రివ్యూలు, సాంకేతికాలు, స్క్రీన్ ప్లే సంగతులు...

టికెట్లు దొరకడం యోగం, సినిమాలు చూడడం భోగం, రివ్యూలు రాయడం రోగం!

31, ఆగస్టు 2022, బుధవారం

1201 : స్పెషల్ ఆర్టికల్

 

సెప్టెంబర్ 9 న విడుదల కానున్న రణబీర్ కపూర్ బ్రహ్మాస్త్ర: శివ - పార్ట్ వన్ కూడా బాయ్ కాట్ బారిన పడింది. ఈ మధ్య విడుదలవుతున్న ఏ హిందీ సినిమానీ  వదలడం లేదు కొత్తగా పుట్టుకొచ్చిన బాయ్ కాట్ బృందాలు. ఇదంతా పథకం ప్రకారం జరుగుతోందనొచ్చు. సెక్యులర్ బాలీవుడ్ ని దెబ్బ తీయాలని. ఆ మాట కొస్తే ఏ సినిమా రంగమైనా సెక్యులర్ గానే వుంటుంది. లేకపోతే ఏనాటిదో షోలేలో ముస్లిం పాత్రని ఉదారవాదిగా చూపించారని ఇప్పుడెందుకు బాయ్ కాట్ అవుతుంది. ఈ బహిష్కరణ పిలుపులకి బాలీవుడ్ నోరెత్తకుండా మౌనంగా వుంటోంది. నోరెత్తితే వాళ్ళ సినిమాలు బాయ్ కాట్ లిస్టులో చేరిపోతున్నాయి. తాప్సీ, అనురాగ్ కశ్యప్ నోరెత్తారని వాళ్ళ దొబారా సినిమా బాయ్ కాట్ అయిపోయింది. లాల్ సింగ్ చద్దా బావుందని హృతిక్ రోషన్ అనేసరికి అతడి రానున్న విక్రమ్ వేద బాయ్ కాట్ అయిపోయింది.

       బాయ్ కాట్ ట్రెండ్ కి మౌనంగా వుండరాదని అర్జున్ కపూర్ నోరెత్తాడని అతడి రాబోయే కుత్తే బాయ్ కాట్ గండంలో పడింది. తాజాగా సునీల్ శెట్టి నోరు విప్పాడు. ఈయన కూడా కాచుకోవాలి. రాబోయే షారుఖ్ కాన్ పఠాన్ కూడా బాయ్ కాట్ అయింది. కారణం ఇతడి కొడుకు డ్రగ్ స్మగ్లర్ అని. కానీ ఆ కేసులో కొడుకుని ఇరికించారని తేలిపోయినా అబద్ధాలతో బాయ్ కాట్ అయిపోతోంది. బాయ్ కాట్ కి వ్యతిరేకంగా వున్నాడని ఆఖరికి మోడీ భక్తుడు అక్షయ్ కుమార్ రక్షాబంధన్ కి కూడా బాయ్ కాట్ వేటు పడింది. ఇక అమీర్ ఖాన్ లాల్ సింగ్ చద్దా సంగతి సరే!

ఇప్పుడు విడుదలకి సిద్ధమైన అత్యంత ఖరీదైన బ్రహ్మాస్త్ర వంతు వచ్చింది. ఇందులో హీరోయిన్ ఆలియా భట్ నటించిన డార్లింగ్స్ ఇటీవలే విడుదలయ్యింది. ఈ సందర్భంగా నేను నచ్చకపోతే నా సినిమా చూడకండి అనేసింది. దీంతో ఆమె నటించిన బ్రహ్మాస్త్ర బాయ్ కాట్ అయిపోయింది. ఈమెతో బాటు హీరో రణబీర్ కపూర్, దర్శకుడు అయాన్ కపూర్ పాత నేరాలు కూడా బాయ్ కాట్ కి కారణమయ్యాయి.  

ప్రతీ స్టార్ మీదా కన్నేసి, వాళ్ళ గతాన్ని తవ్వి తీసి బాయ్ కాట్ కి ఆయుధంలా వాడుకుంటున్నారు. అమీర్ ఖాన్ 2015 లో తన భార్య ఈ దేశంలో అభద్రత ఫీలవుతోందని చెప్పిన మాట పట్టుకుని ఇప్పుడు  లాల్ సింగ్ చద్దా ని బాయ్ కాట్ చేశారు. ఆ భార్య హిందువే. అలాగే పీకే లో హిందూ దేవుళ్ళని అవమానించాడని కూడా బాయ్ కాట్ చేశారు. పీకే నిర్మాత, దర్శకుడు, రచయిత హిందువులే.

ఇప్పుడు రణబీర్ కపూర్ పాత నేరం : తను బీఫ్ తింటానని ఏనాడో ఒక మాట చెప్పడం. దీంతో బ్రహ్మాస్త్ర బాయ్ కాట్ అయిపోయింది. రణబీర్ కపూర్ గురించి ఒక బ్లాగర్ పోస్ట్ చేసిన పాత వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఆ వీడియోలో సదరు బ్లాగర్, రణబీర్ కపూర్ లంచ్ చేస్తూంటారు. అప్పుడు రణబీర్ కపూర్ ఐయాం ఏ బిగ్ బీఫ్ గై (నేను పెద్ద బీఫ్ గాణ్ణి) అన్నాడు.

దీన్ని పట్టుకుని బాయ్ కాట్ బ్రహ్మాస్త్ర ట్రోలింగ్ మొదలెట్టారు. రణబీర్ కపూర్ బీఫ్ ఖాతా హై. యే  బ్రహ్మాస్త్ర కా హీరో హై. బాయ్ కాట్ బ్రహ్మాస్త్ర (రణబీర్ కపూర్ బీఫ్ తింటాడు. ఇతను బ్రహ్మాస్త్ర హీరో. బాయ్ కాట్ బ్రహ్మాస్త్ర) అని ట్రెండ్ అవుతోంది.  

అయాన్ ముఖర్జీ పాత నేరం : 2019 లో ఇంస్టాగ్రాంలో ఒక పోస్ట్. డ్రాగన్ బ్రహ్మాస్త్రంగా మారింది, రణబీర్ కపూర్ పాత్ర పొడవాటి శిరోజాలతో రూమీ (సూఫీ కవి జలాలుద్దీన్ రూమీ) లాగా వుంటుంది, శివుడు కాదు అని రాశాడు!

రూమీ! మొదట అతను రూమీ. పొడవాటి జుట్టుతో రూమీ. ఈ గెటప్ సినిమాకి సంబంధించిన ఫస్ట్ లుక్ టెస్ట్ నుంచి వచ్చింది. ప్రేమనేది మీకూ మీతో ప్రతిదానికీ మధ్య వారధిలాంటిదని అన్నాడు రూమీ. ఈ ఫీలింగునే ఆధారంగా చేసుకుని రణబీర్ కపూర్ పాత్రని తీర్చిదిద్దాం. కానీ ఆ తర్వాత కొత్త ప్రేరణ, కొత్త ఆలోచనలు వచ్చాయి... డ్రాగన్ ని బ్రహ్మాస్త్రంగా మార్చి రణబీర్ పాత్రకి అందించాం. రణబీర్ గెటప్ మార్చాం. దాంతో రూమీ శివుడు అయ్యాడు అని ఇంస్టాలో పోస్ట్ చేశాడు ముఖర్జీ. నేరకపోయి ఇరుక్కోవడమంటే ఇదే!

ఆమె తను నచ్చకపోతే తన  సినిమా చూడకండి అంటుంది, ఆయన బీఫ్ తింటానంటాడు, ఈయన డ్రాగన్ ని బ్రహ్మాస్త్రంగా మార్చి, రూమీని శివుడు చేశానంటాడు!

ఇన్ని నేరాలు చేశాక ఇక సినిమా వుంటుందా? ఒక నెటిజన్ ట్విట్టర్ లో గొడ్డు మాంసం వ్యక్తిని బహిష్కరించాలన్నాడు. మరికొందరు సినిమాని బహిష్కరించడం సబబు కాదని వాదిస్తూ మద్దతుగా ట్వీట్ చేశారు. అతనేం తింటాడో అతనిష్టం - అన్నారు. కనీసం మన చరిత్రపై సినిమా తీయడానికి ఏదో ఒకటి చేస్తున్నాడు కదా అని ఇంకో నెటిజన్  అయాన్ ముఖర్జీని ఓదార్చాడు.

ఇంకో నెటిజన్ ఇలా ట్వీట్ చేశాడు- బ్రిటిష్ పౌరురాలు అలియా భట్ హిందూ వ్యతిరేక, భారతదేశ వ్యతిరేక వ్యక్తుల కుటుంబం నుంచి వచ్చింది. తండ్రి మహేష్ భట్ బాహాటంగా హిందూ వ్యతిరేకి. 26/11 టెర్రర్ దాడి ఆరెస్సెస్ కుట్ర అని అతను పేర్కొన్నాడు. అతడి సోదరుడు రాహుల్ భట్ కి ఈ టెర్రర్ దాడి నిందితుల్లో ఒకడైన డేవిడ్ హెడ్లీతో సంబంధాలున్నాయి

పాత నేరాలకి క్షమాపణలు చెప్పినా వదలడం లేదు. అమీర్ ఖాన్ క్షమాపణ చెప్పినా వదల్లేదు. ఇప్పుడు విజయ్ దేవరకొండనీ వదలడం లేదు. శుభమా అని పానిండియాలో పాదం మోపుతూ విజయ్ తనకి సంబంధం లేని బాయ్ కాట్ ట్రెండ్ లో తలదూర్చి ఎడాపెడా కామెంట్లు చేశాడు. తనూ బాయ్ కాట్ అయిపోయాడు.

దీంతో ముంబాయిలో ఒక థియేటర్ ఓనర్ విజయ్ మీద విరుచుకుపడ్డాడు. విజయ్ వల్ల లైగర్ షోలకి థియేటర్ ఖాళీగా వుంటోందని. వెంటనే విజయ్ ముంబాయి వెళ్ళి ఓనర్ కి పాదాభివందనం చేసి మరీ క్షమాపణలు చెప్పాడు. కానీ అసలతను అలాటి సినిమాలో నటించినందుకు ప్రేక్షకులకి క్షమాపణలు చెప్పాలి. లైగర్ బాయ్ కాట్ అయినా, కాక పోయినా ఫ్లాపయ్యేదే.

ఈ బాయ్ కాట్ మేనియా ఇంకెంత కాలం సాగుతుందో తెలీదు. దీన్ని ఎదుర్కొంటూ కనీసం హీరోల ఫ్యాన్స్ కూడా రంగంలోకి దిగడం లేదు. ప్రస్తుతం బాలీవుడ్ జీవులు నోరు విప్పకుండా తమ పని తాము చేసుకుపోవడమే మంచిదేమో. అలాగే ఏవో చేసి అవి పాతనేరాలుగా రికార్డు అవకుండా చూసుకోవడం మంచిది.
***