రివ్యూలు, సాంకేతికాలు, స్క్రీన్ ప్లే సంగతులు...

టికెట్లు దొరకడం యోగం, సినిమాలు చూడడం భోగం, రివ్యూలు రాయడం రోగం!

14, జనవరి 2022, శుక్రవారం

1117 : రివ్యూ


కథ  - దర్శకత్వం : కళ్యాణ్ కృష్ణ
తారాగణం  : నాగార్జున, నాగ చైతన్య, రమ్యకృష్ణ, కృతీ శెట్టి, రావు రమేష్, నాగబాబు, వెన్నెల కిశోర్, ఝాన్సీ, బ్రహ్మాజీ తదితరులు
స్క్రీన్ ప్లే : సత్యానంద్, సంగీతం : అనూప్ రుబెన్స్, ఛాయాగ్రహణం : యువరాజ్
విడుదల : జనవరి 14, 2022
***

        2016 సంక్రాంతికి కళ్యాణ్ కృష్ణ దర్శకత్వంలో నాగార్జున నటించిన సోగ్గాడే చిన్నినాయనా ఎంత ఘనవిజయం సాధించిందో తెలిసిందే. ఈ సంక్రాంతికి దీని సీక్వెల్ గా బంగార్రాజు విడుదల చేశారు. ఈ సారి నాగార్జునతో బాటు నాగ చైతన్య నటిస్తూ చిన బంగార్రాజు పాత్ర పోషించాడు. ఈ సీక్వెల్ తండ్రీ కొడుకుల వల్ల ఇంకెంత ప్రీమియం వినోదంగా మారిందో చప్పున చూసేద్దాం...

కథ
          సోగ్గాడే చిన్ని నాయనా లోని బంగార్రాజు (నాగార్జున) కొడుకు డాక్టర్ రామ్మోహన్ (నాగార్జున) ఇప్పుడు కొడుకుని కని, భార్య చనిపోయి, కొడుకుని తల్లి సత్యమ్మ (రమ్యకృష్ణ) కప్పగించి తిరిగి అమెరికా వెళ్ళిపోతాడు. మనవడికి భర్త పేరే వచ్చేలా చిన బంగార్రాజు అని పేరు పెట్టుకున్న సత్యమ్మ అల్లారు ముద్దుగా పెంచుతూ చనిపోయి, స్వర్గంలో వున్న భర్త బంగార్రాజుని చేరుకుంటుంది. వూళ్ళో సర్పంచ్ (రావురమేష్) కూతురు నాగలక్ష్మి (కీర్తీ శెట్టి) తో క్షణం పడని మనవడు చిన బంగార్రాజుని స్వర్గం నుంచి చూసి, మనవణ్ణీ నాగలక్ష్మినీ ఎలాగైనా కలిపి పెళ్ళి చేసి రమ్మని బంగార్రాజుకి చెప్పి పంపిస్తుంది సత్యమ్మ. భూమ్మీద మనవడు చిన బంగార్రాజు (నాగ చైతన్య) శరీరంలోకి ప్రవేశించిన బంగార్రాజు ఆత్మ, ఇప్పుడా ఇద్దరి ప్రేమని ఎలా చక్కబర్చి పెళ్ళి చేసిందనేది, మనవణ్ణి చంపాలని జరుగుతున్న కుట్రని ఎలా ఎదుర్కొందన్నదీ మిగతా కథ.  

ఎలా వుంది కథ

         నాటి సంక్రాంతి విలేజి వినోదం సోగ్గాడే చిన్ని నాయనా లోలాగే సోషియో ఫాంటసీ కమర్షియల్ కథ. దర్శకుడు కళ్యాణ్  కృష్ణ మొదటి సినిమా సోగ్గాడే చిన్ని నాయనా కి తనది కాని కథని (మూల కథ పి రామ్మోహన్, స్క్రీన్ ప్లే సత్యానంద్) ఓన్ చేసుకుని, ఒక విజయవంతమైన వినోదాన్ని అందించగల్గిన వాడు, 2017 లో రెండో సినిమా రారండోయ్ వేడుక చూద్దాం ని సొంత కథతో తీసి ఫ్లాప్ చేశాడు. ఎలాగైతే ఈ రెండో సినిమాకి ప్రాణంలేని కథ చేశాడో, ఇప్పుడు మూడో సినిమా బంగార్రాజు కీ ప్రాణం లేని సొంత కథే చేశాడు.  ప్రాణమే లేకపోతే బంగార్రాజు ఆత్మ ఎక్కడుంటుంది. మనవడు చిన బంగార్రాజు శరీరంలోకి తాత బంగార్రాజు దూరినంత మాత్రాన ఏం జరుగుతుంది కథకి శరీరం లేక పోయాక.

        రెండో సినిమా కథలో కొత్తదనం లేనట్టే మూడో సినిమాలోనూ లేదు. రెండో సినిమా లాగే మూడో సినిమా పాత కథని కూడా ఆసక్తికరంగా చెప్పలేకపోయాడు పాత్ర చిత్రణలు సహా. రెండో సినిమాలో ఫస్టాఫ్ లో విషయం లేనట్టే, మూడో సినిమాలోనూ లేదు. రెండో సినిమాలో సెకండాఫ్ ముప్పావు గంట సేపూ కథని  పక్కకి తప్పించి, వెన్నెల కిషోర్ పెళ్ళి తంతే సాగించినట్టు, మూడో  సినిమాలో నాగ చైతన్య- కీర్తీ శెట్టిల విషయం లేని ప్రేమని సాగదీశాడు.

        స్వర్గం నుంచి వచ్చిన బంగార్రాజు ఆత్మ తన మహిమతో ప్రేమకి ఒక క్రేజీ ఫార్ములా ప్రయెగించి సంచలనం రేపకుండా- ప్రేమికుల్ని ముప్పుతిప్పలు పెట్టకుండా- తను ఆత్మ అనే విషయాన్నే మర్చిపోతే ఇంకేం కథ. ఫాంటసీ జానర్ అన్నాక మానవాతీత శక్తుల వినియోగంలేని వినోద కాలక్షేప మెలా సాధ్యం.

     సోగ్గాడే చిన్ని నాయనా లో బంగార్రాజు కొడుకు పాత్ర, భార్యతో వూళ్ళోకి రావడంతో వుంటుంది. ఈ ప్రారంభమే ఇద్దరూ విడాకులు నిర్ణయించుకుని వచ్చారన్న ఎమోషనల్ హుక్ తో వుంటుంది. ఈ ఎమోషనల్ హుక్ మొత్తం కథనంతా బలంగా నడిపిస్తూంటుంది. విడాకుల నిర్ణయానికి కారణం కొడుకు తన పనే తప్ప, ఇంకో పని పట్టకుండా భార్యని నిర్లక్ష్యం చేయడం. ఇతనిలా తయారవడానికి తల్లి సత్యమ్మే కారణం. చనిపోయిన భర్త బంగార్రాజు మన్మధ వేషాలేస్తూ తలనొప్పిగా తయారయ్యాడని, కొడుకు కూడా అలా తయారవకూడదని, ఆడగాలి సోకకుండా కట్టుదిట్టంగా పెంచింది కొడుకుని. దీంతో కొడుకు మన్మధ బాణం లేని మొండి మొగుడుగా తయారయ్యాడు. ఇలా ఇక్కడున్న వొక ఎమోషనల్ సెటప్ ఈ సీక్వెల్ కి కొరవడింది. చైతూ- కీర్తీల మధ్య కీచులాటలొక సమస్యా? అది తీర్చే కథ వో కథా? కథే కాక పోయినా వున్న దాన్నిబంగార్రాజు స్పెషల్ పవర్స్ తో ఫన్నీ రోమాంటిక్ ఫాంటసీ చేయొచ్చు. ఇదీ లేకపోవడంతో సంక్రాంతికి వినోదం సోసోగా తయారైంది.

నటనలు – సాంకేతికాలు

    బంగార్రాజు సీనియర్ గా నాగార్జున ఆరేళ్ళ క్రితం సోగ్గాడులాగే అందం తగ్గకుండా గ్లామరస్ గా వున్నాడు. స్వర్గంలో రంభా ఊర్వశీ మేనకలతో రోమాంటిక్ సాంగ్ రోస్ట్ చేశాడు. కథలోకి వస్తే బంగార్రాజు జూనియర్లోకి దూరి చేసిన కామెడీ మాత్రం పాతగానే వుంది పేలకుండా. జూనియర్లోకి దూరి ఫైట్లు చేసే రెగ్యులర్ టెంప్లెట్ సీన్లూ వున్నాయి. మార్వెల్ స్టూడియోస్ సూపర్ మాన్ సినిమాలు కొత్తకొత్తగా వూపేస్తున్న కాలంలో, నాగ్ ఆత్మ పాత్ర ఇన్నోవేటివ్ గా కొత్త విన్యాసాలతో నెక్స్ట్ లెవెల్ కెళ్ళాల్సింది. ఉన్న స్థాయిలోనే వుండిపోయింది. స్వర్గ దృశ్యాలకి, టెంపుల్ సీన్సుకీ వెచ్చించిన సీజీ వర్క్ అసలు నాగ్ క్యారక్టర్ విషయంలో విస్మరించారు.

        చిన బంగార్రాజుగా నాగచైతన్య ఎప్పటిలాగే హుషారుగా నటించాడు. పాత్రగా సాగడానికి ఎమోషనల్ గోల్ లేకపోవడంతో, కథలో కూడా ఎమోషనల్ త్రెడ్డే లేకపోవడంతో, కీర్తీ శెట్టితో పైపైన సాగే రోమాన్స్ కి పరిమితమైపోయాడు. హిట్స్ సాంగ్స్ తో మాత్రం అలరించగల్గాడు. నాగ్ - చైతూలు కలిసి కన్పించే సీన్లు వెండితెరని వెలిగించేసినా కథలో విషయం లేకపోవడం వల్ల కేవలం మోడలింగ్ చేస్తున్నట్టే, లేదా క్యాట్ వాకింగ్ చేస్తున్నట్టే వున్నారు. క్లయిమాక్స్ మాత్రం కొంత విషయం కనపడి ఇద్దరూ కాస్త ఫర్వాలేదన్పించుకున్నారు.

        లేటెస్ట్ గ్లామరామృతం హీరోయిన్ కీర్తీ శెట్టి సర్పంచ్ గా మారే పాత్ర చిత్రణకి, ఆ కామెడీకి రెండు మూడు చోట్ల మాత్రమే నవ్వొస్తుంది. ఆమె పాత్రని సరిగా డెవలప్ చేయకుండా టెంప్లెట్ హీరోయిన్ స్థాయిలో వదిలేశారు. రమ్యకృష్ణ ఎక్కువ గ్లామరస్ గా వుంది వెండి తెరకి. ఆత్మగా ఆమె కూడా వచ్చి కొన్ని పనులు చేస్తుంది. ఇక హీరోయిన్ తండ్రిగా రావురమేష్ సైడ్ క్యారక్టర్ గానే మిగిలిపోయారు. సహాయ పాత్రల్లో ఇతరులందరూ హంగామా చేస్తారు కథ లేకపోయినా.

        యువరాజ్ ఛాయాగ్రహణంలో అతిగా డీఐ చేసిన గ్రామీణ విజువల్స్ కన్పిస్తాయి. పాటల దృశ్యాల్ని అత్యంత రంగులమయం చేసి, పాటల కోసమే సినిమా చూడాలన్నట్టుగా చేశారు. హమ్ దిల్ దే చుకే సనమ్ పాటల చిత్రీకరణ గుర్తొచ్చేలా. అనూప్ రూబెన్స్ ఆరుకి ఆరు పాటలూ హిట్ చేశాడు. ఇతర సాంకేతిక విలువలన్నీ బావున్నాయి.

చివరికేమిటి

    సోగ్గాడే చిన్ని నాయనా ఇప్పుడు తీసి బంగార్రాజు గతంలోనే తీసి వుంటే ఆరోహణ క్రమం కనపడేది.  సీక్వెల్ అన్నాక ప్రీక్వెల్ ని మించిన స్థాయిలో వుండాలి. అప్పుడు బంగార్రాజు తీసి ఇప్పుడు సోగ్గాడే తీస్తే కథల్నేమీ మార్చాల్సిన అవసరం రాదు. అప్పట్లో అంచనాలుండేవి కాదు కాబట్టి బంగార్రాజూ హిట్టయ్యేది, ఇప్పుడు అంచనాలుంటాయి కాబట్టి వాటిని అందుకుంటూ సోగ్గాడూ హిట్టయ్యేది.

        బంగార్రాజు సెకండాఫ్ కెళ్ళడానికి ఫస్టాఫ్ లో కారణం లేదు. ప్రేమకథలో విషయం లేదు, ఇంటర్వెల్లో హీరోయిన్ విడిపోయే సన్నివేశమూ సరిగా లేదు. ఫస్టాఫ్ ముప్పావు గంట వరకూ చాలా విషయాలుంటాయి గానీ దేంతోనూ భావోద్వేగాలు పుట్టవు. చిన బంగార్రాజు పుట్టుక, గుడిని విలన్లు దోచే ప్రయత్నం, చిన బంగార్రాజు పెంపకం, స్కూల్లో చిన్న హీరోయిన్ తో తగువులాటలు, స్వర్గంలో పెద్ద బంగార్రాజు సరసాలు, చిన బంగార్రాజు పెద్దవాడై హీరోయిన్ వెంట పడ్డం, మధ్యలో గుడి కింద వజ్రాల గనులతో విలన్ కుట్ర ఇలా యాభై నిమిషాలు గడిచిపోయాక- స్వర్గం నుంచి బంగార్రాజు ఆత్మ వచ్చి చిన బంగార్రాజులోకి దూరడంతో కథ ప్రారంభమవుతుంది.

        ఓ అరగంట ఇంటర్వెల్ వరకూ బంగార్రాజు ఆత్మతో కామెడీలయ్యాక, చిన బంగార్రాజుతో హీరోయిన్ విడిపోవడం, గుడి కింద గనులు దోచాలంటే అడ్డున్న చిన బంగార్రాజుని విలన్ చంపాలనుకోవడంతో ఇంటర్వెల్. ఇలా ఫస్టాఫ్ లో ప్రధాన కథ సరిగా లేక, విలన్ తో ఉప కథ రొటీన్ గా వున్నాక, సెకండాఫ్ ఫస్టాఫ్ లాగే ఇంకా కథని వెతుక్కుంటూ వుండి పోయింది. దీన్ని మరిపించడానికన్నట్టు  చాలా మాస్ కామెడీలు చేశారు. చివరి కెలాగో క్లయిమాక్స్ కొచ్చి, సగటు ప్రేక్షకులకి సరిపోయే ఎమోషనల్ ముగింపుని మాత్రం ఇచ్చారు.  

—సికిందర్