రివ్యూలు, సాంకేతికాలు, స్క్రీన్ ప్లే సంగతులు...

టికెట్లు దొరకడం యోగం, సినిమాలు చూడడం భోగం, రివ్యూలు రాయడం రోగం!

Sunday, January 16, 2022

1118 : రివ్యూ!

రచన - దర్శకత్వం : పులి వాసు
తారాగణం : :
 కళ్యాణ్ దేవ్, రచితా రామ్, రాజేంద్ర ప్రసాద్ నరేష్, ప్రగతి, పోసాని కృష్ణ మురళి
సంగీతం:
 తమన్‌, ఛాయాగ్రహణం : సినిమాటోగ్రఫీ: శ్యామ్ కే నాయుడు
నిర్మాత: రిజ్వాన్
విడుదల : జనవరి 14
, 2022
***

        మెగాస్టార్ అల్లుడు కళ్యాణ్ దేవ్ 2018 లో విజేత అనే విఫల యత్నంతో ఎంట్రీ ఇచ్చాక ఇప్పుడు సూపర్ మచ్చి తో రీ ఎంట్రీ ఇచ్చాడు. మధ్యలో నాల్గేళ్ళు గడిచిపోయాయి. కన్నడ హీరోయిన్ రచితా రామ్ తో కలిసి ఈ ప్రేమకథ నటించాడు. దీనికి దర్శకత్వం వహించిన కొత్త దర్శకుడు పులి వాసు ఈ సినిమా అస్సలు నిరాశపర్చదని భరోసా ఇచ్చాడు. అంటే పెద్దగా ప్రమోషన్ లేకుండానే విడుదలైన ఈ కళ్యాణ్ దేవ్ మలి ప్రయత్నం సక్సెస్ అన్నట్టేనా? దర్శకుడిచ్చిన భరోసాతో చూడొచ్చా? చూడాలో వద్దో చూద్దాం...  

కథ

రాజు (కళ్యాణ్ దేవ్) ఆవారాగా ఫ్రెండ్స్ తో తిరుగుతూ బార్‌లో పాటలు పాడుతూంటాడు. ఇతణ్ణి ప్రేమిస్తూ మీనాక్షి (రచిత రామ్) అనే అమ్మాయి వెంట పడుతూంటుంది. ఈమె ఇన్ఫోసిస్‌ లో టెకీ. లక్షన్నర రూపాయల జీతం. ఇలాటి అమ్మాయి ప్రేమిస్తున్నా రాజు తిరస్కరిస్తాడు. ఆమె వదిలి పెట్టదు. ఈమెని వదిలించుకోవడానికొక కండిషన్ పెడతాడు. ఒక రాత్రి తనతో గడిపితే ఆమె ప్రేమని అంగీకరించి పెళ్ళి చేసుకుంటానని అంటాడు. దీనికీ ఆమె ఒప్పుకుంటుంది. అసలు ఆవారా రాజుని మీనాక్షి ఎందుకు ప్రేమించింది? రాజు కంటే ముందు ఆమె ఎవర్ని ప్రేమించింది? చివరికి రాజుకే చేరువైందా? ఆ రెండో అతన్నే కోరుకుందా? ఆమె ఇలా ప్రవర్తించడానికి ఆమె తండ్రి చనిపోతూ చెప్పిన మాటేమిటి? ...ఇవి తెలుసుకోవాలంటే మిగతా సినిమా చూడాలి.

ఎలావుంది కథ

1976 లో కె. రాఘవేంద్రరావు దర్శకత్వంలో రెండో సినిమాగా జ్యోతి అనే లో- బడ్జెట్ విడుదలైంది. ఇందులో జయసుధ, మురళీ మోహన్, గుమ్మడి నటించారు. రచయిత్రి సి. ఆనంద రామం  మమతల కోవెల నవలకాధారం. సత్యానంద్ చిత్రానువాదం. సూపర్ హిట్ బ్లాక్ అండ్ వైట్ సినిమా. క్రాంతి కుమార్ నిర్మాత. ఇందులో ఉత్తమ నటనకి జయసుధ, గుమ్మడిలకి ఫిలిమ్ ఫేర్ అవార్డులొచ్చాయి. ఈ సినిమాలో జయసుధ తండ్రి వయసున్న గుమ్మడి దగ్గరి కొచ్చి తనని పెళ్ళి చేసుకోమని అభ్యర్ధిస్తుంది. పెళ్ళి చేసుకుంటుంది కూడా. ప్రేమించిన మురళీ మోహన్ని కాకుండా గుమ్మడి నెందుకు పెళ్ళి చేసుకుంది? ఇదీ సస్పెన్సు.

        ఒకమ్మాయి భవిష్యత్తుని పణంగా పెట్టి ఆల్టర్నేట్ ప్రేమని వెతుక్కుందంటే దాని వెనుక కదిలించే కారణం వుండొచ్చు. ఇదే జ్యోతి ని చిరస్మరణీయం చేసింది. ఇదే పాయింటు సూపర్ మచ్చి కి కాపీ చేశారో లేక కాకతాళీయమో గానీ, ఈ పాయింటుతో తలపెట్టిన కథాకథనాలు సింగిల్ స్టార్ రేటింగుకి తీసిపోకుండా వున్నాయి. పైగా టైటిల్ కీ సినిమాకీ సంబంధం లేదు. 

        తండ్రి చెప్పిన మాట అనే పైన చెప్పుకున్న పాయింటుతో ఇది మీనాక్షి పాత్ర ప్రధానంగా వుండాల్సిన కథ. అంటే ఆమె కేంద్రంగా ఆమె చుట్టూ అల్లాల్సిన కథవ్వాలి. కానీ ఏ విజన్ లో పెట్టుకుని ఈ కథని అల్లారో గానీ, మీనాక్షీ మీద కాసేపు- రాజు మీద కాసేపూ విజన్ మారుతూ, ఎవరి కథ ఫాలో అవాలో అర్ధం గాకుండా తయారైంది. చదువు సంధ్యల్లేని, ఒక ఆవారాని ఒక పెద్ద ఉద్యోగం చేసే అమ్మాయి ఒక కారణంతో ప్రేమించడమే ఒక పాయింటైతే, మళ్ళీ ఆ ఆవారా రాజు ఆమెని తిరస్కరించడానికో కారణముందని అతడికి ఇంకో పాయింటు కల్పించడంతో ఈ రెండు పాయింట్ల మధ్య రెంటికీ చెడ్డ రేవడి అయింది కథ.

        మళ్ళీ సెకండాఫ్ లో ఇద్దరూ వేరే ఇద్దర్నీ ప్రేమించే కథనం అదనపు కన్ఫ్యూజన్. ఆమె తనకి ఏ మాత్రం సరితూగని రాజుని ప్రేమించడానికి చనిపోతూ తండ్రి చెప్పిన మాటే కారణమైతే, దాని కోసం రాజుతో ఒక రాత్రి గడపడానికైనా సిద్ధపడితే, రాజు ఆమె ఎందుకిలా చేస్తోందని ఆలోచించకుండా, తన వెంట పడుతున్న ఆమె అసలు కథ తెలుసుకునే ప్రయత్నం చేయకుండా- ఒక రాత్రి గడపడం గురించి ప్లేటు ఫిరాయించి నీతులు చెప్పడం వుంటుంది.

        హీరోయిన్ కి హిడెన్ ట్రూత్ అనే ప్లాట్ డివైస్ ని పెట్టుకుని సృష్టించే ఇలాటి సమస్యాత్మక కథకో ప్రయోజన ముండాల్సింది లేదు. హిడెన్ ట్రూత్ తో ఈ పరిస్థితి ఎదురైన హీరోయిన్ ఇక ఏం చేయాలన్న ప్రశ్న ప్రధానంగా బలంగా, ఆలోచనాత్మకంగా,  ప్రాక్టికల్ గా వుండాల్సిన కథ.

నటనలు- సాంకేతికాలు

కళ్యాణ్ దేవ్ ఈ రెండో సినిమాతో కూడా స్కిల్స్ పెంచుకుని నటించలేదు. ఒకే ఎక్స్ ప్రెషన్ తో సినిమా మొత్తం లాగించేశాడు. ఫైట్లు, డాన్సులు మాత్రం బాగా చేయగలడని  నిరూపించుకున్నాడు. ఇలాటి  బరువైన రోమాంటిక్ డ్రామాలు గాకుండా  తేలికపాటి లవ్ - యాక్షన్లు చేసుకుంటే సరిపోతుందేమో.  మొదటి సినిమా విజేత లో కూడా తండ్రీ కొడుకుల బరువైన కథతో తనకి ఎమోషన్లు వర్కౌట్ కాని నిదర్శనముంది. పోతే తను నటించిన ఈ రెండు సినిమాల్లో కూడా ఆవారా పాత్రే తీసుకున్నాడు. ఇలా ఒకే టైపు సినిమాలు, అవీ లో- గ్రేడ్ సినిమాలు చేయడం ఇంకో ప్రత్యేకతగా కన్పిస్తోంది.

        ఇక కన్నడ హీరోయిన్ రచితా రామ్ టాలెంటెడ్ నటియే. ఈ క్లిష్ట పాత్రని నటించగల సామర్ధ్యం వుంది. కానీ కథే గందర గోళంగా వుంటే క్లిష్ట పాత్ర ప్రేక్షకుల పాలిట దుష్ట పాత్రయి పోతుంది. క్లిష్ట పాత్ర కథా కథనాలూ, నటనా ఎలా వుంటాయో దర్శకుడూ హీరోయినూ కలిసి జ్యోతి లో జయసుధని చూసి వుండాల్సింది.

        హీరోయిన్ తండ్రి పాత్రలో రాజేంద్ర ప్రసాద్, హీరో తల్లిదండ్రుల పాత్రల్లో నరేష్, ప్రగతి నటించారు. ప్రొడక్షన్ విలువలు మాత్రం బావున్నాయి. తమన్ సంగీతం సినిమా స్థాయికి తగ్గట్టుంది.

చివరికేమిటి

గత నెల హిందీలో  అట్రంగీ రే విడుదలైంది. ధనుష్, సారా అలీ ఖాన్, అక్షయ్ కుమార్ నటించిన రోమాంటిక్ కామెడీ. ఇందులో సారా ఇతరులెప్పుడూ చూడని మెజీషియన్ అక్షయ్ ని ప్రేమిస్తూ పదేపదే అతడి కోసం ఇంట్లోంచి పారిపోతూంటుంది. ఇలా కాదని ఒక రోజు ఆమె బంధువులు దారిని పోతున్న మెడికో ధనుష్ ని కిడ్నాప్ చేసి సారాతో పెళ్ళి జరిపించస్తారు. బీహారులో ఇలాటి కిడ్నాప్ పెళ్ళిళ్ళు మామూలే. అవతల తనకి పెళ్ళి నిశ్చయమై వుంటే ఈ కిడ్నాప్ పెళ్ళితో ధనుష్ పిచ్చెత్తి పోతాడు. సారా మాత్రం మెజీషియన్నే కలవరిస్తూంటుంది. ఒక రోజు అతను గుర్రం మీద వస్తూంటే ఎదురు పరిగెడుతుంది. అక్కడ గుర్రముండదు, మెజీషియనూ వుండడు. అదంతా ఆమె వూహే  అన్నమాట. వూహాల్లో మెజీషియన్ని సృష్టించుకుని ప్రేమించుకుంటోంది. ఆమెది మెంటల్ కండిషన్. కథకి సెంట్రల్ క్యారక్టర్. ఆమెకి సమస్య వున్నట్టు ధనుష్ కింకో సమస్య వుండదు. ఆమె సమస్యని పరిష్కరించడమే ధనుష్ సమస్య. ఇక్కడ్నుంచీ సమస్యని పరిష్కరించే బాటలో ఈ కథ ఎంత గందర గోళంగా, బోరుగా తయారై 1.5 రేటింగ్ సంపాదించుకుందో తెలిసిందే. ఇది కాదు విషయం- ఇందులో సెంట్రల్ క్యారక్టర్ గా హీరోయిన్ వున్నప్పుడు సమస్య ఆమెకే వుంది. ఈమె సమస్యని పరిష్కరించడమే హీరో సమస్య. ఈ కాన్షస్ - సబ్ కాన్షస్ ఇంటర్ ప్లేనే సూపర్ మచ్చి లో లోపించింది. ఇద్దరికీ వేర్వేరు సమస్యలు పెట్టడం వల్ల.

        ఫస్టాఫ్ సాంతం రాజు ఆవారాతనం, మీనాక్షీ ప్రేమిస్తూ వెంటపడడం తప్ప కథనంలో మార్పు రాదు, ప్లాట్ పాయింట్ రాదు. ఎందుకు ఆమె రాజు లాంటి ఆవారాని లొంగదీయడానికి పడకెక్కడానికి సైతం సిద్ధపడిందో చెప్పకుండా సెకండాఫ్ లో వరకూ నాన్చారు. అట్రంగీ రే లో ఆమెకి మెజీషియన్ తో ప్రేమ కల్పననే ప్లాట్ పాయింట్ ఫస్టాఫ్ లోనే వచ్చేసి కథ ప్రారంభమైపోతుంది.

        సెకండాఫ్ లో మళ్ళీ ఇద్దరి వేర్వేరు ప్రేమలు టార్చరే. కథేమిటో అర్ధం గాకుండా, పాత్రలేమిటో అర్ధంగాకుండా చేస్తూ అది సస్పెన్సు పోషణ అనుకుంటే - ఎండ్ సస్పెన్సూ, మిడిల్ మాటాషులతో ఫిష్ మార్కెట్టే అవుతుంది తప్ప సూపర్ మచ్చీ అవదు.

సికిందర్