రివ్యూలు, సాంకేతికాలు, స్క్రీన్ ప్లే సంగతులు...

టికెట్లు దొరకడం యోగం, సినిమాలు చూడడం భోగం, రివ్యూలు రాయడం రోగం!

Monday, July 11, 2022

1181 : 'చమన్' త్రైమాసిక పత్రిక- జూన్ '22 ఆర్టికల్

     కాశ్మీర్ కుగ్రామంలో పట్టపగలు ఆర్మీ జవానులు మైకులు పెట్టి హెచ్చరిక జారీ చేస్తూంటారు. మిలిటెంట్లు దాడి చేస్తారని సమాచారం తమ కందిందనీ, అందుకని కాశ్మీరీ పండిట్లు తక్షణం ఇళ్ళల్లోంచి బయటికి వచ్చేయాలనీ విజ్ఞప్తి చేస్తూంటారు. కాశ్మీరీ పండిట్లు భయపడి పోయి కట్టుబట్టలతో కుటుంబాలతో సహా బయటికొచ్చేస్తారు. మేం మిమ్మల్ని రక్షించడానికే వచ్చామనీ చెప్పి వాళ్ళని గ్రామం నడిమధ్య కూడలికి తీసుకుపోతారు ఆర్మీ జవానులు. ఆ కుటుంబాల్లో పుష్కర్ నాథ్ పండిత్ కుటుంబం కూడా వుంటుంది. పుష్కర్ నాథ్, అతడి కోడలు శారద, పెద్ద మనవడు శివ ముగ్గురూ.  కొడుకు కరణ్ ని ఇదివరకే మిలిటెంట్లు చంపేశారు.

        లా అందర్నీ ఒక చోట చేర్చాక పుష్కర్ నాథ్ ఆర్మీ జవాన్లని చూసి, వీళ్ళు ఆర్మీ జవానులు కాదనీ, మిలిటెంట్లు అనీ అరిచేస్తాడు. వెంటనే మిలిటెంట్ల నాయకుడు ఫరూక్ మాలిక్ బిట్టా తుపాకీ మడమ పెట్టి ఎడాపెడా కొడతాడు పుష్కర్ నాథ్ ని. అడ్డొచ్చిన కోడలు శారద బట్టలు చించేస్తాడు. ఆమె కొడుకు శివని కాల్చేస్తాడు. ఆమెని రంపపు మిషను మీద ఎక్కించి నిలువునా కోసేస్తాడు. మిగిలిన పండిట్లు 23 మందినీ వరసగా నించో బెట్టి, ఒక్కొకర్నీ కాల్చి చంపేస్తాడు...

        ఈ భీకర దృశ్యం కాశ్మీర్ ఫైల్స్ ముగింపులో వచ్చే దృశ్యం. కథనంలో ఇంతవరకూ దాచిపెట్టిన సంఘటనని, చిట్ట చివర్లో ఇలా షాకింగ్ గా వెల్లడిస్తూ, ఒక వెంటాడే బలమైన భావోద్వేగంగా ప్రేక్షకుల మనసుల్లో నాటే అద్భుత కళా ప్రక్రియ. సైరత్ మరాఠీ సినిమా ముగింపులో తల్లిదండ్రులు రక్తపు మడుగులో పడున్న దృశ్యం చూసి, ఆ రక్తంతో తడిసిన అడుగులతో పిల్లవాడు ఏడుస్తూ వెళ్ళిపోయే హృదయ విదారక క్లోజింగ్ ఇమేజిలాంటి భయానక అనుభవం.

ఇలా కాశ్మీర్ ఫైల్స్ క్లోజింగ్ ఇమేజి దర్శకుడు వివేక్ రంజన్ అగ్నిహోత్రి ప్రతిభకి మచ్చు తునక అనాలి. ఈ సినిమా ద్వారా తను ఏ ఫలితాన్నైతే పొందాలనుకున్నాడో అది ఈ ఒక్క క్లోజింగ్ ఇమేజి ద్వారా పూర్తి స్థాయిలో విజయవంతంగా పొంద గలిగాడు. చీర్స్ టు హిమ్. నిజంగా ఈ దృశ్యం చూస్తే చలించని మానవ మాత్రులుండరు. ఐతే దర్శకుడి టార్గెట్ ప్రేక్షకుల మనసుల్ని కదిలించి, వివేకాన్ని మేల్కొల్పడం కాదు. ఎవరికైనా  అన్పించవచ్చు- ఈ అన్యాయానికి తాము పండిట్ల పక్షాన నిలబడి వ్యవస్థని గట్టిగా ప్రశ్నించాలనీ, 30 ఏళ్ళుగా పండిట్లకి ఏం న్యాయం చేశారో అడగాలనీ...

        కానీ దర్శకుడి లక్ష్యిత ప్రేక్షకులు ప్రశ్నించే మెదళ్ళు కాదు. ప్రతీ థియేటర్లో ప్రతీ ఆటా ఐపోగానే, హాల్లోనే ప్రేక్షకులని ఒక మత వర్గం మీద రెచ్చగొట్టేలా మాటలూ, ఆ మత నిర్మూలన కోసం పిలుపులూ, నినాదాలూ ఇచ్చి చక్కా వెళ్ళే ఫ్రింజి గ్రూపులు దర్శకుడి లక్ష్యం. పొరపాటున థియేటర్లో సినిమా చూద్దామని గడ్డం సాయిబు వున్నాడా, వాడి పని ఐపోతుంది. ఇలాటి ప్రమాదాన్ని ఆశించే ఒక సీనియర్ ముస్లిం ఢిల్లీ జర్నలిస్టు ఈ సినిమా కెళ్ళలేదని చెప్పుకుంది. దేశంలో ఒక సినిమా చూడాలంటే ఇలాటి ప్రాణాపాయ స్థితి మునుపెన్నడూ లేదు. టెర్రరిజం సినిమా లెన్నో వచ్చాయి - ఇలాటి పరిస్థితి చూడ లేదు. ఇలాటివన్నీ చూసి, మీరు ఫ్రింజి గ్రూపులుగా మారకండిరా నాయనలారా అని ఒకవైపు ప్రొఫెసర్ లక్ష్మణ్ యాదవ్ సభలు పెట్టి అర్ధిస్తున్నాడు కింది సామాజిక వర్గాలని.

        దేశంలో గతంలో అనేక బాంబు దాడులు జరిపి ఎందరి ప్రాణాల్నో తీశారు  ఉగ్రవాదులు. ఆ విషమ పరిస్థితుల్లో కూడా మతం మీద, మతానుయాయుల మీదా దాడులు జరగ లేదు. ఇప్పుడు మతం మీదే గురి పెట్టి ఓట్లని సంఘటితం చేసుకునే పరిశ్రమ వెలిసింది. ఇందులో భాగం గానే దర్శకుడు అగ్నిహోత్రి సినిమాకి నోట్లు, ఎన్నికల్లో ఓట్లూ అనే ద్విముఖ వ్యూహంతో పరిపూర్ణ విజయం సాధించాడని ఒప్పుకు తీరాలి. ఇందుకు అభినందించాలి కూడా. 1941-45 మధ్య జర్మనీలో యూదుల ఊచకోతకి ముందు ఇలాటి సినిమాలతోనే రంగం సిద్ధం చేశాడు అడాల్ఫ్ హిట్లర్. ఇలాటి సినిమాలతో అతడి అభిమాన దర్శకురాలు లేనీ రీఫెన్ స్టాల్. 1994 లో రువాండాలో  టుట్సీ  మైనారిటీల నర సంహారానికి ముందు రేడియో రువాండా కూడా ఇలాటి కార్యక్రమాలతోనే వాతావరణాన్ని సిద్ధం చేసిందని యూట్యూబర్, ప్రముఖ సీనియర్ జర్నలిస్టు  అభిశార్ శర్మ పదేపదే హెచ్చరిస్తున్నాడు. ఇప్పుడు విజయవంతంగా ఆగ్నిహోత్రి అనుసరిస్తున్నదిదే.

ప్రారంభం 
    1990. మంచు మేట వేసిన ఆ శీతాకాలపు ఉదయాన హిందూ ముస్లిం కాశ్మీరీ పిల్లలు క్రికెట్ ఆడుతూంటారు. ఓ పక్కన పాత రేడియోలో సచిన్ టెండూల్కర్ క్రికెట్ ఆడుతున్న కామెంటరీ వస్తూంటుంది. ఇది వింటూ ఇద్దరు ముస్లిములు పాకిస్తాన్ జిందాబాద్ అనమని శివని పట్టుకు కొడుతూంటే, శివ స్నేహితుడు అబ్దుల్ శివని కాపాడి తీసుకుని పారిపోతాడు. ఇంతలో వూళ్ళో ముస్లిములు ర్యాలీ తీస్తూ రలీవ్, గలీవ్, యా చలీవ్ (మతం మారిపో, లేదా చచ్చిపో, లేదా పారిపో) అన్ననినాదాలతో పండిట్ల ఇళ్ళకి నిప్పంటిస్తూంటారు. అల్ సఫా బట్టే దఫా (అల్లా దయ వల్ల పండిట్లు లోయ వదిలి వెళ్ళిపోతారు) అంటూ కూడా రెచ్చిపోతూంటారు.

        ఈ పరిస్థితుల్లో టీచర్ పుష్కర్ నాథ్ పండిత్ (అనుపమ్ ఖేర్) శివరాత్రికి వేసే నాటకంలో పాత్రకి గాను మేకప్ వేసుకుంటూ వుంటాడు. ఇంతలో ఎవరో వచ్చి బయట పరిస్థితి బాగా లేదని చెప్తారు. పుష్కర్ కి కొడుకు కరణ్ గురించి ఆందోళన పట్టుకుంటుంది. మిలిటెంట్లు అతడ్ని ఇండియన్ ఏజెంటు అని ఇప్పటికే ఆరోపిస్తున్నారు. దీంతో వెంటనే మిత్రుడైన  ఐఏఎస్ అధికారి బ్రహ్మ దత్ (మిథున్ చక్రవర్తి) దగ్గర కెళ్ళి కొడుక్కి రక్షణ కల్పించమని వేడుకుంటాడు. బ్రహ్మదత్ విషయాన్ని ముఖ్యమంత్రికి నివేదిస్తాడు.

        కానీ ఈ లోగా మిలిటెంట్ల నాయకుడు ఫరూక్ మాలిక్ బిట్టా (చిన్మయ్ మండ్లేకర్)  పుష్కర్ ఇంటికి వచ్చేస్తాడు. ఇతను పుష్కర్ దగ్గర చదువుకున్న విద్యార్థే. ఇప్పుడు పుష్కర్ ఇంటికి వచ్చేసి బియ్యపు డ్రమ్ములో దాక్కున్న కరణ్  మీద కాల్పులు జరుపుతాడు. ఆ రక్తంతో తడిసిన బియ్యాన్ని బలవంతంగా కరణ్ భార్య శారద (భాషా సంబ్లీ) చేత తినిపిస్తాడు. తీవ్రంగా గాయపడిన కరణ్ ని తీసుకుని పుష్కర్ హాస్పిటల్ కెళ్తే, అక్కడ మిలిటెంట్లు కొనవూపిరితో వున్న కరణ్ ని చంపేస్తారు.

ఇక పుష్కర్ కోడల్నీ, ఇద్దరు మనవళ్ళనీ తీసుకుని ప్రాణ రక్షణ కోసం జమ్మూ పారిపోతాడు. పెద్ద మనవడు శివ, చిన్న మనవడు కృష్ణ దారిలో ఎందరో పండిట్ల శవాల్ని చూస్తారు భయకంపితులై.

        2016 - 2020. పుష్కర్ పండిత్ చిన్న మనవడు కృష్ణ (దర్శన్ కుమార్) ఇప్పుడు ఢిల్లీలో ఏ ఎన్ యూ ( జే ఎన్ యూ?) విద్యార్థిగా వుంటాడు. ఏదేమిటో అర్ధం గాని చాలా కన్ఫ్యూజన్ తో వుండే అతడికి, వామపక్ష భావ జాలపు ప్రొఫెసర్ రాధికా మీనన్ (పల్లవీ జోషి) బ్రెయిన్ వాష్ చేస్తూ వుంటుంది కాశ్మీర్ సమస్య గురించి. కాశ్మీర్ నుంచి పండిట్ల వలసల గురించీ, భద్రతా దళాల చేతిలో ముస్లిముల మరణాల గురించీ, జాడ లేకుండా పోయిన ఏడువేల మంది ముస్లిమ్స్ గురించీ పూస గుచ్చినట్టు చెప్పుకొస్తూంటుంది.

        అందుకని మనం ప్రభుత్వాన్ని వ్యతిరేకించాలనీ, టెర్రరిస్టుల్ని సమర్ధించాలనీ అంటుంది. ఇండియా, పాక్ రెండిటితో సంబంధం లేని స్వతంత్ర కాశ్మీర్ ఏర్పాటు కోసం పోరాడాలంటుంది. విద్యార్ధుల చేత ఆజాదీ నినాదాలు చేయిస్తుంది. హమ్ దేఖేంగే ఫైజ్ అహ్మద్ ఫైజ్ కవిత పాడుతుంది. ఆమె ఈ మాటలన్నీ విన్న కృష్ణకి గతం గురించి, కుటుంబం గురించి, దేశం గురించీ కొంత అవగాహన ఏర్పడుతుంది. కానీ తన కుటుంబానికి అసలేం జరిగిందో తెలీదు. ఎప్పుడో చిన్నప్పుడు తల్లిదండ్రులు కారు ప్రమాదంలో పోయారనుకుంటున్నాడు. తాత ఈ మధ్యే పోయాడు. పోతూ విషయాలన్నీ చెప్పిపోయాడు.

        ఈ తాతగారి చితాభస్మం తీసుకుని కాశ్మీర్ వెళ్తాడు కృష్ణ అక్కడున్న సొంతింట్లో చల్లడానికి.  ఈ కార్యక్రమానికి హాజరయ్యేందుకు పుష్కర్ మిత్రులు మాజీ ఐఏఎస్ అధికారి, ప్రస్తుత గవర్నర్ సలహాదారు బ్రహ్మదత్  (మిథున్ చక్రవర్తి), డాక్టర్ మహేష్ కుమార్ (ప్రకాష్ బెలవాడీ), మాజీ డిజిపి హరినారాయణ్ (పునీత్ ఇస్సార్), జర్నలిస్టు విష్ణు రామ్ (అతుల్ శ్రీవాస్తవ) వస్తారు. బ్రహ్మదత్ భార్య లక్ష్మి (మృణాల్ కులకర్ణి) సాదరంగా ఆహ్వానిస్తుంది. షాజల్ వాంగన్, ముజ్చేటిన్, నద్రు యాక్నీ, దమ్ ఆలూ, మొంజెహా మొదలైన రుచికర పండిత్ వంటకాలు వడ్డిస్తుంది. మీ అమ్మ చాలా బాగా వండేదని కృష్ణకి గుర్తు చేస్తుంది.

        విందులో వాళ్ళతో మాటల్లో కృష్ణకి గతం గురించి చాలా తెలుస్తుంది. 30 ఏళ్ళుగా యంత్రాంగం, చరిత్ర కారులు, ప్రొఫెసర్లు, మేధావులు, మీడియా వీళ్ళంతా పండిట్లకి వ్యతిరేకంగా పనిచేశారని చెప్తారు. కేంద్ర ప్రభుత్వం కూడా కాశ్మీర్ దేశంలో భాగమే  కానట్టు వదిలేసిందని అంటారు. బ్రహ్మదత్ కి మొదట్నుంచీ పండిట్ల మీద అకృత్యాల గురించిన పేపర్ కటింగ్స్ తో ఫైళ్ళు తయారు చేసుకునే అలవాటుంటుంది. ఆ ఫైల్స్ ని కృష్ణ కిస్తాడు. ఇలా కృష్ణ పండిట్ల సమస్య పూర్వాపరాలన్నీ తెలుసుకుని ఢిల్లీ తిరిగి వెళ్తాడు.

        ఢిల్లీ తిరిగొచ్చిన కృష్ణ యూనివర్సిటీ ఎన్నికల్లో ప్రెసిడెంట్ కి పోటీ చేస్తాడు. ఈ సందర్భంగా సుదీర్ఘ ఉపన్యాసం చేసి  సాంస్కృతికంగా కాశ్మీర్ పూర్వ వైభవాన్ని వర్ణిస్తాడు. ప్రాచీన కాలంలో కశ్యప లాంటి ఋషులు, విష్ణుశర్మ లాంటి కవులు, భరత ముని లాంటి నాట్యాచార్యుడు, శంకరాచార్య లాంటి ఆథ్యాత్మిక గురువులూ ఇలా వివిధారంగాల్లో ఎందరో పండితులు కాశ్మీర్ ని జ్ఞాన కేంద్రంగా, స్వర్గ తుల్యంగా మార్చారని అంటాడు. 13 వ శతాబ్దంలో ప్రవేశించిన ఇస్లామిక్ టెర్రరిజం ఇదంతా ధ్వంసం చేసిందని అంటాడు. షంషుద్దీన్ ఎరాఖీ ఎలాటి దురాగతాలకి పాల్పడ్డాడో వివరిస్తాడు. పండిట్స్ ని బలవంతంగా ఇస్లాంలోకి  మార్చాడనీ, ముస్లిముల పేర్లకి భట్, కౌల్, బిట్టా, మట్టూ లాంటి ఇంటి పేర్లు వున్నాయంటే వాళ్ళు మతమార్పిడికి గురైన పండిట్సే ననీ అంటాడు... ఇది కల్చరల్ జెనోసైడ్ అనీ, స్వతంత్ర దేశంలో కూడా దీనికి మీరే  కారకులనీ విద్యార్థులకి చెప్పుకొస్తాడు.

        మధ్యమధ్యలో విద్యార్థులు వ్యతిరేకించినా తర్వాత కృష్ణ ప్రసంగానికి తలలూపేస్తారు. ప్రొఫెసర్ రాధికా మీనన్ కళ తప్పిన మొహంతో అక్కడుండ లేక వెళ్ళి పోతుంది. ఇక కృష్ణ తల్లి శారదని గుర్తు చేసుకుంటాడు. దీంతో ఈ వ్యాసం ప్రారంభంలో చెప్పుకున్న పండిట్ల సామూహిక హత్యా కాండ దృశ్యంతో సినిమా ముగుస్తుంది.  

నటనలు- సాంకేతికాలు

        పాత్రచిత్రణ లెలా వున్నా నటనలు రియలిస్టిక్ స్కూలుకి చెందినవి. ఇందులో మొదట చెప్పుకోవాల్సింది బ్రహ్మదత్ పాత్రలో మిథున్ చక్రవర్తిని. సాక్షాత్తూ సత్యజిత్ రే ని అనుకరిస్తున్నాడా అన్నట్టు వుంటుంది అభినయం. ముప్పయ్యేళ్ళుగా గాయాల్ని చూస్తున్న, మోస్తున్న మానసిక స్థితిని లోలోపలే భరిస్తున్న నిస్సహాయ బ్యూరోక్రాట్ గా మిథున్ ప్రేక్షకుల దృష్టి నాకర్షిస్తాడు.

        తర్వాత పుష్కర్ నాథ్ పండిత్ పాత్రలో అనుపమ్ ఖేర్. ఇతను కుటుంబాన్ని కాపాడుకుంటూ పరుగులు తీసే పాత్ర. దుఖంతోనే వుంటాడు. పండిట్లకి న్యాయం కోసం ప్రధాన మంత్రులకి 6 వేల ఉత్తరాలు రాస్తాడు. 370 ని రద్దు చేయాలని నినదిస్తాడు. రద్ద యిన విషయం తెలియకుండానే 2020 లో తనువు చాలిస్తాడు. అయితే తనువు చాలిస్తున్నప్పుడు తప్ప మనవడు కృష్ణకి పండిట్ల సమస్య చెప్పడు. తమ కుటుంబానికి ఏం జరిగిందో, పండిట్లు ఎలా చెల్లా చెదురయ్యారో చెప్పకుండా కన్ఫ్యూజుడు యూత్ గా పంచుతాడు. చివరి మాటగా ఒంటరి కృష్ణ ఎలా బ్రతకాలో కూడా చెప్పడు. ఒక టీచర్, యాక్టర్ అయిన పుష్కర్ పాత్రలో అనుపమ్ ఖేర్ పరిస్థితి ఇది.

        మనవడు కృష్ణ పాత్రలో దర్శన్ కుమార్ కన్ఫ్యూజుడు పండిత్ గా, చివర్లో నిజాలు తెలుసుకున్న యువ పండిత్ గా పాత్రకి న్యాయం చేస్తాడు సెటిల్డ్ నటనతో. చివర్లో చుట్టూ విద్యార్థుల ముందు పదిహేను నిమిషాల పాటు కృష్ణ చేసే ప్రసంగంతో, తన పాయింటాఫ్ వ్యూలో, తన చుట్టూ తిరిగే  రివాల్వింగ్ షాట్స్ తో- మణిరత్నం గీతాంజలిలోని ఓం నమహః సాంగ్ లాగా, మోనోలాగ్ తో దర్శన్ కుమార్ తప్పక జాతీయ అవార్డు నటుడు అవుతాడేమో?

        ఈ పాత్రచిత్రణలో పెద్ద లోపమేమిటంటే, పైన చెప్పుకున్నట్టు తాత చనిపోతూ చెప్తే తప్ప తనేమిటో తెలియకపోవడం. తల్లిదండ్రులు, అన్న అసలెలా చనిపోయారో తెలియకపోవడం. దేశమంతా చర్చించుకుంటున్న పండిట్ల విషాదం తెలియకపోవడం. యూనివర్సిటీలో కాశ్మీర్ కి చెందిన విద్యార్థులు భారీ సంఖ్యలో వున్నా తెలియకపోవడం. తాత చనిపోతూ కాశ్మీర్లో తన మిత్రుల దగ్గర తెలుసుకోమంటే వెళ్ళి చరిత్ర తెలుసుకోవడం. ఎప్పుడో గూగుల్ చేస్తే తెలిసిపోయే దానికి.

అయితే, ఈ సినిమా కాశ్మీర్ ఉగ్రవాదానికీ, కాశ్మీర్ వేర్పాటుని కోరుకునే యూనివర్సిటీ విద్యార్థులకీ మధ్య నలిగే కృష్ణ కథ కాబట్టి- కృష్ణని చివరికి హిందూత్వ భావజాలపు ప్రతినిధిగా మార్చి ముగించడమూ కన్పిస్తుంది. ఢిల్లీలో జే ఎన్ యూ ని కూడా టార్గెట్ చేస్తూ చూపించిన సినిమా ఇది. అయితే ఒక పండిత్ హిందూత్వ అవుతాడా అన్నది ప్రశ్న. అవ్వాలన్నది దర్శకుడి తపన. ఎజెండాకి కాన్పు చేయాలని తంటాలు పడుతున్నాడు.

        ఇక ప్రొఫెసర్ రాధికా మీనన్ పాత్రలో పల్లవీ జోషి. దర్శకుడు అగ్నిహోత్రి భార్య అయిన తను 72 సినిమాల సీనియర్ నటి. కన్ఫ్యూజుడు కృష్ణకి బ్రెయిన్ వాష్ చేసే  పాత్రలో తను కూడా అద్భుత జాతీయ అవార్డు నటి కాగలదు. కమ్యూనిస్టు పాత్రకి జాతీయ అవార్డు గనుక ఇస్తే. ఇప్పించుకున్నా ఆశ్చర్యం లేదు భర్త అయిన దర్శకుడు. కథలో ఆమెకి బలమైన డైలాగులున్నాయి. పెదాల మీద చిరునవ్వుతో చెప్పే డైలాగులు. ఈ పాత్రని ఎంత హైలైట్ చేస్తే చివర్లో అంత పరాభవించ వచ్చు. కృష్ణ చేత ఆజాదీ నినాదం ఇప్పించినప్పుడు -చూశావా? వెంటనే నీ పేరుతో రేపు హెడ్ లైన్స్ వచ్చేస్తాయి... కాశ్మీర్లో పిల్లవాడి అరుపులు వినపడతాయా? ఆ పిల్ల వాళ్ళ అరుపులకి ఒకే పేరు- ఇస్లామిక్ టెర్రరిస్టు. ఆ పిల్ల వాళ్ళ  అరుపుగా మారి చూడు, కాశ్మీర్ నీకర్ధమవుతుంది అని కృష్ణకి భోదిస్తుంది. 

        కానీ చివర్లో కృష్ణ ప్రసంగానికి- ఆ ప్రసంగంలో ఎన్ని లొసుగులున్నా- తనేదో దోషిగా దొరికిపోతున్నట్టు, హిందూత్వకి లొంగి తప్పించుకుంటుంది. పాత్ర కిల్ అయిందని కాదు, ఎజెండాకి కాన్పు అయిందా లేదా చూడాలి.

        ఇంకో పాత్ర మిలిటెంట్ నాయకుడు ఫరూఖ్ మాలిక్ బిట్టా గా చిన్మయ్ మండ్లేకర్. 30 ఏళ్ళ తర్వాత కథలో చిన్మయ్ హూందా గల నటనతో ఆకట్టుకుంటాడు. తను ఆధునిక గాంధీననీ, తను శాంతియుత ప్రజాస్వామిక ఉద్యమం నడుపుకుంటున్నాననీ అంటాడు. ఆ రోజుల్లో నెహ్రూ, వాజపాయి లు ప్రజలు తమని ఇష్టపడాలని కోరుకునే వారనీ, ఇప్పుడున్న ప్రధాని ప్రజలు తనని చూసి భయపడాలని కోరుకుంటున్నాడనీ బ్లేమ్ చేస్తాడు. ఒక ఆరెస్సెస్ కార్యకర్తని చంపేశానంటాడు. ఇప్పటి ఎజెండాకి నెహ్రూ వాజపాయిలని చరిత్ర నుంచి తప్పించెయ్యడమేగా  కావాలి. ఇక భయపెట్టే ప్రధాని దేనికో, ఆరెస్సెస్ ప్రస్తావన అవసరమేమిటో అర్ధం జేసుకోవచ్చు.  

చిన్మయ్ పోషించిన ఈ విలన్ పాత్ర ఈగ వాలకుండా దర్జాగా వుంటాడు ఇప్పటికీ. గత పాలకులు ఇతడ్ని శిక్షించలేదని ఎత్తి చూపే అర్ధంలో. ఇది తప్పు. నిజజీవితంలో ఇతడ్ని శిక్షించారు. ఆ ఊళ్ళో 24 మంది పండిట్లని చంపిన (ముగింపు దృశ్యం) లష్కరే తోయిబా ఉగ్రవాది జియా ముస్తఫాని అప్పుడే పట్టుకుని జైల్లో వేశారు. 2021 అక్టోబర్లో, వేరే ఉగ్రవాద స్థావరాలని గుర్తించడానికి భద్రతా దళాలు జైలు నుంచి తీసి కెళ్ళారు. అప్పుడేంజరిగిందో, ఎన్ కౌంటర్ అయిపోయాడు.

        ఈ సినిమాలో దోషులైన మిలిటెంట్ పాత్రలు దేన్నీ చట్టం పట్టుకోవడం గానీ, శిక్షించడం గానీ చేసినట్టు చూపించలేదు. అలా చేస్తే  ప్రేక్షకుల నుంచి ఆశిస్తున్న ఉక్రోషం వీగిపోతుంది. అయితే ఒక్క ముస్లిం పాత్రని కూడా చంపలేదన్న అసంతృప్తి నార్త్ ప్రేక్షకుల్లో వుంది. చంపితే ఆ మత వర్గం మీద కక్ష తీరిపోతుందని దర్శకుడి బాధ.

        సాంకేతికంగా హింసతో కూడిన దృశ్యాల చిత్రీకరణ అతి క్రూరంగా వుంది. జుగుప్సాకరంగానూ వుంది. ప్రేక్షకుల మస్తిష్కాల్లో విభజన రేఖని గీసే మాత్సర్యాన్ని బలంగా నాటాలనే ఈ చర్య.  పండిట్ల ట్రాజడీ లోంచి ఎన్ని ప్రయోజనాలు వీలైతే అన్ని పిండుకోవడం. మధ్యమధ్యలో కాశ్మీరీ పాటలు. రెండు గంటలా 45 నిమిషాల బారెడు నిడివి వున్న ఈ సినిమా కథనం సహనాన్ని పరీక్షిస్తూ నత్త నడక నడుస్తుంది. ఫ్లాష్ బ్యాకులతో నాన్ లీనియర్ కథనం చేయాలని ప్రయత్నించిన తీరు విఫలమైంది.

ఫెయిలైన ఫైళ్ళు    
గత సంవత్సరం అక్షయ్ కుమార్ నటించిన సూర్యవంశీ అనే టెర్రరిజం సినిమా విడుదలైంది. పాక్ టెర్రరిస్టుల్ని పట్టుకునే కథగా ప్రారంభమయ్యే ఈ సినిమా, వాళ్ళ కథ వదిలేసి ఇండియన్ ముస్లిములని బ్యాడ్ గా చూపించే ఎజెండా సినిమాగా మారిపోయింది. అక్షయ్ కుమార్ పేరు మోసిన ఎజెండా అంబాసిడరని తెలిసిందే.

        కాశ్మీర్ ఫైల్స్ లో ఇదే బ్రాండింగ్. చిన్న పిల్లల నుంచీ పెద్దల దాకా, స్త్రీలు సహా మొత్తం ముస్లిములని పండిట్ల -హిందువుల  శత్రువులుగా ప్రొఫైలింగ్ చేసి అందులోంచి ప్రయోజనం పొందడం. 1990 లో పండిట్ల మీద దాడులు జరిగేటప్పటికి పాక్ ప్రేరేపిత  జమ్మూ కాశ్మీర్ లిబరేషన్ ఫ్రంట్ (జేకేఎల్ఎఫ్) వేర్పాటు వాద మిలిటెంట్ సంస్థ ఏర్పాటై రెండు మూడేళ్ళే అయింది. కార్యకలాపాలు కూడా అంతంత మాత్రంగా వుండేవి. ఈ సంస్థ గురించి స్థానిక ప్రజలకి పెద్దగా తెలీదు కూడా.  అయినా సినిమాలో ఈ మిలిటెంట్ సంస్థలోకి ముస్లిం పౌరుల్నీ, పిల్లల్నీ కూడా అప్పుడే చొరబెట్టేసి పండిట్లని వెళ్ళగొట్టే ముష్కర మూకగా చూపించారు. పిల్లలకి ఆయుధాలిచ్చి రలీవ్ గలీవ్ చలీవ్ నినాదాలిప్పించారు.

        ముస్లిం స్త్రీలు పండిత్ స్త్రీలకి కిరాణా సరుకులు దొరకనివ్వడం లేదన్నట్టు, రేషన్ లాక్కుంటున్నట్టూ, కాఫిర్లు అని తిట్టి, కంచాలు లాక్కుని అన్నాలు పారేస్తున్నట్టూ ఇంకో కట్టు కథ అల్లారు. ఇప్పటికీ ఏ పండిత్ ముస్లిములతో కష్టాలు పడ్డామని చెప్పడం లేదు. మిలిటెంట్ల  దాడుల మధ్య సాయం పొందామనే చెబుతున్నారు. చరిత్ర కూడా ఏం చెబుతోందంటే, డోగ్రా రాజుల కాలం నుంచీ  హిందూ ముస్లిములు కలిసి మెలిసే వుంటున్నారు. విడదీయాలని సినిమా ప్రయత్నం. 

        ఇక పండిత్ పాత్రలకి బ్రహ్మ, విష్ణు, మహేష్, శివ, కృష్ణ, శారద మొదలైన దేవుళ్ళ పేర్లు పెట్టడంలో ముస్లిం పాత్రలకి తస్మాత్ హెచ్చరిక వుంది. పండిత్ పాత్రలకి తిలకం అద్ది, మిలిటెంట్ పాత్రలకి సూర్మా రుద్దడం ఇంకో ప్రొఫైలింగు. పండిట్లు పూర్తి శాఖాహారులని చెప్పడానికి, బ్రహ్మదత్ పాత్ర భార్య చేత శాఖాహార వంటకాల మెనూ అంతా చదివించారు. పవిత్రంగా మనం వేరు- తుచ్ఛంగా వాళ్ళు వేరూ అని విభజన చూపించడానికి వీలైనన్ని ప్రతీకలు వాడుకోవడం. కానీ పండిట్లు మేక మాంసంతో బాటు చేపలూ తింటారని ఎలా దాస్తాడు దర్శకుడు? ఇలాటి తప్పుడు సమాచారాలు సినిమాలో అనేకం.

        హిందూ పురుషుల్లేని, హిందూ స్త్రీలతో కూడిన పాకిస్తాన్ గా కాశ్మీర్ మారుతుందని డైలాగు. మంచిదేగా? 370 రద్దు అవగానే, ఇప్పుడు అక్కడ ప్లాట్లు కొనుక్కుని, అక్కడి అమ్మాయిల్ని పెళ్ళి చేసుకోవచ్చని ఉవ్వీళ్ళూరిన దేశ ప్రజల కోరిక నెరవేరుతుంది. టెర్రరిస్టులు కొన్ని మంచి పనులు కూడా చేస్తారన్న మాట.

ముసలి ముస్లిం బడి పంతులు కృష్ణ తల్లిని కామిస్తున్నట్టు ఒక వెకిలి దృశ్యం. ఇటు వెనుక వైపు టింబర్ డిపోలో రంపపు మిషను రొద. దర్శకుడి ఈ కథన చాతుర్యాన్ని మెచ్చుకోవాల్సిందే. కథనంలో ఇది ఫోర్ షాడోవింగ్  సీను. తర్వాత కథ చివర్లో రంపపు మిషనులోనే  రెండు ముక్కలవుతుంది కృష్ణ తల్లి శారద. మిలిటెంట్ల ఈ అకృత్యాన్ని ఎవరూ సమర్ధించరు. కాల్చి చంపాల్సిందే.

        ఇక రాజకీయ కోణం చూస్తే, ఈ సినిమా పండిట్ల వలసని పండిట్ల వలస అనకుండా, పండిత్ జాతి నిర్మూలన అంటోంది. పోలీసు రికార్డుల్ని ఉటంకిస్తూ ఇండియా టుడే కథనం ప్రకారం, 1989-2004 మధ్య కాలంలో మొత్తం 200 మంది పండిట్లు మిలిటెంట్ల దాడుల్లో మరణించారు. ఇందులో 1990 లో 109 మంది మరణించారు. చంపిన వాళ్ళలో ముస్లిం పౌరులు లేరు. సినిమాలో ముస్లిములని కూడా దోషుల్ని చేసి, మరణాల సంఖ్యని 4 వేలు అని చూపిస్తూ, పండిట్ల జాతి నిర్మూలన అంటూ ప్రచారం చేస్తున్నారు. మిలిటెంట్ల చేతిలో ఇంకా 1690 మంది ముస్లిములు సహా హిందూ, సిక్కు, దళితుల మరణాల గురించి చెప్పడం లేదు.

        సమస్యకి కారకులుగా 1989 లో రాజీవ్ గాంధీ, ఆ తర్వాత ముఫ్తీ మహ్మద్ సయీద్, ఫరూఖ్ అబ్దుల్లా అనీ సినిమాలో చెప్పడం వుంది. అప్పటికి రాజీవ్ గాంధీ ప్రధానిగా లేరు. 1990 లో కాశ్మీర్ లో పండిట్ల మీద దాడులు ప్రారంభమైనప్పుడు ప్రతిపక్ష నాయకుడుగా రాజీవ్ గాంధీ పార్లమెంటుని ఘెరావ్ చేశారు. పండిట్ల మీద దాడుల్ని, వలసల్ని ఆపాలని డిమాండ్ చేశారు. 1990 లో ప్రధానిగా వున్నది 89 సీట్లున్న బిజెపి మద్దతుతో విపి సింగ్ (జనతా దళ్), హోమ్ మంత్రిగా వున్నది కాశ్మీర్ కి చెందిన ముఫ్తీ మహ్మద్ సయీద్ (పిడిపి).

        ఈ కాలంలో పండిట్ల మీద దాడులు జరుగుతూంటే బిజెపి కనీసం ఆందోళన కూడా చేపట్టలేదు, విపి సింగ్ ప్రభుత్వానికి మద్దతు వాపసు తీసుకునే సంగతలా వుంచి. ఇంకోటేమిటంటే, 1990లో కేంద్ర  హోమ్ మంత్రిగా వున్న ముఫ్తీ మహ్మద్ సయీద్ తోనే 2015 లో జమ్మూ కాశ్మీర్ లో పొత్తు ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసుకుంది బిజెపి. 2016 లో సయీద్ మరణం తర్వాత ఆయన కుమార్తె మహెబూబా ముఫ్తీతోనూ ఆ పొత్తుని బిజెపి కొనసాగించింది.

ఇక ఫరూఖ్ అబ్దుల్లా కొస్తే, ముఖ్యమంత్రిగా వున్న ఈయన్ని దెబ్బ తీయడానికి ముఫ్తీ మహ్మద్ సయీద్,  ప్రధాని విపి సింగ్ ని ఒప్పించి జగ్మోహన్ ని జమ్మూ కాశ్మీర్ గవర్నర్ గా పంపాలనుకున్నారు. దీన్ని అబ్దుల్లా తిప్పికొట్టారు. 1984 లో తను ముఖ్యమంత్రిగా వున్నప్పుడు గవర్నర్ గా వున్న జగ్మోహన్ ప్రధాని రాజీవ్ గాంధీ చేత అబ్దుల్లా ప్రభుత్వాన్ని బర్తరఫ్ చేయించారు. ఇది గుర్తుంచుకున్న అబ్దుల్లా, జగ్మోహన్ ని గనుక గవర్నర్ గా నియమిస్తే ముఖ్యమంత్రిగా రాజీనామా చేస్తానన్నారు. విపి సింగ్ జగ్మోహన్నే గవర్నర్ గా పంపడంతో, 1990 జనవరి 18 న అబ్దుల్లా రాజీనామా చేశారు. ఇక జనవరి 19 నుంచే పండిట్ల మీద మిలిటెంట్లు విరుచుకు పడ్డం మొదలెట్టారు జగ్మోహన్ హయాంలో.

        1990 లోనే విపి సింగ్ ప్రభుత్వం బీసీ రిజర్వేషన్ల మండల్ కమిషన్ రిపోర్టుని ఆమోదించింది. దీంతో బీసీల దృష్టిని మళ్ళిస్తూ బీసీలని తన ఛత్రఛాయ కిందికి తీసుకొచ్చేసేందుకు, హిందూ సెంటిమెంట్లతో అయోధ్య రథ యాత్ర మొదలెట్టింది బిజెపి. విపి సింగ్ మండల్ కి తన కమండల్ అడ్డేసింది. రథ యాత్రని విపి సింగ్ అడ్డుకుంటే, అప్పుడు మద్దతు ఉపసంహరించుకుని ఆయన ప్రభత్వాన్ని కూల్చేసింది. ఇవన్నీ దర్శకుడు అగ్నిహోత్రి మూసి పెడితే మనకి దొరికిన ఫైళ్ళు. 1990 నాటి సంఘటనలతో 1991 లో వచ్చిన ఇండియా టుడే కవర్ పేజీ కథనం చూస్తే ఈ ఫైళ్ళు బయటపడతాయి. ఆ తర్వాత 1992 లో బిజెపి బాబ్రీ మసీదుని కూల్చేసింది. దాని తాలూకు మతకలహాలతో దేశం అట్టుడికింది. ఇలా మత విషయాలతో పాపం బిజెపి అంత బిజీగా వుంటే పండిట్లని పట్టించుకోలేదని విమర్శించడమేమిటి?


ఇక కనీసం కాశ్మీర్ లో మిలిటెన్సీ ఎలా ఎప్పుడు ఎందుకు ప్రారంభమైందో సినిమాలో చెప్పలేదు. అనుకూలంగా లేని ఫైళ్ళు తెరవ కూడదని అనుకున్నట్టుంది. నేపథ్యం చెప్పి కథ చెప్తే దానికో అర్ధం పర్ధం. కథా రచనకి ఈ ప్రాథమిక సూత్రం కూడా పాటించలేదు.

మొదటి తూటా ముస్లింకే

1989 ఆగస్టు 14 రాత్రి నేషనల్ కాన్ఫరెన్స్ పార్టీ నాయకుడు మహ్మద్ యూసుఫ్ హల్వాయి కి కాల్ వచ్చింది. రేపు పంద్రాగస్టు, నువ్వు ఈ రాత్రి ఇంట్లో లైట్లు ఆర్పేయాలని హెచ్చరిక. ఆయన విన్పించుకోలేదు. అప్పుడు జేకేఎల్ఎఫ్ మిలిటెంట్ల మొట్టమొదటి తూటా ఈయన మీద ఫటేల్మని పేలింది.

        మిలిటెంట్లకి హిందువు లేడు, ముస్లిం లేడు, తమ మాటే! జేకేఎల్ఎఫ్ ఎక్కడ్నుంచి వచ్చింది? 1987 ఎన్నికల్లో జనాబ్ డాక్టర్ ఫరూఖ్ అబ్దుల్లా సాబ్ ఎన్నికల్లో రిగ్గింగ్ చేసి గెలిచి, కాశ్మీర్ కి ప్రత్యేక ప్రతిపత్తి అంశాన్ని కూడా తుంగలో తొక్కుతున్నారనీ, ఇక కాశ్మీర్ ని ఇండియా నుంచి విడదీయాలనీ, జమ్మూకాశ్మీర్ లిబరేషన్ ఫ్రంట్ (జేకేఎల్ఎఫ్) ఏర్పాటయింది. అమానుల్లా ఖాన్, మక్బూల్ భట్ లు పాక్ ఆక్రమిత కాశ్మీర్ లోని ముజఫరా బాద్ లో ఏర్పాటు చేశారు.

        ఆ తర్వాత రెండో తూటా సరీగ్గా నెల తర్వాత, 1989 సెప్టెంబర్ 14 న, టీకా లాల్ టప్లూ అనే అడ్వొకేట్ మీద పేలింది. ఈయన బిజెపి నాయకుడు కూడా. హిందువులు ఉలిక్కి పడ్డారు. ఇక ఒకర్నొకర్నే హిందూ ప్రముఖుల్ని లక్ష్యం చేసుకోసాగారు మిలిటెంట్లు. ఎప్పుడైతే 1990 జనవరి 18 న ఫరూఖ్ అబ్దుల్లా రాజీనామా చేశారో, ఆ మర్నాటి నుంచి  బహిరంగంగా విరుచుకు పడసాగారు మిలిటెంట్లు. ఇప్పుడు లక్ష్యం పండిట్లు అయ్యారు. కొత్త గవర్నర్ గా వచ్చిన జగ్మోహన్ పండిట్లకి భద్రత కల్పించక పోగా, ఖాళీ చేసి వెళ్ళి పోవాలని ఆదేశించారు. తత్ఫలితంగానే వలసలు. అప్పటి ఒక కాశ్మీరు జర్నలిస్టు ప్రకారం, అలా చేయడంలో జగ్మోహన్ ఆంతర్యం, పండిట్లని ఖాళీ చేయిస్తే, ముస్లిములని చంపడం ఈజీ అవుతుందనీ ఆయన గేమ్ ఆయన ఆడుకున్నారు.

        1947 లో భారత్ లో కాశ్మీర్ విలీనాన్ని పురస్కరించుకుని షేక్ అబ్దుల్లాని దర్శకుడు విమర్శిస్తాడుగానీ, అప్పటి కాశ్మీర్ రాజు హరి సింగ్ పాత్ర గురించి చెప్పడు. షేక్ అబ్దుల్లాని కేంద్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం 11 ఏళ్ళు జైల్లో వుంచిన విషయం కూడా చెప్పడు.

కృష్ణ ప్రసంగంలో దాటవేత
  ప్రాచీన కాలంలో కాశ్మీర్ స్వర్గ తుల్యంగా వుండేదన్న కృష్ణ ప్రసంగాన్ని తప్పుపట్టాల్సింది లేదు. కృష్ణ అన్నట్టు  అన్ని పార్శ్వాల్లో జ్ఞాన కేంద్రంగా కాశ్మీర్ అప్పట్లో స్వర్గమేఅది స్వర్ణ యుగమే. ముందు భౌగోళిక అందాలతో భూతల స్వర్గం, తర్వాత కృష్ణ చెప్పే స్వర్గం అనుకుంటే సరిపోతుంది.  13వ శతాబ్దంలో ముస్లిం పాలకుల రాకతో ధ్వంస రచన కూడా నిజమే. ఇరానియన్ సూఫీ మీర్ షంషుద్దీన్ ఎరాఖీ పాలనా కర్కశమే. చిత్ర హింసలు పెట్టి పండిట్ల మతం మార్పించాడు. ఆ తర్వాత మొగల్ పాలనలోనూ అన్యాయాలు జరిగాయి. అయితే ముస్లిమేతరుల  పట్ల హింస అనేది కాశ్మీరు లోయలో ఇతర ముస్లిం గ్రూపులతో పైచేయిగా వుండాలన్న రాజకీయాధికార కాంక్షతోనే జరిగింది తప్ప మరొకటి కాదని చరిత్ర కారులు చెప్తారు. దీన్ని కూడా కొట్టివేద్దాం.

మరి 1846 నుంచీ 1947 వరకూ ఏకధాటిగా వందేళ్ళూ పరిపాలించిన డోగ్రా రాజులు ఏం చేశారు? రాజు గులాబ్ సింగ్ నుంచీ రాజు హరి సింగ్ వరకూ? పూర్వపు కాశ్మీరు వైభవాన్ని కల్పించి తిరిగి స్వర్గతుల్యం చేసేందుకు  వందేళ్ళూ సరిపోవా? మధ్యలో ఈ కాలాన్ని దాటవేసి 1990 లోకి జంప్ చేస్తాడెందుకు కృష్ణ? అప్పట్లో మెజారిటీ సంఖ్యలో వున్న ముస్లిములు, మైనారిటీ వర్గ హిందూ రాజుల పాలనలో కలిసిపోయి ఎలా వున్నారో కూడా చెప్పాలిగా? దర్శకుడు ఎంత కాదనుకున్నా తేలేది కాశ్మీరు గురించి ఇలాటి నిజాలే. 

        ప్రొఫెసర్ రాధికా మీనన్ పాడిన ఫైజ్ కవిత్వంలోని అనల్ మాలిక్, లౌహే అజల్ రెండు పదాలు తీసుకుని ఆవేదన వ్యక్తం చేస్తాడు కృష్ణ- అనల్ హక్ ఏమిటి? లౌహే అజల్ ఏమిటీ?’ అంటూ.

        ఐఐటీ కాన్పూర్ లో ఫైజ్ కవిత్వం హిందూ వ్యతిరేక కవిత్వమంటూ చెలరేగిన వివాదంతో స్ఫూర్తి పొంది ఈ చిత్రణలు చేసినట్టుంది దర్శకుడు. ప్రసిద్ధ పాకిస్తాన్ మార్క్సిస్టు కవి ఫైజ్ అహ్మద్ ఫైజ్  కవిత్వం హమ్ దేఖేంగే(మేము చూస్తాం) 1979 లో  పాక్ సైనిక నియంత జనరల్ జియావుల్ హక్ పై ఎక్కుపెట్టి రాసింది. ఇస్లాం మత మౌఢ్యానికి వ్యతిరేకంగా రాసిన ఈ కవిత్వం హిందూ వ్యతిరేక కవిత్వమెలా అయిందని మేధావులు ప్రశ్నించారు. శ్రీశ్రీ కవిత్వంలో జగన్నాథ రథ చక్రాలని పురాణ ప్రతీక లెలాగో, ఫైజ్ కవిత్వంలో సూఫీ పదం అనల్ హక్ (అహం బ్రహ్మస్మి), ఇస్లాం పదం లౌహే అజల్ (శాస్త్ర గ్రంథం) పదాలు అలాగ. ఇవి హిందువులని ఉద్దేశించినవి కావు. పాకిస్తాన్ లో జియా పీడిస్తూంటే, ఇండియాలో హిందువులకి వ్యతిరేకంగా కవిత్వం రాస్తాడా? సమస్యల మీద నుంచి దృష్టి మళ్ళించే గోదీ మీడియా కాదేమో అతను?

ముగింపుకొద్దాం

వ్యాసం ప్రారంభంలో పేర్కొన్న సినిమా ముగింపు దృశ్యాని కొద్దాం. ఈ దృశ్యం చాలా పెద్ద జోకు. ప్రేక్షకుల తెలివితేటల మీద జోకు. ఒకనాటి ఫైల్లో విషయాన్ని ఇంకో నాటి ఫైల్లో విషయంగా చూపించేశాడు దర్శకుడు. 1990 లో జరిగినట్టు 24 మంది పండిట్ల ఊచకోతతో దర్శకుడు చూపించిన ముగింపు దృశ్యం నిజానికి 1990 లో జరిగింది కాదు. 2003 లో జరిగిన సంఘటన అది. 2003 నాటి సంఘటనని 1990 కథా కాలపు సంఘటనగా ఎలా చూపిస్తాడు? గమ్మత్తేమిటంటే 2003 అటల్ బిహారీ వాజపాయి ప్రధానిగా వున్న కాలం! ఇది కూడా తనిఖీ చేసుకోనట్టుంది, లేదా ప్రేక్షకులకి ఏం తెలుస్తుందిలే అనుకుని వుండాలి. 1990 లో బిజెపిని దృశ్యంలోకి తీసుకు రాకుండా కాపాడిన తను, ఇప్పుడు వాజపాయి  దగ్గరికే వచ్చి దొరికిపోయాడు.

        2003 నాటి సంఘటన లాంటిదే 1998 లో జరిగింది. 1998 జనవరి 25 షబ్బే ఖదర్ రాత్రి - అంటే తెల్లారితే రిపబ్లిక్ దినోత్సవం- సైనిక దుస్తుల్లో మిలిటెంట్లు వంధమా అనే గ్రామానికొచ్చి,  26 మంది పండిట్లని వరుసగా నిలబెట్టి కాల్చేశారు. వెంటనే ఆ గ్రామానికి అప్పుడున్న ప్రధాని ఐకే గుజ్రాల్, గవర్నర్ కెవి కృష్ణారావు, ముఖ్యమంత్రి ఫరూఖ్ అబ్దుల్లా, కేంద్ర పర్యావరణ మంత్రి సైఫుద్దీన్ సోజ్ తరలి వెళ్ళారు. ఈ హత్యలకి పాల్పడ్డ హిజ్బుల్ ముజాహిదీన్ మిలిటెంట్ అబ్దుల్ హమీద్ గడాని 2000 లో భద్రతా దళాలు కాల్చి చంపాయి.

        2003 నాటి సంఘటన నదీ మార్గ్ లో జరిగింది. మార్చి 23 రాత్రి ఫుల్వామా జిల్లా సోఫియాన్ సమీపం లోని నదీ మార్గ్ గ్రామానికి మిలిటరీ దుస్తుల్లో మిలిటెంట్లు వచ్చి, ఇద్దరు పిల్లలు సహా 24 మంది పండిట్లని వరుసగా నించో బెట్టి కాల్చి చంపేశారు. ఈ సంఘటనని సినిమాలో 1990 నాటి ముగింపు దృశ్యంగా చూపిస్తూ మిలిటెంట్ నాయకుడుగా ఫరూఖ్ మాలిక్ బిట్టా పాత్రలో విలన్ చిన్మయ్ మండ్లేకర్ని చూపించాడు. ఈ పాత్రని జేకే ఎల్ఎఫ్ నాయకుల్లో ఒకడైన ఫరూఖ్ అహ్మద్ దార్ (బిట్టా కరాటే) ని దృష్టిలో పెట్టుకుని సృష్టించారు. అయితే 2003 ఘాతుకానికి పాల్పడింది బిట్టా కరాటే కాదు. లష్కరే తోయిబా ఉగ్రవాది జియా ముస్తఫా అనీ, ఇతణ్ణి అప్పుడే పట్టుకుని జైల్లో వేశారనీ,  2021 అక్టోబర్లో, వేరే ఉగ్రవాద స్థావరాలని గుర్తించడానికి భద్రతా దళాలు జైలు నుంచి తీసి కెళ్ళినప్పుడు ఎన్ కౌంటర్ అయిపోయాడనీ పైన చెప్పుకున్నాం.

        మరొకటేమిటంటే ఈ తప్పుడు ముగింపు దృశ్యంలో, ఇంకో తప్పుని చూపెట్టారు. వ్యాసం ప్రారంభంలో చెప్పుకున్న కృష్ణ తల్లి శారదని రంపపు మిషను మీద కోసే దృశ్యం. ఇది 1990 లో జరిగిందే. గిరిజా టిక్కూ అనే ఆవిణ్ణి మిలిటెంట్లు రంపపు మిషను మీద కోసేశారు. ఈ 1990 నాటి సంఘటనని 2003 సంఘటనతో కలిపి ఒకే దృశ్యంగా చూపించేశాడు దర్శకుడు. మరొకటేమిటంటే, కృష్ణ తల్లిని గిరిజా టిక్కూగా చూపించిన దర్శకుడు, సినిమా ప్రారంభంలో బియ్యపు డ్రమ్ము సంఘటనలో  శశి గంజూని కూడా కృష్ణ తల్లిగానే చూపించేశాడు!

        పీపీ కపూర్ అనే ఆర్టీఐ కార్యకర్త సెన్సార్ బోర్డుకి దరఖాస్తు వేశాడు. దానికి సెన్సార్ బోర్డు ఇచ్చిన సమాధానం - కాశ్మీర్ ఫైల్స్ పెద్దలకు మాత్రమే సర్టిఫికేట్ తో డ్రామా తరగతికి చెందిన సినిమా. ఇది డాక్యుమెంటరీ కాదు కాబట్టి ఇందులో చూపించిన వాటిని  వాస్తవాలుగా తీసుకోనవసరం లేదు...

        సెన్సార్ బోర్డే ఇలా సర్టిఫికేట్ ఇస్తే, కాశ్మీర్ ఫైళ్ళు అబద్ధాల్లోంచి కళ్ళు తెరిపిస్తాయి. ఇంకో అబద్ధం- మలి విడత కథాకాలం 2016-2020  గా చూపించడానికి ముఖ్య కారణముంది. దర్శకుడు జే ఎన్ యూని బోనులో నిలబెట్టేందుకు రెండు వేల పదహారే మంచి ప్రారంభం. ఆ సంవత్సరం జే ఎన్ యూలో భారత్ వ్యతిరేక, కాశ్మీర్ అనుకూల నినాదాలు చేశారని, భారత్ తేరే తుక్డే హోగే ఇన్షాల్లా ఇన్షాల్లా అంటూ హెచ్చరికలు చేశారనీ విద్యార్థులు కన్హయ్యా కుమార్, ఉమర్ ఖాలిద్ లపై కేసు. దీనికి సాక్ష్యం ఒక వీడియో. కోర్టు ఆ వీడియో దాఖలు చేయమంది. తీరా పోలీసులు ఆ వీడియో గురించి తెలుసుకుంటే అది ఫేక్ వీడియో. బిజెపి ఐటీ సెల్ వైరల్ చేసిన వీడియోని ప్రముఖ గోదీ ఛానెల్ ప్రసారం చేస్తే, దాన్ని విశ్వసించి సాక్ష్యంగా తీసుకున్నారు పోలీసులు. ఇరుకున పడ్డారు.  దర్శకుడు అగ్నిహోత్రి ఈ ఫేక్ సమాచారాన్ని కూడా తన ఫైల్స్ లో పొందుపర్చుకున్నాడు.

మునుల మౌన వ్రతం

తాజా వార్త. మే 12, 2022. మధ్య కాశ్మీర్ బుద్గావ్ లోని చదూరా తహసీలు కార్యాలయం. ఆ ఉదయం ఇద్దరు లష్కరే తోయిబా ఉగ్రవాదులు కార్యాలయంలోకొచ్చి, రాహుల్ భట్ ఎవరని అడిగారు. పండిట్లకి ప్రధాన మంత్రి ప్రత్యేక ప్యాకేజీ కింద కొత్తగా ఉద్యోగంలో చేరిన  రాహుల్ భట్ దగ్గరికెళ్ళి, అతడి మీద తుపాకులతో గుళ్ళు కురిపించి పారిపోయారు. 

        రాహుల్ భట్ పండిత్ హత్యతో జమ్మూ కాశ్మీర్ భగ్గుమంది. పండిట్లు రోడ్ల  పైకొచ్చి తీవ్ర నిరసన తెలిపారు. ఆగ్రహావేశాలు వ్యక్తం చేశారు. ఈ ప్రదర్శనల్లో ముస్లిములు కూడా పాల్గొన్నారు. పోలీసులు అందర్నీ చెదరగొడుతూ బాష్ప వాయుగోళాలు ప్రయోగించారు. లాఠీలు పెట్టి నిర్ధాక్షిణ్యంగా పండిట్లని తరిమి తరిమి కొట్టారు. పండిట్లు ప్రాణాలు రక్షించుకుంటూ పారిపోయారు. ఎవరికి చెప్పుకోవాలో దిక్కు తోచడం లేదు.

దీనిపై మౌనం. అందరూ మౌనం. ప్రధాన మంత్రి, హోమ్ మంత్రి, ఐటీ సెల్, వాట్సాప్ యూనివర్సిటీ, గోదీ మీడియా, ఫ్రింజి గ్రూపులు, కశ్మీర్ ఫైల్స్ ఫ్యాన్స్, కాశ్మీర్ ఫైల్స్ దర్శకుడూ అందరూ మౌనం. ట్వీట్ లేదు, మాట లేదు. దొరికిన రెండు మూడు ఇండిపెండెంట్ మీడియాల ముందు మళ్ళీ కొత్త రాజకీయ గాయాలతో గోడు వెళ్ళబోసుకుంటూ నిస్సహాయ  పండిట్లు!

        ఇదీ సరైన ముగింపు అవుతుందేమో? ఉన్న సినిమా ముగింపుకి ఈ జోడింపుతో అప్డేట్ చేస్తే, నడుస్తున్న నాటకం కూడా అవుతుంది.

—సికిందర్