తారాగణం: వెంకటేష్, మీనా, కృతిక, ఎస్తర్ అనిల్, తనికెళ్ల భరణి, నదియా, నరేష్, సంపత్ రాజ్ తదితరులు
సంగీతం: అనూప్ రూబెన్స్, ఛాయాగ్రహణం : సతీష్ కురుప్
బ్యానర్స్ సురేశ్ ప్రొడక్షన్స్, ఆశీర్వాడ్ సినిమాస్ నిర్మాతలు: డి సురేష్ బాబు, ఆంటోనీ పెరంబవూర్, రాజ్ కుమార్ సేతుపతి
విడుదల ; నవంబర్ 25, 2021 (అమేజాన్ ప్రైమ్)
***
2014 లో వెంకటేష్ తో హిట్టయిన ‘దృశ్యం’
ఫ్యామిలీ డ్రామా థ్రిల్లర్ సీక్వెల్ ‘దృశ్యం 2’ ఈ రోజు విడుదలైంది. ‘దృశ్యం 2’ మలయాళం ఒరిజినల్ గత ఫిబ్రవరిలో ఓటీటీలో అమెజాన్లో
విడుదలై ఫర్వాలేదనిపించుకుంది. తెలుగు సీక్వెల్ కూడా ఇప్పుడు అమెజాన్లోనే విడుదలైంది.
దీనికి ఒరిజినల్ ‘దృశ్యం’, ‘దృశ్యం 2’ దర్శకుడు జీతూ జోసెఫ్ దర్శకత్వం వహించాడు.
తెలుగు ‘దృశ్యం’ శ్రీప్రియ దర్శకత్వం వహించింది.
ఇప్పుడు జీతూ జోసెఫ్ దర్శకత్వంలో తెలుగు సీక్వెల్ ఎలా వుందో చూద్దాం.
‘దృశ్యం’ లో కేబుల్ ఆపరేటర్ అయిన రాంబాబు (వెంకటేష్) ఇప్పుడు థియేటర్ ఓనర్ గా, సినిమా తీయాలనుకుంటున్న ప్రొడ్యూసర్ గా వుంటాడు. భార్య జ్యోతి (మీనా), కూతుళ్ళు అంజూ, అనూ (కృతిక, ఎస్తర్
అనిల్) వుంటారు. రాంబాబు ఓ రచయిత (తనికెళ్ళ భరణి) తో కలిసి సినిమా కథ కూడా రాస్తూంటాడు.
ఆరేళ్ళ క్రితం ‘దృశ్యం’ లో పోలీస్ ఐజీ గీత
(నదియా) కొడుకు వరుణ్ అదృశ్యం కేసులో అనుమానితుడైన రాంబాబు కుటుంబాన్ని ఆ కేసు భయం
ఇంకా వెన్నాడుతూ వుంటుంది. కొన్ని తప్పనిసరి పరిస్థితుల్లో వరుణ్ ని చంపి కుటుంబాన్ని
కాపాడుకున్నాడు రాంబాబు. శవం దొరక్కుండా చేశాడు. ఇప్పటికీ కోల్డ్ కేసుగా వున్న ఆ కేసుని
ఇప్పుడు పోలీసులు తిరగ దోడడం ప్రారంభిస్తారు. దీంతో రాంబాబు కుటుంబం మళ్ళీ సమస్యల్లో
పడుతుంది. ఐజీ గౌతమ్ సాహూ (సంపత్ రాజ్) కొత్త ఆధారాలతో రాంబాబుని ట్రాప్ చేస్తాడు.
ఇప్పుడు రాం బాబు ఏం చేశాడు? సినిమా కథ అల్లడంలో టాలెంట్ చూపిస్తున్న
రాంబాబు ఇప్పుడు ఏ కథల్ని అల్లి పోలీసుల్ని ఓడించాడు? ఇదీ మిగతా
కథ.
‘దృశ్యం’ కొనసాగింపు కథ ‘దృశ్యం’ కంటే నీటుగా
వుంది. ఫస్టాఫ్ కథనం 40 నిమిషాలు మాత్రం అత్యంత మందకొడిగా సాగుతుంది. ఈ నిడివిని కేసు
భయంతో ఇంకా కూతుళ్ళు మానసిక వేదన అనుభవించే దృశ్యాలు, వెంకటేష్
ని మీనా సున్నితంగా సాధించే దృశ్యాలూ, రహస్యంగా పోలీసులు దర్యాప్తు
చేసే దృశ్యాలూ ఒక క్రమ పద్ధతిలో వస్తూంటాయి డ్రామాని బిల్డప్ చేస్తూ. చనిపోయిన వరుణ్
తండ్రి నరేష్ కూడా వచ్చి, వరుణ్ అస్థికలైనా ఇప్పించమని వెంకటేష్
ని ప్రాధేయపడే ఎమోషనల్ దృశ్యాన్ని వెంకటేష్ గిల్టీ ఫీలింగ్ ని పెంచే మంచి దృశ్యంగా
ఎస్టాబ్లిష్ చేశాడు దర్శకుడు. ఒక అర్ధవంతంగా సాగే పోలీస్ ఇన్వెస్టిగేషన్ కి వెంకటేష్
డిఫెన్స్ లో పడి, కథలు చెప్పే కాబోయే నిర్మాతగా చెక్ పెట్టే దృశ్యాలూ
థ్రిల్ చేస్తాయి. కథనం, దాని చిత్రీకరణ, నేపథ్య సంగీతం మలయాళ దర్శకుడి చేతిలో రెగ్యులర్ తెలుగు సినిమాలకి భిన్నంగా
ఒక ఫీల్ తో డిఫరెంట్ అనుభవాన్నిస్తాయి. మలయాళ దర్శకుడు ఈ తెలుగు సినిమా తీసి సహజత్వాన్ని
అత్యంత సహజంగా ప్రెజెంట్ చేశాడు. క్లయిమాక్స్, ముగింపూ అసాధారణమైనవే
మేధస్సుకి పని పెడుతూ.
నటనలు -సాంకేతికాలు
వెంకటేష్ మళ్ళీ కుటుంబాన్ని కాపాడుకోవాల్సిన పాత్రలో ‘దృశ్యం’ అనుభవంతో దివ్యంగా చేసుకుపోయారు. ఫ్యామిలీ మాన్ గా తెలుగు మార్కు హెవీ ఎమోషన్స్ లేకుండా సున్నిత ఫీలింగ్స్ తో సైలెంట్ గా చేసుకుపోయారు. పోలీస్ స్టేషన్ లో నదియా ప్రతాపం చూపించే సన్నివేశంలోనూ డౌన్ ప్లే చేశారు. నదియా సంధించే ప్రశ్నలకి పోలీస్ స్టేషన్ కెక్కిన కుటుంబంతో పడే వేదన, నేరం ఒప్పుకోలేని డైలమా చాలా కాలం తర్వాత వెంకటేష్ లోని నటుడ్ని కొత్త రూపంలో చూపిస్తుంది. హైప్, కమర్షియల్ హంగామా, హీరోయిజమూ లేని ఈ బలమైన ఫ్యామిలీ డ్రామా థ్రిల్లర్ తో వెంకటేష్ గుర్తుండి పోతారు.
వెంకటేష్ మళ్ళీ కుటుంబాన్ని కాపాడుకోవాల్సిన పాత్రలో ‘దృశ్యం’ అనుభవంతో దివ్యంగా చేసుకుపోయారు. ఫ్యామిలీ మాన్ గా తెలుగు మార్కు హెవీ ఎమోషన్స్ లేకుండా సున్నిత ఫీలింగ్స్ తో సైలెంట్ గా చేసుకుపోయారు. పోలీస్ స్టేషన్ లో నదియా ప్రతాపం చూపించే సన్నివేశంలోనూ డౌన్ ప్లే చేశారు. నదియా సంధించే ప్రశ్నలకి పోలీస్ స్టేషన్ కెక్కిన కుటుంబంతో పడే వేదన, నేరం ఒప్పుకోలేని డైలమా చాలా కాలం తర్వాత వెంకటేష్ లోని నటుడ్ని కొత్త రూపంలో చూపిస్తుంది. హైప్, కమర్షియల్ హంగామా, హీరోయిజమూ లేని ఈ బలమైన ఫ్యామిలీ డ్రామా థ్రిల్లర్ తో వెంకటేష్ గుర్తుండి పోతారు.
మీనా, కృతిక, ఎస్తర్, నదియా, సంపత్ రాజ్ నల్గురూ
ఎక్సెలెంట్ గా నటించారు. అరుపులు, కేకలు లేకుండా, హింస, దానికి చెవులు పగిలే బిజిఎం లేకుండా సైలెంట్ గా
సాగిపోయే మూవీ అసలు మూవీ చూస్తున్నట్టు భారంగా అన్పించదు. అమెజాన్లో తప్పక చూడాల్సిన
తెలుగు మూవీ.
—సికిందర్