దర్శకత్వం : గ్యారీ బిహెచ్
తారాగణం: నిఖిల్ సిద్ధార్థ్, ఈశ్వర్యా మీనన్, సాన్యా ఠాకూర్, అభినవ్ గోమఠం, ఆర్యన్ రాజేష్, నితిన్ మెహతా, జిష్షూ సేన్ గుప్తా తదితరులు
కథ : కె రాజశేఖర్ రెడ్డి, రచన :
అనిరుద్ధ కృష్ణమూర్తి, సంగీతం : విశాల్ చంద్రశేఖర్, నేపథ్య
సంగీతం : శ్రీచరణ్
పాకాల, ఛాయాగ్రహణం
: వంశీ పచ్చిపులుసు, మార్క్ డేవిడ్
బ్యానర్ : ఈడీ ఎంటర్‌టైన్‌మెంట్స్
నిర్మాతలు : కె రాజశేఖర్ రెడ్డి, చరణ్ తేజ్ ఉప్పలపాటి
విడుదల : జూన్ 29, 2023
***
‘కార్తికేయ 2’ పానిండియా
విజయంతో మరో పానిండియా ‘స్పై’ అనే యాక్షన్
థ్రిల్లర్ తో ప్రేక్షకుల ముందుకొచ్చాడు నిఖిల్. అంతర్జాతీయ గూఢచార కార్యకలాపాల
చిత్రీకరణకి హాలీవుడ్ స్టంట్ డైరెక్టర్ బాబీని కలుపుకుని
దర్శకుడు గ్యారీ బిహెచ్ తో ఈ పానిండియా ప్రయత్నం చేశాడు. దర్శకుడు గ్యారీ టాలీవుడ్ లో ఎడిటర్ గా
పరిచితుడే. ‘క్షణం’, 'గూఢచారి,'
'హిట్:
ది ఫస్ట్ కేస్,' 'హిట్: ది సెకండ్ కేస్' సినిమాలకి పనిచేశాడు. తెలుగుతో బాటు
హిందీ, తమిళం, కన్నడ, మలయాళం భాషల్లో నేడు విడుదలైంది. అయితే ఈ మూవీలో ప్రధానంగా నేతాజీ సుభాష్ చంద్ర
బోస్ కి సంబంధించి ఒక రహస్యం వెల్లడిస్తున్నామని ప్రచారం చేశారు. ఆ రహస్యమేమిటో
తెలుసుకుందాం...
జై
(నిఖిల్) రా ఏజెంట్. శ్రీలంకలో
వుంటాడు. ఐదేళ్ళ క్రితం చనిపోయాడను కుంటున్న పాకిస్తాన్ కి చెందిన ఉగ్రవాది ఖదీర్ ఖాన్ (నితిన్ మెహతా) బతికే వున్నాడని
రా చీఫ్ (మకరంద్ దేశ్ పాండే) కి తెలుస్తుంది. అతను, పాకిస్తాన్ కి చెందిన సైంటిస్టు అబ్దుల్ రెహ్మాన్ (జిష్షూ సేన్ గుప్తా)
కలిసి ఇండియా మీద పెద్ద కుట్రకి పథకం వేస్తున్నారని కూడా తెలుసుకుంటాడు. దీంతో ఖదీర్
ఖాన్ ని పట్టుకుని ఈ కుట్రని భగ్నం చేయమని జైని రా చీఫ్ ఆదేశిస్తాడు.
జైతో బాటు సహ ఏజెంట్లు వైష్ణవి (ఐశ్వర్యా మీనన్), కమల్ (అభినవ్ గోమఠం) ఆపరేషన్ చేపడతారు, గతంలో రా ఏజెంట్ గానే వున్న జై అన్న సుభాష్ (ఆర్యన్ రాజేష్) హత్యకి గురయ్యాడు. ఎవరు హత్య చేశారో తెలుసుకునే వ్యక్తిగత బాధ్యత కూడా జై కుంటుంది. ఇంతలో నేతాజీ సుభాష్ చంద్ర బోస్ కి చెందిన డీ క్లాసిఫై చేసిన ఫైలు ఖదీర్ ఖాన్ చేజిక్కించు కున్నాడని తెలుస్తుంది.
ఈ ఫైలుతో ఏం చేయదల్చుకున్నాడు ఖదీర్ ఖాన్? ఆ ఫైల్లో వున్న రహస్య మేమిటి? అన్న హత్య, ఇండియా మీద ఖదీర్ ఖాన్ కుట్ర, ఖదీర్ తస్కరించిన నేతాజీ ఫైలు- ఈ సమస్యలన్నిటినీ జై ఎలా పరిష్కరించి దేశాన్ని కాపాడాడన్నది మిగతా కథ.
ఎలావుంది కథ
దీన్ని పానిండియా సినిమాగా తలపెట్టారు కాబట్టి నార్త్ ప్రేక్షకుల కోసం సుభాష్ చంద్రబోస్ రహస్యం గురించిన కథ కలిపే ప్రయత్నం చేశారని అర్ధమవుతోంది. అయితే ఆ రహస్య మేమిటో చెప్పకుండానే ముగించారు. అసలు కథకి సుభాష్ చంద్ర బోస్ ఫైలుతో సంబంధం కూడా లేదు. కేవలం ప్రేక్షకుల్ని మభ్యపెట్టడానికే సుభాష్ చంద్రబోస్ ని వాడుకున్నారని స్పష్టమైపోతుంది.
రహస్య మేంటో చెప్పలేకపోయారుగానీ, దేశ స్వాతంత్ర్యం గురించి బోస్ కి ముడిపెట్టి కొత్త థియరీ చెప్పారు. స్వాతంత్ర్యం గాంధీ అహింసావాదం వల్ల రాలేదనీ, బోస్ హింసాత్మక మార్గం వల్లే బ్రిటిష్ వాళ్ళు స్వాతంత్ర్యం ఇచ్చారనీ చెప్పుకొచ్చారు. స్వాతంత్ర్యం సాధించిన ఘనత గాంధీ, నెహ్రూలు తప్పుడుగా పొందారనీ చెప్పారు. ఇది ప్రేక్షక బాహుళ్యంలోకి వెళ్ళలేదు.
దీన్ని పానిండియా సినిమాగా తలపెట్టారు కాబట్టి నార్త్ ప్రేక్షకుల కోసం సుభాష్ చంద్రబోస్ రహస్యం గురించిన కథ కలిపే ప్రయత్నం చేశారని అర్ధమవుతోంది. అయితే ఆ రహస్య మేమిటో చెప్పకుండానే ముగించారు. అసలు కథకి సుభాష్ చంద్ర బోస్ ఫైలుతో సంబంధం కూడా లేదు. కేవలం ప్రేక్షకుల్ని మభ్యపెట్టడానికే సుభాష్ చంద్రబోస్ ని వాడుకున్నారని స్పష్టమైపోతుంది.
రహస్య మేంటో చెప్పలేకపోయారుగానీ, దేశ స్వాతంత్ర్యం గురించి బోస్ కి ముడిపెట్టి కొత్త థియరీ చెప్పారు. స్వాతంత్ర్యం గాంధీ అహింసావాదం వల్ల రాలేదనీ, బోస్ హింసాత్మక మార్గం వల్లే బ్రిటిష్ వాళ్ళు స్వాతంత్ర్యం ఇచ్చారనీ చెప్పుకొచ్చారు. స్వాతంత్ర్యం సాధించిన ఘనత గాంధీ, నెహ్రూలు తప్పుడుగా పొందారనీ చెప్పారు. ఇది ప్రేక్షక బాహుళ్యంలోకి వెళ్ళలేదు.
‘కార్తికేయ 2’ తోనే నార్త్ ప్రేక్షకుల అభిమానాన్ని పొందిన నిఖిల్, ఆ ఉత్సాహంతో ‘స్పై’ ని ప్రాపగాండా సినిమాగా తీసినట్టుగా కూడా అర్ధమైపోతుంది. నిర్మాతలు ఇంకో వారం తర్వాత విడుదల చేయాలని ప్లాన్ చేస్తే, పట్టుబట్టి 29 వ తేదీనే నిఖిల్ విడుదల చేయించడంలో ఉద్దేశమిదే అన్పించక మానదు. టెర్రరిస్టులు, దేశం మీద కుట్ర, వాళ్ళని కాల్చి చంపడం ఈ రోజు చూపిస్తేనే కిక్ వస్తుంది. అయితే సినిమాలోనే ఒక డైలాగు వున్నట్టు- ‘అతి తెలివిని వాడుకోవడం’ వల్ల కథ కాని సుభాష్ చంద్ర బోస్ ఫైలు కథతో ప్రాపగాండా సినిమా ప్రయత్నం పూర్తిగా బెడిసి కొట్టింది.
ఓ రెగ్యులర్ సినిమా కథగా చూసినా పాయింటు మీద పాయింట్లు ఇందులో కుమ్మారు. అన్న హత్య, ఉగ్రవాది కుట్ర, బోస్ ఫైలు - ఇలా విడివిడి పాయింట్లు జొప్పించడంతో ఏ పాయింటు మీద కూడా కథ కాకుండా పోయింది. ఏదో ఒక పాయింటు మీద కథ చెప్పాల్సింది మూడు పాయింట్లు కుమ్మడంతో, దేంతోనూ భావోద్వేగాలు, థ్రిల్, సస్పెన్స్, ట్విస్టులు అన్నవి లేకుండా పోయాయి.
ఇక స్పై జానర్ కథా మర్యాదలైతే శూన్యం, పాత్రచిత్రణలతో సహా. మరి బాగున్నదేమిటి? యాక్షన్ సీన్స్, ఛాయాగ్రహణం, నేపథ్య సంగీతం. పరిమిత బడ్జెట్ తోనైనా ప్రొడక్షన్ విలువలు బావుండడం.
స్పై అనగానే ఒక రూపం కళ్ళ ముందు మెదుల్తుంది.
స్టయిలిష్ లుక్, చుట్టూ అమ్మాయిలు, కాస్త రోమాన్స్, ఫన్, ఎక్కువ
అడ్వెంచర్స్ చేసే వాడుగా కన్పిస్తాడు. దేశంకోసం పోరాడతాడు కాబట్టి గౌరవ భావం కూడా
ప్రేక్షకుల్లో సృష్టించుకుంటాడు. ప్రపంచ సమస్యే తన సమస్యగా వుంటాడు కాబట్టి, రక్త సంబంధాలు, కుటుంబ జీవితమూ లేని ఒంటరిగా సానుభూతి
కూడా పొందుతాడు. ఈ స్పై జానర్ మర్యాదలన్నిటినీ తీసి అవతలబెట్టి ఓ రెగ్యులర్ తెలుగు
సినిమా యూత్ లా నిఖిల్ ని చూపెట్టారు. ఇది చాలా అన్యాయం.
నిఖిల్ ఎక్కడా ఒక స్పై లాగే అన్పించడు. ఓ కామన్ యూత్ లా అన్న హత్యకి రివెంజితో ఎమోషనల్ అవుదామంటే, ఉగ్రవాదిని పట్టుకునే బాధ్యత, దేశ భక్తితో ఉగ్రవాదిని పట్టుకుందా మంటే, మధ్యలో ఆకస్మాత్తుగా బోస్ ఫైలు కోసం వెదుకులాట. ఇలా ‘అపరిచితుడు’ టైపులో ఇన్ని రకాలుగా నటిద్దామన్నా, ఒకదాంతో ఒకటి సంబంధం లేని కథా కథనాలతో ఏదీ నిలబెట్టుకో లేకపోయాడు.
మిగిలిన అన్ని పాత్రల్లో కూడా అందరూ కృత్రిమంగానే కనిపిస్తారు. హీరోయిన్ ఐశ్వర్యా మీనన్ నిఖిల్ కంటే ఎక్కువ యాక్టివ్ గా వున్నా, పాత్ర చిన్నదే. ఇంకో ఏజెంట్ గా అభినవ్ గోమఠం కామెడీ డైలాగులకి పరిమిత మయ్యాడు. ఈ పాత్ర ఏజెంట్ కి తక్కువ, కమెడియన్ కి ఎక్కువగా వుంటుంది. అయితే ఇతడి డైలాగులే ప్రేక్షకులు బాగా ఎంజాయ్ చేసే పరిస్థితి వుంది. ఇక విలన్లు నితిన్ మెహతా, జిష్షూ సేన్ గుప్తా రెంగ్యులర్ విలన్లుగానే నటించారు.
చాలా దేశాల్లో లొకేషన్స్ చూపించారు- శ్రీలంక, జోర్డాన్, న్యూయార్క్ సహా. వీటి చిత్రీకరణ బావుంది. మంచు పర్వతాల్లో, రిసార్ట్స్ లో సీన్లు కూడా బావున్నాయి. వర్షపు రాత్రి పోరాట దృశ్యాలు కూడా బావున్నాయి. క్లయిమాక్స్ కూడా ఓకే. ఈ సినిమాకి కథతో దర్శకుడు పడిన కష్టం కన్నా పోరాటాలతో హాలీవుడ్ స్టంట్ డైరెక్టర్ బాబీ పడ్డ శ్రమ ఎక్కువ. ఇక వంశీ పచ్చిపులుసు, మార్క్ డేవిడ్ ల ఛాయాగ్రహణం స్పై మూవీకి తగ్గట్టు రిచ్ గా వుంది. విశాల్ చంద్ర శేఖర్ సంగీతం లో పాటలు చూశాక గుర్తుండవు. కానీ శ్రీచరణ్ పాకాల నేపథ్య సంగీతం చెప్పుకోదగ్గది.
ఇది స్పై మూవీగా తప్ప రివెంజీ మూవీగా, టెర్రరిజం యాక్షన్ మూవీగా,
హిస్టారికల్ మూవీగా రకరకాలుగా కన్పిస్తుంది ఈ ‘స్పై’.
మూడు విడివిడి అంశాలతో కథ చేసినా మూడిటినీ కలిపి ఒక కథగా కలపలేక
పోయారు. అన్న హత్య పూర్వ కథని ‘ది మాగ్నిఫిషెంట్ సెవెన్’ లోలాగా చివర్లో షాకింగ్ గా రివీల్ చేసి, హీరో అన్న హత్యకి పగదీర్చుకోవడంగా అప్పుడు చూపించి
వుంటే చాలా ఎమోషనల్ గా వుండేది. కథకి కూడా అడ్డుపడేది కాదు.
ఉగ్రవాదిని పట్టుకోవడం గురించి కథ ప్రారంభించి, ఇంటర్వెల్ కి ముందు సుభాస్ చంద్రబోస్ ఫైలు తస్కరించాడని విడిగా చెప్పకుండా, కథా ప్రారంభమే ఫైలు తీసుకుని పారిపోయిన కథగా చూపించి వుంటే- అతుకుడు కథగా వుండేది కాదు.
ఆ ఫైలులో రహస్యమేమిటన్నది- తెలియకపోయినా- హిచ్ కాక్ ప్రయోగించే మెక్ గఫిన్ చిట్కాతో చూపించి వుంటే సరిపోయేది. క్వెంటిన్ టరాంటినో తీసిన ‘పల్ప్ ఫిక్షన్’ లో ఒక బ్రీఫ్ కేసు గురించి ముఠాల మధ్య కథ. ఆ బ్రీఫ్ కేసులో ఏముందో దర్శకుడు చెప్పడు. చివరికి హీరో దాన్ని చేజిక్కించుకుని ఓపెన్ చేస్తే- అందులో ఏముందో కూడా దర్శకుడు చూపించడు. అందులోంచి వచ్చే మిలమిల మెరిసే మెరుపుతో హీరో మొహం వెలిగిపోవడాన్ని చూపిస్తాడు. చూపిస్తే ఏం చూపించాలి- డ్రగ్సో, వజ్రాలో చూపించాలి. ఇది రొటీనే. అందుకని చూపించకుండా సస్పెన్సు పెంచుతూ ప్రేక్షకుల వూహకి వదిలేశాడు.
సుభాష్ చంద్ర బోస్ రహస్యంతో కూడా ఇలాగే చేయొచ్చు. పోతే, కథనం బలహీన పడడానికి ముఖ్య కారణం ఉగ్రవాది విలన్ తెరమరుగున వుండడం. అంటే తెర మీద హీరో విలన్ల ప్రత్యక్ష పోరాటం లేకపోవడం. హీరో నిఖిల్, విలన్ని వెతికే ఏక పక్ష కథనంతో సరైన యాక్షన్ లేకుండా పోయింది.
నిఖిల్ ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకుని నటించిన ఈ స్పై మూవీ, స్టోరీ డిపార్ట్ మెంట్లో తగిన రీసెర్చి, ప్రొఫెషనలిజం లేకపోవడం వలన 29 వ తేదీ అతడి మనోకామనకి దూరంగా వుండిపోయింది.
—సికిందర్