రచన -
దర్శకత్వం: శ్రీని జోస్యుల
తారాగణం : హర్ష, నికీషా, మీషా, చత్రపతి శేఖర్, సూర్య
తదితరులు
సంగీతం: అజయ్, ఛాయాగ్రహణం : జనా
బ్యానర్: భజరంగ బలి క్రియేషన్స్
నిర్మాతలు: భాస్కర్ జోస్యుల, లక్ష్మీశేషగిరి
రావు
విడుదల : నవంబర్ 19, 2021
***
గత శుక్రవారం
విడుదలైన కొత్త దర్శకుల 9 తక్కువ బడ్జెట్ సినిమాల్లో ‘మిస్సింగ్’ ఒకటి. శ్రీని జోస్యుల
దర్శకుడు. తొలి ప్రయత్నంగా కొత్త నటీనటులతో సస్పెన్స్ థ్రిల్లర్ తలపెట్టాడు.
సినిమా తీసి ఓటీటీ మార్కెట్లో కూడా లాభ పడాలంటే సస్పెన్స్ థ్రిల్లర్ మంచి వస్తువే.
కాకపోతే ‘లో - బడ్జెట్’ సినిమాలు విభిన్నంగా వుంటేనే ఓటీటీ
మార్కెట్లో బిజినెస్ వుంటుంది. ప్రేక్షకులుంటారు. ఇంటర్నెట్
వీడియో మీడియా యూజర్లు క్వాలిటీ కంటెంట్ ని కోరుకుంటారు. కనుక ఓటీటీ అధికారుల
సినిమాల ఎంపిక నిబంధనల్ని గట్టెక్కాలంటే, ఎంత ఇన్నోవేటివ్
ఐడియాతో కంటెంట్ వుంటే అంత మంచిది. అదృష్టవశాత్తూ కొత్త దర్శకుడి ‘మిస్సింగ్’ లో అలాటి ఇన్నోవేటివ్ ఐడియాయే వుంది.
దీనికి తగ్గ కంటెంట్ ఎలా వుందన్నదే ప్రశ్న. వైరల్ ఐడియా వుంటే కంటెంట్ లో వైరల్
మెకానిజం కోసం కూడా కృషి చేయాలి. ఇది జరిగిందా? చూద్దాం...
గౌతమ్ (హర్ష),
శృతి (నికీషా) ఐటీ ఉద్యోగులు. ప్రేమించి పెళ్ళి చేసుకుంటారు. చేసుకున్నాక ఓ రోజు
ప్రయాణిస్తున్న కారు యాక్సిడెంట్ అవుతుంది. గౌతమ్ హాస్పిటల్లో కళ్ళు తెరిచి చూస్తే
శృతి వుండదు. ఘటనా స్థలం నుంచి అదృశ్యమైపోతుంది. ఎలా అదృశ్యమైంది? ఎక్కడికెళ్ళింది? గౌతమ్ వెతుకుతూంటే తామిద్దర్నీ ఓ
నల్గురు ఫాలో అవుతున్నట్టు ఓ సీసీ టీవీ వీడియో బయట పడుతుంది. వాళ్ళని పట్టుకోబోతే
ఒక్కొక్కరూ చచ్చి పోతూంటారు. ఎవరు చంపుతున్నారు? ఎందుకు
చంపుతున్నారు? శృతి నేం చేశారు?
పరిస్థితి జటిలమవుతుంది గౌతంకి. ఈ కేసు తేల్చడానికి పోలీసులుతో బాటు ఓ జర్నలిస్టు
మీనా (మీషా) రంగంలోకి దిగుతారు. అసలేమిటీ మిస్టరీ అన్నదే మిగతా కథ.
ఇందులో వైరల్ అయ్యే అవకాశమున్న ఐడియా ఏమిటంటే, గౌతమ్
తెలియకుండా తనే శృతిని కిడ్నాప్ చేసి, తనే ముగ్గుర్నీ అనుమానించి తెలియకుండా వరుస హత్యలు చేయడం. పూర్వం జరిగిన ఇంకో యాక్సిడెంట్లో జ్ఞాపక శక్తిని
కోల్పోయిన
కారణంగా స్ప్లిట్ పర్సనాలిటీతో ఇలా చేయడం. ఇంత ఇన్నోవేటివ్ గా
వున్న ఈ ఐడియాని కథగా విస్తరించడంలో అనేక గందరగోళాలకి లోనై, గజిబిజి
చేసి, అసలేం చూస్తున్నామో అర్ధంగానంత,
చూడడం మానెయ్యాలన్నంత కసితో కన్ఫ్యూజన్ క్రియేట్ చేశారు. వైరల్ ఐడియాతో వైరల్
మెకానిజం లేకుండా పాత ఫార్ములాతో ఈ కాలపు సినిమా చూపించే ప్రయత్నం చేశారు. పాత కాలపు
ఫార్ములాలు ఇంకా విన్నింగ్ ఫార్ములాగా వున్నాయా బడ్జెట్ సినిమాలకి ఈ రోజుల్లో? ‘బి’ గ్రేడ్ సినిమాలు
అన్పించుకోవడం తప్ప?
చివరికి ఆ స్ప్లిట్ పర్సనాలిటీతో
కిడ్నాపులు, హత్యలూ చేసిన గౌతమ్ ని కాపాడుతూ, మరికర్ని దోషిని చేసే పాత ఫార్ములా ఇది. ఎంతైనా మన తెలుగు హీరో మంచి వాడే, తెలుగు కాని హీరోయిన్ తో ఇక సుఖంగా కాపురం చేసుకుంటాడని ప్రేక్షకుల్నిసంతోష
పెట్టాలనుకునే, ఎవరూ కేర్ చేయని కృత్రిమ కథ. కథని ప్రశ్నార్థకం
చేస్తే ప్రేక్షకులు కేర్ చేయడానికి వీలుంటుంది.
నిఖిల్ నటించిన ‘అర్జున్ సురవరం’ లో నిఖిల్ తనని నకిలీ సర్టిఫికేట్ల
స్కామ్ లో ఇరికించిన విలన్ని పట్టుకుని తను నిర్దోషిగా నిరూపించుకునే కథ. అతను
విలన్ని పట్టుకుంటే మనకేంటి? పట్టుకోక పోతే మనకేంటి? విలన్ దోషి అయితే ఎవరిక్కావాలి? కాకపోతే
ఎవరిక్కావాలి?
సీన్ రివర్సల్- ప్రాక్టికల్ కథలు
కావాలిప్పుడు. నకిలీ సర్టిఫికెట్ల స్కామ్
లో నిఖిల్ ని ఇరికించలేదనీ, అతనే బుద్ధిపూర్వకంగా నకిలీ సర్టిఫికేట్లు కొన్నాడనీ, సీన్ రివర్స్ చేస్తే కొత్త కథవుతుంది. దీని విష పరిణామాలు చూపిస్తే కథ
కొత్త తావులకి విస్తరిస్తుంది. కొత్త విషయాలు చెప్తుంది. కొత్త తీరాలకి తాకుతుంది.
కథ వెనుక కథ చెప్తుంది. నకిలీ సర్టిఫికేట్లు కొనే విద్యార్ధుల నైతిక, సామాజిక స్థితి ఏ
గతి పడుతుందో తెలియ జెప్తుంది. కథలకి సముద్రాలే వుంటే ఇంకా చెరువులు చూపించడం ఎంత
కాలమని?
కిడ్నాపులు, హత్యలూ
గౌతమే చేశాడు స్ప్లిట్ పర్సనాలిటీటీతో= ఐతే ఇప్పుడేమిటి? ఇతను
శిక్షార్హుడా అని ప్రశ్నిస్తే, కఠిన ప్రశ్నవుతుంది న్యాయస్థానం
ముందు. గత జనవరిలో విడుదలైన హిందీ ‘నెయిల్ పాలిష్’ వుంది. ఇందులో స్ప్లిట్ పర్సనాలిటీ హీరోతో ప్రశ్నార్థకం చేసిన సైకలాజికల్
పాయింటు - ‘నేరం మెదడు చేస్తుంది. ఇలాటి
ముద్దాయి
మీద కేవలం నేరారోపణ చేయగలరు. అయితే బోనులో నిలబడ్డ ఈ ముద్దాయి
చేసిన హత్యలతో దోషిగా రుజువవుతూ, స్ప్లిట్ పర్సనాలిటీ వల్ల నిర్దోషి కూడా అయితే ఇప్పుడేమిటి? దేని ఆధారంగా తీర్పు చెప్తారు ? - అన్నది.
దిసీజ్ వైరల్ మెకానిజం. ప్రశ్నార్థకంగా మారిపోయిన కథ. ప్రేక్షకుల్ని
ఆలోచింపజేస్తూ ఇంటికి పంపే కథ. ఎన్నికల సభలో నాయకుడు చెప్పిన మాటలకి తర్జనభర్జన
జేసుకుంటూ ఇళ్ళకి పోతారు ప్రజలు. ఎన్నికల సభ పాటి విలువ కూడా వుండదా సినిమాకి?
ఈ ప్రశ్న తెగక ఇలా వుంటే, ఆ వీర్ సింగ్ అనే
ముద్దాయిలో వీర్ సింగ్ వుండడు, చారు రైనా అనే ఆవిడ
వుంటుంది. అతడి స్ప్లిట్ పర్సనాలిటీ క్యారక్టరామె. అతడి మనసులో తప్ప
భౌతికంగా లేని చారు రైనా మీద కేసేలా నడుపుతారు? ముద్దాయి లోంచి వీర్ సింగ్
మాయమై పోయాడు - వీర్ సింగే లేడు, కనిపించని చారు రైనా వుంది- కనుక కేసే లేదు! జడ్జికి
దిమ్మదిరిగి పోతుంది... న్యాయ వ్యవస్థకే పెద్ద
సవాలు
ఈ కేసు!
కోవిడ్
కారణంగా ఓటీటీలో విడుదలైన ‘నెయిల్ పాలిష్’ ని
రివ్యూలతో జాతీయ మీడియా వైరల్ చేస్తే, ప్రేక్షకులు వ్యూవ్స్
పెంచేశారు. బడ్జెట్ సినిమా వైరల్ కంటెంట్ తోనే గుర్తుంటుంది,
మరి దేంతోనూ గుర్తుండదు- ఓ ‘బి’ లేదా ‘సి’ గ్రేడ్ గా అంతర్ధానమై పోతుంది.
ఫస్టాఫ్ ఒక కిడ్నాప్ తో, ఇంకో యాక్సిడెంట్ తో ప్రారంభమవుతుంది. వేరే క్యారక్టర్స్ తో కిడ్నాప్ సెకండాఫ్
లో రివీలయ్యే సస్పెన్స్ గా, శాంపిల్ సీనుగా వుంటుంది. యాక్సిడెంట్
లో మాత్రం గౌతమ్ గాయపడి, భార్య శృతి మాయమవుతుంది. ఇక శృతిని తల్చుకుంటూ
ఫ్లాష్ బ్యాక్ మొదలవుతుంది. ఫ్లాష్ బ్యాక్ మొదలవడానికి ట్రిగర్ పాయింటేమీ వుండదు. కథకీ, గౌతమ్ కీ, ఒక హుక్ ని ఏర్పాటు చేసి నడిపించే థ్రిల్లింగ్
పాయింటేమీ వుండదు ఈ సైకలాజికల్ థ్రిల్లర్ జానర్ మూవీకి.
శృతి గర్భవతై వుండడమో, లేదా ఆమెకి తను చేసిన ఓ ప్రామీజ్ వుండడమో, లేదా జాయింటుగా
కొన్న ప్రాపర్టీని అత్యవసరంగా అమ్మాల్సి వుండడమో లాంటి, డైనమిక్స్
ని సృష్టించే, ‘ఎమోషనల్ అర్జెన్సీ’ ఏదోవొకటి పుట్టకుండానే, ఏదో కాసేపు ఆమెతో గడిపిన క్షణాల్ని
తల్చుకోవడమే కథకి అవసరమన్నట్టు, నిస్తేజంగా వుంటాయి ఫ్లాష్ బ్యాక్
సీన్లు. కథ డిమాండ్ చేసే సీన్లకి వ్యతిరేకంగా బడ్జెట్ ని వృధా చేసిన సీన్లివి.
పోలీసులు కేసు టేకప్ చేస్తారు.
జర్నలిస్టు మీనా కూడా కేసు చేపడుతుంది. ఈ ఇద్దరి ఇన్వెస్టిగేషన్ సీన్లు
కథని ముందుకు నడిపించని, సస్పెన్స్ ని సృష్టించని విషయాలతోనే
వుంటాయి. గౌతమ్ ఒక మాల్ లో తననీ శృతినీ ఎవరో నల్గురు కనిపెడుతున్నట్టు అన్పించిన విషయాన్ని
గుర్తు చేసుకుని, ఆ సీసీ టీవీ ఫుటేజీ చూసి, ఆ నల్గుర్నీ పట్టుకోవడానికి వెళ్ళినప్పుడల్లా ఒకొక్కరూ చచ్చి పోతూంటారు.
ఈ చంపడాలు గౌతమే చేస్తున్నాడని ఆటోమేటిగ్గా
మనకి అనుమానం వచ్చేస్తుంది. మళ్ళీ అసలు శృతీ గౌతమ్ లు ఎలా ప్రేమలో పడి పెళ్లి చేసుకున్నారని
ఇంకో ఫ్లాష్ బ్యాక్. ఇది ఇంకో కథకి అడ్డుపడే మార్కెట్ యాస్పెక్ట్ లేని, ఆసక్తి కల్గించని వ్యవహారం. ఇక ముగ్గురు
వ్యక్తులు చనిపోయాక, నాల్గో వ్యక్తి తానే అని గౌతమ్ కి రివీలవడం
ఇంటర్వెల్.
ఈ ఇంటర్వెల్ మలుపు బావుంది. శృతిని కిడ్నాప్
చేసిన వాళ్ళని హత్యలు చేస్తున్నది తనేనా? హత్య చేయాల్సిన నాల్గో
వ్యక్తి తనేనా? ఎలా? ఎందుకు? శృతిని తనే మాయం చేశాడా? ఈ ఇన్నోవేటివ్ వైరల్ ఐడియా ఇంటర్వెల్లో ఎస్టాబ్లిష్ అయినందుకు సంతోషం.
దీని తర్వాత ఈ ఐడియాతో ప్రేక్షకుల బుర్రని
బ్లాస్ట్ చేసే డైనమిక్స్ తో పేఆఫ్ చేసే దిశగా ఏక త్రాటిపై కథ సాగక, దీన్ని వదిలేసి, ఇంటర్వెల్ తర్వాత ఇంకో ప్రేమ ఫ్లాష్
బ్యాక్. ఈ ఫ్లాష్ బ్యాక్ లో గతంలో జర్నలిస్టు మీనాతో ప్రేమ. ప్రేమిస్తూ యూఎస్ కి ఆమె
వెళ్ళిపోతే, నాల్గేళ్ళ క్రితం గౌతమ్ కే జరిగిన యాక్సిడెంట్లో
మెమరీ కోల్పోవడం, మీనా
గుర్తుకు రాక యాక్సిడెంట్ చేసిన అపరిచితురాలు శృతితో ప్రేమలో పడి ఆమెనే పెళ్ళి చేసుకోవడం.
ఇలా ఇగ్నైట్ చేసిన విన్నింగ్ ఐడియాని వదిలేసి - మరో ప్రేమ ఫ్లాష్ బ్యాకు పెట్టడంతో నడపడానికి కథ లేనట్టు- సెకండాఫ్
సిండ్రోమ్ అనే సుడిగుండంలో పడింది మొత్తం వ్యవహారం.
ఫ్లాష్ బ్యాకులతో మలుపులు, నడుస్తున్న కథలో మలుపులూ సాగిసాగి, గౌతమ్ స్ప్లిట్ పర్సనాలిటీతో
ఇలా చేస్తున్నాడని చెప్పడం. మళ్ళీ అది కాదు ఇదంటూ మలుపుల మీద మలుపులతో గౌతమ్ ని కాపాడేందుకు, ఇంకెవరో
ఇదంతా చేశారని జస్టిఫికేషన్ ఇవ్వడం. మొత్తంగా గజిబిజిగా తయారైంది. స్ప్లిట్ పర్సనాలిటీతో
తెలియకుండా హత్యలు చేస్తున్నాడు - ఇప్పుడేమిటి?- అన్న డ్రమెటిక్
క్వశ్చన్ కి సమాధానం చెప్పే కథగా కాకుండా, ఇప్పుడవసరం లేని మూస
ఫార్ములాగా ప్రేక్షకుల ముందుంది ఈ మూవీ. కథంటే డ్రమెటిక్ క్వశ్చన్ తో ఆర్గ్యుమెంట్
అని గ్రహించినప్పుడే - దీంతో చిన్న సినిమాలు బాగుపడతాయి.
—సికిందర్