రివ్యూలు, సాంకేతికాలు, స్క్రీన్ ప్లే సంగతులు...

టికెట్లు దొరకడం యోగం, సినిమాలు చూడడం భోగం, రివ్యూలు రాయడం రోగం!

Tuesday, May 24, 2022

1170 : స్పెషల్ ఆర్టికల్

 

    చార్య స్క్రీన్ ప్లే సంగతులు రెండవ భాగంలో ఒక చోట ఇలా చెప్పుకున్నాం - “ రైడర్స్ ఆఫ్ ది లాస్ట్ ఆర్క్’ లో  దివ్య శక్తులున్న ఆర్క్ ని దోచుకుందామని చూసే జర్మన్ నాజీల కేం గతి పట్టింది చివరికికాబట్టి  అమ్మవారితో వొక సూపర్ నేచురల్ హై పవర్ యాక్షన్ సీను కాగల కమర్షియల్ సందర్భాన్ని చేజార్చుకున్నారు. స్టార్ సినిమా కథకి థింక్ బిగ్ అనుకుంటే సరిపోదు, థింక్ హై అనుకోవాలి. రాస్తూంటే ఆ హై వచ్చేస్తూ వుండాలి” అని.

       చార్య ఆడలేదు. తర్వాత విడుదలైన సర్కారు వారి పాట బ్రేక్ ఈవెన్ కోసం స్ట్రగుల్ చేస్తూ పుంజుకునే ప్రయత్నం చేస్తోంది. ఇలా జరగడానికి కారణమేమిటి? రొటీన్ గా ఏ స్థాయిలో తెలుగు సినిమాలుంటున్నాయో అదే సోకాల్డ్ సేఫ్ జోన్ లో మళ్ళీ తీయడం. అంతకి మించి పైకి ఎదగకపోవడం. ఊహని విస్తరించక పోవడం. నెక్స్ట్ లెవెల్ కి తీసికెళ్ళక పోవడం. ప్రేక్షకులకి సరికొత్త అనుభవాన్నివ్వకపోవడం. చూసిందే చూపించే అదే రొటీన్, మూస, పాత ఫార్ములా - వీటినే నమ్ముకుని వుండడం. ఇలా బాక్సాఫీసు దగ్గర పరాభవాలెదురవుతున్నా మారకపోవడం. కరెన్సీ నోట్లు మారిపోయాయి, సినిమాలు మారడం లేదు. పాత నిల్వ సరుకు చూపిస్తూ కొత్త కరెన్సీ నోట్లు కోరుకుంటున్నాయి.   

        “... స్టార్ సినిమా కథకి థింక్ బిగ్ అనుకుంటే సరిపోదుథింక్ హై అనుకోవాలి. రాస్తూంటే ఆ ‘హై’ వచ్చేస్తూ వుండాలి అన్న కనువిప్పు ఇది వరకు ఈ వ్యాసకర్తకి లేదు. ఆచార్య స్క్రీన్ ప్లే సంగతులు  రాస్తూంటే అనుకోకుండా ఈ కనువిప్పు కల్గింది. కనువిప్పవడంతో ఆలోచన మొదలయ్యింది. మంచి సినిమాలు, చెడ్డ సినిమాలు అన్నీ ఆలోచింపజేస్తాయి క్వాలిటీ పరంగా. కనుక థింగ్ బిగ్ ఫిజికల్లీ యువర్స్ అనీ, థింక్ హై స్పిరిచ్యువల్లీ యూనివర్సల్ అనీ అర్ధం జేసుకుంటే సరిపోతుంది. అంటే థింక్ హై థింక్ బిగ్ కంటే విస్తారమైనదీ, శక్తిమంతమైనదీ అన్నమాట. థింక్ బిగ్ గురించి చాలా మోటివేషనల్ పుస్తకాలూ వీడియోలూ వున్నాయి. థింక్ హై అని గూగుల్ చేస్తే ఈ పేరుతో ఒక సాంగ్ మాత్రమే కన్పిస్తోంది.

ఐతే స్టార్ సినిమాలు థింక్ బిగ్ గా కూడా రావడం లేదు. స్టార్ సినిమాల్లో థింక్ బిగ్ అనేది టెక్నాలజీ పరంగా మాత్రమే వుంటోంది తప్ప కంటెంట్ పరంగా అదే సోకాల్డ్ సేఫ్ జోన్లో మూస తరగతే. మామూలు హీరోల సినిమా కథలే స్టార్ సినిమాలకుంటున్నాయి. కనుక థింక్ బిగ్ ని ఫిజికల్ అయినందుకు టెక్నాలజీకీ, థింక్ హై స్పిరిచ్యువల్ అయినందుకు కంటెంట్ కీ ఆపాదిస్తే, ఈ  ఫిజికల్- స్పిరిచ్యువల్ రెండిటి కాంబినేషన్ తో మంచి ఫలితాలు సాధించ వచ్చు. ఆఫ్టరాల్ స్క్రీన్ ప్లే అంటే తెరమీద చూపెట్టే మనిషి మానసిక లోకమే కాబట్టి- అంటే కాన్షస్ - సబ్ కాన్షస్ మైండ్ ల ఇంటర్ ప్లేనే కాబట్టి, ఇది స్పిరిచ్యువలే కాబట్టి, థింక్ హై ఇక్కడ కార్యాచరణలోకొస్తోంది.

దీనికేం చేయాలి?
        స్టోరీ ఐడియాల్ని వాడుకలో వున్న నిల్వ సరుకు నుంచి పుష్ చేసి ఇన్నోవేట్ చేయడమే. ఇమాజినేషన్ ని పుష్ చేసి, లేదా యాంటీగా ఆలోచించి, కొత్త పుంతలు తొక్కించడమెలా అన్నది ఇప్పుడు చూద్దాం.

        ఒక స్టోరీ ఐడియా లేదా కాన్సెప్ట్ ఎప్పుడు థింక్ బిగ్ అవచ్చు, ఎప్పుడు థింక్ హై అవచ్చు? హాలీ వుడ్ లాగ్ లైన్స్ (స్టోరీ ఐడియాలు) సెర్చి చేస్తూంటే ఏ క్వయిట్ ప్లేస్ అనే మూవీకి సంబంధించిన లాగ్ లైన్ థింక్ హైకి తార్కాణంగా కన్పిస్తోంది. చూస్తే ఇది 2018 లో 17 మిలియన్ డాలర్ల బడ్జెట్ తో స్మాల్ మూవీ, కానీ బాక్సాఫీసు వచ్చేసి 341 మిలియన్ డాలర్ల గ్రాండ్ ఈవెంట్ గా వుంది!

        ఆలోచించాలి- ఎక్కడ 17, ఎక్కడ 341?మామూలుగా అయితే 17 మిలియన్ డాలర్ల ఈ స్మాల్ బడ్జెట్ మూవీకి లాగ్ లైన్ లేజీగా ఇలా వుండొచ్చు- అణుయుద్ధానంతరం నరమాంస భక్షక గ్రహాంతర జీవుల్ని తప్పించుకోవడానికి ఓ కుటుంబం ఇంట్లో తలుపులేసుకుని బందీ అయిపోయింది. ఈ స్టోరీ ఐడియా హైకాన్సెప్ట్ - బిగ్ బడ్జెట్ మూవీ స్క్రీన్ ప్లేకి కూడా బాగానే అన్పించ వచ్చు.  గ్రహాంతర జీవుల నుంచి రక్షించుకునే కథ. గ్రహాంతర జీవుల మీద ఎన్నో సినిమాలొచ్చాయి, ఇది డిఫరెంట్ గా ఏముంది? రొటీన్ గా ఏ స్థాయిలో ఇలాటి సినిమాలుంటున్నాయో అదే  సోకాల్డ్  సేఫ్ జోన్ లో ఇదీ వుందని లాగ్ లైన్ చూస్తే తెలిసిపోతోంది. ఇంతకి మించి పైకి ఎదగ లేదు. ఊహని విస్తరించుకో లేదు. నెక్స్ట్ లెవెల్ కి తీసికెళ్ళ లేదు. ప్రేక్షకులకి సరికొత్త అనుభవాన్నివ్వలేదు. చూసిందే చూపించే అదే రొటీన్, మూస, పాత ఫార్ములా - వీటినే నమ్ముకుని వుంది. కాబట్టి ఈ ఐడియాతో  ఎంత హైకాన్సెప్ట్ - బిగ్ బడ్జెట్ మూవీ తీసినా మూడో రోజుకల్లా కలెక్షన్స్ డ్రాప్ అవుతాయి.

        ఎందుకంటే ఇది టెక్నాలజీ పరంగా మాత్రమే ఫిజికల్లీ థింక్ బిగ్ కాబట్టి. కంటెంట్ పరంగా థింక్ హై ఆత్మ దీనికి లేదు కాబట్టి. థింక్ హై ఆత్మతో వుంటే కలెక్షన్స్ ని పిండుకుంటుంది. ఇదే చేసింది ఏ క్వయిట్ ప్లేస్’.

        ఏ క్వయిట్ ప్లేస్ లాగ్ లైన్ అసలేమిటంటే, అణుయుద్ధానంతరం వినికిడి శక్తి ఎక్కువున్న గుడ్డి నరమాంస భక్షక గ్రహాంతర జీవుల్ని తప్పించుకోవడానికి, ఓ కుటుంబం ఏ మాత్రం అలికిడి లేకుండా, ఎట్టి పరిస్థితిలో నోట్లోంచి మాట బైటికి రానివ్వకుండా తలుపులేసుకుని ఇంట్లో బందీ అయిపోయింది

        ఈ లాగ్ లైన్లో ఎంత సస్పెన్స్ వుంది, ఎంత థ్రిల్ వుంది. కేవలం రొటీన్ గా చూపించే గ్రహాంతర జీవులని గుడ్డి జీవులుగా చేసి, అధిక వినికిడి శక్తిని కల్పించడంతో కథే మారిపోయింది. కళ్ళు లేకపోయినా శబ్దం వింటే చంపేస్తాయి. నెక్స్ట్ లెవెల్ కెళ్ళిపోయింది కథ. తెలిసిన స్టోరీ లైనునే మెలిదిప్పితే కొత్త లైను అయిపోతుంది. ఇదే థింక్ హై టెక్నిక్.

        అశోకవనంలో అర్జున కళ్యాణం రొటీన్ లైనే. 33 ఏళ్ళు వచ్చినా హీరోకి పెళ్ళికాకపోవడం, పెళ్ళి ప్రయత్నాలు చేసుకోవడం కథ. ఈ లైనుతో ఇదివరకు సినిమాలొ చ్చేశాయి. ఈ కొత్త సినిమా కొత్తగా ఏం చూపించి బాక్సాఫీసు దగ్గర నిలబడింది? ఫ్లాప్ గానే మిగిలింది.

         33 ఏళ్ళు వచ్చినా పెళ్ళి  కానివాడు తనలాంటి ఇతరుల పెళ్ళిళ్ళు  చేయబూనాడు  అని లాగ్ లైన్ వుంటే కొత్త సినిమా అవుతుంది. రొటీన్ కి యాంటీగా ఆలోచించినప్పుడు థింక్ హై అవుతుంది. తన పెళ్ళి కోసం తను పాట్లు పడేవాడు కింది స్థాయి క్యారెక్టర్, తన పెళ్ళి కాకపోయినా ఇతరుల పెళ్ళిళ్ళు  చేసేవాడు పై స్థాయి క్యారెక్టర్. క్యారక్టర్ పై స్థాయిలో వుంటే కథ కూడా పై స్థాయిలో వుంటుంది.

రొటీన్ పాయింట్లు అనేవి నిల్వ సరుకు. నిల్వ సరుకుని వేడి చేసి అందిస్తే వర్కౌట్ అయ్యే రోజులు కావివి. అశోక వనంలో అర్జున కళ్యాణం కూడా పాత లైనుకి వేడి చేసిన  ఫ్రెష్ గా అన్పించే సీన్లే. ఫలితం ఏమైంది? స్టోరీ ఐడియాల్ని హై థింకింగ్ తో కథగా మార్చినప్పుడే నిజమైన ఫ్రెష్ సీన్లు వస్తాయి.

        స్టోరీ ఐడియా థింక్ హై గా వుండాలంటే ఈ  నాల్గిటిని కూడా థింక్ హైగానే   ఆలోచించాలి :  హీరో, హీరో గోల్, కాన్ఫ్లిక్ట్, సొల్యూషన్. రెగ్యులర్ హీరో, రెగ్యులర్ హీరో గోల్, రెగ్యులర్ కాన్ఫ్లిక్ట్, రెగ్యులర్ సొల్యూషన్ లతో సినిమాలుంటాయి. ఈ రెగ్యులర్ కి వ్యతిరేకంగా ఆలోచించినప్పుడు హీరో, గోల్, కాన్ఫ్లిక్ట్, సోల్యూషన్ హై లెవెల్లో కొత్తగా మారిపోతాయి. రిజర్వాయర్ డాగ్స్' లో దొంగలు దోపిడీ ప్లాన్ చేస్తే ఆ ప్లాన్ విఫల మవుతుంది. అప్పుడు తమలో ఒకడు పోలీస్ ఇన్ఫార్మర్ వున్నాడని అనుమానిస్తారు. ఇది రెగ్యులర్. తమలో ఒకడు గాంధేయ వాది వున్నాడని అనుమానిస్తే? దొంగలందరూ  గాంధేయ వాదులుగా మారిపోతే? ఇదేదో కొత్త కామెడీ అవుతుంది. ఉన్నదానికి వ్యతిరేకం (యాంటీ) గా ఆలోచిస్తే థింక్ హై అయిపోతుంది. కాకపోతే యూనివర్సల్ స్పిరిచ్యువల్ టచ్ ఇవ్వాలి. గాంధేయ వాదులుగా మారడం యూనివర్సల్ స్పిరిచ్యువల్ టచ్చే. తన పెళ్ళి కాకుండా ఇతరుల పెళ్ళిళ్ళు చేయడం యూనివర్సల్ అప్పీలున్న స్పిరిచ్యూవల్ టచ్చే...

—సికిందర్