అసలు రాయాలంటే ముందు వామప్
(warm up) అవాలి. జిమ్ము కెళ్ళి బరువు లెత్తబోతే, జిమ్ ట్రైనర్ వచ్చేసి ముందు నీ బాడీని
వామప్ చేసుకోమంటాడు. అంటే ఎకాఎకీన ఎత్తబోయిన
బరువు శరీరం మీద పడి కండరాలు షాక్ కి గురవకుండా, నువ్వీ
బరువెత్తబోతున్నావూ అని ముందస్తుగా కండరాలకి కౌన్సెలింగ్
చేసుకోవడమన్నమాట. కానీ రూములో రైటర్ రాయడానికి
కూర్చున్నప్పుడు మాత్రం అలాటి వామప్పులూ ఏవీ
వుండవు. స్క్రిప్టు రాయడం మొదలెట్టాడంటే
వరసబెట్టి సీన్లే రాసేస్తూంటాడు. జిమ్ములోలాగే
రాయడానికి రూములో కూడా వామప్ చేసుకోవడం మనస్కరించదు.
రాస్తున్న
విషయానికి సంబంధించి ఏ విషయ సేకరణా (వామప్) వుండకపోతే, ఏ క్షేత్ర
స్థాయి పరిస్థితుల పరిశీలనా (వామప్) వుండక పోతే, ఏవో వూహలు అల్లేసుకుంటూ తమ లోకంలో తాము ఆత్మకథ రాసుకోవడమే. క్షేత్ర స్థాయిలో
అంటే - పంపిణీ రంగంలో, ప్రేక్షక రంగంలో- జయాపజయాల కదనరంగంలో- ఇతర భాషా రంగాల్లో - పరిస్థితులేమిటో
తెలుసుకోకుండానే గొప్ప వ్యాపారాత్మక సినిమా
స్క్రిప్టు రాయడం ఎలా సాధ్యం?
బ్యాడ్ రైటింగ్ అంతా వామప్ కి
ఎగనామం పెట్టే దగ్గరే మొదలవుతుంది. ఒక వస్తువు కొనాలన్నా నాల్గు చోట్ల వాకబు చేసి
కొంటాం. కానీ ఒక స్క్రిప్టు రాయాలంటే ఏ
వాకబూ వుండదు. ఇప్పుడు నేనీ స్క్రిప్టు రాస్తున్నాను, దీన్నిప్పుడు ప్రేక్షకులు చూస్తారా,
ప్రేక్షకులు ఎలాటివి చూస్తున్నారు, ఎలాటివి చూసి చూసి విసిగి పోయారు, కొత్తగా ఏం
కోరుకుంటున్నారు, అసలు సినిమా ప్రేక్షకులుగా ఇప్పుడెవరున్నారు, మొదటి రోజు మొదటి
ఆటకి వచ్చే ప్రేక్షకులెవరు, వాళ్ళ అభిరుచులేమిటి, వాళ్ళ అభిరుచులకి ఏ
సామాజికార్ధిక పరిస్థితులు దోహదం చేస్తున్నాయి, ఏ సామాజికార్దిక పరిస్థితుల్ని
దృష్టిలో పెట్టుకుని నేను రాయాలి, నేను రాయాలంటే సదా స్మరించుకోవాల్సిన యూత్ అప్పీల్ అంటే ఏమిటి, ఆ యూత్ అప్పీల్ కి
అబ్బాయిలే వున్నారా, అమ్మాయిలు కూడా వుంటున్నారా ప్రేక్షకుల్లో, ఎంత మంది అమ్మాయిలు
కొత్త దర్శకుల స్మాల్, మీడియం బడ్జెట్
సినిమాలకి వస్తున్నారు, రాకపోతే అబ్బాయిల కోసమే వేటిని దృష్టిలో పెట్టుకుని ఏ
కల్చర్లో, ఏ జానర్లో స్క్రిప్టులు రాయాలి...
అసలు
తెలుగు సినిమాల విజయాల రేటెంత, ఏ సినిమాలు
ఎందుకు ఫ్లాపవుతున్నాయి, ఎందరు కొత్త దర్శకులు వస్తున్నారు, వాళ్ళందరూ ప్లాపై
వెళ్లిపోతూంటే నాకూ అదే పరిస్థితి వస్తుందా, అలా నాకు భయం వేయడం లేదా, ఎందుకు
వేయడంలేదు, నా సొమ్ము కాదనా, ఫ్లాపవుతున్న వాళ్ళు చేస్తున్న తప్పులేమిటి, వాటిని
నేనెలా నివారించుకోవాలి, వాళ్ళల్లో రచయితే వాళ్లకి శత్రువై పోతున్నాడా, అలాటి రచయితే
నాలో కూడా వున్నాడా, ఐడియా నుంచీ డైలాగ్ వెర్షన్ దాకా నాకు తెలిసిందెంత,
నా చుట్టూ వుండి సలహాలిచ్చే నా ఏజి గ్రూపు వాళ్ళ విషయ పరిజ్ఞానమెంత, నూటికి నూరు శాతం ఫ్లాప్స్ ఖాయంగా ఏడాది కేడాది
కళ్ళెదుట కన్పిస్తున్నప్పుడు నేను హిట్టివ్వగలనని ఏ ప్రాతిపదికన నమ్ముతున్నాను,
అసలు నేను చేస్తున్న సబ్జెక్టు ప్రాతిపదికేమిటి, ప్రపంచంలో సినిమాలెన్ని రకాలు,
కమర్షియల్ సినిమాలు, వరల్డ్ (ఆర్ట్) సినిమాలు అనే రెండు రకాలున్నాయని నాకు తెల్సా,
వీటిలో మొదటి రకమే తెలుగులో పనికొస్తాయని నేనెప్పుడైనా ఆలోచించానా, స్క్రిప్టు
కావల సినిమా ప్రపంచానికి సంబంధించి నా జనరల్ నాలెడ్జి ఎంత, నా స్క్రిప్టుకి
శాస్త్రీయంగా స్ట్రక్చర్ లోవుంటూ అలరించే కమర్షియల్ సబ్జెక్టు ఎంచుకుంటున్నానా,
లేక స్ట్రక్చర్ లేకుండా అశాస్త్రీయంగా వుంటూ తెలుగు ప్రేక్షకులకి సహన పరీక్షపెట్టే
వరల్డ్ (ఆర్ట్) మూవీస్ లాంటి ప్రయోజనంలేని
సబ్జెక్టు చేస్తున్నానా, నిర్మాత డబ్బుతో నా
కళా తృష్ణ తీర్చుకోవడానికి వరల్డ్ (ఆర్ట్) మూవీ బాపతు స్క్రిప్టు రాసి నేనూ బరితెగించి
నా వూళ్ళో ముఖం చూపించుకోలేని సినిమా అజ్ఞాని అనిపించుకోబోతున్నానా ఒకవేళ...
సినిమాలెక్కువగా
ఎందుకని ఓన్ రిలీజ్ చేసుకోవాల్సి వస్తోంది, విషయం లేకపోతే ఓన్ రిలీజ్ తప్పదా, ఓన్ రిలీజ్ అంటే ఆశలు వదులుకోవడమేనా, నిర్మాత ఓన్
రిలీజ్ కి సిద్ధపడక మూల పడేస్తే నా గతేంటి, ఇంకో సినిమా అవకాశం వస్తుందా, అసలీ కష్టాలెందు
కొస్తున్నాయి, స్క్రిప్టు రాయడానికి ముందు తగు విధంగా వామప్ చేసుకోక పోవడం వల్లేనా...
భారతదేశంలో
మొత్తం ఎన్ని ప్రాంతీయ - ఉపప్రాంతీయ
సినిమా రంగాలున్నాయో - అక్కడ చోటు
చేసుకుంటున్న పరిణామాలేమిటో నాకేమైనా తెలుసా, తెలుసుకోవడానికి ప్రయత్నించానా,
ఎవరితోనైనా చర్చించానా, తుళు (టులు వుడ్) - బడుగ- కొంకణి - మీరట్ (మాలీవుడ్) - నాగపురి
(ఝాలీవుడ్ ) -సంథాలీ (ఝాలీవుడ్) - డోగ్రీ- లడఖీ (పహారీవుడ్) - అస్సామీ (జాలీవుడ్) –
ఒరిస్సా (ఓలీవుడ్) - చత్తీస్ ఘర్ (చోలీవుడ్)- గుజరాత్ (ఘోలీవుడ్) - భోజ్ పురి...
ఇలా 30 దాకా ప్రాంతీయ, ఉప ప్రాంతీయ సినిమా పరిశ్రమలున్నాయని నాకెప్పుడైనా తెలుసా, ప్రాంతీయ-
ఉపప్రాంతీయ సినిమాలంటేనే ఒకప్పుడు సామాజిక సమస్యలతో కూడిన వాస్తవిక (ఆర్ట్) కథా చిత్రాలే
అయినప్పటికీ అవన్నీ గత రెండు దశాబ్దాల
కాలంలో ప్రపంచీకరణతో కొత్త తరం ప్రేక్షకులందుకున్న సరికొత్త అభిరుచులతో,
జీవనశైలులతో పక్కా కమర్షియల్- మాస్- రోమాన్స్- కామెడీ – యాక్షన్ సినిమాలుగా
మారిపోయి- సొమ్ములు చేసుకుంటున్న పరిణామ క్రమాన్ని నేనెప్పుడైనా గ్రహించానా...
ఈ లోతట్టు ప్రాంతీయ - ఉప ప్రాంతీయ సినిమాలు
చూసే ప్రేక్షకుల్లోనే ఇంత మార్పు వచ్చిందంటే, నేనింకా తెలుగు ప్రేక్షకులు నేను
తీసే నాన్ కమర్షియల్ వరల్డార్టు సినిమాలు చూస్తారని ఎందుకు అనుకుంటున్నాను, తక్కువ
మార్కెట్ గల ప్రాంతీయ -ఉపప్రాంతీయ
రంగాల్లో తక్కువ బడ్జెట్లతో కమర్షియల్ సినిమాలు తీసి మూడు నాల్గు రెట్లు లాభాలెలా
గడిస్తున్నారో ఎప్పుడైనా పరిశీలించానా, ఝార్ఖండ్ లో సినిమాలు తీస్తే రెండు కోట్లు
సబ్సిడీ ఇస్తున్నారనీ -బాలీవుడ్ మేకర్లు ఝార్ఖండ్ బాట పడుతున్నారనీ నాకేమైనా తెల్సా,
మొత్తం సినిమా వ్యవస్థని పరిశీలించకపోతే, అవగాహనా లేకపోతే నేను మూవీ మేకర్ నెలా అవుతాను, స్క్రిప్టు
రాయడానికి నేనేం పనికొస్తాను...
నేను
రాయబోయే సబ్జెక్ట్ ఏమిటి, దాని గురించి ఏం రీసెర్చి చేశాను, ప్రేమ సినిమా
తీయాలన్నా సబ్జెక్టుని బట్టి రీసెర్చి తప్పని సరని నాకేమైనా తెల్సా, దేని మీద ఆధారపడి సబ్జెక్టుకి ఐడియా
అనుకుంటున్నాను, చూసిన తెలుగు సినిమాల నుంచి మృతప్రాయమైన మూస ఫార్ములా ఐడియాలు
తీస్తున్నానా, లేక చుట్టూ ప్రపంచంలోకి చూసి మరింత డైనమిక్ గా నాన్ ఫార్ములాయిక్ ప్రాక్టికల్ ఐడియాలు
తీస్తున్నానా, ఒకప్పటి సినిమాల్లోలాగే ఇప్పుడు కుటుంబాలున్నాయా, ప్రేమలున్నాయా,
పరిస్థితులున్నాయా...
నేను
రాసే సీన్లు - డైలాగులు వచ్చిన సినిమాల్లో
వచ్చినంత మంది వాడేసిన ఎంగిలి – టెంప్లెట్ సీన్లేనా - డైలాగులేనా - లేక సొంతంగా నేనేమైనా సృష్టించి నాదంటూ
వొక ముద్ర వేస్తున్నానా, నేను చూడడానికి - సినిమాగా తీయడానికి - విజువల్ గా స్క్రిప్టు
రాస్తున్నానా, లేక చదువుకోవడానికి - చదువుకుని దిండు కింద పెట్టుకోవడానికి మాత్రమే వ్యాసంలాగా స్క్రిప్టు రాస్తున్నానా, నా సబ్జెక్టు ఏ జానర్ కిందికొస్తుంది, ఆ జానర్
మర్యాదలు నాకేమైనా తెల్సా, లేక గుండుగుత్తగా కలిపి కొట్టేస్తున్నానా, నేనేనుకున్న
ఐడియా రఫ్ గా మనసులోనే వుందా, లేక స్పష్టంగా ముందు దాన్ని కాగితం మీద వర్కౌట్
చేశానా, నా ఐడియాలో కథే వుందా, లేక కమర్షియల్ సినిమాలకి పనికిరాని గాథ వుందా, నా కమర్షియల్ ఐడియాని మూడు
వాక్యాల్లో స్క్రీన్ ప్లే పాయింటాఫ్ వ్యూలో నిర్మించుకున్నానా, నిర్మించుకున్నాక స్క్రీన్
ప్లే పాయింటాఫ్ వ్యూలో సినాప్సిస్ రాసుకున్నానా,
రాసుకున్నాక దాని ఆధారంగా వన్ లైన్ ఆర్డర్ వేస్తున్నానా, లేక ఇవన్నీ డుమ్మాకొట్టి
పని దొంగలా మొక్కుబడి స్క్రిప్టు రాసి - రెండు కోట్లు బడ్జెట్ ఆశిస్తూ నిర్మాతల
చుట్టూ తిరుగుతూ విఫలయత్నాలు చేస్తున్నానా...
అసలు నాకు సినాప్సిస్ రాయడం వచ్చా,
ఎప్పుడైనా నేనొక సినిమా చూసి ఒక పేజీలో క్లుప్తంగా దాని కథ రాయగలిగానా, రెండు నిమిషాల్లో ఎవరికైనా
ఆ సినిమా కథ చెప్పగల్గానా, అసలు నేను అసిస్టెంట్
అవకముందు - అయ్యాకానూ - ఏనాడైనా వివిధ జానర్లలో
నా ఊహా శక్తినీ, నా కల్పనా శక్తినీ, నా సృజనాత్మక శక్తినీ పరీక్షించుకుంటూ, సింగిల్ పేజీ మినీ కథలు
రాసుకున్నానా...నేను ఇంటలిజెంట్ రైటర్నా, లేక లేజీ - అవుట్ డేటెడ్ రైటర్నా...
ఇవీ
వామప్ కి బారులు తీరే ప్రశ్నాస్త్రాలు. ఈ ప్రశ్నలకి సమాధానాలు చెప్పుకోలేకపోతే
స్క్రిప్టు రాయాలనే ఆలోచన వృధా అనుకోవాలి. ఈ వామప్ చేసుకున్నాకే
స్క్రిప్టు రాయడం మొదలెట్టడానికి రెండో మెట్టు- స్క్రీన్ ప్లే సంగతులు
తెలుసుకోవడం. వామప్ చేసుకోకపోతే స్క్రీన్
ప్లే సంగతులు కూడా అనవసరం. అవి తెలుసుకుని ప్రయోజనం లేదు.
―సికిందర్