులనుంచి కేరింతలే. ఇక్కడ్నించీ వరుసగా కేరింతలే.
ఈ పూర్తి స్థాయి కామెడీతో కూడిన సూపర్ హీరో అడ్వెంచర్స్ కి, క్లయిమాక్స్ లో హిమాలయాల నుంచి సాక్షాత్తూ హనుమంతుడే రావడంతో మరోస్థాయి థ్రిల్. అయితే ఇందులో పాత వాసన వేసే మూస సన్నివేశాలు, మందకొడి కథనం, అనవసర పాత్రలు వంటి అవరోధాలూ లేకపోలేదు. సినిమా నిడివిని రెండున్నర గంటల నుంచి రెండు గంటలకి కుదించేస్తే ఈ లోపాలు తొలగి పోయేవి.
పాత సినిమాల్లో పల్లెటూరి పాత్రల్లో
సాదాసీదా చిరంజీవిలాగా తేజ సజ్జా వుండడం కనెక్టివిటీకి బాగా తోడ్పడింది. అశక్తుడైన
సామాన్యుడు అతీత శక్తులతో అసామాన్యుడిగా మారడమానే ఇరు పార్శ్వాల్ని సమయోచితంగా
ప్రదర్శించాడు. నటనకి కామెడీ ప్రేక్షకుల్ని ఇంకా దగ్గర చేసేలా వుంది. హీరోయిన్ తో
రోమాన్స్ లో ఫీల్ లేకపోవడం, అక్క పాత్రతో సెంటిమెంట్లు
లోపించడం వంటి లోపాలున్నాయి. యాక్షన్ సీన్స్, క్లయిమాక్స్ లో
పతాక స్థాయి పోరాటాలూ బాగా కుదిరాయి. చిన్న హీరోకి పెద్ద హిట్ సంక్రాంతి
దక్కడమన్నది రికార్డే.
హీరోయిన్ అమృతా అయ్యర్ కి అందచందాలు, నటించే టాలెంట్ వున్నాయి. హీరో అక్క పాత్రలో వరలక్ష్మీ శరత్ కుమార్ యాక్షన్ సీను కేరింతలకి ఇంకో సమయం. విలన్స్ గా రాజ్ దీపక్ శెట్టి, వినయ్ రాయ్ లు మరోసారి స్టైలిష్ విలన్ రోల్ చేశారు. గెటప్ శ్రీను, సత్య, జబర్దస్త్ రోహిణి తదితరులు నవ్వించే క్యారక్టర్లు. ఇక విభీషణుడిగా వచ్చే సముద్రకని హూందాగా నటించాడు.
తక్కువ బడ్జెట్లోనే టెక్నికల్‌గా బాగా తీయడం దర్శకుడిని నిర్మాతల లక్కీ ఛామ్ గా చేసే విషయం. అయితే బడ్జెట్ మూడు రెట్లు పెరిగిందని నిర్మాత ప్రకటన. వీఎఫ్ఎక్స్, సాంగ్స్, నేపథ్య సంగీతం (ముగ్గురు సంగీత దర్శకులు) వీలైనంత క్వాలిటీతో ఇచ్చారు. క్లయిమాక్స్ 15 నిమిషాల నేపథ్య సంగీతం భారీ సినిమాల స్థాయిలో వుంది.
కరుడుగట్టిన హింసాత్మక గెటప్స్ తో హీరోల సినిమాల్ని తీస్తున్న ఈ రోజుల్లో హింసే లేకుండా విజయవంతమైన కమర్షియల్ సినిమా తీయడం, ఎంటర్ టైన్ చేయడం, బాక్సాఫీసులో డబ్బులు కళ్ళజూడడం మొదలైన మంచి పనులు ‘హనుమాన్’ తో సుసాధ్యం చేసి చూపించారు.
—సికిందర్