Q : ‘గరుడ గమన వృషభ వాహన’ సినిమా లో ఉపయోగించిన స్లో
మోషన్ షాట్స్ గురించి విశ్లేషణ ఇవ్వగలరా?
—జయసింహా, రచయిత
A : అది కన్నడలో నటుడు, దర్శకుడు రాజ్ బి శెట్టి
తీసిన గొప్ప గ్యాంగ్ స్టర్ సినిమా. సినిమాలో దృశ్య భాష (విజువల్ లాంగ్వేజ్) ని
కొత్త కోణంలో ఆవిష్కరించాడు. స్లోమో (స్లోమోషన్) షాట్స్ ని కథనంలో సబ్ టెక్స్ట్
(ఉపవచనం) చెప్పడానికి వాడుకున్నాడు. డైలాగుల్లో పాత్ర పైకి చెప్పే మాట వొకటి
వుంటుంది, చెప్పకుండా వదిలేసే అంతర్లీన భావం ఒకటుంటుంది. ఇదే
సబ్ టెక్స్ట్. దీన్ని కథనానికి దృశ్య భాషగా ఉపయోగించాడు. ఏమిటా దృశ్యభాష అంటే
కాలాన్ని చెప్పడం. అంటే ఇక్కడ వెండితెర మీద బొమ్మ మామూలుగా కదులుతున్నప్పుడు అది
కాలంతో పాటు వున్నట్టు. కదలికలు నెమ్మదించినప్పుడు, లేదా
నిలిచిపోయినప్పుడు, కాలవేగం తగ్గినట్టు లేదా ఆగినట్టు.
ఈ వయోలెంట్ గ్యాంగ్ స్టర్ కథలో పాత్రలకి కాలంతో బాటు పరిగెత్తకండి, పతనమైపోతారు, మీ దుర్మార్గాలు తగ్గించండి - లేకపోతే
కాలమే మిమ్మల్ని ఆపేస్తుందనీ చెప్పడం. కాలం ఆగడమంటే చావు అన్నమాట. ఈ సినిమా నిండా
స్లోమో తో బాటు, ఫ్రీజ్ షాట్స్ కూడా వున్నాయి. ఒక చావుని
చూపించే ముందు ఏ పాత్రయితే ఆ చావు గురించి చెబుతోందో, లేదా
తెలుసుకోబోతోందో, అప్పుడా పాత్ర మీద ఫ్రీజ్ షాట్ పడుతుంది. ఆ
షాట్ ఫోటోగ్రాఫ్ లా నిశ్చలంగా వుంటుంది. తిరిగి మోషన్లో కొస్తే, ఓ శవం రివీల్ అవుతుంది. కాలాన్ని ఆపి చెప్పడమంటే చావు గురించి చెప్పడ
మన్న మాట. ఫ్రీజ్ షాట్స్ ఇలా కథనం చేస్తూంటాయి. కథనాన్ని వినడమో, చూడడమో కంటే ఫీలవడంలో ఎక్కువ ఫీల్ వుంటుంది.
సినిమా ప్రారంభంలో శివ (రాజ్ బి
శెట్టి) పోలీస్ స్టేషన్ కొచ్చి మాట్లాడి వెళ్తున్నప్పుడు, స్లోమోలో వుంటాడు. సినిమాలో ఇదే మొదటి స్లోమో. ఎందుకీ స్లోమో వేశాడో
అర్ధం గాదు. సాధారణంగా కమర్షియల్ సినిమాల్లో హీరో ఒకడ్ని కొట్టి పడేశాక, కాలరేగరేసి స్లోమోలో స్టయిలుగా నటుడుచుకుంటూ పోతూ సిగరెట్ విసిరేస్తే, మాస్ మ్యూజిక్ తో బ్యాక్ గ్రౌండ్ లో ఉవ్వెత్తున మంటలు ఎగిసి పడతాయి. ఈ
స్లోమో హీరోయిజం కోసం.
కానీ పోలీస్ స్టేషన్లో శివకిలాటి
యాక్షన్ సీనేం లేదు. మరెందుకు స్లోమో? తర్వాత్తర్వాత కథనంలో
మరిన్ని స్లోమోలు వస్తూంటే అప్పుడర్ధమవుతుంది- స్లోమోలు కాలానికి సింబాలిజాలని. హింసతో
చెలరేగుతున్న పాత్రల్ని స్లోమోతో కాల వేగాన్ని తగ్గి స్తూ,
వెనక్కి లాగే ప్రయత్నమన్నమాట. హింసని వ్యతిరేకించాలని అంతర్లీన సందేశమన్న మాట!
గొప్ప క్రియేషన్.
Q : ఈ మధ్య యూట్యూబ్ లో ‘భలే
అమ్మాయిలు’ అనే పాత సినిమా చూసాను. ఎన్టీఆర్, సావిత్రి హీరో హీరోయిన్లు. కాని కధ అంతా నడిపించేది రేలంగి. ఎన్టీఆర్ తెర మీద కనిపించేది కూడ తక్కువే. ఇంకా
జగ్గయ్య ఎక్కువ కనపడతాడు. ఈ సినిమా
కి రేలంగినే హీరో అనాలా?
—బోనగిరి అప్పారావు, ఇంజనీర్
A : పాత
సినిమాలు కొన్ని ఇప్పుడు చూస్తే ఇలాగే అన్పిస్తాయి. ‘భలే అమ్మాయిలు’ (1957) టైటిల్ ప్రకారం సావిత్రి, గిరిజలు ఏమీ చేయకుండా, హీరోగా ఎన్టీఆర్ కూడా ఏమీ
చేయకుండా, వీళ్ళ కథ రేలంగి చక్కబెట్టుకు రావడం చూస్తే, రేలంగి కంటే ఎన్టీఆర్ పాత్ర నిడివి తక్కువ కావడం చూస్తే, ఆ రోజుల్లో సరిపోయింది. ఆ రోజుల్లో తెరమీద కదిలే బొమ్మల్ని చూడ్డమే మహా అద్భుతం.
ఆ అద్భుతం ముందు మిగిలినవి ప్రధానమే కాదు. పైగా మొత్తం 12 పాటలతో నింపేస్తే, ఎవరికెంత కథ పడింది, ఎవరెంత నిడివి నటించారు కొలతలు
ఎలా తెలుస్తాయి?
అప్పట్లో హైదరాబాద్ పబ్లిక్ గార్డెన్ లలిత కళా తోరణం ఓపెన్ ఏర్ థియేటర్లో శనివారం
పాత సినిమా వేసే వాళ్ళు. ఏమిటా అని వెళ్తే ‘అంతస్తులు’ (1965) వేస్తున్నారు. అక్కినేని, భానుమతి, కృష్ణకుమారి నటీనటులు. సూపర్ హిట్ పాటలు. కానీ ఇంటర్వెల్ కి కొంత ముందు
గమ్మత్తు జరిగింది. హఠాత్తుగా కథ మారిపోయింది. సస్పెన్సుతో నడుస్తున్న కథ ‘నిను వీడని నీడను నేనే’ హార్రర్ సాంగ్ తర్వాత
అక్కినేని, కృష్ణ కుమారిల కథ ఎటో వెళ్ళిపోయి- ఇంకేదో సినిమా
చూస్తున్నట్టు ‘దులపర
బుల్లోడా’ పాటతో భానుమతి స్టోరీ మొదలైపోయింది.
ఇలా కొన్ని పాత సినిమాలుంటాయి. వీటిని ఆనాటి నటీనటుల కోసం, పాటల
కోసం, ఆ కాలంలో మనుషులెలా వుండేవాళ్ళో తెలుసుకోవడం కోసం చూడాలే
తప్ప. విశ్లేషించ కూడదు. విశ్లేషించుకోవడానికి వేరే పాత సినిమాలు చాలా వుంటాయి.
Q : ‘టాప్
గన్’ చూసి ఏమైనా రాస్తారని ఎదురు చూస్తున్నాను.
—విధీర్, అసోషియేట్
A : ఏమర్ధమైందో చెప్తే రాద్దాం.
—సికిందర్