రివ్యూలు, సాంకేతికాలు, స్క్రీన్ ప్లే సంగతులు...

టికెట్లు దొరకడం యోగం, సినిమాలు చూడడం భోగం, రివ్యూలు రాయడం రోగం!

Tuesday, June 28, 2022

1178 : స్క్రీన్ ప్లే సంగతులు -3

    క్రిందటి వ్యాసం (1173) లో చూసిన డ్యూయెల్ మూవీ స్క్రీన్ ప్లే బిగినింగ్ విభాగంలో కొట్టొచ్చినట్టుండే ఇంకో బ్యూటీ ఏమిటంటే, ఈ బిగినింగ్ విభాగమంతా 15 నిమిషాల సేపూ బీజీఎం వుండదు. ఇది గమనించాలి. గమనించడమే కాదు, అనుభూతించాలి. ఆ రెండు వాహనాల శబ్దం తప్ప బిగినింగ్ విభాగంలో సంగీత దర్శకుడికి పనిలేదు. బీజీఎం ఈ కథ ఫస్ట్ యాక్ట్ బిజినెస్ ఆస్వాదనకి అవాంతరం. నిశ్శబ్దం ఈ  సాంప్రదాయేతర సినిమా కథలోకి మనల్ని తీసికెళ్ళి పరిచయం చేసే పరికరం. మన దృష్టిని మళ్ళించే  ఏ విధమైన సినిమాటిక్ వ్యాపకాలు ప్రదర్శించకుండా, కేవలం ఆ రెండు వాహనాల వ్యవహార సరళి మనకి జీర్ణమయ్యేలా చేసే సృజనాత్మక ప్రక్రియ. పాతికేళ్ళకే స్పీల్బెర్గ్ కిన్ని తెలివితేటలేంటో అర్ధంగాదు. పాతికేళ్ళకి మనకి సినిమాలు చూడ్డమే సరిగా రాదు. శబ్దం కంటే బొమ్మ (ఇమేజి) మనసులో బలంగా నాటుకుంటుంది. సినిమాల పరంగా ఇప్పుడు మారుతున్న ధోరణిలో తెలుగు ప్రేక్షకులకి ఈ అనుభవాన్ని- ఉత్తమాభిరుచినీ అలవాటు చేయాల్సిన అవసరముందేమో ఆలోచించాలి.

     స్క్రీన్ ప్లే మిడిల్ కూడా ప్రారంభమయిన 10 నిమిషాలకి గానీ బీజీఎం ప్రారంభం కాదు. అంటే మొత్తం కలిపి 25 నిమిషాల సేపూ సంగీత దర్శకుడు బిల్లీ గోల్డెన్ బెర్గ్ జోక్యం చేసుకోడన్న మాట. ఆ తర్వాత నుంచి పెట్రేగిపోయే టెర్రర్ హార్రర్ థ్రిల్లర్ లతో కూడిన మిడిల్ విభాగపు సంఘర్షణాత్మక బిజినెస్ ని బీజీఎంతో  పైకెత్తుతాడు. మిడిల్ విభాగపు బిజినెస్ = సమస్యతో సంఘర్షణ. ఇక్కడ సమస్య వచ్చేసి అదృశ్య ప్రత్యర్ధి అయిన ట్యాంకర్ డ్రైవర్ అయినపుడు, వాడి మీద గెలుపు కోసం ప్రధాన పాత్ర డేవిడ్ మన్ సంఘర్షణ.

   అలాగే గత వ్యాసంలో బిగినింగ్ విభాగం ముగిసే ప్లాట్ పాయింట్ వన్ దగ్గర ఏర్పడ్డ సమస్యని సాధించడం ప్రధాన పాత్ర గోల్ అయినపుడు, ఈ గోల్ కోసం పాల్పడే సంఘర్షణ బలిష్టంగా వుండడానికి వుండాల్సిన గోల్ ఎలిమెంట్స్ నాల్గు :  కోరిక, పణం, పరిణామాల హెచ్చరిక, ఎమోషన్. 

    ప్రస్తుతం ఏర్పడ్డ సమస్యలో డేవిడ్ మన్ కోరిక వచ్చేసి ఎలాగైనా బిజినెస్ మీటింగ్ కి చేరుకోవడం. ఈ కోరికకి పణంగా పెడుతున్నది తన ప్రాణాలని, కుటుంబ భవిష్యత్తుని. ఈ పణానికి పరిణామాల హెచ్చరికగా వున్నది బలహీన పడుతున్న రేడియేటర్ పైప్. ఈ మూడిటి కలయికతో ఏర్పడుతున్నది బలమైన ఎమోషన్.

   మిడిల్ విభాగంలో బిగువైన కథనం సాగడానికి ఈ నాల్గు గోల్ ఎలిమెంట్స్ కి బీజాలు బిగినింగ్ విభాగంలోనే పడ్డాయి- బిజినెస్ మీటింగ్ కి బయల్దేరడం, పెట్రోల్ బంకులో ఫోన్ మాట్లాడుతున్నప్పుడు భార్యా ఇద్దరు పిల్లలు పరిచయవడం, బంకు వర్కర్ రేడియేటర్ పైపు మార్చాలనడం, ఈ మూడిటి ఉత్పాదనగా ఎమోషన్.

   ఇప్పుడు మిడిల్ కథనం చూద్దాం. మిడిల్ కథనమంటే పై నాల్గు గోల్ ఎలిమెంట్స్ ని అందిపుచ్చుకుని, ప్రధాన పాత్రకీ, ప్రత్యర్ధి పాత్రకీ మధ్య యాక్షన్ - రియాక్షన్ల పరంపరతో కూడిన సంఘర్షణ. దీన్ని స్ట్రక్చర్ అంటారు.

    ఇప్పుడు అసలు విషయమేమిటంటే, ఈ మూవీ స్క్రీన్ ప్లేని 6 యాక్ట్స్ లో రాశారు. నాటకాలకి వుండే విధంగా. నాటకాల్ని 8 యాక్ట్స్ లో కూడా రాస్తారు. ఏమీ కన్ఫ్యూజ్ అవాల్సిన అవసరం లేదు. సినిమాలకి 3 యాక్ట్స్ లోనే సింపుల్ గా స్క్రీన్ ప్లే వుంటుంది. నాటకాల్లో వుండే 6, 8 యాక్ట్స్ నే  సౌలభ్యం కోసం సినిమాలకి 3 యాక్ట్స్ కింద సర్దేశారు.   

    నాటకాలకైనా సినిమాలకైనా చిన్న కథకైనా వుండేవి మూడే విభాగాలు : ఒక ప్రారంభం (బిగినింగ్), ఒక మధ్యమం (మిడిల్), ఒక ముగింపు (ఎండ్). నాటకాల్లో వీటిని 6, 8 విభాగాలు చేస్తారు. 6 విభాగాలైతే దీన్ని బిగినింగ్ 2, మిడిల్ 2, ఎండ్ 2 భాగాలుగా విడదీస్తారు. 8 విభాగాలైతే బిగినింగ్ 2, మిడిల్ 4, ఎండ్ 2 భాగాలుగా విడదీస్తారు. అప్పుడివి 6, లేదా 8 యాక్ట్స్ అవుతాయి. ఇలా చేయడానికి కారణం నాటకాల్లో దృశ్యం మారినప్పుడల్లా తెర దించి, కొత్త దృశ్యం సెట్ అమర్చుకోవాలి కాబట్టి.

   సినిమాలకి ఈ అవసరం లేదు గనుక, ఎత్తిన తెర సినిమా ముగిసేదాకా దిగదు గనుక, అసలీ రోజుల్లో వెండి తెరని కప్పే ముచ్చటగొలిపే రంగుల రంగుల బల్బులు వెలిగే తెరలే లేవు గనుక, స్క్రీన్ ప్లేకి 3 యాక్ట్స్ సరిపోతాయి. కానీ డ్యూయెల్ ని 6 యాక్ట్స్ చేశారు. ఉన్న బిగినింగ్ ని 2 యాక్ట్స్, మిడిల్ 2 యాక్ట్స్, ఎండ్ 2 యాక్ట్స్ కింద విడగొట్టారు. ఇది రెండు వాహనాల నాన్ స్టాప్ యాక్షన్ ప్లే. బోలెడు మూవ్ మెంట్స్ వుంటాయి కథనంగా. అందుకని షూటింగ్ సౌలభ్యం కోసం చిన్న చిన్న సిక్స్ యాక్ట్స్ గా చేసి వుంటారు.   

ఇక మిడిల్  కథనం

  పెట్రోల్ బంకు నుంచి బయల్దేరిన డేవిడ్ మన్ నిదానంగా 40 మీద కారు డ్రైవ్ చేసుకు పోతూంటాడు. ఇంతలో అకస్మాత్తుగా వెనుకనుంచి ఖడ్గ మృగంలా ట్యాంకర్ ని దౌడు తీయిస్తూ వచ్చేస్తాడు సైకో ట్యాంకర్ డ్రైవర్. డేవిడ్ కి ఇప్పటికీ అర్ధంగాదు ట్యాంకర్ డ్రైవర్ తనని చావుబ్రతుకులాటలోకి లాగుతున్నాడని. క్యాజువల్ గా చెయ్యూపి సైడిస్తాడు. ట్యాంకర్ ముందు కెళ్ళి పోతుంది. ముందుకెళ్ళిపోయి అదే స్పీడుతో వెళ్ళకుండా డెడ్ స్లో చేసి, రోడ్డుని బ్లాక్ చేస్తూ డేవిడ్ ని ఇబ్బంది పెడుతూంటాడు పగబట్టిన సైకో ట్యాంకర్ డ్రైవర్.

    మనకి తెలియకుండా మన వెనుక మన మీద పగ బట్టేస్తూంటారు కొందరు. వాళ్ళకేం హాని చేసి వుండం. కానీ ఇంకెక్కడో తెలిసో తెలియకో ఏదో కీడు చేసి దాని తాలూకు నెగెటివ్ వైబ్రేషన్ (కర్మఫలం) ని మోస్తూంటాం. ఆ నెగెటివ్ వైబ్రేషన్ ని తొలగించుకోవాలని పాజిటివ్ వైబ్రేషన్ (అంతరాత్మ) మనకి తెలియకుండానే రంగంలోకి దిగుతుంది. ఏం జరిగినా మంచికే జరుగుతుందనేది ఇందుకే.

    అదిలా ఎవరో ముక్కూ మొహం తెలీని ట్యాంకర్ డ్రైవర్ రూపంలో కళ్ళముందు ఇలా తారట్లాడినా గుర్తించం. కారణం లేకుండా ఏదీ జరగదు. ఈ ట్యాంకర్ డ్రైవర్ డేవిడ్ లో పొగుబడిన నెగెటివ్ వైబ్రేషన్ ని తొలగించడానికి ప్రత్యర్ధి రూపంలో విచ్చేసిన పాజిటివ్ వైబ్రేషన్ (అంతరాత్మ) అన్నమాట. అంతరాత్మ- సబ్ కాన్షస్ అనేది విశ్వమంతా పరచుకుని వుంది.

    స్క్రీన్ ప్లే అంటేనే మనిషి మానసిక లోకాన్ని ప్రదర్శించేదని మరోసారి గుర్తు చేసుకుందాం. మనిషి మనసులో నిత్యం జరిగే సబ్ కాన్షస్ మైండ్ తో కాన్షస్ మైండ్ సంఘర్షణ. సబ్ కాన్షస్ మైండ్ (అంతరాత్మ) స్క్రీన్ ప్లేలో సమస్య లేదా ప్రత్యర్ధి పాత్ర రూపంలో వుంటుంది. కాన్షస్ మైండ్ ని పాలించే ఇగో రూపంలో వుండే ప్రధాన పాత్ర దీంతో సంఘర్షిస్తూ/మధిస్తూ వుంటుంది. ఇక్కడ డేవిడ్ మన్ కాన్షస్ ఇగో అయితే, ట్యాంకర్ డ్రైవర్ సబ్ కాన్షస్ మైండ్ అన్నమాట. ఈ సంఘర్షణలో చివరికి నిజానిజాలు తెలుసుకున్న ఇగో, మెచ్యూర్డ్ ఇగోగా మారడమే మంచి కథా లక్షణం. ఇలా వచ్చిన సినిమా ఎక్కువ కాలం మన్నుతుంది.

   ఇలా మొదలైంది ఇద్దరి మధ్య ఆట. ఒకచోట సైడ్ ఇచ్చాడని డేవిడ్ ఓవర్ టేక్ చేస్తూంటే ఎదురుగా కారు వచ్చేస్తుంది. కొద్దిలో ఆ ప్రమాదాన్ని తప్పిస్తాడు డేవిడ్. కావాలని ఈ ప్రమాదాన్ని సైకో ట్యాంకర్ డ్రైవర్ కల్పించినట్టు. తిరిగి ట్యాంకర్ వెనకే నత్తనడకన పోనిస్తాడు డేవిడ్. ఇహ ఇలా కాదని, కారుని రోడ్డు దింపేసి మట్టి రోడ్డులో శరవేగంగా ముందుకు దూకించి - లూప్ లైన్లో లాగా ట్యాంకర్ ని దాటేసి హైవే మీది కొచ్చేస్తాడు. బాగైంది రాస్కెల్ కి అన్నట్టు పట్టరాని ఆనందాన్ని అనుభవిస్తాడు. వెనుక ట్యాంకర్ స్పీడు తగ్గుతుంది.

    ఇప్పుడు 60 మీద పోనిస్తూంటాడు డేవిడ్. కార్లో రేడియో ఆన్ చేస్తాడు. ఏదో ప్రోగ్రాం వస్తూంటుంది. సైకో ట్యాంకర్ డ్రైవర్ డేవిడ్ కారుని ఫాలో అవుతూంటాడు. అకస్మాత్తుగా స్పీడు పెంచేసి కారుకి దగ్గరగా భూతంలా వచ్చేసి గుండెలదిరేలా హారన్ కొడతాడు. ఈ ట్యాంకర్ హారన్ కూడా రైలు కూతలా చెవులు పగులగొట్టేస్తుంది. ఏడ్చాడెదవని డేవిడ్ సైడ్ ఇవ్వకుండా 70 మీద లాగిస్తాడు. సైకో ఫాలోవర్ సైడ్ ఇవ్వని డేవిడ్ కారుని వెనుక నుంచి డాష్ ఇవ్వడం మొదలెడతాడు. ఉండుండి రెండు సార్లు డాష్ ఇచ్చేసరికి, ఇక్కడ్నుంచీ ఇప్పుడు బీజీఎం మొదలవుతుంది...

   బిజీఎం ఇక్కడ్నుంచే మొదలవడానికి కారణం? ఇక్కడే డేవిడ్ కి జ్ఞానోదయమైంది. ఈ ట్యాంకర్ డ్రైవర్ ఉద్దేశపూర్వకంగా ఇదంతా చేస్తున్నాడని ఇప్పుడర్ధమైంది. వీడితో తను ప్రమాదంలో వున్నాడని ఇప్పుడు తెలిసింది. ఇక స్పీడు 100 కి పెంచేస్తాడు. ఇక ఇప్పటివరకూ ఏకపక్షంగా వున్న ఆట ద్వైపాక్షికంగా మారుతుంది. తెలివిలోకొచ్చిన డేవిడ్ తో సైకో డ్రైవర్ కి రియాక్షన్ మొదలు. సైకో డ్రైవర్ వదలకుండా ఛేజ్ చేయడం మొదలెడతాడు. డేవిడ్ కారు ఒక చోట కంట్రోలు తప్పి రోడ్డు దిగి గ్రౌండ్ లోకి దూసుకుపోతుంది.

   ఆ గ్రౌండ్ లో కార్లు నిలిపి వుంటాయి. వాటిని తప్పిస్తూ ఎలాగో కంట్రోల్ చేసుకుని మూలకి పోనిచ్చి బ్రేకేస్తాడు. ఇది రెస్టారెంట్ వున్న గ్రౌండ్ (1971 లో ఈ సినిమా తీసినప్పుడున్న ఈ రెస్టారెంట్ చక్స్ కేఫ్ ఇప్పటికీ వుందని సమాచారం. కాలిఫోర్నియా రాష్ట్రం శాంటా క్లారిటాలోని సియెరా హైవే మీద. వెళ్ళి చూసివస్తే చూసి రావచ్చు. అక్కడే ఇది రాసుకుంటూ కూర్చోవచ్చు కూడా బీరు మగ్గుతో. సైకో డ్రైవర్ తిరిగొస్తే తిరిగొస్తామో లేదో చెప్పలేని సంగతి. వాడు కాగితాలు లాక్కుని చంపినా చంపుతాడు).

క్రిస్టఫర్ నోలన్ నోట్స్

ట్యాంకర్ డ్రైవర్ గా స్టంట్ డైరెక్టర్
విలియం కేరీ లాఫ్టిన్

    ఇప్పుడు మూవీ పూర్తిగా రిలాక్స్ అయిపోతుంది. 25 నిమిషాల ఎడతెగని రోడ్ యాక్షన్ తర్వాత ప్రశాంతత. కారు దిగిన డేవిడ్ మన్ నడుం పట్టేసి, మెడ పట్టేసి దిగాలుగా నడుచుకుంటూ రెస్టారెంట్ వాష్ రూమ్ లో కెళ్ళి ఫ్రెష్ అవుతాడు. రెస్టారెంట్లో ఈ సీను పూర్తిగా 15 నిమిషాలుంటుంది. వాష్ రూమ్ నుంచి డైనింగ్ హాల్లో కొస్తాడు. జ్యూక్ బాక్స్ లో సన్నగా మ్యూజిక్ వస్తూంటుంది. లోగొంతుకతో కస్టమర్స్ మాటలు విన్పిస్తూ వుంటాయి. కౌంటర్ ముందు స్టూళ్ళ మీద కౌబాయ్స్ లా హేట్లు పెట్టుకున్న ఐదారుగురు కూర్చుని బీర్లు, ఫుడ్ తీసుకుంటూ వుంటారు.

   దూరంగా వాళ్ళ వెనుక బూత్ లో కూర్చుంటాడు డేవిడ్. కూర్చునే ముందు కిటికీ అద్దంలోంచి గ్రౌండ్ లోకి చూసి షాకు తింటాడు. వేట కోసం పొంచి వున్న పులిలా అప్పుడే వచ్చి నిలబడి వుంటుంది గ్రౌండ్ లో ట్యాంకర్.

   బెదిరిపోయి ఇటు చూస్తాడు. కౌంటర్ దగ్గర అటు తిరిగి కూర్చున్న ఐదుగురిలో వున్నాడన్న మాట సైకో డ్రైవర్. సీటులో కూలబడి తలపట్టుకుంటాడు డేవిడ్. ఆ కూర్చున్న వాళ్ళల్లో ఒకడు ఇటు తిరిగి డేవిడ్ నే చూస్తాడు. తల తిప్పుకుంటాడు. ఇంకోడు కూడా డేవిడ్ నే చూసి తల తిప్పుకుంటాడు. వీళ్ళిద్దర్లో ఎవరు సైకో డ్రైవరో తెలీడం లేదు డేవిడ్ కి.

    ధడాలున ఏదో పడేసరికి అదిరిపడి ఇటు చూస్తాడు. అప్పుడే వచ్చిన వెయిట్రెస్ చేతికేదో తగిలి టేబుల్ మీద పడిందన్నమాట. ఆమెకి ఫుడ్డు, బీరు ఆర్డరిస్తాడు. అవి సేవిస్తూ వాళ్ళ వైపే చూస్తూంటే ఒకడి జీన్స్ వేసుకున్న బూటు కాళ్ళు కనపడతాయి. పెట్రోలు బంకుదగ్గర ఇదే చూశాడు. ఐతే వీడే సైకో డ్రైవరన్నమాట.

   తాగిన మత్తులో  లేచి వెళ్ళి వాడితో ఏదేదో మాట్లాడతాడు డేవిడ్. మనం మాట్లాడుకుని మ్యాటర్ సెటిల్ చేసుకుందామా? లేకపోతే పోలీసుల్ని పిలవనా?’ అని ఏదేదో అనేసరికి అతను లేచి డేవిడ్ పటా పటా కొట్టడం మొదలెడతాడు. ఓనర్ అడ్డుకుని కాపాడతాడు. కిందపడి మూల్గుతూంటాడు డేవిడ్. అతను బయటి కెళ్ళిపోతాడు. డేవిడ్ అటే చూస్తూంటే ట్యాంకర్ అటు పక్కనుంచి పికప్ ట్రక్కు ఇటొచ్చి వెళ్ళి పోతూంటుంది. డేవిడ్ ని కొట్టినతను అది డ్రైవ్ చేసుకుంటూ వెళ్ళిపోతాడు. తను పొరబడ్డాడని ఇప్పుడర్ధమవుతుంది డేవిడ్ కి.

   ఇంకో బూటు కాళ్ళతన్ని చూస్తాడు డేవిడ్. ఇంతలో బయట ట్యాంకర్ స్టార్ట్ అయి వెళ్ళి పోతూంటుంది. అదిరిపడి ఆ ట్యాంకర్ వెనకాల శక్తి కొద్దీ వురుకుతాడు డేవిడ్. సైకో డ్రైవర్ అందడు. వురకలేక ఆయాసంతో ఆగిపోతాడు డేవిడ్.  

   ఈ సీనులో క్రిస్టఫర్ నోలన్ చెప్పే విజువల్ సస్పెన్స్ వుంది, హీరో తపన వుంది, ప్రేక్షకులు ఒకటనుకుంటే ఇంకోటి జరగడం వుంది, కౌబాయ్ టైపు క్యారక్టర్ లుక్స్ తో జానర్ జెర్క్ -మిక్స్ వుంది, ఎమోషనల్ అప్పీల్ కూడా వుంది, సాధారణ ప్రపంచంలో అసాధారణ పాత్ర (సైకో డ్రైవర్) వుంది... 15 నిమిషాల ఒకే సీనైనా ఉత్కంఠ భరితంగా వుంది. ఇది ఛాలెంజి. కిల్ బిల్ లో క్వెంటిన్ టరాంటినో 10 నిమిషాలసేపు సాగే సీన్లు పెట్టాడు సీన్ల చివర్లో బ్యాంగ్స్ తో. ఇలాటి ప్రయోగాలు తెలుగులో కూడా చూడడానికి తెలుగు ప్రేక్షకులు అప్డేట్ అవాల్సిన అవసరముంది.

మరింత మిడిల్

ఇక్కడ్నుంచి మిగిలిన మిడిల్లో యాక్షన్ తీవ్రత పెరుగుతుంది. ఎందుకంటే ఇక్కడ్నుంచి క్లయిమాక్స్ అనే శిఖరానికి కథనాన్ని దౌడు తీయిస్తే తప్ప పైకి ఆ శిఖర మెక్కదు. దీనికి ముందు మనం చూసిన మిడిల్లో యాక్షన్ కాజ్ అండ్ ఎఫెక్ట్ ఆధారంగా అంచెలంచెలుగా వేడెక్కింది. అంతేగానీ ఒకేసారి 100 స్పీడుతో దూసుకెళ్ళలేదు. కథన వేగానికి కారు స్పీడో మీటర్ ని సూచికగా పెట్టుకున్నారు. సమస్య పెరిగే కొద్దీ డేవిడ్ కారు వేగాన్ని 40, 60, 70, 100... ఇలా పెంచుతూ టెన్షన్ ని పెంచుకుంటూ పోయారు.

   ఇప్పుడు మిగిలిన ఈ మిడిల్లో 4 సంఘటనలు జరుగుతాయి. దారిలో ఆగిపోయిన స్కూల్ బస్సుని డేవిడ్ కారుతో పుష్ చేస్తూంటే వెనుకనుంచి ట్యాంకరేసుకుని సైకో డ్రైవర్ వచ్చేస్తాడు. డేవిడ్ కారేసుకుని పారిపోతాడు. సైకో డ్రైవర్ ట్యాంకరు పెట్టి బస్సుని పుష్ చేస్తాడు.

   చాలా దూరం వెళ్ళిపోయి గేటు పడిన రైల్వే ట్రాకు దగ్గర డేవిడ్ ఆగి వుంటే వెనుక నుంచి వచ్చి, వెళ్తున్న రైలు కిందికి కారుని పుష్ చేస్తూంటాడు సైకో డ్రైవర్. ఎలాగో ఆ ప్రమాదాన్ని తప్పించుకుని పారిపోతాడు డేవిడ్. చాలా దూరం వెళ్ళి పోయి ఫోన్ బూత్ కన్పిస్తే ఫోన్ చేయడానికి ఆగుతాడు డేవిడ్. ఫోన్ చేస్తూంటే సైకో డ్రైవర్ వచ్చేసి ఫోన్ బూత్ మీద ఎటాక్ చేస్తాడు. కొద్దిలో తప్పించుకుని పారిపోతాడు డేవిడ్.

చాలా దూరం ప్రయాణించి నిద్ర వస్తూంటే డొంకలోకి కారుని దింపి  కళ్ళు మూసుకుంటాడు డేవిడ్. తిరిగి హైవే మీది కొస్తే దూరంగా రోడ్డు కడ్డం ఆపుకుని వుంటాడు సైకో డ్రైవర్. ఇక వీడి సంగతి తేల్చుకోవాలని డేవిడ్ కారు దిగి యమ కోపంగా వెళ్తూంటే ట్యాంకర్ స్టార్ట్ చేసుకుని వెళ్ళిపోతాడు సైకో డ్రైవర్.

   వెళ్ళి పోయాడనుకుని డేవిడ్ నిదానంగా కారు డ్రైవ్ చేసుకు వెళ్తూంటే, కొంత దూరంలో ఆపుకుని వున్న సైకో డ్రైవర్ డేవిడ్ ని వెళ్ళనిచ్చి వెంటపడతాడు. ఈ ఛేజింగ్ లో డేవిడ్ కారు రేడియేటర్ పైపు పగిలిపోతుంది. దీంతో మిడిల్ విభాగం ముగిసి ప్లాట్ పాయింట్ టూ ఏర్పడుతుంది.

   బిగినింగ్ లో పెట్రోలు పంపు దగ్గర సెటప్ చేసిన రేడియేటర్ పైప్ ప్రాబ్లం ఇక్కడ ఇలా పే ఆఫ్ అయిందన్న మాట. ఇలా ఈ మిడిల్ విభాగం ఈ రెండు పాత్రల యాక్షన్ రియాక్షన్ల ఇంటర్ ప్లేతో  రసకందాయంలో పడి కొలిక్కి వచ్చింది. ఇప్పుడేమిటి? రేడియేటర్ పైపు పగిలి పొగలు కక్కుతున్న, స్పీడు అంతకంతకూ పడిపోతున్న కారుతో డేవిడ్ యాక్షన్ ప్లానేమిటి? ఇదీ క్లయిమాక్స్  పాయింటు.

ఎండ్ చూద్దాం

కారు పొగ మేఘాలు సృష్టిస్తూ స్పీడు 20 లోపు పడిపోతున్న ప్రాణాపాయ స్థితిలో తరుముకొస్తున్న ట్యాంకర్ ని తప్పించుకోవడానికి విశ్వ ప్రయత్నం చేస్తూంటాడు డేవిడ్. ఈ క్రమంలో రెండు చోట్ల హైవే మీద బ్యారికేడ్స్ వల్ల డైవర్షన్ తీసుకుంటాడు. విలేజి సింగిల్ రోడ్డు మీద ఛేజింగ్ మొదలవుతుంది. ఇక తప్పించుకోలేనని ఒక నిర్ణయం తీసుకుంటాడు డేవిడ్ - కారుని రోడ్డు దింపేసి లోయ ప్రాంతానికి తీసికెళ్ళి పోతాడు. సైకో డ్రైవర్ భీకరంగా ట్యాంకరుతో మీది కొచ్చేస్తూంటే, బ్రీఫ్ కేసుతో ఏక్సిలేటర్ ని లాక్ చేసి, లోయ కేసి స్టీరింగ్ ని తిప్పుతూ కారు లోంచి బైటికి దూకేస్తాడు డేవిడ్. ట్యాంకర్ పెట్టి కారుని గుద్ది తోసుకుంటూ వెళ్ళి, ఎదర లోయ కనబడక కారుసహా ట్యాంకరుతో లోతైన లోయలోకి పడిపోయి ఆట ముగించుకుంటాడు సైకో డ్రైవర్.

   ఈ దృశ్యం చూసి గంతులేస్తాడు డేవిడ్. ఆపుకోలేని దుఖమూ ఆనందమూ రెండూ వచ్చేస్తూంటాయి. లోయ అంచున కూలబడి వైరాగ్యంతో  రాళ్ళు విసురుతూంటాడు. నెమ్మదిగా సూర్యాస్తమయ మవుతూంటుంది...

   ట్యాంకర్ ని పేల్చేయమన్నాడు నిర్మాత. అదెప్పుడూ చేసేదే. పేల్తుందనుకున్న ఆయిల్ ట్యాంకర్ పేలకుండా శకలాలుగా లోయలో పతనమవడం డైనమిక్స్. లోయలో ముక్కలై పడ్డ ట్యాంకర్ విడి భాగాల్ని - ఒక విలన్ వినాశనాన్ని చూపిస్తున్నట్టు చూపించాడు స్పీల్బెర్గ్. ఇదొక క్లాసిక్ సీను. సినిమాటోగ్రాఫర్  జాక్ మార్టా, ఎడిటర్ ఫ్రాంక్ మోరిస్ ఈ యాక్షన్ థ్రిల్లర్ వెనుక సాంకేతిక యోధులు.

    దీంతో స్క్రీన్ ప్లే సంగతులు పూర్తయింది. ఇందులో కొత్త విషయాలకి ఇన్స్పైర్ అవచ్చు. కళాత్మక సినిమాలు చూడరని ఏమీ లేదు. కళా ప్రదర్శన పైకి కనపడకుండా సాంకేతికాలతో సంలీనం చేస్తే తెలియకుండానే ఆత్మికంగా కనెక్ట్ అవుతారు ప్రేక్షకులు. పాతికేళ్ళ వయసులో స్టీవెన్ స్పీల్బెర్గ్ ఏం సాధించాడో, ఎందుకు సాధించాడో తెలుసుకుంటే - సినిమా తీయడం అల్లాటప్పా 90% అట్టర్ ఫ్లాప్స్ వ్యవహారం కాదని తెలుస్తుంది. డ్యూయెల్ కిప్పుడు 51 ఏళ్ళు. ఇంకో 51 ఏళ్ళ దాకా లోబడ్జెట్ మేకర్లకి ఇది స్పీల్బెర్గ్ నామా అని రాసి పెట్టుకోవచ్చు.

—సికిందర్