వరుస ఫ్లాపులెదుర్కొంటున్న అక్షయ్ కుమార్ ‘రామ్ సేతు’ తో విజయాలకి వారధి వేసుకుందామని వచ్చాడు. భక్తి- యాక్షన్ సినిమాల సీజన్ నడుస్తోంది కాబట్టి ప్రేక్షకులు కూడా దీన్ని చూసి తరిద్దామని చాలా కాలంగా ఎదురు చూస్తున్నారు. కోవిడ్ కి ముందు ప్రారంభమై ఈ దీపావళికి విడుదలవుతున్న దీని కోసం చాలా కష్టపడ్డాడు అక్షయ్ కుమార్, దర్శకుడు అభిషేక్ శర్మ మీద విశ్వాసంతో. అభిషేక్ శర్మ కిది రెండో స్టార్ సినిమా. ఇవి తప్పిస్తే గతంలో తీసిన ఐదు సినిమాలూ చిన్న సినిమాలు. 2018 లో జాన్ అబ్రహాంతో ‘పరమాణు- ది స్టోరీ ఆఫ్ పోఖ్రాన్’ అని భారత దేశం జరిపిన అణుపరీక్ష మీద తీశాడు. ఇది ఫర్వాలేదన్పించుకుంది. ఇప్పుడు రామాయణంలోని రామసేతు మీద భక్తి- యాక్షన్ థ్రిల్లర్ తీశాడు. మరి ఈ ప్రయత్నమెలా వుంది? ఇందులో భక్తిగానీ, యాక్షన్ గానీ అర్ధవంతంగా ఏమైనా వున్నాయా? ఇది తెలుసుకోవడానికి రామేశ్వరం వెళ్దాం...
రివ్యూలు, సాంకేతికాలు, స్క్రీన్ ప్లే సంగతులు...
టికెట్లు దొరకడం యోగం, సినిమాలు చూడడం భోగం, రివ్యూలు రాయడం రోగం!
Saturday, October 29, 2022
1238 : రివ్యూ!
రచన- దర్శకత్వం : అభిషేక్ శర్మ
తారాగణం : అక్షయ్ కుమార్, జాక్వెలిన్ ఫెర్నాండెజ్ , నుస్రత్ భరుచా,
సత్యదేవ్, నాజర్ తదితరులు
సంగీతం : డానియల్ బి.
జార్జ్, ఛాయాగ్రహణం : అసీమ్ మిశ్రా
బ్యానర్స్ : కేప్ ఆఫ్
గుడ్ ఫిల్మ్స్, మజాన్ ప్రైమ్, అబడాంటియాఎంటర్టయిన్మెంట్, లైకా ప్రొడక్షన్స్
నిర్మాతలు : అరుణా
భాటియా విక్రమ్ మల్హోత్రా
విడుదల : అక్టోబర్ 25, 2022
***
2017 లో నాస్తికుడైన డా. ఆర్యన్ కులశ్రేష్ఠ (అక్షయ్ కుమార్)
పాకిస్థానీ బృందంతో ఆఫ్ఘనిస్తాన్‌లోని బామియాన్ కి వెళ్తాడు. అక్కడ ఓ భారతీయ
రాజుకి చెందిన పురాతన నిధిని
తవ్వుతున్నప్పుడు తాలిబన్లు దాడి చేస్తారు. ఆర్యన్ ఆ నిధిని చేజిక్కించుకుని
తప్పించుకుంటాడు. ఇటు దేశంలో పుష్పక్ షిప్పింగ్ కంపెనీ యజమాని ఇంద్రకాంత్ (నాజర్)
తన సేతుసముద్రం ప్రాజెక్టులో భాగంగా రామసేతుని కూల్చివేయాలని భారత ప్రభుత్వాన్ని
అభ్యర్థిస్తాడు. దీని వల్ల ఇంధనం ఆదా అవుతుందని, భారత్-శ్రీలంక మధ్య ప్రయాణ సమయం తగ్గుతుందనీ
అభిప్రాయపడతాడు.
ఇది దేశంలో తీవ్ర ఆగ్రహానికి దారి తీస్తుంది. సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలవుతుంది.
ఇంద్రకాంత్‌తో చేతులు కలిపిన ప్రభుత్వం, ఆర్కియోలాజికల్ సొసైటీ ఆఫ్ ఇండియా (ఏఎస్ఐ)
సహాయం తీసుకుంటుంది. ఇప్పటికి ఆర్యన్ ఏఎస్ఐ జాయింట్ డైరెక్టర్ జనరల్‌గా పదోన్నతి
పొంది వుంటాడు. ఇతడి లాంటి నాస్తికుడే తమకు సహాయం చేయగలడని ప్రభుత్వం భావిస్తుంది.
రామసేతు సహజసిద్ధమైన కట్టడమని, మానవ నిర్మితం కాదని పేర్కొంటూ నివేదికని
సమర్పించాల్సిందిగా కోరుతుంది. అప్పుడు ఆర్యన్ సమర్పించిన నివేదిక రామాయణంపై కూడా
ప్రశ్న లేవనెత్తుతుంది. ఇది పెను వివాదానికి దారి తీస్తుంది. ఇంద్రకాంత్ కూడా ఆర్యన్
తో జతకట్టి రామసేతువు మానవ నిర్మితం కాదని ప్రపంచానికి నిరూపించమని కోరతాడు.
ఆర్యన్ రామేశ్వరం చేరుకుంటాడు. ప్రాజెక్ట్
మేనేజర్ బాలి (ప్రవేశ్ రాణా), పర్యావరణవేత్త డాక్టర్ సాండ్రా రెబెల్లో
(జాక్వెలిన్ ఫెర్నాండెజ్) ఆర్యన్ మిషన్‌లో సాయం చేయడానికి వస్తారు. వీళ్ళ
పరిశోధనల్లో రాముడు 7000 సంవత్సరాల క్రితం జన్మించాడని, రామసేతు
రాముడి పుట్టుక కంటే ముందే వుంధనీ పేర్కొంటారు. ఇక దీని పర్యవసానాలు ఎలా
ఎదుర్కొన్నాడన్నది, ఫలితంగా నాస్తికుడైన తను రామ సేతుని నిజంగా
రాముడే వానర సైన్యంతో నిర్మించినట్టు నమ్మే ఆస్తికుడుగా ఎలా మారాడన్నది మిగతా కథ.
ఒక నాస్తికుడైన ఆర్కియాలజిస్టు రాముడ్ని నమ్మే భక్తుడిగా ఎలా మారాడన్నది ఈ
కథ. స్పిరిచ్యువల్ థ్రిల్లర్ జానర్
కథ. బాబ్రీ మసీదు కింద రామాలయం లేదనడం ఎలాంటిదో, రామేశ్వరంలో రామసేతు లేదనడం అలాటిది.
సాక్షాత్తూ నాసా అలాటిదేమీ లేదని సాక్ష్యాలు చూపించినా మత విశ్వాసం ముందు అది
దిగదుడుపే. కాబట్టి నాస్తికుడైన ఆర్యన్ ఆస్తికుడుగా మారకపోతే ఈ సినిమా వుండదు, బాయ్
కాట్ అవుతుంది.
అయితే ఈ సినిమా తీసిన దర్శకుడి దార్శనికత ఎలాంటిదంటే అతనే
సెంటిమెంట్లకి పూర్తిగా కట్టుబడడు. ఆటో కాలు ఇటో కాలు వేసి కన్ఫ్యూజ్ చేస్తాడు.
రామేసేతుకథ కోసం రామేశ్వరంలో ఆ కాలు పెట్టకుండా, డామన్
డయ్యూలో పాదం మోపి ఇదే రామేశ్వరం అనుకోమంటాడు. రేపు వేటపాలెం చూపించి వారణాసి
అనుకో మంటాడేమో తెలీదు. రామేశ్వరం
వెళ్ళినా శనీశ్వరం వదలనట్టు, డామన్ వెళ్ళినా అట్టర్ ఫ్లాప్ తప్పలేదు. లొకేషన్
దగ్గరే స్పిరిచ్యువాలిటీ ఆవిరైపోయింది.
రామేశ్వరంని ఎవాయిడ్ చేసినట్టు, రామసేతుతో
సంబంధమున్న శ్రీలంకని కూడా ఎవాయిడ్ చేశాడు. శ్రీలంక బదులు గోవా చేరింది. శ్రీలంకలో
స్థిరపడ్డ జాక్వెలిన్ ఫెర్నాండెజ్ సాండ్రా రెబెల్లో పాత్ర, తను
గోవాకు చెందానని చెప్పుకుంటుంది. ఇలాటివి చాలా వున్నాయి. అసలు రామసేతు మీద సినిమా
తీస్తూ మొదటి అరగంట వేరే సినిమా చూపించే ‘భక్తి’ కూడా వుంది. ఈ అరగంట సేపు అక్షయ్ కుమార్
ఆర్కియాలజిస్టు పాత్ర పరిచయం పేరుతో ఇండియానా జోన్స్ లాగా చేసే వేరే సాహసకృత్యాలే వున్నాయి అసలు కథతో
సంబంధం లేకుండా.
సినిమా అంటే పాత్ర
పరిచయమేనా, కథ కాదా? బహుశా ‘కేజీఎఫ్’ తో ఇన్స్పైర్ అయి క్యారక్టర్ ఎలివేషన్స్ తో ఇలా నింపేద్దామనుకున్నాడు.
ఇది బెడిసి కొట్టింది. ‘కారికేయ2’ లో
కృష్ణుడు పురాణం కాదనీ, చరిత్ర అనీ వాదన తప్ప నిరూపణ లేని
సెంటిమెంట్ కి మోకరిల్లి ముగించినట్టే, ఇక్కడ రామ సేతు
విషయంలోనూ జరిగింది. రామ సేతు మానవ నిర్మితం కాదనీ, అది
లక్షల సంవత్సరాల క్రితం జరిగిన సహజ భౌగోళిక ప్రక్రియ అనీ,
చెప్పిన నాసా పరిశోధనని ఇంకోలా చెప్పి చరిత్రగా మార్చినట్టే,
ఇక్కడా మత విశ్వాసం ఆధారంగానే ముగించారు.
అయితే ఈ
భక్తి భావోద్వేగపు ముగింపుకి రావడానికి చేసుకొచ్చిన పరిస్థితుల కల్పనేమీ లేదు. దీంతో అక్షయ్ కుమార్ నాస్తిక పాత్ర రామభక్తుడయ్యే ఉద్వేగభరిత
సన్నివేశం నిర్జీవంగా
మిగిలింది. కృష్ణం రాజు నటించిన భక్త ‘కన్నప్ప’ లో
నాస్తికుడైన తిన్నడు శివ భక్తుడయ్యే కన్నప్పగా మారే క్రమానికో కథ వుంటుంది. ‘రామ్
సేతు’ దర్శకుడు కనీసం భక్తి సినిమాలైనా ఎలావుంటాయో
చూడకుండా, తనకు తెలిసిన గ్రాఫిక్స్ తో యాక్షన్ దృశ్యాలు
తీసేసినట్టుంది. రామ
సేతుని కనుగొనే యాక్షన్ దృశ్యాలకి చివర ఓ భక్తి దృశ్యం కలిపితే సినిమా అయిపోయింది.
ఎక్కడా కథకి ప్రధానమైన ఆధ్యాత్మిక భావ తరంగాలు కథని డ్రైవ్ చేయవు. ఈ గ్రాఫిక్స్
కూడా నాసి రకంగా, హాస్యాస్పద్సంగా వున్నాయి. సముద్రం, డైవింగ్
దళాలు, రామసేతు సెట్ కూడా ఆకర్షణీయంగా లేవు. రామసేతు
బయటపడుతోందంటే ప్రేక్షకుల వెంట్రుకలు నిక్కబొడుచుకుని కేకలు వేసే ఉద్విగ్న డ్రామా వుండాలి. ఇలాటి కమర్షియల్ చిత్రీకరణ కూడా లేదు.
స్పిరిచ్యువల్ జర్నీ అన్నాక ప్రేక్షకుల్ని బలంగా ఆ లోకంలోకి లాక్కెళ్ళే దర్శకత్వ
ప్రతిభ పూర్తిగా
లోపించింది.
అక్షయ్ కుమార్ పాత్ర బలహీనతలు నటనలో బయట పడతాయి. పాత్ర బలహీనం, కథ
కూడా బలహీనం కావడంతో తన హీమాన్ యాక్షన్ దృశ్యాలు బోరు కొట్టే స్థాయిలో వున్నాయి.
మాస్ ప్రేక్షకులు కూడా ఈలలు వేయలేరు. స్పిరిచ్యువల్ షేడ్స్ రివీలయ్యే సస్పెన్సు తో
కూడిన పాత్ర చిత్రణ అయివుంటే – అక్షయ్ అలా రూపొందించుకుని వుంటే ఈ సినిమా
బెటర్ గా వుండేది. స్టీవెన్ స్పీల్ బెర్గ్ తీసిన ఆర్కియాలజిస్టు ఇండియానా జోన్స్
సినిమాలు ప్రసిద్ధి చెందిన స్పిరిచ్యువల్ థ్రిల్లర్సే కదా?
అక్షయ్ కి తోడుండే యాక్షన్ పాత్రలో తెలుగు
నటుడు, ‘గాడ్ ఫాదర్’
ఫేమ్ సత్యదేవ్ కాస్త కామెడీ చేస్తూ
ఆకట్టుకుంటాడు. జాక్వెలిన్ ఫెర్నాండెజ్, నుస్రత్ భరూచాలు సహాయ పాత్రలుగా మిగిలిపోయారు.
విలన్ గా మాత్రం నాజర్ ఒక ఊపు ఊపాడు. చాలా విషాదకరమేమిటంటే, ఛాయాగ్రాకుడు
అసీమ్ మిశ్రా టాలెంట్ అంతా బూడిదలో పోసిన పన్నీరవడం. డానియల్ జార్జ్ నేపథ్య సంగీతం
భక్తిని
రెచ్చగొట్టదు. అంతా రామమయమని రాముడి లీలలు ప్రస్ఫుటమయ్యే - నేపథ్య సంగీతానికి తోడ్పడే చిత్రణలు చేయాలని
ముందసలు దర్శకుడు అభిషేక్ శర్మకి తెలియాలి.
మొత్తానికి రామసేతు చూద్దామని
రామేశ్వరం వెళ్తే డామన్ చేరుకుంటాం. అక్కడ డామన్ దెయ్యాలు కన్పిస్తాయి. కాశీకి పోయాను రామాహరీ అని
అక్కడ్నుంచి బయల్దేరాలి...
—సికిందర్