రివ్యూలు, సాంకేతికాలు, స్క్రీన్ ప్లే సంగతులు...

టికెట్లు దొరకడం యోగం, సినిమాలు చూడడం భోగం, రివ్యూలు రాయడం రోగం!

Sunday, January 2, 2022

1111 : సందేహాలు- సమాధానాలు


  

Q : శ్యామ్ సింగ రాయ్ సినిమా మూల కథను బాలకృష్ణ నటించిన ఆత్మబలం అనే సినిమా నుంచి తీసుకున్నారు అనిపించింది. దాని గురించి వివరించగలరు. శ్యామ్ సింగ రాయ్ లో పాత్రల చిత్రీకరణల మీద అసలు శ్రద్ధ పెట్టలేదు. ఎందుకు అలా జరిగింది? రెండవ పాత్ర అయిన రచయిత పాత్రను అంత బలహీనంగా ఎందుకు చేశారు? అలాగే మొదటి పాత్ర అయిన దర్శకుడి పాత్ర తన మీద అభియోగం మోపినపుడు తానే అసలు ఏం జరిగింది? శ్యాం సింగ రాయ్ ఎవరు?  అని వెతుకుతూ బయలు దేరి ఉంటే అప్పుడు స్క్రీన్ ప్లే అద్భుతంగా ఉండి పాత్ర యాక్టివ్ వ్ మారేది కదా? అలాగే దర్శకుడి పాత్రకు శ్యామ్ సింగ రాయ్ లాగే ఆదర్శ భావాలు ఇప్పటికీ ఉండి తాను కూడా ఆడవాళ్ళ కోసం పోరాడుతూ సినిమా తీశాడు అని చూపించి, ఆ సినిమా శ్యామ్ సింగ రాయ్ కథతోనే తాను తీశాడని అభియోగం మోపబడి, తానే శ్యామ్ సింగ రాయ్ గురించి తెలుసుకుని, సమస్యను పరిష్కరించుకుని ఉంటే కథ అద్భుతంగా ఉండేది అనిపించింది. శ్యామ్ సింగ రాయ్ లాగా రెండు పాత్రల మీద కథ రాసుకున్నప్పుడు ఒక పాత్రను ఇలా గోదాట్లో వదిలేయాలి అంటారా? వివరించగలరు.

—పేరు వెల్లడించడాని కిష్టపడని అసోసియేట్
A : సినిమా హిట్టయ్యాక తప్పులు వెతికితే తప్పులో పడతామేమో ఇలా రాయాలంటే ఆలోచించాలి. మీరు చెప్పిన తప్పుల్ని ప్రేక్షకులు క్షమించి, లేదా ఉపేక్షించి, ఇంకా లేదా అవి తప్పులని తెలీక హిట్ చేశారేమో. ఎలా హిట్టయినా హిట్టన్పించుకున్న అర్హతే చర్చని పూర్వ పక్షం చేసేస్తుంది. అయితే మీలాటి మేకర్స్ కూడా హిట్టయ్యింది కాబట్టి తప్పులన్నీ ఒప్పయ్యాయని ఇలాగే సినిమాలు తీయాలనుకుంటేనే సమస్య వస్తుంది. ఈ హిట్ చూసి నేచురల్ స్టార్ నాని నుంచి కూడా ఇక ఇలాటి సినిమాలే నటిస్తానని స్టేట్ మెంట్ కూడా వచ్చింది. కనుక మరికొన్ని ఇలాటి తప్పులతోనే నాని నుంచి మరిన్ని  శ్యామ్ సింగ రాయ్ లు రావచ్చనీ, తప్పులే ఒప్పులని అవి కొత్త ప్రమాణాల్ని స్థాపించబోతాయనీ అర్ధం జేసుకోవచ్చు. అయినా కమర్షియల్ సినిమాల్లో ఒప్పులుంటాయని ఎవరాశిస్తారు గనుక విశ్లేషించడానికి.

        నేను అనారోగ్యంగా వున్నానూ వచ్చి పొమ్మని అన్న కబురంపితే, వెళ్ళిన రచయిత అయిన తమ్ముడు, ముందు అన్నెలా వున్నాడో చూడకుండా వదిన చేత అన్నం పెట్టించుకు తినడం లాంటి నాగరికత ప్రేక్షకులకి నచ్చి హిట్ చేస్తే ఎవరేమనగలరు. సమాజ ఉద్ధరణకి బయల్దేరిన రచయిత అయిన వాడు, ఒక దురాచార బాధితురాలిని చూసి ముందు ఆమెని ఉద్ధరించకుండా, లవ్ ఎట్ ఫస్ట్ తో ప్రేమలో పడడం, ఆ ప్రేమ కథే నడపడం కూడా ప్రేక్షకులకి నచ్చితే ఎవరేమంటారు. కృష్ణ నటించిన అల్లూరి సీతారామ రాజు వుంది. ప్రసిద్ధ రచయిత త్రిపురనేని మహారధి రచన చేశారు. ఇందులో కృష్ణ పోషించిన అల్లూరి పాత్ర దేశానికి సంపూర్ణ స్వరాజ్యం కోసం పోరాటమెలా సాగించాలో తెలుసుకునేందుకు దేశాటన  చేస్తానని ప్రేమించిన సీతతో చెప్పి వెళ్ళిపోతాడు. అలా వెళ్ళిన అల్లూరి ఎక్కడో ఇంకో సీతతో ప్రేమాయణం సాగిస్తే ఎలా వుంటుంది? ప్రేక్షకులు చప్పట్లు కొట్టి, హీరో కృష్ణ డ్యూయెట్లు చూసి ఎగిరెగిరి హిట్ చేసే వాళ్ళా?

    దేశాటన చేసి తిరిగి వచ్చిన అల్లూరి, అజ్ఞానంలో, శోకంలో ఈ జాతి ఎంత భయంకరంగా బతుకుతోందో చూశాను. విదేశీయుల కసాయి పాలన నుంచి దేశాన్ని విముక్తం చేసే ముందు దేశ ప్రజలు తమ దాస్య బుద్ధి నుంచి విముక్తం కావాలి. అందుకు విప్లవ మార్గ మొక్కటే శరణ్యం  అని సీతకి చెప్పేసి మళ్ళీ సాగిపోతాడు. సాగిపోకుండా ఆమెతోనే వుంటే ఒప్పుకునే వాళ్ళా ప్రేక్షకులు? ఇప్పుడెందుకు సింగరాయ్ రచయిత పాత్రని అలా ఒప్పుకుంటున్నారు? జీవితం ఎలా వుంటుందంటే ఇలా వుంటుంది... జీవితం నీ కిచ్చిన పిలుపుని నువ్వు నిరాకరించావంటే, నిన్ను సృష్టించిన శక్తిని నువ్వు అవమానించుకున్నట్టేనని అంటాడు రాబిన్ శర్మ- ది మాంక్ హూ సోల్డ్  హిజ్ ఫెరారీఅన్నతన  
పాపులర్ పుస్తకంలో. ఇలా వుంటుంది జీవితం. సింగరాయ్ జీవితమిచ్చిన పిలుపుతో సమాజోద్ధరణకి ఇంట్లో వ్యతిరేకించి వెళ్ళిపోయిన వాడు మరి! నిజానికి అల్లూరి జీవితంలో సీత కల్పిత పాత్ర. దాంతో మాస్ అప్పీల్ కోసం మహారధి ఏమైనా చేయొచ్చు, చేయలేదు. ఎందుకు చేయలేదు? అల్లూరి ప్రేక్షకులకి తెలిసిన నాయకుడనా? కాదు, తెలిసిన నాయకుడైనా, తెలియని కల్పిత నాయకుడైనా ప్రేక్షకుల్ని మభ్యపెట్టే పని ఏ రచయితా చేయలేడు. చేస్తే అతను రచయిత కాదు.

        పాత సినిమా కథలు ఇప్పుడు పనికి రావనే మాట నిజమే. కానీ పాత సినిమాల్లో విలువలు కూడా పనికి రావన్నట్టు చిత్రణలు చేసే కాలం వచ్చినట్టుంది...విలువలు మారిపోయాయి. లేదా ప్రేక్షకులకంత పరిశీలనగా సినిమాలు చూసే ఓపిక లేదేమో. ఒకప్పుడు సినిమాలు చూసి సగటు ఆడవాళ్ళు వీధిలో కూర్చుని పాత్రల గురించి చర్చించుకునే వాళ్ళు. పంతులమ్మ లో లక్ష్మి పోషించిన పాత్ర, కోరికలే గుర్రాలైతే లో ప్రభ, చంద్ర మోహన్ల పాత్రలు... వ్యాపారాలు చేసే మగవాళ్ళు కూడా షాపులో కూర్చునికృష్ణవేణి లో వాణిశ్రీ పాత్రని విశ్లేషించుకోవడం...ఇప్పుడిలాటి దృశ్యాలు కన్పిస్తున్నాయా? ఫటాఫట్ గా ఏదో సినిమా చూశామన్పించుకోవడం - ఎఫ్బీలోనో, ట్విట్టర్ లోనో ఓ కామెంట్ పడేసి- పోటాపోటీగా పనీ పాటల్లోకి వెళ్ళిపోయి - సినిమాని ఫినిష్ ఇక మర్చిపోవడం!     

    ఇలా తప్పులో పడినా సరే తప్పదనుకుంటే మాట్లాడుకుందాం... పునర్జన్మ కథతో బాలకృష్ణ నటించిన ఆత్మబలం (1985), సుభాష్ ఘాయ్ తీసిన హిందీ కర్జ్ (1980) కి రీమేక్ అని తెలిసిందే. కర్జ్ వఛ్చేసి ది రీయింకార్నేషన్ ఆఫ్ పీటర్ ప్రౌడ్ (1975) అనే  హాలీవుడ్ కి రీమేక్ అనీ, ఈ హాలీవుడ్ మూవీకి అదే పేరు గల నవల ఆధారమనీ సమాచారముంది. ఇందులో ఈ జన్మలో మ్యూజీషియన్ అయిన హీరో రిషీ కపూర్, గిటార్ వాయిస్తున్నప్పుడు, జ్ఞాపకాల తెరలు తొలిగి పూర్వజన్మలో మ్యూజీషియన్ అయిన రిషీ కపూర్ ట్యూన్స్ కి కనెక్ట్ అవుతాడు. దీంతో పూర్వ జన్మలో తాను ఫలానా అని గుర్తిస్తాడు. పూర్వజన్మలో తను ప్రేమించి పెళ్ళి చేసుకున్న అమ్మాయే తనని చంపిందని కూడా దృశ్యాలు మెదిలి, ఆ భార్య (సిమీ గరేవాల్) మీద పగదీర్చుకోవడానికి బయల్దేరడం కథ. ఆ పగే తను తీర్చుకోవాల్సిన గత జన్మ రుణం (కర్జ్).  

        ఇక్కడ శ్యామ్ సింగ రాయ్ తో పోలిక ఇరు జన్మల టాలెంట్స్ తోనే. కనెక్టవడం దాంతోనే. కర్జ్ లో పూర్వజన్మలో మ్యూజీషియన్ అయిన తనకి కి ఈ జన్మలో మ్యూజీషియన్ అయిన హీరో ట్యూన్ ద్వారా కనెక్ట్ అయ్యాడు. శ్యా సి రా లో పూర్వ జన్మలో రచయిత అయిన తను, ఈ జన్మలో సినిమా డైరెక్టరుగా సినిమా తీసి కనెక్ట్ అయ్యాడు. రెండు జన్మల్నీ కలిపే ఈ బ్రిడ్జింగ్ ఎలిమెంట్స్ తప్ప కథలు వేర్వేరు. కాబట్టి ఇది పక్కన బెడదాం.

       పాత్రల విషయానికొస్తే రెండిట్లోనూ ఫండమెంటల్ డిఫెక్ట్స్ వున్నాయి. అవేమిటంటే, మీరన్నట్టు దర్శకుడి పాత్రని తన పూర్వ జన్మ రహస్యం తను తెలుసుకునే ఎమోషనల్ జర్నీ వైపు మళ్ళించకుండా, కోర్టులో లీగల్ సమస్యగా చేసి అతణ్ణి పాసివ్ గా కూర్చోబెట్టేయడం. పునర్జన్మనేది జన బాహుళ్యానికి ఎమోషనల్- సెంటి మెంటల్ ఇష్యూయే తప్ప లీగల్ ఇష్యూ కాదు. ఇక రచయిత పాత్ర- పైగా మార్క్సిస్టు భావాలున్న రచయిత పాత్రని -దురాచార నిర్మూలన కోసం పోరాడే పాత్రగా కాక లవర్ బాయ్ గా మార్చేయడం. ఈ క్రమంలో ప్రేమా పెళ్ళీ గొడవల్లో ప్రాణాలు పోగొట్టుకోవడం, సమాజోద్ధరణకి ప్రాణత్యాగం చేయకుండా. ఫండమెంటల్ డిఫెక్ట్స్ తో ఈ పాత్రలూ, వాటి కథలూ ఎలా బలహీనంగా, తప్పుల తడకగా వుండచ్చో అలా వున్నాయి. ఇంతకంటే విశ్లేషణ అనవసరం. ఈ రెండు పాత్రలే కాదు, హీరోయిన్ సాయి పల్లవి పోషించిన దేవదాసీ పాత్ర సైతం డిటో ముగింపు సహా. ముగింపులో పిల్లలకి నాట్యం నేర్పిస్తూ జీవనం సాగిస్తూంటుంది. ఏ నాట్యమైతే తనని దేవదాసీ గా చేసి ఉదర పోషణ కోసం ఆడించిందో, ఆ నాట్యంతోనే బ్రతుకు తెరువు చూసుకోవడం! పాత్ర చిత్రణలంటే ఇవే, విలువలంటే ఇవేనని ఇలాగే సినిమాలు తీస్తూ పోవచ్చు.  

Q : ఒక థ్రిల్లర్ కథ తక్కువ బడ్జెట్ లో రాసుకున్నాను. దీని స్క్రీన్ ప్లే కరెక్ట్ గా ఉందంటారా చూసి చెప్పగలరు.
—ఎన్ కె, రచయిత
A : ఇలా కథలు పంపించి చదివి చెప్పమంటే చదవడమూ సాధ్యం కాదు, చదివి చెప్పడమూ అయ్యే పని కాదు. మీరే కాదు, తరచూ కొందరు ఇలా కథలు పంపించేసి అడుగుతున్నారు. ఏవైనా సందేహాలుంటే ఈ శీర్షికకి రాయవచ్చు, సమాధానం దొరుకుతుంది. రాసుకున్న కథల గురించి అడగాలంటే మాత్రం ముందుగా సంప్రదించాలి. ఇలా కాకుండా పంపిస్తూ పోతే ఇంతే సంగతులు. ఇంకొందరు సాహిత్య కథలు కూడా పంపిస్తున్నారు. పాశ్చాత్య నవలాకారులు త్రీయాక్ట్స్ స్ట్రక్చర్ గురించే మాట్లాడతారు స్క్రీన్ ప్లేలకి లాగా. కానీ రాయడం మాత్రం త్రీయాక్ట్స్ స్ట్రక్చర్లో నవలల్లాగా రాస్తారు, సినిమా ల్లాగా కాదు. కథానికలు కూడా ఇంతే. ఐతే మనం వీటికి సలహా సంప్రదింపులు మాత్రం పెట్టుకోవడం లేదు.

Q : విజువల్ స్టోరీ టెల్లింగ్ కి రిఫరెన్స్,  లేదా ఆ బ్రెయిన్ డెవలప్ అవడానికి బుక్స్ ఏమైనా రిఫర్ చేయగలరా?
—కె. హరీష్, అసోసియేట్
A : విజువల్ స్టోరీ టెల్లింగ్ గురించి నెట్ లో మీకు సమాచారం దొరుకుతుంది. బుక్స్ కూడా చాలా వున్నాయి. ఏదైనా సెలెక్ట్ చేసుకోవచ్చు. షో డోంట్ టెల్ కి మాత్రం బుక్స్ లేనట్టున్నాయి, నెట్ లో సమాచారముంది. ఈ రెండిటికీ తేడా ఏమిటనొచ్చు. తేడా ఏమీ లేదు- రెండూ సీన్ల సంఖ్యని, నిడివినీ  తగ్గించే ఉపాయాలే. కేవలం ఇవి చదివితే ఉపయోగం లేదు. సినిమాలు చూస్తూ అన్వయించుకోవాలి. దీని ప్రకారం సీన్లు వుంటున్నాయా, లేకపోతే ఎలా మార్చవచ్చనే అభ్యాసం అలవాటు చేసుకోవాలి.

—సికిందర్