మారుతి దర్శకత్వంలో గోపీచంద్
నటించిన ‘పక్కా కమర్షియల్’ ఈ వారం
విడుదల. రాశీఖన్నా హీరోయిన్. రావు రమేష్, సత్య రాజ్, సప్తగిరి, ప్రవీణ్ తదితరులు ఇతర తారాగణం. గోపీచంద్ ది
లాయర్ పాత్ర. జడ్జి అయిన అతడి తండ్రి సత్యరాజ్ చెప్పిన ఒక తీర్పువల్ల, బాధితురాలు ఆత్మహత్య చేసుకోవడంతో బాధపడి జడ్జి పదవికి రాజీనామా చేసేస్తాడు.
గోపీచంద్ తండ్రి విలువలకి పూర్తిగా వ్యతిరేకం. డబ్బే ప్రధానంగా వుంటాడు. అతడి దగ్గర
ఒక సీరియల్ నటి రాశీ ఖన్నా అసిస్టెంట్ గా చేరుతుంది. సీరియల్ లో లాయర్ పాత్ర నటించాలి
గనుక లాయర్ల గురించి తెలుసుకోవాలని గోపేచంద్ దగ్గర చేరుతుంది. ఇద్దరూ ప్రేమలో పడతారు.
ఇంతలో ఒక కేసు చేపడతాడు గోపీచంద్. ఈ కేసుని వాదించి నెగ్గడమే మిగతా కథ.
గోపీచంద్, రాశీ ఖన్నాల స్టయిలిష్ అప్పీయరెన్స్ బావుంది. సాంకేతికంగా దృశ్యాలూ
బావున్నాయి. ఈ రెండు తప్ప మిగిలినవి షరామామూలే. పక్కాగా కథ లేదు, అది కమర్షియల్ గానూ లేదు. అసలే ఇప్పుడు పనికిరాని పాత కాలం నాటి కథ. దీనికి
అర్ధరహిత కథనం. కాన్ఫ్లిక్ట్ అనుకున్నది కాన్ఫ్లిక్ట్
కి సరిపోని విషయం. ఫస్టాఫ్ గోపీ చంద్- రాశీ ఖన్నాల రోమాంటిక్ కామెడీ. ఇందులో రోమాన్సు, కామెడీ చీప్ గా వున్నాయి. కామెడీ నవ్వే పుట్టించదు. ఇంటర్వెల్ నుంచి కథ మొదలైతే
సెకండాఫ్ లో కాన్ఫ్లిక్ట్ సరిగా లేని కారణంగా కథ అనే పదార్ధం కనపడకుండా పోయింది. ముగింపు
కాస్త నిలబడినా ఈ ముగింపు కోసం సినిమా అంతా భరించే ఓపిక వుండాలి. ఈ సినిమాతో మారుతీ
ప్రతిభ ప్రశ్నార్ధకంగా మారింది.
‘యాక్టర్ ఇన్లా’ (2016) అనే పాకిస్తానీ కామెడీ వుంది. ఇందులో నాటకాలేసే హీరో తండ్రి
ఓంపురి లాయర్. నాటకంలోంచి హీరోని వెళ్ళగొడితే, ఓంపురి వూళ్ళో లేని సమయంలో లాయర్ గా నటిస్తూ ఓ కేసు చేపట్టి నానా హంగామా చేస్తాడు
హీరో. మరిన్ని కేసులు చేపట్టి మరింత హంగామా చేస్తాడు. సామాజిక సమస్యల్ని పరిష్కరించి
పారేస్తూంటాడు నకిలీ లాయర్ గా. ఇది పూర్తిగా సోషియో కామెడీ. పెద్ద హిట్టయ్యింది. కోటి
రూపాయల బడ్జెట్ కి 30 కోట్ల బాక్సాఫీసు. సినిమా కథకి మార్కెట్ ఐడియాని పట్టుకోవడం
దగ్గరే వుంటుంది అంతా.
ఇంకా ఈవారం మరో 7 విడుదలయ్యాయి. గత వారం
8 విడుదలయ్యాయి. ఏ భాషలోనూ ఇన్నేసి సినిమాలు విడుదలకావడం లేదు తెలుగులో తప్ప. ఈ 7 లో
మాధవన్ నటించిన ‘రాకెట్రీ’ బయోపిక్ ప్రధానమైనది.
ఇది తమిళ డబ్బింగ్. ఇంకో తమిళ డబ్బింగ్ అరుణ్ విజయ్ నటించిన ‘ఏనుగు’ యాక్షన్ మూవీ. ఇక షికారు, బాల్రాజు, టెన్త్ క్లాస్ డైరీస్, ఏమైపోతానో, ఈవిల్ లైఫ్... ఇవి టాలీవుడ్ లో వివిధ 32 క్రాఫ్ట్స్
కి- కార్మికులకి ఆదాయాన్ని సమకూర్చడం తప్ప ఇంకేమీ ఆశించని రెగ్యులర్ తెలుగు చిన్నారి సినిమాలు.
—సికిందర్